ఆకాశవంతెన 3

6

బాంపూఁ నుంచి నాన్‌జింగ్‌కి ఎక్స్‌ప్రెస్ ట్రెయినుకి టికెట్ తీసుకున్నా. ఉదయం పదకొండున్నరకా ట్రెయిన్. నేను ఫోన్లో గడ్డపు సన్‌తో మాట్లాడినప్పుడు అతను మా అమ్మ గురించి తనకు తెలుసునని చెప్పి తనతో మాట్లాడ్డానికి నాన్‌జింగ్‌కి రమ్మని పిలిచాడు. అతన్ని కలిసినప్పుడు, నేను మా అమ్మ మరణించిన స్థలమ్మీదుగా అప్పటికే రెండుసార్లు ప్రయాణించినట్లు చెప్పాడు గడ్డపు సన్. ఆ ప్రదేశం పేరు ఎద్దు పడిన లోయ అట. నాకు అలాంటి చోటు గుర్తు లేదని చెప్పాన్నేను.

“ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్లు ఆగవక్కడ. కానీ అక్కడ రెండు కొండల మధ్యన బ్రిడ్జి ఒకటి ఉంటుంది. ట్రెయిన్లన్నీ ఆ బ్రిడ్జి మీదుగానే వెళ్ళాలి. నువ్వు ఆ స్టేషన్ని గమనించి ఉండకపోవచ్చు గానీ, ఆ బ్రిడ్జిని ఖచ్చితంగా చూసే ఉంటావు. మీ అమ్మ సమాధిని కూడా చూసే వుండవచ్చు.”

ఒక క్షణమాగి, “అది ఇంకా అక్కడే ఉండి ఉంటే…” అన్నాడు తనే మళ్ళీ.


ల్యూ ఇచ్చిన బిజినెస్ కార్డు నేను ఎద్దు పడిన లోయలో పారేశాను. ప్లాట్‌ఫామ్ మీద గోడనానుకుని బ్రిడ్జి వంక చూసినప్పుడు, ‘అబ్బ, ఈ బ్రిడ్జి నిజంగా ఆకాశంలోనే ఉంది!’ అనుకున్నాను. అదే సమయంలో చొక్కా జేబులో ఏదో గుచ్చుకుంటుంటే, తీసి చూద్దును గదా… బిజినెస్ కార్డు. రెండు ముక్కలు చేసి గోడ మీదుగా పడేశాను.


తియన్ చియావ్ (Sky bridge)

పైనుంచి చూస్తుంటే, బిజినెస్ కార్డ్ రెండు ముక్కలూ రెండు తెల్ల సీతాకోకచిలుకల్లాగా గాల్లో తేలుతూ వెళ్తున్నాయి. గాలి తెమ్మెర వాటిని ఒకసారి పైకి లేపుతూ, అంతలోనే క్రిందకి నెడుతోంది. చివరికి వాటిల్లో ఒకటి లోయ అంచున పెరిగిన ఓ పిచ్చిచెట్టు కొమ్మ మీద ఆగింది. రెండవది లోయ అడుగున చిన్నా పెద్దా గులకరాళ్ళ మధ్యన చేరింది.

ఏదోవొకరోజున, ఎవరికో ఒకరికి ఈ రెండు ముక్కల్లో ఒకటి దొరుకుతుంది. అలా దొరికిన ముక్క మీద ‘ప్రశాంత వాతావరణం, అందమైన ప్రకృతి’ అనో లేక ‘మీ బంధు మిత్రులకి చక్కటి విశ్రామ స్థలం’ అనో ఉంటుంది. వాళ్ళు అదంతా ఒక సమాధి స్థలం గురించని బొత్తిగా ఊహించలేరు.

కరవుకాలంలో, ప్రతీ వృత్తిలోనూ, పనివాళ్ళు పల్లెలకి తరలివెళ్ళాలని[1] The government has to supply rations to the people living in urban areas. However, in villages, people are expected to fend for themselves. So, moving people to rural areas would reduce the burden on the government. ఆదేశాలొచ్చాయి. మా కుటుంబం మొదట పల్లెప్రాంతాల్నుంచి వచ్చిందే. అందువల్ల, మా నాన్న గ్రూపు లీడర్లు తనని పల్లెలకి వెళ్ళిపోవాల్సిందిగా చాలాసార్లు వత్తిడిచేశారు గానీ మా నాన్న ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయాడు. ఆయన తన రేడియోని పెద్దగా పెట్టి బొగ్గుల కుంపటిని విసిరేవాడు. బొగ్గుల కుంపటి పొగతో గది నిండేసరికి గదిలో ఎవరూ ఉండలేకపోయేవారు. చివరికి, మా నాన్న సూపర్‌వైజర్లు ఆశ వదిలేసుకుని, మా నాన్న మొండితనాన్ని తిట్టుకుంటూ వెళ్ళిపోయారు.

మొండి బుర్రల్ని మామూలు బుర్రలు కదిలించలేవు. మేయర్ చెన్-యి అంతటివాడు కూడా ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యాడు. మిగతా వాళ్ళు సరేసరి.

మా నాన్న నాకు ఉపకారం చేస్తున్నట్టుగా అనుకున్నాడు. చాలా ఏళ్ళ తరువాత ఆయన నాతో ఇలా అన్నాడు: “వాళ్ళు నన్ను పల్లెలకి తరిమేద్దామని చూసేరు. వాళ్ళ పథకం నన్ను మళ్ళీ వెనక్కు రాకుండా చేద్దామని. వాళ్ళ సంగతి నాకు తెలుసును. నేను షాంగ్‌హాయ్ వదలకపోవడానికి కారణం, నేనిక్కడ లేకపోతే నిన్ను షాంగ్‌హాయ్ రానివ్వరనే. ఇప్పుడు చూడు, వాళ్ళు నిన్ను వెనక్కి రానివ్వకపోవడానికి లేదు.” నేను తిరిగి షాంగ్‌హాయ్‌కి రావడం గవర్నమెంట్ పాలసీ వల్లనని, ఇందులో తను చేసిందేం లేదని, మా నాన్నతో చెప్పాలనిపించేది. అయితే అప్పటికే మా నాన్న మతి పోగొట్టుకున్నాడు. నాకాయన ఆనందాన్ని పాడుచేయడం ఇష్టంలేకపోయింది.

