కొడవటిగంటి సాహిత్యంతో అవసరం ఇంకా ఉందా?

నాకు ఒకటే ఆశయం – నా రచనల వల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండి తీరాలి. వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపయోగం చేసిన వాణ్ణవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు. ఇంకా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం రాస్తున్నాననే అహంకారం కూడా నాకు లేదు. నేను ఆకాశం నుంచి ఊడిపడలేదు. నాకు పూర్వం కథలు రాసిన వారు ఎక్కడ విడిచి పెట్టారో నేను కథా రచనను అక్కడే అందుకోగలను కాని అంతకు పైన ఎట్లా అందుకోగలను?” – (ముందుమాట, కొకు ‘కారుణ్యం’ 1937).

ఈ మధ్య వచన సాహిత్యంలో చెప్పుకో తగిన ప్రతిభ కనపరచిన కొడవటిగంటి కుటుంబరావు (కొకు) శతజయంతి సందర్భంగా అమెరికాలో జరిగిన రెండు సాహిత్య సదస్సుల్లో నన్ను మాట్లాడమన్నారు. నేను ఏమిటి మాట్లాడాలి అనుకుంటుండగా “ఆ పాత సాహిత్యంలో ఏముంది మాట్లాడటానికి?” అన్న నా మిత్రుని ప్రశ్న నన్ను నిజంగానే ఆలోచింపచేసింది. నిజమే! అప్పటి సాహిత్యంతో ఇప్పుడు పనేమిటి? అన్నది ఆలోచింపతగిందే! ఇదే ప్రశ్నకు నా జవాబునే ఆ ప్రసంగాలకి, ఇప్పుడు ఈ వ్యాసానికి కేంద్ర బిందువును చేసుకున్నాను.

కొకు రచనల్లో ఒక విలక్షణత ఆయన రచనల్లో కనపడే అభ్యుదయ దృక్పథం. కొకు రచనలు ఆలోచనలను రేకెత్తిస్తాయి. ” రచయిత సమాజాన్ని ‘కుక్క కాపలా’ కాయటం కష్టమే” అనే కొకు వాక్యాల వెనుక ఎంతో ఆలోచన ఉంది. 1930, 40 దశాబ్దాల్లో తెలుగు మధ్య తరగతి కుటుంబాలని (కొంత ఎక్కువగా బ్రహ్మణ కుటుంబాలని) నిశితంగా పరిశీలించి వాటికి సంబంధించి ఎన్నో ఇతివృత్తాలను తన కథల్లోకి కొకు తీసుకొన్నాడు. ఉదాహరణకి జాతకాలు – వాటి ప్రభావాలు, మత పరమైన మూఢ విశ్వాసాలు, పిల్లల్ని పెంచటంలో పెద్దవాళ్ళ మూర్ఖత్వాలు, సామాజిక స్పృహ లేని వ్యక్తులు, మధ్య తరగతి మానవ సంబంధాలు, వాటిల్లో ముఖ్యంగా స్త్రీ – పురుష సంబంధాలు, అందులో దాంపత్యేతర సంబంధాలు కొకు రచనల్లో వస్తువులు.

ఈ వ్యాసం శీర్షికలో ప్రశ్నకి సమాధానం ఏమిటి? ఎప్పుడో దాదాపు ఏభై ఏళ్ళ క్రితం తెలుగులో వచ్చిన కొకు సాహిత్యం (ముఖ్యంగా కథలు, నవలలు, వ్యాసాలు) ఆంధ్రదేశంలో కొంత అలజడి రేపిన మాట నిజం. అనేక రంగాల్లో రాసిలోనూ, వాసిలోనూ గత రెండు దశాబ్దాలకి పైగా చెప్పుకో తగ్గ అభివృద్ధి సాధించిన అమెరికా తెలుగు వారికి, తెలుగు సాహితీ ప్రపంచంలో ప్రగతిశీల మేధావిగా గుర్తించబడ్డ కొకు ఏభై ఏళ్ళకి పైగా సృష్టించిన సాహిత్యం అవసరమా? కొకు సాహిత్యంలోని కొన్ని ఇతివృత్తాలని ఉదాహరణలుగా తీసుకొంటే వాటి ఆవశ్యకత ఇప్పటి అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి జీవితాల్లో ఇంకా ఉందా? ఉంటే ఎలా ఉందన్న విషయాలను మూడు కొకు రచనలని ఉదాహరణలుగా తీసుకొని మీ ముందుంచటానికి ప్రయత్నిస్తాను.

