రాగమాలిక

నాదేన వ్యజ్యతే వర్ణః పదం వర్ణాత్పదాద్వచః
వచసో వ్యవహారోయం నాదాధీనమతో జగత్

నాదం తోటి వర్ణమూ, వర్ణముల వల్ల పదములూ, పదముల చేత వాక్కూ, వాక్కు వల్ల ప్రపంచ వ్యవహారమూ ఏర్పడింది. అటువంటి నాదానికి ప్రపంచం మొత్తమూ అధీనంలో ఉంటుందని సంగీత రత్నాకరంలోని పై శ్లోకం అర్థం. సంగీత శాస్త్రానికి సామవేదం మూలం. ఇందులో ఉపవేదం గాంధర్వం. ‘గాం’ అంటే వాక్కు. వాక్కుని ధరించింది కాబట్టి గాంధర్వమన్నారు. ఈ గాంధర్వం స్వర, తాళ, పద సాహిత్యాలని ఆశ్రయించి ఉంటుంది. ఇందులో నాదం నుండి స్వరం పుట్టింది.

శాస్త్రీయ సంగీతంలో ఉన్న సప్త స్వరాల గురించి అందరికీ తెలుసు. వీటి పేర్లు షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం. వీటిల్లో ఒక్క షడ్జమ పంచమాలకి (స, ప) తప్పించి మిగతా అన్ని స్వరాలకీ రెండూ లేదా మూడు స్వరాంతరాలున్నాయి. వీటన్నిటినీ కలిపితే 16 ప్రధాన స్వరాలవుతాయి. అవి – (షడ్జమం), రి1 (శుద్ధ రిషభం), రి2 (చతుశ్రుతి రిషభం), రి3 (షట్శ్రుతి రిషభం), గ1 (శుద్ధ గాంధారం), గ2 (సాధారణ గాంధారం), గ3 (అంతర గాంధారం), మ1 (శుద్ధ మధ్యమం), మ2 (ప్రతి మధ్యమం), (పంచమం), ద1 (శుద్ధ దైవతం), ద2 (చతుశ్రుతి దైవతం), ద3 (షట్శ్రుతి దైవతం), ని1 (శుద్ధ నిషాదం), ని2 (కైసికి నిషాదం), ని3 (కాకలి నిషాదం). ఈ పదహారు స్వరాలలో ఒక్కొక్క స్వరానికీ నిర్దిష్టమైన స్వరస్థానాలున్నాయి. ఈ స్వరాలన్నీ ఒక రీతిలో కూర్చి చెవులకింపుగా పాడడమే సంగీతం.

స్వరాలే కాక శ్రుతి, లయ అనేవి కూడా సంగీతంలో ప్రధానాంశాలు. శ్రుతి స్వర స్థానాల మీద ఆధారాపడి ఉంటే, లయకి మూలం తాళం. ఇవే కాకుండా శాస్త్రీయ సంగీతంలో ప్రతీ పాటా ఒక రాగంతో ముడిపడి ఉంటుంది. స, రి, గ, మ, ప, ద, ని వంటి ప్రత్యేక స్వరాల సంవిధానాన్ని రాగం అన్నారు. ‘స’ తో మొదలు పెట్టి ఒక్కో మెట్టూ ఎక్కుతున్నట్లుగా స్వర స్థాయిని మార్చి తిరిగి ‘స’ కి చేరడాన్ని ఆరోహణ అంటారు. అలాగే పై మెట్టు నుండి ఒక్కో మెట్టూ దిగుతున్నట్లుగా స్వరాలని వ్యతిరేక క్రమంలో దిగడాన్ని అవరోహణ అంటారు. పైన చెప్పినట్లుగా ప్రతీ రాగంలో స్వరాలున్నాయి కాబట్టి వాటికొక ఆరోహణా, అవరోహణా ఉంటుంది. దీన్నే మూర్ఛన (స్కేల్) అని కూడా వ్యవహరిస్తూ వుంటారు. ప్రతీ రాగానికీ ఖచ్చితమైన స్వరాల ఆరోహణా, అవరోహణా ఉంటాయి. ఇది రాగానికి మొదటి సూత్రం.

ఆరోహణా, అవరోహణల్లో స,రి,గ,మ,ప,ద,ని ఖచ్చితంగా ఉండే రాగాలని మేళకర్త రాగాలన్నారు. ఇక్కడ స,రి,గ,మ,ప,ద,ని అని చెప్పిన స్వరాల్లో, రూపాంతర స్వరాలున్నా పరవాలేదు. ఉదాహరణకి రిషభ స్వరం ‘రి’ ని తీసుకుందాం. రిషభానికి రి1 (శుద్ధ రిషభం), రి2 (చతుశ్రుతి రిషభం), రి3 (షట్శ్రుతి రిషభం ) అని మూడు రూపాంతర స్వరాలున్నాయి. వీటిల్లో ఏ రిషభమైనా మూర్ఛనలో ఉండచ్చు. మొత్తం 16 ప్రధాన స్వరాల సమూహాన్ననుసరించి, వాటిలో స,రి,గ,మ,ప,ద,ని స్వరాలు మేళకర్త రాగాల మూర్ఛనలో ఉంటాయి (ఇందులో భాషాంగ రాగాలు, ఉపాంగ రాగాలు, జన్య రాగాలు, ఔడవ రాగాలు, షాడవ రాగాలు, సంపూర్ణ రాగాలనే వర్గాలున్నాయి).

అలాగే ప్రతీ రాగంలో సామాన్యంగా అయిదుకి తక్కువ కాకుండా స్వరాలుంటాయి. (అయిదుకి తక్కువ స్వరాలున్న రాగాలు కూడా ఉన్నా, ఒక స్వర స్థానం నుండి మరొక స్వరస్థానాన్ని చేరుతూ పాడడం చాలా కష్టం. అలా పాడగలిగే గాయకులు చాలా చాలా అరుదుగా కనిపిస్తారు. ప్రముఖ వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ కేవలం నాలుగు స్వరాలతోనే మహతి అనే ఒక రాగాన్ని కూర్చారు). ఉదాహరణకి మోహన రాగం ఆరోహణలో ‘స1 – రి2 – గ1 – ప1 – ద2’ స్వరాలు, అవరోహణలో ‘స – ద2 – ప – గ1 – రి2’ స్వరాలు ఉన్నాయి. అలాగే కళ్యాణి రాగానికి ‘స – రి2 – గ1 – మ2 – ప – ద2 – ని2’ ఆరోహణా, ‘స – ని2 – ద2 – ప – మ2 – గ1 – రి2’ అవరోహణగా స్వరాలున్నాయి. ఈ విధంగా ప్రతీ పాటకీ ఒక రాగం ఉంటుంది. ప్రతీ రాగానికీ కొన్ని జీవ స్వరాలుంటాయి. అంటే ఆయా రాగంలో ఆ స్వరాలు ప్రత్యేకంగా, ప్రస్ఫుటంగా వినిపిస్తాయి. ఉదాహరణకి మోహన రాగం తీసుకుంటే, రి2, ద2లు జీవ స్వరాలు. ప్రతీ రాగానికీ ఒక మూర్చన (స్కేల్) ఉంటుంది. ఒకే రాగాన్ని వివిధ తాళాల్లో పాడచ్చు. అంటే లయని బట్టి రాగం వూగు మారుతుంది. స్థూలంగా రాగ లక్షణాలివి. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ పాడే పద్ధతిని ‘రాగాలాపన’ అంటారు.

కొన్ని రాగాల మూర్ఛన చూస్తే ఒకేలా ఉంటుంది. అంటే ఆ రాగాల్లో ఆరోహణా అవరోహణల్లో ఒకే స్వరాలుంటాయి. వాటిని రెండు వేర్వేరు రాగాలుగా గుర్తించాలంటే ఆ రాగాల్లో జీవ స్వరాలు గుర్తించ గలగాలి. ఆయా రాగాల్లో స్వర సంచారం కూడా తెలుసుండాలి. ఉదాహరణకి ఆరభి, దేవగాంధారి రాగాల్లో మూర్ఛన ఒకేలా ఉంటుంది. కానీ ఇవి రెండూ వేర్వేరు రాగాలు. ఆ తేడాని స్వర సంచారంతో సులభంగా గుర్తించచ్చు. ఆరభి రాగానికి ‘స – రి2 – మ1 – ప – ద2’ ఆరోహణలో, ‘స – ని3 – ద2 – ప – మ1 – గ3 – రి2’ అవరోహణలో, స్వరాలుంటాయి. ఇవే స్వరాలతో దేవగాంధారి మూర్ఛన కూడా ఉంటుంది. కానీ వీటి మధ్య తేడా వుంది. ఆరభి రాగంలో రి, మ, ద లు రాగచ్ఛాయా స్వరాలు. దేవ గాంధారిలో రి,గ,ద లు రాగచ్ఛాయా స్వరాలు. అలాగే ఆరభి రాగంలో ‘దద – పప – మమ – గగ – రిరి – సస’ వంటి జంట ప్రయోగాలు కనిపిస్తాయి. గాంధారి రాగంలో గ స్వరం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న తేడాల బట్టి ఈ కృతి ఆరభిలో ఉందీ, ఈ కీర్తన రాగం దేవగాంధారీ అన్నది చెప్పగలుగుతాం. త్యాగరాజు స్వరపరిచిన ‘సాధించినే మనసా‘ పంచరత్న కీర్తన ఆరభి రాగంలోనిదే. మరో కృతి ‘క్షీర సాగర‘ దేవగాంధారి రాగంలో రచింపబడింది. ఈ రెండూ వింటే ఒకేలా అనిపించినా, ఏ మాత్రం శ్రద్ధగా విన్నా తేడా కూడా పసిగట్టగలం.

అలాగే కొన్ని రాగాల్లో ప్రత్యేకమైన రసాలని చూపించడానికి ఆస్కారమెక్కువగా ఉంటుంది. దీన్ననుసరించే మన పూర్వీకులు ప్రత్యేక రసాలని కొన్ని రాగాలకాపాదించారు. ఉదాహరణకి ఖమాసు రాగం శృంగార రసానికీ, సారంగ రాగం వీర రసానికీ, ముఖారి రాగం కరుణ రసానికీ వాడడం కనిపిస్తుంది. అలాగే కొన్ని రాగాలు పాడే కాలాన్ని కూడా చెబుతారు. భూపాల రాగాన్ని ఉదయాన్నే పాడాలనీ, కొన్ని రాగాలు అన్ని వేళలా పనికొస్తాయనీ, కొన్ని సాయంత్రం లేదా రాత్రి మాత్రమే పాడాలనీ ఇలా కర్ణాటక సంగీతంలో నిర్వచించారు.

కర్ణాటక సంగీతంలో గీతాలూ, స్వరజతులూ, వర్ణాలూ, కీర్తనలూ, కృతులూ, జావళీలు ఇలా ఎన్నో రకాల రచనలు ఉన్నాయి. ఇవి చాలామటుకు ఒక్కొక్కటి ఒక్కొక్క రాగం మాత్రమే ఉపయోగించి స్వర పరచబడతాయి. ఇవి కాకుండా ‘రాగమాలిక’ అనే ఒక ప్రక్రియ కూడా ఉంది. రాగమాలిక అంటే వివిధ రాగాలనీ ఒక దండలా గుది గుచ్చడమన్నమాట. పాటలోని పల్లవీ, అనుపల్లవీ, చరణాలు వంటి ఒక్కొక్క అంగమూ ఒక్కొక్క రాగంలో స్వరపరిస్తే దాన్ని రాగమాలిక అంటారు. రచన యొక్క నడకగానీ, భావం గానీ చెడకుండా పాట యొక్క సౌందర్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే ప్రక్రియే రాగమాలిక. కర్ణాటక సంగీతంలో రాగమాలికకు ఒక విశేషమైన ఆదరణ వున్నది.

రాగమాలిక అన్నది 15వ శతాబ్దం తరువాతనే విరివిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందు ‘రాగ కదంబం’ అనే ప్రక్రియ ఉంది. కానీ రాగమాలికకీ, రాగ కదంబానికీ కొంచెం తేడా ఉంది. రాగ కదంబంలో నాలుగు వృత్తాలుంటాయి. ఒక్కో వృత్తమూ ఒక్కో తాళంలో ఉంటుంది. అంటే మొత్తం రచన ఒక రాగంలోనే ఉన్నా, తాళం మాత్రం ప్రతీ వృత్తానికీ మారుతూ ఉంటుంది. ఈ రాగ కదంబం నిర్వచనంలో భిన్నాభిప్రాయాలున్నాయి. కొంతమంది ఇది వివిధ తాళాలతోనే రచించాలంటారు. రాగ కదంబం గురించి సంగీత రత్నాకరంలో చెప్పబడింది కానీ, రాగ కదంబంలో ఏ ఏ రచనలున్నాయో చెప్పబడలేదు. పలానా వాగ్గేయకారుడు రాగ కదంబంలో రచించాడని చెప్పడానికి ఆధారాలు లేవు.

రాగమాలిక రాగ కదంబాన్ననుసరించి పుట్టిందే అయినా ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. తాళం మాత్రం ఒకటే ఉన్నా, ప్రతీ అంగానికీ రాగం మారుతూ ఉంటుంది. ఇందులో కూడా నాలుగు రాగాలకంటే తక్కువ ఉండకూడదు. కానీ కొన్ని సంగీత రచనలు రెండూ, లేదా మూడు రాగాల్లో వింటూ ఉంటాం. కొన్ని రాగమాలికల్లో అనుపల్లవి కనిపించదు. సాధారణంగా రాగమాలికలో ఒక్కో చరణం ఒక్కో రాగంలో ఉంటుంది. ప్రతీ చరణానికి చివర చిట్టస్వరం (రాగం తీరుని చూపిస్తూ చేసే స్వరకల్పన) ఉండచ్చు, లేకపోవచ్చు. ఉంటే ఆ చిట్టస్వరంలో కొంతభాగం పల్లవి రాగాన్ని అనుసరించి ఉంటుంది. ఇది ఒక వంతెనలా పల్లవినీ, చరణాలనీ కలుపుతుంది. ఈ రాగమాలికలో పలానా రాగాలే ఉండాలన్న నియమేమీ లేదు. మేళ కర్త రాగాలూ ఉండచ్చు. జన్య రాగాలూ వాడచ్చు. కాకపోతే ఒక రాగం నుండి మరో రాగానికి మారేటప్పుడు అది సున్నితంగా వినసొంపుగా సాగాలి. హృద్యంగా ఉండాలి.

కొంతమంది వాగ్గేయకారుల రాగమాలికల్లో ప్రతీ చరణంలోనూ సాహిత్యమూ, భావమూ చెడకుండా అందులో వాడే రాగాల పేర్లు కూర్చినవున్నాయి. ఉదాహరణకి సీతారామయ్యర్ అనే వాగ్గేయకారుడు ఎనిమిది రాగాలతో ‘నిత్య కళ్యాణి నిగమాగమ సంచారిణీ’ అనే రాగమాలికని రచించాడు. ఈ రచనలో ఇంతకు ముందు చెప్పబడిన చిట్ట స్వర రచనా, ప్రతీ చరణంలోనూ వాడిన రాగాల పేర్లూ ఉంటాయి. ఇందులో కళ్యాణి, శంకారాభరణం, తోడి, కాంభోజి, నాయకి, భైరవి, మోహన, భూపాల రాగాల పేర్లు సాహిత్యంలో చొప్పించబడ్డాయి. రచన కొంత తెలుగులోనూ, కొంత సంస్కృతంలోనూ ఉంది.

నిత్యకల్యాణి నిగమాగమ సంచారిణి అత్యానంద అభిరామ అమర సేవిత త్రిపురసుందరి (రాగం:కల్యాణి)
కరుణాకరి కంబుకంఠి కాత్యాయని కౌమారి శరణాగత రక్షకి శ్రీ శంకరాభరణ వేణి (రాగం: శంకరాభరణం)
పరమ ప్రీతి తోడితోను పాలింపు జాలమేల పరితాపములెల్ల ఇపుడు పరిహరింపుము పతితపావని (రాగం: తోడి)
గంభీర భాషణి కాలకంఠునిరాణి కాంభోజాధి పతులు కాంక్షతో కొనియాడుచున్నారు (రాగం: కాంభోజి)
దిక్కెవరు నీవే గదా దీనదయాపరి అంబ మక్కువతో బ్రోచే శ్రీ మంగళ నాయకి (రాగం: నాయకి)
మధుకైటభ భంజని అంబ మరాళ గమన భైరవి మధురాపుర వాసిని మహేశ్వరి మీనాక్షి (రాగం: భైరవి)
ఆది శక్తి శంకరి అఖిలాణ్డేశ్వరి నీదు పద సన్నుత భక్త పోషణి పార్వతి ముద్దు మోహనాంగి (రాగం: మోహన)
పాండ్య భూపాల పుత్రి పర్వత రాజకుమారి తాండవేశ్వరి రక్ష దాస సీతారామ పాలిని (రాగం: భూపాళ)

అలాగే, స్వాతి తిరునాళ్ రచించిన ‘సానంతం’ రాగమాలికలో నాలుగే రాగాలుంటాయి. ఇందులో కూడా రాగాల పేర్లు సాహిత్యంలో కనిపిస్తాయి. అలాగే శ్యామశాస్త్రి ‘అంబా నిను నెరనమ్మితి’ అనే రాగమాలికని ఎనిమిది రాగాలతో రచించాడు. పధ్నాలుగు రాగాలతో చతుర్దశ రాగమాలికని ముత్తుస్వామి దీక్షితార్ రచించాడు. ఇలాగే పక్షమాలికలూ, 72 మేళకర్త రాగమాలికలూ ఇలా పలు రకాలు రచింపబడ్డాయి. త్యాగరాజు కూడా నూరు రాగాలతో ‘శతరాగ రత్నమాలిక’ అనేది రచించాడనీ చెబుతారు. కానీ ఇది ఎవరికీ లభ్యం కాకపోయినా ఈ రచన ఆధారంగానే ‘రాగ రత్న మాలికచే’ అనే కృతి రాసాడని అంటారు.