కందభేద శ్రీకృష్ణస్తోత్రము

ప్రాకృతపైంగలములో ఖందా లేక స్కంధకమునకు క్రింది విధముగా 29 (28+1) భేదములు చెప్పబడినవి. అందులోని ప్రతియొక్క భేదమును వివరించి శ్రీకృష్ణపరముగా ఒక లఘు స్తోత్రకావ్యమును వ్రాసినాను. దీనిని చదివి ఒక రెండు దోషములను సవరించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావుగారికి నా కృతజ్ఞతలు.

ణందఉ భద్ధఉ సేస సారంగ సివ బంభ వారణ వరుణ
ణీల మఅణ తాలంక సేహరు సరు గఅణు సరహు విమఇ ఖీర
ణఅరు ణరు సిద్ధ ణేహలు
మఅగలు భోలఉ సుద్ధ సరి కుంభ కల ససి జాణ
సరహ సేస ససహర గుణహు అట్ఠాఇస ఖంధాణ – (ప్రాకృతపింగలసూత్రం, 1.64)

సంస్కృత ఛాయ –
నంద భద్ర శేష సారంగ శివ బ్రహ్మ వారణ వరుణాః
నీల మదన తాలంక శేఖర శర గగన శరభ విమతి క్షీరాణి
నగర నర స్నిగ్ధ స్నేహాః
మదకల భూపాల శుద్ధ సరిత్ కుంభ కలశ శశినో జానీహి
శరభ శేష శశధరాః జానీన అష్టావింశతిస్కంధకాః

లఘు-గురువుల సంఖ్య, కందభేదముల పేరులు క్రింది పట్టికలో చూపబడినవి.

4, 30 నంద
6, 29 భద్ర
8, 28 శేష
10, 27 సారంగ
12, 26 శివ
14, 25 బ్రహ్మా
16, 24 వారణ
18, 23 వరుణ
20, 22 నీల
22, 21 మదన
24, 20 తాడంక
26, 19 శేఖర
28, 18 శర
30, 17 గగన
32, 16 శరభ
34, 15 విమతి
36, 14 క్షీర
38, 13 నగర
40, 12 నర
42, 11 స్నిగ్ధ
44, 10 స్నేహాలు
46, 9 మదకల
48, 8 లోల (భూపాల)
50, 7 శుద్ధ
52, 6 సరిత్
54, 5 కుంభ
56, 4 కలశ
58, 3 శశీ
60, 2 యాన

(1) 4, 30 నంద
శ్రీరంగేశా దేవా
క్షీరాబ్ధిన్ జిందులాడు – చిద్రూపా సం
సారాబ్ధిన్ దాఁటంగన్
రారా మా నావ నీవె – రాధాస్వామీ.

నిత్యానందా దేవా
సత్యాత్మా చారుహాస – సాలంకారా
అత్యంతోదారా చి-
త్ప్రత్యూషశ్రీల నిమ్ము – ప్రాణాధారా.

(2) 6, 29 భద్ర
లీలాకృష్ణా నే నిన్
లాలింతున్ రమ్ము, నిండ – లాలిత్యమ్ముల్
డోలన్ దూఁగింతునురా
తేలన్ జేతున్ సుధాబ్ధిఁ – దృష్ణన్ దీర్తున్.

భద్రాదేవీ తల్లీ
భద్రాదేవీ ప్రియాంగి – భద్రా చెల్లీ
భద్రా యనుఁ గృష్ణుండా,
భద్రమ్మై కావు మమ్ము – భద్రాకారా.

(3) 8, 28 శేష
బృందారణ్యమ్మందున్
జిందుల్ వేసేను వెల్గు – చిందన్ శ్రీగో
విందుం డానందుండై
సుందర నారులను గూడి – సొంపుల్ మీఱన్.

శేషుండే భ్రాతాయెన్
వేషమ్ముల్ దాల్చి మీరు – వ్రేపల్లెన్ వి-
ద్వేషమ్ముల్ నిండఁగ బల్
దోషమ్ముల్ జేయువారిఁ – ద్రొక్కన్ జనిరా?

