అంకిత ముద్ర: ‘రంగవిఠల’ శ్రీపాదరాయల అంకిత ముద్ర. ఒకప్పుడు పర్యటనలో భీమానదిలో రాయలకు రెండు విగ్రహసంపుటాలు దొరికాయి. అందులో ఒకటి పండరీనాథుడైన విఠలునిది. ఆ విఠలుని పేరిటనే రంగవిఠలుని అంకితముద్ర అతని కీర్తనలలో కనబడుతుంది. ముందున్న రంగ పదము శ్రీరంగేశ్వరుడైన రంగనాథుని కోసమై ఉండవచ్చును. ఆ రెండవ సంపుటమును ఎవ్వరును తెరువలేకపోయినారు. ఒకప్పుడు గురువుగారు పూజచేయమనగా, వ్యాసరాయలు పూజ చేస్తూ ఆ పెట్టెను తెరువగా అందులో ఉండే కృష్ణుని విగ్రహము కనబడింది. తరువాత ఆ వేణుగోపాలుని విగ్రహాన్ని శిష్యునికి బహూకరించి పూజించమన్నాడు శ్రీపాదరాయలు. అందుకేనేమో వ్యాసరాయల అంకితముద్ర శ్రీకృష్ణుని పేరిలో ఉన్నది (కృష్ణా నీ బేగనె బారో, ఇత్యాదులు). ఇతని తరువాత వచ్చిన చాలమంది వాగ్గేయకారులు విఠల నామాన్ని తమ అంకితముద్రలో వాడడము కూడ ఇతని రంగవిఠల అంకితముద్ర ప్రభావమే.
ద్వైతమతము -తత్త్వవాదము
శ్రీపాదరాయలు, వ్యాసరాయలు మున్నగు వారందరూ మధ్వమతావలంబులు. మధ్వాచార్యులు క్రీ.శ. 1238-1317 మధ్య కాలములో జీవించాడు. మధ్వాచార్యులు నారాయణ భట్టు, వేదవతి దంపతులకు పుట్టాడు, ఇతనికి పూర్వాశ్రమములో వాసుదేవుడు అని పేరు. అచ్యుతప్రేక్షుడనే యతికి శిష్యుడుగా పూర్ణప్రజ్ఞుడనే పేరుతో ఇతడు సన్యాసాన్ని స్వీకరించాడు. తరువాత వాదవివాదాలలో ఇతడు చాల మంది పండితులను ఓడించగా, గురువైన అచ్యుతప్రేక్షుడు ఇతనికి ఆనందతీర్థుడనే పేరు నిచ్చి వేదాంతసామ్రాజ్యానికి సార్వభౌముడిగా చేశాడు. ఇతడు శంకరుని అద్వైత మతములో తార్కికముగా ఎన్నో లోటులను ఎత్తి చూపి మహాభారతానికి తాత్పర్యాన్ని, భగవద్గీతకు ఒక కొత్త భాష్యాన్ని రచించాడు. చివరకు ద్వైతమతాన్ని స్థాపించాడు. దీనినే తత్త్వవాదమని కూడా అంటారు. మధ్వ మతావలంబులు ఆచార్యులను హనుమంతుని, భీముని తరువాతి అవతారమని తలుస్తారు. ద్వైత సిద్ధాంతములో హరి సర్వోత్తముడు, వాయువు జీవోత్తముడు. జీవాత్మ పరమాత్మలకు, జడమునకు పరమాత్మకు, జీవాత్మకు జీవాత్మకు, జడమునకు జీవమునకు, జడమునకు జడమునకు భేదమున్నదన్నదే ఈ తత్త్వపు వాదన. ‘సోऽహం’ కాదు ‘దాసోऽహం’ అన్నదే భక్తికి ముక్తికి మార్గము.
మధ్వాచార్యులను గంధర్వ విద్యానిపుణుడని, సామగానప్రియుడని, వనస్పతులను చిగురింపజేసేవాడని చెబుతారు. ఇతడు వ్రాసిన ద్వాదశ స్తోత్రము చాలా అందమైనది. తత్త్వవాదపు మౌలిక అభిప్రాయాలను తెలుపడము మాత్రమే కాక, సంగీతపరముగా కూడా ఈ స్తోత్రములోని 12 అధ్యాయాలు శ్రవణానందముగా ఉంటాయి. ఇప్పుడు కూడా దేవతార్చనలో నైవేద్య సమయములో వీటిని రాగయుక్తముగా పాడడము పరిపాటి. ఇతడు క్రౌంచపదవృత్తముగా వ్రాసిన ‘అంబరగంగ చుంబిత పాద’ అనే పద్యాన్ని నేను నన్నెచోడునిపై వ్యాసములో ఉదహరించాను. ఇవన్నీ విపులముగా ఇక్కడ వివరించడానికి కారణం మధ్వాచార్యుల కాలమునుండి దేవతార్చనలో, మతప్రచారములో సంగీతము ఒక ముఖ్యమైన భాగముగా ఉండిందని తెలుపడానికే. ఈ ద్వాదశస్తోత్రములోని ఒక రెండు ఉదాహరణలను కింద ఇస్తున్నాను –
వందే వంద్యం సదానందం వాసుదేవం నిరంజనం
ఇందిరాపతిమాద్యాది వరదేశవరప్రదం (1.1)
సదానందుడు, నిరంజనస్వరూపుడు, వంద్యుడు, వరప్రదులకు వరప్రదుడైన ఆ ఇందిరాపతి వాసుదేవునికి నమస్సులు.
బహుచిత్రజగద్బహుదాకరణాత్
పరశక్తిరనంతగుణః పరమః
సుఖరూపమముష్య పదం పరమం
స్మరతస్తు భవిష్యతి తత్సతం (4.3)
ఎన్నో చిత్ర లోకాలను ఎన్నో సారులు సృష్టించిన ఆ పరమేశ్వరుడైన శ్రీహరి పాదాలను స్మరిస్తే అనంతసంతోషము లభిస్తుంది.
వామన వామన భామన వందే
సామన సీమన శామన వందే
శ్రీధర శ్రీధర శంధర వందే
భూధర వార్ధర కంధరధారిన్ (5.7)
ఓ వామనా, దుష్ట శిక్షకా, శిష్టరక్షకా, జ్ఞానప్రదాతా, ధర్మసీమను కాపాడువాడా, శక్తిప్రదాతా, జగద్రక్షకా, నీకు నమస్సులు. ఓ శ్రీధరా, సమస్తైశ్వర్యనిలయా, శ్రేష్ఠాకారా, భూధరా, జలధరా, శంఖగ్రీవా, నీకు నమస్సులు.
నందితీర్థోరుసన్నామినో నందినః
సందఘానాః సదానందదేవే మతిం
మందహాసారుణాపాంగదత్తోన్నతిం
నందితాశేషదేవాదివృందం సదా
ప్రీణయామో వాసుదేవం
దేవతామండలాఖండమండనం (8.11)
నందితీర్థులమనే పేరితో ఆనందమును పొందినవారైతిమి. ఎల్లప్పుడు ఆనందమతులై దేవునిపై ధ్యానము నుంచినారము. దేవతలకందరికీ ఆనందమును కలిగించువాడైన మందహాసుని, అరుణాపాంగవీక్షణుని వందించుచున్నాము. సమస్తదేవతల మండలానికి తలమానికమైన నీవు తృప్తుడౌదువుగాక!
ఆనందచంద్రికాస్యందక వందే
ఆనందతీర్థపరానంద వరద (12.9)
ఆనందతీర్థా, పరము అనే ఆనందాన్ని ఇచ్చువాడా, నీ దీవెనలు ముక్తులకు ఆనందచంద్రిక వంటిది.