“దేవుడింకా ఉన్నాడు”

కొకు 1954లో రాసిన ఒక చిన్న కథ ఇది. ఉత్తమ పురుష దృష్టికోణంలో కథ సాగుతుంది. కథ చెప్పేవాడే ఈ కథలో ఒక పాత్ర. కులాంతర వివాహం, అందులోనూ ఒక వితంతువును పెళ్ళి చేసుకోటం వల్ల తన వాళ్ళందరిచే వెలివేయబడి తన గ్రామాన్ని వదలి వెళ్ళిపోతాడు. ఊరు నుంచి తనని పంపించటానికి విశ్వ ప్రయత్నాలు చేసి పంపేసిన బంధువర్గం అంతా, తను పదేళ్ళు హాయిగా జీవించటం చూడలేక మళ్ళీ తమ ఊరు రమ్మంటూ రాసిన ఉత్తరాలకి జవాబుగా తిరిగి తన ఊరు వస్తాడు. తన బంధువర్గంలో ఎవరి మొహానా ఒక సంతోషంగాని విచారంగాని లేకపోటం గమనిస్తాడు. ఊచపుల్లల్లాంటి కాళ్ళు, బాన పొట్టలతో అనారోగ్యంగా తిరుగుతున్న తన పెద్ద అన్న పిల్లల్ని, వాళ్ళ మొలలకి, మెడలకి వేలాడున్న తాయత్తుల చూసి ఇది ఏమిటని వేసిన ప్రశ్నలకి వచ్చిన సమాధానం “భైరవ శాస్త్రులూ… నవగ్రహం జపం చేసి… తాయత్తు కట్టాళ్ళే!” అని.

కథకుడి సత్యం అన్నయ్య రెండో భార్య గుర్రబ్బండి వాడితో మళ్ళీ లేచిపోయిందని, అందుకు కారణం చచ్చిపోయిన మొదటి భార్యేనని చెప్పే వివరణ ఇలా ఉంటుంది. “భైరవ శాస్త్రులని పిలిపిస్తే అసలు కీలకం ఇట్టే చెప్పాడు. ఇదంతా సత్యం మొదటి పెళ్ళాం పనే! అసలు సత్యానికి గురువులో శనీ! రవి కోణంలో ఉన్నాడు. సప్తమంలో శుక్రుడూ, బుధుడూ ఉన్నారు… ఇంకా రెండేళ్ళ, మూడు నెల్ల, పన్నెండు రోజులు. అప్పటికి సత్యానికి మారకమన్నా కావాలీ లేదా మంచి యోగమన్నా పట్టాలి. ఏదో ఒకటి తప్పదు…”

ఇంకేదో మాటల సందర్భంలో ఆ ఇంటిలో ఒకే ఒక నివాస యోగ్యమైన గదిలో చనిపోయిన చిన తాతయ్య దెయ్యమై ఉన్నాడని ఆ గదిని పడగొట్టించటం ఏమిటి? అని అడిగిన ప్రశ్నకి సమాధానం, “భైరవ శాస్త్రులు చేత ముగ్గులూ అవీ వేయించాం. లాభించలేదు. తాతయ్యకు భేతాళ మంత్రం వచ్చును. కాదు మరీ? భైరవ శాస్త్రులు ముగ్గులు పని చెయ్యలేదు. మారణహోమం చేస్తానన్నాడు భైరవ శాస్త్రుల్లు. బ్రహ్మహత్య దేనికని మేమంతా వారించాం!” ఇన్ని అనర్ధాలు జరిగినప్పటికీ, ఇంకా తామంతా బతికి ఉన్నారంటే అందుకు కారణం ‘దేవుడింకా ఉన్నాడు’ అన్న విశ్వాసం తన బంధువర్గం చూపటంతో కథ ముగుస్తుంది.