(4) 10, 27 సారంగ
విన్నావా కన్నయ్యా
యన్నయ్యయు జెప్పె నీదు – నాగడముల య-
న్నన్నా బిల్తున్ నే గు-
మ్మన్నన్ వేగమ్ము చూడు – మన్నించన్ నేన్.

సారంగమ్మున్ జూడం
గా, రమ్మో కృష్ణ యంచుఁ – గాంతలు జెప్పన్
సారంగ మ్మెందంచున్
శ్రీరంగం డడిగి విరిని – వ్రేలన్ జూపున్.

(5) 12, 26 శివ
గోపాలా నీవేగా
మాపాలికి నండదండ – మంగళరూపా
కాపాడంగా రావా
శ్రీపాదమ్ములను దాఁకఁ – జింతలు బాయున్.

లాలీ మా కన్నయ్యా
లాలీ నిన్ గాచు శివుఁడు – లాలి ముకుందా
లాలీ పరమానందా
లాలీ గోవింద కృష్ణ – లాలి సునీలా.

(6) 14, 25 బ్రహ్మా
భావమ్మందున నీవే
జీవమ్మం దెప్డు నీవె – జీవనతేజా
రావమ్మందున నీవే
నావై పొకమారు చూడు – నవ్వుల రాజా.

కొండెత్తిన గోపాలా
గుండెలలోఁ గొలువుఁ దీర్చు – గోవిందయ్యా
దండుగ కాదయ్యా నీ
వండగ మాకుండ దుష్ట – హారీ హారీ.

బ్రహ్మాండమ్ముల్ విశ్వము
బ్రహ్మమహేశాది దేవ – రాక్షసకోటుల్
బ్రహ్మపితా నీ కుక్షిన్!
బ్రహ్మమ్మే నిజము నీవు – బ్రహ్మజ్ఞానీ.

(7) 16, 24 వారణ
పాలన్ ద్రాగన్ రా గో
పాలా యని తల్లి బిల్వ – పరిగెత్తితి వా
కాళిందిన్ గల వ్యాళున్
గాళియు భంజించ వేగ – కాలఘనాభా.

బృందావనమ్ము పిల్చెను
నందాత్మజుఁ డందు లలిత – నాట్యమ్మాడెన్
సుందరవంశీగీత
మ్మందముగా మ్రోగుచుండె – నానందమ్మై.

నీవే నాట్యాచార్యుఁడు
నీవే యెత్తేవు కొండ – నిముసములోనన్
నీవే గీతాచార్యుఁడు
నీవే లాగేవు గుండె – నిముసములోనన్.

వారణసంహారమ్మున్
ధారుణిఁ గంసుని వధించి – దైత్యాళిన్ సం
హారణ మొనర్చి లోకో
ద్ధారణమున్ జేసినావు – దాతా త్రాతా.

(8) 18, 23 వరుణ
నీవే నా మంచి పనులు
నావే నా చెడ్డ పనులు – న్యాయాంభోధీ
దేవా సద్బుద్ధి నొసఁగి
కావర జగమందు నన్ను – కల్యాణశ్రీ.

వరుణుం డంపెన్ వానల
ధరణిన్ ముంచంగ శైల – ధారణమున్ స్వీ
కరణమ్ముఁ జేయు ధీరున్
దరుణున్ గోపాలకృష్ణు – ధ్యానింతున్ నేన్.

(9) 20, 22 నీల
మన్నేల తినెద వయ్యా
వెన్నకు కరువేమి లేదె – వ్రేపల్లెన్ నే
వెన్నన్నము దిన్పించెద
కన్నయ్యా రమ్ము వేగ – కార్మొగిలు వలెన్.

నీలము మేఘము నింగిన్
నీలము పింఛమ్ము దలను – నీల మ్మలకల్
నీలము నీ దేహ మ్మది
నీలాపతి నిన్నుఁ నెంచ – నేఁ గంపింతున్.

