పాప

సాళ్ళు సాళ్ళుగా నాటిన మొక్కలన్నీ మారాకువేసి చిక్కటి పచ్చదనంలోకి తిరిగాయి. మిరపలూ, రామ్ములక్కాయలూ, వంగలూ అయితే పూతకూడా వేశాయి. ఆకుల వెనక పురుగులేమన్నా ఉన్నయ్యేమోనని రామ్ములగ ఆకుల్ని లేపి చూశాడు ముసలాయన. ఏం లేవు గానీ కొమ్మ వదలగానే పసరు వాసన గుప్పున కొట్టింది. ఆ వాసన ఆబగా పీల్చుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ముసలాయన.

రెండు నెల్ల ముందు అదంతా పచ్చికతో నిండి ఉండేది. చలికాలమన్నాళ్ళూ శాలువా కప్పుకు మునగదీసుకుని ‘ఇదేం చలిరా నాయనా!’ అనుకుంటూ ఫైర్‌ప్లేస్‌ దగ్గర చేతులు కాసుకుంటూ ఉన్నవాడల్లా స్ప్రింగ్‌ వచ్చి గడ్డీ, చెట్లూ పచ్చబడగానే శాలువా తీసి విసిరేసి వొళ్ళు విరుసుకుని దొడ్లో పనికి దిగాడు. ‘అంతా బీడు పెట్టారూ’ అనుకుంటూ ఒకమూలనుంచి తవ్వటం మొదలుపెట్టేసరికి కొడుకూ కోడలూ లబోదిబోమన్నారు. వేలు కుమ్మరించి వేయించిన లానూ, లాండ్‌స్కేపింగూ మరి. చివరికి రాజీకి దిగి ఒక మూల కొంత భాగం ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేసుకునేందుకు ఒప్పుకున్నారు.

పారా పలుగూ కావాలని కొడుకుని వెంటబెట్టుకుని షాపులన్నీ తిరిగాడు. ‘సరైన పనిముట్లు లేకండా ఎగసాయమెట్టా చేత్తన్నారీళ్ళు?’ అని ఆశ్చర్యపడి దొరికిన పనిముట్లే తెచ్చుకున్నాడు. అలవాటు లేకపోయినా వాటితోటే సతమతమై గడ్డి అంతా తవ్వి పడేసి మట్టిని గుల్ల చేసి మరికాస్త మట్టీ ఎరువూతెచ్చి మడులు కట్టాడు. కోడలు చేత వాళ్ళకీ వీళ్ళకీ ఫోనులు చేయించి మొక్కలూ, విత్తనాలూ తెప్పించి నాటాడు. ఇంటి ముందూ పక్కనా పూలమొక్కలు పెట్టటంలో కోడలు కాస్త సాయం చేసింది.

‘ఈ పిచ్చి ఎరువులు గాకండా మన నయ్యి మట్టి ఏత్తే నాసామిరంగా ఇంకెట్టొచ్చేయ్యో మొక్కలు!’ అనుకున్నాడు. ఇంతలో ఇంటి పక్క వేసిన గులాబీల మధ్య కలుపు బాగా పడినట్టు గుర్తొచ్చి అటు వెళ్ళాడు. వొంగి గడ్డి పీకుతుంటే పక్కింటి కిటికీలో ఏదో కదిలినట్టనిపించి తలెత్తి చూశాడు. పాప. మూడు నాలుగేళ్ళు ఉంటాయేమో! గుడ్లప్పగించి చూస్తూంది. రమ్మన్నట్టు చేయూపాడు నవ్వుతూ. కిటికీ దగ్గరనించి వెళ్ళిపోయింది. రెణ్ణిముషాలాగి చూస్తే మళ్ళీ కనిపించింది. మళ్ళీ చేయూపాడు. మళ్ళీ తప్పుకుంది అక్కణ్ణించి. కాసేపు దాగుడుమూతలాట అయ్యాక మళ్ళీ కనపడలేదు.

