జ్ఞాపకాల వాసన

నా దగ్గర చాలా జ్ఞాపకాలు వున్నాయి. గుట్టలు గుట్టలుగా ఒకదాని మీద ఒకటి పడి! కొన్ని జేబులో కొన్ని పర్సులో… కాస్త పాతబడ్డవైతే అరమరలో, ఇంకా పురాతనమైనవి ఎక్కడో నూతిలోనో, పాత ఉత్తరాల కట్టలోనే, చాలాకాలంగా చూడని ఫోటో ఆల్బంలోనో… ఎక్కడో వుంటాయి. హాలులో, బెడ్రూములో, వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ!

కొన్ని జ్ఞాపకాలు రకరకాల వస్తువులకు అతుక్కోని వుంటాయి. గరిటెకు కొన్ని, రేజర్‌కి కొన్ని, వాడకుండా వదిలేసిన కాండోమ్‌కి కొన్ని. కొన్నేమో గాల్లోనే వేలాడుతుంటాయి. ఇంక బాత్రూములో అయితే ఎన్నుంటాయో చెప్పలేను. అవన్నీ కడిగేసుకున్నవని నేననుకుంటాను. అవేమో తూముల్లోంచి బయటికి పోకుండా అక్కడే పడుంటాయి. తడిసిపోయి నానుతూ… చిరాకేస్తుంది వీటన్నింటిని చూస్తే!

ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక జ్ఞాపకాన్ని తీసుకోని చూద్దామనుకుంటానా, దానికి అతుక్కోని ఇంకోటి వస్తుంది. దాన్ని అందుకుంటే ఇంకోటి అతుక్కుంటుంది. అలా అలా అక్కడ వున్నవన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోని కొండచిలవలా నన్ను చుట్టుకుంటాయి. వీటిని కలిపి వుంచిన దారాన్ని తెంచి పడేద్దామని అనిపిస్తుంటుంది ఒకోసారి. కానీ ఆ దారం ఎక్కడుందో తెలిసి చావదు!

ఇలా కాదని ఒకసారి వాటన్నింటిని సర్ది పద్దతిగా అమర్చుకుందామనుకున్నాను. మంచి జ్ఞాపకాలకు చక్కగా అట్టలేసి అందంగా తయారు చేయాలి. పనికిరాని పిచ్చి జ్ఞాపకాలని వీలైతే తగలబెట్టేయాలి. కనీసం కనపడకుండా ఎక్కడన్నా దాచేయాలి. ఇదీ ప్రణాళిక. అనుకున్నట్టే ఓ టేబుల్ సొరుగులో వున్న జ్ఞాపకాలన్నీ సర్దాను. మంచివి చక్కగా షోకేసులో అమర్చిపెట్టాను. బాలేనివి ఎక్కడన్నా పడేద్దామని చూస్తున్నా. చెత్తబుట్టలో వేద్దామంటే అప్పటికే అక్కడ చాలా జ్ఞాపకాలు పేరుకుపోయి వున్నాయి. పరుపు ఎత్తి దానికింద పెడదామంటే అక్కడ కుళ్ళిపోయిన జ్ఞాపకాలు పేరుకుపోయున్నాయి. వీటిని ఏం చేద్దాంరా భగవంతుడా అని ఆలోచిస్తూ నిలబడ్డాను.

అదిగో, అప్పుడే వచ్చాడు వాడు!

వాడు వచ్చాడంటే నాకు వణుకు పుడుతుంది. ఎప్పుడూ అంతే!

ఒకసారి ఇలాగే వచ్చాడు. ఆ రోజు నేను లాయరయ్యాను. నల్లకోటు అదీ వేసుకోని సెక్షన్ ఫోర్ట్వంటీ, త్రీనాట్టూ, టూనాట్ఫోరూ గట్రా నెంబర్లన్నీ దొర్లించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతున్నాను. వాడు అప్పుడు వస్తాడని నాకు తెలుసు. వచ్చి రాగానే వాణ్ణి ముద్దాయి బోనులోకి ఎక్కించేసి యువరానర్! అని గట్టిగా వాదించేయాలని నా ప్లాన్. వాడు వచ్చాడు. నల్లకోటు, తెల్ల చొక్కా వేసుకోని వున్నాడు.