(10) 22, 21 మదన
రాధామాధవరూప
మ్మీ ధారుణియందుఁ జూడ – నెల్లెడ నాకున్
మాధుర్యము మానసమున
గోదావరి యయ్యె మధుర – ఘోషలతోడన్.

దొంగా పాల్వెన్నలకున్
దొంగా చెలి చేలములకు – దొంగా వ్రజమం
దంగనల చిత్తములకున్
రంగా రా దొంగవోలె – రాత్రుల దరికిన్.

మదనుని తండ్రీ, రూపము
ముదమిచ్చున్ జూడఁ జూడఁ – బొంగున్ డెందం
బుదయమ్మౌఁ బ్రేమానల
మది గాల్చున్ దప్పకుండ – మనసున్ దనువున్.

(11) 24, 20 తాడంక
జోజో యదువంశోత్తమ
జోజో మృదుమధురభాష – సుందరహృదయా
జోజో హరి రామానుజ
జోజో నవరత్నదీప – జోజో సదయా.

తాడంకమ్ములఁ దాల్చిన
జేడియ లాడంగఁ గనిన – శ్రీకృష్ణుఁడు దా
నాడెను బాడెను రాస
క్రీడల కేంద్రముగ నుండె – కేళికలందున్.

(12) 26, 19 శేఖర
నందానంద ముకుందా
సుందర నలినాయతాక్ష – సురుచిర హృదయా
చందురు వెన్నెల నగవుల
చిందించుచునుండు దేవ – శ్రీగోవిందా.

నీవెవ్వరవో సిరిసిరి
నవ్వులతో వచ్చి నన్ను – నవ్వించెదవో
నీవెవ్వరవో చిఱుచిఱు
పువ్వులతో వచ్చి నన్ను – పులకించెదవో.

కలలో వచ్చిన వాఁడే
యిలలో నా ముందు నిలుచు – నెప్పుడొ యెఱుఁగన్
వలపే వసంతమౌ నా
తలఁపే నా కగును రక్ష – ధారుణిపైనన్.

శిఖిపింఛశేఖరా నీ
ముఖమున్ గన మాకుఁ గల్గు – మోక్ష మ్మవనిన్
సఖ కావ రమ్ము నీవే
సుఖదుఃఖములందుఁ ద్రోవఁ – జూపుము సరిగా.

(13) 28, 18 శర
ఆనందము నిన్నుఁ దలువ
నానందము నిన్నుఁ గొలువ – నానందసుతా
యానందము నీ యునికియు
నానందము నాదు మనికి – యానందముఖా.

గ్రుచ్చెన్ బంచశరుని విరు
లిచ్చోటను మాకుఁ గృష్ణ – హృద్బాధలతోఁ
జచ్చుచు బ్రదుకుచు నుంటిమి
వచ్చి దయన్ బ్రోవుమయ్య – వనజదళాక్షా.

(14) 30, 17 గగన
కృష్ణా యనఁగను గష్టమె
కృష్ణా యన నష్టమౌనె – కృష్ణా యనుమా
జిష్ణుని సఖుఁ డిచ్చు సుఖము
తృష్ణయుఁ బరిహారమగును – కృష్ణా యనుమా.

గగనములోఁ జంద్రుం డిల
సుగమగు వెన్నెలను నింపె – సొబగుల నదిగా
సగమయ్యె రాత్రి నాకా
మొగమున్ జూపంగ రమ్ము – మోహనకృష్ణా.

(15) 32, 16 శరభ
శిఖిపింఛమువాఁడే నా
సఖు డయ్యెను నేఁడు చాల – సంతస మయ్యెన్
ముఖమును జూడఁగ మోదము
సఖి! కలిగెను, నాకు హృదియు – సంబర మందెన్.

శరభాంకుఁడు గాచును ని
న్నరవిందదళాక్ష నిద్ర – కయె వేళయు నా
యరవిందమ్ముల మూయుము
మఱి రేపుదయమ్ము పూయు – మరవిందములన్.

(16) 34, 15 విమతి
ఆనందములో మునిఁగెద
గానపు వర్షమునఁ దడిసి – గగనఘనాంగా
నీ నగు మోమును జూపర
శ్రీనాథా సొలసిపోదుఁ – జెలఁగుచు లలితో.