‘అప్పుడే పెద్దయిపోవాలా వాడూ’ అని మనవణ్ణి తలుచుకుని కాసేపు బాధపడ్డాడు. ‘వాడితో ఆడినట్టు కూడా లేదు సరిగ్గా. అప్పుడే కాలేజికి ఎల్లిపోయె! ఒక్కడితో ఆపొద్దురా ఇంకొకళ్ళని కనమంటే ఇనకపోతిరి!’

మరుసటి రోజూ, తరవాత రోజూ అట్లాగే కిటికీ దగ్గర కనిపించింది ఆ పాప. అట్లాగే చేతులూపి రమ్మనటమూ, ఆ పిల్ల అట్లాగే దోబూచులాడటమూ. నాలుగు రోజులయ్యేసరికి అదొక అలవాటయ్యింది ముసలాయనకి. పనిలేకపోయినా ఒకసారి ముందుకి వచ్చి ఆ పిల్లకి చేయూపి పిలిచేవాడు. ఓ వారమయ్యాక మొక్కలికి ఎరువు వేస్తూ ఉంటే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి నిలుచుంది గులాబీల దగ్గర.

“ఓర్నీ పిల్ల, ఇన్నాల్లు పట్టిందా నీ బెరుకు పోటానికి!” అన్నాడు నవ్వుతూనే పాప వంక చూస్తూ. పట్టుకుంటే మాసిపోయే తెల్లటి రంగుతో నిండుగా గాలి ఊదిన రబ్బరు బొమ్మలాగుంది. లేతగోధుమరంగు కళ్ళూ, బంగారపు రంగు జుట్టూ, చేతిలో ఎలుగుబంటి బొమ్మా.

“వాట్‌” అంది ఆ అమ్మాయి.

“ఏస్‌ బోస్‌ ఇంగ్లీసు నాకు రాదనుకున్నావేంది? నువు తెలుగు మాట్టాడు చూద్దాం!”

ఏమర్థమయిందో “యా!” అందా అమ్మాయి.

“నీ పేరేంది?” అడిగాడు. మళ్ళీ ‘యా!’ అందా అమ్మాయి.

“అయితే నిన్ను యా అని పిలవమంటావా?” అని ఎకసెక్కెమాడి “ఈ ఎండలో ఎందుకుగానీ నువు లోపలికి పోమ్మా! పో!”

బదులుగా “యా” అంది మళ్ళీ.

“నీకింకేం మాటలు రావా ఏంది పిల్లా? ఇక్కడ ఈ అగ్గిలో నీకేం పని గానీ నువ్వుబో!”

పోలేదు ఆ అమ్మాయి. అక్కడే కూచుంది ఏవో కబుర్లు చెబుతూ.

“అయ్యన్నీ నాకెట్ట తెలుత్తయ్యమ్మా! ఇదుగో ఇట్టాంటి పనన్నావు రేయింబొవుళ్ళూ చేయమన్నా చేత్తా!”

“నో” అంది పకపక నవ్వుతూ.

అంతలో కోడలు వచ్చింది ఆఫీసునుంచి. “ఏమిటి మామయ్య గారూ, సారాతో కబుర్లు పెట్టుకు కూచున్నారా?” అంటూ దగ్గరికి వచ్చింది.

“చూడు ఏందేందో చెబుతంది. ఆ బాసేమో మనకి అర్దం కాకపోయె!”

“హాయ్‌ సారా! హౌ ఆర్‌ యూ?” అని పాపని పలకరించింది.

“సారానా, అదేం పేరు పాడు పేరు!” అని ఆశ్చర్యపోయాడు. పాప ముసలాయన వంక వేలు చూపించి అడిగింది “వై ఈజ్‌ హీ బ్లాక్‌? వై ఈజ్‌ హీ స్టేయింగ్‌ విత్‌ యూ?”

నవ్వుతూ బదులు చెప్పింది కోడలు ముసలాయన తన భర్త తండ్రనీ, ఆయన వొంటి రంగు అదేననీ. తర్వాత తెల్లటి మొహం ఎర్రబడుతుండగా నవ్వుతూ మావగారికీ చెప్పింది పాప అడిగిందేమిటో.

