అర్హత

అగరొత్తుల పరిమళం గదిలో బెరుకుగా క్రమ్ముకుంటోంది. మంచం మీద చల్లిన మల్లెపూలు.. మధ్యలో గులాబీ మొగ్గలతో కూర్చిన అక్షరాలు.. గుండె క్రింద కొంచెం కంగారుతో కూడిన సంతోషం.. వీటన్నిటి మధ్యా మరోసారి క్రాఫ్‌  సర్దుకున్నాడు అనిరుధ్‌.

తలుపు తెరుచుకున్న తీయటి శబ్దంతో పాటూ.. ఆమె లోపలికి అడుగు పెట్టింది.
అతని హృదయం లయ తప్పింది.
“మై గాడ్‌! ఎంత పెద్ద జడ!” అనుకున్నాడు. “అంగుళానికో ముద్దు చొప్పున పెట్టుకోవాలన్నా అర్ధరాత్రి దాటిపోతుందేమో!”

ఆమె కళ్ళెత్తింది.
గుండె లోతుల్లోనుంచీ పేరు లేని భావన పొంగుకొచ్చింది.
పోలిక దొరకని ఆ అందాన్ని విభ్రమంగా చూశాడు అనిరుధ్‌. అతని మనసులో వేల ఆలోచనలూ.. జ్ఞాపకాలూ గిర్రున తిరిగాయి.

సరిగ్గా నెల రోజుల క్రితం..
….
“సర్‌” ఆమె గొంతు అనిరుధ్‌ని ఈ లోకంలోకి తెచ్చింది.
ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు.
“ఎస్‌” అన్నాడు నిటారుగా కూర్చుంటూ.
ఆమె తడబాటుగా నిలబడిపోయింది.
“ఎస్‌” మరోసారి అన్నాడతను.
“సర్‌.. నా పేరు సుస్మిత. నిన్న మీకు ఫోన్‌ చేశాను.”
అతనికి గుర్తొచ్చింది. తను అలా కన్నార్పకుండా చూడటానికి.. ఆ అమ్మాయి  పాల గ్లాసుతో వచ్చిన పెళ్ళి కూతురు కాదు. తన పర్సనల్‌ సెక్రటరీ పోస్ట్‌కి అప్లై చేసిన అభ్యర్ధి.

“మీ అడ్వర్టయిజ్‌మెంట్‌ చూసి ఫోన్‌ చేశాను. ఈ రోజు యింటర్వ్యూకి రమ్మన్నారు.”
వివరించింది ఆమె.
“అవును” తల వూపుతూ అన్నాడు అనిరుధ్‌ “కూర్చోండి.”
అప్పటికి అతను పూర్తిగా తేరుకున్నాడు.
మరోసారి చూశాడు ఆమె వైపు.
కావ్యాలలో మాత్రమే వర్ణింపబడే రూపం!
గంధం బొమ్మలా.. జాజి రెమ్మలా.. ఇంద్ర ధనువులా..
అందాన్నంతా ఒక బొమ్మలా చేసి నిలబెట్టి, రెండు కళ్ళలోనూ బోలెడంత అల్లరి కూరినట్లుగా వుంది.
“ఈ అమ్మాయికి యింకా.. యింటర్వ్యూ ఏమిటి! నీ మొహం!” అంది అంతరాత్మ.
“కానీ.. కానీ .. అమ్మో! అందం చూసి మోసపోతే ఎలా! అందంగా వున్న అమ్మాయి తెలివిగా వుంటుందనుకోవడంలో.. ఉహు. అసలేమాత్రం లాజిక్‌ లేదు.” తల విదిలించాడు అనిరుధ్‌.