దాససాహిత్యపు పునాదులు
అసలు మొట్ట మొదట ఇటువంటి దాస సాహిత్యాన్ని కన్నడములో సృష్టించింది ఎవరు అనేది ఇంకా వివాదాంశమే. ఆ కాలపు కర్ణాటక దేశములో ఇప్పటి మహారాష్ట్ర, ఆంధ్ర దేశాలలో కొన్ని భాగాలు కూడా ఉండేవి. జైన, బౌద్ధ, అద్వైత, విశిష్టాద్వైత, ద్వైత ధర్మాల కూడలి ఈ ప్రదేశము. బసవేశ్వరుని వచనాలు, అక్కమహాదేవి వచనాలు వీరశైవ సిద్ధాంతాలను ప్రాచుర్యములోకి తెచ్చాయి. ఉదాహరణకు బసవేశ్వరుని ఈ వచనము అర్థం చేసికొనడానికి ఎంత సులభమో, అర్థములో అంత మహత్తరమైనది –
నాదప్రియ శివనెంబరు, నాదప్రియ శివనల్ల
వేదప్రియ శివనెంబరు, వేదప్రియ శివనల్ల
నాదప్రియనూ అల్ల, వేదప్రియనూ అల్ల
భక్తిప్రియ నమ కూడలసంగమదేవ
నాదప్రియు డందురు శివుని, నాదప్రియుడు కాడు శివుడు
వేదప్రియుడు డందురు శివుని, వేదప్రియుడు కాడు శివుడు
నాదప్రియుడు కాడు, వేదప్రియుడు కాడు
భక్తిప్రియుడు మన కూడల సంగమదేవుడు
నరహరి తీర్థులు
అచలానందుని దాసులలో 60 మంది ఆద్యులను ప్రథమ హరిదాసులంటారు. మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడైన నరహరితీర్థులు ఈ హరిదాస సాహిత్యానికి నాందీవాక్యము పలికాడని అంటారు. ఈ నరహరి తీర్థులను గురించి కొద్దిగా ఇక్కడ చెప్పడము అవసరము.
ఇతడు మధ్వాచార్యుల శిష్యులలో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తాడు. ప్రథమ శిష్యుడు పద్మనాభతీర్థులు, నరహరి తీర్థులు ఇద్దరూ ఆంధ్రులు, గోదావరీతీర నివాసులు. నరహరి తీర్థుల పూర్వాశ్రమపు పేరు శ్యామ శాస్త్రి (లేక స్వామి శాస్త్రి). శ్రీకూర్మములో చాల యేండ్లున్నట్లు ఆలయ శాసనాలు తెలుపుతాయి. కొందరు ఇతడు కూచిపూడి నాట్యాచార్యుడైన సిద్ధేంద్రయోగికి గురువని కూడా చెబుతారు. బహుశా రాజమహేంద్రవరములో మధ్వాచార్యులతో వాదించి ఓడిపోయి అతని శిష్యుడయ్యాడు. నరహరితీర్థులను మధ్వాచార్యులు కళింగదేశానికి పంపుతాడు. ఆ కాలములో భానుదేవుడు కళింగదేశపు రాజు. ఈ భానుదేవుడు క్రీ.శ. 1278లో చనిపోయాడు. ఇతని కొడుకు రెండవ నరసింహదేవుడు పసివాడు. రాజ్యాన్ని పరిపాలించడానికి ఒక రాజప్రతినిధి కావాలి. ఒక ఏనుగు పూలమాలతో పురవీధులలో వెళ్ళుతూ అక్కడ నిలిచి ఉన్న నరహరితీర్థుల మెడలో ఆ మాలను వేసింది. నరహరితీర్థులు రాజప్రతినిధిగా రాజ్యాన్ని చక్కగా శత్రువులనుండి కాపాడతాడు.