మా నాన్న రిక్షా లాగుతూనే ఉన్నాడు. కొంతకాలం తర్వాత రిక్షాలని నిషేధించినప్పుడు కుర్ర రిక్షావాళ్ళకి టాక్సీ నడపడంలో ట్రెయినింగు ఇప్పించారు. మా నాన్న మరీ ముసలివాడవడం వల్ల ఆయన్ని ఒక కంపెనీకి డోర్ కీపర్‌గా వేశారు. నేను షాంగ్‌హాయ్‌కి తిరిగి వెళ్ళేదాకా ఆయన రిటైరవ్వలేదు.

మా నాన్న రిటైరయ్యింతర్వాత ఆయన ఆరోగ్యం మరీ క్షీణించింది. మొదట్లో, కిరాణాకొట్టుకీ వాటికీ వీటికీ వెళ్ళగలిగేవాడు. కొంతకాలానికి, ఇంట్లో కూర్చుని రేడియో వినడం మాత్రం చేయగలిగేవాడు. ఇంకొంత కాలానికి, కూర్చోవడం కూడా అసాధ్యంగా మారింది. రోజంతా మంచంలో పడుకుని, నన్ను త్వరగా పెళ్ళి చేసుకోమని పోరేవాడు. మూడేళ్ళ క్రితం మరణించేడాయన. పాపం, కోడల్నిగానీ నా సవతి కొడుకునిగానీ చూడకుండానే పోయాడు.

మా నాన్న తన చివరి రోజుల్ని ఓ ఆసుపత్రిలో గడిపేడు. మొదటసారి ఆస్పత్రిలో చేర్చినప్పుడు, ఒక డాక్టరు పరీక్షించి ‘ఇక అంతే’ అన్నాడు. తర్వాత ఆ డాక్టరు మళ్ళీ ఎప్పుడూ కనబళ్ళేదు. నేను పగలు ఫాక్టరీలో పనిచేస్తూ, రాత్రిపూట మా నాన్నతో ఆసుపత్రిలో గడిపేవాణ్ణి. నేనేమన్నా మరీ పడుచువాణ్ణా? రాత్రుళ్ళు నిద్రలేకపోవడంతో, నాకూ నలత మొదలయ్యింది. అదృష్టవశాత్తూ, మా నాన్నకి పెద్దగా సహాయం అవసరమయ్యేదికాదు. చాలావరకూ స్పృహ లేకుండా ఉండేవాడు. నేనెవరో కూడా తెలిసేదికాదు. ఎప్పుడైనా తెలివొచ్చినప్పుడు, చెయ్యి చాపి నన్ను తాకేవాడు. “వాంగ్ బావ్, నేను పోయింతర్వాత నన్ను మన స్వంతూరు ఉత్తర జాన్‌సూ తీసుకెళ్ళి మీ అమ్మతో పాటూ సమాధి చెయ్యి.” ఇదే మాట పదేపదే చెబుతూ ఉండేవాడు. ఆయన మా అమ్మ సమాధి మా స్వగ్రామంలో ఉందని ఎందుకనుకునేవాడో నాకు అస్సలు అర్థమయ్యేది కాదు.

శీతాకాలం మొదటి రాత్రి మరణించేడు మా నాన్న. శీతాకాలం మొదలవ్వడం చాలా పెద్ద వాతావరణపు మార్పు. ముసలివాళ్ళకి అది చాలా గడ్డు సమయమంటారు. మా నాన్న చాలా రోజుల్నుంచీ పోరాడాడు గానీ, ఈ ఋతువు మారడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆ రాత్రి నేను మా నాన్న మంచం పక్కనే నిద్ర పోయాను. నేను నిద్ర లేచేసరికి ఆయన ప్రాణం పోయింది. ఆయన చనిపోయింది రాత్రి 11 గంటలకూ ఉదయం 5 గంటలకూ మధ్య అని మాత్రమే తెలుసు నాకు.

7

నాన్‌‌జింగ్‌లో నేనొక తమాషా పని చేశాను. రైల్వే హాస్పిటల్లో గడ్డమున్న ప్రతీ ఒక్కర్నీ ఆపి ‘ప్రెసిడెంట్ సన్!’ అని పలకరించాను. నేనాపిన వాళ్ళందరూ తాము కాదన్నట్టు తలూపి ఇంకో పక్క పంపించేరు. చివరికి, నా వయసే ఉండే ఒక వ్యక్తిని ఆపి గడ్డంతో ఉండే ప్రెసిడెంట్ తెలుసేమో అడిగేను. దానికా మనిషి తన నున్నని గడ్డాన్ని తడుముకుని, “నేనే ప్రెసిడెంటుని. మా ఇంటిపేరు సన్. గడ్డపు సన్‌ అనేది నా నిక్ నేమ్!” అన్నాడు.

నేను ఫార్మ్‌లో ఉన్నరోజుల్లో, మా మూడో ప్రొడక్షన్ టీమ్‌లో ఫై డాంగ్ తాలూకా నుంచొకతనుండేవాడు. రెండు మీటర్ల ఎత్తుండేవాడు. అతడి పిడికిలి నా మొహంకంటే పెద్దగుండేది. ఓ రెండువందల కిలోల బరువున్న కావడిని గడ్డిపోచలా మోసేవాడు. అతను బయట పనిచేసుకునే రోజుల్లో ఒకసారి ఓ రౌడీ గ్రూపుతో గొడవ జరిగింది. ఐదుగురు మనుషులు కావడి బద్దల్తో అతని మీదబడ్డారట. ఇతగాడొక్కడూ ఆ ఐదు మందినీ మట్టి కరిపించేడట. అంతేకాదు, ఆ ఐదుగురిలో ఇద్దరు జీవితంలో ఏపనీ చేయలేకుండా తయారయ్యారు. అందువల్లనే అతను మా ఫార్మ్‌కొచ్చాడు.

అతను 1961లో చనిపోయాడు. అది ఆకలివల్లో జబ్బుచేసో తెలీదు. మేమతణ్ణి మా హాస్టల్ వెనుక కొండల్లో పాతిపెట్టాం. అతడి శవాన్ని రెండు చాపల్లో చుట్టినా కాళ్ళు బయటే ఉండిపోయినై. మా హాస్టలు నుంచి కొండల్లోకి కొంచెం దూరమే. ఐనా, టీమ్‌లో ఉన్న పదిమందిమీ ఆ బరువుకి ఏడ్చేం.

ఇంతకీ, ఆ ఫై డాంగ్ తాలూకా అతని పేరు ‘పొట్టోడు’!


