కోనసీమ కథలు: రెండు ప్రేమ కాట్లు

చాలా ఏళ్ళ తరువాత మా కొలీగ్ వాళ్ళ చెల్లి పెళ్ళికి మద్రాసు వెళ్ళినప్పుడు పదిహేడేళ్ళ తరువాత అనుకోకుండా సువర్ణని చూశాను.

తను నన్ను చూసి గుర్తుపట్టింది కానీ, నాకయితే ఆ రూపం సువర్ణేనా అన్నది ఊహకే అందలేదు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఒకప్పుడు ఎస్.కే.బి.ఆర్ కాలేజీ కుర్రకారునీ, చుట్టుపక్కల యావత్తు మగ సమాజాన్నీ ఒక్క కుదుపు కుదిపిన సువర్ణేనా ఇలా అయ్యిందన్నది ఆశ్చర్యం వేసింది. మొహంలో నవకం తగ్గ లేదు కానీ, బాగా లావెక్కింది. నన్ను చూడగానే, “ఏయ్! రావుడూ! గుర్తున్నానా? సువర్ణని! ఎలా వున్నావు?” ప్రశ్నల శరంపరకి నోట మాట రాలేదు.

“నువ్వస్సలు మారలేదు, కాస్త జుట్టు పల్చబడిందంతే!” అంటూ నన్నసలు మాట్లాడనీయకుండా తనగురించి చెప్పుకుంటూ పోయింది. ముగ్గురు పిల్లలనీ, పెద్దమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోందనీ, మిగతా ఇద్దరూ కవలలనీ ఇంటర్ చదువుతున్నారనీ చెప్పింది. సువర్ణ భర్త కోటేశ్వరరావు మాత్రం పెళ్ళికి రాలేదు. అతను నాకు బాగానే గుర్తున్నాడు. నా గురించీ వివరాలు అడిగింది. పెళ్ళయ్యిందనీ, ఇద్దరబ్బాయిలనీ చెప్పాను. పెళ్ళికి పిలవలేదేవిటనీ నిష్టూరంగా అంది. నేను సింపుల్గా గుళ్ళో పెళ్ళి చేసుకున్నానని, ఇంట్లో వాళ్ళని తప్ప ఇంకెవర్నీ పిలవలేదని చెప్పాను.

మా అమ్మ గురించీ, నాన్న గురించీ అడిగింది. అమ్మ పోయి అయిదేళ్ళయిందని చెప్పాను. తనకావిషయం తెలీదని బాధ పడింది. వాళ్ళమ్మకి కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందట. సువర్ణకి మా అమ్మంటే చాలా ఇష్టం. సువర్ణ తల్లీ, మా అమ్మా చిన్నప్పుడు రామచంద్రపురంలో కలిసి చదువుకున్నారు. పెళ్ళయ్యాక అమ్మ అమలాపురం వచ్చేసింది. నాన్న వాళ్ళది ఇందుపల్లి. మేం పుట్టాక చదువుల కోసం అమలాపురం మకాం మార్చేశాడు.

ఇరవయ్యేళ్ళ తరువాత అమలాపురం జిల్లాకోర్టుకి కొత్త జడ్జి బదిలీ మీద వచ్చాడు. నాన్న బార్ అసోషియేషన్‌కి షటిల్ ఆడడానికి వెళ్ళేవాడు. కొత్త జడ్జిగారికీ బాడ్మింటన్ ఆట ఇష్టం అయ్యేసరికి నాన్నతో పరిచయం బాగానే అయ్యింది. అప్పుడు మాటల్లో తేలిందేవిటంటే జడ్జి గారి భార్య, మా అమ్మ చిన్నప్పటి స్నేహితురాలని. అలా ఆ జడ్జి గారు మాయింటికి భోజనానికొచ్చినప్పుడు మొట్టమొదట సారి చూశాను సువర్ణని. నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను. సువర్ణ బి.యెస్సీ రెండో సంవత్సరం అని తెలిసింది. సువర్ణ నా కంటే మూడేళ్ళు పెద్ద.

“పెళ్ళికి పిలవకపోయినా, ఇంకా గుర్తున్నాను. సంతోషం!” అంటూ ఎగతాళిగా అంది. గట్టిగా నవ్వేశాను.

“జీవితంలో మనిషి ఏదయినా మర్చిపోవచ్చు. చిన్నతనాన్ని, కాలేజి రోజులని మాత్రం చివరిదాకా గుర్తుంచుకుంటూనే ఉంటాడు! నీక్కూడా పాతవన్నీ గుర్తుండే ఉంటాయని అనుకుంటాను. లేదని నువ్వంటే మాత్రం నేను నమ్మను,” అని సువర్ణ కళ్ళలోకి చూస్తూ అన్నాను. నా మాటల్లో అర్థం గ్రహించి ఒక్క సారి తలదించుకుంది.

“ఏంటి? ఇంత సన్నబడిపోయావు? డైటింగా?” మాటల మధ్యలో వేళాకోళంగా అన్నాను.

“నీ కోనసీమ వ్యంగ్యం మాత్ర పోలేదు. అయినా నా శరీరం, నా యిష్టం!” అంటూ గట్టిగా పిడికిలితో భుజమ్మీద కొట్టింది.
“తల్లి బ్రతుకు నిస్తే, ఊరు మాట నేర్పుతుందంటారు. అయినా అవన్నీ ఎలా పోతాయనుకున్నావు? వ్యంగ్యం మా జన్మ హక్కు!” అంటూ గట్టిగా చెయ్యి పైకెత్తాను. పిల్లల కాన్పుల వలనా, ముఖ్యంగా కవలల పుట్టాక, తనకి థైరాయిడ్ సమస్య వచ్చిందనీ చెప్పింది.

