ఒకానొక ఊట కోసం

కొన్ని సార్లు ఎక్కడికీ కదలలేను.
చుట్టూ చీకటి
నదులుగా, సముద్రాలుగా కదులుతుంది.
కదిలే చీకట్లో
రేపటి వెలుగును వెతుకుతుంటాను.
ఏదో కరగుతున్నట్లు
మరేదో వినపడీ వినబడనట్లు
కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు
కాలాన్ని అనంతంగా మోస్తూ ఉంటాయి.

క్షణాలుగా విస్ఫోటనమైన దేహం
ఎప్పుడూ గాయాలుగానే ప్రవహిస్తుంటుంది.
ఏ గాయం ఎందుకైందో తెలుసుకోవడానికి
గాయాలన్నీ గేయాలు కావడానికి
ఒక ఊపిరి కావాలి.

ఊపిరొక అపనమ్మకం!
ఏ సమయంలోనైనా
మట్టిలో తల దాచుకుంటుంది.
అంతటితో సమయం ఆగిపోతుంది.
ఇక జరిగేదంతా
ఎండమావుల్లో నీరు వెతకడమే.

బావిలో నీడలు కదలడం జరగదు
నీరింకిపోయిన బావి
రక్తం విరిగిన నా శరీరం
రెండు పర్యాయపదాలే.

ఆఖరి పలుకు ఇదే కావచ్చు
చెవులను రిక్కించి విను…
ఇదిగో ఈ పచ్చని పద్యం నాటు
ఊటలు ఊటలుగా మాటలు
మాటలపై పారే నువ్వు
పారే నీలో నేను…


జాని తక్కెడశిల

రచయిత జాని తక్కెడశిల గురించి:

జాని తక్కెడశిల వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన తెలుగు యువకవి, రచయిత, విమర్శకుడు, అనువాదకుడు. తెలుగుతోపాటు హిందీ, ఆంగ్లంలోనూ కవిత్వం రాస్తున్న బహుభాషా కవి. సామాజిక సమస్యలను కవితా వస్తువులుగా స్వీకరించి విస్తృతంగా కవిత్వం రాస్తున్నారు. కవిత్వంతోపాటు కథలు, గేయాలు, విమర్శలు, సమీక్షలు, నానోలు, నానీలు, నక్షత్రాలు రాశారు. బాలసాహిత్యంలోనూ విశేష కృషి చేస్తున్నారు.

 ...