ఏదైనా ఒక వేడి వస్తువు

గేటు కాడ్నించి మేడంగారి కారు లోపటికి తిరగడం సాన. కిసుక్కుమని నవ్వుతాది కుమారి. “ఏదైనా వొక యేడివొస్తువూ …” అనీసి గుడ్లు మిటకరించుకోని నాదుక్కూ నాగలష్మి దుక్కూ మార్చిమార్చి సూసుకోని, బ్రైనని ఈ చంకలోంచి ఆ చంకలోనికి ఎగదోసుకోని “బాస్పీబవనమూ …” అనీసి అచ్చం మేడంగారు చెయ్యి తిప్పినట్టుగే తిప్పుకోని కానుగ బెత్తం పువ్వుల్చెట్లమీద, మొక్కల గోలేల మీద కొట్టుకుంటూను. మా పనోల గుంట్లకి ఇగటాలకి కుమారీయే లీడర. విల్లా నెంబర సెవన్ అమిరికావోలింట్లో పన్లోనున్నాననీసి దానికి డబలెగష్టా లాగుంటాది. పెద్ద పైల్మేన్లాగ బ్రైనకి నోట్లోన పాలబుడ్డీ తోసీసి, బేబీ స్ట్రోలర చెత్తలోడి బండీలాగ ఇటూ అటూ కోల్నీయల్లా తిప్పుకోని “గార్భేజ మేడం ! రీసైకలింగ సార్ !” అనీసి చెత్తల ముసిలోడికి ఎక్కిరించుతుంటే మా పనోలందరం నవ్వుతుంటే బ్రైను, జాఖరీ, ఆలక్కా మాతోటొచ్చీసి నవ్వడాలు. బ్రయినోలమ్మగారు అమిరికావోలవబట్టి సరిపోయింది గాని అదే మనోలయితే దానికుండీదీపాటికి – మ్రోగింది కల్యానవీనా!

వల్లీ మేడం టింగుమని కార్నుండి దిగిపోయి మహీందర చేత పుస్తకాలు, చార్ట్రులు, బిస్కట్లున్న సంచీలు క్లబ్బౌసు ముందర షెడ్డుకాడ దింపించింది. ఆపగాడు, బేకుడు, సిరీషా ఎర్రటెండలోన నెత్తిమీద గమేలాలు బోర్లించుకోని ఇసక్కుప్పల మీద కూకోని ఇటికబెడ్డలు దొంతులు పేరుస్తన్నారు. రాజేష్ గాడు, దీక్షూ గాడు సరుగుడు కర్రలతోటి కత్తియుద్దం చేసుకోనొచ్చి మేడానికి చూసి కర్రలు బీపెనకాల దాసీసుకోని బుర్రలు దించీసుకున్నారు. నాగలష్మీ ఆల విల్లా నెంబర నైన్ మేడానికి చెట్టుకింద కుర్చీలోన కూకోబెట్టి మీగడా పసుపు మొహానికి రాసి, దోసకాయ చక్రాలు కళ్ళమీద పెట్టి బుర్రకి హెన్నా రాస్తంది. మేడం కారు దిగీదిగ్గానె ఎక్కళ్ళేని పనోల గుంట్లందరికి సిమింటుబస్తాల షెడ్డుకాడికి రమ్మనీసి ఆర్డర్లెల్తాయి. నీనెల్లి ఆపగాడికి, బేకుడికి, సిరీషాకి, దీక్షూ గాడికీ రాజేషకీ చేతిలోన కర్రముక్కలు పారీయించి షెడ్డు గుమ్మంలోన వరాసగా లైన్లో నిలబెట్టించేను. ఇక్షునాకొడుకు చేతిలోన కర్ర పారీసినా ఇంకా “జుజ్జుజ్జుజ్జుజ్జూ… షువ్హో… డిష్షుడిష్షుడిష్షోం…” అని రాజేషకి గన్ను కాల్చెత్తనాడు. కుమారీవాలమ్మ, నాగలష్మోలమ్మా గిన్నిలు తోఁవడాలు తుడ్డాలాపీసి “అమ్మా కుమారీ! బ్రెయినుకి నీన్సూస్తాను ఎల్లండర్రా ఎల్లండి…. అమ్మా! నాగలక్ష్మీ…?!” అనీసి పనోలగుంట్లందర్ని మోపుచేస్తనారు. శనాదివారాలు మద్యానమయ్యిందంటే సాన ‘ఆ మేడంగారొచ్చిందర్రా పాఠాలకెల్లర్రా!’ అనుకోని పవిటల్తోటి మొకాలు తుడుచుకోని విల్లా విల్లాకి ఎక్కీగుమ్మం దిగీగుమ్మాలెల్లి బెత్తాయించుతారు మాయమ్మోలు. ఉన్నోలకి ఉన్నకాడుణ్ణీకుంట హైరాన! వల్లీమేడం మా పనోల గుంట్నాకొళ్ళందరికీ రానీలాగ కటింగిచ్చుకోని, నడుమ్మీద చెయ్యేసుకోని సెడ్డు తాళం తీయించీసి “అంతా రడీయర్రా పిల్లలూ? ఏంటే … లష్మీ? ఊఁ …. అంతా రడీయేనఱ్ఱా?” అంటంది.