“దేవుడు మంచి వాడు. నువ్వు లావెక్కి ఎన్నో కాపురాలు నిలబడ్డాయి. లేదంటే యావత్తు మద్రాసు నగరం పిచ్చాసుపత్రుల పాలయ్యేది!”

తనూ నాతో వంత కలుపుతూ గట్టిగా నవ్వింది. కొంతసేపు పాత సంగతులు నెమరు వేసుకున్నాం. నా వివరాలన్నీ తీసుకుంది. వాళ్ళింటికి రమ్మంది కానీ, ఆ సాయంత్రమే నా హైద్రాబాదు టిక్కటు బుక్ చేసుకోవడం వలన మరో సారి వస్తానని చెప్పాను. పెళ్ళిలో భోజనానికి నా పక్కనే కూర్చుంది. ఒక్కతే రావడం వలన నాతోనే మాట్లాడుతూ గడిపింది.

భోజనాలయ్యాక వెళతానంటే కారు వరకూ సాగనంపాను. కారెక్కి డోరు విండో తీస్తూ, మెల్లగా అడిగింది: “వివేక్ ఎలా ఉన్నాడు?”

ఇది నేను ఊహించలేదు. ఇంతకుముందు మాటల్లో ఎక్కడా వివేక్ పేరు ప్రస్తావన రాకుండా మాట్లాడిన సువర్ణ చివర్లో ఆపుకోలేక పోయిందని అనుకున్నాను. ఏం సమాధానం చెప్పాలో తెలీలేదు. నాకున్న అతి దగ్గరి స్నేహితుల్లో వివేగ్గాడు ఒకడు. మా అన్నయ్య క్లాస్మేట్ అయినా నాతోనే వాడికి స్నేహం ఎక్కువ.

“వాడు నీకింకా గుర్తున్నాడా?” అప్రయత్నంగా ప్రశ్న వచ్చేసింది. అవునన్నట్లు తలూపింది. చిన్నగా నవ్వాను.

“వాడెలా ఉంటేనేం? నీకు గుర్తున్నాడు, అదే చాలు!” అనేసి వీడ్కోలు చెప్పి వెనక్కి వచ్చేశాను.

సువర్ణని చూశాక గతమంతా కళ్ళముందు మెదిలింది. నేనూ వివేగ్గాణ్ణి కలిసి పదిహేనేళ్ళు దాటింది. ఇంటరయాక ఇంజనీరింగ్‌కి కాన్పూర్ వెళ్ళాక నాకు అందరితో సంబంధాలు తెగిపోయాయి. వివేగ్గాడు బి.eస్సీ తప్పాడని విన్నాను. అన్నయ్య ఎమ్మెస్సీకని ఆంధ్రా యూనివర్శిటీకి వెళిపోయాడు. నేను ఆఖరు సారి వివేగ్గాణ్ణి కలిసింది ఇంటర్ పరీక్షలయ్యాకే! తరువాత మళ్ళీ కలవలేదు. వాడు ప్రేమ ఊబిలో కూరుకుపోయి కుమిలిపోయాడు. ఇప్పుడెక్కడున్నాడో, ఏవిటో ఏ వివరాలూ తెలీదు.

అన్నయ్యతోనూ వాడికి స్నేహం తగ్గిందనీ విన్నాను. స్నేహాలు చిత్రంగా ఉంటాయి. ఒక్కో దశలో ఒక స్నేహం. ఏది చివరి వరకూ నడుస్తుందో చెప్పలేం. సంపదలూ, బంధాలూ ఎప్పటికీ నిలకడగా ఉండవు.


హఠాత్తుగా ఉన్నటుండి ఎస్.కే.బి.ఆర్ కాలేజీలో భూకంపం కన్నా వంద రెట్ల స్త్రీకంపం వచ్చింది. అటెండరు నుండి, ఆచార్యుల వరకూ అందరూ దాని బాధితులే! స్టూడెంట్స్ అయితే చెప్పనవసరం లేదు. అప్పుడే నిక్కరు నుండి పేంటుకి ప్రమోషన్ వచ్చిన కురాళ్ళ దగ్గర్నుండీ, పెళ్ళీడొచ్చిన పిల్లలున్న పెద్దవాళ్ళ సహితం ఏదో విధంగా మనసు గాయపడినవారే! ఉదయాన్నే ఏడు గంటల కొకసారి, మరలా మధ్యాన్నం పన్నెండున్నరకి మరోసారీ ఈ స్త్రీకంపానికి చెదరిన వారే! అంతవరకూ బుద్ధిగా పుస్తకాల్లోంచి తలెత్తని బుద్ధులు కూడా కాలేజీ గేటు దగ్గర ప్రబుద్ధుల్లా అవతార మెత్తారు.

ఇంతటి కంపనం సృష్టించింది కాలేజీలో కొత్తగా చేరిన సువర్ణ అనే కొత్తమ్మాయి. పసుప్పచ్చ శరీర చాయ, చక్కటి కనుముక్కు తీరూ, నల్ల త్రాచులా నడుం దాటిన జడా: నడిచొచ్చే పాలరాతి శిల్పంలా ఉంది. దానికితోడు ఎంతో అందమైన చీర కట్టు. ఎవరైనా ఒకసారి చూస్తే మరలా వెనక్కి మరోసారి చూడకుండా ఉండలేరు. అమలాపురం కోర్టుకి కొత్తగా బదిలీ అయిన జడ్జిగారమ్మాయని మొదటి రోజే కాలేజీ అంతా టాంటాం అయిపోయింది.