విమలా నీ ధూర్తతఁ గని
విమతియు నీవంచు వారు – ప్రేలెదరు గదా
విమతియుఁ గుమతియుఁ గాదుర
సుమతియె నా బిడ్డ నీవు – సుందరకృష్ణా.

(17) 36, 14 క్షీర
మధురాపురిలో వెలసిన
మధుసూదనుఁ దల్తు నేను – మధురోహలతో
మధుమాసమ్మునఁ బెదవుల
మధు విచ్చును సుమమువోలె – మాధుర్యముతో.

క్షీరాబ్ధిశయనునికి గో
క్షీరమ్మును గుడువ నిచ్చెఁ – జేతులతోడన్
నీరజనయన యశోదయు
మీఱఁగ హృదయమున ముదము – మిలమిలలాడన్.

(18) 38, 13 నగర
అలసటఁ బడకను తిరుగును
తలి వీడక నొక్క క్షణము – తరుణశిశువు చే
తలతో నవ్వించుచు నా
టలతోఁ గవ్వించుఁ గాదె – టక్కరి పనులన్.

యుగములయెంగా క్షణముల్
నగరములో సడియు లేదు – నగధర రారా
వగచుచు నుంటిని నిర్ఘృణ
బిగువేలర విరహబాధ – వేదన యయెరా.

(19) 40, 12 నర
సుమములపయి మధువనమున
భ్రమరమ్ములు వ్రాలి సోలెఁ – బరికించఁగ నా
రమణీయమ్మగు క్షణమున
రమణిని గన రమ్ము రయము – రాజీవాక్షా.

నరనారీమణు లందఱు
చిరునగవుల సిరిని గనఁగఁ – జేరిరి వనమున్
మురళీధరు డరుదెంచెను
కరతాళముతోడ గీతి-కల నుడువంగన్.

(20) 42, 11 స్నిగ్ధ
మనసను గుడిలోఁ బ్రతిమగ
ననయము మని యుందు వయ్య – హరుస మ్మలరన్
స్వనమును వినిననె చాలును
తనువిటఁ బులకించు నాకుఁ – దథ్యము కృష్ణా.

ముగ్ధను నిలిచితి నీదగు
స్నిగ్ధతకయి మోహవశగ – నిశి దిన మిచటన్
దగ్ధ మొనర్చకు హృదయము
ముగ్ధకు నద్దముర పగుల – ముక్క లగునురా.

(21) 44, 10 స్నేహాలు
హరి హరి యన మదిలో వెత
హరమగు నిముసాన వేగ – హరుసము విరియున్
హరి హరి యన శాంతియు సు
స్వరభరమధురమ్ము మంచి – పాటగ వెలయున్.

రక్కసిఁ దునిమెను బుడుతఁడు
ముక్కల శకటమును జేసి – ముదమును జిలికెన్
చక్కని నుడులను బలుకుచు
చుక్కలలో ఱేనివోలె – సొబగులఁ జిలుకున్.

మాధవ యన మధుమాసము
శ్రీధర యన చైత్రపు సిరి – చెలువము మదిలో
భూధరధర యన శ్రావణ
మీ ధరణిని హరియె యెల్ల – ఋతువుల పతియౌ.

మురహరుఁ డొక స్నేహాళువు
దరిసెనమే చాలు మనకుఁ – దపము ఫలించన్
మురళీస్వరముల నదిలోఁ
బరగఁగ జలకమును సలిపి – పావనుఁ డయెదన్ .

(22) 46, 9 మదకల
నుదుటను దిలక, మ్మురమునఁ
గదిలెను మణి, వెదురుఁగ్రోవి – కరమున, గళమం
దదురుచు సరములుఁ, జందన
మెదపయి, గోపికలు చుట్టు – హృద్యము చూడన్.

ఎదురవ మదకల మొకటియు
మధురాపురిలోన దాని – మదము నడంచెన్
పిదపన్ దునిమెను బెదరక
మదమయుఁడగు కంసనృపుని – మహి యలరంగన్.