మహిందర కిందటాదివారం పరిచిన జంబకానాలు అలాగే వున్నాయి. బచ్చానాకొళ్ళు ఒక్కొక్కలే పుస్తకాలు ఇస్తిరాకుల్లాగ ముందరేస్సుకోని బోయనాలకి బంతిస్తళ్ళు కూకున్నట్టు కూకుంటే నీను కుమారీ దుక్కు నాగలష్మీ దుక్కు సూసి టూటీఫూటి పుల్లతోటి తాగినట్టిగ ఏక్సన్ చేస్తుంటే ఆలు కిసకిసామనీసి నవ్వుతుంటె. సిమింటుబస్తాలు పోగా మీఁవు కూకోగా ఉన్న ఈరికముక్కలోనే మేడం తెల్ల ప్లాష్టిక్కుర్చీలోన కూలబడిపోయి, ఫేనేయించుకోని కూడా పంజాబీడ్రెస్స వోనీతోటి ఇసురుకుంటంది ‘ఇస్సో’ మని. “ఏంటఱ్ఱా..? ఏంటి ఫన్నీగా వున్నానా? ఎందుకే నవ్వుతున్నారూ..?” అనీసి సిలకలాగ తియ్యట తియ్యట మాటలు మాటాడుతుంటే ఆపగాడు, బేకోజి, సిరీషా గుంట్నాకొళ్ళందరు కిసకిసకిసాలమనీసి నవ్వుల్నవ్వుల్నవ్వులే. ఆపగాడు ఉట్టుట్టికె పల్లకోలేక “మేడం వీల్లకి టూటీఫ్రూటీ కావాలంట మేడం!” అన్నాడు పెద్ద పోటుగాణ్ణాగ. విల్లా నెంబర సిక్సోల బాబుకి భర్తడే పార్టీ చేసిన్రోజు సుడాల ఆపనాకొడుకు కుక్కుకోని కుక్కుకోని ఎన్ని కేకుముక్కలు తిన్నాడో, సెక్రూరిటీవోలు సూడకుంట కడుపుబ్బరించుకోని ఎన్ని కోకులు తాగేడో!

వల్లీమేడం ఇంగ్లీషు బుక్కు తీస్సి ఇంకా సద్దుకుంటందో లేదో అంకిత్ బాబు సాగర్ బాబోలు వాటర గన్స్ తోటొచ్చి షెడ్లోకొచ్చీసి మేడాం కుర్చీ ఎనకాల దాగుండిపోనారు. ఆ బాబోలు ఎస్సాటాడతుంటె వాల్ని పట్టుకోడానికి జస్వంత్ బాబు, జాఖరి బాబు, సమీర్ బాబు ఎతకడాలకొచ్చీసి. మేడం అంకిత్ బాబోలని సిమ్మింటుకట్టల యెనకాల్నుండి లేపించీసి “ఏయ్! నాట్ హియర్ నాట్ హియర్…” అనీసి పార్కులోన ఆడుకోమనీసి గసిరీసింది. అంకిత్ బాబోలు ‘డంబ్ పనమ్మా కిడ్స్ ..’ అనీ తిట్టుకోని బేకుడి బుర్రమీద అంగలు దాటుకోని పార్కుదుక్కెలిపోయేరు. మీఁవు పనమ్మా పిల్లలఁవి పనోల్లాగుండకుంట ఎర్రటెండలోన ఇలాగ షెడ్నోన కూకోని వల్లీమేడం సుత్తినాలంటే నాకు సించుకున్నట్టుగుంటాది. అంకిత్ బాబోలు క్లబ్బౌసు పూల్లోన స…ల్లగా ఈతలకి దిగుతారింక. నాకు గేటవతల బందలోన ఈతలు కొట్టుకోని, సీమసింతబొట్టలు ఈత గుడ్లు తెంపుకోనొచ్చి రాతిబండల మజ్జిన వేపచెట్ల కింద తినుకుంటు కూకోవాలుంటాది. సెక్రూరిటీగాడ్రంకులాల కేబిన్లోన కిరికిట్లైన చూస్కోనివ్వకుంట పన్నిండున్నరకి బెల్లుకొట్టి పిల్సినట్టుగు ఈవిడొచ్చెత్తాది ‘ఏ ఫర్దీ యెపిల్ బీ ఫర్దీ బేట్’ అనీసి. నీను సెవంత తోని ఆపీసేననీసి నాగలష్మీ తెంత పోయిందనీసి మా ఇద్దరిమీదా పట్టించింది మేడఁవు. యెక్కడ్లేనింగ్లీష్ పుస్తకాలు, నెక్కలబుక్కులు తెచ్చీసి మా అయ్యకిచ్చీసి రాయించమంటె మాయమ్మా నాగలష్మాలమ్మా “మనోల మంచికే సెప్తన్నారు మేడం గారు! ఆయమ్మన్న ముక్కలేటో రాసీయర్ర మరేద!” అనుకోని. ఈ మేడాము బుక్కులు మా పేనాల్తిండానకి!

