కారణాలేమీ అక్కర్లేదు

ఎవ్వరైనా విడిపోవడానికి
పెద్దగా కారణాలేమీ అక్కర్లేదు
మర్రివిత్తనమంత అపార్థం
మస్తిష్కపు పొరల్లో మొలకెత్తితే చాలు
అది ఊడలు దిగి పాతుకుపోయి
మనిషికి మనిషికి మధ్య
ఎడతెగని దూరం పెరగటానికి-

ఒకరితో ఒకరు కలవక పోవటానికి
యుద్ధాలే జరగనక్కర్లేదు
మాటల మాయలేడి
సమూహంలో సంచరిస్తే చాలు
మదికి మదికి మధ్య నిర్మించుకున్న
అనురాగ వారధి
అమాంతం కూలిపోవడానికి-

మాటకు మాట అనుకోవలసిన అవసరం
అసలే లేదు
మంథర లాంటి మనిషి
మన మధ్య తిరుగాడితే చాలు
మనసుకు మనసుకు మధ్య
ఆరని చిచ్చు రేగి
బాంధవ్యాలు బూడిదపాలవడానికి-

ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-

విడిపోయినవారు కలవడానికి
పెద్దగా సందర్భాలేమీ అక్కర్లేదు
పాతజ్ఞాపకాల పరిమళ సుగంధాలు
ఆప్యాయంగా చల్లుకుంటే చాలు
అపార్థాల గోడలు కూలిపోయి
బలహీన పడిన బాంధవ్యాలు
పూర్వపు వైభవాన్ని సంతరించుకోడానికి.


తేళ్ళపురి సుధీర్ కుమార్

రచయిత తేళ్ళపురి సుధీర్ కుమార్ గురించి:

అనేక పురస్కారాలు అందుకున్న తేళ్ళపురి సుధీర్ కుమార్ గారు ప్రముఖ కవి, రచయిత, విశ్లేషకులు. సామాజిక అంశాలు, జీవన శైలి, సమకాలీన రాజకీయాలపై స్పందిస్తూ విభిన్న కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. ఆయన కవితలలో “త్యాగాల నిలయం” వంటివి పాఠకుల ప్రశంసలను అందుకున్నాయి. అక్షరాల ద్వారా తన భావాలను స్పష్టంగా, లోతుగా వ్యక్తపరిచే రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

 ...