పాడిందే పాట అను ఒక పునశ్చరణ

ఏ పత్రికకైనా రచయితల అవసరం ఎంత ఉందో, రచయితలకి కూడా పత్రిక అవసరం అంతే ఉన్నది. పదిమందీ చదవాలని, చదివి ఆనందించాలనీ ప్రతీ రచయితా కోరుకుంటాడు. అలాగే, సహృదయులైన పాఠకుల స్పందన రచయితలకి ఉత్సాహం ఇస్తుంది. పత్రిక మనుగడకి జీవగర్రలు: పాఠకుల స్పందన, రచయితల ప్రతిస్పందన. ఈ విషయాలు ఈమాట పాఠకులకి తెలియనివి కావు. మరయితే, ఇప్పుడు ఎందుకు వల్లించాల్సి వస్తున్నది, అన్న ప్రశ్న సబబైన ప్రశ్న.

నా మటుకు నేను పునశ్చరణ అప్పుడప్పుడు అవసరం అని నమ్ముతాను. అయితే, ఎన్నిమార్లు వల్లించినా ఎవరూ ఖాతరు చెయ్యని పునశ్చరణ విసుగెత్తిస్తుంది.

అసలు విషయం:

ఈమాట పత్రికని పాఠకులకి ఇప్పటికన్నా ఆసక్తికరంగా చెయ్యటం ఎల్లాగ? కొత్త రచయితలని ప్రోత్సహించడం ఎల్లాగ? ప్రచురణకొచ్చే రచనలలోవైవిధ్యం పెంచడం ఎల్లాగ? అని మాలో మేము తర్జన భర్జనలు పడ్డాం, మా శ్రేయోభిలాషుల సలహాలు అడిగాం. వీరిలో కొంతమంది చేయి తిరిగిన రచయితలు, సహృదయులైన పాఠకులు, మరికొందరు పుంఖానుపుంఖంగా కామెంట్లు వెదజల్లే విమర్శకులు. మిత్రులు చాలామంది రకరకాల సలహాలు పంపించారు. కొద్దిమంది శ్రేయోభిలాషులు పిలిచి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మరికొందరు ముఖాముఖీ చెప్పారు. అందరికీ మా హృదయపూర్వకాభినందనలు. ఈమాట మిత్రులలో రాయగల్గినవారంతా మరింత తరచూ రాస్తామని మాటిచ్చారు. ఇంతకంటే మాక్కావల్సింది లేదు. వారికి మా కృతజ్ఞతలు.

ఇకపోతే, సలహాలన్నీ బేరీజువేసి చూస్తే వాటిని మూడు తరహాలుగా విభజించవచ్చు.

మొదటిరకం: రకరకాల అభిరుచులున్న పాఠకులందరూ మెచ్చుకోవాలంటే, వారందరికీ నచ్చాలంటే ఈమాట పరిధిని విస్తృతం చెయ్యాలని కోరినవారు. అందుకుగాను పత్రికలో కార్టూనులు, జోకులు, తెలుగునాట విరివిగా వస్తున్న సినిమాల విశేషాలు ప్రచురించమని సలహానిచ్చారు. అటువంటి పత్రికలు ఆంధ్రప్రదేశ్‌లో అచ్చులోను, అమెరికాలో వెబ్‌లోను వుండనే వున్నాయి. ఆ పత్రికలకి క్లోన్‌గా ఈ మాటని మార్చడం అనవసరం అని మా ధృఢనమ్మకం.

ఈ తరహా సలహాలిచ్చిన వారిలో కొద్దిమంది, సీరియల్‌ నవలా సాహిత్యాన్ని ప్రోత్సహించమని కోరారు. ఈ మాట రెండునెలలకు ఒక సారి ప్రచురించబడే పత్రిక. సీరియలు నవలలు ప్రచురించడానికి దినపత్రికలు, వారపత్రికలు పనికి వస్తాయి కాని సంవత్సరంలో ఆరుసార్లు మాత్రమే ప్రచురించబడే పత్రికకి ఈ ప్రక్రియలు నప్పవు. అయితే చిన్నసైజు నవలలు, అంటే 100+ పేజీల సైజులో నవలికలని ప్రోత్సహించి ప్రచురించడంపై వచ్చిన సలహా మా కుతూహలాన్ని పెంచింది. ఏ విధంగా ఈ ప్రక్రియని ప్రోత్సహించాలి అన్న విషయం గురించి మేము ఆలోచిస్తున్నాం. త్వరలో వివరాలు ప్రచురించడానికి ప్రయత్నిస్తాం.