“వోర్నీ పాసుగూల! చిన్నప్పుడు తెల్లగానే ఉండేవోణ్ణి. ఎండలో వానలో పనిచేసి ఇట్టయా గానీ!” అని పాపతో అంటుంటే “బట్‌ హిజ్‌ హెయిర్‌ ఈజ్‌ వైట్‌” అంది ఒక వైరుధ్యాన్ని కనిపెట్టినట్టుగా. కోడలు తెలుగులో చెప్పింది ఏమంటుందో.

అంతలో సారా వాళ్ళమ్మొచ్చింది “ఈజ్‌ షీ బాదరింగ్‌ యూ?” అంటూ. లేదనీ, తన మావగారికి కంపెనీ ఇస్తుందనీ చెప్పింది కోడలు.

ఆ రాత్రి కోడుకూ కోడలితో అన్నం తింటూ “భలే పిల్లరా! బంగారపు బొమ్మనుకో! ఏం తెలివి? పేరే పిచ్చి పేరు పెట్టారు గాని!” అని అదే పనిగా చెప్పాడు.


నాలుగురోజుల తర్వాత దొడ్లో మొక్కలకి నీళ్ళు పెడుతుంటే వెనకమాలే వచ్చి నిలుచుంది.

“వోర్నీ పిల్ల! ఎట్టొచ్చావమ్మా! దడితలుపుకు కొక్కెం లేదూ!” అంటే చేతిలో అమ్మాయి బొమ్మ చూపించి ఏదేదో చెప్పటం మొదలు పెట్టింది.

“నువ్వే బొమ్మవి నీకింకో బొమ్మెందుకూ?” అంటే బొమ్మ ముసలాయనకివ్వబోయింది.

“నాకెందుకమ్మా బొమ్మలు! ఇదుగో ఈ మట్టి ఉంటే చాలు!” అన్నాడు. పాప కూడా కూచుని బొమ్మ పక్కన పడేసి మట్టిలో వేళ్ళు పెట్టి ఆడుతూంది.

“చూడు ఆ మట్టి చూడు బంగారం కాదూ! ఈ బూపెపంచకంలో యాడికన్నా పో, ఇదే మట్టి. ఇంకేం కావాల? నేల చదును చేసి యిత్తనాలేసి నీళ్ళు పెట్టు; తన్నుకుని వస్తయ్యి మొక్కలు. యిరగబడి కాయాల!” పాప ఏమీ పట్టించుకోకుండా మట్టి కెలుకుతూంది.

“చీమలుంటయి జాగర్త!” అని ఒక హెచ్చరిక విసిరేసి బెండలకీ, గోరుచిక్కుళ్ళకీ నీళ్ళుపెడుతూ చెప్పాడు. “ఈ మాత్రం నీటి సౌక్రిం ఉంటేనా బంగారం పండించేవాళ్ళం.. వానల్లేకా, కాలవరాకా పంటలెండిపోయి అగోరించాల్సొచ్చింది కానీ..”

కండవాతో మొహమ్మీద పట్టిన చెమట తుడుచుకుంటూ కూచున్నాడు ట్యూబు పాదుల్లో వదిలేసి.

“ఏదో వీడు కాసిని డబ్బులు పంపిచ్చబట్టిగానీ ఆ పొలం కాత్తా ఎప్పుడో అమ్ముకోవాల్సింది కాదూ? మనకి తప్పినయిలే ఆ తిప్పలు. అసలు నేలదేం తప్పు లే; నీళ్ళదే! అటు ఎండిపోటమో ఇటు మునిగిపోటమో!” చెప్పుకుపోయాడు.