ఈ కథ నేను దాదాపు ముప్ఫై ఏళ్ళ క్రితం, ఇంకా అమెరికా రాక ముందు చదివాను. కథ రాసింది 1954లో అయినా, కథా కాలం 1930, 40ల్లో జరిగిందనిపిస్తుంది. నమ్మకాలకి, మూఢ నమ్మకాలకి ఉన్న వెంట్రుక వాసి తేడా ఎలా ఉంటుందో నాకు ఈ కథలో కనిపించింది. పై కథలో ఒక వాక్యం “తన బంధువర్గంలో ఎవరి మొహానా ఒక సంతోషంగాని విచారంగాని లేకపోటం గమనిస్తాడు” గురించి ఎంతైనా భాష్యం చెప్పుకోవచ్చు. తమ జీవితాలు పరాధీనమైనప్పుడు కలిగే నిర్లిప్తత అది. అమెరికా వచ్చిన తరవాత ఈ కథ ఒక కొత్త కోణంలో నాకు కనపడసాగింది. గత ఇరవై, ముప్ఫై ఏళ్ళల్లో అమెరికాలో ఉన్న తెలుగువారికి భక్తి పెరిగిందనటంలో సందేహం లేదు. ఈ విషయంలో నాకు ఎటువంటి పేచీ లేదు. కానీ, కొన్ని కొత్తగా వస్తున్న మార్పులు నాకు కొరుకుడుపడటం లేదు. ఉదాహరణకి ఈ మధ్యే ఆంధ్ర రాష్ట్రంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న రాజకీయ సంఘటనలకి స్పందనగా, అమెరికాలో పర్యటనలో ఉన్న ఒక తెలుగు స్వామీజీ ఇక్కడ నుంచే “తెలుగు ప్రజలు ఈ కష్ట సమయంలో కలిసి కట్టుగా ఉండాలి” అని ‘పిలుపు’ నిచ్చారు. ఈ వార్తని ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక స్వామీజీవారి ఫొటోతో సహా మొదటి పేజీలో ప్రచురించింది. మతగురువులకు రాజకీయాలతో పని ఏమిటో తెలియదు! ఇది వరకు ఎన్నడూ లేనంతగా భారతదేశం నుండి మత గురువులు అమెరికా పర్యటిస్తున్నారు అన్నది తెలిసిన విషయమే! ఈ మత గురువుల పర్యటనల ప్రయోజనం ఏమిటి? ఏమి ఆశించి వారు అమెరికా వస్తున్నారు? వీరిని పిలిపించే వ్యక్తుల ఆంతర్యం ఏమిటి? ఇందుకు కారణాలు ఏమిటి? అమెరికా ప్రవాసాంధ్రుల ఆర్థిక స్థోమత బాగా ఉండటమా? లేక పాపభీతి పెరిగిందా? అదీ కాకపోతే సాంప్రదాయ పునరుద్ధరణా? ప్రవాస జీవితం వల్ల ఏర్పడిన ఒక శూన్యతను పూడ్చే ప్రయత్నమా ఇది? లేక మనలో ‘దేవుడింకా ఉన్నాడు’ వంటి నమ్మకాలు పెరగటం వల్లా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అని నాకు తోస్తోంది.

“చదువు, వారసత్వం”

ఈ రెండూ కొకు రాసిన పెద్ద నవలలు. చదువు నవల ఇతివృత్తం మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య ఆంధ్రదేశంలో జరిగిన సంఘచరిత్రలో మార్పులు వివరిస్తుంది. వారసత్వం నవల భర్త సహాయం అతి తక్కువగా ఉన్న ఒక గృహిణి తనకి ఉన్న ఒక్క పిల్లవాడిని పెంచి పెద్దచేయటం ఇతివృత్తంగా కలది. ఈ రెంటిలోనూ పిల్లల పెంపకం మీద ఉపన్యాస ధోరణిలో కాకుండా పాఠకులు ఆలోచించేటట్లు తన నిశితమైన పరిశీలనలని మన ముందు ఉంచుతాడు రచయిత. ఉదాహరణకి, పిల్లలు పెరుగుతున్నకొద్దీ వారు తమ తల్లితండ్రుల కన్న తోటి స్నేహితుల నుంచి ఎక్కువ నేర్చుకుంటారు అన్న విషయాలని కొన్ని విపులీకరిస్తాడు. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వారు తమ నుంచి దూరమయిపోతున్నారని బెంగపడే తల్లితండ్రులు ఆరాటాన్ని కూడా వర్ణిస్తాడు. కొకు రచనల ముందు వచ్చిన చలం రచనల్లో ‘పిల్లల పెంపకం’ అన్న అంశాన్ని చర్చించినా, చలం రచనల్లో లేని ఒక శాస్త్రీయ దృక్పథం కొకు రచనల్లో కనపడుతుంది. అలా అని ‘పిల్లల్ని పెంచడంలో వారి వ్యక్తిత్వ వికాసానికి మార్గాలు’ అన్న నీతిబోధ ధోరణిలో సాగవు ఈ రచనలు.