“డిక్టేషన్‌ తీసుకోండి.” వీలైనంత గంభీరంగా చెప్పాడు.
“ఇప్పుడా!” ఆ అమ్మాయి గాభరాగా చూసింది.
అనిరుధ్‌ భృకుటి ముడిపడింది. “మరి!” అన్నాడు, “ఎనీ ప్రాబ్లమ్‌!”
స్మిత బెరుకుగా తలెత్తింది. ఆల్చిప్పల లాంటి కళ్ళని యింకా విశాలం చేస్తూ కుడిచేయి ముందుకి సాచింది. చూపుడు వేలు ఎర్రగా  కందిపోయి వుంది. రక్తం గడ్డకట్టినట్లు చిన్న మచ్చ. గోళ్ళకి  వున్న కనకాంబరం రంగు పాలిష్‌తో పోటీ పడుతూ మెరుస్తూన్న పొడుగైన వేళ్ళు..
కళ్ళార్పకుండా చూశాడు అనిరుధ్‌. అమ్మాయిల చేతులు యిం..త బాగుంటాయా!
“నాకు గులాబీలంటే చాలా యిష్టం” భయం భయంగా చెప్పింది స్మిత.
అతనికి అర్ధం కాలేదు. ఆమె చేతి వైపే ఆశ్చర్యంగా చూస్తూ “అయితే!” అన్నాడు.
“ఒక్క పువ్వు.. ఒక్కటే కోయబోయాను. ఈ లోపలే వాచ్‌మాన్‌ వచ్చేశాడు. ఆ కంగారులో.. ముళ్ళు..” అమాయకంగా చూసింది.
“దొంగతనంగా కోయబోయావా! ఎక్కడ!” ఏకవచనంలో సంబోధిస్తున్నానన్న విషయం మర్చిపోయి అడిగాడు అనిరుధ్‌.
స్మిత ఒక్క క్షణం మౌనంగా వూరుకుంది. ఆ తర్వాత మెల్లగా తలెత్తి,  ఒక్కో అక్షరమూ చెప్పింది.
” ఇక్కడే.. ఆఫీస్‌ ముందు.. గార్డెన్‌లో..”
ఫక్కున నవ్వొచ్చింది అనిరుధ్‌కి. “సర్టిఫికేట్స్‌ ఏవీ!” అన్నాడు.
ఎడమ చేత్తో అందించింది.
మార్కులయితే బాగానే వున్నాయి. అన్నీ ఫస్ట్‌ క్లాస్‌ మార్కులే. సర్టిఫికేట్స్‌ అన్నీ ఒకసారి తిరగేసి, మళ్ళీ స్మిత వైపు చూశాడు.

అలాగే చూస్తోంది అమాయకంగా. ఎంతటి ముగ్ధత్వం!
ఆ కళ్ళూ.. ఎర్రటి ఆ పెదవులూ.. ఈ అమ్మాయిని యిలా ఎదురుగా కూర్చోపెట్టుకోవడానికే సామ్రాజ్యాలు వదులుకోవచ్చునే!
ఇంటర్వ్యూ చేయకుండానే ఉద్యోగం యిచ్చేసేందుకు నిర్ణయించుకున్నాడు అనిరుధ్‌.
“మార్కులు బాగానే వున్నాయిగా!” అతని నిర్ణయాన్ని మనసు సమర్ధించింది.
ఫైల్‌ టేబిల్‌ మీద పెడుతూ అడిగాడు “ఎపుడు జాయిన్‌ అవగలరు!”
“రేపు జాయిన్‌ అవుతాను సర్‌!” స్మిత కళ్ళు మిలమిలా మెరిశాయి.
ఆ కాంతిని చూసిన పరవశం తన మొహంలో కనపడకుండా నిగ్రహించుకుంటూ తల వూపాడు అనిరుధ్‌. “నైన్‌ కల్లా వచ్చేయండి.”
స్మిత జాయిన్‌ అయింది అతని పర్సనల్‌ సెక్రటరీగా.
“స్మి..తా..!” అలా పిలవగలగడమే ఓ గొప్ప వరంలా వుంటుంది అనిరుధ్‌కి.
అంత అందమైన అమ్మాయిని ప్రతి క్షణం చూడగలగడం.. ఆ పేరుని పదే పదే పలకగలగడం.. అదృష్టంగా తోస్తుంది.
“కానీ..” నిట్టూర్చాడు అనిరుధ్‌. “స్మిత వర్క్‌ అసలు బాగా లేదు. ఏ విషయమూ ఒక పట్టాన అర్ధం చేసుకోదు. ఏ పని చెప్పినా అవకతవకగా చేసి పెడ్తోంది. చేరి నెల రోజులు అవుతున్నా ఏ మాత్రం వర్క్‌ నేర్చుకోలేదు. తనకేమో ఆ అమ్మాయి మీద కోపం తెచ్చుకోవడం చేతకావడం లేదు.”
ఇంటర్‌కం నొక్కి “స్మితా!” అన్నాడు.
“సర్‌!” స్మిత గొంతు తీయగా వినిపించింది.
“కాస్త కాఫీ పంపించండి.”
“కాఫీనా సర్‌!”
“అవును.”
“ఎస్‌ సర్‌.”