పాప వచ్చి నీళ్ళలో చేతులు కడుక్కుంటూ ఉంది. “నీ పేరేంది, సారాయా?” అని నవ్వుకుంటూ “సారా!” అని పిలిచాడు. ముసలాయన వైపు తలెత్తి చూసి బురద చేతుల్తో నీళ్ళు అతని మీద చల్లింది. ‘ఓసినీ పిల్ల!’ అనుకుంటూ లేచి నిల్చుంటే ఆ పిల్ల గేటు వైపు పరుగులు తీసింది పకపక నవ్వుకుంటూ. “ఆగాగు!” అంటూ వెంటనే పరిగెత్తబోయి ఆగాడు హడావిడిలో ఎక్కడ కింద పడిపోతుందేమోనని. నీళ్ళు ఆపేసి ట్యూబు చుడుతూ ఉంటే మళ్ళీ వచ్చింది.

“అరె పట్టుకోండిరా సారాని!” అని ఉలికిచ్చబోయాడు. ఆ పిల్ల బెదరకుండా అట్లానే నిలబడింది. “రా సారా! నిన్ను తాగేస్తా రా!” అంటూ పిలిచి నవ్వొచ్చి నవ్వేశాడు. ఎప్పుడో కనుము పండక్కి కోటేశు ఒక బ్రాందీ సీసా తెస్తే కొట్టంలో కూచుని తాగటమే. “ఈ మద్దె ఎప్పుడూ తాగలేదు దా!” అన్నాడు చేతులు సాచి ఎత్తుకుందామన్నట్టు. అంతలోనే కోడలు చెప్పింది గుర్తొచ్చింది చిన్నపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని అడక్కుండా ఎత్తుకోకూడదూ అని. ‘అంతా ఇచిత్రం’ అనుకుని ట్యూబు చివరలో కాసిని నీళ్ళుంటే చేతిలోకి తీసుకుని పాప మీదికి చల్లేడు. నాలుగు చుక్కలు మొహమ్మీద పడేసరికి ఉలిక్కిపడి కళ్ళు గట్టిగా మూసి తెరిసి పెద్దగా కేకలు వేస్తూ పారిపోయింది.


బీర, సొర, పొట్ల, దొండ పాదుల్లో గడ్డి తీసి పాదులు కాస్త సరి చేస్తూ ఉంటే వీపు మీద ఏదో వచ్చి తగిలింది. తిరిగి చూస్తే ఎర్రరంగు బంతి. దూరంగా నిల్చుని నవ్వుతుంది. ‘నీకెవురూ ఇంక ఆడుకునే వాళ్ళు దొరకలా?’ అంటూ బంతి విసిరేశాడు. మళ్ళీ వేస్తే తిరిగి ఇవ్వకపోయేసరికి తనే వచ్చి తీసుకుంది.

“పందిళ్ళు వెయ్యాలింక. చూడు తీగలు సాగుతున్నయ్యి. గెడ్దపొలుగు లేదాయె!” చెప్పి చతికిలపడి నవ్వటం మొదలుపెట్టాడు. పాప కొద్దిసేపు ఆశ్చర్యంగా చూసి తనూ నవ్వసాగింది.

“ఏం తోచటం లేదంట తోచటం లేదు. పందిళ్ళు ఏద్దామురా అని చెప్పా. ఏడీ అయిపు లేడు పెద్దమనిషి!”

ముందు రోజు రాత్రి ఎవరింటికో భోజనానికి తీసుకుని వెళ్ళారు కొడుకూ కోడలూ. ఎవరి మాటల సందడిలో వాళ్ళుంటే ఒక పెద్దాయన వచ్చి పలకరించాడు. ఆడాళ్ళలో ఎవర్నో చూపించి వాళ్ళమ్మాయని చెప్పాడు. అక్కణ్ణుంచీ ఇక్కడెంత బోరు కోడుతుందీ చెప్పటమే పనిగా పెట్టుకున్నాడు. ముసలాయన వివరాలూ, కొడుకూ కోడలూ ఎక్కడ పనిచేసేదీ అడిగి తెలుసుకుని “ఇంట్లో మేంఇద్దరమూ, ఇంకా పసిపిల్లాడూ ఉంటేనే పొద్దుపోటల్లేదే, ఒక్కళ్ళకే ఎట్లా తోస్తుందీ” అని ఒకటే ఆశ్చర్యపోయాడు. ముసలాయన కూరగాయల పెంపకాన్ని గురించి విని తనూ ఉత్సాహ పడ్డాడు.

