ఇగో

సింహాసనం కొంచెం
​జ​రిగిందా
కిరీటం కాస్త
వాలిందా
నీ పని గోవిందా!

కురుసార్వభౌముడు
సుయోధనుని కన్నా
ఒక మీటరు
ఎక్కువే ఉంది

సోడాలా
బుసబుసా
పొంగుతోంది
బుడగలా
ఫట్‌మని
పగులుతోంది
​అలల్లో ​
బెండులా
ఆడుతోంది
​ప్రతి గురివిందకీ
సున్నితపు త్రాసులా
చలిస్తోంది ​

కవుకుదెబ్బలే​-​
చీకట్లో ఉఫ్ ఉఫ్‌మని
ఊదుకొమ్మంటోంది
నువ్వు కట్టుకున్న
పేక ముక్కల
​గీర మేడల్లో ​
ఎవరికీ తెలీకుండా
ఘొల్లుమని
ఏడవమంటోంది

అదే​గా ​
మరి
నే చెప్పేది

​సింహాసనం
అంగుళం
జరిగిందా ​
కిరీటం
ఓ డిగ్రీ ​
వాలిందా
నీ పని
గోవిందో గోవిందా!