మహా నిశ్శబ్దం

ఈ మానవులు గ్రహాంతరజీవులను వెతకడం కోసం అరెసీబో టెలిస్కోపును తయారు చేసుకున్నారు. ఈ విశాల విశ్వంలో మేధోజీవులు ఇతర గ్రహాలపై ఎక్కడో ఉండేవుంటారన్న నమ్మకం, వారితో మాట్లాడాలన్న కోరిక, ఎంత బలమైనవి అంటే ఇలా ఖగోళం ఆ చివరినుంచి ఈ చివరిదాకా వినగలగడానికి ఇలా ఒక పెద్ద చెవి తయారు చేసుకున్నారు.

మరి నేనూ, నా తోటి చిలుకలూ ఇక్కడే ఉన్నాం కదా. మనుషులతో మాట్లాడగలిగే, వారితో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోగలిగే సామర్థ్యం ఉన్న మానవేతర జాతులం మేము. వారి అన్వేషణ కచ్చితంగా మాలాంటి వారికోసమే కదా! కాని, వాళ్ళు మేము చెప్పేది వినడానికి మాత్రం ఏమాత్రం ఆసక్తి ఎందుకు చూపరు?

ఈ విశ్వం ఎంతో పెద్దది. తప్పకుండా ఇందులో ఎన్నోచోట్ల మేధోజీవులు పుట్టే ఉండివుండాలి. పుట్టింది మనం ఒక్కళ్ళమే అనుకోవడం అసంబద్ధంగా తోస్తుంది. ఈ విశ్వం ఎంతో పాతది కాబట్టి ఆ జీవుల్లో ఏ ఒక్క జాతికయినా ఈ పాటికి పాలపుంత మొత్తం వ్యాపించేంత సమయమూ ఉండివుండాలి. కానీ విచిత్రంగా ఒక్క భూమ్మీద తప్ప మరే ఇతర గ్రహంలోనూ జీవం ఉందన్న ఉనికి కాని, కనీసం ఒక చిన్నపాటి సంకేతం కాని లేదు. ఈ మానవులకు ఇదొక అర్థం కాని చిక్కుముడి. అందుకే దీనిని ఫెర్మి పారడాక్స్ అని పిలుచుకుంటారు.

ఈ ఫెర్మి పారడాక్స్ ఛేదించడానికి శాస్త్రజ్ఞులు సూచించిన ఒక పరిష్కారం ఏంటంటే, మేధోజీవులు శత్రుదురాక్రమణలకు లక్ష్యం కాకుండా తమ ఉనికిని దాచుకోడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయట. మానవాళి చేసిన తప్పిదాల కారణంగా ఇప్పుడు అంతరించిపోవడానికి చేరువలో ఉన్న మా చిలుకలను చూశాక ఇలా ఉనికిని దాచుకోవడం చాలా మంచి వ్యూహమని నేను నిశ్చయంగా చెప్పగలను! తమ ఉనికిని కాపాడుకునే దిశగా ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా, నిశ్శబ్దంగా తమపని తాము చేసుకోవడం మేధోజీవులు అవలంబించవలసిన అత్యవసర మార్గంగా తోస్తోంది.

ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికి ఈ విశాల విశ్వం అంతానూ ప్రాణికోటితో, వివిధ గ్రహాలపై వివిధ జాతులకు చెందిన వైవిధ్యమైన కంఠధ్వనుల రొదలతో నిండిపోయుండాలి కదా! కానీ దీనికి విరుద్ధంగా ఎటు చూసినా కలవరపరిచేంత నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అందుకే కదా ఆ ఫెర్మి అన్న శాస్త్రవేత్త ‘బట్, వేర్ ఆర్ దే?’ అని అడిగాడు. అందుకేనేమో, ఈ సృష్టివైరుధ్యాన్ని మహా నిశ్శబ్దం అని పిలుచుకుంటారు ఈ మనుషులు.

మేధోజీవులు అంతరిక్షంలోకి వ్యాప్తి చెందేలోపే అంతరించిపోతాయని కొందరు శాస్త్రవేత్తల వాదన. ఈ వాదన నిజమనుకుంటే, నిశీధివేళ నిర్మలాకాశపు నిశ్చలత్వం నిజానికి ఒక శ్మశాన నిశ్శబ్దం మాత్రమే.

