అనంతకవితాకాంచి

నీవు
నేను
ఆద్యంతాలను కలిపే విడదీయరాని ముడులం
సౌందర్యగానం చేసే కడు తీయనైన సడులం

నీవు
నేను
భూత భవిష్యత్తులు సంధించే బిందువులం
పాత కొత్తలు ఒకటై చేరి పరిగెత్తే సింధువులం

నీవు
నేను
అశ్రుసాగరంలో ముత్యాలకై మునిగే కలాసులం
ఆనందసాగరపుటలలపై ఉరికే విలాసులం

నీవు
నేను
అనంత ప్రేమరాగపు ఆరంభ స్వరాలం
వినూత్న విశ్వసృష్టిలోని విచిత్ర రవాలం


ప్రేమికుల దినం సందర్భంగా ఏదైనా కొత్త విధమైన ఒక కవితను సృష్టించాలనే ఊహ నాకు కలిగింది. తెలుగులో ఇంతకు ముందు నేనెక్కడా చూడని ఒక చిత్రకవితను రూపొందించాను. మన చిత్ర కవిత్వాలలో కొన్ని నియమాలుంటాయి. అవి ఒక పద్యంలో మరో పద్యం రాయడమో (గర్భకవిత్వం), ఒక నమూనాకు సరిపోయేటట్లు పద్యాలను రాయడమో (బంధకవిత్వం), లేక పోతే అన్ని లఘువులు ఉండేటట్లో, గురువులు ఉండేటట్లో, పెదవులతో పలికే అక్షరాలు మాత్రమే వాడేటట్లో, ఇలా.

నేను పైన చెప్పిన కవితా పద్ధతికి అనంతకవితాకాంచి అని పేరు పెట్టినాను. ఈ కవిత ఒక పట్టీపైన రాయబడినది. కాంచి అంటే ఒడ్డాణము. అనంత అంటే అంతులేనిది. అంటే ఇది ఒక అంతులేని కవితా వృత్తము వంటిది. ఈ పట్టీకి సామాన్యమైన పట్టిలా రెండు కాక ఒకే ఉపరితలం (surface) ఉంటుంది. దీనిని సంస్థితిశాస్త్రంలో (topology) మోబియసు పట్టీ (Mobius strip) అంటారు. ఈ మోబియసు పట్టీ రీసైక్లింగ్ చిహ్నం. చీమలాటి కీటకం ఒకటి ఈ పట్టీపైన ఒక చోటినుండి బయలుదేరి నేరుగా నడిస్తే కొద్ది సేపటికి ఎక్కడ బయలుదేరిందో అక్కడికే మళ్ళి వచ్చి చేరుతుంది. ఈ గుణమే దీనికి అనంతత్వాన్ని ఆపాదిస్తుంది. దీనిని ఉపయోగించి మోరిస్ ఎషర్ (Maurits Escher) ఒక కొయ్య శిల్పాన్ని కూడా చెక్కాడు. ఆంగ్లములో ఈ రకమైన కవితకు ఉదాహరణ లున్నవి.


మొదటి మెలిక

పై కవితలో నాలుగు పదాలు ఉన్నాయి, ఒక్కొక్క పదానికి నాలుగు పాదాలు. మొదటి రెండు పదాలను ఒక వైపు (వంగపండు రంగు కాగితంపై), చివరి రెండు పదాలను తలకిందులుగా మరోవైపు (తెల్లటి కాగితంపై) రాసి కాగితపు అంచులను సామాన్యంగా చేర్చకుండా ఒక మెలిక తిప్పి చేర్చాను. రెండు ఉపరితలాలను సరిగా గుర్తించడానికోసమే రెండు రంగులను వాడాను.


రెండవ మెలిక

మోబియసు పట్టీని మధ్యలో కత్తిరిస్తే అదనంగా ఇంకొక అర్ధ మెలికతో రెండింతల నిడివిగల పట్టీ లభిస్తుంది. ఇలా కత్తిరించిన దాన్ని మరో సారి కత్తిరిస్తే మనకు ఒకదానితో మరొకటి లంకె వేసికొన్నట్లు రెండు పట్టీలు దొరుకుతాయి. ఈ లంకె కత్తిరిస్తే తప్ప విడివడని ముడి.


మూడవ మెలిక

విధి కత్తెర వేటుకు తప్ప అవి తెగవు. మన ప్రేమికులు (నీవు, నేను) అలా వారి ప్రేమను కలుపుకొని అమరత్వాన్ని సాధించారు. ఇందులో మరొక చిత్రం ఏమంటే, కవితను ఏ పదముతోనైనా ప్రారంభించవచ్చు. నేను రాసిన విధంగానే చదువవలసిన అవసరం లేదు.

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...