నారా (వెల్చేరు నారాయణ రావు) పరిశోధనలన్నిటికీ తొలిమెట్టు “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం” అని నా అభిప్రాయం. కనక ముందుగా కవితా విప్లవాల గురించి మాట్లాడి తర్వాత మిగతా రచనలకి దానితో ఉన్న సంబంధం గురించి వివరిస్తా.
కవితా విప్లవాలు
కవితావిప్లవాల గురించి నారా పరిశోధనలు, పరిశీలనలు జగద్విదితాలు. విప్లవాత్మక కవితల రూపం, విషయం, వ్యక్తీకరణ – ఈ పార్శ్వాలన్నీ ఆ కవిత పుట్టిన సందర్భాన్ని ప్రతిబింబిస్తాయని ఈ సిద్ధాంతసారం. దీన్నుంచి కొన్ని విప్లవాత్మకమైన ఉపలక్ష్యాలు కూడా వస్తాయి. (అ) కవులు విప్లవాలను తీసుకురారు, (ఆ) తామున్న సమాజ సందర్భాన్ని అర్థం చేసుకున్న కవులు ఆ సందర్భానికి అనుగుణంగా కవిత్వం రాస్తారు, (ఇ) అలాటి వారిలో సమర్థులైన వారు ఆ కవితావిప్లవానికి నాయకులుగా గుర్తింపబడతారు, (ఈ) సమర్థులైనా సందర్భాన్ని అర్థం చేసుకోలేని వారూ, లేదా ఆ సందర్భాన్ని తాము మార్చగలమనుకునే వారూ రాసే కవిత్వం నిలబడటానికి, వారి సమర్థత పాలు సందర్భానికి అనుగుణంగా రాసే వారి కన్నా ఉన్నతమైనదై వుండాలి.
ఈ సిద్ధాంతాన్ని ఇంకొంచెం లోతుగా పరిశీలిద్దాం.
సందర్భంలో పెనుమార్పులు అరుదుగా వస్తయ్. తెలుగులో కవితావిప్లవాల స్వరూపం అన్న గ్రంథంలో నారా గుర్తించిన విప్లవాలు అయిదు.
అ) ఆశుకవిత్వం నుంచి పురాణ విప్లవం,
ఆ) పురాణ కవిత్వం నుంచి ప్రబంధ విప్లవం,
ఇ) ప్రబంధ కవిత్వం నుంచి భావకవితా విప్లవం,
ఈ) భావ కవిత్వం నుంచి అభ్యుదయ విప్లవం,
ఉ) అభ్యుదయ కవిత్వం నుంచి దిగంబర విప్లవం.
వెయ్యేళ్ళ తెలుగు కవిత్వ చరిత్రలో ఇంతకన్నా విప్లవాలు లేవా? ఈ పట్టికలోని ఐదింట్లో మూడు ఒక్క ఇరవైయ్యో శతాబ్దంలో వచ్చినవే కావటం కూడ ఈ సిద్ధాంతం ఎన్నుకున్న విప్లవ భావన మరీ స్థూలమైందేమో అన్న అనుమానం కలిగించక మానదు.
ఇక పైనిచ్చిన ఐదు విప్లవాలకి కారణభూతాలైన మార్పులు చూస్తే అవి – (అ) మౌఖిక కవితా నిర్మాణం నుంచి రాసింది చదివి ఒక వ్యక్తి వివరించటం, (ఆ) రాసిందాన్ని పదుగురు కూర్చుని విశ్లేషించి చర్చించటం, (ఇ) అచ్చొత్తిన దాన్ని ఎవరికి వారే చదువుకుని తనదైన అనుభూతిని పొందటం, (ఈ) ఎవరికి వారో లేక గుంపుగానో చదివి సామూహికానుభూతిని పొందటం, (ఉ) సంప్రదాయ వాసనలు మచ్చుకైనా లేని సామూహికానుభూతిని ఎవరికి వారే చదువుకుని పొందటం, అని నా అభిప్రాయం. చివరి మూడు సరిగ్గా దానికి ముందున్న విప్లవమార్గానికి తిరుగుబాటుగా వచ్చిన విప్లవాలు కావటం గమనించదగ్గది.