వందల సంవత్సరాల పూర్వం మా జాతి ఎంత సమృద్ధిగా ఉండేదో తెలుసా! ఇదిగో ఈ అరసీబో టెలిస్కోపుకు ఆనుకునే ఉన్న రియో అబాహో అడవులు మా చిలుకల మాటలతో మారుమోగిపోయేవి. ఇప్పుడు మేము సుమారుగా అంతరించిపోయే దశలో ఉన్నాం. అతి త్వరలోనే ఈ రెయిన్ ఫారెస్ట్ కూడా ఆ చీకటి ఆకాశంలాగా నిశ్శబ్దంగా అయిపోతుంది.

మాలో అలెక్స్ అనే ఒక ఆఫ్రికన్ గ్రే జాతి చిలుక ఉండేవాడు. భలే తెలివైనవాడని పేరు. మాలో కాదు, ఈ మనుషుల్లోలెండి. ఐరీన్ పెపర్‌బర్గ్ అనే ఒక సైంటిస్ట్ ముప్పై ఏళ్ళపాటు అలెక్స్‌ను అధ్యయనం చేసింది. అలెక్స్‌కు కేవలం ఆకారాలూ, రంగుల పేర్లూ తెలియడమే కాకుండా వాడికి వాటి తత్వాన్ని కూడా అర్ధం చేసుకోగల తెలివితేటలు ఉన్నాయని కనిపెట్టింది. చాలామంది శాస్త్రజ్ఞులు ఒక పక్షికి ఇలాంటి నైరూప్య భావనలు అర్థం అవుతాయని నమ్మరు. ఈ మానవులు తాము మిగతా జీవరాశులకంటే శ్రేష్ఠులమనీ, అసమానులమనీ భావిస్తుంటారు. కానీ చివరకు పెపర్‌బర్గ్ అలెక్స్ కేవలం పదాలను పునరుచ్చరించడం లేదని, తాను పలుకుతున్న మాటలకు అర్ధం కూడా తెలుసుననీ వారిని ఒప్పించింది.

మా బంధువులందరిలోనూ అలెక్స్ ఒక్కడే కొద్దో గొప్పో ఈ మనుషులకు కాస్త మేధోజీవిలాగా, వారితో సమాచారం ఇచ్చిపుచ్చుకోగలిగిన వాడిలాగా కనిపించాడు.

కాని అలెక్స్ అనుకోకుండా చిన్నవయసులోనే పోయాడు. తాను చనిపోవడానికి ముందురోజు సాయంత్రం అలెక్స్ పెపర్‌బర్గ్‌తో చెప్పాడట. “You be good. I’ll see you tomorrow. I love you.”

మానవేతర మేధ కోసం వెతుకుతూ వారితో మాట్లాడాలని ఇంతగా తపించిపోతున్న ఈ మనుషులకు ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి?

మీకు మేమందరం ఒకేలా కనిపించవచ్చు కాని, మాలో ఏ ఇద్దరమూ ఒకేలా ఉండం. మాలో ప్రతీ చిలుకకూ ఒక ప్రత్యేకమైన కూత ఉంటుంది. అదే దాని గుర్తింపు. మీ బయాలజిస్టులు దీన్నే కాంటాక్ట్ కాల్ అంటారు.

1974లో అరెసీబో టెలిస్కోప్ నుంచి శాస్త్రజ్ఞులు విశ్వంతరాలలోకి తమ గురించిన ఒక చిన్న సందేశం ప్రసారం చేశారు, దానిలో తమను, ‘మేము ఈ రకమైన మేధోజీవులం’ అని పరిచయం చేసుకుంటూ. అది మానవాళి కాంటాక్ట్ కాల్.

అరణ్యంలో చిలుకలం కూడా మీలాగే ఒకర్నొకరం పేరు పెట్టి పిలుచుకుంటాం. మరొక చిలుక దృష్టిని ఆకర్షించడానికి మేము దాని కాంటాక్ట్ కాల్‌ను అనుకరిస్తాం. అలాగే, ఎప్పుడైనా మానవులు విశ్వంలోకి ప్రసారం చేసిన అరెసీబో సందేశం భూమికి తిరిగి వస్తే, గ్రహాంతరవాసులెవరో మానవుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని గమనించాలి.

మేము విని నేర్చుకుంటాం. కొత్త శబ్దాలు వింటే వాటిని మళ్ళీ ఉచ్చరించగలం. ఆ సామర్థ్యం చాలా కొద్ది జంతువులకు మాత్రమే ఉంది. మీ కుక్క మీ ఆజ్ఞలను అన్నిటినీ అర్ధం చేసుకోగలదు, కానీ అది కేవలం మొరగడం తప్ప ఇంక వేరేదీ చెయ్యలేదు. మానవులు కూడా విని నేర్చుకోగలరు. చిలుకలకు మానవులకు ఉన్న ఒక సామాన్య లక్షణం ఇది, ఇలా శబ్దంతో ఒక ప్రత్యేకమైన సంబంధం ఉండడం. మనుషుల మాటల్లాగే మా కూతలు కూడానూ, మేము ఊరికే కూయం. ప్రతీ పదం స్పష్టంగా ఉచ్చరిస్తాం.