“ఇదేంట్రా? నువ్వూ లాయరేనా?” అన్నా.

“ఒకసారి చూసుకో,” అని కోటు చాటు నుంచి పెద్ద అద్దం తీశాడు. వాడి దగ్గర ఎప్పుడూ ఒక అద్దం వుంటుందని నాకు తెలుసు కాబట్టి నేను ఆశ్చర్యపోలేదు. కానీ అద్దంలో కనపడ్డ నన్ను చూసి ఆశ్చర్యపోయా. నేను ముద్దాయి గెటప్‌లో వున్నాను. చేతులకి బేడీలూ అవీ. ఎంత ప్రయత్నించినా నాకు ఒక్క సెక్షన్ కూడా గుర్తు రాలేదు. ముఖానికి మసి పూసినట్లు నల్లగా వుంది.

వాడు గట్టిగా, “యువరానర్!” అన్నాడు.

“రేయ్ వద్దురా… నన్ను వదిలేయ్,” అన్నాను. వాడు ఒప్పుకోలేదు. వాదించాలన్నాడు.

“యువరానర్, నన్ను కాపాడండీ,” అన్నాను జడ్జి వైపు తిరిగి. చూస్తే వాడే జడ్జి.

ఇంకేం చేసేది? శిక్షవేసి పోయాడు. ఆ కోర్టు కాగితం కూడా ఎక్కడో జ్ఞాపకాల మధ్యలో కుక్కేశాను.

వెధవ, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు.

“ఏం చేస్తున్నావ్,” అన్నాడు.

“ఏం లేదే!” అన్నా చేతులు వెనక్కి పెట్టుకోని. వాడు నా వెనకే వున్నాడన్న సంగతి గమనించుకోలేదు. ఓ కట్ట జ్ఞాపకాలను తీసుకున్నాడు. అవన్నీ పారేద్దామనుకున్నవే. ఓ మూడు నా ముఖం మీద కొట్టాడు. అవి నా నుదుటిలో నుంచి దూరి, మెదడులో చేరి పురుగులుగా మారిపోయాయి. లోపలెక్కడో తొలుస్తున్న బాధ. అక్కడితో ఆగలేదు వాడు! మిగిలినవన్నీ ఇల్లంతా చల్లేసి పోయాడు.

వాడు వెళ్ళిపోయిన తరువాత కూడా ఇల్లంతా ఒకటే జ్ఞాపకాల వాసన. ఆ వాసనతో పడలేక ఎక్కడో మూల పడిపోయిన నాలుగు మంచి మంచి జ్ఞాపకాలను ఏరుకోని అక్కడ్నుంచి బయటపడ్డాను. దగ్గర్లో ఏదో పార్క్ కనపడితే అక్కడ చేరి, తెచ్చుకున్న మంచి జ్ఞాపకాలను లాన్ మీద మెత్తగా వుండేట్టు పరుచుకోని దాని మీద పడుకున్నాను. నేను గమనించనే లేదు. నాలుగు మంచి జ్ఞాపకాలతో పాటు, నలభై చెత్త జ్ఞాపకాలు కూడా అతుక్కోని వచ్చినై. అవన్నీ కలిసి ఒక దుప్పటిలా మారి నా మీద పరుచుకున్నాయి. మళ్ళీ ఆ దరిద్రపుగొట్టు వాసన. వాడు వచ్చినట్లున్నాడు.

“మనం ప్రేమికులం,” అన్నాడు.

“నేను ప్రియుణ్ణా?” అడిగా.

“అవును. నేను ప్రేయసి,” చెప్పాడు.

“ఐ లవ్యూ,” అన్నాను.

“అంటే?”

“అదే ప్రేమికులం అన్నావు కదా? అందుకే ప్రేమిస్తున్నానని చెప్పాను.”

“ఏదీ ప్రేమించు.”

“ఎనీథింగ్ ఫర్యూ డార్లింగ్.”

“మాల్‌లో షాపింగ్.”

“ఓస్ అంతేనా?”

“బంగారం, ఒక ఫ్లాట్, ఒక బిజినెస్.”