ఈ సువర్ణ రాక గురించి మొట్టమొదట నాకు తెల్సింది మా అన్నయ్య ద్వారానే. మా అన్నయ్యా, వాడి స్నేహితుడు వివేగ్గాడు చెప్పుకుంటూండగా విన్నాను. కోనసీమలో చుట్టుపక్కల ఊళ్ళన్నింటికీ ఎస్.కే.బి.ఆర్ కాలేజీ ఒక్కటే దిక్కు. డిగ్రీ క్లాసులు ఉదయాన్ని, ఇంటర్మీడియేట్ క్లాసులు మధ్యాన్నం ఉండేవి. నేనింకా అప్పుడే ఇంటర్లో చేరినందువల్ల నాకు సువర్ణ దర్శన భాగ్యం కలగలేదు. అన్నయ్యా, వివేగ్గాడు ఇద్దరూ బి.యస్సీ రెండో ఏడు చదువుతున్నారు. ఈ సువర్ణ కూడా వాళ్ళ సెక్షనే అయ్యేసరికి అన్నయ్యా, వివేగ్గాడికి పొద్దస్తమానూ కాలేజీలో సువర్ణ విషయాలే! ఇంగ్లీషు టీచరు ఆమెకు ఎలా లైను వేసేవాడు, మిగతా అల్లరిమూక క్లాసు బయట ఎలా పడిగాపులు కాసేవారు కథలు కథలుగా చెప్పుకునేవారు. హఠాత్తుగా నాన్న ఓ రోజున మా ఇంటికి జడ్జి గారిని భోజనానికి పిలవడంతో మొట్టమొదటి సారి సువర్ణని చూసే భాగ్యం కలిగింది. అంతవరకూ అందం అంటే సిరిసిరిమువ్వ జయప్రద అనుకునే నాకు సువర్ణని చూసాక అర్థం మారిపోయింది.

మొదటి సారి కలిసినప్పుడు కేవలం పరిచయాలే తప్ప ఏమీ మాట్లాడలేదు. అన్నయ్యా, తనూ ఒకే సెక్షన్ అని పరిచయాల్లో అన్నయ్య చెప్పినా, సువర్ణ ఉలుకూ పలుకూ లేదు, ఓ తెచ్చి పెట్టుకున్న నవ్వు తప్ప. మాటల్లో మా నాన్న నేను బొమ్మలు బాగా వేస్తానని చెప్పడంతో సువర్ణ నే వేసిన బొమ్మలు చూపించమంది. నా డ్రాయింగ్ బుక్సన్నీ తీసుకొచ్చి చూపించాను. తనకి బొమ్మలు వేయడం అంటే చచ్చేటంత చికాకనీ, తనకి రాదనీ చెప్పింది. తనకి బోటనీ, జూలాజీల్లో కావల్సినప్పుడు బొమ్మలు వేసిస్తావా? అని నన్ను అడిగింది. నా సొమ్మేం పోయింది. సరే నన్నాను. అలా సువర్ణ నాకు పరిచయమయ్యింది. తరచు మా ఇంటికి బొమ్మలు వేయించుకోడం కోసం వచ్చేది. ఆ విధంగా మా కుటుంబంలో అందరికీ పరిచయం ఎక్కువయ్యింది. అన్నయ్య ద్వారా వివేగ్గాడు పరిచయమయ్యాడు.

నన్నెలా బొమ్మలు వేయడానికి ట్రాప్ చేసిందో, వివేగ్గాణ్ణి కెమిస్ట్రీ చెప్పించుకోడానికి కుదుర్చుకుంది. వివేగ్గాడు వాళ్ళది అంబాజీపేట. రోజు పది కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ కాలేజీకి వచ్చేవాడు. వాళ్ళది మధ్య తరగతి కంటే తక్కువ కుటుంబం. వీడే పెద్ద కొడుకు. వీడికి ఇద్దరు అక్కలున్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి అత్తారింటికెళిపోయారు. వివేగ్గాడు చాలా బాగా చదువుతాడు; తెలివైన వాడు కూడా. ఇంటర్లో కాలేజీ ఫస్ట్ వచ్చాడు. మెడికల్ సీటు వచ్చినా చదివించే స్థోమత లేక వాళ్ళ నాన్న వాణ్ణి పంపలేదు. అలా ఎంతో తెలివైన వాడు కాస్తా బి.యస్సీకే పరిమితం అయిపోయాడు. వివేగ్గాడు సువర్ణకి నోట్సు రాసిచ్చేవాడు. వాడి రాత ముత్యాల కోవలా ఉంటుంది. ఇంకేముంది? సువర్ణ పొగడ్డమూ, మనవాడు తబ్బిబ్బయ్యి చూచిరాత రంగంలోకి దూకడం క్షణంలో జరిగిపోయాయి.