బహుశా అందువల్లేనేమో మానవులు అరెసీబోని అలా తయారుచేశారు. టెలిస్కోప్ అనేది ఒక రిసీవర్. అది ప్రసారం కూడా చేయాలన్న నియమం లేదు. కానీ అరెసీబో ఈ మానవులకు మాట్లాడే నోరు మాత్రమే కాదు. వినే చెవి కూడా.

ఇన్ని వేల సంవత్సరాలు ఈ మానవులు మాతో కలిసే బతికారు కాని ఇప్పుడిప్పుడే మేము కూడా మేధోజీవులం అన్న విషయం వారికి మెల్లిగా తెలిసివస్తున్నట్టుంది. కాని, వారిని నిందించలేను. నిజం చెప్పాలంటే మేము చిలుకలం కూడా చాలా కాలం మానవులు ఏమంత తెలివైనవారు కాదనే అనుకునేవాళ్ళం. మనకు విరుద్ధమైన స్వభావాన్ని అర్ధం చేసుకోవడం కష్టం కదా!

ఏదేమైనా మానవులకూ, చిలుకలకూ మధ్య ఉన్నన్ని సారూప్యతలు వారికీ వారు వెతుకుతున్న మరే గ్రహాంతరవాసులకీ మధ్యా ఉండవు, ఉండబోవని కచ్చితంగా చెప్పగలను. మానవులు మమ్మల్ని అతి దగ్గరనుండి గమనించగలరు. మా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలరు. మాతో మాట్లాడగలరు. అవేమీ చేయరు. కానీ వీళ్ళు గ్రహాంతర మేధస్సును గుర్తు పట్టగలమని అనుకుంటారు! ఎలా? వీళ్ళు చేస్తున్నదల్లా కాంతి సంవత్సరాల దూరం నుండి చెవి ఒగ్గి వినడమే కదా.

ఇంగ్లీష్ భాషలో ఆస్పిరేషన్ అనే పదం ఉంది. దానికి రెండర్థాలున్నాయి, ఒకటి కోరిక, రెండవది శ్వాసక్రియ. ఇది కాకతాళీయం కాదని నాకనిపిస్తుంది. మనం మన ఊపిరితిత్తుల శ్వాసను వాడేకదా మన ఆలోచనలను మాటలుగా మార్చేది. ఆ మాటలే కదా మన కోరికను తెలిపేవి, మన ప్రాణశక్తిని చాటేవి. అందుకే నేను అంటున్నాను, I speak, therefore I am. ఇందులో నిజం విని నేర్చుకునే జాతులైన మానవులకూ, చిలుకలకూ తెలిసినంతగా మరే ఇతర జాతికీ తెలిసే అవకాశం లేదు.

పెదవులను కదుపుతూ, ఊపిరితో శబ్దాన్ని పుట్టిస్తూ వాటిని పదాలుగా మార్చడంలో ఒక గొప్ప ఆనందం ఉంది. అనాదిగా మానవులలో ఇది ఒక ముఖ్యమైన, ఆంతరంగికమైన భావనగా ఏర్పడిపోయింది. అందుకే వారు శబ్దాన్ని ఐహికానికి, దైవానికి దారి చూపేదిగా భావిస్తారు. పైథాగరియన్ యోగులు అచ్చు శబ్దాలను గ్రహాలకు ప్రాతినిధ్యం వహించేవి అని నమ్మి, ఆ శక్తిని సంగ్రహించడానికి వాటిని జపించేవారట. పెంటెకోస్టల్ క్రిస్టియన్లు తమ ప్రార్థనలో వాడే భాషను దేవతలు మాట్లాడే భాషగా పరిగణిస్తారు. హిందూ బ్రాహ్మణులు మంత్రపఠనం ద్వారా వాస్తవికత పునాదులను పటిష్ఠం చేస్తున్నామని నమ్ముతారు.

వీటన్నిటినీ బట్టి, శబ్దాన్ని అభ్యసించే ప్రత్యేకమైన జాతులు మాత్రమే వారి పురాణాల్లో శబ్దానికి అంత ప్రాముఖ్యతను ఆపాదిస్తాయి. ఇది చాలా అభినందనీయమైన విషయమని మా చిలుకల భావన.