ఆ అమ్మాయి ప్రతి విషయాన్నీ అలా రెండోసారి ఎందుకడుగుతుందో అర్ధం కాదు అనిరుధ్‌కి. ఇంకొకరైతే ఏ మాటైనా రెండో సారి అడిగితే, రెండో నిమిషంలో ఉద్యోగంలో నుంచి తీసేసి వుండేవాడు.
కానీ ఈ అమ్మాయి ఎన్నిసార్లడిగితే అన్ని సార్లూ జవాబు చెప్పాలనిపిస్తుంది. అది కదా అసలు బలహీనత!
ఎందుకిలా అయిపోయాడు తను! ఎన్నడూ లేనిది ఒక అమ్మాయిని చూసి కలవరపడడమా! వర్క్‌కి ఎంతో విలువ యిచ్చే తను అందానికి లొంగిపోవడమా!
తల విదిలించాడు అనిరుధ్‌. “లాభం లేదు. ఇంత మొద్దులాగా వుంటే ఎలా తన పర్సనల్‌ సెక్రటరీ! ఈ పోస్ట్‌కి కావలసింది అందం కాదు, ఆలోచన. అవును. ఈ అమ్మాయికి కనీసం తెలివితేటలయినా వున్నాయో, లేవో తెలుసుకోవాలి. లేవని అనుకుంటే వుద్యోగంలోనుంచి తీసేయాలి. అంతే.” తనకి తనే గట్టిగా చెప్పుకున్నాడు. “ఒక్కటే ఛాన్స్‌. ఎక్కువ యివ్వకూడదు.” తీర్మానించుకున్నాడు.
స్మిత ఆలోచనలు బలవంతంగా వదుల్చుకుని, నుదుటి మీద వేళ్ళతో నొక్కుకుంటూ ఫైల్‌ ఓపెన్‌ చేశాడు.

అంతే. మతిపోయినంత పనయ్యింది అనిరుధ్‌కి.
మొదటి కాగితం వైపే అయోమయంగా చూశాడు. ఒక్కొక్క లైనూ ఒక్కో రకమైన సైజ్‌లో ప్రింట్‌ అయి వుంది అక్కడ. కొన్ని అక్షరాలు పెద్దగా. కొన్ని చిన్నగా..
ఒక యింపార్టెంట్‌ లెటర్‌లా లేదది. ఎవరో పిల్లలు కంప్యూటర్‌ దగ్గర కూర్చుని ఆడుకుంటే వచ్చిన అవుట్‌పుట్‌లా వుంది.
కంగారుగా క్రిందికి చూశాడు. కాపీ టు మిస్టర్‌ .. కపూర్‌.. ఛీఫ్‌ యింజినీర్‌. “మై గాడ్‌!” అనిరుధ్‌ ఇంటర్‌కం నొక్కి అరిచాడు “స్మి..తా!”
నిమిషం తర్వాత ఫోన్‌ తీసింది స్మిత. అప్పటికి అనిరుధ్‌ అసహనం అగ్నిపర్వతంలా పెరిగింది.
“ఒకసారి లోపలికి రండి.” కొట్టినట్లుగా చెప్పాడు.
స్మిత రాగానే “ఏమిటిది!” అన్నాడు చిరాగ్గా.
స్మిత ఫైల్‌లోకి తొంగి చూసింది.
“అదీ.. అది.. వూరికే.. డిఫరెంట్‌ సైజెస్‌లో ప్రింట్‌ చేయడం నేర్చుకుందామని.. అలా ప్రింట్‌ చేశాను సర్‌!”
“ఏం మాట్లాడ్తున్నావసలు నువ్వు! ఛీఫ్‌ యింజినీర్‌కి పంపాల్సిన లెటర్‌ని యిలా టైప్‌ చేస్తావా! ఆమాత్రం కామన్‌సెన్స్‌ లేదూ!” చెవులదిరిపోయేలా అరిచాడు.
“ఛీఫ్‌ యింజినీర్‌!! ఓ.. కపూర్‌ గారి గురించా! లేదు సర్‌. ఆయనకి పంపించే కాపీ బాగానే వుంది. మీ కాపీనే యిలా..”
“నా కాపీ.. నా కాపీ ఎందుకుండాలి యిలా! నువు ఆడుకోవడానికి తీసుకున్న పేపర్స్‌ అన్నీ యిలా ఫైల్లో పెడతావా! కాన్ట్‌ యూ టేక్‌ వన్‌ మోర్‌ ప్రింట్‌ అవుట్‌! అంత లేజీనెస్‌ ఏమిటి?”
బెదిరిపోయినట్లుగా చూసింది స్మిత.

