[ శ్రీ చేకూరి రామారావు గారి వివరాలు కొన్ని, వారి మాటల్లోనే.
ఉస్మానియాలో B.A., ఆంధ్రాలో M.A. Telugu, Madison, Wis.లో, Cornell Univ.లో Linguistics చదువు. M.A., Ph.D. Linguistics from Cornell. ఉస్మానియాలో 196994 Lecturer, Reader, Professor, Dean వగైరా.
తెలుగులో పుస్తకాలు. 1. రెండు పదుల పైన. పద్య గేయ సంకలనం. 2. తెలుగులో వెలుగులు. భాషా వ్యాసాలు. 3. వచన పద్యం లక్షణ చర్చ. సంపత్కుమారతో కలిసి. 4. తెలుగు వాక్యం. (తెలుగు వాక్య నిర్మాణ పరిశీలన) 5. ముత్యాల సరాల ముచ్చట్లు ఛందో వ్యాసాలు. 6. చేరా పీఠికలు. 7. చేరాతలు సాహిత్య విమర్శ, పరామర్శ (చేరాతలు 198694 మధ్యలో ఏడున్నర ఏళ్ళు. అందులో కొన్ని మాత్రమే సంకలనంలో వచ్చాయి.)
ఇంగ్లీషులో Linguistics essays సంకలనం కాలేదు. సంకలనం కాని వ్యాసాలు చాలా ఉన్నాయి. ఇతరం. A.P. Open University B.A. Telugu సిలబసుకు ప్రధాన చోదకుడు. Indira Gandhi National Open Universityలో B.A. తెలుగు పాఠాలు రాశాడు. ఈ రెండూ ఆధునిక భాషను సిలబసులో పెట్టాయి. ఇదీ క్లుప్తంగా. ]
చేరా గారూ ! మీ అమెరికా పర్యటన సందర్భంగా ఈమాట పాఠకుల కోసం ఈ ఇంటర్వ్యూ ఇవ్వటానికి అంగీకరించినందుకు చాలా కృతజ్ఞతలు. మీరిక్కడున్న కాలంలో పాల్గొన్న వివిధ సాహిత్య కార్యక్రమాల గురించి చెబుతారా ?
చేరా. ఇక్కడ నేను చేస్తున్న పెద్ద నిర్వాకం ఏమీ లేదు. “ఈ మాట” ద్వారా అమెరికన్ తెలుగు సాహిత్య పాఠకులతో మాట్లాడటం నాకూ సంతోషమే.
నేనిక్కడ ఎక్కువ సాహిత్య కార్యక్రమాలలో పాల్గొనలేదు. డెట్రాయిట్ ప్రాంతపు తెలుగు సాహిత్య సమావేశాలు కొన్నిట్లో పాల్గొన్నాను. వాళ్ళు కొన్ని కథల గురించి చర్చించారు. ఒక సమావేశంలో జయప్రభ కవిత్వం గురించి మాట్లాడుకున్నాం. జయప్రభ కవితా పఠన కార్యక్రమం ఒకటి Ann Arbor లో జరిగింది.
సరే, తానా వారి 12వ సమావేశం ఒక మంచి అనుభవం.
తానాతో సహా ఇక్కడి ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న సాహిత్య కార్యక్రమాలు, వారి సాహిత్య వ్యాసంగాలపై మీ అభిప్రాయం చెప్పండి. తెలుగు సాహిత్యానికి ప్రవాసాంధ్రుల contribuion చెప్పుకోదగినదేనంటారా ?
చేరా. తెలుగు సాహిత్యానికి ప్రవాసాంధ్రుల కంట్రిబ్యూషన్ గురించి చెప్పదగినంత సమాచారం నా దగ్గర లేదు. కవిత్వం కొంత చదివాను. ఇక్కడ కవిత్వం రాసే మూడ్ తక్కువేమో! ఇటీవల తానా సంచికలో కథలు చదువుతున్నాను. మంచి కథలు రాయటానికి తగిన సంఘటనలు, అనుభవాలు వీళ్ళ కున్నాయి. నా మట్టుకు నాకు ఇక్కడి కథలు తెలుగు సాహిత్యంలో ఒక కొత్త శాఖ అవుతుందనుకుంటాను. నవలలు కూడా బాగా రాసే వాళ్ళున్నారు. 1999 అక్టోబరు లో ఆంధ్రప్రభలో కలశపూడి శ్రీనివాసరావు నవల ఒకటి చదివాను. చాలా నిమగ్నమయ్యేట్టు చేసింది.
తెలుసా లో సాహిత్య చర్చలు కూడా మంచి కంట్రిబ్యూషన్స్. దాంట్లో నుంచి కూడా కొన్ని ఎన్నుకొని పబ్లిష్ చెయ్య వచ్చేమో! గతంలో చంద్రలత రేగడివిత్తులు నవలపై జంపాల చౌదరి గారి విమర్శ, ఇప్పటి కాశీభట్ల వేణుగోపాల్ గారి “తపన”పై ఆరి సీతారామయ్య గారి వ్యాఖ్యలు చాలా మంచి విమర్శలు.