వివేగ్గాడికీ నేనే బొమ్మలు వేసిచ్చేవాణ్ణి. నాకూ, వాడికీ సినిమాల విషయంలో దోస్తీ. మా అన్నయ్యకి సినిమాలంతగా నచ్చేవి కావు. నేను మధ్యాన్నం క్లాసులెగ్గొట్టి మరీ వివేగ్గాడితో కలిసి సినిమాలకి చెక్కేసేవాణ్ణి. సరిగ్గా అప్పుడు మరో చరిత్ర రిలీజయ్యింది. నేను కాకినాడ వెళ్ళినప్పుడు చూసొచ్చాక, వివేగ్గాడికీ, సువర్ణకీ కథ చెప్పాను. అమలాపురంలో ఆ సినిమా ఇంకా రిలీజు కాలేదు. ఓ నాలుగు వారాల తరువాత డీలక్స్ ధియేటర్లోకి వచ్చింది. నేనూ, వివేగ్గాడూ, సువర్ణా, వాళ్ళ చెల్లెలూ అందరం వెళ్ళాం. సరిగ్గా ఆ సినిమానే వివేగ్గాడి జీవితాన్ని మార్చేసింది.

మా కాలేజీకి కొత్తగా ఒక కుర్ర ఇంగ్లీషు లెక్చరర్ వచ్చాడు. పాఠం చెప్పడానికి ముందే సువర్ణని చూసి మనసు పారేసుకున్నాడు. ఉడుకురక్తం కదా? సరాసరి వెళ్ళి సువర్ణని పెళ్ళి చేసుకుంటానని జడ్జిగారిని అడిగాడట. జడ్జిగారు ఇప్పుడే కాదు, తరువాత చూద్దాం అన్నాడని వివేగ్గాడు చెప్పాడు. సువర్ణ కూడా మాటల్లో నాతో అంది. వీళ్ళ మాటల్లో తేలిందేవిటంటే సువర్ణ వివేగ్గాణ్ణి ప్రేమిస్తోందని. వివేగ్గాడికి తెలివితేటలే కాదు, రూపం కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఒకటే అడ్డు. అది కులం. వివేగ్గాడు వాళ్ళూ బ్రామ్మలు. సువర్ణ వాళ్ళూ కాపులు. వీళ్ళ ప్రేమ గురించి నన్నెవరికీ చెప్పొద్దనీ ఇద్దరూ నా దగ్గర ఒట్టు తీసుకున్నారు.

ఇంగ్లీషు లెక్చరర్ సువర్ణని పెళ్ళి చేసుకోడానికి వెళ్ళాడన్న వార్త కాలేజీ అంతా పొక్కి పోయింది. ఎవరు ఎవరికి ఉప్పందించారో తెలీదు, మొత్తం కాలేజీ అంతా మార్మోగింది. గోడల మీదకి ఎక్కలేదంతే! ప్రిన్సిపాల్ రామేశం గార్ని చూసి దడిసి ఎవరూ ఆ పని చెయ్యలేదు. ఈ విషయం జడ్జిగారి వరకూ వెళ్ళే సరికి ఆయన సువర్ణ రాకపోకల కట్టడి చేసేశాడు. మా ఇంటిక్కూడా రావడం పూర్తిగా తగ్గి పోయింది. వివేగ్గాడు క్లాసులో కలిసినప్పుడు మాట్లాడ్డం తప్పిస్తే ఇంకెక్కడా కుదిరేది కాదు. సువర్ణనీ ఈ పుకార్లు కొంత బాధించాయి. అందువల్ల వివేగ్గాడితోనూ కాలేజీలో జాగ్రత్తగా వ్యవహరించేంది. ఎప్పుడైనా బొమ్మలు కావల్సి వస్తే వాళ్ళ డ్రైవరు వచ్చి ఇచ్చేవాడు. నా బొమ్మలతో పాటే వివేగ్గాడి నోట్సులూ, లవ్ లెటర్లూ చేరేవి.

ఓ సారి సువర్ణ పుట్టినరోజయితే నన్ను సువర్ణ ఫొటో బొమ్మేయమని అడిగాడు. నేను ఎవరికంటా పడకుండా, ఆఖరికి మా అన్నయ్యకి కూడా తెలీకుండా బొమ్మ గీసిచ్చాను. ఆ బొమ్మకింద “నిన్ను ప్రేమిస్తున్నాను – ఒక పిచ్చోణ్ణి!” అని రాశాడు. మరో చరిత్ర సినిమా పైత్యం అని అర్థమయ్యింది. వివేగ్గాడు గ్రీటింగ్స్ పంపుతూ, అందులో “ఐ లవ్ యూ!” అని రాశాడు. అది ఎలా వెళ్ళిందో తెలీదు, జడ్జిగారి చేతికి చిక్కింది. మొత్తానికి కాలేజీలో ఉన్న కాపులబ్బాయిలందరూ కలిసి వివేగ్గాడి పేరు రవణం వీధిలో నున్న ఒకతనికి చెప్పారట. దాంతో వాళ్ళు ” మా కాపులమ్మాయికి లవ్ లెటర్ రాస్తావురా?” అని కాలేజీకొస్తున్న వివేగ్గాణ్ణి బండార్లంక పొలిమేరల్లో చచ్చేలా బాది వదిలారు.

ఈ విషయం నాన్నకి తెలిసి జడ్జిగారిని వెళ్ళి, “పాపం వాడేదో తెలియ అలా లవ్ లెటర్ రాస్తే వాణ్ణి చచ్చేలా కొడతారా? మీరెందుకండీ వాళ్ళని పురమాయించారు?” అని అడిగితే జడ్జి గారికి కోపం వచ్చింది. ఆయన ఎవర్నీ పురమాయించలేదనీ చెప్పాడు. ఆస్పత్రిలో ఉన్న వివేగ్గాణ్ణి చూడ్డానికి ఆయనొక్కడే వచ్చాడు. సువర్ణ రాలేదు. వివేగ్గాడు కోలుకోవడానికి నాలుగు వారాలు పైనే పట్టింది. వాళ్ళ నాన్నా, మా నాన్నా వాడికి బాగా చివాట్లు పెట్టారు.

