అనితర సాధారణమైన కావ్యకళను త్యాగయ్య
అబ్బురముగా అబ్బించుకున్నాఁడు.
త్యాగయ్యగారి సాహిత్యము ఆయన సంగీతమువలె విశాలము, వివిధము, ఉన్నతము, అపూర్వమునైన కళ. సరస్వతితల్లి యిరు ప్రక్కల చనుబాలను ఇంత సమానముగా కడుపు నిండ త్రాగి పెరిగిన బిడ్డఁడు తెలుగువారిలోనే కాదు… నేనెఱింగినంతవఱకు ఎక్కడను ఇంకొక్కఁడులేఁడు. ఇతని సమకాలికులై కర్ణాటక సంగీత రక్షామణులనఁదగిన ముత్తుస్వామిదీక్షితులు, శ్యామాశాస్త్రులు, కులశేఖరమహారాజు– వీరిలోనే యెవరికిని కావ్యకళ ఇంత చక్కనిది, ఇంత తేజోవంతమైనది అబ్బలేదు. దీక్షితుల భాష మంత్ర తంత్ర పరిభాషలతో, సంగీతపు నాలుకకు సామాన్యముగా మెదగని సమాసములతో, శబ్దములతో ముక్తాయమయినది. శ్యామాశాస్త్రుల భావ ప్రవాహము కామాక్షమ్మను తలుచుకొని ‘అమ్మా! ననుఁ బ్రోవవే’ యని వాయి విడిచి వేఁడుటతో పరవశమై స్తంభించుచున్నది. కులశేఖరుల సంస్కృత రచన ముద్దుల మూటయైనను వట్టి మూర్తివర్ణనముతో మొదలై ‘మాం పాహి’తో ముగియునేకాని తీవ్రభావముల లోఁతుకు దిగలేదు. ఇట్లగుటకు కారణము పై ముగ్గురిది హృదయమందు వేదనగాని, ఆందోళనగాని లేని యుపాసన. ముగ్గురును పరమభక్తులే, కావ్యానేశము కలవారే కాని తాము భజించు దేవత తమ్ము తప్పక కాపాడి మోక్షమిచ్చునను గట్టి నమ్మికతో సంప్రదాయము ప్రకారము ఉపాసన చేసినవారు కనుక వారికి ముక్తి లభించి యుండవచ్చునుగాని మనకు వారివలన కావ్యకళ లభించలేదు.
శాస్త్ర చోదితములైన నిత్య నైమిత్తిక కర్మములు ‘కల్లలని’
వానిని వదలివేసిన పరమభాగవతోత్తముఁడు.
త్యాగయ్య భక్తి జీవితమట్టిది కాదు. చిన్నతనమున నుండియు నానాదేవతోపాసనకు వాడుకపడియున్నను, వేదశాస్త్ర పురాణములందు విధింపఁబడిన నిత్య నైమిత్తిక కర్మములు చేయు సంప్రదాయమునకు లోఁగియున్నను, అవన్నియు ‘కల్ల’లని వదలి శ్రీరామమూర్తిని ‘వాఁడేరా దైవ’మని నమ్మి ‘నీవేరా కులధనము సంతతము నీవేరా జీవనము’ అని శరణుచొచ్చినవాఁడు. అతని ఆశ అపారమైనది. నిరాశయగునేమో యను ఆందోళన అంతులేనిది. శ్రీరాముని ఈ జన్మమందే, ఈ తోలు కన్నులతోనే దర్శించి తీరవలయునని పట్టుపట్టినవాఁడు. అందుకని జపములు చేసి, ప్రార్థించి, పూజించి, నిందించి, తన్ను నిందించుకొని, వేసటపడి, విసుగుకొని, ఏడ్చి, తప్పాయెనని క్షమాపణ వేఁడుకొని, ఎన్నో తంటాలు పడినాఁడు. తన కోర్కి ఫలించకపోయినప్పుడు తనకీ మార్గముపదేశించిన ‘పెద్దల మాటలు నేఁడబద్ధమౌనో!’ యని భయపడినాఁడు. వైదిక మార్గ నిష్టులగు స్మార్త బ్రాహ్మణుల కులమందు పుట్టి ఆ సంఘమందే పెరిగియున్నను ‘వేద శాస్త్ర పురాణ విద్యలచే భేదవాదములు తీరక’ వారందఱును ‘భ్రమసేవా’రనియు, ‘యజ్ఞాదులు సుఖమనువారు’ ‘అజ్ఞాను’లనియు, ‘అసురచిత్తు’లనియు ఎదురు తిరిగి తిరస్కరించి తిట్టినవాఁడు. మనము కల్ల అనుకొన్నను, కలవరింపు అనుకొన్నను, భ్రాంతి అనుకొన్నను సరే, ఆతఁడు శ్రీరామచంద్రమూర్తిని పలుమారీ జన్మమందే తాను దర్శించినట్లు అనుభవించి, అతనితో సాక్షాత్తుగా ఆడి పాడి వేడి అనందలీనుఁడైనవాఁడు. ఇతరులు భుక్తి, ముక్తి రెండును గావలెనని కోరంగా, అతఁడు ‘రామా! నీ భక్తి నాకు భోగానుభవంబులందు బాగుగ బుద్ధినీయదు’ అని విరక్తికి పరవశుఁడైనవాఁడు కావుననే దొరలను, వారిచ్చు గౌరవములను మన్నింపక తిరస్కరించి తిరిగిన పరమ స్వతంత్రుఁడు కాఁబట్టి త్యాగయ్య భక్తి, వట్టి దృఢమైన మూగ నమ్మిక, జడశ్రద్ధ కాదు. నిమిషమైనను ఊరకుండనీయక దేహ మపస్సుల ప్రతి నాడిని కదలించి మీఁటి ఊఁగించి ఆడించునట్టి అమేయమైన విద్యుచ్ఛక్తి. అది ఆడించిన ఆటలలో మన పాలికి ముఖ్యమైనవి అతని పాటలు.
కాబట్టి త్యాగయ్య కృతులలో ఒక దానివలె మరొక్కటియుండదు. క్రొత్త భావమో, క్రొత్త నుడికారమో తప్పకయుండును. మనఃపూర్వకముగా తీవ్రముగా వెడలని భావమేదియు కానరాదు. మఱియు మనస్సులో పుట్టిన భావము కావ్య రూపముగా బైలుపడు వేగమునకు అడ్డుపడునదేదియు నుండదు.
గేయకల్పనలో అపూర్వశక్తి, అసాధారణ ప్రతిభలుగల ధీశాలి.
కాని ఒకటితప్ప నీదనుగా అతని గేయ రచన మాటలలో ఎంత ఎంత క్రొత్తదనము, వేగము, అందము కలదో అంతకన్న ఎక్కువగ వానిని పాటలందు చూపఁగల అపూర్వ గేయకల్పనాశక్తి ఆతనిది. ఒక శంకరాభరణ రాగమందు ముప్పది వర్ణ మెట్టుల నెత్తి, అన్నిటిని అన్ని ముఖములుగా ఆద్యంతము నిర్వహింపగల అసాధారణ ప్రతిభ ఆతని సొమ్ము. ఇతరులెత్తిన మెట్లకు తన మాటలను జోడించు దేబతనము నతఁడెప్పుడును చేసినట్లే కానరాదు కాబట్టి మనసులో మాట తోచిన వెంటనే దానినేదైన క్రొత్త నడక గల పాటగానే కూర్పవలయునను ఉత్సాహము అతనికి ఉగ్గుపాలతో వచ్చినది. ఇట్లయి మాట పాటకు లొంగి నిలుచును. ఎన్నియో పాటలలో అతని మాటలు స్వేచ్ఛా ప్రచారములు లేక మంత్రమునకు కట్టుపడిన నాగుఁబామువలె ఎగరోజుచు అణఁగియుండును.
అతఁడు పాటను నేర్చినంత శ్రద్ధతో మాటను నేర్వలేదు.
సంగీత భావము ముందఱ సాహిత్యభావము గౌణముగానే నడచును.
