విలువలు

అర్థరాత్రి రెండింటికి సెల్ ఫోన్ తెగ మోగుతుంటే ఇండియా నుంచి కాల్ అనుకున్నాను. కళ్ళు తెరవకుండానే నిద్రమత్తులో “హలో!” అన్నాను. ఆవతల గొంతు రాజుది. రాజు చెప్పిన వార్త విని ఒక్కసారి అవాక్కయ్యి బెడ్ మీద లేచి కూర్చున్నాను. చప్పున నిద్ర మత్తు వదిలి, ఒళ్ళు జలదరించింది. వెన్నులో సన్నగా వణుకు పుట్టింది.

రాజు చెప్పింది నమ్మలేక పోయాను. యూసమిటీ వాటర్ ఫాల్స్ లో పడి రవి పోయాడని చెప్పాడు.

“అదేమిట్రా! ఎలా జరిగింది? మీరందరూ అక్కడ ఏం చేస్తున్నారు?” గొంతు వణికింది. మాటలు పెగల్లేదు. రాజు ఏడుస్తూ చెబుతున్నాడు. వాడు చెప్పింది వింటూ నమ్మలేక పోతున్నాను. రాజు వాళ్ళూ రవి శవాన్ని పోలీసులు తీసుకొస్తున్నారని, రేపు సన్నీ వేల్ లో పోస్ట్ మార్టమ్ చేసే వరకూ వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకుంటారని చెప్పాడు. యూసమిటీ వెళ్ళిన వాళ్ళందరూ వెనక్కి వస్తున్నామని చెప్పాడు. ఊహించని వార్త ! దాని వెంబడే కన్నీళ్ళు!

పక్కనే పడుక్కున్న జయని లేపి విషయం చెప్పాను. జయ ఏడవడం మొదలు పెట్టింది. జయ రవిని తమ్ముడూ అంటూ పిలిచేది. రవి ప్రోద్బలంతోనే జయ ఎమ్ ఎస్ చేయడం మొదలు పెట్టింది. జయకి రవి తమ్ముడిలా చేదోడు వాదోడుగా ఉండేవాడు.

రవి నాకు ఓ ఏడాది క్రితమే పరిచయం అయ్యాడు. ఏడాది లోనే మా స్నేహం బాగా పెరిగింది. ఎంతలా పెరిగిందీ అంటే రవి వారానికి అయిదు రోజులు మా ఇంట్లోనే భోజనం చేసేంత. మా స్నేహం బలపడడానికి మూల కారణం, మేం ఇద్దరం ఒకే కంపెనీలో పని చేయడమే. నేను మేనేజరు అయినా ఆఫీసులో పనినీ, స్నేహాన్నీ ఎప్పుడూ ముడి వేయలేదు. దేని దారి దానిదే అన్నట్లుగా ప్రవరించేవాడు. అందుకే రవి అంటే నాకు వల్లమాలిన ఇష్టం. శుక్రవారం అసలు నేను కూడా యూసమిటీ వెళ్ళాల్సి ఉంది. పని చాలా ఉండి ఆగిపోయాను. మా స్నేహితులంతా ఎప్పటినుండో ప్లాన్ చేసుకున్న ప్రోగ్రామది. పనుందని రవిని యూసమిటీ ప్రోగ్రాము ఆపేసినా బాగుండేది. రవి స్నేహితుడొకతను న్యూజర్సీ నుండి రావడంతో కాదనలేక పోయాను.

రెండు రోజుల క్రితం ఆఫీసులో ఆఖరు సారిగా చూసిన మొహం ఇంకా గుర్తుకొస్తూనే ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. నేను వెళ్ళి ఉంటే ఇలా జరిగేది కాదేమో ! నేను వెళ్ళక పోవడానికి స్కాట్ కారణం. స్కాట్ సెలవులో వెళ్ళడం వల్లే నేను వెళ్ళలేకపోయాను.

క్రితం గురువారం నాకింకా గుర్తు…. నా రూంలో నేను పని చేసుకుంటున్నాను. సరిగ్గా రెండున్నరయ్యింది.


“హయ్ ! చందూ – నిన్నే !” పనిలో నిమగ్నమయిపోయిన నేను ఒక్కసారి ఉలిక్కి పడ్డాను. వెనక్కి తిరిగి చూస్తే రవి.

“ఓ ! నువ్వా !”

“ఏంటి, అంత సీరియస్ గా పనిచేసేస్తున్నావు? నాలుగు సార్లు పిలిచినా పలక లేదు ?”

