ఆవేళ ఆదివారం. తెల్లవారకముందే, భూదేవి బ్రహ్మదేవుడి ఇంటికొచ్చి, బ్రహ్మదేవుడిని లేపి మరీ మరీ మొర పెట్టుకుంది.
“స్వామీ! మీరు హాయిగా ఉన్నారు; మీ సొమ్మేం పోయింది, చెప్పండి. ఈ కలికాలం ప్రారంభంలోనే నా కొంపతీసిందంటే నమ్మండి. ఇప్పుడు భూలోకంలో వావివరసలు వదిలేసి వివాహాలు చేసుకుంటున్నారు. అంతేనా? మొగవాడు మొగవాడిని, ఆడది ఆడదానినీ మోహించి మరీ పెళ్ళిచేసుకుంటున్నారు. ఆడవాళ్ళు మొగవాళ్ళుగాను, మొగవాళ్ళు ఆడవాళ్ళుగానూ శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్నారు. కుతర్కవాదులు, వితండవాదులు, కపట సాక్షులు, కులట పక్షులూ, దొంగలూ, దొరలూ ఒకరేమిటి! రకరకాల మోసగాళ్ళు పెరిగిపోయారు. వీళ్ళు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. భరించటం అసాధ్యం కాలేదంటే నమ్మడానికి లేదు. భ్రూణహత్యలు పెరిగి పోయాయి. మ్లేచ్చుల అధికారం పెచ్చు పెరిగిపోయింది. హెగ్గడికత్తెలు అంతఃపురకాంతలుగా చెలామణి అవుతున్నారు. శిష్టులు దాసులవుతున్నారు. దుష్టులు రాజులవుతున్నారు. భ్రష్టులు మంత్రులవుతున్నారు. ద్రష్టలు అడుక్కోతింటున్నారు. దైవభక్తి తరిగిపోతున్నది. నాస్తికత్వం పెరిగిపోతున్నది. కాషాయం కట్టిన ప్రతివాడూ యతిగా, కలం పట్టిన ప్రతివాడూ కవిగా చలామణి అవుతున్నాడు. మీసృష్టిలో అర్థంతరంగా ఏమిటీ అనర్ధం. నాకెందుకీ ప్రారబ్ధం? ఇదంతా మీ సృష్టి ఫలం. ఇదంతా మీ ఘర్మ జలం. అందుచేత మీరు వెంటనే నివారణోపాయం కనుక్కోవాలి. నా వర్క్‌లోడ్ తగ్గించాలి.”
బ్రహ్మకి మాత్రం ఆవిడ ఆదివారం పొద్దుపొద్దునే నిద్దర్లేపినందుకు మహా చిరాగ్గా ఉంది. పైగా రాత్రి సరస్వతితో కాస్త మాట అటూ ఇటూ వచ్చి, అది చిలికి చిలికి గాలివాన అయింది. దాంతో రాత్రంతా కలత నిద్రే. ఇంకానయం, బెడ్రూం తలుపు వేసేసుకుని పెళ్ళాం తనని పోయి ఆ తామరపూవులో పడుకోమన్లేదు. అలవాటు తప్పిన ప్రాణం ఠారెక్కిపోయేది. కాస్త పొద్దెక్కేదాకా పడుకుందామనుకుంటే భూదేవి పొద్దునే తయారు కష్టాల చిట్టా చదువుతూ. నాలుగు తలలతో వింటున్నట్టు నటిస్తున్నాడు కానీ ఒక్కదాంతోటే వింటున్నాడు, అందులోనూ ఒక్క చెవితోటే. అయినప్పటికీ భూదేవి కథనం వింటుంటే ఆయనకే సందేహం కలిగింది. ఈ రభస, మామూలుగా మహాయుగాంతంలో రావలసింది. ఇప్పుడే మొదలయ్యిందేమిటి, చెప్మా, అని అనుమానం వచ్చింది. ప్రతియుగంలోనూ తను సృష్టి విషయంలో ఎన్ని జాగర్తలు తీసుకున్నా ఎక్కడో అక్కడ చటుక్కున రాక్షసజనం పుట్టటంలేదూ! అప్పుడప్పుడు ఈ అనంత విశ్వ సృష్టిలో కొద్దో గొప్పో విపరీతాలు రావని కాదు. అవి తనకి తెలియనివీ కావు. అయితే, ఇంత దారుణంగా జన్య కణాలు అడ్డంగా బెడిసికొట్టటం ఈ ఇరవై ఎనిమిది మహాయుగాలలో ఎన్నడూ జరగలేదే!
బ్రహ్మ పరధ్యాసలో పడ్డాడని సందేహించిన భూదేవి, “తండ్రీ! నా మొరవింటున్నావా, లేదా?” అని నిలదీసి అడిగింది.
“వింటున్నాను భూదేవీ, వింటున్నాను. ఈ దుస్థితి కలియుగ ప్రారంభంలోనే వచ్చిందేమిటా అని నాకూ ఆశ్చర్యంగానే ఉంది. అప్పుడే కలిపురుషుడు ఇంత ఘోరంగా విజృంభించాడేమిటా అని ఆలోచిస్తున్నాను. ఒక్కవారం రోజుల వ్యవధి ఇయ్యి. నీ బాధలకి నివారణోపాయం కనిపెడతాను, సరేనా?” అని బ్రహ్మ భూదేవికి అభయం ఇచ్చి ఆదరించి పంపిచేశాడు.