గడ్డపు సన్ నన్ను తన ఆఫీసుకి తీసుకువెళ్ళాడు. అది బాగా విశాలమైన గది. కిటికీ బయట చాలా వెదురు మొక్కలున్నాయి. నేనతడితో బాంపూఁలో ఎవరికీ మా అమ్మ విషయం తెలీదనీ, ఫైళ్ళన్నీ పోయినయ్యనీ చెప్పాను. గడ్డపు సన్ ఓ క్షణమాలోచించి, “ఐతే, ఈ కేసు గురించి తెలిసింది నాకొక్కడికేనన్నమాట!” అన్నాడు. అతడకారణంగా గర్వపడుతున్నాడనిపించింది.

మా అమ్మ ఎద్దు పడిన లోయలో మరణించిందని చెప్పాడు గడ్డపు సన్. అతడు ఫాన్ వేసేసరికి అసలే ఉడికిపోతున్న గదిలోకి వెచ్చని గాలి దూసుకొచ్చింది. “అప్పట్లో నేను రైల్వే సెక్యూరిటీ డిపార్ట్‌మెంటుకి కొత్త. ఎద్దు పడిన లోయ స్టేషన్నుంచి వార్త అందింది, ఎవరో ఆడమనిషి శవం దొరికిందని. ఆ ప్రాంతం మనిషి కాదట. సెక్యూరిటీ వాళ్ళెవరన్నా వెంటనే రావాలన్నారు. మా సూపర్వయిజరు నన్ను పంపేడు. శవం స్టేషన్ దగ్గర లోయలో దొరికింది. లోయలో పడిపోడంవల్లనే మనిషి చనిపోయింది. తల పూర్తిగా పగిలిపోయింది. నేను చెక్ చేస్తే శవం వంటి మీద వస్తువులేమీ కనబళ్ళేదు. నా చెక్ పూర్తవ్వగానే స్టేషన్ మాస్టర్‌తో శవాన్ని వీలైనంత త్వరగా పూడ్పించమని చెప్పేన్నేను. తెలుసు కదా, జులై నెల. విపరీతమైన వేడి ఈ రోజులానే. తప్పని సరి.”

“తెలుసు.”

ఇదయింతర్వాత గడ్డపు సన్ బాంపూఁ వెళ్ళాడట. బొత్తిగా ఆధారాల్లేని కేసు. ఎంతకాలం పరిశోధించినా ఫలితముండదనుకున్నాడట తను. అయితే, ఆరోజు రాత్రి ఏదో పోలీస్ స్టేషన్నించి రైల్వే సెక్యూరిటీకి ఫోను- రైల్లో నేరం చేసొచ్చినవాడొకడు దొరికేడనీ, వచ్చి విచారణలో పాల్గోమనీనూ.

ఆ పట్టుబడినవాడి ఇంటిపేరు జిన్. వాడు మిలిటరీలో పనిచేసినవాడు. వాడు పోలీస్టేషన్‌కెలా వచ్చేడో సరిగా తెలీదు. ఒక పోలీసు ఆఫీసర్ వాడి దగ్గర అన్ని రాష్ట్రాల్లోనూ పనికొచ్చే రేషన్ టిక్కెట్లు[2] Before 1980s, the distribution of many essential consumer goods (food, soap, cloth etc.) was not only controlled but also run by the government. Only a small fraction of the outlets were in private hands. People would go to the ‘Lilong’ (the neighborhood association) to get the ration tickets once every quarter and then they purchased from stores using money AND ration tickets. For items such as meat, sugar, cooking oil, and soap, how much you got depended mostly on the size of the household. For staple foods, such as rice and flour, it also depended on your occupation: students and workers in the heavy industry got extra. Before the 80s, there was no free market for these goods. Being caught making transactions in the black market could get you in trouble. (The enforcement also varied by region. Cities like Shanghai were very strict. Some cities in the suburban areas may not have been very strict.) In the 1980s, there was a gradual liberalization, especially in the farm produce market. People still got their rations, but most things were available in farmers’ markets, but at a higher price. The items still under government control were staple foods, cooking oil, and sugar, etc. Starting from 1990’s, there was no shortage of these items and the government abolished rationing. People now buy everything in the open market. Vegetables and fruits were never rationed. There were always enough of the former, and the rationing the latter was not considered necessary. చూసి అవి ఎక్కడివని అడిగాడట. ఆశ్చర్యంగా, వాడా ప్రశ్న వినగానే ఏడవడం మొదలుపెట్టి చెప్పాడట- తను చావాల్సిందేననీ, డబ్బులకీ రేషన్ టిక్కెట్లకీ ఆశపడి రైల్లో ఒకావిణ్ణి చంపేననీనూ.

గడ్డపు సన్ పోలీస్టేషన్‌కి వెళ్ళేసరికి వాడింకా చిన్నపిల్లల్లా ఏడుస్తూనే ఉన్నాడట. “ఏడవడమేగానీ దేనికీ సమాధానం చెప్పడు. చివరికి మాట్లాడ్డం మొదలుపెట్టేడు. వాడన్ని పనికిరాని విషయాలెక్కడ నేర్చుకున్నాడో తెలీదు. ఆపమన్నా ఆపడే! వాడు ఫూకోలో ట్రెయినెక్కాడు. మీ అమ్మ ఎదురుగా కూర్చోవడం జరిగింది. ఆ రోజు రైల్లో చాలా తక్కువమంది పాసెంజర్లున్నారు. ఆ పెట్టెలో మరీ తక్కువ మంది. మాటల మధ్యలో, మీ అమ్మ తను దక్షిణాన తన కొడుకుని చూడ్డానికి వెళ్తున్నట్లు చెప్పింది వాడితో. అప్పుడే వాసన పట్టుంటాడు ఆవిడ వెళ్తున్నది ఫార్మ్‌కని. అర్ధరాత్రి అందరూ నిద్రపోయింతర్వాత వాడు మీ అమ్మని రెండు పెట్టెలమధ్యనుండే వెస్టిబ్యూల్‌లోకి తీసుకువెళ్ళాడట. లేదూ, మీ అమ్మ బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు వీడు వెనకాల వెళ్ళుండవచ్చు. ఏమైతేనేం, వాడు మీ అమ్మ పీక పట్టుకుని రేషన్ టిక్కెట్లు తీసుకున్నాడు. వాడి దగ్గిర రైలు పెట్టెకి తాళపు చెవులున్నాయి. వాడు పెట్టె తలుపు తీసి మీ అమ్మని కిందకి తోసేశాడు. ఏం జరగనట్టు తిరిగి పెట్టెలోకి వెళ్ళి కూర్చున్నాడు.”

“ఎన్ని రేషన్ టిక్కెట్లు తీసుకున్నాడు వాడు?” అడిగేను.