“అదా, నథింగ్ ! రేపు కస్టమర్ ప్రెజెంటేషన్ ఉంది కదా, అది ప్రిపేరు చేస్తున్నాను. చెప్పు ఏంటి?” ఒక్కసారి వొళ్ళు విరుచుకున్నాను.

” ఏం లేదు, స్కాట్ ఈ మైయిల్ చూసావా? ”

” లేదు. మెయిల్ చెక్ చేసి ఓ గంట దాటింది. లెట్ మీ సీ ” అంటూ మెయిల్ చూడ్డం మొదలు పెట్టాను. ఈ లోగా రవి చెప్తున్నాడు. వింటూ మెయిల్ వెతుకుతున్నాను.

“స్కాట్ కిచ్చిన టెస్టింగ్ ఇంకా పూర్తి కాలేదు. నెక్స్ట్ వీక్ రిలీజు ఉంది కదా! అదీకాక ఓ నెల రావట్లేదనీ, ఎమర్జన్సీ అంటూ మెయిల్ కొట్టాడు. ఇప్పుడెలాగ ? నా టెస్టింగ్ కూడా ఇంకా కాలేదు…” మెయిల్ చదివాను. ఒక్కసారి గాలి తీసేసినట్లయ్యింది.

“అదేమిటి – స్కాట్ ఇలా చెప్పా పెట్టకుండా వెళిపోతే, ఎలాగ? అయినా స్టీవ్ ఏం చేస్తున్నాడు? వచ్చే వారం రిలీజు ఉంటే, వెకేషన్ ఎలా ఇచ్చాడు?” స్టీవ్ స్కాట్ మేనేజరు. అతను క్వాలిటీ విభాగం చూస్తాడు. నేను ఇంజనీరింగ్ మేనేజర్ని ! మా గ్రూప్ తరపున క్వాలిటీ రిప్రజెంటేటివ్ గా రవి పనిచేస్తాడు.

“చచ్చేంత పని ఉంది. అయినా ఈ స్కాట్ ఇలా ఎలా వెళతాడు? ప్రతీసారీ ఇంతే ! క్రితంసారి, కష్టమర్ ప్రోబ్లమ్ వచ్చినప్పుడు, రెండయిపోయింది, నే వెళ్ళాలంటూ మధ్యలోనే వదిలేసి వెళిపోయాడు. స్టీవ్ కి ఎంత చెప్పినా ప్రయోజనం లేదు. ఉన్న అయిదు గంటలూ పని బాగా చేస్తాడు కదా అని అంటాడు. ఇప్పుడెలా? నువ్వేమో ఈ వీకెండు యూసమిటీ ప్రోగ్రాం పెట్టుకున్నావు. ఎవ్వరూ లేకుండా…” విసుగూ, నిరాశా నా మాటల్లో ధ్వనిస్తున్నాయి.

స్కాట్ ప్రతీరోజూ ఉదయం తొమ్మిది నుండి, రెండింటి వరకే పని చేస్తాడు. ఎంత పని ఉన్నా, రెండయ్యేసరికి మధ్యలో వదిలేసి వెళిపోతాడు. ఉన్నంత సేపూ పని బాగా చేస్తాడు. కానీ అతని టైమింగ్సే పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. నా గ్రూపు కాదు, ఏమీ చెయ్యలేను. పైగా అతను కన్షల్టెంటుగా పనిచేస్తున్నాడు. పెర్మనెంటు ఉద్యోగి కాదు. దాదాపు పదేళ్ళుగా ఈ కంపెనీలోనే చేస్తుండడం వల్ల ఎవరూ ఉద్యోగం లోంచి తీసేయడానికి ప్రయత్నించలేదు.

“పోనీ – నేను యూసమిటీ ట్రిప్ కాన్సిల్ చేసుకుంటాను. ఈ శనాది వారాలు వచ్చి పనిచేస్తాను.” రవి నా విసుగు అర్థం చేసుకున్నట్లుగా అన్నాడు.

“అదికాదులే ! నువ్వు నెల్లాళ్ళ క్రితమే ప్లాన్ చేసావు కదా! అయినా రేపు మీ స్నేహితుడు న్యూజర్సీ నుండి వస్తున్నాడన్నావు కదా! సర్లే ! నేను ఈ వీకెండు స్కాట్ పని చేస్తాను. నువ్వూ, రాజూ అందరూ వెళ్ళండి.”

“పరవాలేదు..కాన్సిల్ చేద్దాం. అయినా నువ్వు రాకుండా…”

“డోంట్ వర్రీ ! మనందరం మరోసారి వెళదాం. అప్పుడయితే జయ కూడా వస్తుంది. నాకు స్కాట్ టెస్ట్ ప్లాను అవీ ఇయ్యి. అవసరం అయితే నీకు కాల్ చేసి కనుక్కుంటాను. సరేనా..”

