నరకప్రవాసి

1. ట్రిప్పు రిపోర్టు

“అయితే డియర్, ఈ అండమాను ట్రిప్పు ఎలా ఉందంటావు? దాపరికం లేకుండా చెప్పెయ్!”

పోర్టు బ్లెయిరులో సముద్రం ఒడ్డున షహీద్ బారు నం. 276లో ఆసనశుద్ధిగా బైఠాయించి, మునివేళ్ళతో ఓ డబుల్ జానీ వాకర్ రెడ్ లేబుల్ గ్లాసుని లాలిస్తూ, డియర్‌ అని మెలిగే నా ఆమరణ సహచరిని ఉద్దేశించి యాథాలాపంగా ప్రశ్న సంధించాను. బయట ఎండ కమ్మరాడి కొలిమిలా కాల్తోంది.

ఆవిడ కనుగుడ్లు రంగు మారాయి. ఏదో మాటవరసకి అడిగిందాన్ని సీరియస్‌గా తీసేసుకుని పచ్చినిజం ఒకటి చెప్పెయ్యబోతోందన్నదానికి అది సిగ్నలని దీర్ఘసహజీవనం నేర్పిన పాఠం.

అందుకు సిధ్ధపడటానికిగాను, జానీగాణ్ణి కాస్త ఆచమనం చేశాను.

“శుద్ధ వేస్టు!” పగిలింది కుండ.

“మరీ అంత…” నసిగాను.

“కాకపోతే మరేంటి? సముద్రం ఒడ్డున బార్లో దూరి మీ వృద్ధబాలక సమాజంతో కలిసి తాగాలనే ఉంటే ఇంత డబ్బు తగలేసి, ఇరుకు విమానాల్లో ఒళ్ళు హూనం చేసుకుని, ఇంత దూరం రావాలా? అదీ ఇంట్లో పిల్లిపిల్లని ఊళ్ళోవాళ్ళ దయాదాక్షిణ్యాలకి వదిలేసి! కొంప దగ్గిర్లోనే ఉన్న ఏ మాలిబూకో పోతే అదే సంబరం తీరేదిగా?”

‘మాలిబూ తగలడిందిగా?’ అన్న మాట నాలిక చివరిదాకా వచ్చి, మళ్ళీ బుధ్ధి తెచ్చుకుని, వచ్చిన తోవంబడే వెళ్ళిపోయింది.

“ఇక్కడెవరో నేటివులూ, పరాయి మనిషి కనబడితే బాణాలూ బల్లేలూ వేసి ఉన్నపళంగా చంపేసే ఆటవికులూ ఉన్నారని ఒకటే చెప్పారు న్యూసులో. తీరా వస్తే ఈ చోటు చెన్నైని బాగా కుదించి, కాస్త శుభ్రం చేసి రంగులేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది, ఏమంత గొప్పా?”

(వివరణ: ఇటీవల మోదీగారు విచ్చేసి వెళ్ళాట్ట, ఆ రంగులూ హంగులే ఇంకా కాస్త మిగిలున్నాయి.)

“అలాంటి నేటివులకి దూరంగా ఉండటమే…”

డియర్ జోరు పుంజుకుంది. ఆ జోరుతోనే పట్టాలు మార్చేసి బండిని మరో త్రోవ పట్టించేసింది.

“ఓసోసి నీకన్నీ భయాలే. ఆ కుర్రాడు జాన్ చావు చూడు, చేవంటే అలా ఉండాలి. అంధకారంలో మగ్గుతున్న సెంటినెలీయులకి ఏసు సువార్తని అందించి ఉద్ధరించడం కోసమని వాళ్ళ బాణాలకీ, బల్లేలకీ ఎర అయిపోయి, కారణమృతుడుగా అమరుడయిపోయాడు.”

ఏదో శాస్త్రానికయినా ఈ ధోరణికి అడ్డు తగలడం కనీస కర్తవ్యమనిపించింది.