కళ్ళలోనుంచి అమాయకత్వం ఒలికిపోతుండగా చెప్పింది.
“మళ్ళీ ప్రింట్‌ అవుట్‌ తీసుకుందామనుకున్నాను సర్‌! కానీ పేపర్స్‌ లేవు.. మీకిచ్చే కాపీయే కదా అని..” తల పట్టుకున్నాడు అనిరుధ్‌. “ఇక లాభం లేదు. ఈ అమ్మాయిని వుద్యోగంలోనుంచి తీసేస్తే గానీ నాకు మనశ్శాంతి లేదు.” ఒక నిర్ణయానికి వచ్చినట్లూ తల పంకించాడు.
“ఇక మీరు వెళ్ళండి” శాంతంగా చెప్పాడు.
స్మిత బయటికి వెళ్ళాక కూడా ఒక రెండు నిమిషాలు అలాగే కూర్చుండి పోయాడు.
ఆ తర్వాత వాచ్‌ చూసుకుని లేచి నిలబడ్డాడు.
టేబిల్‌ మీద ఫైల్‌ అలాగే వుంది. అది తీసుకుని బయటకి వచ్చాడు.
సీట్లో లేదు స్మిత. ఆఫీస్‌లో అందరూ కామ్‌గా పని చేసుకుంటున్నారు. ఫైల్‌ ఆమె టేబిల్‌ మీద పెట్టి సాలోచనగా నిలబడ్డాడు.

ఏదో వీక్లీ.. వుమన్స్‌ ఎరా.. ఆఫీస్‌ మాగజైన్‌.. అన్నీ పరచినట్లుగా వున్నాయి.
మాగజైన్‌ చేతిలోకి తీసుకుని తిరగేశాడు.
ఏవేవో బొమ్మలు దానిమీదంతా..  పూలూ.. ఆకులూ.. అమ్మాయిల మొహాలూ.. నీట్‌గా పూర్తి చేసిన పజిలూ..
అడుగుల చప్పుడు వినబడడంతో మాగజైన్‌ టేబిల్‌ మీద పెట్టి వెనుదిరిగాడు.
“నేను బయటికి వెళ్తున్నాను. మళ్ళీ ఫోరోక్లాక్‌కి వస్తాను.” అన్నాడు స్మితతో.
వేగంగా క్రిందికి వచ్చి కార్లో కూర్చోబోతూ ఒక్క క్షణం ఆగాడు.
ఏదో ఆలోచన హఠాత్తుగా తోచినట్లు తడబడ్డాడు.
ప..జి..ల్‌. ఆఫీస్‌ మాగజైన్‌లోని పజిల్‌… రెండు రోజులుగా తను పూర్తి చేయలేక కుస్తీ పడుతున్న పజిల్‌ని స్మిత పూర్తి చేసింది! ఎలా సాధ్యం! ఆ మొద్దుపిల్ల యింత కష్టమైన పజిల్‌ని పూర్తి చేయడం.. అసలెలా సంభవం!!

