కన్నబాబు పోయాడట. ఇది జరిగి వారం రోజులయ్యిందని ఇంటి ఇల్లాలు వార్త మోసుకొచ్చింది. ఎలా పోయాడని కానీ, ఎప్పుడు పోయాడని కానీ అడగలేదు నేను. కాకినాడకి ఫోన్ చేస్తే చెప్పారని తనే అంది. నాకయితే మాట రాలేదు. నిజానికి మాటలు పెగల్లేదు. నాకూ కన్నబాబుకీ ఉన్న పరిచయం అంత గొప్పదేవీ కాదు. అలాని నాకు సంబంధంలేని వ్యక్తి కూడా కాదు.
కన్నబాబు ప్రవర్తన నన్ను రెండు సార్లు అబ్బురపరిచింది. ముచ్చటగా మూడోసారి జరగలేదు.
నా పెళ్ళిలోనే నేను కన్నబాబుని మొదటి సారి చూసాను. మాది గుంటూరు. మా అమ్మ ఏరి కోరి మరీ కోనసీమ సంబంధం తీసుకొచ్చింది. కోనసీమ అంటే మొదట్నుండీ నాకు వ్యతిరేక భావం. ఎలా వచ్చిందో తెలీదు. నేను కాకినాడ ఇంజనీరింగు కాలేజీలో చదివేటప్పుడు అమలాపురం నుండి ఇద్దరు ముగ్గుర్ని అక్కడ కలిసాను. చాలా అతి తెలివిగాళ్ళన్న ఒక స్థిరాభిప్రాయం ఏర్పడి పోయింది. ఎప్పుడూ వాళ్ళని వేళాకోళం చేసే వాణ్ణి. అలాంటిది నాకు పనిగట్టుకు మరీ కోనసీమ సంబంధం తీసుకొచ్చిందని గింజుకున్నాను. చివరకి నాకు అక్కడి అమ్మాయితోనే పెళ్ళి ఖాయం అయ్యింది.
మా ప్రెండ్సంతా కోనసీమ అల్లుడని నన్నాట పట్టించారు. నాకయితే గోదారి దాటి పెళ్ళికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కాకినాడలో చెయ్యమని షరతు పెట్టాను. మా మావగారు కోనసీమ గడుసుపిండం. అలాగే అని అన్నవరంలో చేస్తానని దెబ్బకొట్టాడు. అసలే నాస్తికుణ్ణి. అలాంటిది దేవుడి గుళ్ళో పెళ్ళా? వల్ల కాదన్నాను. మొక్కని తిప్పికొట్టాడు. మా అమ్మ పోరు పడలేక తిట్టుకుంటూ ఒప్పుకోక తప్పింది కాదు. కోనసీమ మావగారు భలే దెబ్బకొట్టాడనీ మా స్నేహితులు రెచ్చిపోయారు.
సరిగ్గా అప్పుడే, కన్నబాబుని నేను చూసింది. చూడ్డానికి నల్ల తుమ్మ మొద్దులా ఉంటాడు. ఆరడగుల దేహమే కాదు, పళ్ళు కూడా ఎత్తే! దీనికి తగ్గట్టు బొంగురు గొంతు. నుదుటన అమ్మవారి బొట్టు మరపించేలా ఎర్రటి కుంకుం బొట్టూనూ. ఏం శాల్తీరా నాయనా అనుకున్నాను. మగపెళ్ళి వారికి కావాల్సిన ఏర్పాట్లు చూడమని మా మావగారు పురమాయిస్తే విడిదికొచ్చాడు కన్నబాబు. తనని తాను బ్రోకెన్ ఇంగ్లీషులో పరిచయం చేసుకొని, అన్నయ్యా అంటూ వరస గలిపాడు. వయసులో నాకంటే పెద్దేనని మొహం చూస్తేనే తెలుస్తుంది. పైగా అన్నయ్య, తమ్మయ్య లాంటి వెధవ వరసలు కట్టే సరికి నాకు చికాకు కలిగింది. ఈ కోనసీమ వాళ్ళు వరసలు కలిపితే కానీ పిలుచుకోరని అప్పుడే తెలిసింది. నేను మా సొంత అన్నయ్యనే పేరు పెట్టి పిలుస్తాను. అలాంటిది కన్న బాబుని తమ్ముడూ అని పిలవాలంటే తేళ్ళూ జెఱ్ఱులూ పాకినట్లుండేది.