“అంటే, పిలవని పేరంటంగా వాళ్ళ నెత్తెక్కి, మతం, గితం అంటూ బైబిలుమీద సవారీ అయ్యే జర్ములూ, జొరాలూ కూడగట్టి ఆ అమాయక జీవుల్ని మారణహోమం చేసెయ్యడమేనా గొప్పతనమంటే?” నాకూ కాస్త జొరమెక్కింది.

“అవున్లే, మతమన్నా అందులోనూ సువార్తన్నా నీకు వల్లమాలిన ఎలర్జీ అని నాకు తెలీక్కాదు. అదల్లా వదిలేసినా, నాగరిక జీవనం వాళ్ళకి వల్లకాదని నిర్ణయించడానికి నీకెవరిచ్చారంటా అధికారమూ?”

“ఆహా, ఓహో, నాగరిక జీవనమే! అంటే ఏమిటీ? ఇంటర్నెట్టూ, పిల్లిపిల్లల విడియోలేనా? అసలు ఈ ద్వీపాల్లో పిల్లులూ, కుక్కలే కాదు, ఎటువంటి సస్తన జంతువులు కూడా ఆదిలో లేవని వికిపీడియాలో ఉంది తెల్సా?”

“ఖచ్చితంగా పిల్లిపిల్లల విడియోలే! ఎంత ముద్దొస్తాయనీ! వాటిన్నీ, ఆ మాటకొస్తే మీ వికిపీడియానీ, ఈ నేటివులకి లేకుండా చెయ్యాలనుకోడం ప్రోగ్రెసివులమని చెప్పుకునే నీ బోటిగాళ్ళ దుర్బుద్ధి, అంతే! అందుకే అంటం, నేటివులకి ఆమడ దూరంలో ఉండదల్చిన పెద్దమనుషులు మాలిబూలోనే కొలువుదీరి మందుకొడితే సరిపోయేది!

అయినా నాకెందుకొచ్చింది, అడిగావు గనక చెప్పాను, అంతే! మా స్పౌజులమంతా షాపింగు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, అదిగో వాను కూడా వచ్చేసింది, వెళ్తున్నా. మరీ ఆ డబుళ్ళు తాగేసి, ఒళ్ళూ కొంపా గుండం చెయ్యక!”

వీడ్కోలు బాణం జుయ్యిమంది, చెవు పక్కనించి.

2. తివారీ

“గురూ, వినకుండా ఉండలేకపోయాను, మీ సంవాదమంతా. అసలు మాలిబూ మాటకొస్తే…”

వెనక టేబులు దగ్గిర ఎంతసేపట్నించున్నాడో గానీ, తివారీగాడు పాలగ్లాసు చేత పుచ్చుకుని డియర్ ఖాళీ చేసిన సీటును అమాంతం ఆక్రమించేశాడు.

‘చావు వెధవా!’ అని ఇందాక నోరెత్తిన పాపానికి నన్ను నేను లోపలే తిట్టుకుంటూ, బారు వెనక రాజ్యమేలుతున్న చంద్రముఖి కేసి దీనదృక్కొకటి ప్రసరించాను. ఆ కరుణామయి నన్ను కనికరించి, మరో డబుల్ జానీని ప్రసాదించింది. భక్తితో సేవించి, ‘దూధ్‌నాథ్‘ నాఁబరగిన పాల తాగుబోతు తివారీ వాచాలత భరించే శక్తి పొందాను.

బండి కూత పెట్టి స్టేషను వెడలింది.

“నీకు తెలీదేమోరా, అసలు మాలిబూ అన్నపదం చుమాష్ వాళ్ళ భాషలో ‘హుమాలిబూ’ అనగా ‘సముద్రం కెరటాలు భలే రొద చేస్తున్నాయిరోయ్!’ అనేదానికి అపభ్రంశం. మరసలు ఈ చుమాష్ వాళ్ళెవరని అడగవేం?”