దీని నివారణోపాయం బ్రహ్మకి తెలుసు. శ్రీమహావిష్ణువు వెంటనే మహానిద్ర చాలించి, కల్కి అవతారం ఎత్తాలి, అంతే. అయితే, అది ఎట్టా సాధ్యం? శ్రీమహావిష్ణువు మహానిద్ర లోకి వెళ్ళి కొద్ది దేవ క్షణాలు కూడా కాలేదు కదా! ఆయన్ని ఇప్పుడు లేపటం ఎవరితరం?
బ్రహ్మదేవుడు సోమవారం ప్రొద్దున్నే కాస్త ఎర్లీగా లేచి, హడావిడిగా స్నానం చేసి, కాఫీ మగ్గులో పోసుకొని బ్రేక్‌ఫాస్ట్ బారొకటి జోబులో పడేసుకుని, భార్యామణి లేవకముందే హంసవాహనమెక్కి ఆఫీసుకి వెళ్ళిపోయాడు. కంప్యూటర్ స్విచాన్ చేసి ఆలోచనలో మునిగి పోయాడు. గడుస్తున్న మహాయుగం మనసులో కలలా మెదిలింది.
‘కృతయుగం సత్యయుగం. అనుకున్నట్టుగా పని జరిగిపోయేది. సృష్టి యధావిధిగా జరిగిపోయింది. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ వగైరాలు, ఏ విధమైన ఆటంకాలూ లేకండా క్లాక్ వర్క్‌లా సజావుగా జరిగిపోయాయి. కాస్త ఇబ్బంది పడినా, త్రేతాయుగంలో పరశురాముడి లాంటి ప్రభృతులు అప్పుడప్పుడు అవకతవకలు తెచ్చిపెట్టినా కూడా మరిన్ని ఆటంకాలు ఏవీ రాలేదు. ద్వాపర యుగంలోనూ అంతే! కృష్ణుడు అనుకోకండా గొడవలు తెచ్చిపెట్టినా, ఏదోవిధంగా ఆ యుగమూ గట్టెక్కిపోయింది. ఎటొచ్చీ ఈ కలియుగంలోనే మొదటినుంచీ ఇబ్బందులు! ఏమిటి చెప్మా’ అని బ్రహ్మ సతమవుతున్నాడు. మనసులో ఏదో అనుమానం మెల్లిగా మొలకెత్తుతున్నది కానీ, పట్టించుకోకుండా నొక్కి పెడుతున్నాడు. ఇంతలో టెలిఫోను మోగింది.
“హలో!”
“నేనే. పొద్దున్నే చడీ చప్పుడు కూడా లేకండా పారిపోయారే?”
“నిన్న పొద్దున్నే భూదేవి వచ్చి నానా గొడవా పెట్టింది. రాత్రి చెప్పానుగా, నీతోటి! అందుకని…”
“అందుకని? ఈ పని ఒత్తిడి మీకెప్పుడు లేదనీ! పొద్దున్నే పెళ్ళాంతో కూర్చుని కాఫీ తాగే టైం కూడా లేదా? అసలు మనిద్దరం పొద్దున్నే కలిసి కూచోని కాఫీ తాగి ఎన్నాళ్ళయ్యిందో తెలుసా?”
“సతీ, ప్లీజ్. ఈ వారం కాస్త ఓపికపట్టు. వచ్చేవారమంతా నీకు నేనే బ్రేక్‌ఫాస్ట్ ఇన్ ది బెడ్ నా స్వహస్తాలతో చెసిపెడతాను, సరేనా?” బుజ్జగించాల్సొచ్చినప్పుడు సరస్వతిని సతీ అనడం బ్రహ్మ టెక్నిక్.
“అంత అదృష్టమా! సరి సరి! ఇలానే ఇంతకు ముందు ఈ యుగం మొదట్లో…”
“అవునూ, అడగడం మర్చే పోయాను. ఇవాళ నీ కార్యక్రమం ఏవిటి? ” అన్నాడు బ్రహ్మ, వెంటనే విషయం మారుస్తూ.
“ఏముందీ? నాకేమైనా మీలాగా బ్రహ్మ విద్యలొచ్చా! ఒకరోజు నారదుడు, ఒకరోజు తుంబురుడు. సంగీతం పంతులమ్మకేవుంటుంది లేండి, కార్యక్రమం!”
“సరే! సాయంత్రం తొందరగా రావటానికి ప్రయత్నిస్తాను, ఓకే. బై!” ఇక లాభం లేదని వెంటనే ఫోన్ పెట్టేశాడు, ఎందుకైనా మంచిదని.
యుగలక్షణాల ప్రకారం, బ్రహ్మ వేసిన లెక్కల ప్రకారం దక్షిణభారతదేశాగ్రంలో శంబళ అనే కుగ్రామంలో శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంగా రావాలి. అదెలాగంటే, శంబళ గ్రామంలో విష్ణుయశుడనే వాడికీ, వాడిభార్య సుమతికీ శిశువుగా ఆయన జన్మమెత్తాలి. ఆయనకి కవి, ప్రాజ్ఞుడు, సుమంతుడు అనే ముగ్గురన్నలుండాలి. అతగాడు, పరశురాముని దగ్గిర విద్యాభ్యాసం చెయ్యాలి. ఇది కర్మానుగుణ్యంగా జరగవలసిన వరస. ఈ తతంగంలో మార్పు తేవడం ఏ ‘బ్రహ్మ’ తరం కాదే! ఇదంతా కలియుగం నాలుగవపాదం ఆఖరి రోజుల్లో జరగవలసిన కథ. మరి ఇప్పుడే, అంటే ఇంకా నాలుగులక్షల ఇరవైఎనిమిదివేల ఏళ్ళముందే కల్కి అవతరించడం, కలిని ధ్వంసం చెయ్యడం ఎలా కుదురుతుందీ?