అతని మొహంలో గబగబా రంగులు మారాయి.
వెనక్కి తిరిగి, దాదాపు పరుగెత్తుతున్నట్లుగా  మెట్లన్నీ ఎక్కాడు. కొద్దిగా ఆయాసపడుతూ స్మిత టేబిల్‌ దగ్గరికి నడిచాడు.
స్మిత లేచి నిలబడింది.
ఆమె ఖాళీ చేసిన సీట్లో తను కూర్చుంటూ అడిగాడు. “ఆఫీస్‌ మాగజైన్‌ ఒకసారిలా యివ్వండి.”
స్మిత అందించింది.
అది చూడగానే అతని మొహం పాలిపోయింది.
మల్లె పూవంత తెల్లగా వుంది ఆ పేపర్‌. ఇందాక చూసిన బొమ్మలూ, పజిలూ ..
అన్నీ నీట్‌గా ఎరేజ్‌ చేశారెవరో!
“ఇందులో పజిల్‌ పూర్తి చేశారు కదా మీరు!” అడిగాడు.
మిన్ను విరిగి మీద పడినట్లూ వులిక్కి పడింది స్మిత “నేనా..! పజిలా..!”
“అవును. మీరు పూర్తి చేశారు.” అతను రిపీట్‌ చేశాడు.
“లేదు. నేను చేయలేదు.” స్మిత కూడా రిపీట్‌ చేసింది.
అనిరుధ్‌కి అర్ధం కాలేదు. ఆమె పెదవి చివర ఒక కొంటె నవ్వు మెరుస్తూందన్న అనుమానం వచ్చింది కానీ రూఢి చేసుకోవడం ఎలాగో తెలీలేదు.

ఆమె అబద్ధం చెబుతూందన్న విషయం స్పష్టంగా అర్ధమౌతోంది. ఎందుకిలా నాటకమాడుతూంది!!
సాలోచనగా చూస్తూ కుర్చీలోనుంచి లేచాడు అనిరుధ్‌. “మీ అకౌంట్స్‌ సెటిల్‌  చేయమని గుప్తాతో చెప్తాను. రేపటినుండి మీరు ఆఫీస్‌కి రానవసరం లేదు.”  చెప్తూనే బయటకి నడిచాడు.  వెనుక స్మిత హతాశురాలయినట్లుగా నిలబడిపోవడాన్నీ,.. “సర్‌” అంటూ పిలవడాన్నీ పట్టించుకోలేదు.
మళ్ళీ రెండు గంటల తర్వాత అతను తిరిగి వచ్చేసరికి, ఆమె వెళ్ళిపోయింది.
మేనేజర్‌ని పిల్చి స్మిత అడ్రస్‌ తీసుకున్నాడు. లోపలికి వచ్చి సీట్లో కూర్చోబోతూండగా కనపడింది లెటర్‌.. ఆమె హ్యాండ్‌ రైటింగ్‌తో..

అనిరుధ్‌ కళ్ళు ఆసక్తిగా పరుగు తీశాయి.
“సర్‌!
మీరు నాకు  సంజాయిషీ చెప్పుకునే అవకాశం యివ్వలేదు. కానీ చెప్పడం నా బాధ్యత అనుకుని ఈ లెటర్‌ వ్రాస్తున్నాను. ఇంతకు ముందు మీ సెక్రటరీగా వున్న రీతూ నా ఫ్రెండ్‌.   మగవాళ్ళు ఎప్పుడూ అమ్మాయిల అందాన్నే ఆరాధిస్తారనీ.. తెలివితేటలకి ఏమాత్రం ప్రాముఖ్యత యివ్వరనీ నా నిశ్చితాభిప్రాయం.

దాన్ని రీతూ వ్యతిరేకించేది.
“మా సర్‌ అలా కాదు. ఆయన ఆడవాళ్ళూ, మగవాళ్ళూ అన్న డిఫరెన్సియేషన్‌ ఎపుడూ చూపించరు. …అసలు ఆయన దగ్గర వున్నపుడు నాకు అమ్మాయిని అన్న ఫీలింగే రాదు..” అనేది.