రెండవరకం: ఈ రకం సలహాలు చాలాభాగం ఇదివరకు చర్చించబడినవే. ఉదాహరణకి, రచయితలకు పారితోషకం ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్ లో ‘పేరు పొందిన’ రచయితలని ఈమాటకి రాయమని ఆహ్వానించడం, ‘పీర్ రివ్యూ’ ప్రక్రియకి స్వస్తి చెప్పడం వగైరా. పారితోషకం గురించి మాలో మేము కొంతకాలంగా తీవ్రంగా చర్చించుకుంటున్నాం. మాలో మాకు ఉన్న అభిప్రాయ బేధాలు, అభ్యంతరాలు – ప్రస్తుతానికి పక్కకి నెట్టినా ఈ పనికి పూనుకోవడంలో ఉన్న సాధకబాధకాలే ఎక్కువ. అమలు పరచడంలో వచ్చే ఇబ్బందులు ఇంకా ఎక్కువ. మా చర్చలు ఒక కొలిక్కి రావడానికి ఇంకొంత కాలం పడుతుంది.

పోతే తెలుగునాడులో ప్రఖ్యాత రచయితలని ఆహ్వానించడం గురించి మా సంపాదకవర్గంలో ఏ విధమైన అభిప్రాయబేధమూ లేదు. తెలుగునాడు రచయితలని తరచూ అడుగుతూనే ఉన్నాం. ఇష్టమైన వారు రాస్తూనే ఉన్నారు. వారికి మా హృదయపూర్వక అభినందనలు. కొందరు రచయితలు – అక్కడి రచయితలు, ఇక్కడి రచయితలూ కూడా – పీర్‌ రివ్యూపై కొద్దిపాటి అసహనం ప్రకటిస్తున్నారు. ఇందుకు కారణం, ఈ పద్ధతి పాశ్చాత్య సాహిత్య పద్ధతి. బహుశా అందువలన మనవారికి ఇంకా అలవాటు కాకపోవడం మూలంగానే అని మా నమ్మకం.

అయితే, ఏవిషయానికి ఆవిషయమే చెప్పుకోవాలి. పీర్‌ రివ్యూ ప్రక్రియ రచయిత ‘గొంతు’ మార్చే ప్రక్రియ కాదనీ, పాఠకుల దృష్టితో చదివి రచన మెరుగుపడటం కోసం చేసే సలహాలేనని తెలుసుకున్న కొంత మంది ‘పేరు మోసిన’ రచయితలు – అక్కడా ఇక్కడా కూడాను – ఈ ప్రక్రియపై వారి అభిప్రాయాలు మార్చుకుంటున్నారు. ఇది మా అనుభవం. మరికొంత మందికి వారి రచనలలో ఒక కామా మార్చడం కూడా పనికి రాదు. అటువంటి వారితో మాకు పేచీ లేదు. కానీ, నూటికి తొంభైతొమ్మిది శాతం మా రివ్యూ పద్దతిని సాదరంగా ఆహ్వానిస్తున్నవారే కావడం మా నమ్మకానికి మరింత బలాన్నిస్తోంది.

ఒకరిద్దరు ముఖాముఖీ సంభాషణలలో చాలా ఘాటుగా చెప్పారు: “మీది అమెరికానుంచి వస్తున్న వెబ్ పత్రిక. వెబ్‌లో సాహిత్య ప్రచురణ మార్గాలు అక్కడి వారికి (అంటే తెలుగు దేశంలో వారికి) ఇంకా పట్టు బడలేదు. అది ఒక్క ఉదుటునే రాక పోవచ్చు. బహుశా ఉప్పెనలా వచ్చినా రావచ్చు. అందుకు మీ పత్రిక ద్వారా మీరు ప్రయత్నించాలి. ఆపనికి మీరు తోడ్పడాలి. అక్కడివాళ్ళు మీరు చేస్తున్న పనిని అనుసరించేట్టు చెయ్యాలిగాని, మీరు వారిని అనుకరించి, అటుచూడవలసిన అవసరం కనపడటల్లేదు,” అని! ఇది చాలా రాడికల్‌ సలహా! మాకు నచ్చింది కానీ, ఆపని ఎలా చెయ్యగలమో కాస్త తీవ్రంగా ఆలోచించాలి.

మూడవరకం: ఈ మూడవరకం శ్రేయోభిలాషులు ఇచ్చిన కొన్ని సలహాలు రెండవరకం వారిచ్చిన సలహాలే! అయితే, ‘కొత్త’ అనుకునే సలహాలతో పాటు ప్రస్తుతం ఈమాట సాహిత్య స్థితి, సంపాదకుల పరిస్థితి పై కొన్ని విషయాలు నిష్కర్షగా చెప్పారు. ముందుగా వారందరికీ మరోసారి అభినందనలు. వారు చెప్పిన విషయాలు కూడా పాఠకులకి తెలియపరచడం అవసరం. వీటిపై పాఠకుల స్పందన మాకు ఉపయోగపడుతుందని మానమ్మిక.

ఈమాట పత్రికలో వ్యాసాలు చదువుతుంటే, ఇదెక్కడో “బొబ్బర్లంకనుంచి ప్రచురించబడుతున్న పత్రికలా ఉన్నదికాని,” ఆధునిక వెబ్ పత్రికలా లేదని ఒక వ్యాఖ్య. బొబ్బర్లంక నుంచి పత్రికలు ప్రచురించబడుతున్నాయని మాకు తెలియదు; కానీ, గోదావరి జిల్లాలలో వేదం, సంస్కృతం క్షుణ్ణంగా చదువుకున్న మహా పండితులు ఇంకా బ్రతికే ఉన్నారని, వారి సత్తువని ఆదరించి అభిమానించే ఆంధ్రులు ఆంధ్రాలో లేరు; అమెరికాలో అసలే లేరని మాత్రం మాకు తెలుసు. ఆ మహానుభావులకి మా వందనాలు.