ఇట్లగుటకు కారణము త్యాగయ్యకుఁగల అపారమైన గానవిద్యా పాండిత్యమే. వాకుఁ జూడఁగా పాటను నేర్చినంత శ్రద్ధతో అతఁడు మాటను నేర్వలేదు. మాటయందతనిది ఇంచుమించు పోతన్నవంటి సహజ పాండిత్యము. పాటలో నట్లుగాదు. సుప్రసిద్ధులగు సొంటివారి యింటి శిష్యుఁడు, మీఁదు మిక్కిలి నారదమహర్షి యనుగ్రహమునకు పాత్రుఁడు. ‘రజత గిరీశుఁడు నగజకుఁ దెల్పు స్వరార్ణవ మర్మములు విజయముగల త్యాగరాజుకెరుకే’ అను గొప్ప ఆత్మ ప్రత్యయము గల క్రొవ్విన పండితుఁడు కనుకనే అతని సాహిత్యము మూఁడు పాళ్ళు సంగీతము నాశ్రయించి ఆకుమఱుఁగు పిందెవలెనున్నది. సంగీతభావము ముందఱ సాహిత్యభావము గౌణముగానే నడచును. ఉదాహరణముగా అతని పంచరత్నములలో ఒక రత్నమగు ‘సాధించెనే ఓ మనసా’ అను ఆరభి పాటను గ్రహింపవచ్చును. ‘శ్రీరాముఁడు తుట్టతుదకు తన్ను మోసగించెనే!’ అని ఇందులో త్యాగయ్య అంగలార్చుచున్నాడు. శ్రీరాముడు ‘సమయానికి తగు మాటలాడెనే; నేనిచ్చిన పూజలన్ని కైకొనెనే, అలుగవద్దనెనే, విముఖులతో చేరఁబోకనెనే, వెత కల్గిన తాళుకొమ్మనెనే, ఇట్లాడిన మాటలన్ని బొంకుచేసి తుదకు చెంత రాకనే తాఁబట్టిన పట్టు సాధించెనే!’యని– యింకెవరితో చెప్పుకొనఁగలడు?– తన మనస్సుతో త్యాగయ్య మొఱపెట్టుచున్న పాట యిది. ఈ భావముసు, భాషను అడఁచి పట్టుకొన్న రాగము ఆరభి. అది ఉత్పాహ ప్రధానమగు ఘన రాగము. స్వరముల వడక జంటలు జంటలుగా పందెపు గుఱ్ఱపు నడకవలె, నాభినాదముతో గంభీరముగా, ధైర్యముగా, నిర్లక్ష్యముగా జరుగవలసి యుండును. కాఁబటి విలంబ కాలముకంటె మధ్యమ ద్రుతకాలములు ఈ రాగ స్వరూపమున కెక్కున చేరిక గలవి. ఈ రాగమందీ పాటను పాడుచు పై నిరాశ భావమును, ధైన్యమును స్ఫురించునట్లు చేయుట నాకుఁ జూడఁగా అసాధ్యము. ఆరభి రాగమును లయమును బిగువు చెడును. కీర్తిశేషురాలగు వీణధనము దీనిని మార్దవ ప్రధానముగా పాడినప్పుడు విన్న వారి కిదే భావము కలిగినది.
సాహిత్యమును వెనుకకునెట్టి నూతనసృష్టి చేసిన త్యాగయ్య గాన ప్రతిభ.