కంప్యూటర్ ముందు కూచొని బ్రహ్మ గూగుల్‌లో భూగోళం అంతా వెతికాడు. ఒకసారి కాదు; పది సార్లు వెతికాడు. స్పెలింగ్ మారుస్తూ, గూగుల్ ట్రాన్సిలేటర్లో వేరే వేరే భాషల్లో ప్రయత్నిస్తూ, రోజంతా వెతికాడు, శంబళ కుగ్రామం కోసం. ఊహూ! ఎక్కడా దొరకలేదు. ‘గూగుల్ లోకి ఇంకా ఎక్కని బుల్లి బుల్లి ఊళ్ళు అన్నేమీ మిగల్లేదు, భూప్రపంచంలో!’
నావిగేటర్ పెట్టించిన తర్వాత కూడా హంస తన రెక్కల కింద రాండ్ మెక్నాలీ రోడ్ మ్యాప్స్ దాచుకోటం బ్రహ్మకి గుర్తొచ్చింది. వెంటనే ఇంద్రసభలో ఉన్న బృహస్పతికి ఫోను చేసి తాటి ఆకుల మీద ఉన్న నాడీ జాతకాలు, జాగ్రఫీ పుస్తకాలు, నేషనల్ జియో మ్యాపులు రేపటికల్లా తన ఆఫీసుకి పంపించమని బృహస్పతిని ఆదేశించాడు. ఎందుకన్నా మంచిదని డాన్ బ్రౌన్కి, స్పీల్‌బర్గ్‌కి, కామెరూన్‌కి కూడా ఒక ఈమెయిల్ పడేశాడు. ఏమో! ఏపుట్టలో ఏ పామున్నదో ఎవరికెరుక?
ఊరికే కూర్చోలేక పోనీ టీవీ అన్నా చూద్దామని, టీవీ ఆన్ చేశాడు.
టెలివిజన్ లో ఏదో టాక్ షోలో ఎవరో పెద్దమనిషి పరమ ఉద్రేకంగా మాట్లాడేస్తున్నాడు. “భ్రూణ హత్యలు, మ్లేచ్ఛ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! నా ప్రభుత్వం వస్తే…” ఆ మాటలింతకు ముందు విన్నవే. ఓ నాలుగు దేవ క్షణాలు క్రితం ఈయనా లాగానే సూట్లు బూట్లూ వేసుకున్న నలుగురు పెద్దమనుషులని మరో సూటూ బూటూ వేసుకున్న పెద్దమనిషి ఏవేవో ప్రశ్నలు అడుగుతుండేవాడు. వీళ్ళు నలుగురూ ఒకరితర్వాత ఒకరు సమాధానం చెపుతుండేవారు. చూస్తుంటే, ఈ నలుగురిలో ఎవడికీ ఏ ప్రశ్నా సరిగా బోధపడిన్నట్టు ఉండేది కాదు. లేకపోతే ఏవిటి? ప్రతి ప్రశ్నకీ అందరూ ఒకే సమాధానం చెప్తుండేవారు, అరిగిపోయిన యల్.పీ లా! అమెరికా ఆర్థిక మాంద్యం గురించి అడిగినా, ఆఫ్రికాలో కరువు గురించి అడిగినా ప్రతి ఒక్కడూ “భ్రూణ హత్యలు, మ్లేచ్చ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! నా ప్రభుత్వం వస్తే…” అంటూ నలుగురూ పరమ ఉద్రేకంగా మాట్లాడేసేవారు. ఒకాయనైతే మరీనూ, ‘దేవుడెలా చెప్తే అలానే చేస్తా నా ప్రభుత్వమొస్తే’ అని అనేవాడు. ఒక పది నిమిషాల పాటు చూసి చికాకేసి టీవీ ఆఫ్ చేసి రిమోట్ గిరాటేశాడు.
సాయాంకాలం కావొచ్చింది. బ్రహ్మతో రమ్మీ ఆడుకోవటానికని విశ్వకర్మ వచ్చాడు, ఎప్పట్లానే. వర్క్ స్ట్రెస్ తగ్గించుకోడానికి బ్రహ్మ కదో అలవాటు. బ్రహ్మకి ఆటమీద ఏమాత్రం ధ్యానం కుదరటల్లేదు. జోకర్లు పారేస్తుంటే చూసి,
“ఏమిటి స్వామీ! ఇవాళ ఇంత పరధ్యాన్నంగా ఉన్నారు?” అని అడిగాడు విశ్వకర్మ.
“ఏదో తల్నొప్పి. సరే గానీ రేపో, ఎల్లుండో నీకో పెద్దపని తగలచ్చేమో!” అన్నాడు బ్రహ్మ.
“అదేమిటో ఇప్పుడే చెప్పండి. ముందుగా ప్రిపేర్ అవుతాను. లోకలా, అవుటాఫ్ స్టేషనా?”
“ఇంకా కొన్ని విషయాలు తెమలాలి. ఎల్లుండికి అన్నీ సిద్ధం కావచ్చు. అప్పుడు చెపుతా. ఇవాళ్టికి ఈ ఆట చాలు,” అన్నాడు బ్రహ్మ. విశ్వకర్మ కిమ్మనకుండా వెళ్ళిపోయాడు. కునికిపాట్లు పడుతున్న హంసని లేపి, బ్రహ్మ ఇంటికి బయల్దేరాడు. సరిగ్గా గుమ్మం ముందు హంస ఆగి తను దిగుతుండగానే గుమ్మం దగ్గిర నారదుడు కనిపించాడు.