మీరు మీ PhD కోసం పనిచేసేటప్పుడు కొన్ని సంవత్సరాలిక్కడ గడిపారు గదా. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడి పరిస్థితుల్లో విశేషమైన మార్పులేమన్నా మీరు గమనించారా ? ముఖ్యంగా ఇక్కడున్న తెలుగు కమ్యూనిటీ జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని చెప్పండి.
చేరా. నేను 1962 1966 సంవత్సరాలలో ఒక ఏణ్ణర్థం Madison, Wisconsin లోనూ తరవాత మూడేళ్ళు Cornell Univeristy, Ithaca లోనూ ఉన్నా. అప్పుడు తెలుగు మాట వినిపిస్తే ప్రాణం లేచివచ్చేది. అప్పటి తెలుగు వాళ్ళు ఎక్కువమంది ఇక్కడ నివాసం తాత్కాలికం అనే ఉద్దేశంతోనే ఉన్నారు. వాళ్ళకో ప్రత్యేక జీవనశైలి ఏర్పడేంత వ్యవధానం ఎక్కడిది? ఇప్పటి జీవనశైలి తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ఇక్కడి జనజీవనంలో భాగంగా ఏర్పడుతున్నది. అప్పుడు మాకు ఈ సంస్కృతిపై ఆక్షేపణలు ఎక్కువ. ఇప్పుడు వీళ్ళు ఈ సంస్కృతిని అర్థం చేసుకుంటున్నారు.
Telecommunications అందులోనూ ముఖ్యంగా internet బాగా వాడకంలోకి వచ్చాక ఇక్కడున్నవాళ్ళకికూడ ఆంధ్రదేశంలో వస్తున్న literary trendsని closeగా follow కావటానికి అవకాశం ఏర్పడింది. మీరు చదువుకొనే రోజుల్లో ఈ gapని ఎలా పూర్తిచేసుకొనేవారు ?
చేరా. మేం చదువుకొనే రోజుల్లో ఇక్కడ సాహిత్యం గురించి పెద్ద చర్చలు, మీటింగులూ ఉండేవి కావు. Madison, Wisconsinలో ఒక కాలంలో అడపాదడపా రామకృష్ణారావు గారు, అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు, తిరుపతి నుంచి వచ్చిన జి.ఎన్. రెడ్డి గారు, కొత్తపల్లి వీరభద్రరావు గారూ, నేనూ ఉండే వాళ్ళం. తరచు కలుస్తుండే వాళ్ళం. అబ్బూరి స్వయంగా కవి, కవిత్వంలో అభిరుచి ఉంది. చమత్కారి. మిగతా వాళ్ళంతా తెలుగు సాహిత్యంలో ఎమ్.ఏ. లు, పరిశోధకులు. మా వరకు ఎప్పుడన్నా సాహిత్యగోష్టులు జరుపుకొనే వాళ్ళం. ఆంధ్ర దేశంలో ఏం జరుగుతుందో మాకసలు తెలిసేది కాదు. ఉదాహరణకి దిగంబర కవిత్వ ప్రారంభం నేను ఈ దేశంలో ఉండగానే జరిగింది. 1966 లో ఇంటికి వెళ్ళే వరకూ దాన్ని గురించి నాకు తెలీలేదు. ఇంటికి వెళ్ళిన తరవాత కూడా కొన్నాళ్ళు పట్టిందనుకో.
ఇక్కడ ఒకటి మాత్రం నాకు సంతోషంగా ఉంది. తమతమ వృత్తుల్లో అంత బిజీగా ఉంటూ తెలుగు సాహిత్యం గురించి ఎంత తపన పడుతున్నారు జంపాల చౌదరి గారు, వెల్చేరు నారాయణరావు గారు, కన్నెగంటి సోదరులు, ఆరి సీతారామయ్య గారు, నాసీ, ఇట్లా ఎన్నని పేర్లు చెప్పను? వీళ్ళందర్నీ చూస్తుంటే ముచ్చటేస్తుంది.
నీ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్తే గ్యాప్ నింపే ప్రయత్నమేం చెయ్యలేదు. ఇంకో విషయం చెప్పనా? నేను ఈ దేశం 1962 జనవరి 24న వచ్చాను. మా నాన్న 1962 డిసెంబరు 12న చనిపోయాడు. ఆ వార్త నాకు 1963 జనవరి 4న తెలిసింది. అత్యవసర విషయాలే ఇట్లా ఉంటే సాహిత్యం గురించి ఎక్కడ ఆలోచించం? Internet లేదు సరే, phone contact కూడా ఉండేది కాదు.
సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్ర్రాచుర్యంలో ఉన్న విభిన్న ధోరణులు, ఆయా కవులు, రచయితల గురించి మాకుకొంత ఐడియా ఉంది. ఇతే, మొత్తంగా తెలుగు సాహిత్యాన్ని నడిపిస్తున్న స్పిరిట్, దాని వెనకనున్న మౌలిక శక్తులు గురించి కొంత వివరిస్తారా ?
చేరా. సాహిత్యంలో విభిన్న ధోరణుల గురించి, రచయితల గురించి మీకు తెలుసు, బాగానే ఉంది. కాని మొత్తం సాహిత్యాన్ని ఒకే ఒక్క స్పిరిట్ నడిపిస్తుందని నాకు తెలీదు. మౌలిక శక్తుల గురించి కూడా నాకు తెలీదు. మార్క్సిస్టులు చెప్పే ఆర్థిక శక్తుల గురించి కాడా నాకెక్కువ తెలీదు.