“40 కిలోలవి!” అన్నాడు గడ్డపు సన్. “కానీ మేం వాణ్ణి పట్టుకునేసరికే వాడు అందులో చాలాభాగం వాడేయడమో అమ్మేయడమో జరిగింది. వాడు బాంపూఁలో దిగేటప్పుడు మీ అమ్మ బుట్టని తీసుకెళ్ళడం మర్చిపోయాడు. బహుశా, ఆ బుట్ట ఉన్నట్టు వాడికి తెలిసుండకపోవచ్చు. ఆ బుట్ట దొరకడం వల్లనే మాకు మీ అమ్మ పేరు తెలిసింది. తర్వాత మేము షాంగ్‌హాయ్ ఆఫీసుని కాంటాక్ట్ చేశాం.”

ఆ తర్వాత జరిగిందంతా నాకు తెలుసు. షాంగ్‌హాయ్ పోలీసు బ్యూరో నుంచి వచ్చిన కామ్రేడ్ గావ్ మా నాన్నకు చెప్పిన కథంతా మా నాన్న నాకు చెప్పాడు. చాలా పొడూగు కథ!

రేషను టిక్కెట్ల గురించి మా నాన్న నాతో ఎప్పుడూ చెప్పలేదు. ఆయనకి తెలిసిందల్లా మా అమ్మ నాకోసం ఒక బుట్ట పట్టుకెళ్ళిందని మాత్రమే. అందులో ఏముందో ఆయనకి తెలీలేదు. ఈ కేసు మూసేసినతర్వాత, బాంపూఁ రైల్వే సెక్యూరిటీవాళ్ళు ఆ బుట్టని షాంగ్‌హాయ్‌కి పంపించేరు. ఐతే, అప్పటికే మా బాబాయి మా నాన్నని ఉత్తర జాన్సూలో మా ఊరికి తీసుకెళ్ళిపోయాడు. అందువల్ల ఆ బుట్ట లోకల్ పోలీస్‌స్టేషన్లో ఉండిపోయింది. ఆర్నెల్ల తర్వాత మా నాన్న షాంగ్‌హాయ్ తిరిగివచ్చిన తర్వాతగానీ దాన్ని తెరవడం జరగలేదు. “మీ అమ్మ అన్ని తినుబండారాలు ఎలా సంపాదించిందో ఆ భగవంతుడికే తెలియాలి. ఆ రోజుల్లో బిస్కట్లు కొనడానిక్కూడా ప్రత్యేకమైన రేషన్ టిక్కెట్లు అవసరమయ్యేది!” అన్నాడు మా నాన్న.

ఆయన బుట్టని తెరిచేసరికి ఆ తిండి పదార్థాలన్నీ బూజుపట్టేసున్నాయని చెప్పాల్సిన అవసరం లేదు.

మా అమ్మ దగ్గిర నలభై కిలోల రేషన్ టిక్కెట్లున్నాయని–అందునా దేశమంతటా పనికివచ్చేవి–తెలిస్తే ఆయన ఆశ్చర్యపడి ఉండేవాడు. ఆ టిక్కెట్లతోపాటు మా అమ్మ కొంత డబ్బు కూడా తీసుకెళ్ళింది. ఈ సంగతిగాని తెలిసుంటే మా నాన్న మండిపడేవాడనిపించింది. తను నాకు సిగరెట్లు పంపడం గురించి మా నాన్న చాలాసార్లు గొడవపడ్డాడని వ్రాసింది మా అమ్మ, తను వ్రాసిన ఆఖరి ఉత్తరంలో. “నాకు నువ్వు తప్ప ఇంకెవరన్నా పట్టదని మీ నాన్న ఎగిరిపడుతున్నాడు. సిగరెట్లన్నీ నీకు పంపేసేనట. తనేం కాల్చుకోవాలని గొడవ.” నాకోసం రేషన్ టిక్కెట్లూ, డబ్బూ తీసుకువస్తున్నట్టు ఆ ఉత్తరంలోనే వ్రాసింది.

తెస్తానన్నదేగానీ, ఎంతనేది వ్రాయలేదు. టిక్కెట్లు నలభై కిలోలవని ఇప్పటికి తెలిసింది. డబ్బెంతనేది ఎప్పటికీ తెలీదు. ఆ డబ్బుల్ని ఆ చంపినవాడూ కనుక్కోలేదు. గడ్డపు సన్ కూడా చూళ్ళేదు. మా పిన్ని మాటలు నమ్మితే ఆ డబ్బులు మా అమ్మ లంగా జేబులో దాచిపెట్టుంటాయ్. ఆ డబ్బు ఆవిడతో పాటు ఎద్దు పడిన లోయలోనే సమాధయ్యింది.

ఆ రేషన్ టిక్కెట్లనీ, డబ్బునీ ఆవిడెలా పోగేయగలిగిందో నాకు తెలీదు. అదంత సులభమయ్యుండదని మట్టుకు తెలుసు. ఎందుకంటే, వాటిని మా నాన్న కళ్ళబడకుండా దాయాలి. నా చిన్నప్పుడు మా అమ్మ చేపల బౙార్లో కూర్చుని చేపల్ని బాగుచేసిపెట్టేది. అప్పుడప్పుడూ బల్లని మొయ్యడానికి నన్ను తీసుకెళ్ళేది. ఆవిడ తన జుట్టు కనపడకుండా ఒక తెల్ల టోపీ తొడుక్కుని ఒక ప్లాస్టిక్కు కాగితాన్ని ఏప్రానులాగా కట్టుకునేది. అలా తయారయ్యి, ఒక ముసలమ్మల గుంపులో కూర్చునేది. ఆ గుంపులో ప్రతి ఒక్కరి ముందూ, ఒక చిన్న చెక్క బల్లుండేది. జనాలు చేపల్ని కొనుక్కుని వాటిని ఆ చెక్క బల్లలమీద పడేసేవాళ్ళు. చేపలు కొట్టిపెట్టినందుకు మేం డబ్బులు తీసుకునేవాళ్ళం కాదు. అయితే చేపల పొట్టలూ, తలకాయలూ, తోకలూ మట్టుకు మేమే ఉంచుకునేవాళ్ళం. పిల్లులున్నవాళ్ళు వాటి మేతకోసం రోజూ ఆవిడ దగ్గరకొచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కరూ ఐదు పైసలో పది పైసలో ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుల్నావిడ తన ఏప్రానుకున్న జేబులో వేసుకునేది. ఇంటికెళ్ళేటప్పుడు నాకో పావలా ఇచ్చేదావిడ.