“తీసుకో బుజ్జీ నీకన్నానా? మరి నాక్కావల్సింది ఇస్తావా?” అన్నా లస్టీగా.

“మరి నాకో?” వెనుక నుంచి వినపడింది. తిరిగి చూస్తే వాడే. “ఇప్పుడు పెళ్ళాన్ని,” అన్నాడు.

“ఛీ ఎదవన్నర ఎదవా. ఏబ్రాసి నా కొడకా. సుఖంగా వుండనీవారా నన్ను!” బట్టలన్నీ విప్పేశా. ఒక్కో బట్ట విప్పుతుంటే ఒక్కో కొత్త బూతుమాట తన్నుకొచ్చింది. నా పెళ్ళాంగాడిని చావగొట్టా.

వాడు నవ్వేసి “పోయొస్తా,” అన్నాడు.

“మళ్ళీరాకురరేయ్, చెత్తనాయలా!” అన్నా గట్టిగా. పార్కులో వున్నవాళ్ళంతా నన్నే చూస్తున్నారు. మళ్ళీ బట్టలేసుకోని బయల్దేరా.

వాణ్ణి తప్పించుకోవాలంటే ఊరు దాటిపోడమే మార్గమని ఓ బస్సెక్కా. వేరే వూర్లో బస్సు దిగగానే ఆటోవాడు తగులుకున్నాడు. వాడే. ఈ సారి ఆటోవాడయ్యాడు. కనపడగానే నమస్తే చెప్పి, ప్రయాణం ఎలా జరిగింది సార్, అని అడగాలా? అదేం లేదు.

“పక్క వీధికేగా? మూడొందలు ఇవ్వండి,” అన్నాడు.

“నీకు బుద్ధుందా? పక్క వీధికి మూడొందలు అడుగుతున్నావ్? మీటరెంతవుతుందో తెలుసా?” గట్టిగా అరిచా. వాడు ఆటో దిగాడు. ఖాకీ చొక్కా శరీరాలు మారింది.

“పోనీ లాడ్జిలో దిగుతారా? పది రూపాయిలివ్వండి చాలు. ఏ ప్రాబ్లం రాని లాడ్జి వుంది,” అన్నాను నేను.

“ఏమే వస్తావా?” అన్నాడు.

మళ్ళీ మారింది. ఇప్పుడు నేను లం… తప్పు తప్పు… వేశ్య… ఊహూ కాదు కాదు, కాల్ గర్ల్.

లాడ్జికి వెళ్ళాం. వాడు బట్టలు విప్పి నా మీదకి దూకాలా? ఏం లేదు. నేనే విప్పుకున్నా. నేను విటుడు, వాడు సెక్స్ వర్కర్. కాదు కాదు, లం…!

“ఏమే రోజుకి ఎంత మంది వస్తారు?” దాని దీన చరిత్ర తెలుసుకోని జాలి పడిపోవాలని నాకు ఆరాటం. మూడు వేళ్ళు చూపించాడు వాడు. నాకు నచ్చలా. నాకు నచ్చలేదన్న సంగతి వాడికి తెలిసింది. మిగిలిన వేళ్ళు కూడా తెరిచాడు. ఇంకో చేతిని కూడా తెరిచి చూపించాడు.

“అయ్యో పాపం,” అన్నాను.

“అసలెందుకు దిగావు ఈ రొంపిలోకి?” అడిగాను. అది ఏదో దీనగాధ చెప్తుందని ఎదురు చూశా.

“నా మొగుడే నన్ను తార్చాడు. ఇప్పటికీ వస్తాడు. వాడికి ఫ్రీ. మిగిలిన వాళ్ళ ఇచ్చినదాంట్లో వాడికి కమిషన్. ఇద్దరు పిల్లలు. స్కూల్‌కి వెళుతున్నారు. వాళ్ళకోసమే నేను పక్కలెక్కుతున్నాను,” ఏడుస్తూ చెప్పాడు వాడు.

“అయ్యయ్యయ్యో… లోకం ఎంత దుర్మార్గంగా మారిపోయింది. సరే. నువ్వు నా పక్కలో పడుకోకపోయినా సరే ఇదిగో వెయ్యి రూపాయలు. ఉంచుకో,” అనేసి నేను బయటికి నడిచాను. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది.