“సరే! నేను కచ్చితంగా ఇవాళే నా పని పూర్తి చేసేస్తాను.”

” ఈ స్కాట్ తో పెద్ద తలనొప్పి – ఈ సారి మీటింగ్ లో స్టీవ్ కి కచ్చితంగా కంప్లైంట్ చేస్తాను…” నా కోపాన్ని వెళ్ళగక్కాను.

“కంప్లైంట్ ఎందుకు? వద్దులే ! స్కాట్ మంచి మనిషి! పోనే నేను ఆగిపోతాను…” రవి కి స్కాట్ మీద కంప్లైంట్ చేయడం ఇష్టం లేనట్లుగా అనిపించింది.

“సరే! కంప్లైంట్ చేయనులే ! నువ్వు యూసమిటీ వెళ్ళచ్చు…” నవ్వుతూ అన్నాను. అతనూ నవ్వుతూ నా గదిలో నుండి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు శుక్రవారం రవిని కలవలేదు. కానీ ఫోన్ లో మాట్లాడు కున్నాం. రవి ఫ్రెండు వచ్చాడు.

చివరసారిగా నా గది నుండి నవ్వుతూ వెళ్తున్న రవే నాకింకా గుర్తు !


రవి మరణం మమ్మలందర్నీ షాక్ లోకి నెట్టేసింది. జయ, నేనూ ఇంకా నమ్మలేక పోతున్నాం. తెల్లవారుఝామున నాలుగింటికి రాజూ, ఫ్రెండ్సూ వచ్చారు. రాజూ, న్యూజర్సీ నుండి వచ్చిన రవి ఫ్రెండూ అందరూ ఒకరకమైన స్థబ్దులోకి వెళిపోయారు. ఇదెలా జరిగిందీ? అన్నది నమ్మశక్యం కాకుండా వుందందరికీ! అందరూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు.

రవి వాటర్ ఫాల్స్ లో జారి పడిన తరువాత, శవం కోసం దాదాపు నాలుగు గంటలు పైగా వెతకాల్సొచ్చిందని చెప్పారు. ఈ సంఘటన మధ్యాన్నం జరిగినా అర్థరాత్రి వరకూ రాజు నాకు చెప్పలేదు. రవికి ఈత వచ్చు కదా, క్రింద ఎక్కడో పడి బ్రతుకుతాడని అనుకున్నారట. వేంటనే పోలీసులకి 911 కాల్ చేసి చెప్పడంతో మొత్తం అందరూ యూసమిటీ ఫాల్స్ దగ్గర గాలించారు. యూసమిటీ ఫాల్స్ అంత ఉదృతంగా ఉండవు. పైగా వేసవి కాలం కావడం వల్ల జలపాతం ధాటిగా లేదు. అయినా ఆ ప్రవాహంలో పడితే బ్రతికే ఛాన్సు తక్కువే! అందరూ తలో రకంగా చెప్తున్నారు.

“ఏరా? అసలేం జరిగింది? మీరందరూ వుండి ఏం చేస్తున్నారు?”

“ఫాల్స్ దగ్గరకి వెళ్ళాంరా, అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది. రవి అక్కడకి వెళ్ళి చూసొస్తానన్నాడు. నేను రవీ వెళ్ళాం. నీళ్ళలో కాళ్ళు కడుక్కుంటానని ఒక కాలు వేసాడు. అంతే అక్కడ ప్రవాహంలో కాలు జారి కొట్టుకుపోయాడు. గట్టిగా అరిచాడు.నేనూ అరిచాను, ఇదంతా ఒక్క క్షణంలో జరిగిపోయింది…”

రాజు గొంతు వణికింది. కన్నీళ్ళు ప్రవాహంలా వస్తున్నాయి. మిగతా ఇద్దరి పరిస్థితీ ఇదే ! నా కయితే మెదడు మొద్దుబారి పోయింది. జయ దుఖం ఆపుకోలేకపోతోంది. న్యూ జెర్సీ నుండి వచ్చిన రవి స్నేహితుడు ” అంతా నా వల్లే జరిగింది. నేను రాకపోయినా ఇలా అయ్యుండేది కాదేమో” అంటూ బాధ పడ్డాడు.

“ఇలా జరగాలనుంటే మనం చేసేదేముంది?. ముందు రవి వాళ్ళ అమ్మా, నాన్నలకి ఫోన్ చేసి చెప్పాలి. ఈ దుర్వార్త ఎలా చెప్పాలో తెలీడం లేదు..” ఎంత దిగమింగుకున్నా ఆపుకోలేని బాధ.