ఇది ఒక అచ్చమైన అన్వరీయం.
పసుపు పచ్చగా కాంతులీనే ‘అనగనగా ఒక చిత్రకారుడు’ అనే ఈ పుస్తకం నా చేతిలో పడి పదిహేను రోజులు పైనే అయింది. ఫేస్‌బుక్‌లో చాలావరకూ చదివిన వ్యాసాలే అయినా పుస్తకంగా చూసినపుడు కలిగే అనుభూతి వేరు. అదే అక్షరానికున్న అధికారత.
అసలు అన్వర్‌ని మంచి చిత్రకారుడనాలా? మంచి రచయిత అనాలా? అనేది పెద్ద ధర్మసంకటం నాకు. మంచి రచయిత అంటే రచయితలోని చిత్రకారుడికి కోపం వస్తుంది (ఆర్టిస్ట్ మోహన్‌గారి లాగ) మంచి చిత్రకారుడంటే చిత్రకారుడిలోని రచయితకి అన్యాయం చేసినట్టవుతుంది. చాలామంది అని అనను కాని, కొంతమంది చేయి తిరిగిన చిత్రకారులు చక్కని వాక్యం రాయడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
రేఖాయాత్ర ప్రచురణ
ఆర్టిస్టు బాపుగారి వాక్యం ఆయన బొమ్మల్లాగే బహు అందమైనది. ఆలోచనల్లోనూ, పదాల పొందికలోనూ పొదుపు ఆయన ప్రత్యేకత. రాసినది చాలా తక్కువయినా, ఒఖ్ఖ అనవసరమైన పదం గాని, వాక్యం గాని కాగడాబెట్టి వెతికినా కనపడదు వారి రచనలలో. ‘మబ్బునీడా-మల్లె వాసనా’ అనుకుంటా ఆయన రాసిన ఒక కథ పేరు. అది కాక కొంతమంది చిత్రకారులపై వ్యాసాలు, వారి తల్లి గురించి రాసిన ‘ఉత్తమాఇల్లాలు’, తను బొమ్మలు ఎలా నేర్చుకునేవాడో చెప్పిన వ్యాసం, ఐసెన్‌బర్గ్ మీద రాసిన ‘నేనూ నా గాడ్ ఫాదర్’, ఇంకా తమ సినిమాల మీద పేల్చిన జోకుల సమాహారంగా ఒక సినిమా వ్యాసం వంటివి కొన్నే తెలుసు నాకు. ఎంత మంచి వాక్యం రాసేవారో ఆయన! తను గీసే కార్టూన్లకి రాసే కామెంట్ కూడా ఆయనదే. (చాలామంది ఆ రాసింది ముళ్ళపూడి అనుకుంటారట!)
అలాగే మోహన్‌గారి వాక్యమంటే కూడా నాకు చాలా వ్యామోహం. ఆయన ఎప్పుడయినా కనపడితే ‘మీ బొమ్మలేమో కానీ, మీ వాక్యం అద్భుతం!’ అని చెప్పాలనుకునేదాన్ని. కానీ తెలిసినవాళ్ళు ముందే హెచ్చరించారు, ‘పొరపాటున అలా అనేవు సుమా! అలా అంటే ఆయనకు కోపమొస్తుంది’ అని.
