Mrs. Bird’s House

మీట నొక్కితే
పిట్ట గొంతుకది
తేనెలు ఊరే కూకూలన్నది
తడిసిన బూట్లు వణికాయన్నది
పువ్వుల గుత్తులు వేచాయన్నది

అది విని
ముక్కు కొద్దిగా వంగుతుండగా
ఎర్రని పెదవులు విచ్చుతుండగా
ఓరగ తెరిచి తలుపు
బులుగు ఎరుపు
పసుపు తెలుపు
రంగు పిట్టల స్వెట్టర్ ఒక్కటి
వంచి తలను కొంచెం పక్కకి

తెల్లగ నవ్విందదిగో
ఆవిడ జుట్టు పళ్ళు
ఒకటే రంగు.

ఆ ఇంటికి నిండుగ
కొలువు తీరినవి
నిక్కి నిక్కి
చూస్తూ ఉన్నవి
బారులు తీరి
రంగు రంగుల
పిట్టల బొమ్మలు
తోకలున్నవి
తోకలు లేనివి.

ఆమె తన
ఎర్రని గోళ్ళని
ఈకల వేళ్ళని
ఆన్చీ బుగ్గని

తవ్వి చల్లని
కువ కువ
మాటల ఊటని
నవ్వుల చాటున
మిస మిస
తేటని

టీ కప్పుల్లో
మూల నెగడులో
రెక్కలు విప్పిన
వేడి సెగల్లో
గదిలో నిండిన
నవ్వు రవ్వల్లో
మా తెరిచిన నోళ్ళు
తెరిచి ఉండగనే

తన ముసలి రెక్కలను
సాచి మెల్లిగ
ఈకల ఒంటిని
లేపి సూటిగ

కిటికీలోంచి
కొండల మీదికి
కొండల్లోని
సూర్యుడి వైపుకి
గాలి కడలిలో
తెడ్లను వేస్తూ
ఒకటే చూపు
అదే పోత.

పరుగున పోయి
చూసిన గుంపుకు
కిటికీ ముందర
నేలకు రాలిన
బులుగు ఎరుపు
పసుపు తెలుపు
దిగాలు ఈకల
వెక్కిలి సన్నగ.