కన్నబాబూ అని పిలిస్తే, – “తమ్ముడూ అని పిలు అన్నా! కన్నబాబూ అంటే క్లోజుండదు,” అని చేతులు రెండూ కలిపి చూపిస్తూ చెప్పాడు. నాకవేమీ నచ్చవనీ కన్నబాబనే పిలుస్తాననీ తెగేసి చెప్పేసాను. ఏమీ అనలేక సరే నన్నా, నన్ను మాత్రం అన్నయ్యా అని పిలిచే వాడు.
పెళ్ళిలో నా ఫ్రెండ్సందరికీ పేకలూ, టీల సప్లయిరు కన్నబాబే! ఆడుతున్నంత సేపూ ఆ ముక్కేయి, ఈ ముక్కేయి అని చంపుకు తిన్నాడు కానీ మాతో కలిసి ఆడిన పాపాన పోలేదు. చివరకి నేనే విసుక్కుంటే మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఎవరో కన్నబాబు కోసం వెతుక్కుంటూ వచ్చారు.
“కన్నబాబు గాడు ఇలా రాలేదా? అమాస్చెంద్రుడు ఆడాళ్ళకి లైనెయ్యడానికి పోయుంటాడు,” అంటూ వెటకారంగా అంటే, కన్నబాబుకి ఈ విద్యకూడా ఉందాని ఆశ్చర్యపోయాను.
మూడుపదులు వయసు దాటినా కన్నబాబుని ఎవరూ ‘గారు’ అనరు. ‘గాడు’ అనే అంటారు. మా పెళ్ళిలో వడ్డన దగ్గర్నుండి, మగపెళ్ళి వారి మర్యాదల వరకూ కన్నబాబే చూసాడు. మొదట్లో అతని వాగుడు భరించడం కాస్త చికాగ్గా ఉన్నా రెండ్రోజులకి అలావాటయిపోయింది. మాకు కావల్సినవన్నీ చిటెకలో ఏర్పాటు చేస్తూండడంతో అతని మీదే ఆధారపడక తప్పింది కాదు. అలా కన్నబాబుతో పరిచయం ఏర్పడింది. మా మావగారి చుట్టమేమో అనుకున్నాను, మొదట్లో. కాదని తరువాత తెల్సింది. అప్పుడప్పుడు పండగలకి అల్లుడిగా కోనసీమ వెళ్ళినప్పుడల్లా కన్నబాబుని చూసే వాణ్ణి. కన్నబాబుకి తిండి యావ చాలా ఎక్కువని అందరూ ఏడిపించేవారు. పిల్లల దగ్గర్నుండీ అందరూ ఆట పట్టించేవారు.
“ఏరా! కన్నబాబూ! పనసపొట్టు కూర ఓ పదలం లాగించేవా? ఏంటీ గారెల శతకం పాడేసావా? వేరే వాళ్ళ పెళ్ళికే నువ్విలా లాగించేస్తే నీ పెళ్ళికి ఏం మోతాదులో లాగిస్తావో చూడాలనుందిరా!” అంటూ వేళాకోళం చేస్తూంటే మొదట్లో నవ్వుకున్నా, తరువాత తరువాత బాధ కలిగేది.
కన్నబాబు ఇవేమీ పట్టించుకునేవాడు కాదు. “పొండెయహా!” అంటూ నవ్వుతూ విసుక్కునే వాడు.
కన్నబాబుకి పెళ్ళికాలేదు. మెల్లగా నాకూ మా బావమరుదుల ద్వారా విషయాలు తెలిసాయి. కన్నబాబుకి తల్లీ తండ్రీ చిన్నప్పుడే పోతే అక్కగారూ, తనూ ఉంటున్నారనీ, ఆవిడ ఇతన్ని కన్నకొడుకులా చూసుకుంటుందనీ చెప్పారు. ఆవిడకి ఇద్దరు మొగపిల్లలనీ, భర్త కుటుంబాన్ని వదిలేసి దేశాలు పట్టి పోతే ఆవిడే సంసారం నెట్టుకొస్తోందనీ తెలిసింది. కన్నబాబు వాళ్ళకీ పదిహేనెకరాల వరి సాగు ఉందనీ, దానిపై వచ్చే శిస్తు పైకంతోనే బ్రతుకుతున్నారనీ చెప్పారు. ఎవరేం చెప్పినా బండ చాకిరీ మాత్రం చేసేవాడు.
మా ఆవిడ సీమంతానికి వచ్చినప్పుడు ఆ వేడుక సందర్భంలో కన్నబాబు అక్కని చూసాను. కచ్చా పోసుకొన్న చీరలో పెద్ద ముత్తైదువులా వుంది. ఆవిడ చాలా మంచి మనిషనీ అలాంటి వ్యక్తి ఈ భూప్రపంచమ్మీదుండరనీ మా ఆవిడా వాళ్ళూ ఆవిణ్ణి ఆకాశానికి ఎత్తేసారు. చూడ్డానికి ఆవిడ కూడా అంతే వినయంగా వుంది.