ఓ రోజున సువర్ణ వాళ్ళమ్మా, నాన్నా మా ఇంటికి సువర్ణ పెళ్ళి శుభలేఖతో వచ్చారు. సువర్ణకి మద్రాసులో పెళ్ళనీ, మమ్మల్ని రమ్మనమనీ చెప్పారు. ఇది తెలిసి నేను రాత్రికి రాత్రే అంబాజీపేట సైకిల్ మీద వెళ్ళి వివేగ్గాడి చెవిన వేశాను. వాడయితే కుప్ప కూలిపోయాడు. ఎలాగయినా సువర్ణని కలవాలనీ, అదీ ఎవరి కంటా బడకుండా జరగాలనీ ప్లాన్ వేశాడు. పరీక్షలు దగ్గర పడటంతో కాలేజీకి శలవలు ఇచ్చేశారు. దాంతో సువర్ణని బయట చూళ్ళేదు.

శుభలేఖ చూస్తే తెలిసిందేవిటంటే పెళ్ళికొడుకు వాళ్ళ నాన్నకి మద్రాసులో నాలుగైదు సిమెంట్ ఫ్యాక్టరీలున్నాయి. పెళ్ళికొడుకు ఎం.బి.య్యే చదివాడని మాత్రం ఉంది. ఎవరికీ తెలియకుండా సువర్ణని మద్రాసు తీసుకెళిపోయారు వాళ్ళ తల్లి తండ్రులు. సువర్ణ నుండి ఏ సమాచారం లేకపోయేసరికి వివేగ్గాడు దేవదాసు అవతారం ఎత్తాడు.

సువర్ణ పరీక్షలు రాయలేదు. వివేగ్గాడు పరీక్షలకి వెళ్ళాడు కానీ, ఒక్క పేపరు కూడా రాయలేదని చెప్పాడు. ప్రేమ పిచ్చోడిలా తయారయ్యాడు వాడు.

హఠాత్తుగా ఓ వారం రోజులు ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి పారిపోయాడు వివేగ్గాడు. వాళ్ళ నాన్న పోలీసు రిపోర్ట్ ఇప్పించారు కూడా. ఓ రెండు వారాల తరువాత మాసిన బట్టలతో, బవిరి గెడ్డం వేసుకొని పీనుగులా తయారయ్యి వచ్చాడు. ఆ వాలకం చూసి వాడి అమ్మానాన్న లబో దిబో మన్నారు. వివేగ్గాణ్ణి చూస్తే నాకే భయమేసింది.

ఓ నాలుగు వారాల తరువాత జడ్జి గారు కూతురు పెళ్ళయిన సందర్భంలో వాళ్ళింటికి విందుకి పిలిచారు. అమ్మా, నాన్నలతో పాటు నేనూ వెళ్ళాను. ఎందుకో సువర్ణని చూస్తే పీకల వరకూ కోపం వచ్చింది. దూరన్నుంచే చూశాను తప్ప దగ్గరకి వెళ్ళి పలకరించలేదు. పెళ్ళికొడుకు నల్ల తుమ్మ మొద్దులా ఉన్నాడు. కాకిముక్కుకు దొండపండులా అనిపించారు వాళ్ళిద్దరూ!

అదే ఆఖరు సారి నేను సువర్ణని చూసింది.


మా కంపెనీకి కొత్తగా రీజనల్ సేల్స్ మేనేజరు వచ్చాడని మా ప్రెసిడెంట్ చెబితే కలవడానికి వెళ్ళాను. అతన్ని చూసి ఇట్టే గుర్తు పట్టాను. అన్నయ్యా వాళ్ళ క్లాస్మేట్, ఫణి. నన్ను చూడగానే గుర్తు పట్టాడు. వాడి పూర్తిపేరు ఫణీంద్ర కుమార్. మా అందరికీ ఫణి అనే తెలుసు. నన్ను చూడగానే చాలా సంతోషించాడు. అన్నయ్య గురించి అడిగాడు. వాడు ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నాననీ చెప్పాడు. మా కబుర్లు అమలాపురం చుట్టూ, మా చిన్నతనం వైపు మళ్ళాయి. కుర్రకారు సువర్ణ వెనక ఎలా పడేవారో, కాలేజీ లెక్చరర్లు సైతం ఎలా గుడ్లప్పగించి చూసేవారో చెప్పుకొని నవ్వుకున్నాం. హఠాత్తుగా వివేగ్గాడి ప్రస్తావన వచ్చింది.

వివేగ్గాడి పేరు చెప్పగానే వాడి మొహంలో రంగులు మారిపోయాయి. నెమ్మదిగా చెప్పాడు.

“వివేగ్గాడు పోయి ఆరేళ్ళు దాటింది…”

ఒక్కసారి హతాశుణ్ణయ్యాను. నోట మాట రాలేదు. నేను తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టింది.

“ఏం జరిగింది?”

ఫణికీ సువర్ణా వివేగ్గాడి ప్రేమ గురించీ, వాడు తిన్న తన్నులు గురించీ బాగానే తెలుసు.

