డడడ్డ డడడం డడడ్డ డడడం. లయ తెలుసు నీకు. అనుగుణంగా అడుగు తీసి అడుగు. ఊగుతూ నడుము. ఊపుతూ చేతులు. ముందుకీ వెనక్కీ. కవ్విస్తూ దగ్గరగా ఒరిగి అందకుండా దూరంగా జరిగి. కదలికకు బదులుగా కదలిక. ఉబికే కండరం మీద నిగనిగలాడుతూ వెచ్చటి తడి.
డడడిడ్డుం డడడిడ్డుం. పదం వెనక పదం. బదులుకు బదులు. ఒకేసారి జాగ్రత్తగానూ దేన్నీ లెక్కచేయకుండానూ. అదుపులో ఉంచడమూ ఎగసిపడనివ్వడమూ. ఏం జరుగుతుందో నీకు తెలుసు. తెలుసని తెలియకుండానే. ఏ మాట ఏ మీట నొక్కుతుందో. అంతా ముందే రాసినట్టు. గీత గీసినట్టు.
డడ్డం డడ్డం డడాడడ్డం. చీకటివెలుగులు పెనవేసుకుంటూ. తన నృత్యంలో తను నిమగ్నమై నెగడు. నాల్కలు సాచి. చీలికలు కలిసి. నారింజ సెగల భుగభుగలు. నీకు తెలియదు అది రగులుకుంది బయటో లోపలో. కాలుస్తుందో వేడినిస్తుందో వెలుగునిస్తుందో. నీకది పట్టదు కూడా.
డడ్డాడ డాడా డడ్డాడ డాడా. నువు ఆటాడుతున్నావో ఆడిస్తున్నావో బదులాడుతున్నావో తెలియదు. అసలు ఆట ఏదో కూడా. నువ్వెవరో ఏమవుతున్నావో నీకు తెలియదు. నువు మండుతున్న నిప్పువో కాలుతున్న కట్టెవో. ఏదయినా ఒకటే నీకు. పిదప ఎటూ రెండూ మిగలవు కనక. తెలవారగానే ఇంత వెలిబూడిద. లోలోపల ఆరని నిప్పుకణిక. ఇంకో ఆటకి.