“మీ పెళ్ళికి రాలేకపోయాను. మా కన్నబాబు మీగురించి అంతా చెప్పాడు. మావాడికి మీ గుంటూరు దగ్గర ఎవరైనా పిల్లుంటే చూసి పెట్టండి,” అంటూ ఆవిడ కన్నబాబు పెళ్ళి అర్జీ విప్పింది.
“ఏంటక్కా, నువ్వు మరీను,” అంటూ కన్నబాబు గింగిర్లు తిరిగితే చూసి నవ్వుకోలేక చచ్చాను.
ఆవిడ వెళ్ళాక, “ఏరా కన్న బాబూ, నీకెలాంటి పిల్ల కావాల్రా? వాణీశ్రీయా, జయప్రదా, జయచిత్రా?” అని మా మొదటి బావమరిది వెటకారం చేస్తే, “ఈళ్ళెవరూ కాదెయహా! జోతి లచ్చిమి కావాలి కదరా?” అంటూ మా రెండో బావమరిది ఆట పట్టించేవాడు.
“టెంత్ ఫామ్ గజనీకి సినేమా స్టార్లేవిటి? నిక్షేపంగా ఏ డాకటరో, కలకటేరు అమ్మాయో అయితే ఈడూ, జోడూ బావుంటుంది. ఏరా ఏవంటావు?” అంటూ మొదటి బావమరిది ఇంకో వ్యంగ్యం విసిరేవాడు. చుట్టూ ఉన్న అందరం విరగబడి నవ్వుకునేవాళ్ళం. అప్పట్లో పండగకొచ్చిన నాకు కన్నబాబు పెద్ద ఎంటర్టయిన్మెంటు. నాకే కాదు, ఆ చుట్టుపక్కల అందరికీ కూడా. ఇవన్నీ కన్నబాబు నవ్వుతూనే తీసుకునేవాడు. ఏనాడు ఎవర్నీ పల్లెత్తు మాట అనేవాడు కాదు.
ఇలా మొదలయినా కన్నబాబుతో పరిచయం ఊహించని మలుపు తిరిగిందొకసారి.
నేను అప్పట్లో కథలు రాసేవాణ్ణి. తెలుగు సాహిత్యమ్మీద ఇష్టంతో చాలా పుస్తకాలు చదివే వాణ్ణి. ఓ సారి నాకిష్టమయిన పుస్తకం బుచ్చిబాబు “చివరకి మిగిలేది?” చదువుతూంటే కన్నబాబొచ్చాడు. చలం పుస్తకాలు చదివారాని అడిగాడు. కాసింత ఆశ్చర్యపోయాను.
“ఏం? నువ్వు చదివావా?” అంటూ ఎదురు ప్రశ్న వేస్తే, చలం రచనలమీద అరగంట ఉపన్యాసం దంచాడు. విని విస్తుబోయాను. వెర్రిబాగుల కన్నబాబేనా ఇంతలా మాట్లాడిందీ అని నోరెళ్ళబెట్టాను. మొదటిసారి అతని మాటలు నన్ను అబ్బురపరిచాయి. అప్పటినుండీ అతని మీదున్న లోకువతనం కాస్తా సడలింది.
అమలాపురంలో తనలాగే సాహిత్యం అంటే చెవి కోసుకునే మరో ఇద్దరిని నాకు పరిచయం చేశాడు. ఒకరు అబ్బులు. రెండో వ్యక్తి లాయరు రామారావు. అందరూ వకీలు అని పిలిచేవారు. ఇద్దరూ కాపు కులస్తులని పరిచయమయ్యాక అర్థమయ్యింది. మేం నలుగురం రోజూ సాయంత్రం నల్లవంతెన వరకూ ప్రతీ సాయంత్రం నడక సాగించే వాళ్ళం. ఊరి చివర నున్న పొలాల మధ్య సాహిత్యం గురించి మాట్లాడుకునే వాళ్ళం. మమ్మల్ని “గారూ” తో సంబోధించినా, వాళ్ళిద్దరూ “ఏరా!” అనే పిలిచేవారు. నేను పేరు పెట్టే పిలిచేవాణ్ణి.