తెలుగు కవులకి, విమర్శకులకి సాహిత్యోద్యమాల పట్ల విశేషమైన అనురక్తి కనిపిస్తుంది. ఏదో ఒకరకమైన ఉద్యమం ఉంటేనే తప్పించి సాహిత్యానికి మనుగడ లేదంటారా ?
చేరా. తెలుగు కవులకు, విమర్శకులకు అని సాధారణీకరించలేము గాని, ప్రధానంగా మార్క్సిస్టులకు ఈ నమ్మకం ఉంది.
అయితే, సాహిత్యం మానవ మానసికావసరాల్లో ఒకటి. ఉద్యమాలు లేకముందు అంటే మనం ఇప్పుడు వాడే అర్థంలో ఉద్యమాలు లేకముందు కూడా సాహిత్యం ఉంది. మానవజాతి ఉన్నంతవరకూ సాహిత్యం ఉంటుంది. సాహిత్యం అంటే ఉద్యమ సాహిత్యమే కాదు కదా!
ఫెమినిష్టు, దళిత ఉద్యమాలు సమాజంలో gender లేదా కులం ప్రాతిపదికగా ఏర్పడినవి గదా. సాహిత్యం మొత్తంగా మానవతా విలువల్ని గుర్తించటానికి, వాటిని పెంపొందించటానికి ఉపయోగపడాలనే దృష్టితో చూసినప్పుడు, ఈధోరణులు ఏరకంగా మేలు చేస్తాయంటారు?
చేరా. ఫెమినిస్టు, దళిత ఉద్యమాల మూలాలు సమాజంలో ఉన్న అసమానతలో ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిని తొలగించే వరకూ అందరికీ అనువర్తించే మానవత్వపు విలువల్ని గురించి మాట్లాడలేం.
ఈ శతాబ్దం ద్వితీయార్థం నుంచి, సాహిత్యానికి సమాజం, సామాన్యుడు కేంద్రం కావాలనే ధోరణి బలపడుతూ వచ్చింది గదా. ఇప్పుడొకసారి వెనక్కి తిరిగి చూసుకొంటే, దీనివల్ల కలిగిన మంచిచెడ్డల నుంచి మనం నేరుకోవలసిందేమన్నా ఉందంటారా ? సాహిత్యంవల్ల నిజంగా సమాజంలో చెప్పుకో దగిన మార్పులేమన్నా కలిగాయంటారా?
చేరా. విస్తృతార్థంలో సాహిత్యానికి సమాజం ప్రేరణే మూలం అని ఒప్పుకోవచ్చు. అది బహుశా సాహిత్యంలో ప్రధాన ధోరణికి వర్తిస్తుంది. వ్యక్తి నిష్టమైన ధోరణి ఎప్పుడూ ఒకటి ఏ కాలంలో అయినా ఉంటుందని నా అభిప్రాయం. ప్రాచీన సాహిత్యంలో చాటువులు అట్లాంటివి.
సాహిత్యం వల్ల సమాజంలో మౌలికమైన మార్పులు కలుగుతాయని నమ్మేవాణ్ణి. కరపత్రాల వల్ల జరుగుతాయేమో కాని కథలు, కవిత్వం వల్ల అట్లాంటి మార్పులు వస్తాయనటానికి ఆధారాలు లేవు. బాధ్యత గల సాహిత్య కారులు సమాజావసరాల కోసం కొంత కృషి చెయ్యవచ్చు. కొంత మార్పు రానూ వచ్చు. కాని అది ఉపేక్షణీయం.
ఈ శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్నీ, సమాజాన్నీ,ఇతర రచయితల్నీవిశేషంగా ప్రభావితం చేసిన కవులు,రచయితలు ఎవరు?
చేరా. శతాబ్దం మొత్తంలో సాహిత్యాన్నీ, సమాజాన్నీ విశేషంగా ప్రభావితం చేసిన కవులూ రచయితలూ చాలా మంది ఉన్నారు. ఎక్కడ మొదలుపెట్టాలో తెలీదు… ఎక్కడ ఆపాలో కూడా తెలీదు. ఇందులో సొంత అభిరుచుల ప్రమేయం కూడా ఉంటుంది.
సమాజాన్ని ప్రభావితం చేసిన రచయితలు అంటే, సాహిత్యేతర సమాజాన్ని అని అర్థం చెప్పుకుంటే లెక్క బెట్టటం కష్టం. ఇది నిర్దిష్ట విభాగం కాదు. అయినా నా పట్టిక నేను ఇస్తాను.
సాహిత్యాన్ని చాలా ప్రభావితం చేస్తూ సమాజాన్ని ప్రభావితం చేసిన కవులు రచయితలు తొలిరోజుల్లో వీరేశలింగం, త్రిపురనేని రామస్వామి. సాహిత్యం మీద అంటారా? చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ప్రధానంగా గురజాడ అప్పారావు, చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ గార్లను విస్తృత పరిధిలో గుర్తించవచ్చు. పరిమిత పరిధిలో ఇస్మాయిల్, శేషేంద్రశర్మ వంటి వాళ్ళున్నారు. వివరాల్లోకి పోతే చాలామంది ఉన్నారు.
మీ ఉద్దేశ్యం ప్రకారం, ఈ శతాబ్దకాలంలో తెలుగు సాహిత్యంలో memorable eventsగా పేర్కొనదగిన సంఘటనలు ఏవి?
చేరా. సంఘటనల గురించి చెప్పటం మరీ కష్టం. నా ఉద్దేశంలో భావకవిత్వావిర్భావం ఒక గొప్ప సాహిత్య సంఘటన. కాని సాహిత్యంలో సంఘటనలుంటాయా? అంటే అది తాత్విక ప్రశ్న అవుతుంది. లఘు కాల పరిమితిలో జరిగిన వాటిని సంఘటనలు అనవచ్చునా? నాకు తెలీదు.
ఆ తరవాత విరసం ఆవిర్భావం. అంతకుముందు దిగంబర కవిత్వోద్యమం కూడా కొంత మెమొరబుల్ సంఘటనే.
తెలుగు కవిత్వంలో అత్యాధునికత(postmodernism) గురించి కొంత తర్జన భర్జన జరుగుతోంది గదా.మీ ఉద్దేశ్యంలో, అత్యాధునిక కవిత్వంగా పరిగణించితీరవలసిన కవిత్వం ఏదన్నా తెలుగులో యిప్పటిదాకా వచ్చిందా ? అట్లా పరిగణించడానికి, ఏయే లక్షణాలను ప్రాతిపదికగా తీసుకొంటారు ?
చేరా. పోస్ట్ మోడర్నిజం అనే మాట చాలా విశేషంగా వాడుతున్నారు. ఒక ఉద్దేశం ప్రధానంగా పెట్టుకొని భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం, విప్లవ కవిత్వం వగైరా వచ్చాయి. ఆయా ఆదర్శాలతో కవులు రాశారు. వాళ్ళు తమను తాము అట్లా పిల్చుకున్నారు. తెలుగులో నేను పోస్ట్ మోడర్న్ కవిని అని (తొడగొట్టి) చెప్పుకున్న కవి నాకు కనపడలేదు. ఆధునికత అనే దాన్ని సరిగ్గా వేరుపరచలేక ఆ తరవాత వచ్చిందాన్ని ఏమనాలో తెలీక పాశ్చాత్య దేశాల్లో వచ్చిన పోస్ట్ మోడర్నిజం అనే పద్ధతికి తెలుగులో ఉదాహరణలు వెతుకుతున్నారు. సాహిత్య సృజనకు కాని, విమర్శకు కాని ఈ భావన “అవసరం” నా కింకా అర్థం కాలేదు.
విమర్శగురించి ఒకటి రెండు ప్రశ్నలు. తెలుగులో ప్రామాణిక విమర్శ మన విశ్వవిద్యాలయాలలో ఉన్నవారికంటే బయటివారి వల్లనే ఎక్కువగా జరిగిందని కొందరు చెబుతుంటారు. అదెంతవరకూ నిజం?
చేరా. “ప్రామాణిక” అనే మాటను వదిలేద్దాం. కొత్త ఆలోచనలు ప్రేరేపించే విమర్శ అందాం.
విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖల వారికి సాహిత్య విమర్శను మించిన పనులేవో ఉంటాయి.
విశ్వవిద్యాలయాల బయటే చాలా మంచి విమర్శలు అధిక సంఖ్యలో వచ్చాయి. అయితే, వెల్చేరు నారాయణరావు గారి “కవితా విప్లవాల స్వరూపం” ఏం చేద్దాం? accident అందామా? ఈ మధ్య కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు శాఖలో పనిచేస్తున్న కాత్యాయనీ (విద్మహే) ప్రాచీన సాహిత్యంలో మహిళాజనజీవితం (?) అనే వ్యాస సంకలనం ప్రచురించింది. అది చాలా మంచి విమర్శ. ఆ మాటకొస్తే కాకతీయ విశ్వవిద్యాలయం వారు సాహిత్య విమర్శలో చాలా కృషి చేశారు. కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సంపత్కుమారాచార్య, అనుమాండ్ల భూమయ్య, కాత్యాయనీ విద్మహే … నా దృష్టికి వచ్చిన వాళ్ళు. ఇంకా కొంతమంది ఉండవచ్చు. వీళ్ళేం చేశారు అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూలలో వివరించటం కష్టం. నా మాటపై నమ్మకం ఉంచి వాళ్ళ కృషిని పరిశీలించండి.
విమర్శ రాసేటప్పుడు, మీరు పాటించే పద్ధతి చాలా సున్నితంగానూ, democraticగానూ కనిపిస్తుంది. దీనికి భిన్నంగా, ఘాటు విమర్శలు, కొన్ని సార్లు రారా గారు చేసినట్టు క్రూర విమర్శలు కూడా చేసేవారున్నారు కదా. అటువంటి విమర్శలపై మీ అభిప్రాయం ఏమిటి ?
చేరా. విమర్శ రాసేటప్పుడు రచయితలను వ్యక్తులుగా నొప్పించకూడదు అనే ఒక లక్ష్యం నాకు (అస్పష్టంగానైనా) ఉంది. ఘాటు విమర్శలు చదవటానికి “రంజు”గా ఉంటాయి. కాని మన బుద్ధిని జోకొట్టి ఆవేశాలను రెచ్చగొడతాయి. నాకు వాళ్ళ ఆవేశాల కన్నా నా అభిప్రాయాలు ముఖ్యం. అంటే స్వార్థం అన్నమాట! అందుకని పరుషంగా ఉండను. కానీ అప్పటికే నా మీద కోపగించుకున్న వాళ్ళున్నారు. కొందరిని సమర్థించబోయి దెబ్బతిన్నాను. అంటే ఎవర్ని సమర్థించానో వాళ్ళే నాపై విరుచుకుపడ్డారు. సాహిత్య చరిత్ర దృష్టితో చూస్తే ఇవి చాలా అల్ప సంఘటన లనుకోండి.
కె.వి.ఆర్., రారాలు అట్లా నొప్పించే మాట నిజమే అయినా వాళ్ళు చెప్పిన విషయాలు విలువైనవి. వాళ్ళైనా వ్యక్తి ద్వేషం వల్ల కాదు అట్లా రాయటం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల పట్ల వాళ్ళ కమిట్‌మెంట్ అట్లాంటిది.
ఉద్యమ సారధులైన తెలుగు విమర్శకులు కొంతమందికి, సాహిత్య విషయాలు కాకుండా, సంక్లిష్టమైన సామాజిక, రాజకీయాంశాలగురించి సాధికారికంగా మాట్లాడే అలవాటుంది. విమర్శకునికి పరిధులవసరం లేదా ? ఈ ధోరణిపై మీ అభిప్రాయం ఏమిటి ?
చేరా. రవిశంకర్ గారూ, కవులకు లేని పరిమితులు విమర్శకుల కెందుకుండాలంట! ఈ విశాల విశ్వంలో ప్రతిదీ ఇంకోదానితో సంబంధమున్నదే. రాజకీయాంశాలను, సామాజికాంశాలను మాట్లాడవద్దనటానికి మనమెవరం? అయితే వాళ్ళ నిర్ణయాలకు పూర్తిగా సాహిత్యేతరాంశాలే కారణమైతే నేను మెచ్చలేను.
అనేక వచన కవితలలో అందాలు మీరు విప్పిచెప్పినా, ఛందస్సుపై మీకున్న మమకారం అందరికీ తెలిసిందే. ఒకసారి, పద్యం మనుగడ పై వివాదం ఉధృతంగా నడుస్తున్నప్పుడు, ఇరువర్గాలవారూ మిమ్మల్నపార్థం చేసుకున్న సందర్భంలో, మిమ్మల్ని “ఉభయ కవి శత్రువు”గా వాకాటి చమత్కరించారు కూడా. పద్యంపై మీకున్న మక్కువకి కారణం ఏమిటి?
చేరా. సాహిత్యంలో నేను ప్లూరలిస్టును. పద్యమో, గేయమో, వచన కవిత్వమో మాత్రమే ఏ కాలానికైనా ఏకైక సాహిత్య రూపంగా పనికొస్తుందని ఎవరు చెప్పినా ఒప్పుకోను.
ఛందఃపరిశోధనపై నాకు మక్కువ ఉన్న మాట నిజమే. నా పరిశోధన ప్రధానంగా మాత్రాఛందస్సు గురించి. తెలుగులో విశేష పద్యాలన్నీ లయబద్ధాలు. అంటే పద్యలక్షణం అక్షరగణాల్లో ఉంటుంది. పద్యం నడక మాత్రాబద్ధంగా ఉంటుంది. అప్పుడు పద్యానికీ గేయానికీ భేదం చెరిగిపోతుంది. గేయంలో నడక వదిలేస్తే వచన కవిత్వానికీ గేయానికీ భేదం ఉండదు. అందువల్ల ఈ భేదాలు కవితారచనకు అంత నిర్ణాయకాలు కావనీ, అసలు సరుకుంటే ఎందులో చెప్పినా రసజ్ఞులు మెచ్చుతారని నా అభిప్రాయం.
పాపం వాకాటి చనిపోయి ఏ లోకాన ఉన్నారో గాని “ఉభయకవిశత్రువు” అని ఆయన ఇచ్చిన బిరుదును ఎంత ఇష్టంగా చెప్పుకునే వాడినో!
పద్యంపై నాకు మక్కువ ఎక్కువ ఉన్నమాట నిజమే. బహుశా అతి చిన్నతనం నుంచి పద్య కావ్యాలు చదివే అలవాటు చేసుకున్నా. పద్యంలో సౌందర్యం నన్ను ఆకట్టుకోటం (వచన కవిత్వం వచ్చిన తరవాత కూడా) మానలేదు. పద్యకవిత్వం ఆనందించలేని వారిని చూస్తుంటే జీవితంలో అతి తేలికగా అందే ఆనందాన్ని ఎంతగా “మిస్” అవుతున్నారో అని విచారం వేస్తుంది.
ప్రస్తుతం మళ్ళీ అవధాన ప్రక్రియ బాగా ప్రచారంలోకి వస్తోంది. లెక్క చూస్తే బహుశా అవధాన శ్రోతల సంఖ్య మిగిలిన అన్ని కవిత్వాల పాఠకుల కన్నా ఎక్కువే ఉండొచ్చు. మరి ఈ అవధాన సాహిత్యంపై మీ అభిప్రాయం ఏమిటి? సాహిత్యంలో దాని పాత్ర ఏమిటి?
చేరా. ఒక కవితా వినోదంగా అవధానవిద్యపై నాకు వ్యతిరేకత లేదు. నువ్వన్నట్లు అవధాన శ్రోతల సంఖ్య కవితా పాఠకుల / శ్రోతల కన్నా ఎక్కువేననుకుంటాను.
ప్రస్తుత పరిస్థితులలో అవధానుల పాత్ర ఏమిటి? అంటే చాలా పరిమితం అని నా ఉద్దేశం. కొంత సాహిత్య వినోదం కలిగిస్తారు. కాసేపు మంచిదే. కాకపోతే కాలం గడపటం కోసం (to buy time) పృఛ్ఛకులు, అవధానులు నానా చెత్త మాట్లాడతారు. అది నాకు గిట్టదు. ఒక్కోసారి పాత కాలపు తెలుగు పంతుళ్ళ లాగా చౌక బారు సెక్సు జోకులు వేస్తుంటారు. వీళ్ళు నిర్వహించగలిగిన అవాంఛనీయ పాత్రలు (negative roles) చాలా ఉన్నట్లున్నాయి
1. సాహిత్యంలో ఉత్తమాభిరుచులను ధ్వంసం చెయ్యగలరు. 2. కవిత్వం కాని దాన్ని కవిత్వం అని భ్రమింపచెయ్యగలరు (ముఖ్యంగా సంగీతం ద్వారా, అల్ప చమత్కారాల ద్వారా.) 3. ఆశు కవిత్వమే కవిత్వపరమావధి అని భ్రమ కల్పించగలరు. 4. ఉత్తమ పద్య కవిత్వానికి అడ్డం రాగలరు.
ఇవి ఇట్లా ఉండగా అవధానులు తమ ఆరోగ్యానికి చేసుకునే నష్టాన్ని గురించి వేలూరి శివరామశాస్త్రి గారి వ్యాసాలున్నాయి. బొమ్మకంటి శ్రీనివాసాచారి గారి పద్యాలున్నాయి.
అవధానులు చెయ్యగలిగిన పనుల గురించి పాలకులకు, పాలితులకు సమానమైన భ్రమలుండటం ఈ కాలపు సాహిత్య దురదృష్టం.
వచన కవులకి కూడా ఛందో పరిజ్ఞానం, సాంప్రదాయ సాహిత్యంతో పరిచయం అవసరమని మీరు భావిస్తారా? భవిష్యత్తులో రాయాలనుకొనేవారికి సాంప్రదాయ సాహిత్య పరిజ్ఞానంలో కనీసార్హతలుగా మీరేమైనా సూచిస్తారా ?
చేరా. వచన కవులకు ఎంత సాహిత్య పరిజ్ఞానం అవసరం అనేది ఎవరూ నిర్ణయించలేరు. వచన కవులకే కాదు, ఏ కవులకైనా సరే. ఆ మాటకొస్తే ఎవరికైనా సరే.
ప్రత్యేక జ్ఞానాల విషయం వస్తే ఛందః పరిజ్ఞానం అవసరమా అంటే, వచన కవిత్వం రాసే వాళ్ళకి దానికి మాత్రమే పరిమితమయ్యే వాళ్ళకి ఛందః పరిజ్ఞానం అవసరం లేకపోవచ్చు. కాని కొంచెం విస్తరించదల్చుకుంటే ఈ లోపం కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది. ..కొన్ని ఉదాహరణలిస్తాను.
1. రావులపల్లి సునీత అనే కవయిత్రి “అన్వేషణ” అనే కవితా సంపుటి ప్రకటించింది. అందులో “పుష్పవిలాపం” పద్ధతిలో ఏదో ప్యారడీ లాంటిది ఉంది. (రిఫరెన్స్ నా దగ్గర లేదు) కరుణశ్రీ గారి పద్యాలను (ఛందఃపరిజ్ఞానంతో) చదివినవారు అయ్యో ఇది ఛందస్సులో లేకుండా ఇదేం ప్యారడీ అనిపిస్తుంది. 2. కొండేపూడి నిర్మల కూడా ఇట్లాగే ఒకటి అంటే పద్యాలకు వచనకవిత్వం ప్యారడీ రాస్తే నేను తీవ్రంగా వ్యతిరేకించాను. తరవాత అచ్చువెయ్యటం మానుకుంది. 3. శ్రీశ్రీ ప్రాసక్రీడలు అందరికీ తెలిసిందే. అది మాత్రా ఛందస్సులో ఉంది. దాని వివరాల జోలికి వెళ్ళను. విశాలాంధ్ర వాళ్ళు అచ్చువేసిన నా “ముత్యాల సరాల ముచ్చట్లు”లో ఉంది. జయప్రభ, రంగనాయకమ్మ మీద “అసలే కోతి” అని (యశొధరా వగపెందుకే?), చేరా మీద “ముళ్ళకంప ఛందం!” అని చింతల నెమలి లో రాసింది. ఈ రెండూ తిట్టి కవితలు. శ్రీశ్రీ ప్రాసక్రీడలు మాత్రాఛందస్సుల్లో రాసిన సెటైరు. ఆ సెటైరు పాదానికి పన్నెండు మాత్రలుండే ఛందస్సులో ఉంది. శ్రీశ్రీ ప్రాసక్రీడల పరిజ్ఞానం ఉన్న ఎవరైనా జయప్రభ రాసిన రెండు సెటైర్లూ ప్రాసక్రీడల మోడల్లో రాసినట్లు చెప్పగలరు. కాని ఛందస్సు అర్థం కాకపోవటం వల్ల వాటిలో అతిక్రమణలు చాలా ఉన్నాయి. ఛందస్సు తెలిసిన పాఠకులకు అవి రుచించవు. నా ఇష్టం వచ్చినట్టు రాస్తాను, నీ ఇష్టం ఐతే చదువు లేకపోతే మానెయ్యి అనటానికి వీల్లేదు. సరే ఇది ఛందస్సుకు సంబంధించింది.