త్యాగయ్యగారి గాన ప్రతిభ మరియొక నూతన సృష్టి చేసి సాహిత్యమును వెనుకకు త్రోసినది. పల్లవి విస్తరింపులను శిష్యులు చిన్ననాటి నుండి నేర్వవలయునను ఉద్దేశముతోఁ గాబోలును త్యాగయ్య తన పాటలకు వీలున్నచోటనెల్ల కొన్ని సంగతులనేర్పఱచి అవి తప్పక పాడవలయునని కట్టుపాటు చేసినాడు. ఈ పద్ధతి అదివఱకు లేనిది. ఆ సంగతులన్నియు రాగ తాళ భావములఁ జూపుట కెంతో అనుకూలముగానున్నను సాహిత్య భావములతో ఏకీభవించుట కష్టము. తన ప్రియదైవము శ్రీరాముని అపూర్వ మధురముగా
‘నా జీవనాధారా, నా నోము ఫలమా
రాజీవలోచనా, రాజ రాజ శిరోమణీ
నా చూపు ప్రకాశమా, నా నాసికాపరిమళమా
నాజపవర్ణ రూపమా, నాదు పూజాసుమమా త్యాగరాజనుతా’
అని మహా ప్రేమతో సంబోధించు కృతికి త్యాగయ్య బిలహరి రాగములో ఏర్పఱచిన మెట్టును సంగతులన్నియు వేసి సంప్రదాయముగా పాడఁబోయినప్పుడు అక్షరములన్నియు తనుకులాడి ఎక్కడనో ఆవిరియై అంతర్థానమగును! సంగీతమందున్నంత పాండిత్యము లేకున్నను ఇదే చిత్తవృత్తి, అతని కొన్ని సాహిత్య కల్పనలందును చూడవచ్చును. అష్ట ప్రాసములను నిర్వహించుచును అతఁడు రచించిన కొన్ని కీర్తనముల భాష భావశూన్యమై రాగలయములను గూడ త్రోసి నడచును. ‘తరాన దొరకని పరాకు నా యెడను రాము చేసితే సురాసురులు మెత్తు, రా యిపుడు ఈ హరామితన మేలరా భక్త త్యాగరాజనుత’ ఇత్యాదులుదాహరింప వచ్పును. సాహిత్య పాండిత్యము దుర్బలము కావుననే ఇట్టి చిత్ర రచనల కతఁడెక్కువగా చేయి వేయలేదు.
వట్టి పాండిత్యపు పొగరుతో అతఁడు తృప్తి పడలేదు.
అతనికి చాల లోతుకు దిగి చూచు ఆధ్యాత్మిక దృష్టి కలదు.
అనఁగా త్యాగయ్య కృతులన్నియు నిట్లున్నవని కాదు. ఆయన సృష్టిలో అటు జరుగుట అసాధ్యము. అతనిది చాల సుకుమారచిత్తము. నిర్మాణశక్తి మెఱపువలె మెఱయునట్టిది. భావములు తేజోమయములై అడఁచినను అడఁగనివి కాఁబట్టి అతఁడు వట్టి పాండిత్యపు పొగరుతో తృప్తి పడఁజాలఁడు, చాల లోతుకు దిగి చూచు ఆధ్యాత్మిక దృష్టిగలవాఁడు కావున పై దంభములతనికి చాలవు. మఱియు సంగీత సాహిత్యములు రెంటిని అనుభవించి ఆనందించు రక్తియు, నిర్మించు శక్తియు కలవాఁడు కావున, అతని రచనలలో కొన్నిటియందు ఒక దాని కొకటి అడఁగియున్నను, అనేక కృతులలో రెండును చేయి చేయి పట్టుకొని అపూర్వ సౌహార్దముతో ఏకాగ్రముగా రూపుగొన్న అద్భుత దృశ్యమును మనకు త్యాగయ్య ఎత్తి చూపఁగలిగినాఁడు. ‘పలుకు పలుకులకు తేనెలొలుకు’ కృతులు అతనివెన్నో కలవు. ఆ తేనెలు మాటలవో, పాటలవో చెప్పలేము. ఎందుకనగా అవి రెండును మేళగించి దింపిన రసాయనములు. ‘దొరకునా ఇటువంటి సేవ’, ‘పక్కల నిలుఒడి’, ‘నీ దయచే రామ’ మొదలగు ఎన్నో కృతుల ధాతు మాతు మాధుర్యమును, భావగంభీర్యమును ఎవరు వర్ణింపగలరు?
కాని మొత్తముమీద నాద విద్యామర్మములను గమనించినంత మెలకువతో శబ్దరచనా రహస్యములను గమనింపలేదు.