మా అందరిదీ రమారమి ఒకే వయస్సు. వకీలుకి పెళ్ళయ్యింది కానీ, అబ్బులుకి కాలేదు. అబ్బులు సారా వ్యాపారం చేస్తాడు. అబ్బులుకి ఎవరో బ్రామ్మల పిల్లతో ప్రేమ వ్యవహారం నడుస్తోందనీ కన్నబాబే చెప్పాడు. తరువాత మాటల్లో అబ్బులూ చెప్పాడు. నేనొకసారి కన్నబాబుని పెళ్ళెందుకు చేసుకోడం లేదని అడిగాను.
“నాకు పిల్లనెవరిస్తారయ్యా? చదువా సంధ్యా? పైగా నా రంగు చూసి భయపడి పారిపోతారు,” అంటూ తనమీద తనే జోకేసుకునేవాడు. వాళ్ళక్క మాత్రం ఎడతెరిపి లేకుండా సంబంధాలు చూస్తోందని మాత్రం చెప్పాడు.
పైగా, “పెళ్ళొక్కటేనా జీవితానికి పరమావధి?” అని తత్వపు ప్రశ్నలు వేసేవాడు.
ఇంత లోతుగా ఆలోచించే కన్నబాబంటే అందరికీ ఎందుకు లోకువో అర్థం కాలేదు. అతన్ని వేళాకోళం చేసినా ప్రతిఘటించే వాడు కాదు. ఒక్కోసారి అతన్ని చూస్తే జాలి కలిగేది. అమలాపురం వెళ్ళినప్పుడల్లా వీళ్ళని కలవకుండా ఉండేవాణ్ణి కాదు. కన్నబాబు సరేసరి. మా మావగారింటికి రోజూ వచ్చేవాడు. నా రాకపోకలన్నీ ముందే తెలుకునేవాడు. అలా మొదలయిన మా రెండేళ్ళ పరిచయంలో కన్నబాబు నాకెప్పుడూ అర్థమయ్యేవాడు కాదు. నేనూ అతన్ని మామూలు మనిషిగా చూడ్డానికి అంగీకరించలేదేమో అనిపిస్తుంది. ఒక జోకరు లాగానో, లేదా వెర్రిబాగులోడుగానో అనుకునేవాణ్ణి. సాహిత్యపు వాదనలు చూసి విస్తుబోయేవాణ్ణి. మామూలు వ్యవహారాల్లో అస్సలు లౌక్యం లేని మనిషిలా మసలుకునే వాడు.
ఓసారి పండక్కి అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే వీళ్ళని కలవడానికి వెళ్ళాను. అబ్బులు రాలేదు. ఏవిటాని ఆరా తీస్తే అతని ప్రేమ వ్యవహారం బెడిసికొట్టిందనీ, ఆ బాధ భరించలేక దేవదాసయ్యాడనీ విన్నాను. ఆ అమ్మాయికి వేరెవరితోనో పెళ్ళికుదిరిందనీ తెలిసింది. నేనూ, వకీలూ, కన్నబాబూ అబ్బులింటికి వెళ్ళాం. అబ్బులు మమ్మల్ని చూసి భోరుమన్నాడు. కోపంతో ఊగిపోయాడు.
“చూడండి సార్! అది ఎంత పెద్ద దెబ్బ కొట్టిందో! ప్రేమా, దోమా అంటూ నేను లేకపోతే జీవితం లేదన్న ఆ లం…, ఎవడో ఎర్రగా బుర్రగా ఉన్నోడు వస్తే సరే నంటుందా? అయినా ఈ పెళ్ళెలా జరుగుతూందో చూస్తాను? దొంగది. ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పింది. చూపిస్తాను నా తడాఖా! దాన్నీ, దాని బాబునీ వీధి కీడ్చకపోతే, నా పేరు అబ్బులే కాదు!” అంటూ ఆవేశంతో రెచ్చి పోయాడు.
మేమెవ్వరమూ మాట్లాడక పోయేసరికి మరింత రెచ్చిపోయి ఆ అమ్మాయి మీద బూతుల పర్వం మొదలు పెట్టాడు. ఇది చూసి కన్నబాబుకి ఒళ్ళు మండినట్లుంది.
“ఒరే అబ్బులూ! ఆపరా నీ దండకం! తిరిగినన్నాళ్ళూ నువ్వూ తిరిగావు కాదా? సినిమాలకనీ, షికార్లనీ. ఇప్పుడు నీకు చెడింది కాబట్టి శారద చెడ్డదయి పోయిందా? ఒరేయ్! ఏం పరిస్థితుల్లో పెళ్ళికి ఒప్పుకుందో నీకు తెలుసా? అయినా పెళ్ళి కుదిరాక నువ్విలా మాట్లాడ్డం బావోలేదు. నిన్నటి వరకూ శారదలాంటి అమ్మాయే లేదని మాకు క్లాసు పీకావు కదా?” ఆవేశంగా అన్నాడు.