“అడక్కపోయినా నువ్వాగుతావా?” గొణిగాను. జానీగాడు నెత్తిన నడయాడుతున్నాడులా ఉంది, తల దిమ్ముగా అనిపిస్తోంది.

“వాళ్ళూ ఒకప్పుడు, అంటే బైబిలూ నాగరికతా మోసుకుని తెల్లవాడు కాలిఫోర్నియా చేరక ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్నమాట, వెంటురాకి అవతల ఛానల్ ద్వీపాలు లేవూ, అక్కడ బయల్దేరి కాలిఫోర్నియా తీరమంతా వ్యాపించిపోయారు. చేపలూ పళ్ళూ కాయలూ తినేవారు కాబోలు, ఇవీ అవీ పులవబెట్టి మందుకూడా కొట్టేవారేమో…”

అడుగంటిపోయిన జానీ గ్లాసుకేసి జాలిగా చూసి, రాక్షసుడెవడో తలని గట్టిగా అదిమేస్తున్న ఫీలింగొచ్చి బాధగా మూలిగాను. తివారీగాడికిదేం పట్టినట్టులేదు.

“వాళ్ళంతా ఇప్పుడేమయ్యారంటావా?” (నేనేం అన్లేదు.)

“నాగరికతోయ్, నాగరికత! తెల్లవాడు రాక మునుపు చుమాష్ వాళ్ళ చేతుల్లో కాలిఫోర్నియా, తెల్లవాడి చేతిలో బైబిలూ ఉంటే, వాడు దిగాక విడ్డూరంగా తెల్లోడి చేతిలో కాలిఫోర్నియా, చుమాషోడి చేతిలో బైబిలూ అయ్యాయి. అదీ మరి సువార్తంటే!

అంతేనా? ఇంకా ఉంది. చుమాషోళ్ళని అంధకారంలోంచి వెలుగులోకి లాక్కురావాలని ఫాదరీ జూనిపెరో సెర్రాలాంటి త్యాగమూర్తులు వాళ్ళ తండాలని విడగొట్టి, కాలిఫోర్నియా అంతటా మఠాలు పెట్టి, ఆ మఠాలకి తరాల తరబడి కట్టుబానిసలుగా ఉండేటట్టుగా అనుగ్రహించారు. స్పెయిను పోయె, స్వతంత్ర మెక్సికో వచ్చె, అదీ పోయె, స్వతంత్ర కాలిఫోర్నియా వచ్చె, ఆ ముసుగు లాగవతల పారేసి, అంతా అమెరికా అయ్యె! ఏది మారినా, ఎంత మారినా, చుమాషుల హీనదశ అంతకంతకూ క్షీణిస్తూనే వచ్చింది.”

“మాలిబూ… తగ… లదిం…” నత్తి నత్తిగా నసిగాను. ఏదో వికారంగా అనిపిస్తోంది.

తివారీకి పూనకం వచ్చేసింది.

“తగలడ్డం కాదోయ్, తగలెట్టారను! మతమూ నాగరికతా పేరు చెప్పి, ఒక జాతి జాతినే సమూలంగా మట్టుపెట్టేశారు. మాలిబూ అనే పేరు మిగిలింది, మానవులే పోయారు!”

నాకెందుకో నవ్వొచ్చింది. “హహహ్హా! మానవులు, అండమానవులు ఏరీ, కనబడరేం?”

కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చంద్రముఖి పాలగ్లాసుతో వచ్చి ఎదట నుంచుంది.

3. క్షమాభిక్ష

“తివారీ! ఏమిటా మొద్దు నిద్ర? లే! లే! నీ ఆర్డర్సు వచ్చాయి, దొర రమ్మంటున్నాడు!” జమాదార్ అరుపులకి మెలుకువొచ్చింది.