“సూసైడ్! వేరీ బాడ్. ఆరేళ్ళ క్రితం ఢిల్లీకి మారకముందు నేను హైద్రాబాదులోనే పని చేసేవాణ్ణి. ఓ సారి నాకు వివేగ్గాడు బ్యాంకులో కనిపించాడు. వాడు హైద్రాబాదు వచ్చేశాడనీ, జీడిమెట్లలో ఒక ఫార్మసూటికల్ కంపెనీలో పని చేస్తున్నాననీ చెప్పాడు. నా అడ్రసూ, అదీ ఇచ్చాను. అప్పుడు చూడ్డానికి బాగానే ఉన్నాడు. మామూలుగా కాదు, చాలా హుషారుగా కనిపించాడు. ఓ రెండు వారాల తరువాత హఠాత్తుగా మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. అర్జంటుగా పదివేలు సర్దగలవా అని అడిగాడు. ఆ వేళ ఆదివారం. బ్యాంకు శలవు కాబట్టి రేపు విత్‌డ్రా చేసి ఇస్తాను, ఆఫీసుకి రమ్మనమని చెప్పాను. అలాగే నన్నాడు. మూడ్రోజులయినా రాలేదు. ఆ సాయంత్రం సినిమాకి వెళ్ళినప్పుడు మా వూరి వీరిగాడు కనిపించి, వివేగ్గాడు సోమవారం నాడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. సరిగ్గా క్రితం రోజే నన్ను కలిశాడనీ, నా దగ్గర్నుండి పదివేలు తీసుకోవడానికి సోమవారం వచ్చేదుందనీ, రాలేదనీ చెప్పాను. వాడికీ వివరాలు తెలీదని వాళ్ళ అక్కవాళ్ళ ఇంటి ఫోన్ నంబరు ఇచ్చాడు. మర్నాడు వాళ్ళింటికి వెళ్ళాను. వాళ్ళక్క నన్ను చూసి బావురుమంది. సోమవారం ఉదయం అందరూ ఆఫీసుకెళ్ళగా చూసి ఎండ్రిన్ తాగి పోయాడని చెప్పి భోరున ఏడ్చింది…” అంటూ ఆగిపోయాడు.

నాకయితే మెదడు స్తబ్దుగా అయిపోయింది. “ఏమయ్యిందట? అంత సివియర్ డెసిషన్ తీసుకోడానికి?” గొంతు పెగల్లేదు.

“ఏముంది? లవ్ ఫెయిల్యూర్! ఎంతో తెలివైనవాడు, సువర్ణ ప్రేమలో పడి నాశనం అయిపోయాడు. దాన్నుంచి తేరుకొని స్థిమిత పడ్డాడనుకుంటే, మరో ప్రేమలో చిక్కుకున్నాడు. ఆ అమ్మాయి మెడికోట. చాలాకాలం నుండే ప్రేమించుకుంటున్నారనీ, ఇద్దరి ఇళ్ళలోనూ తెలుసనీ చెప్పింది వాళ్ళక్క. ఆ అమ్మాయి వాళ్ళన్న డాక్టర్ మొగుడుగా కాంపౌండర్ ఉద్యోగం ఒక్కటే వాడికి సరైనదని హేళన చేశాడట. మనవాడు మరీ సున్నిత ప్రాణి కదా? ఆ అమ్మాయి ఎదుటే కాబోయే బావమరిదితో తగాదాకి దిగాడట. అది చిలికి చిలికి గాలివానయ్యి ఆ అమ్మాయి వీడితో పెళ్ళి కేన్సిల్ అందట. అంతే మనవాడు అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వెరీ పిటీ…”

వింటున్నంత సేపూ నాకు కళ్ళ నీళ్ళు ఆగలేదు. నిజానికి మా అన్నయ్య స్నేహితుడయినా నాతోనే ఎక్కువ చనువుగా ఉండేవాడు. ఎన్నోసార్లు కాలేజీకి నడిచి వెళ్ళాల్సి వస్తే తనూరెళ్ళి పోతున్నా వెనక్కి వచ్చి మరీ నన్ను సైకిలు మీద కాలేజీ దగ్గర దింపేవాడు. వివేగ్గాడు పోయిన సంగతి మా అన్నయ్యకీ తెలీదని అన్నాను.

“తెలీక పోవచ్చు. వాడు అందరికీ దూరంగా అజ్ఞాతవాసంలోకి వెళిపోయాడు. పాపం! రెండు సార్లూ వాణ్ణి ప్రేమే కాటేసింది!” బాధగా అన్నాడు.

“వాళ్ళ పేరెంట్స్ ఎలా వున్నారు?” నాకింకా వివేగ్గాడు తన్నులు తిని ఆసుపత్రిలో ఉన్న క్షణాలు కళ్ళకు కట్టినట్లు గుర్తున్నాయి. ఆ రోజున వాళ్ళ నాన్న గోడకి తలకొట్టుకునీ మరీ ఏడ్చాడు.

“నేను వెళ్ళి నప్పుడయితే వాళ్ళెవరూ కనిపించలేదు. వివేగ్గాడి అక్కలిద్దరూ, తమ్ముడూ మాత్రమే కనిపించారు.”

ఇదంతా విని తేరుకోడానికి నాకు అరగంటపైనే పట్టింది. వివేగ్గాడిది చాలా మంచి మనసు. మంచి వాళ్ళందరికీ సున్నితంగా ఉంటారేమో? తెలీదు. నమ్మితే ప్రాణం ఇస్తాడు. రెండు సార్లు ప్రేమకి బలయ్యాడంటే తెలిసి బాధ కలిగింది.