కన్నబాబు ఇలా మాట్లాడగా చూడ్డం ఇదే మొదటి సారి.
“సంస్కారం లేని ప్రేమ ప్రేమ కాదు. అలా నోటి కొచ్చినట్లు మాట్లాడకు. జరిగిందేదో జరిగిపోయింది. శారదని ఇహ అల్లరి పెట్టకు. ఆ అమ్మాయి మీద కక్షతో వీధికి లాగితే నాశనమయ్యేది ఆమె కాదు, ఆమె చుట్టూ అల్లుకున్న జీవితాలు. నీకు శారద కాకపోతే మరొకరు వస్తారు. కానీ పెళ్ళి చెడిన అమ్మాయికి పుస్తె కట్టడానికి ఎవరూ ముందుకు రారు,” కన్నబాబు మాటల్లో తీవ్రత చూసి ఆశ్చర్యపోయాను. ఇంతలా ఆలోచిస్తాడని ఎప్పుడూ ఊహక్కూడా అందలేదు నాకు.
రెండోసారి అబ్బురపడ్డాను. మేమూ కన్నబాబునే సమర్ధించి, అబ్బులుకి నచ్చచెప్పాం.
అంతవరకూ నా దృష్టిలో ఒక జోకరులా ఉన్న కన్నబాబు మరో పార్శ్వం చూసాను. తరువాత అతన్ని నేనెప్పుడూ వేళాకోళం చెయ్య లేదు. మా ఆవిడ కానీ, బావమరుదులు కానీ ఏవయినా అన్నా వాళ్ళ మీద విరుచుకుపడేవాణ్ణి. ఆ తరువాత నాకు వైజాగు నుండి పూనా ట్రాన్స్ఫర్ అవ్వడంతో అమలాపురానికి రాకపోకలు తగ్గాయి. వైజాగంటే గుర్తుకొచ్చింది. పెళ్ళయ్యిన మూణ్ణెల్ల వరకూ మా శ్రీమతి కాపురానికి రాలేదు. మా అత్తగారొచ్చి కాపురం పెట్టించి ఒక రోజుండి వెళిపోయారు. ఆవిడిలా వెళ్ళిందో లేదో కన్నబాబు పెట్టె పుచ్చుకొని మా ఇంటికొచ్చాడు. కాపురం పెట్టగానే వచ్చిన మొట్టమొదటి అతిధి. దూరపు బంధువుల పెళ్ళికోసం వచ్చిన కన్నబాబు వారం రోజులు వున్నాడు. కాదు, తిష్ట వేసాడని మా ఆవిడ నసుక్కునేది.
మా ఆవిడకి కన్నబాబుతో చనువూ వల్ల అప్పట్లో ఎప్పుడు వెళతావని కూడా వేరే రకంగా అడిగేసింది. అలా మాకు ఓ వారం రోజులు స్పెషల్ గెస్టుగా మమ్మల్ని ఎంటర్టయిన్ చేసాడు. ఆ తరువాత పూనా వెళ్ళాక అక్కడకీ వచ్చాడు. పూనా నుండి బెంగుళూరు మారాం. ఆ వూర్లోనూ మాకు కన్నబాబే మొదటి అతిధి. ఇవన్నీ కాకతాళీయంగా జరిగినా మా ఆవిడకి మాత్రం కన్నబాబుని చూస్తే చిర్రెత్తుకొచ్చేది. మొదట్లో నాకూ అలానే అనిపించినా కన్నబాబు వ్యక్తిత్వం తెలిసాక నవ్వేసి ఊరుకునే వాణ్ణి. అప్పుడే నేను ఓ ఏడాది పాటు సౌతాఫ్రికా వెళ్ళల్సి వచ్చింది. “మీ కన్నబాబు అక్కడికీ వస్తాడేమో?” అంటూ మా ఆవిడ విసుర్లు విసిరేది. పాపం వాడేం చేసాడని నేను అన్నా ఊరుకునేది కాదు.
“వాడికి పెళ్ళా, పెటాకులా? ముతక బ్రహ్మచారి. సంసారం ఉంటే బాధ్యత తెలిసేది. ఆ అక్కగారు అన్నీ దగ్గరుండి చూస్తోంది కాబట్టి బండి నడుస్తోంది,” అంటూ చికాకు పడేది.