కళ్ళు నులుపుకున్నాను. ఏమిటిది? ఎక్కడున్నాను? ఏదో జెయిల్లా ఉంది. రాతి గోడలూ, కటకటాలూ, పైన ఎత్తుగా సన్నటి వెంటిలేటర్లోంచి పల్చటి వెలుగూ. ఒంటి మీద ఖైదీ యూనిఫారంలా చారల నిక్కరూ, బనీనూ.

“పద, పద, దొరకింకేం పన్లేదనుకున్నావా?” జమాదారు అదిలించడంతో అతని వెనకాల బయల్దేరాను.

బయట ఆవరణ విశాలంగా ఉంది. ఓ వైపు పసుపుపచ్చ రంగు కట్టడం. పైన పెద్దక్షరాలతో ఎడ్మినిస్ట్రాటివ్ బ్లాక్ అని రాసుంది.

బిల్డింగులోకి జమాదారు వెంబడే వెళ్ళాను. తిన్నగా ‘ఆఫీస్ ఆఫ్ ది వార్డెన్, రాస్ ఐలండ్ ప్రిజన్’ అని తలుపుమీద రాసున్న గదిలోకి.

అక్కడొక తెల్లవాడు, చెంపగడ్డం, బుంగమీసాలు, సినిమాల్లో 19వ శతాబ్దపు ఇంగ్లీషు అధికార్ల యూనిఫారం ఉంటుందే, ఆ మాదిరి డ్రెస్సుతో టేబులు వెనక కుర్చీలో విలసిల్లుతున్నాడు.

నన్ను చూసి, “నంబర్ 276! టివారీ! మై ఫేవరెట్ డబుల్ ట్రెయిటర్! వెల్, యువర్ థర్టీ పీసెస్ ఆఫ్ సిల్వర్ ఆర్ హియర్. ఆర్ ఈజ్ ఇట్ సిక్స్‌టీ? ఫిటింగ్ ఫర్ ఎ డబుల్ ట్రెయిటర్, ఈజింటిట్? కమిషనరుగారు నువ్వు చేసిన సేవకి మెచ్చి క్షమాభిక్ష పెట్టినాడు, నువ్వు మరుసటి బోటులో కలకత్తా పోవచ్చు,” అన్నాడు.

నాకు బుర్ర తిరిగిపోతోంది. ఈ జైలేమిటి? ఈ పగటి వేషగాడెవడూ? నన్ను తివారీ అంటాడేం? డియర్ ఎక్కడ? చంద్రముఖి ఏదీ? జానీ వాకర్? పాల గ్లాసో?

వెర్రి చూపుల్తో చుట్టూ పరకాయించాను.

గోడమీద కాలెండరులో మే 1859 అని ఉంది.

మూలనెక్కడో ‘మ్యావ్, మ్యావ్’ అని వినిపిస్తోంది. అక్కడో మానవ కళేబరం, చూస్తే 18-19 ఏళ్ళ ఆడమనిషిలా ఉంది. కారు నలుపు దేహం. ఒంటిమీద ఆచ్ఛాదన లేదు. ఓ అరడజను పిల్లి పిల్లలు శవం మీద పడి ముచ్చటగా ఆడుకుంటున్నాయి, మధ్యమధ్యలో శవాన్ని ప్రీతిగా నాకుతున్నాయి.

“ఏంది బే ఎరగనట్టు అలా చూస్తున్నావు? అది నీ పెళ్ళాం లీపా. తన చావుకి నీ ద్రోహమే కారణం అని చెప్పి పోయింది. అది చచ్చింది, దాని కడుపులో నీ బిడ్డా చచ్చింది, దాని వాళ్ళంతా చచ్చారు. దొరలూ, మనమూ ఉన్నాం. భలే భలే!”

చావట్లో భోజనాల గంట మోగింది. జమాదారుని అనుసరించి బయల్దేరాను. అవతల ఎండ ఆవిర్లెత్తుతోంది.