నేను కూడా ఏడుస్తున్నాను. కాదు నేనే ఏడుస్తున్నాను. ఒక్కసారి నా దొంగ ఏడుపు ఆపి గట్టిగా నవ్వుకున్నాను.

“పిచ్చి నా బకరా! పడక మీద ముండమాటలు విని వెయ్యి రూపాయిలిచ్చాడు,” అన్నాను గట్టిగానే. డబ్బులు జాకెట్లో తోసుకున్నాను. వాడు విటుడు. బయటికెళ్ళిపోయాడు. నేను మంచం మీద వేశ్యను.

థూ! ఈడి బతుకు చెడ!

లేచి అక్కడ్నుంచి పారిపోయాను. ఒకటే పరుగు. వాడు దొరకలేదు. చేతిలో చూసుకుంటే మా వూరికి టికెట్. తప్పక రైలెక్కా.

నా ఎదురుగా ఒక ఆంటీ కూర్చోని వుంది. జాగ్రత్తగా గమనించి చూశా. అనుమానం మొదలైంది. వాడే అయ్యుంటాడని అనుకున్నా. ఆమె చదువుతున్న పుస్తకం దించి నన్ను చూసి చిలిపిగా నవ్వింది.

రేయ్, నాకు తెలియదనుకున్నావా. ఈ సారి చచ్చినా నీ మాయలో పడను అనుకున్నా. నేను నవ్వలేదు. ఆంటీ ఏమనుకుందో మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసింది. నేనే గెలిచా. వాడు ఓడిపోయాడు. రైలు పొందుగుల స్టేషన్ దాటి ముందుకు పోతోంది.

ఇంతలో ఏదో జ్ఞాపకాల వాసన. ఉడకబెట్టిన శెనక్కాయల వాసన. శెనక్కాయలమ్మే నడివయసామె వచ్చింది. బుట్ట దించి నా ముందు పెట్టింది. చూద్దును కదా బుట్టనిండా నా జ్ఞాపకాలే! వాడు శనక్కాయల రూపంలో వచ్చాడా? కాదు, కాదు! శెనక్కాయలమ్మేదానిలాగా… అవును వాడే. ఆమె చీర గుండెల మీద నుంచి జారిపోయి ఇంకేవో కొత్త జ్ఞాపకాలను నా ముందు పరిచింది. వాడు నా చొక్కా పట్టుకున్నాడు.

“ఏరా ఎలా కనిపిస్తున్నారా నీకు?” అంటూ నా దవడలు వాచిపోయేలా కొట్టాడు.

“నేనేం చేశాను?” అన్నాను అమాయకంగా.

“ఏమైందమ్మా?” అంది ఎదురుగా కూర్చోనున్న ఆంటీ.

“వీడు నా నడుం మీద చెయ్యేసి గిల్లాడు. ఎదవ నా కొడుకు,” అంది మరో రెండు దెబ్బలు కొట్టి.

నేను ఆమె నడుం మీద చెయ్యేశానా? అబద్ధం అంతా అబద్ధం అందామనుకున్నా. చుట్టూ వున్న జనం నన్ను పురుగుని చూసినట్లు చూస్తున్నారు. చూస్తున్నారా? లేకపోతే నేనే అలా అనుకున్నానా? అంతా పిచ్చి. ఎవడికి పట్టింది? అందరూ చిలిపిగా నవ్వుతున్నారు. ఎవరో పైన బెర్తులో గట్టిగానే నవ్వారు. తల ఎత్తి చూశా. వాడే. నా ఎదురుగా వున్న ఆంటీ పైన బెర్తులో పడుకోని నవ్వుతున్నాడు. నవ్వేటప్పుడు వాడి చూపంతా ఆంటీ గుండెల మీదే వుందన్న సంగతి నేను మాత్రమే గమనించాను.

ఇంక అక్కడే వుంటే ప్రమాదమని అర్థం అవడంతో ట్రైన్లో నుంచి దూకేసి, ఎగురుకుంటూ సికింద్రాబాద్ చేరుకున్నాను. అక్కడ దిగగానే నేరుగా ఇంటికి పోయాను. ఇప్పుడు నాకు అర్జంటుగా ఆడది కావాలనిపించింది. పెళ్ళాం ఒకతి వుందిగా. ఇంట్లో నేను నా పెళ్ళాంతో వుంటే వాడు వస్తాడన్న భయం కూడా వుండదు. అదీ నమ్మకం. అదీ ఒప్పందం.