ఇది నా చిన్నప్పటి మాట. నేను ఫాక్టరీకి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత, ఆవిడలా చేపల బౙారుకు వెళ్ళడం మానేసింది. నేను తలెత్తుకు తిరగాలని ఆవిడ కోరిక.

ఇప్పటికీ నేనా చేపల బౙారుకు వెళ్తుంటాను. ఇప్పుడు, అలా చేపలు కొట్టిపెట్టే ముసలమ్మలు డబ్బులు వసూలు చేస్తున్నారు. లేదూ, వాళ్ళ దగ్గిర అల్లమో ఉల్లికాడలో కొనాలి. మా అమ్మ కూర్చునేచోట వేరే ఊరి అమ్మాయిలు కనబడుతుంటారు. వాళ్ళు గిన్నెలూ, కుండలూ, ప్లాస్టిక్ బిందెలూ ముందుపెట్టుక్కూచ్చుంటారు. వాళ్ళు డబ్బుల్తీసుకోరు. రేషన్ టిక్కెట్లే తీసుకుంటారు[3]As the previous note explains, in the past, basically the neighborhood associations controlled who would get what. So if you didn’t migrate to somewhere legally, you couldn’t get anything. It’s likely that the girls’ family is not in Shanghai legally and hence doesn’t get ration tickets from the neighborhood association. So, while the parents are working somewhere else making money, the girls’ task is to sell some pots and pans to earn the ration tickets needed. Since they are migrants, it’s good to have ration tickets available nation-wide. In China, most consumer goods (food, cloth, soap etc.) used to be distributed by the government and the ‘Lilongs’ (neighborhood associations) acted as the outlets. Similar to the system in India, making purchases at these outlets required both money and appropriate ration tickets. There are two kinds of ration tickets – those useful only locally and those useful nation-wide. The latter type are most valuable for obvious reasons.. ఓ పెద్ద కుండకేం తీసుకుంటారని వాళ్ళనడిగేనొకసారి. ఒక వేలు చూపెట్టింది ఒకమ్మాయి.

ఒక వంద జింగుల (యాభై కిలోల) రేషన్ టిక్కెట్లు (దేశమంతటా పనికివచ్చేవి) కావాలన్నది ఆ అమ్మాయి.


ఆ రాత్రికి నా బస రైల్వే హాస్పిటల్లోనే ఉన్న హోటల్లో. కొత్తగా కట్టిన ఒక బిల్డింగ్‌ లోకి నన్ను తీసుకువెళ్ళాడు గడ్డపు సన్. అక్కడ ప్రతీ గదికీ ఏ.సీ. కలర్ టీ.వీ. ఉన్నాయి. కిటికీలకున్న అల్యూమినియం ఫ్రేములకి తేనె రంగు అద్దాలున్నాయి. బాత్రూము గోడలకి తెల్లటి చలువరాయి తాపడం చేసుంది. ఆ బిల్డింగు పెద్ద అధికారులకి ఉద్ధేశించబడిందని చెప్పాడు గడ్డపు సన్. రోజుకి పాతిక రూపాయల అద్దెట ఒక్కొక్క గదికీ.

“నాకిది అవసరంలేదు.” అన్నాను నేను వెంటనే.

“నువ్వు అద్దె ఇవ్వనక్కరలేదు,” చిన్నగా నవ్వేడు గడ్డపు సన్. “ఎలానూ గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈరోజుకు నువ్వు రైల్వే డిపార్ట్‌మెంట్ అతిథివి.”

నన్ను గదిలో వదిలి వెళ్ళబోతున్నవాడల్లా ద్వారంలో ఆగి వెనక్కు తిరిగేడు. “వాంగ్ బావ్! ఇంతకీ మీ అమ్మ పేరేమిటన్నావ్ ?”

“షు గూయింగ్,” చెప్పేను.

“ఆఁ! అదీ పేరు. ఇప్పుడు గుర్తొచ్చింది,” అంటూ మళ్ళీ గదిలోకొచ్చేడు. “ఆవిడ ఎవరో కనుక్కోడానికి మాకు చాలా సమయం పట్టింది. హంతకుణ్ణడిగేం. వాడు తనకి ఆవిడ దగ్గిర రేషన్ టిక్కెట్లూ, కొంచెం చిల్లర డబ్బులూ తప్పితే ఇంకేం దొరకలేదన్నాడు. ఇంతకీ, మీ అమ్మ వంటిమీద ఐడీ కార్డు లేదెందుకని?”

ఆవిడకు ఐడీ కార్డు లేదని చెప్పాను. చేపలు శుభ్రం చేసేదావిడ[4]Only those with proper employment would have an ID card.. ఆవిడ దగ్గిర కుటుంబానికిచ్చే రిజిస్ట్రేషన్ కార్డు తప్ప వేరే ఐడీ కార్డేం ఉండేది కాదు.

గడ్డపు సన్ వెళ్ళింతర్వాత గుర్తొచ్చింది నాకు. షాంగ్‌హాయ్ గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న రిజిస్టర్లో మా అమ్మ పేరుంది. (దానివల్లనే మా అమ్మ ఎడ్రస్ పట్టుకోగలిగేడు కామ్రేడ్ గావ్.) ఆవిడ ఆ రిజిస్టర్లో ఉన్న 288 మంది షు గూయింగుల్లో ఒకతి. ఇప్పుడు గనుక చూస్తే ఆవిడ పేరు పక్కన ‘మరణించింది’ అని ఒక ముద్ర వేసుంటుంది. ఎప్పటికైనా ఆ రిజిస్టర్ని చూడాలని ఉంది నాకు. అది దొరికితే నేను వాంగ్ బావ్ అనే పేరున్న పేజీకి వెళ్ళి చూస్తాను. 27 ఏళ్ళ క్రితం, జనాభా 60 కోట్లు; షాంగ్‌హాయ్ లోనే 288 మంది షు గూయింగులుండేవారు. ఇప్పుడు జనాభా 100 కోట్లు దాటింది. ఎంతమంది వాంగ్ బావ్ లుంటారో షాంగ్‌హాయ్‌లో? 400? 500? 600? వాళ్ళల్లో ఐదోవంతన్నా ఆడవాళ్ళుండొచ్చు.

అల్లాంటి రిజిస్టరు ఇంకొకరి దగ్గిర కూడా ఉంటుంది. అతడు యమధర్మరాజు. చిన్నప్పుడు నేను నిద్రపోకపోతే మా అమ్మ నన్ను భయపెట్టి నిద్రపుచ్చాలని చూసేది. “యముడి దగ్గిర ఇద్దరు పనివాళ్ళుంటారు. ఒకడికి ఎద్దు తలకాయ ఉంటుంది. రెండోవాడికి గుర్రపు తలుంటుంది. రాత్రిపూట వాళ్ళిద్దరూ యముడికి ఆ చావు పుటకల చిట్టా చూపెడతారు. యముడు ఎవరి పేరుమీద ఎర్ర గీత గీస్తే వాళ్ళని తర్వాత రోజు వీళ్ళిద్దరూ యమలోకానికి తీసుకెళ్తారు. విన్నావా?” మెత్తగా అనేది అమ్మ. “చప్పుడు చెయ్యకు. చప్పుడు చేస్తే యముడు నిన్ను తీసుకురమ్మని ఆ ఎద్దు తలవాణ్ణీ, గుర్రపు తలవాణ్ణీ పంపుతాడు. అప్పుడు నువ్వు మీ అమ్మని చూళ్ళేవు.”

యముడి దగ్గిరుండే ఆ పుస్తకంలో మా అమ్మ పేరప్పుడే ఎర్ర ఇంకుతో కొట్టేసుంటుంది. నా పేరు మాత్రం ఇంకా ఉంటుంది. రేపో మాపో యముడు నా పేరు మీద కూడా తన పెన్ను పెడతాడు. ‘ఈ వాంగ్ బావ్ ఇంకా బ్రతికున్నాడేంటి? వీడు 27 ఏళ్ళ క్రితమే ఆకలికి చచ్చిపోయుండాలి కదా? అప్పుడు తప్పించుకున్నాడు కాబట్టి ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకనిస్తాన్లే వీణ్ణి!’ అంటాడు యముడు. అలా అని పేజీ తిప్పుతాడు.

యముడికి వాంగ్ బావ్ అంటే ఒక పేరు. అంతే!

8

నేను 1961లో ఆకలితో దాదాపూ చచ్చినంతపనయ్యిందనడం నిజమే. ఐతే, అసలు ప్రమాదం అంతకు మూడు సంవత్సరాల ముందు ఎదురయ్యింది.

అది నేను తెల్ల గుర్రపు సరస్సుకు వెళ్ళిన సంవత్సరం. ఆ రోజుల్లో కార్మికులకి ఉచిత భోజన పథకాలు ముమ్మరంగా నడుస్తుండేది. అందరు కార్మికులకులానే, మాక్కూడా మా ఫార్మ్‌లో కావల్సినంత తిండి దొరికేది. ఇతరత్రా తిండేమీ దొరికేది కాదేమో మేమ్మరీ విరగబడి తినేవాళ్ళం. ప్రతీ భోజనంలో, కనీసం ఓ కిలో అన్నం లాగించేవాణ్ణి నేను. నా తిండిబోత్తనం అలా అలవాటయిందే. అయితే ఫార్మ్‌లో మిగతా వాళ్ళతో పోలిస్తే నేనొట్టి ఎలకపిల్లనని చెప్పుకోవచ్చు.

ఆ కొద్ది నెలలూ మా ఫార్మ్ జీవితంలో గొప్పగా చెప్పుకోవచ్చు. బాగా తినేవాళ్ళం; కష్టపడి పనిచేసేవాళ్ళం. అయితే ఎంత కష్టపడినా అలసటనేది ఉండేది కాదు. చుట్టూ ఉన్న కొండలమీది చెట్లన్నీ నరికేశాం. తర్వాత ఆ కొండల్ని తవ్వి ఆ మట్టితో ఆర్నెల్లలో సరస్సు మొత్తాన్ని నింపిపారేశాం.

మా టీములో అందరికంటే నేనే ఎక్కువ పనిచేసేవాణ్ణి. ఒకరోజు కమిసార్ నా దగ్గిరకి వచ్చాడు. ఆయన చేతిలో మా అందరి పనితీరు వివరాలు పట్టీవేసి ఉన్నాయి. “వాంగ్ బావ్! నువ్వు చాలా బాగా పనిచేశావ్. ఈ రోజునుంచీ నువ్వే మీ ప్రొడక్షన్ టీముకి లీడరువి.” అన్నాడు. నేను ఫాక్టరీలో టీము లీడర్ని. ఫార్మ్‌లోనూ టీము లీడర్నే. నేను పన్నెండేళ్ళ తర్వాత ఫాక్టరీకి తిరిగి వెళ్తే, మా డైరెక్టర్ నన్ను మళ్ళీ టీము లీడర్ని చేశాడు.

ఆ ఏడాది చివర్లో, మేం కావాల్సినంత తినగలిగే రోజులైపోయినయ్యని చెప్పారు మాకు. కొలిచి భోజనం పెట్టడం మొదలౌతుందన్నారు. ఉచిత భోజన పథకం ఆఖరి రోజున, మా ఫార్మ్ అధికార్లు స్వయంగా వాళ్ళే మాకు వడ్డించేరు. మేమెంత తినగలమో లెక్క చూసి దాని ప్రకారం మాకివ్వబోయే తిండికి కొలతలు తయారుచేద్దామని వాళ్ళ ఉద్దేశ్యం.

దాని గురించి మేమంతా మధ్యాహ్నం పొలంలో పనిచేసేటప్పుడు మాట్లాడుకున్నాం. ప్రతీ ఒక్కరూ శక్తివంచనలేకుండా తినాలని నిర్ణయం జరిగింది. మా టీము వంతొచ్చేసరికి అధికార్లకి కళ్ళు తిరిగినయ్యి. మా పదిమందిలో ప్రతి ఒక్కరి చేతిలో ఒక బేసిను. ఏడు బేసిన్లలో అన్నమూ, మూడిటిలో కూరగాయల సూపూ తెచ్చుకున్నాం.

కమిసార్ చేతిలోని చెక్క గరిటని నావంక చూపుతూ, “వాంగ్ బావ్! నీ నోరు చిన్నదీ, కళ్ళు పెద్దవీనూ!” అన్నాడు.

“కొంచెమాగితే మీకే తెలుస్తుంది కమిసార్!” అన్నాన్నేను. “నేను ఒక్క మెతుకు వదిలేసినా మీరు నా శిక్షని మూడేళ్ళు పెంచండి.”

