పరిచయము
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆ ఛందస్సులో కవులు వ్రాసినారు. కవిరాజమార్గము, ఛందోంబుధి, కవిజనాశ్రయము వంటి లక్షణ గ్రంథాలలో కంద పద్యములే యెక్కువ. కన్నడములోని మొదటి కావ్యమైన పంపకవి వ్రాసిన విక్రమార్జునీయము అనబడే భారతములో సుమారు 45 శాతము కంద పద్యములే. ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. ఇవి గాక శతకములలో, యక్షగానములలో, నాటకములలో కంద పద్యములను మనము చదువుతాము. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు. కందపద్యములను గుఱించిన కంద పద్యములను చూడండి –
కందంగ ళమృతలతికా
కందంగ ళనూన వాక్య ఫల విలస న్మా
కందంగళ్ తనిరసదు
క్కందంగళ్ సొగసియిర్పు వీతన కృతియొళ్ — (హరిహరుని గిరిజాకల్యాణము)
(అమృతలతల మూలములు, వాక్యముల నిండుదనముతో గూడుకొని విలసిల్లే మామిడి పండ్లు, రసవంతమయిన స్రోతస్సులు, ఇలా సొగసుతో నిండియుంటాయి కంద పద్యములు ఈ కవి కృతిలో)
కందంబులు సకల జనా
నందంబులు సరస మధుర -నవరస ఘుటికా
బృందంబులు నీ కవితా
కందంబులు కుందవరపు -కవి చౌడప్పా — (కవి చౌడప్ప శతకము – 15)
సుందరమగు గీతిక నొక
ఛందమ్ముగ నార్య కొసఁగె -సర్వేశ్వరుఁడున్
గందముగ నయ్యె నది మా
కంద మధుర రసము లొలుకు -కవితలయందున్
కందము సుస్వరభరితము,
కందము వినగను లలితము, -కందము పదమే
కందము బాడగ మధురము,
కందము వ్రాయగ సుకరము, -కందము ముదమే — (నా శతకందసౌరభము – 5)
ఇంత అందమైన కంద పద్యములను గుఱించి మనకు చాల విషయములు తెలియవు. కందపద్యమును గుఱించిన నా అధ్యయనము, పరిశోధనల సారాంశమే ఈ వ్యాసములు.
కందముపైన మొదటి భాగమయిన ఈ వ్యాసములో నేను క్రింది విషయములను చర్చిస్తాను –
- సంస్కృతములో ఆర్యా భేదములు, నియమములు
- ప్రాకృతములో గాథా భేదములు
- కంద పద్యపు నియమములు
- 29 కంద భేదములు, వాటికన్నిటికి ఇంతకుముందు వ్రాయబడని లక్ష్యములు
- కందముల వర్గీకరణ, నా సూచనలు
- కుఱుచ నిడుదపాదములతో 16 కంద భేదములు
ఆర్యా నియమ భేదములు
ఆర్యా లేక గాథా లక్షణములు పింగళుని ఛందశ్శాస్త్రములో, భరతుని నాట్యశాస్త్రములో, జయదేవఛందస్సులో, కేదారభట్టు వృత్తరత్నాకరములో, నందితాఢ్యుని గాథాలక్షణములో, స్వయంభూఛందస్సులో, జయకీర్తి ఛందోనుశాసనములో, హేమచంద్రుని ఛందోనుశాసనములో, విరహాంకుని వృత్తజాతిసముచ్చయములో, ప్రాకృత పైంగలములో గలవు. ఆ సూత్రముల, పద్యముల సారాంశములను మాత్రమే యిక్కడ తెలియబరుస్తున్నాను –
- చతుర్మాత్రలు ఐదు, అవి – UU (గగ) – 1, IIU (స) – 2, UII (భ) – 3, IIII (నల) – 4, IUI – 5 (జ)
- ఆర్య లేక గాథ పై (మాత్రా)గణములతో నిర్మితములు.
- సంస్కృతములో, ప్రాకృతములో ఇది ఒక ద్విపద.
- మొదటి పాదములో ఎనిమిది గణములు, రెండవ పాదములో ఎనిమిది గణములు.
- రెంటిలో బేసి గణములు జ-గణములుగా నుండరాదు.
- చివరి గణము, అనగా ఎనిమిదవ గణము గుర్వంతము.
- పూర్వ (ముఖ) పాదములో ఆఱవ గణము నల లేక జ-గణముగా నుండవలయును.
- పూర్వ పాదములో నల-జ గణము నలమయితే ఒక పదము మొదటి లఘువుతో అంతమై, మఱొక పదము రెండవ లఘువుతో ప్రారంభము కావాలి. జ-గణమునకు ఈ నిర్బంధము చెప్పబడ లేదు.
- పూర్వ పాదములో ఏడవ గణము (నల-జ పిదప గణము) నలమయితే, పదము మొదటి లఘువుతో ప్రారంభము కావాలి.
- ఉత్తర (జఘన) పాదములో ఆఱవ గణము నల-జ కు బదులు ఒక లఘువు మాత్రమే.