“పాఠం బాగా జరిగిందా?”
“ఏదో మీ దయవల్ల,” అన్నాడు, నారదుడు తలవంచుకుంటూ.
“నాదయ ఏముంది? అంతా ఆ అమ్మ దయ,” అంటూ త్వరత్వరగా ఇంట్లోకి పోబోయాడు.
“స్వామీ! మీరు మీరుగా అగపడటల్లేదు. మీ ముఖంలో ఏదో ఆత్రుత కనిపిస్తూన్నది. ఏమిటి కారణం?” అన్నాడు నారదుడు.
“నాలుగు ముఖాల్లో, ఏ ముఖంలో నీకు ఆత్రుత కనిపిస్తూన్నది?” జోకేశాడు బ్రహ్మ.
నారదుడు నవ్వుతూ బ్రహ్మకి నమస్కరించి నిష్క్రమించాడు. అమ్మయ్య! అనుకుంటూ బ్రహ్మ ఇంటిలోపలికి వెళ్ళాడు. శంబళకుగ్రామం దక్షిణ భారత దేశం కొసలో ఎక్కడా కనిపించకపోవడంతో, బ్రహ్మ రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గిర కూడా సరస్వతితో ముభావంగానే ఉన్నాడు. సరస్వతి వేసిన ప్రశ్నలన్నింటికీ ఆ, ఊ అంటూ మొక్కుబడిగానే సమాధానాలు చెప్పాడు. సరస్వతి అర్థం చేసుకున్నట్టుంది. రెట్టించి మరేమీ అడగలేదు.
మంగళవారం పొద్దున్నే సిరియల్ కూడా తినకండా ఒక్క కాఫీ మాత్రమే తాగి, తిన్నగా ఆఫీసు కొచ్చాడు బ్రహ్మ. ఇవాళా సరస్వతిని లేపలేదు. కాలుకాలిన పిల్లిలా కాస్సేపు అటూఇటూ తచ్చాడుతూ కంప్యూటర్ ఆన్ చేశాడు. ఇంటర్నెట్ పనిచేస్తున్నట్టు లేదు. పేజీలు లోడ్ కాలేదు. దేవలోకం ఇంట్రా మెయిల్ తెరిచాడు. పనిచేస్తోంది, కనీసం అదైనా. ఇన్బాక్సులో కొత్త మెసేజీలేమీ లేవు. బృహస్పతి దగ్గిరనుంచి జాగ్రఫీ పుస్తకాలు, నాడీజాతకాలూ వస్తాయేమో అనుకుంటే హెవెనెక్స్ వాడింకా డెలివరీకి రాలేదు. ‘మనకి కావలసినప్పుడు ఈ వెధవ హెవెనెక్స్ ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది,’ ఆంటూ చిరాకు పడ్డాడు. బృహస్పతికి ఫోన్ చేశాడు. ఆయన ఎత్తలేదు. ‘ఏముందీ, ఇంద్రసభకు పోయుంటాడు పొద్దున్నే. అక్కడికి వెళితే ఈ మహా ఋషులకి కూడా మిగితా ప్రపంచ విషయాలు పట్టవు,’ అని విసుక్కున్నాడు. ఇన్‌బాక్స్ మీద పదిసార్లన్నా క్లిక్ చేసుంటాడు కొత్త మెయిల్ కోసం. ఇంతలో టెలిఫోన్ మోగింది.
“హలో” అన్నాడు, బ్రహ్మ నీరసంగా, ఆ ఫోన్ ఎక్కణ్ణుంచో ముందే ఊహించి.
“ఆఁ, హలోనే! ఇవాళా నన్ను లేపకండానే వెళ్ళిపోయారు. ఏమిటంత హడావిడి?”
“చెప్పానుగా! భూదేవి రభస గురించి.”
“అవుననుకోండి. అంత ప్రళయం ఏం వచ్చిందని? రాత్రి మిగిలిపోయిన పీజ్జా లంచ్‌బాక్స్‌లో పెట్టి పెట్టాను కదా. తీసుకొని పోలేదేం? ఎదురుగా ఉన్నవే కనపడకపోతే ఎట్లా మీకు? అంత ముంచుకొచ్చిన పనేమిటో. ఎప్పుడూ లేనిదిదేం చోద్యం?”
“సరస్వతీ, ప్లీజ్! నేను వెతుకుతున్నది ఈ వారంలోగా దొరక్కపోతే నా ఉద్యోగానికే ముప్పు రావచ్చు. నా రాత నాకే బెడిసి కొట్టచ్చు.”
“గూగుల్ చెయ్యలేక పోయారా?”
నువ్వింకా చెప్పలేదనీ ఎదురుచూస్తున్నా, అసహనంగా అనబోయి నాలిక్కర్చుకున్నాడు బ్రహ్మ. అనుంటే ఆ తర్వాత జరగబోయేది ఆపడం బ్రహ్మ వల్ల కూడా కాదని తెలుసు.