పన్నెండు సంవత్సరాల తరువాత రాజ్యాన్ని నరసింహదేవునికి అప్పగిస్తాడు. రాజు నీవేదైనా కోరుకో, నీకు కావలసింది ఇస్తాను అని చెప్పగా నరహరితీర్థులు మధ్వాచార్యుల ఆజ్ఞానుసారము అక్కడ కోశాగారములో ఉండే మూలరాముల, సీతాదేవి విగ్రహాలను అడగగా, రాజు ఇస్తాడు. దానిని తీసికొని ఉడుపికి వెళ్ళి మధ్వాచార్యులకు అర్పించాడని చెబుతారు. ఈ మూలరాముల విగ్రహము (ఇక్ష్వాకు మహారాజు చేత పూజించబడి, దశరథునికి సంక్రమించి, పిదప లక్ష్మణ హనుమంతులచే అర్చించబడి, భీమునిచే పూజించబడి గజపతి రాజులకు ఇవ్వబడిన ప్రతిమ) నేడు కూడా శ్రీరాఘవేంద్ర మఠములో అర్చనలను అందుకొంటున్నది. నరహరితీర్థుల ప్రేరణ వల్లనే యక్షగానాలను తుళునాడులో బయలాట రూపములో మధ్వాచార్యులు ప్రవేశ పెట్టారని అంటారు. (జయదేవుని గీతగోవిందపు ప్రేరణ యేమో?) ఈ నరహరితీర్థులు ఉడుపిలో కన్నడమును అభ్యసించి కీర్తనలను వ్రాసినాడు అంటారు. నేడు మనకు మూడు కీర్తనలు లభ్యమవుతున్నాయి (తిళికో నిన్నొళగె నీనె మరుళె, ఎంత మరుళాదె, హరియే ఇదు సరియే). అందులో ‘హరియే ఇదు సరియే‘ అనే కీర్తనను ఇక్కడ ఇస్తున్నాను –
పల్లవి:
అనుపల్లవి:
చరణం:
వితతవాహుదె నిన్న పతిత పావన కీర్తి
చరణం:
భక్తవత్సల నామ వ్యర్థవాగదె
చరణం:
నగధర ఎన్న బిడువ బగె ఏనిదు
చరణం:
కీయనె, నా పరకీయనె నినగె
చరణం:
నెంటనె నినగె బంట నానల్లవె
చరణం:
కొట్టళు అవళేన బిట్టదు నానేన
చరణం:
మొరె హొక్కెను నా నరహరి పూర్ణనె
హరి నీ కిది సరియా
చరణ సేవకునిపై కరుణ చూపవేల
పతితుడని శ్రీపతి కావకున్న
వితత మగునె నీదు పతిత పావన కీర్తి
శక్తుడై నీవేల భక్తుని కావవు
భక్తవత్సల పేరు వ్యర్థమగునే
దిగులు జెందక తన్నిన భృగుని కాచితివి
నగధర నన్ను విడుచు తెరగు ఏమిటి
హేయు డజామిళుని బ్రోచితివి స్వ-
కీయుడె, నే పరకీయుడె నీకు
దుష్ట హిరణ్యకుని పాపము బాపితివి
చుట్టమె నీకు, బంటు నేనే గద
తుచ్ఛ అహల్యను మెచ్చి పాలించ
యిచ్చెనె నీకేమి, ఇవ్వని దేమి నేను
దొర నీదు మనసుకు సరియగు నట్లు చేయి
మొర లిడెదను నే నరహరి పూర్ణుడ
కాని కొందరు విమర్శకులు ఇవి నరహరితీర్థుల కాలము నాటిది కావంటారు. మూడు పాటలలో మూడు విధాలైన అంకితాలు ఉండడము ఒక కారణము. ఆ కాలపు పాటలలో అనుపల్లవి లేదు. పై పాటలో అనుపల్లవి ఉంది. అదియును గాక ఆంధ్రుడైన నరహరితీర్థులు కన్నడము నేర్చుకొని ఇలాటి పాటలను ఎలా వ్రాసి ఉంటాడు అన్నది మరొక కారణము. నా ఉద్దేశములో మూడవది ఒక కారణము కాదు. సకలవిద్యా పారంగతులైన సన్యాసులకు కొత్త భాషను నేర్చుకొనడము కష్టమేమీ కాదు. ఏది ఏమైనా ఇటువంటి పాటలు చాల తక్కువ. మొట్ట మొదట విరివిగా కన్నడములో శ్రీహరి కీర్తనలను వ్రాసింది శ్రీపాదరాయలే అనడములో సందేహము లేశమైనా లేదు.