ఇక భాషావిషయం. కవిత్వానికి మాట్లాడే భాష నిషిద్ధం కాదు కాని దానికే పరిమితం కాదు. కవిత్వభాషలో ప్రాచీనభాష నిషిద్ధం కాదు. భాషలో దొరికే అన్ని వనరులనూ కవిత్వభాష వాడుకుంటుంది. ఉదాహరణకు మళ్ళీ జయప్రభ కవిత్వాన్నే చూడండి (ఆమె స్పెల్లింగులను వదిలెయ్యండి). ఈనాటి వచన కవులలో ఇంత ప్రాచీనభాష వాడిన కవులు ఇటీవలి కవుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. కాని అద్భుతంగా వాడింది. (జయప్రభ కవిత్వంపై నా అభిమానానికి అదొక కారణం.) వచనకవులకు ప్రాచీన కవిత్వ భాషా పరిజ్ఞానం అవసరమా అంటే ఏం చెప్పాలి? ఆ పరిజ్ఞానం ఎట్లా వస్తుంది? ప్రాచీన కావ్యపఠనం వల్ల వస్తుంది. నా కక్కర్లేదు అంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు.
ఉద్యోగాల్లోనో, కోర్సుల్లోనో చేరేవారికి లాగా, అర్హతలను (కనీసమైనా, గరిష్టమైనా) సూచించటం నాకు చేతకాదు. కాని సంప్రదాయ సాహిత్యాన్ని మాకు అక్కర్లేదని వదిలెయ్యటం అయాచితంగా దొరుకుతున్న ధనాన్ని కాలదన్నుకోటం లాంటిదని నా అభిప్రాయం!
మీరు కూడా ముత్యాల సరాలు కొన్ని రాసారు గదా. మరి, తరువాత కవిత్వం రాయటం ఎందుకు మానుకున్నారు ? ఎప్పుడైనా మళ్ళీ మీకు కవిత్వం రాయాలనిపిస్తుందా?
చేరా. నేను కవిత్వం (అనుకొని) రాసే రోజుల్లో (1956 59) పద్యాలు, గేయాలు, ముత్యాల సరాలు రాశాను. ముత్యాల సరాల రచనపై, ఛందస్సుపై కొంత విశేష కృషి చేశాను.
కవిత్వం ఎందుకు మానుకున్నావు? అనేదానికి ఉచితమైన సమాధానం చెప్పలేను. జీవితం మొత్తాన్ని వెనక్కి తిరిగి పర్యాలోకించి చూస్తే కవిత్వం కన్నా విలువైన పనులే చేశానని నా నమ్మకం! కవిత్వం ఎందుకు మానుకున్నావంటే ఏం చెప్పను? కవిత్వం రాయాలనిపించలేదు. బహుశా సరుకు అయిపోయిందేమో! ఇటీవల కాలంలో ఆ ప్రయత్నం చెయ్యలేదు, కనుక చెప్పలేను.
ప్రవాసాంధ్రులకి తమ పిల్లలకి తెలుగు రాదేమోనన్న భయం ఉండటం సహజం. కానీ, ఇప్పుడు, ఆంధ్రదేశంలో ఎక్కడచూచినా ఇంగ్లీషు మీడియం స్కూల్సు పెరిగిపోవటంతో, నివాసాంధ్రులకి కూడా ఇటువంటి భయమే ఏర్పడుతుందేమో. ఒక భాషాశాస్త్రవేత్తగా మాతృభాషా ప్రచారానికి మీరేమైనా సలహాలు, సూచనలు ఇస్తున్నారా?
చేరా. ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు మాతృభాషగా రావటం కష్టమే. తల్లిదండ్రులకి పిల్లలతో మాట్లాడే వ్యవధి ఉండదు. వాళ్ళు తెలుగు మాతృభాషగా మరిచిపోక తప్పదనుకుంటా. అయితే తల్లిదండ్రులు ప్రయత్నిస్తే ఏ స్పానిష్‌నో, ఫ్రెంచ్‌నో నేర్చుకున్నట్టు నేర్చుకోవచ్చు. అందుకు తెలుగు వాళ్ళు ఎక్కువున్న చోట తెలుగు స్కూళ్ళు పెట్టించవచ్చు. పరిశ్రమలు పెట్టగల తెలుగువాళ్ళు స్కూళ్ళు పెట్టలేరా? లేక తెలుగు కూడ స్కూళ్ళలో పెట్టించే ప్రయత్నం చేయించ వచ్చు. అంటే తెలుగు వాళ్ళు తెలుగు టీచర్లను పోషించవలసి రావచ్చు.