కన్నబాబూ, అతని పెళ్ళీ మా ఆవిడకే కాదు, అమలాపురంలో చాలా మందికి వీధరుగుల కాలక్షేపం. అక్క సంబంధం ఇలా తేవడం, అలా చెడిపోవడం, వీళ్ళిలా హాస్యాలాడుకోవడం నాకు తెలుసు. క్రమంగా అమలాపురం ఎప్పుడో కానీ వెళ్ళే వాణ్ణి కాదు. మా పిల్లలూ పెద్దవాళ్ళవడంతో దాదాపు వెళ్ళడం మానేసాను. అప్పుడప్పుడు కన్నబాబు విషయాలు మా ఆవిడ ద్వారానే తెలిసేవి. అవీ వేళాకోళ విషయాలే. అంతగా పట్టించుకునే వాణ్ణి కాదు.
ఓసారి వకీలు బెంగుళూరు పని మీద వచ్చి నన్ను కలిసాడు. మా ఇంటికీ వచ్చాడు. మాటల్లో కన్నబాబు పెళ్ళి ప్రస్తావనొచ్చింది.
“మీరేనా, ఏవైనా సంబంధాలు పాపం కన్నబాబుకి చూడచ్చు కదా? ఆ మాత్రం సరిపడ పిల్ల దొరకలేదంటే నేన్నమ్మను,” నవ్వుతూనే ఆన్నాను. అప్పుడు వకీలు ఒక బాంబు పేల్చాడు.
“మీకెవరికీ తెలియని ఒక విషయం చెబుతాను. వినండి. కన్నబాబు పెళ్ళి చేసుకోడు. ఈ జన్మకంతే,” అన్నాడు.
ఏవిటని గుచ్చి గుచ్చి అడిగితే నిజం చెప్పాడు. కన్నబాబు వాళ్ళ వీధిలోనే ఉండే చంద్రమతనే అమ్మాయిని ప్రేమించాడనీ, ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుందామనుకున్నాడనీ చెప్పాడు. ఆ చంద్రమతికి వేరెవరితోనే పెళ్ళయి బోడసకుర్రు వెళిపోయిందనీ చెప్పాడు.
“ఈ విషయం వాళ్ళ అక్కకి తెలుసా?”
“తెలుసు. ఐరనీ ఏవిటంటే, చంద్రమతీ ఒప్పుకుంది, కన్నబాబూ ఇష్టపడ్డాడు. కానీ కన్నబాబు అక్కే ఇక్కడ విలను. ఆవిడే కాపు కులం పేరు చెప్పి అడ్డు వేసింది,” అంటూ చెప్పాడు.
ఆవిడ చాలా మంచిదంటారని అంటే, “మీకు తెలీదు. ఆవిడకి కన్నబాబుకి పెళ్ళవడం అస్సలు ఇష్టం లేదు. ఆవిడే దగ్గరుండి చాలా సంబంధాలు చెడగొట్టింది,” అంటూ చెప్పుకొచ్చాడు. ఇందులో ఆవిడకి లాభం ఏవిటని ప్రశ్నిస్తే, ఆస్తి అని అన్నాడు.
“కన్నబాబు పేరనే ఆ ఇల్లూ, పొలమూ ఉన్నాయి. అతనికి పెళ్ళయితే ఆవిడ పిల్లలకి ఏవీ మిగలదు. పెళ్ళికాకుంటే తదనంతరం ఆవిడ పిల్లలకే ఆస్తి వస్తుంది. ఇదీ ఇందులో ఉన్న లొసుగు,” లాయరు లాజిక్కు చెప్పాడు.
నాకు ఒక్కసారి కన్నబాబు అక్కమీద కోపమూ, అసహ్యమూ కలిగాయి. ఈ విషయం కన్నబాబుకి తెలుసాని అడిగితే, తెలుసనీ, కానీ అక్క ప్రేమని శంకించలేననీ మొదట్లో అన్నాడనీ చెప్పాడు. ఆమెను ఎదిరించే ధైర్యం లేదతనికి. చివరకి ఒక్కొక్కటీ తెలిసిందన్నాడు. ఇంకా పెద్ద ట్రాజెడీ ఏవిటంటే, పెళ్ళయిన ఆరేళ్ళకి చంద్రమతి భర్త పోయాడనీ, కొడుకుతో ఒక్కతే ఉంటోందనీ చెప్పాడు. కన్నబాబుని తలుచుకుంటే జాలేసింది. అయినా చేసేదేమీ లేదు. ఎవరి జీవితాలకి వాళ్ళే బాధ్యులు, మంచైనా, చెడయినా. ఆ దరిలోనే మరో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. కుల కక్షలతో అబ్బుల్ని ఎవరో హత్య చేసి బోడసకుర్రు రేవులో పడేసారనీ తెలిసింది. పాపం అబ్బులు కూడా కన్నబాబులానే పెళ్ళీ, పెటాకులూ లేకుండా భగ్న ప్రేమికుడిలా మిగిలాడు. చివరకి హత్య చేయబడ్డాడనీ విని బాధపడ్డాను.