“నిన్నంతా చేసిన పనే అది. గూగులే కాదు. అసలు వెతకని చోటు లేదు! నా ఆఫీసులో ఉన్న రాయల్ కంపెనీ అట్లాసులు, చేటల్లాంటి నేషనల్ జాగ్రఫీ సొసైటీ మ్యాపులన్నీ దుమ్ము దులిపి మరీ వెతికా. కళ్ళు కాయలు కట్టుకో పోయినాయనుకో. ఈ చెత్త ఊరు ఎంత వెతికినా దొరకలా. బృహస్పతికి కూడా చెప్పా…”
“సరే లేండి. వీలైతే తొందరగా ఇంటికి రండి. ఇన్నేళ్ళైనా ఒక అచ్చటా ముచ్చటా లేదు. ఇలా ఎన్నేళ్ళుంటాం…”
“సరే సరే. అలాగే. బై ఫర్ నౌ.”
అమరావతి నుంచి ఒక పెద్ద ప్యాకెట్ రానే వచ్చింది. దాంట్లో ఉన్న తాటి ఆకు పుస్తకాలన్నీ తిరగేశాడు. కొన్ని తాటాకులయితే మరీ పాతబడిపోయి నట్టున్నాయి; ముట్టుకుంటే చాలు, విరిగిపోతున్నాయి. జాగ్రఫీ తాటాకులన్నీ, ఒకదాని తరువాత ఒకటి అతి జాగ్రత్తగా పరిశీలించాడు. కొన్ని మ్యాపులయితే చెరిగే పోయినాయి. బృహస్పతి మీద విపరీతమయిన కోపం కూడా వచ్చింది. పాత తాటాకులు కాస్త జాగ్రత్తగా దాచద్దూ? ఎప్పుడేమన్నా, ఇంద్రుణ్ణుంచి ఫండ్స్ రాటల్లేదంటాడు. ఎక్కడా శంబళకు గ్రామం పత్తా లేదు. ఉన్న నాడీ జాతకాలన్నీ ముందునుంచి వెనక్కి, వెనకనుంచి ముందుకీ చదివాడు. ఎక్కడన్నా విష్ణుయశుడు సుమతీ అనే భార్యాభర్త ల జంట దొరుకుతుందేమోననే ఆశతో! అదీ లేదు. అసలు శంబళగ్రామం దొరికితేనేగా, వీళ్ళు దొరికేది! ఆ తాటాకులన్నీ ఓ మూల పారేసాడు, విసుక్కుంటూ!
ముందైతే శివుణ్ణి పిలుద్దామని అనుకోలేదు. ఎందుకంటే, ఈ కలి పురుషుడు బ్రహ్మ రాక్షసి. కామరూపి. రకరకాల వేషాలలో వచ్చి మోసం చెయ్యగలడు. ఈ మహేశ్వరుడు, ఒక భోళా మనిషి. ఎవడన్నా ఒక బిళ్వపత్రం పారేస్తేనో, మురిసి పోయి, వాడు అడక్కండానే వరాలు ఇచ్చి పారేయగలడు. అందాకా ఎందుకూ? తనకు ఎంగిలి తాంబూలం పెట్టినవాడిని కొడుకు కంటే ప్రేమగా చూసుకోగలడు, వెర్రి బాగులవాడు. అదొక చావు, ఈ మహానుభావుడితో!
అయినా కైలాసంలో శివుణ్ణి పిలిచాడు, గత్యంతరంలేక. ఆయన తిరుగుళ్ళలో దక్షిణభారతాగ్రంలో ఎక్కడన్నా శంబళ అనే కుగ్రామం తగిలిందా అని అడగటానికి. శివుడు తాండవపు మైకంలో ఉన్నట్టున్నాడు, డమరుక నాదం జోరుగా వినిపిస్తోంది, టెలిఫోనులో. శివుడు వెంటనే సమాధానం చెప్పలేదు. పదినిముషాలు లైన్ మీద ఉన్నాడు బ్రహ్మ, డమరుకం వింటూ! తాండవానంతరం కుమారస్వామితో కూడా మాట్లాడి, సమాధానం చెప్పాడు, శివుడు. ‘నీ సృష్టి ఏమో గాని, శంబళ అనే కుగ్రామం ప్రస్తుతం ఎక్కడా లేదు,’ అని.
ఏమీ తోచక, విశ్వకర్మ కార్ఖానాకి పిలిచాడు. అతగాడు దొరకలా. ‘అమరావతిలో పాత రధాలు రిపేర్ చేయటానికి పొద్దున్నే పోయాడ’ని రిసెప్షనిస్ట్ చెప్పింది. మళ్ళీ టీ.వీ. ఆన్ చేశాడు. ఈ సారి మరో ఛానల్. అందులోనూ ఇందాకటి ఇంటర్వ్యూయే వస్తూన్నట్టుంది. చానల్ మార్చాడు. ఎవరో వయసు మళ్ళినాయన, పత్రికలు అచ్చేసుకుంటాట్ట, అన్ని ప్రభుత్వాల ఫోన్లూ దొంగతనంగా ట్యాప్ చేశాడని ఆయనని ప్రభుత్వ నాయకులే మర్యాదగా ప్రశ్నలడుగుతున్నారు. ఆయనేమో వినయంగా నేను నిమిత్తమాత్రుణ్ణి. నాకంతగా ఏమీ గుర్తుండవు. బ్రహ్మని అడగండి ఆయన ఎలా రాసుంటే అలానే కదా జరిగేది. అని ఏ ప్రశ్న కైనా ఒకటే జవాబు చెప్తున్నాడు. ఒళ్ళు మండిపోయింది. ఈ సారి టీ.వీ. రిమోట్ దూరంగా విసిరి పారేశాడు. మూలకేసిన తాటాకులనే చూస్తూ కూర్చున్నాడు కాసేపు.
మనసులో నిన్న మొలకెత్తిన అనుమానం మళ్ళీ పీడించసాగింది. ఇక ఇలా కాదని, టైం చూశాడు. ‘అబ్బో! అప్పుడే మూడయిందే! కాసేపు శ్రీమతితో మాట్లాడితే మనసు కుదటపడవచ్చు,’ అని, ఇంటికి పిలిచాడు బ్రహ్మ.
“సతీ, నువ్వేమిటి చేస్తున్నావు?”
“టీ.వీ. చూస్తున్నా.” అన్నది సరస్వతి.
“అవునా? తుంబురుడు..”
“తుంబురుడికి జలుబు చేసింది. గొంతు పూడిపోయింది. అందుకని, అతనికి స్వరం కుదరటల్లేదు. ఇంటికి పంపించేసా.”
“అవునా, ఏ ప్రోగ్రాం చూస్తున్నావ్?”
“ఏదో రియాలిటీ షో. హూ ఈజ్ ది బెస్ట్ స్కామర్ అని. దొంగడబ్బు ఖర్చు పెట్టి గెలిచి నాయకులు కాగానే, ఖర్చుపెట్టిన డబ్బుకు పదింతలు ఎవరు ముందర దోచుకుంటారో వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి, వాళ్ళ బంధుమిత్ర పరివారానికి ఇంకో ఐదేళ్ళు ఇంకా దోచుకోటానికి చోటిస్తారు. ఓడిపోయిన వాళ్ళేమో సైడ్‌లైన్స్‌లో అరుస్తుంటారు, సోపాన పటంలో లాగా, కోర్టులు, చట్టాలు ఇలా పాములూ, వ్యాపారాలు, బ్యాంకులు ఇలా నిచ్చెనలు కూడా. ఉత్తుత్తి పాములే అనుకోండి. సరదాగా ఉంది ఈ పోటీ.”
బ్రహ్మకి మతిపోయినంత పనైయింది.
“భలే సరదా ఏమిటంటే, నాయకులెవరూ కూడా వాళ్ళు దోచుకుంటున్నట్టు ఇంకెవరికీ తెలియకుండా ఉండాలట. కానీ అందరికీ తెలుసు. అయినా ఎవరికేమీ తెలీనట్టే నటిస్తున్నారు. చెప్పడం మర్చిపోయాను, వాళ్ళప్పుడప్పుడూ మీ పేరే అంటున్నారు కూడా. ప్రస్తుతం గెలుస్తున్నది జగజ్జెంత్రీలనే జట్టు. ఒక కుర్రాడు, ముసలాడు….”
సరస్వతి వాక్యం పూర్తి చెయ్యకండానే బ్రహ్మ మధ్యలో అడ్డుపడి, “ఇంతకీ తుంబురుడికి ఏ పాట నేర్పుతున్నావు?” అని అడిగాడు, విషయం మార్చి, సంభాషణ పొడిగించడానికా అన్నట్టు.
“బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెని పాదము, చెలగి వసుధ కొలిచిన నీ పాదము…” అంటూ ముఖారిలో ఆలాపించింది సరస్వతి. బ్రహ్మకు నవ్వాలో ఏడవాలో తెలీలేదు.
“నారదుడికీ, తుంబురుడికీ, ఇద్దరికీ ఈ పాటే నేర్పుతున్నా. మీకు నచ్చిందా?”
“… అది సరేగాని, నువ్వు ఏదో చెప్పబోతుంటే నేను అడ్డుపడ్డాను. ఇంతకీ నువ్వు ఏదో అడుగుదామనుకున్నావు కదూ?”
“ఆ! అదే! తుంబురుడికి గొంతు పూడి పోయింది అన్నాను కదూ? అతనికి , టీ లో తేనె కలిపి ఇద్దామనుకున్నా. తీరా చూస్తే, ఇంట్లో తేనె అయిపోయింది. మీరు ఇంటికి తిరిగొచ్చేటప్పుడు పబ్లిక్స్ లోనో, క్రోగర్ లోనో ఆగి కాస్త తేనె సీసా ఒకటి పట్టుకోనిరండి. సరేనా? ఇంతకీ దొరికిందా మీ గ్రామం?”
“అలాగే! బృహస్పతి పంపించిన తాటాకులన్నీ వెతికా. నాకయితే ఇంతవరకూ ఆ దిక్కుమాలిన కుగ్రామం దొరకలేదు. అది దొరికేవరకూ…” నసిగాడు బ్రహ్మ.
“ఔట్ సోర్స్ చెయ్యరాదూ? బెంగుళూరులో అదేదో కంపెనీ వాళ్ళు ఎవరి ఆరా అయినా సరే, ఏది కావాలన్నా సరే, ఇట్టే కనుక్కోగలరట. ఈ మధ్య మాటల సందర్భంలో రంభ చెప్పింది. ఆ ప్రయత్నం కూడా చెయ్యండి, ఇందులో పోయిందేముంది?” అన్నది సరస్వతి.
‘సరే! ఆఖరి ప్రయత్నం. అదీ చేసి చూద్దాం,’ అని, ఆ పనికుపక్రమించాడు, బ్రహ్మ. బెంగుళూరు కంపెనీ తేలిగ్గానే దొరికింది. వాళ్ళకి వివరాలన్నీ ఇచ్చి, కాంట్రాక్ట్ ఒప్పుకునేసరికి సాయంత్రం అయిదయ్యింది.
హంస వాహనం ఎక్కి ఇంటికి బయల్దేరాడు. సడెన్‌గా గుర్తుకొచ్చింది, తేనె సీసా కొనుక్కెళ్ళాలని. ఇవాళ ట్రాఫిక్ పరమ ఘోరంగా ఉన్నది. షాపింగ్ సెంటర్ దగ్గిరకి రావటానికి తనకే అరగంట పట్టింది. పబ్లిక్స్ గ్రోసరీ పక్కన టెలివిజన్ కొట్లో ఏదో కోలహలంగా ఉన్నది. ఆ కొట్లో అన్ని టెలివిజన్ల చుట్టూ జనం మూగి శ్రద్ధగా చూస్తున్నారు.
ఏవిటి చెప్మా అని తనుకూడా టెలివిజన్ కొట్లోకి వెళ్ళాడు. ఒక టెలివిజన్‌లో సూటేసుకున్నాయన, ఇంకోదాంట్లో పేపర్ల ముసలాయన, ఆ పక్కనే ఎవరో కుర్రాడు, వాళ్ళ బాబాయి, ఇంకోదాంట్లో చాలా మంది ముసలీ ముతకా, ఇంకో రెండింట్లో గడ్డాలూ, తలపాగాల మనుషులు. ఇంకోదాంట్లో అన్ని దొంగ వార్తలు. ఒకాటో రెండొ స్క్రీన్ల మీద ఎవరో, అంగారక గ్రహంలో కూడా మన భాషా సంస్కృతులని వృద్ధి చేసేది, చేస్తున్నది నేనే. నన్ను గుర్తించాల్సిన అవసరం అందరికి ఉన్నది అని నొక్కి వక్కాణిస్తున్నాడు, పక్కన వాళ్ళని డొక్కల్లో పొడుస్తూ. అన్నీ భూలోకం షోలు. అందరూ ఒకటే అంటున్నారు. ఆదివారం పొద్దున్న భూదేవి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.
“మ్లేచ్చులు విర్రవీగి పోతున్నారు. లైంగిక సంబంధాలకి లింగభేదం లేదు. లంచగొండి తనం ప్రబలిపోయింది. రాజకీయ వాతావరణం కలుషితం అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో భ్రూణహత్యలు జోరుగా జరుగుతున్నాయి. ప్రస్తుతం అవినీతి పరిపాలిస్తోంది. మన భూమండలాన్ని శని పూర్తిగా ఆవహించింది. మ్లేచ్ఛులు శిష్టుల్ని బెదిరించి భయ పెడుతున్నారు. ఈ పరిస్థితి ఏవిధంగానైనా సరే వెంటనే మార్చాలి. ఈ మార్పు తేగలిగింది ‘నేనే’. మరెవ్వరికీ సాధ్యంకాదు… బ్రహ్మ వల్ల కూడా కాదు…” ఇదీ వరస!
కలి కామరూపుడని, వాడు రకరకాల వేషాలు వేసుకొని జనాన్ని మోసం చెయ్యగలడని, మభ్యపెట్టగల సమర్ధుడనీ, ఠక్కున గుర్తుకొచ్చింది, బ్రహ్మకి. వీళ్ళు గాని…
ఈ మాటలు వింటూ ఉంటే ‘ఆదివారం పొద్దున్న భూదేవి వేషంలో వచ్చింది కలిపురుషుడు కాదుకదా ?’ అన్న అనుమానం కూడా వచ్చింది. ఛ! ఛ! అనుమానం పెనుభూతం అంటారు.
వెంటనే ఇంటికొచ్చేశాడు.
గడపలో నారదుడు, తుంబురుడూ పకపక నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం! వీళ్ళిద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది! వీళ్ళిద్దరూ ఇంత కులాసాగా కబుర్లు చెప్పుకోవటం, తను ఒకే ఒక్కసారి చూశాడు ఎప్పుడో కృతయుగంలో ఇంద్రసభలో! బ్రహ్మని గుమ్మంలో చూసి ఇద్దరూ ‘గూడీవినిన్’ అని విష్ చేసి, ఒకడి వెంట ఒకడు వెళ్ళిపోయారు.
సరస్వతి కూడా సరదా గానే మాట్లాడింది. డిన్నర్ చేసి తొందరగా బెడ్డెక్కి పడుకున్నాడు బ్రహ్మ. మనసులో పెరుగుతున్న అనుమానాన్ని పెరగనీయకుండా.
బుధవారం ఇదే తంతు. ఎర్లీగా లేచి, కాఫీ గబ గబా తాగేసి ఆఫీస్ కొచ్చేశాడు బ్రహ్మ. ఎవరినుంచీ మెయిళ్ళు లేవు. కొత్తగా సమాచారమేమీ లేదు.
సాలోచనగా మానిటర్ మీద తిరుగుతున్న గూగుల్ ఎర్త్ చూస్తూ కూర్చున్నాడు. మనసంతా గజిబిజిగా ఉంది.