హిందూ పురాణాల ప్రకారం, ఈ విశ్వం అంతా ఓంకారనాదం చేత సృష్టించబడింది: ఈ ఓమ్‌ అనే శబ్దం భూతభవిష్యద్వర్తమానాలన్నిటినీ తనలో నిబిడీకృతం చేసుకుని ఉంటుందని హిందువుల నమ్మకం.

అరెసీబో టెలీస్కోప్‌ను అంతరిక్షపు లోతుల్లోకి, నక్షత్రాల నడుమకు గురి చేసినప్పుడు, అది ఒక సన్నని రొదను వినిపిస్తుంది. ఖగోళ శాస్త్రజ్ఞులు దీనినే ‘కాస్మిక్ మైక్రోవేవ్ బాక్‌గ్రౌండ్’ అని అంటారు. ఇది పద్నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం ఒక గొప్ప పేలుడుతో విశ్వాన్ని సృష్టించిన బిగ్‌బాంగ్ యొక్క రేడియోధార్మిక అవశేషం.

ఇది మైక్రోవేవ్ బాక్‌గ్రౌండ్ కాదు, ఇది అస్పష్టంగా వినిపిస్తున్న ఓంకారనాదం అని కూడా మీరు అనుకోవచ్చు. ఆ శబ్దం ఎంత గొప్పదంటే ఈ విశ్వం ఉన్నంత కాలం రాత్రిళ్ళు ఆకాశం ఆ ఓమ్ శబ్దాన్ని ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది ఎన్నటికీ. అరెసీబో మరింకేమీ విననప్పుడు, సృష్టి యొక్క ఈ ప్రతిధ్వనిని మాత్రం వింటూవుంటుంది.

అన్నట్టు పురాణాలూ, ఇతిహాసాలూ మీకే కాదు, మా ప్యూర్టోరికన్ చిలుకలకు కూడా సొంత పురాణాలున్నాయి. ఎటొచ్చీ మీ కథలకంటే మావి కాస్త సరళమైనవి, కానీ మానవులకు అవి కూడా ఆహ్లాదాన్ని పంచుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. కానీ అయ్యో, మా పురాణాలు కూడా మా జాతితో బాటే అతి త్వరలో అంతరించిపోనున్నాయి. అవి పూర్తిగా క్షయమైపోయేలోపు మానవులు మా భాషని అర్ధం చేసుకోగలరో లేదోనని నాకు అనుమానంగానే ఉంది. ఇక్కడ మా జాతి అంతరించిపోవడమంటే కేవలం ఒక రకమైన పక్షులు మాత్రమే పోయాయని కాదు. మా భాష, మా ఆచారాలు, మా సంప్రదాయాలు, అన్నీ కూడా అంతరించిపోవడం ఇది. మా గొంతులు నొక్కివేయడం ఇది.

మానవ సమాజం మా జాతిని వినాశనపు అంచుల వరకూ తీసుకొచ్చింది, కానీ ఈ కారణంగా నేను వారిని నిందించలేను. వారు ఇదంతా మా మీద ద్వేషభావంతోనో, కక్షతోనో కావాలని చెయ్యలేదు. వారికి వారు చేస్తున్న వినాశనం పట్ల గమనింపు లేదు. వారి కోరికలు, ఆకాంక్షలు, వాటిని సాధించుకొనే పద్ధతులూ తీవ్రమైనవి. అద్భుతమైన పురాణగాథలకు రూపకల్పన చేసిన మానవజాతి సృజనాత్మకత అపూర్వమైనదీ, సాటిలేనిదీను. బహుశా అందువల్లే వారి ఆకాంక్షలకు తీవ్రత ఎక్కువ. అరెసీబోనే చూడండి. అటువంటి ఒక అత్యద్భుతమైన, అతివినూత్నమైన పరికరాన్ని తయారుచెయ్యగలిగిన సామర్ధ్యం కలిగివున్న జాతి తప్పకుండా ఒక గొప్ప జాతి అయివుంటుంది.

మేమిక ఎక్కువ కాలం మనలేకపోవచ్చు; బహుశా, పరిణామక్రమంలో సహజంగా అంతరించే సమయంకన్నా ముందే మేమందరం మరణించి మహా నిశ్శబ్దంలో కలిసిపోవచ్చు. కానీ, మేము ఈ భూమ్మీద నుండి శాశ్వతంగా అదృశ్యమైపోయేలోపు మానవాళికి మా అందరి తరఫునా ఒక సందేశం పంపుతున్నాం. అరెసీబో టెలీస్కోప్ మా సందేశాన్ని మానవులు వినడానికి తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. మా సందేశం ఇది:

You be good. I love you.

(మూలం: The great silence)