నేను చివరసారి కన్నబాబుని చూసింది మా మావగారు పోయినప్పుడు. ఏభయ్యో పడిలోకి పడగానే మొహంలో ముసలితనం కొట్టచ్చినట్లు కనబడింది. నల్లగా ఉన్నా నుదుట కుంకుమ బొట్టుతో మొహం కళగా ఉండేది. ఆ నవకం పూర్తిగా పోయింది. కుంకుమ బదులు స్టిక్కరు పెట్టుకున్నాడు. చెమటకి కుంకుమ కళ్ళల్లో పడి ఇబ్బందవుతోందనీ, స్టిక్కరు ఊడిపోదనీ చెప్పాడు. అతను వచ్చీ రాగానే మా చుట్టుపక్కల అందరూ స్టిక్కరు బాబొచ్చాడనీ అంటే నాకు వాళ్ళమీద కోపమూ, అతని మీదా జాలీ కలిగాయి. ఆ తరువాత మళ్ళీ చూళ్ళేదు కన్నబాబుని.
ఇదిగో ఇలా మరణ వార్త వినాల్సొచ్చింది. గతం తలచుకుంటే కళ్ళ నీళ్ళొచ్చాయి.
అబ్బులు ప్రేమ చెడినప్పుడు కన్నబాబు మాటలు గుర్తుకొచ్చాయి. అమలాపురమంతా వేళాకోళం చేసినట్లు కన్నబాబు బ్రహ్మచారి గానే పోయాడనిపించింది. కొందరి జీవితాలంతే! అన్నీ ఉంటాయి. సుఖపడలేరు. కావాల్సింది దొరకదు. కన్నబాబు మొహంలో జీవితం పట్ల విసుగూ, మనుష్యుల ఎడలా అసంతృప్తీ, అసహనమూ ఎప్పుడూ చూళ్ళేదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. కన్నబాబు గురించి నాకు తెలిసినా మా ఆవిడ దగ్గర ఎప్పుడూ చెప్పలేదు. అతను పోయాడని తెలిసాక నాకు తెలిసినవన్నీ చెప్పాను. మా ఆవిడ బాధ పడింది కానీ, నమ్మలేదని గ్రహించాను.
మా మావగారు పోయాక మా అత్తగారు పెద్దకొడుకు దగ్గరకి కాకినాడ మకాం మార్చారు. ఆ విధంగా అమలాపురంతో అనుబంధం తెగిపోయింది.
ఓ సారి మా పెద్దబ్బాయి రీసెర్చి పని మీద అమెరికా వెళ్ళే పనిబడింది. వాడి డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. మా దగ్గరున్నది సరిపడదనీ, మున్సిపల్ ఆఫీసునుండి ధృవ పత్రం కావాలని అంటే అమలాపురం వెళ్ళాల్సి వచ్చింది. వకీలుకి ఫోన్ చేస్తే తను అన్నీ చూస్తాననీ, నన్ను రమ్మనమనీ చెప్పాడు. అలా మరోసారి కోనసీమ వెళ్ళాను. ఆ సందర్భంలో కన్నబాబూ, అబ్బుల ప్రస్తావన వచ్చింది. మేం నల్లవంతెన దగ్గర కలుసుకున్న రోజులూ, సాహిత్య చర్చలూ నెమరువేసుకున్నాం.
“కన్నబాబు పోవడం నిజంగా బాధ కలిగింది. ఏవయ్యింది? హార్టెటాకా?” అడిగాను. విషాదంగా నవ్వాడు వకీలు.
“ఒకరకంగా అదే! చంద్రమతి మొగుడు పోయాక ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకో అక్కకి భయపడ్డాడు.ఎదిరించే ధైర్యం లేదు. అక్కకంటే ఊళ్ళో జనాలకే అయ్యుంటుంది. గొడవలు వద్దనుకొన్నాడేమో, చాలా కాలం దొంగచాటుగా చంద్రమతితో కాపురం నడిపాడు. దాదాపు పదేళ్ళ వరకూ నాకూ తెలీదు. చంద్రమతి ఇతని ద్వారా కూతుర్ని కూడా కంది. ఆ కూతురి పేరేవిటో తెలుసా? విజయలక్ష్మి,” అంటూ మరింత బిగ్గరగా నవ్వాడు. విజయలక్ష్మి అంటే కన్నబాబు అక్క పేరు.