“రావే,” అన్నాను ఇంట్లోకి అడుగుపెడుతూనే.

“వద్దండీ,” అంది పెళ్ళాం.

“నీయమ్మ! రమ్మంటుంటే!” నేను చొక్కా విప్పాను.

“ఒంట్లో నలతగా వుందండీ.”

“దొంగ వేషాలెయ్యకే. దొంగముండా!” నేను బనీను విప్పాను.

“అయ్యో.. ఏమిటండీ ఈ పని!”

“నీ యమ్మని…” ప్యాంటు కూడా విప్పాను.

ఆ తరువాత… పదకొండు నిముషాల తరువాత వాడు నాపై నుంచి లేచాడు. నా ఒళ్ళంతా నొప్పులు. ఎక్కడెక్కడో చురుక్కుమంటోంది. గోళ్ళు దిగాయో, పళ్ళు దిగాయో. తొడల మీద జిగటగా రక్తం.

వాడు నవ్వాడు.

“నేను కదరా అక్కడుండాల్సింది!” అన్నాను నిస్సహాయంగా, కోపంగా, కసిగా.

వాడు మళ్ళీ నవ్వాడు.

“వస్తా,” అన్నాడు వెళ్ళిపోతూ.

“మళ్ళీ రావద్దురరేయ్, ముండనాయాలా!” అరిచా గట్టిగా. నొప్పితో స్పృహ గిలగిలా తన్నుకుంటూ వుండిపోయా.

వాడు వదిలిపెట్టిన పురుగులు ఇంకా మెదడు లోనే తిరుగుతున్నాయి. క్రమక్రమంగా అవి నా బుర్రను తొలవటం మొదలుపెట్టాయి. జ్ఞాపకాల పురుగులు. ఎలా వదిలించుకోవాలి? ఏం చేస్తే ఇవన్నీ చచ్చిపోతాయి? వాడు మళ్ళీ రాకుండా, ఇవన్నీ లేకుండా చెయ్యాలి.

నేను లేచాను. శరీరంలో నొప్పుల స్థానంలో ఎక్కడలేని బలం పుట్టుకొచ్చింది. ఇంట్లో వున్న జ్ఞాపకాలన్నీ సేకరించడం మొదలుపెట్టాను. చీపురుతో ఊడ్చాను, బూజు కర్రతో దులిపాను. గుట్టగుట్టలుగా జ్ఞాపకాలు పేరుకున్నాయి. కొన్నింటిని బలంగా కొడితేకానీ కదలేదు. కొన్ని తెగిపడ్డాయి. అలా తెగిపడ్డవాటి చివర్లలో రక్తం కనపడేకొద్దీ నాలో కసి ఇంకా పెరిగిపోతోంది. అన్నింటినీ ఒక చోట చేరి అగ్గిపుల్ల వెలిగించాను.

“వద్దురా… ప్లీజ్!” అన్నాడు వాడు.

“నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఈ రోజు నీకు మూడింది,” అన్నాను, వెలిగించిన అగ్గిపుల్లని జ్ఞాపకాల మీద పెడుతూ.

భగ్గున అంటుకుంది. హాహాకారాలు. భగభగ మంట పైకి లేచింది. వళ్ళంతా చురచురలాడుతోంది. అబ్బా… ఇదేమిటి మంటలన్నీ నా మీద? తగలబడుతోంది నేనే. జ్ఞాపకాలు కావు.

వాడు ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. ఇప్పుడు నా జ్ఞాపకాలు ఎక్కడున్నాయో కనపడలేదు. నేను కాలుతున్నాను. వాడు నవ్వుతున్నాడు.

“జ్ఞాపకాలని కదరా తగలబెట్టాను,” అన్నాను నేను.

“నువ్వే నీ జ్ఞాపకానివి,” అన్నాడు వాడు వెళ్ళిపోతూ.

వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను. నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి.