ఎప్పుడైతే భిక్షా పాత్ర త్యజించాలనుకుంటున్నాడో, తన ప్రియ సఖిని చేరుకోవాలనుకుంటున్నాడో, మనస్సుని ఇంటి దారి మళ్ళించాడో అప్పుడే నందుని ధైర్యం సన్నగిల్లింది. విరామం లేకుండా అతను రోదిస్తున్న సమయంలో తధాగతుని వద్దకు రమ్మనమని పిలుపు వచ్చింది.
దీక్ష తీసుకొని ముక్తి మార్గం వైపు పయనించాల్సిన బుద్ధి, విషయవాంఛలు ఆవరించుకున్న గృహోపచారాలవైపు మళ్ళడం తెలుసుకున్న బుద్ధుడు నందుణ్ణి విషయం ఏమిటని ప్రశ్నించాడు. నందుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాగో ధైర్యం చేసి మెల్లగా తన నిర్ణయం చెప్పాడు.
విషయోపభోగాల చీకటిలో చిక్కుకున్న నందుణ్ణి చూసాడు. ఒక్కసారి మెల్లగా ప్రేమపూర్వకంగా అతని చేతిలో చేయి వేసాడు. నందుడు ఒక్కసారి తలెత్తి చూసాడు. అలుముకున్న చీకటి ముందు ప్రకాశవంతమైన బుద్ధుడి నేత్రాలు కాంతిపుంజాల్లా అగుపించాయి. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది నందుడికి.
అంటిన మైలను శుభ్ర పరచడం కోసం గంగానది వైపు మరలినట్లుగా తధాగతుడు నందుడ్ని యోగవిద్యా ప్రభావంతో ఆకాశంలోకి తీసుకెళ్ళాడు.
నదులు, పర్వతాలు, సుందరారణ్యాలు దాటుకుంటూ పయనిస్తున్నారిద్దరూ!
ఏం జరుగుతోందో నందుడి కి అర్థం కావడంలేదు. అత్యంత రమణీయమైన ప్రకృతి ఒక్కసారి అతని కళ్ళలో అద్భుతమైన రంగురంగుల చిత్రాల్ని చిత్రీకరిస్తోంది. ఒక్కసారి పులకించిపోయింది మనస్సు. వెండి వెన్నెలలాంటి ఆ ప్రదేశం హిమాలయాలు కాక ఏమయ్యింటుంది అనిపించింది నందుడికి. ఒక్కసారి క్రిందకి చూసాడు. అనితర తపో దీక్షలో ఉన్న సిద్ధుల పాదాల తాకిడితో పులకరిస్తున్న హిమాలయాలు కనిపించాయి.
ఆ ఆహ్లాద వాతావరణం ఒక వింత అనుభూతిని కలిగించింది అతనికి. రమణీయమైన పుష్పాలతో అలంకరించికున్న వనాలు, స్వచ్చమైన సెలయేళ్ళు, ఒడ్డున పురివిప్పిన మయూరాలు, సువాసనలతో పరిమళాన్ని అద్దిన దేవదారు వృక్షాలు పక్షుల కిలకిలరావల మోహనరాగాలు, ఇవనీ చూస్తే తనువు పులకరించింది అతనికి.
ఒక గుట్టపైనుండి ఇంకో ఇంకో గుట్టకి, ఒక చెట్టుపైనుంది ఇంకో చెట్టు పైకి ఎగురుతూ అక్కడ ఉన్న దేవాదారు వృక్షం చేరుకున్న ఓ ఆడ కోతుల జంటలు వారి దృష్టిని ఆకర్షించాయి. వాటిని చూపిస్తూ నందుడితో ఇలా అనాడు బుద్ధుడు.
“ఓ నందా ! నీ దృష్టిలో ఎవరు అత్యంత సుందరీ మణులు? ఆ కోతులా లేక నీ ప్రియ సఖా? ”
ఒక్కసారి ఆశ్చర్యపోయాడు నందుడు. ఆ ప్రశ్న విని, తనలో తను నవ్వుకుంటూ –
” ఓ బుద్ధ భగవానుడా! ఈ కోతులకు, ముగ్ధమనోహర రూపవతి అయిన సుందరికీ పోలికా? హాస్యానికైనా ఈ పోలిక సరికాదు!” అన్నాడు.
అతని సమాధానం బుద్ధుడి ముఖంలో చిరునవ్వును చెరపలేక పోయింది. ఇంకొంత దూరం పయనించాక ఇంద్రుడి కేళీవనం చేరుకున్నారిద్దరూ!
విస్ఫారిత నేత్రాలతో నందుడు అత్యంత రమణీయమైన ఆ వనమంతా కలయజూసాడు.
ఒక్కట ఒక తటాకంలో అతిలోక సుందరిలైన అప్సరసలు జలక్రీడలాడుతూ కనిపించారు నందుడికి. వారి అందం చూసి స్తబ్ధుడయ్యాడు. వారి అందం అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేసింది. వారిని చూసి అతని మనస్సు వ్యాకుల మయ్యింది. ఆ అప్సరలసల పొందుకోసం మనస్సు ఉవ్విళ్ళూరింది.
చికిత్సకు ముందు వైద్యుడు రోగి యొక్క రోగం పెరిగేలా చేసినట్లుగా, బుద్ధుడు రాగద్వేషాల్లో రాగాన్నీ, దాన్ని అలుముకున్న మోహాన్నీ నందుడి లో పెంపొందింపచేసాడు.
చిన రూపాన్ని పెద్ద రూపం ఆవరించుకున్నట్లుగా, పెద్ద శబ్దం చిన్న శబ్దాన్ని మింగేసినట్లుగా, పెద్ద రోగం చిన్న నొప్పిని మరపిప చేసినట్లుగా, పెద్దదైన వస్తువు చిన్న దానికి వినాశానికి కారణ భూతం అవుతుంది.
చంచలమైన నందుడి మనస్సుని గ్రహించాడు తధాగతుడు. నందుడికి నిన్నటి ప్రియ సఖి సుందరి కన్నా నేటి ఈ అప్సరసలే సమ్మోహనంగా అనిపించారు. వారి పొందులేని జీవితం వ్యర్థం అనిపించింది అతనికి. అతనిలోని కోరిక అతని కంటే పెద్దదయ్యింది. ఆ కోరికే అతన్ని ముందుకు తోసింది. అతను పడతాడని అప్పుడు తన ఆపన్న హస్తం ఎలగూ రక్షిస్తుందన్న కాలజ్ఞానం బుద్ధుడికి ఉంది.
నందుడు మనసులోని కోరిక బయటకు తన్నుకొచ్చింది.
“ఓ స్వామీ! సుందరి కంటే అత్యంత మనోహరీమణులు ఈ అప్సరసలు! వీరి పొందుజేరిన వారిదెంత అదృష్టమో కదా! ఈ అప్సరసల అందం ముందు ఎవ్వరూ సాటి రారు. ఇంతకు పూర్వం సుందరి తప్ప ఎవ్వరూ నాకంటికి అందంగా కనిపించని నాకు, ఈ అప్సరసల సాంగత్యం లేని జీవితం వ్యర్థం అనిపిస్తోంది”
తధాగతునికి విషయం అర్థమయ్యింది. ఉవ్వెత్తున లేచిన కామాగ్నికెలా ఆజ్యం పొయ్యాలో బుద్ధుడికి తెలుసు. ఆ ఆజ్యమే అతని దారి సుగమం చేస్తుందన్న విషయం మరింతగా తెలుసు.
శాంతంగా బదులిచ్చాడు తధాగతుడు.
“ధైర్యంతో నీ మనస్సులోని వికారాన్ని తుడిచేయి. కర్ణాలు తెరిచి మనస్సుని నియంత్రణ చేయి. నీకు నిజంగా ఆ అప్సరసల పై కోరిక ఉంటే వారికోసం తప్పస్సు చెయ్యాల్సివస్తుంది. దానికి నువ్వు సిద్ధమేనా? ఈ అప్సరసలు కేవలం ధర్మాచరణ ప్రాయమైన తపస్సు వల్లే లభిస్తారు. నువ్వే కనుక వీరి పొందు కోరుకుంటే ఆలస్యం చేయక ప్రయత్నాపూర్వకమైన వ్రతాన్ని పాటించు. ఆ తపస్సే నీకు వీరిని నీ వశం జేస్తుంది.”
తధాగతుని ప్రవచనాలు నందుడిలో కోరికకి ఆశను కలిగించాయి. ఆ ఆశే అతన్ని ముందుకు తోసింది. అంతరంగంలో విషయ వాంఛ ముందు ఈ తపస్సు అతి చిన్నదిగా అనిపించింది. కోరికను మించిన శక్తి లేదు. అదే అతన్న్ని అతని జీవితాన్ని నిర్దేశిస్తుందని తధాగతునికి తెలుసు.
నందుడు సరే నన్నాడు, నాగస్వరానికి తలాడించిన సర్పంలా !
యశొధరని చూడగానే ఒకాసారి దుఖం ఆపుకోలేకపోయింది సుందరి. ఒక్కసారి యశోధరను ఆలింగనం చేసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను అనునయిస్తూ యశొధర తల నిమిరింది.
యశొధరకి ఆ బాధ లోతులూ, ఎత్తులూ తెలుసు, ఒకప్పటి తన పరిస్థితినే ఇప్పుడు సుందరి ఎదుర్కుంటోంది.
“బాధ పడకు సుందరీ! విషయం తెలిసి వచ్చాను. సాటి ఆడదానిగా నీ బాధని అర్థం చేసుకోగలను. వగచి ప్రయోజనం లేదు. ధైర్యంగా ఉండు”
“ధైర్యం ఎక్కడినుండి వస్తుంది చెప్పండి, మహారాణీ? క్షణంలో వస్తాడనుకున్న ప్రియుడు మరో క్షణంలో దూరమవుతాడని ఎవరైనా ఊహిస్తారా? అలా ఊహిస్తే ప్రేమిస్తారా? నాకేమీ పాలుబోవడంలేదు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావడంలేదు. ”
ఏడ్చి ఏడ్చి ఆమె ముఖం ఎర్రబడింది. కన్నీటి చారికలు ఆమె అందాన్ని ఆక్రమించుకున్నాయి.
“బాధపడకు సుందరీ! ఇంతకుముందు నేనూ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నదాన్నే! అప్పుడు ప్రాణ త్యాగం చేయాలనిపించింది. కానీ రాహులుడి కోసమే మనసు రాయి చేసుకొని నిర్జీవంగా కాలాన్ని వెళ్ళ బుచ్చాను. ఏం చేస్తాం, ఇది మన తలరాత….దానికెవరూ బాధ్యులు కారు…”
“కాదు మహారాణీ ! ఈ రాతలకు బాధ్యులు మనం కాదు వీళ్ళే ! మనమేం పాపం జేసావని ఇలా నట్టేట్లో ముంచి, వాళ్ళు బౌధ భిక్షువులుగా మారడానికి. ఇదే ఆ నందుడ్ని అడగాలనుకుంటున్నాను. మాటవరసకి ఒక్క సారి కూడా ప్రస్తావించ కుండా ఇలా చేయడం తట్టుకోలేకపోతున్నాను.”
సుందరిలో కోపం ఎక్కువయ్యి, ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి.
“చెప్పానుగా ! ఒకప్పటి నేను అనుభవించిన దానినే నువ్వూ చూస్తున్నావు. ఏ పాపం ఎరుగని నాకు శిక్ష పడిందనుకున్నాను. సిద్దార్ధుడు మరల తిరిగి వస్తాడని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసాను. తిరిగి వచ్చాడు. ఫలించిందనుకున్న నా కల నన్ను మరోసారి అగాధంలోకి నెట్టేసింది. బిక్షువుగా ఈ కపిలవస్తునగరం వచ్చిన సిద్దార్ధుణ్ణి నేనూహించుకోలేక పోయాను. నిజానికి ఆ నాడు బౌద్ధ సన్యాసం స్వీకరించింది సిద్దార్ధుడు కాదు, మానసికంగా నేను. అందుకే ఈ రోజు వరకూ నేను ఆ సిద్ధార్ధుడి ఎదుట పడ లేదు.”
యశోధర గొంతు జీర బోయింది. అప్రయత్నంగా ఆమె కన్నీళ్ళు కార్చింది. సుందరికి ఒక్కసారి ఆమె ముఖంలోకి చూసింది. బాధలో తనకి పెద్దతోడుగా కనిపించింది యశోధర. ఈ లోకంలో తననెవరైనా అర్థం చేసుకోగల వ్యక్తి ఉనారు అంటే అది ప్రస్తుతం యశోధరొక్కతే!
అదే ప్రియులు, అదే గాయం, అదే బాధ, కాలమొక్కటే తేడా!
“మహరాణీ యశోధరా ! నేను మీలా మౌనంగా విలపించదలచుకోలేదు. వెళ్ళి ఆ నందుడ్నే నిలదీస్తా? నన్ను కాదాంటే కాదన్నావు, ఇలా చెప్పా పెట్టకుండా పారిపోవడమేమిటని గట్టిగా అడుగుతాను. కారణం చెప్పే వరకూ వదలను.”
యశోధరికి సుందరి అమాయకత్వం చూసి నవ్వొచ్చింది.
“సుందరీ ! నీ ప్రశ్నలన్నీ అడగాలంటే ముందు ఆ నందుడు నీ కళ్ళెదుటబడాలికదా? భిక్షువుల ఆశ్రమానికి పర స్త్రీల ప్రవేశం లేదు. అదీకాక ఒకసారి భిక్షువైన తరువాత ప్రశ్నించీ ప్రయోజనం లేదు.”
“మీరన్నది నిజమే అయినా నేను నా నందుణ్ణి సాధిస్తాను. బ్రతిమాలుతాను. ప్రాధేయపడతాను. ప్రార్థిస్తాను. ఇవేమీ కాకపోతే ఎదిరిస్తాను. నేను ఇలా వదిలిపెట్టను.”
కొంతసేపు అక్కడ గడిపి యశోధర తన మందిరానికి వెనక్కి వెళ్ళిపోయింది. సంతోషానికి శత్రువులెక్కువ, బాధకి బంధువులెక్కవ అన్న విషయం సుందరికి అర్థమయ్యింది.
ఆమెలో ఆవేశం పెరిగింది. తన ప్రియుడ్ని ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలన్న ఆమె కోరిక పట్టదల మార్గంలో మొదటి అడుగు వేసింది.
ఆ అడుగు దేనికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు, ఒక్క తధాగతుడికి తప్ప!
*************
( సశేషం )