కళా సృజన అడవినుండి రాజాస్థానాలకు తరలివెళ్ళిన నాటినుండీ దానికి వాణిజ్య విలువ ఏర్పడింది. రాజులు, జమీందారులూ పోయాక అది చాలా వరకూ పడిపోయింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య యుగంలో, మానిటరీ బెనిఫిట్ స్థానంలో జనాదరణ వచ్చి కూర్చుందని చెప్పవచ్చు. దానికి మూలసాధనం ప్రచారసాధనాలయ్యాయి. అవి టెక్నాలజీతో మరింత ఎక్కువై, ఇంటర్నెట్ వచ్చాక బ్లాగుల్లో ఇన్స్టంట్ ప్రతిస్పందన నుంచి, ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అత్యంత వేగంగా ఎక్కువమంది జనాలకి ప్రచారం కావడం వరకూ వచ్చింది. ఇదొక అద్భుత మాయా ప్రపంచం! అయితే, కళని వాణిజ్యంగా కాక, తమ జీవితాన్వేషణగా, ఒక ఆంతరంగిక తపస్సుగా చేసుకున్న కళాకారులూ కనిపిస్తారు. వాళ్ళకు శ్రోతలు కొట్టే చప్పట్లు కాని, పాఠకులు పెట్టే లైకులు కానీ పట్టవు. విలా కేథర్ కథలో, ఒక సాయంపొద్దును చూస్తూ మైమరచిపోయిన శిల్పి అలాంటి వాడు. బాలసుధాకర్ కవితలో, రాతి కాలాన్ని నిర్దయగా ఛీకొట్టే పాటగాడు అలాంటి వాడే. ఏదో పిలుపునందుకుని మోస్తున్నవన్నీ పక్కనపెట్టి ఒక ప్రయాణానికి బయలుదేరిన కవి, జీవితానందం ఇప్పుడు ఈ రోజు ఈ క్షణం మాత్రం వీలయినంత లేనితనంలో ఉందనిపిస్తుంది, అంటున్న కుంచె కవీ కూడా ఆ బాపతు వాళ్ళే! వీళ్ళలో కొంతమందికి అప్పుడప్పుడూ ప్రపంచం ముళ్ళకిరీటం పెడుతూ ఉంటుంది. ఎంతోమందికి పిచ్చివాళ్ళని బిరుదిచ్చి దూరంగా జరిగిపోతుంది–అది వాళ్ళ అదృష్టం, ప్రపంచం దురదృష్టం!
ఈ సంచికలో:
- కథలు: 1+1 – పూర్ణిమ తమ్మిరెడ్డి; పది నిముషాలు – విజయ్ కోగంటి; బేతాళ కథలు: కథన కుతూహలం 2 – టి. చంద్రశేఖర రెడ్డి; ఒక శిల్పి అంతిమ యాత్ర – నౌడూరి సూర్యనారాయణ మూర్తి; జీవితానందం ఎక్కడున్నది? – అన్వర్ (స్వగతం).
- కవితలు: ఒక ప్రయాణం – మూలా సుబ్రహ్మణ్యం; కాళీ పదములు – పాలపర్తి ఇంద్రాణి; కొత్తనేలపాట – మానస చామర్తి; కథలు చెప్పే అతను – బాలసుధాకర్ మౌళి; కథ – స్వాతి సాయి యాకసిరి; ఒక ఆషాఢపు రాత్రి – స్వప్నలిపి.
- వ్యాసాలు: నటనకు గీటురాయి – దాసరి అమరేంద్ర; సిలబస్: 4. బొమ్మ ఎందుకు? – అన్వర్; విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు – జెజ్జాల కృష్ణ మోహన రావు; నాకు నచ్చిన పద్యం: ఒక మహారాజులోని పసి మనసు – భైరవభట్ల కామేశ్వరరావు; సమకాలీన తెలుగు సాహితీ విమర్శ–కొన్ని పరిశీలనలు – టి. శ్రీవల్లీ రాధిక; గడినుడి 21 – సుభద్ర వేదుల.