ఇంతకీ మన అన్వరుడు తన గురువులు బాపు, మోహన్‌ల లాగా ఈ రెండూ సాధించడం గొప్ప విషయం. అయితే అతని వాక్యాన్ని బాపుతో, మోహన్‌తో పోల్చడానికి వీల్లేదు. అతని వాక్యం వినూత్నం, అతని శైలి శక్తివంతం, అనుకరించడానికి సాధ్యం కానిది. ఎందుకు సాధ్యం కాదంటే పచ్చిగా అతని లోని ఆత్మానుభూతిని ఆవిష్కరిస్తాయా అక్షరాలు. అంతేకాదు చూడగలిగితే అతని గుండె కార్చిన రక్తం ప్రతి అక్షరంలోనూ కనపడుతుంది. (అందుకేనేమో పుస్తకంలో కొన్ని వాక్యాలు ఎర్రగా ముద్రితమయ్యాయి!) ఇక కొత్తగా అతను సృష్టించే పదాలయితే కోకొల్లలు, ఉదా: అచ్చించారు(అచ్చు వేయించారు), తోరణించండి(తోరణాలు కట్టండి), రాయచాతకాక(రాయడం రాక)… ఇలాగన్నమాట. అయితే అవి మనకు చదువుకోవడానికేమీ అడ్డం రాకపోగా ఒక ప్రత్యేకమైన అందంతో ప్రకాశిస్తాయి. ఒకవేళ యెవరైనా అతని వాక్యంలో వ్యాకరణం కోసం వెతికి సంస్కరించ బూనుకున్నారంటే అలవోకగా అవివేకమనే అడుసులో కాలేసినట్టే. ఈ పుస్తకంలో వున్నవాటిని వ్యాసాలో, కథలో అనేకంటే జీవనచిత్రాలంటే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఈ జీవనచిత్రాలలో అతని కుంచె వెలార్చిన రంగులు ఎన్నో! అందులో హాస్యం, వేదన, విషాదం, ప్రేమ, స్నేహం, వైరాగ్యం ఇలా… మచ్చుకు ఒకటో రెండో చూద్దాం!
తను చిన్నప్పుడు శ్మశానంలో పుర్రెలతో ఆడుకున్న విషయాలు చెబుతూ ‘సాయంత్రం స్కూలు ముగియంగానే పుస్తకాల సంచి ఇంట్లో పడేసి కాళ్ళు చేతులు కూడా కడుక్కోకుండానే విల్లమ్ములు చేతబట్టి శ్మశానంలోకి పరుగు తీసేవాళ్ళం. తాజా బూడిద మధ్య నుండి ఇటీవలే మోక్షం పొందిన కపాలాన్ని, దాని వేళ్ళ ఎముకలను జాగ్రత్తగా ఏరి, దగ్గలో ఉన్న సమాధి మీద పుర్రె, ఆ పుర్రె మీద ఆ చిన్న ఎముకలను పెట్టి మా విలువిద్య గురిని సరిచూసుకునేవాళ్ళం. అలా అప్పటి సాయంత్రాలు సంధ్యాశిఖరాల వెనుకకు జారిపోయే సూర్యుడి తలపుచ్చలా మాయమయ్యేవి.’ (ఇంతకన్నా పొయెట్రీనా?) ‘అప్పటికి మా జీవితాల్లోకి ఓనిడా టీవీలు, ఐడిఎం క్రికెట్ బ్యాట్లు, విక్కి కార్క్ బాళ్ళు చేరుకోలేదు. ఇప్పటికీ నేను బ్రతికి ఉండటానికి, ప్రతీ పాతను కొత్తగా వింతగా చూడటానికి అది పునాది.’
‘తడి వర్షం’ అనే వ్యాసంలో తను అత్యంత ప్రియంగా ప్రేమించే వర్షంలో తడుస్తూ ఎలా పలవరిస్తాడో చూడండి. ‘వర్షం అంటే దేవుడు నా పేరిట రాసి ఇచ్చిన నా ఆస్తి. చాన్స్ దొరికి ఏనాడు నేను వర్షంతో సంగమించక మహదానందం పొందనిది లేదు. ఒక మధ్యాహ్నం మహానంది చిన్నకోనేరులో ఉండగా వర్షం మొదలయ్యింది. మెట్ల మీదికి ఉరికి సల్లాడంలోంచి చిల్లర దొరకబుచ్చుకుని సైకిల్ మీద పుల్ల ఐస్ అమ్మేవాడి దగ్గర ఒక ఆరంజ్ కొనుక్కుని మళ్ళీ కోనేరు లోకి దూకితే… లోపలా బయటా అంతా నీరే! గుల్జార్ రాయని ఆ మధ్యహ్నపు కవిత్వాన్ని నేను.‘
‘వర్షం అంటే కొన్ని చినుకుల జాతరేనా? నా చిన్నపుడయితే అప్పటికప్పుడు వేయించిన పచ్చి వేరుశెనగ బుడ్డలు కావా? గుర్రాల షెడ్లో ముంత కింది వేడి బొరుగుల్లో పిండిన నిమ్మ చుక్క కాదా? వర్షపు స్నానపు అనంతరం మా ఆవిడ తిట్టుకుంటూ తుడిచే నా వంగిన తలపై నుంచి జారే నా నవ్వు కాదా? అంతా అయ్యాకా ‘కాఫీ కలపనా? టీ పెట్టివ్వనా? రెండు బజ్జీలు కూడా వేసివ్వనా వేడి వేడిగా?’ అని అడిగే వెచ్చని ఆవిరి కాదా వర్షాకాలపు జీవితం అంటే!‘
‘కొద్దిగా చూడు బయట వర్షం కురుస్తుందేమో కాస్త తడుద్దాం‘ అంటాడు. కానీ మనం ఆ పాటికే వర్షంలో పూర్తిగా తడిసి ముద్దయిపోయి ఉంటాం కదా!