ఈ మధ్యనే సువర్ణని కలిశానని చెప్పాను. వాడి జీవితం నాశనం అవడానికి సువర్ణే కారణమని అన్నాను. ఈ సారి సువర్ణని కలిస్తే కడిగేస్తాను. వదిలి పెట్టను. ఇదే అంటే ఫణి గట్టిగా నవ్వాడు.

“అదంతా గతం. పైగా వాళ్ళల్లో ఒకరు బ్రతికే లేరు. ప్రశ్నించి ఏం ప్రయోజనం?” ఫణి మాటల్లో నిర్వేదం తొంగి చూసింది.

“సువర్ణకి ఫోన్ చేసి చెప్తావా?” వెళ్ళబోతూంటే ఫణి ప్రశ్నించాడు. లేదన్నట్లు తలూపి అక్కడనుండి లేచాను. మా అన్నయ్యకి మాత్రం ఫోన్ చేసి విషయం చెప్పాను.


ఓ నెల్లాళ్ళ తరువాత అనుకోకుండా మద్రాసు పని పడింది. ఈ సారి సువర్ణని కలవడానికే నిశ్చయించుకున్న్నాను. అడ్రసూ, ఫోన్ నంబరూ మరోసారి నోట్ చేసుకున్నాను. ఆఫీసు పనులన్నీ పూర్తయ్యాక ఓ రోజు సువర్ణకి ఫోన్ చేశాను. ఊహించినట్లుగానే వాళ్ళింటికి రమ్మనమంది. సాయంత్రం వెళ్ళాను.

నా దృష్టిలో వివేగ్గాడి జీవితం నాశనం చేసింది మాత్రం సువర్ణే! నిక్షేపంలాంటి వాణ్ణి ప్రేమ పేరుతో సమూలంగా నాశనం చేసేసింది. ఆ రోజు పెళ్ళిలో కడిగేద్దామని నోటి వరకూ వచ్చి ఆగిపోయాను. ఈ సారి నా కోపాన్ని వెళ్ళగక్కుతాను, ఆమె ఏమనుకున్నా సరే!

వెళ్ళేసరికి పిల్లల్ని తీసుకొని భర్త సినిమాకి బయల్దేరబోతున్నాడు. సువర్ణ నన్ను పరిచయం చేసింది. నా గురించి సువర్ణ చెప్పిందనీ అన్నాడు. సువర్ణ ఆడపిల్లలిద్దరికీ సువర్ణ పోలికలే వచ్చాయి. చిన్నప్పటి సువర్ణ కళ్ళముందు మెదిలింది వాళ్ళని చూస్తే! పిల్లాడిది మాత్రం తండ్రి పోలిక.

నాకోసమే సువర్ణ సినిమాకి వెళ్ళకుండా ఆగిపోయిందని మాటల్లో అర్థమయ్యింది. వాళ్ళొచ్చేవరకూ డిన్నర్‌కి ఆగవద్దని చెప్పాడు సువర్ణ భర్త. అయినా నేను ఒక గంట మాత్రమే ఉంటానని చెప్పాను.

ఇల్లు చాలా పెద్దది. ఇంట్లో వాళ్ళ సంపద, వైభవం అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంటినిండా పనివాళ్ళూ అటూ, ఇటూ తిరిగుతూ కనిపించారు. ఇద్దరమూ మెల్లగా లాన్లో ఉన్న కుర్చీల వైపు నడిచాం. కాఫీ, టిఫెనూ తీసుకురమ్మనమని నౌకరికి చెప్పింది. అమ్మావాళ్ళ గురించీ, నా గురించీ మళ్ళా అడిగింది. అన్నయ్య వివరాలూ అడిగింది. ఎక్కడా వివేగ్గాడి పేరు ఎత్తకపోయేసరికి అరికాలి మంట నెత్తికొచ్చింది. ఒక్కసారి ఆపుకోలేక పోయాను.

“ఎందుకలా చేశావు సువర్ణా?” నా గొంతు మారింది.

ఆశ్చర్యపోతూ ఏవిటన్నట్లు చూసింది.

“అదే! వివేగ్గాణ్ణి ఎందుకలా తన్నించావు? నిజం చెప్పు నువ్వూ వాణ్ణి ప్రేమించలేదూ?”

నా మాటలు విని తలదించుకుంది. ఆమె కంట్లోంచి కన్నీళ్ళు రాలడం గమనించాను.

“రావుడూ, వయసురా! తెలిసీ తెలియని వయసు. అందం – ఐశ్వర్యం – అహంకారం ఇవి అప్పట్లో నాలో నరనరాన జీర్ణించుకుపోయాయి. నీతో బొమ్మలు వేయించుకోవడానికి స్నేహం చేసినట్లుగానే, వివేక్‌ని నా చదువులో సాయానికి వాడుకున్నాను. నాకు తెలుసు నేను అందంగా ఉంటాననీ, నా వెనుకే మొత్తం కాలేజీ వెంటపడుతోందని. మొదట్లో వివేక్‌ని ప్రేమించని మాట వాస్తవం. కానీ అతని అమాయకత్వం, సున్నితత్వం చూశాక నాలో మార్పొచ్చింది. తీరా అనుకోని సంఘటనల వలన వివేక్‌ని మా కులం వాళ్ళు చావబాదారు. అప్పుడు ఆసుపత్రికెళ్ళి చూసొస్తానని ఎంత గోల పెట్టినా మా వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మ చస్తానని బెదిరించింది. ఒక దశలో వివేక్‌ని పెళ్ళి చేసుకోవడం అసంభవం అని నిర్ధారణకొచ్చేశాను.

