చెదురుబాటు నుండి కుదురుబాటుకు

పాఠక మహాశయా,

నమస్కారాలు.

పూర్వం అడవి బాటలో నడచిపోతున్న బాటసారులను కొన్ని మాంసాహార వృక్షాలు, వారు తమ ఛాయ కిందికి రాగానే తమ కొమ్మలతో వారిని బంధించి పైకి తీసుకు వెళ్ళి బలమైన తమ రెమ్మలతో వారి రక్తమాంసాలు పీల్చి చివరికి ఎప్పటికో వారి కళేబరాలను కిందికి పడేసేవిట. ఇది చందమామ కథ.

ఈనాడు అలా మనిషిలోపలి మనిషిని పీల్చివేయగల విషవృక్షాలు సవాలక్ష. ఆ సవాలక్ష విషవృక్షాలకి వేర్లు పాదుకుని ఉన్న సోషల్‌ మీడియా కీకారణ్యంలోనించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి నాతో నేను పోరాటం చేసి బయటపడగలగడం నిజంగా నామటుకు నాకు భగవదనుగ్రహమే.

ఆ కీకారణ్యంలో డస్సిపోయేలా పరిగెత్తి నా మానసిక ఆరోగ్యం చెడిపోతున్నట్టు, పనిలో ఏకాగ్రత లోపిస్తున్నట్టు క్రమంగా తెలుసుకున్నాను. రకరకాల సమాచారాన్ని అన్ని వైపులనించీ మెదడులో కూరడం వల్ల ఆలోచనలు చెల్లాచెదురైపోయి చిత్తశాంతిని కోల్పోతున్నాననీ గ్రహించాను. ఏదీ నన్ను బంధించడానికి ఇష్టపడని నేను, నా అంతట నేనుగా ఐఫోనును వలచి దాని విషపరిష్వంగంలో చేరానని తెలుసుకుని మిక్కిలి దుఃఖించాను.

రోజువారీ జీవిత సమస్యలనించి తప్పించుకోవడానికి మనసును మభ్యపెట్టే ఒక కృత్రిమమైన మార్గంగా ఉన్న దీన్నించి బయటపడాలని తీవ్రయత్నం ప్రారంభించాను.

సాధారణంగా మన సన్నిహితులు ప్రతి చిన్న విషయానికీ మనల్ని మెచ్చుకోవడం జరగదు. కానీ, మనది ఒక ఫొటో లేదా ఒక పోస్టు, అనేకానేక మెచ్చుకోళ్ళను తెచ్చిపెడుతుంది. లైకులిచ్చే మత్తు మారకద్రవ్యాలనించి వచ్చే మత్తువంటిదే.

సోషల్‌ మీడియాలోకి ప్రవేశిస్తే కాలం తెలియదు. అలీస్ ఇన్‌ వండర్‌లాండ్‌ లాగా వాండరింగ్‌లో ఎక్కడో తప్పిపోతాం. అదేదో తీగను తొక్కితే తప్పిపోయి ఇక అడవంతా తిరుగుతూనే ఉండిపోతారట, ఎప్పటికీ బయట పడలేరట!

అలానే ఈ సోషల్ మీడియా నిన్ను ఒక డిజిటల్ సెల్ఫ్‌గా మార్చి తన స్క్రీన్ లోకి లాగేసుకుంటుంది ఇక బయటపడలేకుండా! నీ వ్యక్తిత్వం మొత్తాన్ని నువ్వు రాసే వ్యాఖ్యల మీద, నువ్వు ఉంచే ఫొటోల మీద అంచనా వేసి తన పరిధికి కుదించి, కుదించి నిన్ను మరుగుజ్జునో మహావృక్షాన్నో చేస్తుంది.

ఎడతెగని అలవాటుగా,
అంతులేని వ్యామోహంగా,
అర్థంలేని ఆవేశంగా,
లౌల్యంగా,
చిత్త భ్రాంతిగా,
అవివేక జన్యంగా,
కాలహరణ సాధనంగా,
వెర్రిమొర్రి సంభాషణలుగా,
కాణీ విలువ చేయని కబుర్లుగా,
చాడీల గోడలుగా,
ఈర్ష్యాసూయల బురదగా,
గోముఖ వ్యాఘ్రాల బజారుగా,
మనో వికారాలకు యవనికగా ఉన్న ఈ మాయా మయసభ వ్యామోహంనించి తప్పించుకోవడానికి భగీరథ ప్రయత్నం అవసరమైంది నాకు.

మొట్టమొదట, ఉదయం కళ్ళు తెరవగానే ఫోనులో సందేశాలు చదవడం అనే అలవాటైన దురలవాటును బలవంతంగా పంతమనే ఛురికతో తెంచివేసి, చిన్నతనంలో ఉదయం మెలకువ రాగానే కాసేపు పక్క మీదే కూర్చుని చేతులు మోడ్చి ఇష్టదైవానికి నమస్కరించుకుని పక్క దిగే ఆ మంచి అలవాటును తిరిగి ప్రారంభించాను.

తరవాత, సోషల్‌ మీడియాతో అనుబంధాన్ని తాత్కాలికంగా ఉత్తరించాను. మద్యపానవ్యసనులకు ఉన్నట్టుండి మద్యం ఆపేస్తే ఎంత బాధ కలుగుతుందో అంతకన్నా రెండు పెగ్గుల ఎక్కువ బాధ. అజ్ఞానజనితమని వేరే చెప్పనక్కరలేదు. ఆ బాధానివారణకై తిరిగి కొన్ని రోజులు ఆ మాయా ప్రపంచంలోనికి ప్రవేశించడం, బుద్ధి వెక్కిరించగా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చేస్తూ వచ్చాను.