కాని మొత్తముమీఁద త్యాగయ్య ‘నాద విద్యా మర్మములను’ గమనించినంత మెలుకువతో శబ్ద రచనా రహస్యములను గమనింపలేదనుట మనము కనుఁగొనఁగలము. భావముల గొప్పతనమునకు సరిరాలేక ఎన్నో చోట్ల అతని భాష తంటాలుపడుచున్నది. వ్యావహారిక రూపములను ఉదాసీనముతో దూర్చినాఁడేకాని అందుఁగూడ క్షేత్రయ్యవలె సయము నాజూకును తలపెట్టలేదు. సంగీత సాహిత్యములు రెంటికిని సమాన గౌరవము గల రచన దైనశక్తితో రావలసినదేకాని దానికై ప్రయాసపడి ఫలము లేదని త్యాగయ్యకుఁగూడ అర్థమాయెనేమో! భావముతోఁచి మెట్టు స్ఫురించినప్పుడు దానికి తగిన భాష ధారాకారముగా రాదేని అది దాని తప్పే కాని నాది కాదను ఉదాసీనము అతని కుండెనని ఆనేక కృతులు చాటుచున్నవి. పాటలు రచించువారికందఱికిని ఇది తెగని చిక్కు. తెలుగు పద కవులలో ఈ చిక్కును కొన్ని చోట్లనైన తెంచుకొనఁగల్గిన మహానుభావుఁడు ఒక్క త్యాగరాజే!
ఇట్లు సాహిత్యమును అరగంటితో చూచు చిత్తవృత్తి త్యాగయ్యగారియందే బీజ రూపముగా నుండి, గురుభక్తికి పేరుపోయిన అతని శిష్య ప్రశిష్య పరంపరలో మొలచి పెరిఁగి పెద్దదైనది. ఆయన సంగీతమును పదిలపరిచుటకు భగీరథ ప్రయత్నము చేసినవారు, చేయుచున్నవారు ఎందఱో కలరు. కాని ఆ సాహిత్యము స్ఫురించునట్లు పాడఁగలవారుకాని, దానిని భాషా దృష్టితో కాపాడినవారుగాని అరుదు. ఒకటికన్న ఎక్కువ చరణములు గల అతని కృతి యేది పాడినను, ఎవరు పాడినను, రెండవ చరణమైనను తాఁకఁగోరు పుణ్యాత్ములు నేఁటి గాయకులలో అపురూపమైనారు. చాలమందికి వేఱు చరణములు కలవని కూడ తెలియదు. డెబ్బదియేండ్ల గొప్ప విద్వాంసుడొకఁడు, సంస్కృత సాహిత్యమును చక్కఁగా చదివినవాఁడు ‘సాధించెనే’ అను కీర్తనము ‘సమయానికి తగు మాటలాడెనే’ అను పాదముతోనే ముగిసినదని, మొన్న నేను చెప్పువఱకును భావించియుండెను! నిజముగా ఆ పాటలోని జీవమంతయు తరువాతి పంక్తులలోనేయున్నది. కాని ఆరభి రాగము నేర్పుటకై పడిన శ్రమయంతయు సార్థకపరచి, పల్లవి, ప్రస్తారముచేసి, స్వరరచనలతో పందిలిగట్టుటకు ‘సమయానికి’ అను ఆవర్తము మిక్కిలి తగియున్నది. ఆ పని చేయుటతో పాటకునికిని, వినువారికిని తృపియగును. ఇఁక తక్కిన సాహిత్య భాగ మెవరికిఁగావలయును? మఱియు పాడినంతలోనైనను శబ్దార్థములను గమనించు గాయకుఁడు దొరకుట నేఁటి మన గొప్ప భాగ్య ఫలము. ఇది ఒక త్యాగయ్య తెలుఁగు కీర్తనలకేకాక సామాన్యముగా అన్ని భాషల పాటలకును అంటిన చీడ. శ్రుతి తాళ లయములను చక్కఁగా నిర్వహించు ప్రయత్నములో నమలి మ్రింగవలసినది ఏ శబ్దమైననేమి, ఏ యర్థమైననేమి?
త్యాగయ్య తెలుగు సాహిత్యమునకు పట్టిన దురవస్థ.
సామాన్యముగ సంగీత విద్వాంసులు నేఁడు సాహిత్య పరిశ్రమగాని, సంస్కారముగాని లేనివారగుటచేత సంగీత విద్య ఇన్నాళ్ళవలెఁగాక ఇప్పుడు సాహిత్యపు సంకెళ్ళకు లోపడక స్వతంత్రముగా నిలుచుటకు ప్రయత్నించుచుండుటచేత, త్యాగయ్య తెలుఁగు దేశములో పుట్టి పెరుఁగకపోవుటచేత, అతని శిష్యులందఱును అఱవవారే యగుటచేత, తెలుఁగు దేశమునందు కర్ణాటక సంగీతమునకు వ్యాప్తి, రాను రాను క్షీణించుచుండుటచేత, ఉన్న కొందఱు తెలుఁగు గానవిద్వాంసులు తెలుఁగు పాటలు పాడినను అఱవవారి పద్ధతులే వారికి చాలావఱకు ఆదర్శముగా నుండుటచేత త్యాగయ్య తెలుఁగు సాహిత్యము ఈ యవస్థకు వచ్చినది.