ఈ నేపథ్యంలో నేను చూసిన కొన్ని పరిశీలనలని మీ ముందుంచుతాను. మాకు బాగా తెలిసిన ఒక తెలుగు కుటుంబంలోని వారమ్మాయి కాలేజీ చదువుల కోసం పొరుగు ఊరికి వెళ్ళి చదువుకుంటోంది. ఆ అమ్మాయి మరీ చిన్న పిల్ల కాదు. కాలేజీ సెలవల్లో ఎప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వచ్చినా ఆమె తల్లితండ్రులు ఆ అమ్మాయిని ఎక్కడకీ తిరక్కుండా కట్టుదిట్టం చేసేవారు. ఏదో మాటల సందర్భంలో నేను నవ్వుతూ నా స్నేహితుడయిన ఆ అమ్మాయి తండ్రితో అనే వాణ్ణి, “మరో రాష్ట్రంలో చదువుతున్న పిల్లకి అన్ని ఆంక్షలేమిటి?” అని. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఇంటిలో తల్లితండ్రుల వద్ద ఒక రకమైన ప్రవర్తన, కాలేజీలో స్నేహితులతో మరొక ప్రవర్తన అలవాటు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర లేదు. ఇంకేదో సందర్భంలో పిల్లల పెంపకంపై నా అమెరికన్ మిత్రుడు చెప్పిన మాటలు, కొకు తన రచనల్లో సూచించిన మాటలు ఒక్కటే అనిపిస్తాయి. అవేమిటంటే “మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతుంటే, మనతో అసలు మాట్లాడుతూ ఉంటే అదే గొప్ప. అంతకు మించి ఆశించితే నిరాశ తప్పదు.”

“కొత్త జీవితం”

ఇది కొకు రాసిన ఒక పెద్ద కథ. ఒక పల్లెటూర్లో అప్పుల్లో మునిగి, పేదరికం అనుభవిస్తున్న కుటుంబం నుంచి పని కోసం బొంబాయి వచ్చిన ఒక కుర్రాడి కథ ఇది. బొంబాయిలో అతి కష్టం మీద పని సంపాదించటమే కాకుండా, ఆ వచ్చిన అతి తక్కువ సంపాదనలో తినీ తినకుండా గడుపుతూ, తన కుటుంబాన్ని ఋణవిముక్తుల్ని చెయ్యటానికి ఇంటికి డబ్బులు పంపుతూ ఉంటాడు ఆ కుర్రాడు. పెద్ద నగరాల్లో ఆ కాలానికి తగ్గట్టు కార్మిక జీవితం గురించి కొంచెం విపులంగానే వర్ణన ఉంటుంది ఈ కథలో. కొంత కాలం తరవాత, తను ఇంటికి పంపిన డబ్బుతో అప్పటికి అప్పులన్నీ తీరి తన వాళ్ళు సుఖంగా ఉంటారన్న ఆశతో జీతం నష్టంపై సెలవు తీసుకొని తన వాళ్ళను చూడబోతాడు ఆ కుర్రాడు. ఇంటికి వెళ్ళిన తరవాత తన తల్లితో మాట్లాడుతూ చేసిన అప్పులన్నీ తీరకుండా అలాగే ఉన్నాయని తల్లి చెప్పటంతో నిర్ఘాంత పోతాడు ఆ కుర్రాడు. మరి తను పంపిన డబ్బంతా ఏమయ్యింది అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ కుర్రాడి తల్లి, “అదేమిట్రా! ఆ డబ్బంతా నేను వాడుకున్నానా! మొన్న పండగలకి నీ పెద్దక్క వాళ్ళ పిల్లలు వస్తే, పిల్లదాని చేతులు బోసిగా ఉన్నాయని నాలుగు బంగారు గాజులు చేయించాను. ఆ తరవాత పండగలకి నీ చిన్నక్కని వాళ్ళ కుటుంబాన్ని పిలవటంతో పెరిగిన ఖర్చులకి నువ్వు పంపిన డబ్బు వాడాను,” ఇలా ఒక జాబితా ఇస్తుంది తల్లి. జరిగింది తెలుసుకొని తిరిగి ఆ కుర్రాడు పట్నం వెళ్ళిన తరవాత మళ్ళీ తన ఇంటికి ఎర్ర ఏగానీ పంపలేదు అన్న వాక్యంతో కథ ముగుస్తుంది.