మొదటి మూడు విప్లవాలకు ఉన్న కారణాలు చాలా పెద్దవి. చదవటం, రాయటం, అంతకుముందున్న దశతో పోలిస్తే మహావిప్లవాలు. అలాగే తాటాకుల మీద ప్రతులు తయారు చేసుకోవటం నుంచి అచ్చువేసిన ప్రతిని కొనుక్కోవటం అన్నదీ మహావిప్లవమే. ఒక పౌరాణికుడు చెప్పింది వినటం నుంచి కొంతమంది పండితులు కలిసి చర్చించుకోవటం వరకు జరిగేది అంత పెద్ద విషయం కాదు. పురాణ దశలో కవి రాసినదాన్ని పౌరాణికుడు శ్రోతలకి అందిస్తే ప్రబంధ దశలో కవి స్వయంగా కొందరు శ్రోతలకి వినిపించటం జరిగింది. కేవలం ఈ మార్పు ఒక్కటే పురాణాల నుంచి ప్రబంధాలకి దారితీసిందని నమ్మటం కొంచెం కష్టమే. ఇలా కొన్ని లోపాలున్నట్టు అనిపించినా, తొలి ప్రయత్నంగా తెలుగులో కవితావిప్లవాల స్వరూపం ఉన్నతమైన పరిశోధనని చాటుతుంది. తొలి రచనతోనే ఒక రంగాన్నంతటినీ ఆమూలాగ్రంగా పరిశీలించటం బహుశ ఏ రంగంలోనూ జరగదు కదా.
ఐతే నారా ఈ లోపాల్ని గుర్తించారనటానికి, వాటిని పూరించటానికి తర్వాత ఆయన చేసిన రచనలే తార్కాణం. ఒక విధంగా చూస్తే, ఆ గ్రంథం తర్వాత వచ్చిన రచనలన్నీ దాన్ని మరిన్ని వివరాలతో పూరించటానికి చేసిన ప్రయత్నాలుగా భావించొచ్చు. ఈ రచనలు కవితావిప్లవాలు హఠాత్తుగా జరగవని, ఒక దశ నుంచి మరో దశకి జరిగే ప్రయాణంలో ఉన్న మైలు రాళ్ళని గుర్తించవచ్చనీ చూపిస్తాయి. ఉదాహరణకి, శ్రీనాథుడి గురించిన పరిశోధన, పురాణ దశ నుంచి ప్రబంధ దశకి జరిగిన పరిణామక్రమంలో, ఒక ముఖ్యమైన మజిలీగా గుర్తించటం. చాటుపద్యాల గురించిన పరిశీలనలు, ప్రబంధ దశకి పట్టుగొమ్మలైన పండితబృందాలు కవిత్వాస్వాదనని ఒక అద్భుతమైన వ్యవస్థగా ఎలా తీర్చిదిద్దాయో, ప్రబంధ కవితా విప్లవాన్ని ఎలా నిలబెట్టాయో చూపిస్తాయి. కళాపూర్ణోదయం, ప్రభావతీ ప్రద్యుమ్నం మీద జరిగిన పరిశోధనలు బహుశా ప్రబంధ విప్లవానికి ఒక ముఖ్య కారణం అప్పటి సమాజంలో ఊపిరిపోసుకుంటున్న “ఆధునికతా” భావనలు కావొచ్చునని ప్రతిపాదిస్తాయి. నాయకరాజుల కాలంనాటి కవిత్వం గురించిన శోధనలు ప్రబంధ సాహిత్యం అంతా ఒకే మూస లోది కాదని, దానిలోనూ అనేక “చిరువిప్లవాలు” ఉండొచ్చునని చూపే ప్రయత్నంగా చూడొచ్చు. ఇలా, స్థూల వర్గీకరణతో ప్రారంభమైన నారా సుదీర్ఘ ప్రయాణం ఒక్కో స్థూలాంశాన్ని దాని సూక్ష్మ విభాగాలుగా విడదీసి ఒక్కో సూక్ష్మాంశానికున్న ప్రత్యేకతల్ని గుర్తిస్తూ, అది దాని స్థూల మాతృకలోని ఇతర సూక్ష్మాంశాలతో ఎలా సంబంధితమైందో వివరించే నిరంతరాయ ప్రయత్నాల సముదాయంగా నాకనిపిస్తుంది.
విప్లవ సిద్ధాంతాన్ని తిరగేస్తే …
సామాజిక సందర్భం కవితా విప్లవాలకి దారితీస్తే, ఒక విప్లవదశకి చెందిన రచనా సమూహం నుంచి వాటికి దారి తీసిన సందర్భాన్ని గుర్తించొచ్చా? అనేదొక ఆలోచించాల్సిన ప్రశ్న. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక సందర్భం నుంచి వచ్చిన విప్లవంలో ఒక వెయ్యి రచనలు వచ్చాయనుకుంటే, వాటిలో ఒక యాభై రచనల్ని చూసి ఆ సందర్భంలోని ఏయే విషయాలు ఆ రచనలకి దారితీశాయో చెప్పొచ్చా? గణితంతో పరిచయం వున్నవాళ్ళకి చాలా పరిచితమైన ప్రాధమిక ప్రశ్న ఇది. దీన్ని సాహిత్య విమర్శా సందర్భంలో వెయ్యగలగటం అనేది కవితా విప్లవ సిద్ధాంతానికున్న శాస్త్రీయ స్థాయిని ప్రతిబింబిస్తుందని అనుకోవచ్చు కూడ. ఏమైనా, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం జరిగింది సార్థకప్రతీకలు (Symbols of substance) అన్న రచనలో. విశాలమైన ప్రబంధ విప్లవ దశలో ఒక కాలభాగాన్ని తీసుకుని, అందులో వచ్చిన రచనల ఆధారంగా ఆ కాలంలో ఉన్న సామాజిక సందర్భాన్ని అంచనా వెయ్యటానికి జరిగిన ఈ ప్రయత్నం అభినందనీయం.