ఇది అఱవవారి దూషణ కాదు. త్యాగయ్యపై నిజమైన భక్తి గల యెవరైనను అఱవదేశపు గాయకులను, రసికులను కృతజ్ఞతతో నమస్కరింపక తీరదు. నాఁటికినీ వేఁటికినీ త్యాగరాజ కీర్తనలు వారు పెట్టవలసిన బిచ్చమే. త్యాగయ్య, క్షేత్రయ్య మొదలగువారి రచనల ననుభవించుకొఱకు ఎందరో ద్రావిడులు తెలుఁగుభాష సలక్షణముగా నేర్చుకొన్నారు. వారి రచనలను వేదములవలె భక్తితో కాపాడినారు. అదేమాదిరిగా తెలుఁగులో ఎందరో కృతులు రచింపఁబ్రయత్నించినారు. వానిని అర్థతాత్పర్యములతో తెలుఁగులోను, అఱవములోను ప్రకటించినారు, ప్రటించుచున్నారు. కాని యెంత భక్తి శ్రద్ధలతో నేర్చినను తెలుఁగు వారికి స్వభాష కాదు కావున వారికి పొరఁబాట్లు తప్పవు. తక్కినవారి మాట అట్లుండ నిండు, మహా ప్రతిభగల పండితుఁడు కీర్తి శేషుఁడగు సి. ఆర్. శ్రీనివాసయ్యంగార్లవంటివాఁడే ప్రచురించిన త్యాగయ్య కీర్తనములందు, తెలుఁగు రచన యందలి జీవగఱ్ఱలవంటి యతి ప్రాసములను గమనింపక వర్ణ మెట్లలో పదవిన్యాసముచేసెను. సాహిత్యపు నడక స్పష్టముగా చతురశ్రగతిలో నుండఁగా ‘సిగ్గుమాలి నావలె ధరలో నెవరు తిరుగఁజాలరయ్య’ అను కీర్తనను మిశ్రచాపు తాళమునకమర్చి అవకతవకగా ప్రచురించిరి. ఇఁక కె. వి. శ్రీనివాసయ్యంగార్యులు తెలుఁగు వ్యాకరణ మందలి జడశ్రద్ధచే త్యాగయ్య రచనలను నానాముఖముగా తిద్దిపెట్టిన త్రిప్పటలకు తుది మొదలు లేదు. ఇది సహజము. తెలుఁగువారు అఱవ సాహిత్యమునకు చేయివేసినచో ఇంతకంటే మేలుగా పని చేయఁగలరని నమ్ముట కవకాశములేదు. మనము బుద్ధిమంతులమై ఊరకున్నాము గనుక బ్రతికినాము!
తెలుఁగు వారికి మిగిలిన కర్తవ్యము.
కాఁబట్టి ఇదివఱకును తమిళులు చేసిన ఉపకారమునకు వారికి కృతజ్ఞులై, ఇప్పటికైన తెలుఁగువారు తెలుఁగు దృష్టితో త్యాగయ్య సాహిత్యమును సమకూర్చి శోధించి పెట్టుకొని దేశములో వ్యాప్తికి తేవలసి యున్నారు. ఇప్పుడు స్వభాషాభిమానము అను పేరుతో పర భాషా తిరస్కారము చీడ పురుగువలె అన్ని దేశములందును వ్యాపించుచు భారతీయ విజ్ఞానమును తునకలు తునకలుగా చేయుచున్నది. తెలుఁగు కీర్తనలు పాడఁగూడదను భావము అఱవదేశములో అందందు తల చూపుతున్నది. అది ముదురుటకు ముందే ఆంధ్రులు మేలుకొనుట మేలు.
[1940 విక్రమ సంవత్సరాది ఆంధ్రపత్రిక నుండి పునర్ముద్రించబడినది – సం.]