- ఉత్తర పాదములో ఐదవ గణము నలమయితే, పదము మొదటి లఘువుతో ప్రారంభము కావాలి.
- పూర్వ పాదములో 30 మాత్రలు, ఉత్తర పాదములో 27 మాత్రలు, గాథకు మొత్తము 57 మాత్రలు.
- ఆర్య లేక గాథను తెలుగులో వ్రాసినప్పుడు చతుష్పదగా వ్రాయవలయును. అప్పుడు కుఱుచ పాదమునకు మూడు గణములు, నిడుద పాదమునకు ఐదు గణములు ఉంటాయి. సరి పాదములలో నాలుగవ గణమునకు (నల-జ గణము తఱువాత) యతి నుంచవలయును.
(ద్విపదకు బదులు చతుష్పద అని మను అనుకొంటే ఇది సరి పాదములలో (రెండవ, నాలుగవ పాదములలో) మూడవ గణము అవుతుంది. ఈ సందిగ్ధతను తప్పించుటకై నేను ఈ గణమును నల-జ గణము అని పిలుస్తాను.)
ఆర్యకు శిలాశాసనమునుండి ఒక ఉదాహరణము –
జయతి విభు శ్చతుర్భుజ-
శ్చతురర్ణవ విపుల సలిల పర్యంకః
జయతః స్థిత్యుత్పత్తి-
వ్యయాదిహేతు ర్గరుడకేతుః — (క్రీ.శ. 485, బుధగుప్తుని ఏరణ (మధ్యప్రదేశము) శాసనము)
(చతుర్భుజునికి, చతుస్సాగరమునే పడకగా కలిగినవానికి, సృష్టి స్థితి లయాదులకు కారణభూతుడైనవానికి, గరుడధ్వజునికి (విష్ణుమూర్తికి) జయమగు గాక!)
ఆర్యకు స్తోత్ర కావ్యమునుండి ఒక ఉదాహరణము. ఈ పద్యము చాల అందమైనది. శివుని ముఖము కమలముతో పోల్చబడినది ఇందులో –
జయతి జటాకింజల్కం
గంగామధుముండవలయ బీజమయం
గలగరలపంకసంభవ
మంభోరుహ మాననం శంభోః — (గోవర్ధన పండితుని ఆర్యాసప్తశతి, 5)
(శంభుని అంభోరుహాననము (పద్మము వంటి ముఖము) అతని గొంతులో ఉండే విషమనే పంకము నుండి పుట్టినది. ఆ తామరపూవు కేసరములు అతని జటాజూటములోని వెండ్రుకలు. తల చుట్టూ ఉన్న ఆ మధుర గంగానది అనే వలయము మధ్య బీజములు.)
ఆర్యకు తెలుగులో నా ఉదాహరణము ఒకటి. ఇందులో నల గణమువద్ద విఱుపును /గుర్తుతో చూపినాను.
యాదవ యదువంశార్యా
మాధవ మధుహారి /దనుజ-మర్దన రా
నాదరి వేగమె వేణువు
నూదుచు /లలితముగ – నుత్సుకతన్
ఆర్యాజాతిని తొమ్మిది విధములుగా వర్గీకరించారు. అందులో మొదటి ఐదు ఆర్యాభేదములు, తఱువాతివి గీతి భేదములు. మొదటి ఐదు పదముల విఱుపు, గణముల అమరిక వీటిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ముఖ, జఘన అనే పదములు మనకు కనిపిస్తాయి. ముఖ అనే పదము పూర్వ పాదమునకు, జఘన అనే పదము ఉత్తరపాదమునకు వర్తిస్తుంది.
పథ్యార్యాలో మూడవ గణము వద్ద పదము అంతమయి నాలుగవ గణము వద్ద మఱొక క్రొత్త పదము ప్రారంభము కావలయును. ఆర్యను ఒక చతుష్పదిగా మనము తలచినయెడల, ఏ పాదమునకు ఆ పాదము పథ్యార్యాలో స్వతంత్రముగా నిలిచి ఉంటుంది. పథ్య అనగా తగినది, ఒప్పినది అని అర్థము. క్రింద నా ఉదాహరణము –
పథ్యార్యా –
మానసమందున నీవే /
దానవహారీ మురారి – దయతో నన్
గానఁగఁ బథ్యార్యా రా /
దీనజనులఁ బ్రోచు – దేవునిగా
విపులార్యలోని విశేష మేమనగా, ఇందులో మూడవ గణమువద్ద (అనగా చతుష్పదిలోని మొదటి పాదాంతములో) పదము అంతమవదు, తఱువాత వచ్చే నాలుగవ గణములోనికి ఈ పదము చొచ్చుకొని పోతుంది. పదము రెండు గణములకు వ్యాపించి విపులముగా నుంటుంది కనుక దీనికి విపులార్య అనే పేరు వచ్చినది. క్రింద నా ఉదాహరణము –
విపులార్యా –
దేవాధిదేవ దివ్యా-
త్మా / వాంఛింతు నిను వనజ-దళనయనా
కావంగను రా భవ్యా-
త్మా / విపులదయాబ్ధి – దయ గనరా