అప్పుడు సాయంత్రం ఆరు గంటలు. కమిసార్ ఏడుగంటలప్పుడు తిరిగివచ్చేసరికి మొత్తం పది బేసిన్లూ ఖాళీ. నోట మాట రాలేదు తనకి. విస్మయంతో తల అడ్డంగా ఊపి వెళిపోయాడతను. తర్వాతిరోజుదయం అటెండెన్సప్పుడు మాత్రం “మన టీమ్‌లో అందరూ తిండికి తిమ్మరాజులూ, పనికి పోతురాజులూ అని నాకు బాగా అర్థమయ్యింది.” అన్నాడు.

నిజానికి నేనా బిరుదుకి అర్హుణ్ణి కాదు. ఎంత కష్టపడ్డా సగం బేసిన్ మాత్రమే తినగలిగేను నేను. పొట్టోడు ఒక్కడూ రెండు బేసిన్లు లాగించేడు. వాడు సూపు తాగడం చూస్తే భయమేసింది నాకు. వాడు బేసిన్ని ఒక్క చేత్తో ఎత్తిపట్టుకుంటే అది వాడి చేతిలో చిన్న చిప్పలాగా కనబడింది. పెదాల్ని బేసిన్ అంచుకతికించి చేత్తో బేసిన్నొకసారి వంచాడో లేదో, బేసిన్ సగం ఖాళీ అయ్యింది.

ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కడుపులో చెడ్డ వికారం. ఎటు తిరిగి పడుకున్నా సుఖం లేదు. కొంతసేపటికి, కడుపులో విపరీతమైన నెప్పి ప్రారంభమయ్యింది, ఏదో జంతువు బైటకు తన్నుకొస్తున్నట్టు. మంచం దిగుదామని ప్రయత్నించా. సాధ్యం కాలేదు. బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టా.

పొట్టోడు వచ్చి నన్ను మంచం దించేడు. ఒకచేత్తో నా ఎడమ చెయ్యి పట్టుకుని రెండో చెయ్యి నా కుడి చంకలో వేసి పట్టుకున్నాడు. ఇలా పట్టుకుని నన్ను హాస్టల్ బయట అటూ ఇటూ నడిపించేడు పొట్టోడు. వాడివి పొడుక్కాళ్ళు. వాడు వేసే ఒక్కొక్క అడుక్కీ నేను రెండు అడుగులు వెయ్యాల్సొచ్చింది. వాణ్ణి నెమ్మదిగా నడవమని అడిగేను. పట్టించుకోలేదు వాడు. నేను దాదాపు నా మోకాళ్ళమీదకి వాలిపోతూ అపస్మారక స్థితిలోకి వెళిపోయాను. పొద్దున్న కోడికూత సమయానికిగానీ నాకు తెరిపి దొరకలేదు.

ఉదయాన్నే మా ఫార్మ్ హాస్పిటల్‌కి వెళ్ళాన్నేను. రాత్రంతా నడిచి చాలా మంచి పనిచేశానన్నాడు డాక్టర్. మంచంలో పడుకునే ఉండుంటే ఖచ్చితంగా మరణించుండేవాణ్ణట.


అలా పొట్టోడు నా ప్రాణాలు కాపాడేడు. అయితే, వాడు నన్ను నడిపిస్తూ పదే పదే నేను అదృష్టవంతుణ్ణన్నాడు. జ్ఞాపకమున్నంతవరకూ వాడికెప్పుడూ కడుపు నిండిన అనుభవం లేదట.

చిన్నప్పట్నించీ వాడు విపరీతమైన పొడవు. తొమ్మిదేళ్ళకే వాళ్ళ నాన్నని మించిపోయాడట వాడు. ఇద్దరు మనుషులకి సరిపడా తినేవాడట. వాళ్ళ నాన్న వాడికి పొట్టోడు అని ముద్దు పేరు పెట్టాడు, వాడి పెరుగుదలని ఆపాలనేమో! వాడంత పొడవౌతాడని ఆయన ఊహించి ఉండడు.

పద్నాలుగేళ్ళకి వాడు 150 కిలోల బరువెత్తగలిగేవాడట. మొత్తం కుటుంబానికి వండింది కూడా వాడికి చాలేది కాదు. వాడి తల్లిదండ్రులకి బెదురుపుట్టి వాణ్ణి బయటకుపోయి ఏదన్నా పని చూసుకోమన్నారు. వాడలానే నానా పనులూ చేసేవాడు. డబ్బులడిగేవాడు కాదు. తిండిపెడితే చాలనేవాడు. కొంతమంది వాణ్ణి ఆనందంగా కూలికి పిలిచేవాళ్ళు. ఎందుకంటే పని దగ్గరకొచ్చేసరికి వాడు ముగ్గురు మనుషుల పని చేసేవాడు. రైతులకి ఎక్కువ పని ఉన్న రోజుల్లో వాడు వాళ్ళ నాన్న పొలంలో పనిచేసేవాడు. ఐతే పని తగ్గిపోగానే వాణ్ణి పంపేయాల్సివచ్చేది వాడి తల్లిదండ్రులకి.

వాడొకసారి వాళ్ళ రాష్ట్రపు బాస్కెట్‌బాల్ టీములో ఆడ్డానికి దాదాపుగా ఎంచుకోబడ్డాడు. అది వాడి జీవితంలో చెప్పుకోదగ్గ ఘట్టం. అదెలా జరిగిందంటే, వాడొకరోజు హెఫేలో[5]hefei is the capital of anhui province. పనికోసం వెతుకుతుంటే, ఎవరో వాణ్ణి ఆపేరట. “అందులో వింతేమీ లేదు. నేను రోడ్డుమీద పోతూంటే చాలామంది పనిలేనివాళ్ళు నన్ను ఏ ఐదుకాళ్ళ జంతువులానో చూడ్డం నాకు అలవాటే. అలాంటి వాళ్ళని పట్టించుకునే టైముండేది కాదు.” అన్నాడు పొట్టోడు.

ఐతే ఈసారి సంగతి వేరు. వాణ్ణి ఆపినవాడు రాష్ట్ర బాస్కెట్‌బాల్ టీము కోచ్.

కోచ్ పొట్టోణ్ణి ట్రెయినింగుకి తీసుకువెళ్ళాడు. పొట్టోడక్కడ మూడ్రోజులు గడిపేడట. ఆ మూడ్రోజులూ కోచ్ వాణ్ణి రోజంతా తెగ కష్టపెట్టాడట- పరిగెత్తమనీ, ఎగిరిదూకమనీ, బంతిని బాస్కెట్లోకి విసరమనీ. ఒక మూణ్ణెల్లు వరసగా పొలంపని చేసినప్పుడు కూడా తనకంత అలుపు రాలేదన్నాడు పొట్టోడు.