నివాసాంధ్రులకు, అంటే స్వదేశాంధ్రులకు తెలుగు రాకపోవటానికి తల్లిదండ్రులే కారణం. పిల్లల “మామీ, డాడీ” ఇంగ్లీషుకు తల్లిదండ్రులు మోజు పడిపోతున్నారు. వీళ్ళకు శ్రద్ధ లేక పోవటం వల్ల ప్రభుత్వమూ పట్టించుకోవటం లేదు. ఎక్కడా తెలుగు చదవకుండా విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకోగలిగిన దౌర్భాగ్యపరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రస్తుత ప్రభుత్వానికి సాంస్కృతిక విషయాల్లో అపారమైన అజ్ఞానం ఉంది. మాతృభాషా సమితి పేర మేం కొందరం కొంత ఆందోళన చేశాం. ముఖ్యమంత్రి మా మహజర్ల మీద సంతకం పెట్టి పంపిస్తాడు. అధికార్లు వాటిని అడుగున పెట్టేస్తారు. సమస్య ఎప్పటికప్పుడు కొత్తగానే మిగిలిపోతుంది.
ఈ సమస్యకు పరిష్కారం భాషాశాస్త్రంలో లేదు. ప్రజల పట్టుదలలోనూ పాలకుల చిత్తశుద్ధి లోనూ ఉంది.
చేరాతల ద్వారా చాలా promising voicesగా అనేకమంది కవుల్ని మీరు పాఠకులకి పరిచయం చేసారు.మంచికవిత్వాన్ని ప్రోత్సహించే దిశలో వీటి ద్వారా జరిగిన కృషి మీకు సంతృప్తి నిచ్చిందా ? ఏమైనా disappointments ఉన్నాయా ?
చేరా. చేరాతల పట్ల నాకసంతృప్తి లేదు. కాని పరిచయస్తులైన కొందరు కవుల, రచయితల ఒత్తిళ్ళు మాత్రం బాధాకరంగా ఉండేవి. ఆధునికాంధ్ర కవితా పాఠకుడిగా నా ఆలోచనలను, పద్ధతులను సాహితీమిత్రులతో పంచుకోగలిగాను.
ఇప్పుడు మీరు చేరాతలు రాస్తూ ఉండి ఉంటే, promising voicesగా మీరు తప్పక ప్రస్తావించి ఉండే వారెవరైనా ప్రస్తుతం మీ దృష్టిలో ఉన్నారా ?
చేరా. చేరాతలు మానేసి అప్పుడే అయిదేళ్ళు అయింది. అయిదేళ్ళ కాలంలో ప్రస్తావించ వలసిన రచయితలు లేకపోవటం ఏమిటి? అయితే వాళ్ళ పేర్లు చెప్పమని అడగొద్దు. మానేసిన తరవాత కొత్త పేచీలు ఎందుకు?
చేరాతలు బాగా పాపులర్ అయ్యాయి. అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ, మీరు బాగా ఇష్టపడిన కాలమిస్టులెవరైనా ఉన్నారా ?
చేరా. చేరాతలకు ముందు ప్రత్యేకంగా భాషాఛ్ఛందస్సాహిత్య విషయాలపై కేంద్రీకరించిన కాలమే పూర్వం ఏదన్నా ఉందేమో నా దృష్టికి రాలేదు. పూర్వం నార్ల వెంకటేశ్వరరావు గారి మాటామంతీ, పిచ్చాపాటీ ఇష్టంగా చదివేవాణ్ణి. పురాణం ఫిడేలు రాగాలు, ఇల్లాలి ముచ్చట్లు, provocativeగా ఉండేవి. జయప్రభ ఆంధ్రప్రభలో మొదలుపెట్టిన కాలం నుంచి ఏదో ఆశిస్తుండగానే తొందరపడి మానేసింది.
మీరు పదవీ విరమణ చేసాక ప్రస్తుతం ఏమి చేస్తున్నారు ? భవిష్యత్తులో నిర్దిష్టమైన plans ఏమైనా ఉన్నాయా ?
చేరా. యు జి సి వారి Emeritus fellowగా ఉన్నాను. తెలుగు సాహిత్యంలో శైలీభేదాలు అనే ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాను.
చేయదల్చుకున్నవి చాలా ఉన్నాయి. నారా గారు కోరినట్టు తెలుగు ఛందస్సుపై ఇంగ్లీషులో పుస్తకం, బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య, ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం ఇంగ్లీషులో, తెలుగు వచనశైలికి నమూనాలు ఏరి analyze చెయ్యటం, కవిత్వం ఎట్లా చదవాలి? అని ఇట్లా ఏవేవో చెయ్యాలని ఉద్దేశం ఉంది, రాయాలని ఉంది. ఈ జీవితం చాలకపోవచ్చు. ఇవేవీ చెయ్యలేక పోవచ్చు. తలపులకు మించిన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.
చేరా 1999 జులై 20