…ఎదురుగా ఉన్నవే కనపడకపోతే ఎట్లా మీకు? …నీ సృష్టి ఏమో గాని, శంబళ అనే కుగ్రామం ప్రస్తుతం ఎక్కడా లేదు. … మీ సృష్టిలో అర్థంతరంగా ఏమిటీ అనర్ధం. నాకెందుకీ ప్రారబ్ధం? ఇదంతా మీ సృష్టి ఫలం. … భ్రూణ హత్యలు, మ్లేచ్ఛ సంపర్కం, నాస్తికత్వం, మత విద్వేషం… వీటన్నిటినీ ప్రోత్సహిస్తూన్నది మన ప్రస్తుత ప్రభుత్వమే! … ఈ మార్పు తేగలిగింది ‘నేనే’. మరెవ్వరికీ సాధ్యంకాదు. బ్రహ్మ వల్ల కూడా కాదు. …ఇన్నేళ్ళైనా ఒక అచ్చటా ముచ్చటా లేదు. ఇలా ఎన్నేళ్ళుంటాం… ఎన్నేళ్ళుంటాం… ఎన్నేళ్ళుంటాం…”
తనదే తప్పు. తన సృష్టే తప్పు. శంబళ గ్రామం దక్షిణ భారత దేశాగ్రం లోనే ఉండాలని నిర్దేశించడం తప్పు కాదూ? ఇంతకుముందు తొమ్మిది అవతారాలూ ఉత్తర భారతంలోనేగా అవతరించింది! ఈ పదో అవతారం జంబూద్వీపంలో ఒకానొక కుగ్రామంలో అని అస్పష్టంగా రాజకీయనాయకుడి పంథాలో రాసిఉంటే బాగుండేది. అయినా ఇప్పుడు అనుకోని ఏం ప్రయోజనం? చేతులు కాలింతర్వాత తాటాకులు పట్టుకున్నట్టు! బ్రహ్మ రాత మార్చడం బ్రహ్మకే సాధ్యం కాదు. తనమీద తనకే కోపం వచ్చింది.
మనసులో తొక్కిపెడుతున్న అనుమానం తన్నుకుంటూ పైకి రావడం మొదలైంది.
గబ గబా కలియుగానికి రాసిన ప్రోగ్రాం లోడ్ చేసీ ఆటోమేటెడ్ టెస్టింగ్ మొదలు పెట్టాడు, సిమ్యులేటెడ్ మోడ్‌లో కలియుగం చివరిదాకా రన్ చేస్తూ. తన అనుమానం నిజమే. అనుకోకుండా అనర్థాలు వచ్చినప్పుడు, వాటికి రెమెడీగా ఎప్పుడూ రాసే కాంటిన్జెన్సీ సబ్ రొటీన్స్ రాయలేదు. సరస్వతితో పెద్ద తగాదా అయింది అప్పుడేగా, ఈ ప్రోగ్రాం రాస్తున్నప్పుడేగా. మీకు మీ సృష్టే ముఖ్యమైతే నన్నెందుకు పెళ్ళి చేస్కున్నారో చెప్పండి, ఒక అచ్చట ముచ్చట లేకుండా ఎందుకీ కాపురం చేయడం అని ప్రతి రోజూ తగాదాలే. పని ఒత్తిడికీ సతికీ మధ్యలో నలిగిపోయిన ఆ రోజులు. సంపాదనంతా అరుంధతి విజిటేషన్లకే సమర్పించుకున్న రోజులు.
బ్రహ్మ కణతలు రుద్దుకున్నాడు. పూర్తిగా అర్థమైపోయింది జరిగినదీ, జరగబోయేది కూడా. టైం చూశాడు, నాలుగయింది. ఏదో నిశ్చయానికొచ్చిన వాడిలా చటుక్కున రన్ అబార్ట్ చేసి కంప్యుటర్ కట్టేశాడు. వెంటనే బైటికొచ్చి ఇంటికొచ్చేశాడు.
హటాత్తుగా మొగుడు పెందరాళే ఇంటికొచ్చేటప్పటికి సరస్వతి మొఖం వెలిగిపోయింది.
“ఏమిటిలా.. ఈ రోజేదో…” అనబోయింది నవ్వుతూ.
సరస్వతిని ఒక్క మాట కూడా మాట్లాడనీయలేదు బ్రహ్మ. సరస్వతి నడుంచుట్టూ చెయ్యి వేసి, ఒక్క ఉదుటున హంసవాహనం ఎక్కించాడు. ఇద్దరూ, సరాసరి సినీప్లెక్స్కి వచ్చారు. ఆలుమగలిద్దరూ హాయిగా పాప్ కార్న్ తింటూ, కోక్ తాగుతూ, 3-డి లో ‘హ్యూగో’ సినిమా చూశారు. సినిమా చూస్తున్నంతసేపూ, బ్రహ్మదేవుడు సినిమాలో లీనమై పోయాడు. సినిమా మధ్యలో సరస్వతి అడిగింది,
“ఇంతకీ మీకు ఆ ఊరేదో దొరికిందా?” బ్రహ్మ భుజమ్మీద తలానిస్తూ.
తదేకంగా సినిమాలో నిమగ్నమయిన బ్రహ్మ ఒక్కసారి వులిక్కి పడి, “ఏ వూరు…?” అని అడిగాడు.
“అదే! శంబళకుగ్రామం…” అని, మెల్లగా గొణిగింది సరస్వతి.
బ్రహ్మ అనుమానంగా నాలుగు తలలూ ఒక్కసారి సరస్వతి వైపు తిప్పాడు. సరస్వతి కూర్చున్న సీటులో నల్లటి నీడ మిగిలింది.
“లేదు. బట్ ఐ క్విట్ ది జాబ్. యెస్. ఐ క్విట్! ఐ క్విట్! అండ్, ఐ క్విట్!!” అని ముచ్చటగా మూడుసార్లు అన్నాడు బ్రహ్మ.
(If any of the astute readers get a wind that they have read about a similar idea, then they must have read Simon Rich’s article in January 9, 2012 The New Yorker, just like me! – author.)