మూడురోజులైంతర్వాత కోచ్ వాణ్ణి పంపేశాడట. కోచ్ అనడం పొట్టోడు బొత్తిగా మబ్బు మనిషని- వేగంగా కదలడు; బంతిని గురిగా విసరలేడు; పైకెగరమంటే నేలమీంచి అరంగుళం మాత్రమే కదుల్తాడు.

“దారుణం!” అన్నాడు పొట్టోడు. “పైకెగరమంటే ఎలా ఎగురుతాను? నాకు ఏ రకమైన తిండి పెట్టాడో ఆలోచించాడా ఆ కోచ్? ప్రతీ పూటా, రెండు ఉగ్గు గిన్నెల్లాంటి గిన్నెల్తో తిండి పెట్టేవాడు. నేనేమన్నా మిడతననుకున్నాడేమో, ఆ తిండి తిని ఎత్తెగరడానికి!”

“కనీసం ఈ రాత్రన్నా కడుపు నిండా తినుంటావులే.” అన్నాన్నేను.

“ఫర్వాలే!” అన్నాడు పొట్టోడు. “పొట్ట దాదాపూ సగం నిండింది.”

మాకు రేషను సంవత్సరానికి తలా ముప్ఫై కిలోలివ్వాలని ఫార్మ్ అధికార్లు నిర్ణయించేరు. ఆ తర్వాత సంవత్సరం అది పాతిక్కిలోలయ్యింది. ఎండాకాలం తర్వాత అది 22 కిలోలయ్యింది. ఆ తర్వాత అది ఇరవయ్యొక్క కిలోలూ, పంతొమ్మిదీ, పదహారూ అయ్యి పన్నెండు దగ్గిరకొచ్చింది. కరువు ఆఖరి సంవత్సరం–పంతొమ్మిది వందల అరవయ్యొకటి–వసంతకాలం నాటికి అది పది కిలోలయ్యింది. అంటే రోజుకు ఒక శేరుకంటే కొంచెం ఎక్కువ గింజలన్నమాట. చెప్పాలంటే, మూడ్రోజులకిచ్చే గింజలు ఒక్క భోజనానిక్కూడా సరిపోయేవి కాదు నాకైతే. పైపెచ్చు వంటవాళ్ళ తిండి కూడా మా గింజల్లోంచే రావాలి.

ప్రతీ ఒక్కరికీ మొహం చిన్నదీ, కళ్ళు పెద్దవీ అయినై. రోజంతా ఎక్కడైనా తిండానికేమైనా దొరుకుతుందేమోనని వెతికేవాళ్ళం గానీ ప్రయోజనముండేది కాదు. పొలాల్లో ఉన్న జీవాలన్నిటినీ అప్పటికే జనాలు తినేశారు. తినడానికి పనికొచ్చే పిచ్చిమొక్కల్ని కూడా వదిలిపెట్టలేదు. నల్లకొండ పల్లెకి వెళ్ళడం మానేశాం. అంత దూరమెళ్ళే ఓపిక ఎవరికీ ఉండేది కాదు. ఏమన్నా ఇచ్చి తిండి కొనుక్కుందామన్నా ఏమన్నా మిగిల్తేకదా! ఒకవేళ మా దగ్గిర పనికొచ్చే వస్తువులేమన్నా మిగిలున్నా నల్లకొండ పల్లె రైతులు అవి తీసుకుని తిండిపెట్టే రోజులు పోయినై. ప్రపంచంలో తిండికంటే విలువైన వస్తువుల్లేవని ఆఖరికి వాళ్ళకర్థమయ్యింది. అయితే జరగాల్సిన నష్టమప్పటికే జరిగిపోయింది. వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి కంటే ఘోరం. మాకు నెలకి 10 కిలోల గింజల రేషనన్నా ఉంది. వాళ్ళకదీ లేదు[6]As mentioned before, there are rations for people living in the rural areas..

ఆ రోజుల్లో ప్రతి ఒక్కరం నీరసంతో తూగుతూ నడిచేవాళ్ళం. పనిచేయడానికి ఓపికుండేది కాదెవరికీ. మా సూపర్‌వైజర్లకి తెలుసా సంగతి. ఐనా వాళ్ళు మమ్మల్ని ప్రతీ రోజూ పొలాల్లోకి తోలేవాళ్ళు. నిజానికి వాళ్ళలా చేయడం మా మేలు కోరే- శరీరాలకి ఎండ తగిలితే అంటువ్యాధులూ గట్రా రావని. మా కాలేజీ స్టూడెంటైతే ‘మనం మొక్కల్లా మారగలిగితే బాగుంటుంది. అప్పుడు మనం ఎండమీదా నీళ్ళ మీదా ఆధారపడి బ్రతికెయ్యొచ్చు.’ అనేవాడు. వాడు 1959 చివర్లో వచ్చాడు ఫార్మ్‌కు. అక్కడ మేం చూసిన మంచిరోజుల్ని వాడు చూళ్ళేదు. ఒక మనిషి సాయంతో ఒక రాత్రంతా చలిలో నడవాల్సిన అవసరం కూడా వాడికి అనుభవం కాలేదు.

ఒక రోజున మేమంతా పొలంలో నేలమీద పడుకోనున్నాం. ఎవరి వంటి మీదా చొక్కాలేదు. వంటికి ఎండ చూపెట్టుకుంటున్నాం. వాడొక్కడూ మట్టుకు చొక్కా తీయలేదు. వాడింకా సిగ్గు నటిస్తున్నాడన్నాడు పొడుగ్గోళ్ళు. వాడికి ఇరవయ్యేళ్ళ శిక్షపడి మా దగ్గిరకొచ్చినా మాముందు చొక్కా విప్పాలంటే భయం పోలేదన్నాడు. ఇక కాలేజీ స్టూడెంటుకి చొక్కా ఊడదియ్యక తప్పలేదు.

ఐతే వాడు చొక్కా తీయగానే ఓ గుంతలోంచి బురద తీసి కుడిదండకి పూసుకున్నాడు. ఎందుకంటే ఆ చేతిమీద ఒక రియాక్షనరీ నినాదమొకటి పచ్చపొడిచి ఉన్నది. దాన్ని దాయాలని వాడి బాధ. ఐతే వాడిచేతి మీద మట్టి చూసినవాళ్ళకు దానికిందున్న మాటలు గుర్తురాక మానదు.

‘కమ్యూనిజాన్ని ఎదిరించండి. దేశాన్ని కాపాడండి.’

వీర రియాక్షనరీ వాడు.

(సశేషం)

అధస్సూచికలు[+]