ఈలోగా నాన్న పెళ్ళి సంబంధం తీసుకొచ్చారు. తీరా పెళ్ళి వారొచ్చాక పెళ్ళికొడుకు నల్లగా ఉన్నాడు. నచ్చలేదని నేనే చెబుదామని అనుకుంటూండగా, ఆ పెళ్ళికొడుకే నేను నచ్చలేదని చెప్పడంతో ఖంగు తిన్నాను. వాళ్ళ పేరెంట్స్ గట్టిగా చెప్పడంతో అతను నాతో మాట్లాడాలని అన్నాడు. నేను అందంగా ఉండడం చూసే తను పెళ్ళి చేసుకున్నానన్న భావన నాకు కలిగితే అతను భరించలేనని చెప్పాడు. ఆ క్షణంలో ఎందుకో అతని మాటలు నా అహాన్ని శూలాల్లా గుచ్చాయి. నన్నే కాదంటాడా? పెళ్ళి చేసుకొని బుద్ధి చెప్పాలనీ, అంతగా గొడవలు జరిగితే వివేక్ ఎలాగూ ఉన్నాడు కదాని ఒక భయంకరమైన ఆలోచన చేసి పెళ్ళికి సరేనన్నాను. పెళ్ళయిన మూడో రోజే తెలిసింది అతను ఎంత సంస్కార వంతుడోనని. అతని గురించి వాళ్ళ వాళ్ళందరూ ఎంతో ఉన్నతంగా చెబితే ఆశ్చర్యపోయాను. కొంతకాలం చూద్దాంలే అనుకొని నిమ్మకున్నాను.

అతనికీ చచ్చేటంత ఆస్తి ఉంది. హనీమూన్కని ఊటీ వెళ్ళాం. సరిగ్గా అక్కడ వివేక్‌ని చూసి ఆశ్చర్యపోయాను. నా గురించి విలవిల్లాడిపోయాడు. నేను లేకుండా బ్రతకలేనని ఏడ్చాడు. ఏం చెయ్యలేని అసహాయుణ్ణని తిట్టుకున్నాడు. అంతవరకూ నాకు వివేక్ అంటే ఉన్న అభిప్రాయం మారిపోయింది. ఒక్కసారి నేనేం కోల్పోయానో అర్థమయ్యింది. కానీ అప్పటికే చేయి జారిపోయింది. అందర్నీ కాదనీ వివేక్‌తో వెళితే ఇంకో వ్యక్తిని పెళ్ళి పేరుతో మోసం చేస్తున్నాను. ప్రేమ పేరుతో వివేక్ ఎలాగూ బలయ్యాడు. నన్ను మర్చిపోమని చెప్పి వచ్చేశాను.

…నా కేదయినా గిల్టీ ఉండంటే అది వివేక్ పట్ల నా ప్రవర్తనకే! ఎన్నో సార్లు గుర్తుకొచ్చాడు, కానీ మర్చిపోలేక పోయాను. మొన్న సారి కలిసినప్పుడు కూడా అతని ఎడ్రస్ అడుగుదామనుకొని ఆగిపోయాను. ఎక్కడో అక్కడ సుఖంగా ఉన్నాడు. మళ్ళా నేను రాళ్ళు వెయ్యడం ఎందుకని ఆగిపోయాను. హనీమూన్ అయ్యి మద్రాసు వచ్చాక మా హస్బెండుకి జరిగినదంతా చెప్పాను. ప్రేమకీ, ఆకర్షణకీ తేడా తెలియని వయసది. పూర్ వివేక్! నన్ను నమ్మి మోసపోయాడు. పోనీలే ఎక్కడో అక్కడ క్షేమంగా ఉన్నాడనుకొని సంతోషిస్తాను. ఈ సారి ఎప్పుడయినా కలిస్తే ఒకటే అడుగుతాను…” అంటూ ఆగిపోయింది.

సువర్ణ చెప్పింది శ్రద్ధగా విన్నాను. ఏవిటని మరలా రెట్టించలేదు. ఇంత చెప్పినా కూడా నాకు సువర్ణ మీద కోపం పోలేదు. ఎప్పటికీ నేనామెను క్షమించను. అందుకే వివేక్ గురించి వివరాలు చెప్పదల్చుకోలేదు.

డిన్నర్ రెడీ అని నౌకరు వచ్చి చెబితే ఇద్దరం లేచి ఇంటి వైపుగా వెళ్ళాం. భారీకాయంతో మెల్లగా ఆయాసపడుతూ నడిచింది సువర్ణ. డిన్నర్ అయ్యాక బై చెప్పి వచ్చేస్తుండగా గదిలో గోడపైన సింహద్వారం మీద పెద్ద ఫొటో ఫ్రేమ్ కేసి పరాగ్గా చూసి ఆగిపోయాను. అది ఇక్కడకెలా వచ్చిందాని ఆశ్చర్యపోయాను. అది సువర్ణ బొమ్మ. నేను వివేగ్గాడికి గీసిచ్చిందే. వెళ్ళబోతూండగా చెప్పకతప్పదన్నట్లుగా చెప్పింది.

“రావుడూ! నీకో నిజం చెప్పాలి. వివేక్ లవ్ లెటర్ మావాళ్ళకి లీక్ చేసింది నేను కాదు? మా అమ్మానాన్నా కూడా కాదు…”

“మరి?”

“మీ అన్నయ్య.”