(23) 48, 8 లోల (భూపాల)
సుమలతలార తపించుచు
భ్రమగొని వనమందు లలితు – వదనము గనఁగా
భ్రమణము సేయుచు నుంటిమి
యమలుడు కనబడెనె తెలుపు – డతిదయతోడన్.

అలవలె లోలము మది హరి
పులకల నొక నిముస ముండు – ముదబిందువుగా
విలవిల యని వెతలఁ బడును
తిలకించ మఱొక్క క్షణము – తృష్ణల వలలో.

కనబడె గగనమున నినుఁడు
వినబడె భూపాల రాగ – విమల స్వరముల్
నిను బిలిచెను సకల జగము
కనులను దెఱువంగ నిదియె – గడియయు కృష్ణా

(24) 50, 7 శుద్ధ
రవి పొడిచెను గగనమునం
దవిరళముగ వెలుగు నెఱసె – నబ్జము లలరెన్
జెవులను బడెఁ బులుగుల సడి
నవదిన మరుదెంచె కృష్ణ – నగవుల లేరా.

నినుఁ గన మనసగు శుద్ధము
నినుఁ గన మనసగును సహజ – నీతికి బద్ధం
బనిశము నవమోహన యన
ఘనమగు నినుఁ గలయు వలపు – గగనఘనాంగా.

(25) 52, 6 సరిత్
కలలకు నెలవగు లలితా
లలితముగద వదనశశియు – లలనకుఁ ద్వరగా
బలిమిని గలిమిని జెలిమిని
జెలికాఁడా యొసఁగ రమ్ము – చెలువము లలరన్.

మురహర భవహర యనగను
సరితగఁ బరుగిడెను వలపు – సరసర యనుచున్
స్వరముల మధురత మ్రోఁగెను
హరి రాసక్రీడఁ దలువ – హరితమె హృదిలో.

(26) 54, 5 కుంభ
వదలర పడకను వరదా
నిదురిక వలదు కనుఁదెఱచి – నిఖిలముఁ గనరా
ముదమున ముఱియుచు సదమల
పదముల నుడివెదము సుప్ర – భాతపు ఘడియన్.

హరియును బుడుతలు తడబడి
పరుగిడి కుంభమున దధినిఁ – బాలను గుడువన్
చిఱుతలఁ గరములఁ గొనుచును
దరుణులు వెడలిరి యశోద – తలుపుల కడకున్.

(27) 56, 4 కలశ
మనసున వెలసినది తలపు
తనువున వెలసినది తపన – తరుణికి రజనిన్
కనులకు నెదురుగ మురళీ
స్వనముల జడి కురియ రమ్ము – వరద మురహరీ.

విరిసిన కుసుమముల సొగసు
కురిసిన శశికిరణ ఛవులు – కొమరుగ నమరెన్
మెఱయుచు కలశముల పగిది
తరుణులు గుమిగూడి రపుడు – తరుణుని చుట్టున్.

(28) 58, 3 శశీ
పరమునిఁ దలఁపఁగ మనసున
వరములు కరువగునె జగతిఁ – బ్రజలకు నిజమై
చరణములఁ దాఁకఁ గలుగును
గురుతరమగు శుభము సుఖము – కువలయతలిపై.

గగనమున శశియు వెలిఁగెను
సొగసుగ సిగరములు వెలిఁగె – సొమసిలి రజనిన్
జగమునకు నొడయఁ డతఁ డెట
మొగమును గనగ నగు శుభము – మోహనమయమై.

(29) 60, 2 యాన
తలపుల గని, వలపుల మణి
చెలువపు సొన, కలఁకుల కొన – సిరులకు నెలవా
కలలకు వల, పలుకుల సెల
కలిమికి నది, చెలిమికి హృది – కనులకు మురువా.

కలువలు కమలములు కనులు
మిలమిల మెఱసినవి మణులు – మిణుగురులన యా
నలువకు జనకుఁడు మన కెపు
డిలపయి సకలమగు నునికి – యెదయను గుడిలో.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...