“మీ అమ్మాయిని పొద్దున్నే దింపెల్లమని చెప్పు. మనం పందిళ్ళు వేద్దాం. నీక్కావాలంటే నా దగ్గిరింకా యిత్తనాలు ఉండయ్యి. కాసిని మొక్కలు కూడా పీకిత్తా” అని చెప్తే “సరే సరే!” అని తలూపాడు.

“వొట్టిదే వాలకం తెలియటల్లా! పట్నం సరుకు. చొక్కా నలక్కూడదు, చేతికి మట్టి అంటకూడదు.”

“యా” అంది.

“చూడు నా మాటినుకో! మనసులో పెట్టుకో ఎప్పుటికయినా! మడిసన్నాక వొంటికి సెమట పట్టాల. లేపోతే ఆడు బతికుండట్టే కాదు!”

“యా!” అంది మళ్ళీ.

“నువ్వు ఈ యాయాలు మల్లీ మొదలుపెట్టా! నువ్వా బంతెందుకు తెచ్చా, మొక్కల మీదపడితే కొమ్మలు ఇరగవూ? మీ ఇంటికెల్లి ఆడుకో పో!” అన్నాడు.

పోలేదు ఆ పాప. బంతిని ముసలాయన పక్కనేపెట్టి దానిమీద కూచోవాలని ప్రయత్నిస్తూంది.

‘ఈ కాకర్లు ఏందో వొచ్చి చావటల్లా! దానికి బాగా ఇష్టం! ఏపుడు చేత్తే చట్టికూరా వొక్కతే తినేది! మరా చేదుకశం నేను తింటేగా!’ అంటూ నవ్వాడు.

‘ఒక్క దోసిత్తనాలే దొరకలా! ఎండా కాలం తింటే బాగ సలవ!’ అని ఆపిల్ల వంక తిరిగి ‘ఇయ్యన్నీ తినరుగా మీరు! నాకు తెలుసులే ఆ గొడ్డుమాంసమేగా తినేది పొద్దుగూకులూ! మీ నాలికలికేం తెలుసు ఆటి రుచి!’ అన్నాడు.

“కాపు పడనియ్యి; కూరగాయలిత్తా నీకు. మీ అమ్మకి చెప్పి వొండించుకో! మళ్ళీ ఆ గొడ్డుమాంసం జోలికెల్తే అప్పుడడుగు.”

“యా” అంది ఇంకా బంతి మీద బ్యాలన్స్‌ చేస్తూ.


ఇంటిపక్క గులాబీల మధ్య కలుపు పీకుతున్నాడు ‘దీందుంప తెగ, మొన్ననేగా ఇక్కడ కలుపంతా పీకిందీ’ అనుకుంటూ.

‘ఈ సారొచ్చేప్పుడు కొడవలి తెచ్చుకోవాల. ఈ తుంగా, గరికా ఎక్కడికి పోయినా వొదలవు.’ అనుకుంటుంటే అప్పుడే బయటినుంచి వచ్చిందో, బయటికి వెళ్ళబోతూందో కొత్త గౌనూ, కాళ్ళకి షూస్‌తో వచ్చింది పాప.

“ఆఁ రా! నువ్వే రాలేదేందాని చూత్తన్నా!” అంటూ ఆహ్వానించాడు.

గౌను మీద పూలూ సీతాకోకచిలకలూ చూపించి ఏదో చెబుతూంది. ‘ఆఁ ఆఁ బాగనే ఉండయ్యిలే! మాకు చూడు చెట్లకి నిజం పూలు ఎట్ట పూసినయ్యో’ చూపించాడు. ఎరుపూ, పసుపూ, నారింజా, తెలుపూ రంగుల్లో చాలా పూశాయి పూలు.

చేయి చాపి పెద్దగా పూసిన ఎర్రపూవందుకోబోతుంటే కోప్పడ్డాడు. ‘ఓర్నీ పిల్లా ముళ్ళు గుచ్చుకుంటయ్యి దూరం పో!’ అని. అలిగి దూరంగా కూచుంది.