తనకి అంత ద్రోహం చేసినా ఆవిడ మీద మమకారం చూపించడం చూసి ఏమనాలో అర్థం కాలేదు. కొంతమంది ఎప్పటికీ అర్థం కారు. అర్థమయినా అర్థంకానట్లే వుంటారు.
“చివర్లో అనారోగ్యంతో మంచం పట్టినా ఏనాడు చంద్రమతి విషయం బయటకు పొక్కనివ్వలేదు. అక్కగారు పట్టించుకోకపోయినా బాధపడలేదు. కానీ ధైర్యం చేసి చంద్రమతి దగ్గరకి వెళ్ళలేక నానా అవస్థ పడ్డాడు. అందరూ ఉన్నా లేనట్లే గడపాల్సి వచ్చింది. ఒక పక్క అవస్థ పడుతున్నా, తనకేవీ సవ్యంగా జరగలేదన్న బాధని మాత్రం ఎన్నడూ చూపించలేదు. కానీ పోయే ముందు మాత్రం ఒక మంచి పని చేసాడు. ఉన్న ఇల్లూ, పొలమూ చంద్రమతి పేర రాసి పోయాడు. కన్నబాబు పోయాక ఇది తెలిసి ఆవిడ లబోదిబో మంది. చంద్రమతి కన్నబాబు భార్య కాదనీ తమ్ముడు తన గొంతు కోసాడనీ ఏడ్చింది. నేనే నచ్చజెప్పీ, అదే ఇంట్లో ఆవిడా, చంద్రమతీ వేర్వేరు వాటాల్లో ఉండేలా ఏర్పాటు చేసాను. కన్నబాబు బ్రతికుండగా ఆ ఇంట్లో అడుగుపెట్టని చంద్రమతి అతని అర్థాంగిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది,” అంటూ చెప్పుకొచ్చాడు.
కన్నబాబు పోయాక కూడా నన్ను అబ్బురపరుస్తూనే ఉన్నాడు. ఇది ముచ్చటగా మూడోసారి.
ఒక్కసారి కన్నబాబు ఇంటికెళ్ళాలనిపించింది. వెళ్ళి పరామర్శించి వచ్చాను. అప్పుడు కళ్ళనీళ్ళొచ్చాయి. తిరిగొస్తూండగా, లాయరు మరో విషయం చెప్పాడు.
“ఇంకో సర్ప్రయిజు ఏవిటంటే, చంద్రమతిని అబ్బులూ చేసుకోవాలనుకున్నాడు. చంద్రమతి చాలా అందంగా ఉంటుంది. అబ్బులికి కన్నబాబు వ్యవహారం తెలీదు. చంద్రమతీ కన్నబాబుని చేసుకోవడానికే సిద్ధపడింది. ఇది చూసి అబ్బులుకి మండిపోయింది. ఒకే కులంవాడయిన తనని కాదనీ, ఓ కురూపిని కట్టుకుంటాననే సరికి చంద్రమతిపై చెయ్యి చేసుకున్నాడు. కన్నబాబు ఎదురు తిరిగాడు. ఇద్దరికీ నా ముందరే ఘర్షణ జరిగింది. ఆ తరువాత అబ్బులు పోయాడు. తెలుసు కదా?” అంటూ ఆగిపోయాడు. నమ్మలేనట్లు చూసాను. ఇహ ఆ విషయం పొడిగించలేదు. అబ్బులు ఎలా పోయాడనీ నేనూ రెట్టించి అడగలేదు. అతనూ చెప్పలేదు. పని ముగించుకొని తిరిగి బెంగుళూరొచ్చేసాను.
అమలాపురాన్నీ, కన్నబాబునీ వేరు చేసి చూడలేను. కొంతమంది ఏవీకారు. కానీ మనసులో మాత్రం తరచూ మెదులుతూనే ఉంటారు. ఒక పక్క అతని అమాయకత్వమూ, మరో పక్క చలం సాహిత్యంపై చెప్పిన విషయాలూ గుర్తొస్తాయి. అబ్బులు ప్రేమ విఫలమయినప్పుడు కన్నబాబు మాటలు ఇప్పటికీ మర్చిపోలేదు. మర్చిపోలేను కూడా.
కన్నబాబు అమాయకుడా? జీవితాన్ని లోతుగా చూసిన వేదాంతా? ఎదుటివారి అవివేకాన్ని గుర్తించి జాలిపడే మేధావా? తెలీదు.
ఇప్పటికే కాదు, ఎప్పటికీ అర్థం కాడు. కొంతమందంతే!