ఈ కథలో ఉన్న విషయాలకి చాలా దగ్గరగా ఉన్న సంఘటనలు కొన్ని అమెరికా జీవితంలో కనపడ్డాయి నాకు. పై చదువులకి అమెరికా వచ్చిన కుర్రాళ్ళు కొందరు చదువుకుంటూ, గాస్ స్టేషన్‌లలో, రెస్టారెంట్‌లలో పని చేస్తూ ఇండియాలో బంధువులకు డబ్బులు పంపిన వారు కొందరు నాకు పరిచయమే! పై కథలో జరిగినట్టుగానే వీరి జీవితాల్లో కూడా ఇంటికి పంపిన డబ్బు సద్వినియోగం కానప్పుడు నిరాశ చోటు చేసుకోటం చూసాను. పై కథలోని కుర్రవాడి కుటుంబానికి, పట్నంలో ఎంతో కష్టపడితేనే కాని డబ్బులు సంపాదించటం సాధ్యం కాదు అన్న విషయం బొత్తిగా తెలియని పరిస్థితి. సరిగ్గా పై కథలో జరిగినట్టుగానే, ఇండియాలో చాలా మందికి అమెరికాలో కష్టపడి డబ్బులు సంపాదించటంలో ఉన్న సాధక, బాధకాలపై బొత్తిగా అవగాహన ఉండదు. ఎన్నో కష్టాలకి ఓర్చుకుంటూ, ఒక పక్క చదువు మరొకపక్క సంపాదన బాధ్యతల్లో కుర్రకారు అవస్థలు పడటం చూస్తూ ఉంటాం! “మన వాడు డాలర్లలో సంపాదిస్తున్నాడుగా! డబ్బులు ఇంటికి పంపించటం తన బాధ్యత!” అన్న ధోరణిలో మాట్లడతారు ఈ విషయాల్లో ఎటువంటి అవగాహన లేని ఇండియా బంధువులు. ఏది ఏమైనా ఈ కథ తప్పకుండా కొన్ని కొత్త ఆలోచనలని రేపుతుంది.

చివరగా…

ఈ వ్యాసం మొదలులో కొకు తన రచనల గురించి ఏమన్నాడో రాశాను: “నాకు ఒకటే ఆశయం – నా రచనల వల్ల కూడా మనోవికాసం పొందదగిన వాళ్ళు తెలుగు వాళ్ళలో ఉండి తీరాలి. వారందరూ నా కథలు చదవాలని నా కోరిక. వారందరికీ నా రచనల మీద ఎంత త్వరగా ఏవగింపు కలిగితే అంత ఉపయోగం చేసిన వాణ్ణవుతాను తెలుగు సారస్వతానికి. అప్పటికి తెలుగు సారస్వతానికి నాతో పని అయిపోతుంది. నా కథలు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఆశ నాకు ఏకోశానా లేదు.” – (ముందుమాట, కొకు ‘కారుణ్యం’ 1937)

కొకు అలా ఎందుకు రాశాడు? సాధారణంగా రచయితలు తమ రచనలని అందరూ చదవాలని కోరుకోటమే కాక అవి కలకాలం నిలవాలనుకుంటారు. అందుకు భిన్నంగా ఏ రచయితలూ వెలిబుచ్చని ఈ అభిప్రాయాలకి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నకి రెండు రకాలుగా భాష్యం చెప్పుకోవచ్చు. మొదటిది నిజాయితీగా తన రచనలను దాటి పాఠకులు ఎదగాలని రచయిత కోరిక. ఇందులో రచయిత విశాల హృదయం, తన రచనలకున్న పరిమితులు తెలుసుకున్న విశిష్ట వ్యక్తిగా కొకు కనపడతాడు. రెండవది కొంచెం వ్యంగ్యంగా, కొంటెగా చెప్పుకొనే భాష్యం. నా రచనలను దాటి పాఠకులుగా మీరు ఎదగటం కష్టం. నేనేదైతే నా కాలంలో సమస్యలను నా రచనల్లో పెట్టానో, ఆ సమస్యలు తరవాత తరాలకు కూడా అనుభవంలోకి వస్తాయి! అవి దాటి మీరు బయట పడనంత కాలం, నా రచనలకి కూడా ఉన్న ఒకే ఒక్క ప్రయోజనం ఇంకా మిగిలే ఉంటుంది.

భవిష్యత్తు కళ్ళ ముందు కనపడటం అంటే ఇదేనా!

(ఈ వ్యాసంలో కొంత భాగం 2009 సెప్టెంబర్ 26, 27 తారీకుల్లో డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ నిర్వహించిన కొకు, శ్రీశ్రీ, గొపీచంద్‌ల శతజయంతి ఉత్సవాల్లో చేసిన ప్రసంగ ఉపన్యాసం. మరి కొంత భాగం అక్టోబర్ 18వ తారీకున ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించిన 23వ టెక్సాస్ సాహిత్య సదస్సులో చేసిన ప్రసంగం నుంచి తీసుకోబడింది. – రచయిత.)