ఇంకా ఇలాంటివి మొత్తం 54 వున్నాయి పుస్తకంలో. మనకి రోజువారీ నలుపు తెలుపుల్లో కనిపించే విషయాలు అతనికి మాత్రం పంచరంగుల్లో కనపడి ఊరిస్తాయి. ఝల్లుమని ఒళ్ళంతా తడిపే వాన తనని లవ్వించమంటుంది. కర్రా-బిళ్ళా ఆటలో పైకెగిసిన కర్రముక్క రెక్కలు విప్పుకున్న రంగురంగుల పిట్టలా మారి రా రమ్మని పిలుస్తుంటుంది. కుదిరిన బొమ్మలే కాదు, కుదరని బొమ్మలు కూడా తమ వెనకున్న వ్యథల కథలు చెబుతాయి. ఇంకా చెప్పాలంటే నూనెపల్లె బఠాణీలు కన్నీళ్ళంత ఉప్పగా ఎందుకుంటాయో, జీవితమనే రోడ్డు మీద మైలురాళ్ళకు రంగులేయడమనే కష్టమెంత ఖరీదో అవగాహన కావాలన్నా, స్మశానంలో కపాలంతో అతని మొదటి స్మైలీ కథేమిటో అది చెప్పే వేదాంతమేమిటో చివరికి అందులో నిండేదేమిటో తెలుసుకునే ఎరుక కలగాలన్నా, చల్లగా హాయిగా తమ స్నేహంతో సేదతీర్చే దేవతలు నాయుని కృష్ణమూర్తి, కాళ్ళ సత్యనారాయణ అనే పేర్లు పెట్టుకుని మన మనుషుల మధ్యలో యెలా తిరుగాడి వెళ్ళిపోయారో తెలుసుకోవాలన్నా, నిజాయితీ నిండిన అనుభూతులు చదువుతుంటే వచ్చే మజా అనుభవించాలన్నా, అతను మెచ్చిన సినిమాల, పుస్తకాల విశేషాలు వినాలన్నా–అతని పుస్తకం చదవడం తప్ప వేరే దారి లేదు. కాకపోతే పుస్తకం చదివాక మీలో కలిగే ఉద్వేగానికీ, మీ హృదయాల మీద పెంకులెగిరిపోవడానికీ (చలంగారు చెప్పినట్టు) నా పూచీ యేమీ లేదు కాబట్టి మీలో ఆ చేవ వుంటేనే పుస్తకం తెరవండి. ఇలాంటి ఒక కొడుకుని కలిగి వున్న తల్లి యే లోకాన వున్నా గర్విస్తూ చిరాయుష్మాన్ భవ అని దీవిస్తుంది కదా! అన్వర్ తన కుంచెతో గీసే చిత్రాలతో పాటు, ఇలాంటి జీవనచిత్రాలు కూడా మరిన్ని రచించి ప్రచురించాలని ఆకాంక్షిస్తూ…