“నువ్వలిగితే నాకేంది? పువ్విత్తాననుకున్నావా? అసలు పూలు పూయించటమే అలవాటు లేదు నాకు. ఎప్పుడో మిరపతోటల్లో బంతులేయటమే కానీ! అప్పుడయినా అయి పండగదాకా ఎవురూ కోసేయటానికి లేదు. పండగరోజు ఎద్దులకీ వాకిట్లోకీ కట్టాల్సిందే!” వెనకటి జ్ఞాపకాల్లోకి జారిపోతూ ఉన్నాడు.

పాప తలతిప్పి చూసి ఏడుపు మొహం పెట్టుకు కూచుంది.

‘పువ్విత్తే మాత్రం ఏం చేత్తా నువ్వు? తల్లో పెట్టుకుంటావా పాడా? నా మాటిని చెట్టుకే ఉండనియ్యి!’ తలెత్తలేదు పాప.

‘ఓర్నీ పిల్ల నాకాడ అలుగుద్దీ!’ అని మురుసుకుని ‘దా దా! కోసిత్తా దా! మరి నా బుగ్గమీన ముద్దు పెడతావా?’ అడిగాడు.

అతని నవ్వు మొహం చూసి లేచి దగ్గరికి వచ్చింది పాప.

‘ముద్దొద్దూ పాడొద్దులే! పాడు దేశం పిల్లల్ని ముద్దు పెట్టగూడదూ, ముద్దు పెట్టిచ్చుకోకూడదూ! ఏ పువ్వు కావాలో చెప్పు?’ ఇదా ఇదా అంటూ అన్నీ ఊగించి చూపించాడు. ఇందాకటి ఎర్రటి పువ్వే చూపించింది మళ్ళీ. ‘తెలివికి మొనగత్తెవే నువ్వు!’ అని ఆశ్చర్యపోతూ, ఒక చేత్తో కొమ్మపట్టుకుని పువ్వు తుంపుతుంటే ముల్లు కసుక్కున దిగింది. తెంపిన పువ్వు అట్లాగే వదిలేసి చూసుకుంటే నెత్తురు బొట్లుగా తేలుతూంది. వేలు నోట్లో పెట్టుకోబోతుంటే పాప అతన్ని ఆగమని వాళ్ళింట్లోకి పరిగెత్తింది.

నెత్తురు చూసి చాన్నాళ్ళయిందనుకుంటూ ఉంటే పాప ఒక ప్లాస్టిక్‌ డబ్బా పట్టుకుని వచ్చింది. అందుట్లోనించి బ్యాండ్‌ఎయిడ్‌ తీసి ముసలాయన వేలికి చుట్టింది. డబ్బా మూసి వెళుతుంటే పిలిచి గులాబీ పువ్వు ఇచ్చాడు.

‘డాక్టరవుతామ్మా నువు పెద్దయాకా?’ అంటూ తలనిమిరాడు.

ఆరాత్రి కొడుకు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముసలాయన అలికిడి లేదు. కోడలికీ తెలియలేదు ముసలాయనకేమయిందో. అట్లా మంచం మీద ఊరకే పడుకుని ఉండే మనిషి కాదు.

భోజనానికీ కిందికి దిగకపోయేతలికి కొడుకు ముసలాయన దగ్గరికొచ్చి మంచమ్మీద కూచున్నాడు ‘ఏమిటి నానా ఏమయింది? వొంట్లో బాగాలేదా? ఆకలవటల్లేదా?’

‘ఆఁ ఏం లేదురా ఏం లేదు!’ అంటూ నెమ్మదిగా లేచికూచున్నాడు ముసలాయన. ‘పద తిందాం!’


రచయిత చంద్ర కన్నెగంటి గురించి: జననం గుంటూరు జిల్లా సౌపాడులో. నివాసం గ్రేప్‌వైన్‌, టెక్సస్‌లో. సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.  ...