ఆ తర్వాత దాని మారేజ్‌ సెటిల్‌ అవడంతో జాబ్‌ కి రిజైన్‌ చేసింది. అపుడు నేను పందెం కట్టాను.  నా తెలివితేటలేమీ ప్రకటించకుండా, చాలా తెలివితక్కువ దానిలా కనిపిస్తూ.. మీ దగ్గర ఉద్యోగం సంపాదిస్తాననీ..   కేవలం అందమే ఆయుధంగా కనీసం ఆరు నెలలు వుద్యోగంలో నిలబడతాననీ..   అన్నట్లుగానే ఉద్యోగం సంపాదించాను. పోటీలో గెలుస్తున్నాననే అనుకున్నాను. కానీ.. వున్నట్లుండి  నా నాటకం బయటపడింది. జాబ్‌ పోయింది.  పోనివ్వండి. దాని గురించి నేనేమీ బాధపడడం లేదు.  అయితే ఒక్క విషయం మాత్రం నాకు అర్ధం కావడం లేదు. నా తెలివి తక్కువ తనాన్ని యిన్నాళ్ళూ భరించిన మీరు నా తెలివితేటలు బయట పడ్డాక వుద్యోగంలోనుంచి తీసేశారేమిటి?
అది మాత్రం నాకు నిజంగా అర్ధం కావడం లేదు.   ఏమైనా మీ దగ్గర పని చేయడం నాకు చాలా ఆనందం కలిగించిన విషయం.
సెలవు.
మీ
సుస్మిత.”

అనిరుధ్‌ పెదవుల మీద చిరునవ్వు మెరిసింది.
“మీ సుస్మిత” అన్న మాటల్ని మరోసారి చూసి ఉత్తరం మడిచి జేబులో పెట్టుకున్నాడు.
స్మిత అడ్రస్‌ కార్డ్‌ చేతిలోకి తీసుకుని ఛైర్‌ లోనుంచి లేచాడు.

…..

నుదుట కళ్యాణం బొట్టుతో, బుగ్గన చుక్కతో దగ్గరికి వచ్చిన స్మితని చూసి ఆలోచనలలోనుంచి తెప్పరిల్లాడు అనిరుధ్‌.
అతనివైపొకసారి పరీక్షగా చూసి, పాల గ్లాసు స్టూలు మీద పెట్టి, జడ విసురుగా వెనక్కి వేసుకుంది స్మిత.
ఆ తర్వాత మంచం మీద అతని ఎదురుగా కూర్చుంటూ అడిగింది. “ఇపుడు చెప్పండి.. ఎందుకు తీసేశారు నన్ను ఉద్యోగంలో నుంచి!”

అనిరుధ్‌ నవ్వాడు. ఆమె ముక్కు మీద చూపుడువేలితో సుతారంగా రాస్తూ అమాయకంగా అడిగాడు “తీసేయడమేమిటి? ప్రమోషన్‌ యిస్తే…!”
పెదవుల మీదికి పాకబోతున్న అతని చేతిని గట్టిగా పట్టుకుని, కళ్ళల్లోకి సూటిగా చూసింది స్మిత.
“అదే ఎందుకిచ్చారూ అని! అందం చూశా! తెలివితేటలు చూశా!”

ఒక ఆనంద కెరటం మొహాన్ని చరిచినట్లు పెద్దగా నవ్వాడు అనిరుధ్‌. అదే వేగంతో ఆమె పెదవులు అందుకోబోతూ ఒక్క క్షణం  ఆగాడు.
సిగ్గుతో మెలమెల్లగా వాలిపోతూన్న స్మిత కన్నులని తాకి అక్షరాలు పరవశిస్తుండగా చెప్పాడు.
“ఆ రెండూ కాదు మేడమ్‌! మీ .. ఈ .. అల్లరి చూసి..!”

టి. శ్రీవల్లీ రాధిక

రచయిత టి. శ్రీవల్లీ రాధిక గురించి: టి. శ్రీవల్లీ రాధిక నివాసం హైదరాబాద్‌లో. వీరి రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. \"రేవు చూడని నావ\" అనే కవితాసంపుటి, \"మహార్ణవం\", \"ఆలోచన అమృతం\" అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి \"mitva\" అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. \"నా స్నేహితుడు\" అనే కథకు 1994 లో \"కథ\" అవార్డు అందుకున్నారు ...