“నేనొప్పుకోను”
నారా రచనలన్నిటినీ విహంగవీక్షణంతో చూస్తే నాకనిపించేది, వాటన్నిటికీ ఉన్న ఒక సామాన్యాంశం (common thread) ఆయన తెలుగు సాహిత్యాన్ని గురించి మరెవరు చెప్పిన సిద్ధాంతాల్నీ విధేయంగా ఒప్పుకోకపోవటం అని (ఇది కొన్ని విషయాల్లో తెలుగు సాహిత్యం నుంచి దక్షిణ భారతీయ సాహిత్యం అంతటికీ విస్తరించింది). ఇది పరిశోధకుడికి ఉండవలసిన ఒక ముఖ్యలక్షణం అని నా నమ్మకం. ఇతరులు చెప్పిన దాన్ని వాళ్ళు పెద్ద వాళ్ళనో, పేరున్న వాళ్ళనో, మరే కారణం వల్లనో తార్కికంగా ఖండించి చూడకుండా బుద్ధిగా తలూపి ఒప్పేసుకోవటమే తెలుగు సాహిత్య విమర్శ హీనస్థితికి మూలదౌర్భాగ్యం. (ఇలా ఆలోచించే నేను నారా ఆలోచనల్ని ఎందుకు ఒప్పేసుకుంటున్నానని సూక్ష్మగ్రాహులు ప్రశ్నించొచ్చు – దానికి నా సమాధానం నాకు తార్కికంగా కనిపించే వాటినే ఒప్పుకుంటాను, అన్నిటినీ కళ్ళు మూసుకుని ఒప్పుకోవటం జరగదని; కవితా విప్లవాల గురించి నేను పైనన్న మాటలే ఇందుకు తార్కాణాలని.)
ఇందుకు ఎన్నో ఉదాహరణలివ్వొచ్చు. కవితా విప్లవ సిద్ధాంతానికి మూలం బహుశా 1970ల్లో కొందరు కవులు “ఇక్కడినించి కవిత్వం నా వెనకనే నడవబోతున్నది”, “నేనీ యుగకవిని”, “రాబోయే కవిత్వాన్ని నేను శాసిస్తాను” లాటి స్వోత్కర్ష పరాకాష్టలైన ప్రకటనలు చెయ్యటం అయుండొచ్చు. లేకుంటే ఆ గ్రంథంలో ఉన్నంత తీవ్రంగా వాళ్ళ ప్రకటనలకి వ్యతిరేకమైన ప్రతిపాదన చెయ్యటం జరిగేది కాదేమో!
కన్యాశుల్కం సందర్భంలోనూ మనం ఇది చూస్తాం. ఇంతకు ముందున్న విమర్శకులంతా దాన్ని సంఘసంస్కరణా సాహిత్యంలో శిఖరాయమానంగా భావిస్తే నారా దాన్లో అసలు సంఘ సంస్కరణ అనేదే లేదని, నిజానికి గురజాడ దృష్టిలో సంఘం చక్కగా వున్నదని, ఎవరూ వచ్చి దాన్ని సంస్కరించాల్సిన పనిలేదనీ ప్రతిపాదించారు. అన్నిటికన్నా పెద్ద ఉదాహరణ ప్రబంధ కాలపు తెలుగు సాహిత్యాన్ని స్వర్ణయుగం, క్షీణయుగాలుగా విభజించిన సాంప్రదాయ ధోరణిని ఆయన తిరస్కరించిన తీరు. క్షీణయుగం అనేది లేదని, అది కేవలం పాశ్చాత్య (విక్టోరియన్) భావాల ప్రభావం వల్ల, సమాజం మీద పెద్ద ప్రభావం వెయ్యగలిగిన కొందరు వ్యక్తులు ఇచ్చిన వైయక్తిక, అతార్కిక, అనాలోచిత తీర్పు మాత్రమే అని నిరూపించటానికి ఆయన చేసిన, చేస్తున్న సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటం ఇంకా విస్తరించి భారత సాహిత్యం గురించిన పాశ్చాత్య భావాలన్నిటినీ అనుమానాస్పదాలు చేసింది. దీన్లో రెండు ప్రధాన పార్శ్వాలు, (అ) రచనకీ దాని రచయితకీ ఉన్న సంబంధం గురించిన భావాలు, (ఆ) ఆధునికత అనేది ఏమిటి, అది ఎప్పట్నుంచి మొదలైంది అన్న మీమాంస.