పూర్వం, ఎప్పుడో ఒక ఉత్తరం వచ్చేది యోగక్షేమాలను తెలియజేస్తూ. వ్యక్తులు అవసరం మేరకు మాట్లాడేవారు. అంచేత ఏ వ్యక్తి అయినా అవతలివారికి ఎంత మేరకు అవసరమో అంతే తెలిసేవారు. ఇప్పుడు దాదాపుగా ప్రతి వ్యక్తి సోషల్‌ మీడియాలో ‘ఎవైలబుల్’గా అందుబాటులో ఉంటున్నాడు. ప్రతిరోజు అనేక విషయాల మీద తన అభిప్రాయాలను వ్యక్తంచేస్తూ వాటి మీద చర్చోపచర్చలు చేస్తున్నాడు. తనవి, తన కుటుంబానికి సంబంధించినవి అయిన అన్ని విశేషాలను నిరంతరం మిత్రులతో పంచుకుంటున్నాడు. సామాన్య సంసారి తాను నిజజీవితంలో పాటించలేని గొప్ప గొప్ప అభిప్రాయాలు వ్యక్తంచేసి తృప్తి పడుతున్నాడు. చిన్నతనంలోనివి, అందమైనవీ తన ఛాయాచిత్రాలు అందరితో పంచుకుని తనను తాను సంతోషపెట్టుకుంటున్నాడు.

మనం ఎక్కువ తెలిసిపోయాం, అదే సమస్య అన్నారొక మిత్రులు. జాబితాలో ఉన్న బంధుమిత్రులంతా నట్టింట్లో పచ్చ జెండాలతో తిరుగుతున్నట్టే. అత్యుత్సాహం వల్ల అక్కరలేని సమాచారం అన్ని వైపులకీ గాలిలో ధూళిలా ప్రసారం చేయబడుతోంది. గాలి తన ధర్మంగా పరిమళాన్ని, దుర్గంధాన్ని ఒకేలా మోసుకొస్తుంది. ఇంద్రియాలతో ఏది చూస్తామో, చదువుతామో, వింటామో అది మనసుకు ఆహారంగా అందివ్వబడుతుంది. రోజూ అసంకల్పితంగా మనం అందిస్తున్న ఈ పాషాణం ఒక్క చెంచా చాలు మంచి మనిషిని నిలువెల్ల విషపూరితం చెయ్యడానికి.

అయితే, అతి ప్రయత్నం మీద అన్ని అనవసర సమాచార మార్గాలూ శాశ్వతంగా మూసివేసి బయటపడడానికి నాకు భారతీయ ఆధ్యాత్మిక చింతనాధార దీపధారి అయి తోవ చూపింది. ప్రాచీన వాఙ్మయం దేహళీదత్త దీపంకాగా స్థిరమైన ఆ వెలుగు ముందు సెల్‌ఫోన్‌ కాంతి వెలవెలపోయింది.

ఇష్టమైనవారిని పట్టలేని హుషారుతో పదేపదే పలకరించడం నా అలవాటు. ఈ అలవాటును ఛేదించడానికి నేనెన్నుకున్న మార్గం, వారు ఫోనులో కనిపించకుండా మాయం చేయడమే!

జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఏ దిన పత్రిక తిరగేసినా నేరాలూ ఘోరాలతో రక్తసిక్తం. ఉదయం చదివిన నేర వార్త, దృశ్యరూపంలో కళ్ళముందు ఆ రోజంతా తిరగడమే కాదు, మనసులో ఏ మూలో స్థిరనివాసం ఏర్పరచుకుని మెల్లమెల్లగా ఆలోచనల్లో సూక్ష్మక్రిమిగా చేరతుంది. సమాజంలో భాగస్వామిగా రోజూ మెదడుకు ఈ విషం తాగించడం అనివార్యమైంది. దీనికి ఓ ఉపాయం కనిపెట్టాను. వార్తా పత్రికలు, తామరతంపర ప్రసారసాధనాలకు సమయం కేటాయించకుండా ఆకాశవాణి వార్తలు వినడమే! హవా మహలే హాయి, హాయి.

మొత్తానికి మారీచునిలా వెంటాడే సందేశాల పేటికకు గరళ వైద్యం జరిగింది. ఏళ్ళుగా మనసుకు గుచ్చుకున్న ముల్లును పీకిపారేసినంత విముక్తి భావన మెదిలింది.

అయితే, ఇంత ప్రయత్నం అవసరమా అంటే, ఇతరుల సంగతి ఏమో, నాకు మాత్రం అవసరమైంది.

నాకు నచ్చిన, ఎన్నో ఏళ్ళనించీ నేను నేర్చుకోవాలనుకొంటున్న విద్యలు నేర్వడానికి, నేరుస్తున్న విద్యలు సాధన చేయడానికి, ఆధ్యాత్మిక చింతనకు, గ్రంథ పఠనానికి, సాంకేతిక విద్యల సాధనకు, అన్నిటికీ ఏకాగ్రత కుదిరింది. శాంతి కలిగింది. జీవితం వృథా కావటంలేదన్న తృప్తి కలిగింది.

హడావిడి ఆగిపోయి జీవితం తిరిగి పాసింజరు రైలులా తాపీగా సాగింది. ఒక్కో క్షణం సంపూర్ణంగా జీవించడం మొదలైంది. జీవితంలోకి దైవత్వం ప్రవేశించింది. మనసుకు చెదురుబాటు నుంచి కుదురుబాటు కలిగింది.

ఈ కథ తిరిగి ఆ సోషల్‌ మీడియాలోనే ఉంచబడవచ్చు. రకరకాల స్పందనలు రావచ్చును.

కానీ అదృష్టవశాత్తూ అవి నా కంటబడవు.