ఇంకో వ్యాఖ్య, “ఈమాట పత్రిక చదువుతుంటే 1935 లో భారతి”లా వున్నదని. ఇది పొగడ్తో, తెగడ్తో, హేళనో మాకు బోధపడలేదు. ఈ వ్యాఖ్య చేసినవారు మాకు ఆప్తులు కాబట్టి పొగడ్తగానే తీసుకుంటాం. అంత పెద్ద పొగడ్తకి మేము అర్హులం కామని మాకు తెలిసినా కూడాను! తెగడ్త అయితే పేచీ లేదు. సంతోషం. ఒకవేళ ఇది హేళన అయితే, ఆ హేళన భారతి పత్రికకే పరిమితమైనదని అనుకుంటాం.

“ఎడిటింగ్ పేరుతో వాక్యాలు అటూ ఇటూ మార్చడం తప్ప ఈ సంపాదక వర్గం ఏ రకంగానూ నిష్ప్రయోజనం. అందుకని ఈమాట సంపాదకవర్గం మొత్తం తప్పుకొని కొత్తవారిని సంపాదకవర్గంలోకి తేవాలి,” అని మరో సలహా. మహా మంచి సలహా! మాకు ఏవిధమైన అభ్యంతరమూ లేదు. మేమూ ఆ విషయమై అతి తీవ్రంగా ఆలోచిస్తున్నాము. అయితే మంచిసలహాలు అన్నీ ఆచరణ సాధ్యాలు కావుగదా! పిల్లికి గంటకట్టే దెవరు అన్న ప్రశ్న మమ్మల్ని వేధిస్తూన్నది. (ఆంగ్ల పత్రికలకూ, ప్రచురణ సంస్థలకూ ఉన్నట్టు తెలుగులో మనకు స్టైల్ మాన్యువల్ లేదు. అదెవరైనా రాస్తే కాకిపిల్లల ఈకలు సవరించే మా పోడు తప్పుతుందేమో. అప్పటిదాకా మేమెందుకు రచనలని పరిష్కరించాల్సి వస్తున్నదో సోదాహరణంగా చెప్పాలని ఉంది గానీ, అది మరెప్పుడైనా).

ఆఖరిగా మరొక వ్యాఖ్య: ఇది వ్యాఖ్య కాదు. ఆరోపణ. ఈమాట సంపాదకులు ఎప్పుడూ చెప్పిందే చెపుతారు, రాసిందే రాస్తారు, కొత్త విషయాలు ఏవన్నా చెపితే బాగుండును, అని. నిజమే! పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అన్నట్టు, కొన్ని విషయాలు మరీ మరీ చెప్పడం జరుగుతూన్నది. అయితే, ‘ఆ చెప్పిన విషయాలు ఏవో పరిశీలించి చూస్తే’ ఎందుకు మళ్ళీ మళ్ళీ చెపుతున్నామో బోధపడక మానదు. పునశ్చరణకి క్షమాపణలు చెప్పుకుంటూనే, ఒక చిన్న సూఫీ కథ చెప్పి ముగిస్తాను.

ఒకసారి, బహదిన్‌ షా సూఫీ సూత్రాలు, సూఫీ పద్ధతులపై ఉపన్యాసం ఇచ్చాడు. ఒక తెలివైన పెద్దమనిషి బహదిన్‌ పై విమర్శ విసిరాడు. ఆ విమర్శ ఇది: “ఈ బహదిన్‌ షా ఎప్పుడైనా, కనీసం ఒక్కసారైనా కాస్త కొత్త విషయాలు చెప్పితే బాగుండును. ఎప్పుడూ చెప్పిందే, చెప్పిందే చెప్పుతాడు.”

బహదిన్‌ ఈ విమర్శ విన్నాడు. ఆ విమర్శకుణ్ణి భోజనానికి ఆహ్వానించాడు. మాంసంకూర చేసి వడ్డించాడు. ఆ విమర్శకుడు ఆత్రంగా మొదటిముక్క నోట్లో పెట్టుకొని తుప్పున ఊశాడు – “ఇది మాంసం కూర కాదు. నాకు విషం పెట్టి నన్ను చంపుదామనుకున్నావా?” అని అరవడం మొదలుపెట్టాడు.

బహదిన్‌ సమాధానం: “ఇది మాంసం కూరే. స్వయంగా నేనే మేకమాంసం కొని వండాను. అయితే, కాస్త కొత్తగా ఉండడం కోసం, కూరలో ఆవాలు, మెంతులు, ఇంగువ, కాస్త వాంతి మందూ కూడా వేసాను. మరి నీకు కూర ఎప్పుడూ చేసినట్టు చేసిందే చేస్తే నచ్చదు కదా! అందుకని.”