“ఎల్డర్స్ అంటె..?” అంటంది నాదుక్కు కొంగనాగ మెడకాయెత్తీసి ‘యేటమ్మా కొండబాబూ నువ్వీని కదమ్మా నా పుడింగివీ!’ అన్నట్టుగ. ఇంకీవిడితోటి మనకెందుకనీసి నీను చేతులు కట్టీసుకోని ‘యెల్డింగు చేసీవోలు మేడం! ‘ అంటే పకాలమనీసి నవ్వీసింది నలుగురున్నారనీసి, ఆడోలున్నారనీసీ లేకంట. మా అయ్యోలకాడ, సారోల కాడా తిట్లుకాసి తిట్లుకాసి రాటుదేలిపోయున్నాను. నాకేటి?! గెట్టిగ నవ్వితె గాలికి, మెల్లిక నవ్వితె మేడకి! కుమారీకి తెలుగచ్చిరాలే రావు అది అమిరికావోల్లాగ కటింగిచ్చుకోని “అచ్చి! యెళ్డర్సంటె పెద్దవారు …” అన్నాది. మేడం దాందుక్కొక యెరీగుడ్డిసిరీసి “రెస్పెక్ట్ యెల్డర్స్! పెద్దలను గౌరవింపుము..” అనీసి ఎత్తుకున్నాది బాగోతము. ఆపనాకొడుకు, బేకుడు,రాజేష బిస్కట్ల బేగీల్ల తిండాలకేటున్నాయా అనీసి సొంగలు కార్చుకుంటనారు. ఇక్షుగాడు టూట్టిప్రూట్టి సంచీ ఇప్పీసి తాగీనాలకి లడీగున్నాడు. సిరీషా, నాగలష్మీ, యెల్డర్సకి పోటుగత్తిలాగ కుమారీ మఠాలేసుక్కూకోని మేడం తెచ్చిన బుక్కునోకి సూస్కోని పెద్దవారి యెడలా, సాటి విధ్యార్ధుల యెడలా మడత కటింగులిచ్చెత్తనారు. వల్లీమేడం మహిందరకి పిల్చి కర్ర స్టేండీకి చార్ట్రు యేలాడకట్టించింది. దనిమీద కిందటసుట్టు తెచ్చినట్టుగ ఆహారాల బొమ్మల్నేవు. డబ్బులు! వెయ్యా, ఐదువొందలూ, వొందా యేబయ్యీ ఇలాగ డబ్బుల్నోట్లు బొమ్మలూ, రూపాయిల బొమ్మలూని! కల్లు జిగీలుమంటంటె మీఁవు పన్నాకొడుకులందరిఁవి తేపకార్సుకోని ఆ డబ్బులికి సూస్తంటే మేడం గర్రాగా నిలబడిపోయి నడుముల కిందాకి సేతులెట్టీసుకోని “చార్ట్రు పైకొసాకి ఏంటునాదో సదవ్వే నాగలష్మీ!” అన్నాది. అది మా సిన్నానాల బొట్టి. ఉట్టప్పుడే దానికి ఊరంతా సిగ్గు. అదింకా ముడుసుకుపోయి లెగిసి “ఎం – వో – ఎన్ – ఈ – వై ….. మొనేయ్ అమ్మ! మోనేయ్ …” అంటంటే మేడం దాని బుజం మీద తట్టీసి “మోనేయ్ కాదు, మనీ! మనీ!! వోకే? మనీ అంటే ..?” అనీసన్నాదో లేదా ఇక్షుగాడితోటి సహా పన్నాకొళ్ళందరిఁవీ “డబ్బులు..!” అనీసరిస్సేము. మేడం ఆ డుబ్బులన్ని లాట్రీ గెలిచిసిందాన్లాగ గట్టెక్కి నిలబడపోయి “యెస్స్! మనీ అంటే ఏంటో అందరికీ తెల్సు కదఱ్ఱా చిల్డ్రన్? డబ్బు! డబ్బులెలాగొస్తాయీ….? ఊఁ? ఎక్కడ్నుంచొస్తాయి డబ్బులు? హౌ..?” అనీసి ఒకొక్కల్లకీ అడుగుతన్నాది, కోకిలా… కో – కి – లా టైపులోన. డబ్బులెక్కణ్ణుంచొత్తాయి?! బేంకీకాడ మిసన బటాలు నొక్కితే వొస్తాయి! నీను ఉండబట్టక “కుమారికయితే బ్రెయినకి సూసినందుకు అమిరికావోలు జీతాలిత్తారు మేడం!” అనీసేను. వల్లీమేడం ఇందాకట కుమారీకి పెట్టీసిన కిరీటము వూడదీస్తెచ్చి నాకు పెట్టీసి “కరక్ట! జీతం … సేలరీ! మరి మీ అమ్మకి నాన్నకి జీతాలొస్తయ్యా కొండబాబూ? వాట్..?” అంటంటె కుమారి సుద్దముక్కలు గురిసూస్కోని నా టెంకిమీదకి ఇసుర్తంది. ‘నీకున్నాది బేండుమేలం, మేడం ఇలగెల్నీవే నీపని!’ అనిసి దానికి నాలిక మడతపెట్టి వార్నింగిస్తె, అది కిరీటాఁవు మల్ల లాగీసుకుందామనీసి నిలబడిపోయి “ఆల్ పనమ్మా కిడ్స్ గెటింగ్ సేలరీ మేడం. ఇక్షు రాజేస్ స్మాల్ చిల్డ్రన నాట్ గెటింగ్ మెడెం !” అనీసింది అమిరికావోలమ్మా మొగుడ్నాగ.

“పనమ్మా చిల్డ్రన్ ఏంటి కుమారీ?” అనీసి ఇసుక్కున్నాది మేడం. “సే వర్కర్స్ చిల్డ్రన్..” అంట. పనోల పిల్లలకి పనమ్మా సిల్డ్రన్సనకుంట పైల్మేన్ సిల్డ్రన్సంతారా? మేడం ఇక్కడ్నుండి ఎటుదుక్కెల్తాదో మాకందరకి తెల్సును సరస్పతీదేవి. పనోలమ్మలకి జీతాలు ఏపాటొస్తాయనీసి, పనోలు గోడవతల రేకుల్సెడ్డుల్లోన కాపరాలుంతామని, బురదల్లోకెల్లి మా ఇళ్ళకి రానానికి తోవల్లేవనీసి, డ్రమ్ముల్లోన్నీల్లు తాగితే జ్వరాలొచ్చెస్తాయి పాపము పూరు పీపుల్సనీసి మామీద ఈవిడికి డబల కనికారము. కుమారాలింట్లోన మా ఇంట్లోన టీవీలున్నాయి. నాకాడ కత్తిలాటి సెల్లున్నాది మేడానికే లేదు నాలాట సెల్లు! మీఁవు బీదోలమంటె నీనొప్పుకోను. మా నీలూసు నిప్పులూసు ఈలకెందుకు? మేడానికి ‘ఎందుకులే!’ అనీసి పల్లకుంటంటె మడతకటింగులెక్కువైపోతన్నాయి! నీను గూబలు, బుజాలు నిగడదన్నీసి “కుమారి, కుమారి! సే వుయార్దీ వర్కర్స చిల్డ్రన్ , వోక్కె?” అనీసి రోబోనాగ అనీస్సరికి పన్నాకొడుకులందరు గొల్లుమనీసి నవ్వీసేరు. దానికలాగే కావాల యెక్కడిదక్కడే ఇచ్చెత్తాను దానమిరికా కటింగులికి! మేడానికి నామీద నవ్వించుతాదా యెల్డర్స?! ఆపగాడు, బేకుడు, ఇచ్చుగాడు అందరు “వోక్కె! వోక్కె!!” అంటంటె మేడాలు గాబరాలెత్తిపోయి “ఏంటఱ్ఱా ఓకే..?” అంటంటె నాగలష్మీ ఉడతనాగ పల్లికిలించుకోని “శ్రీనివాసాలమ్మ – రోబో ఆడతందమ్మ – ఈడు కొండబాబు పనోల పిల్లలఁవందరము ఎల్దామివాల మేడంగారొచ్చీసరికి అనీసమ్మ … ‘మేడం క్లాసొద్దర్ర రోబోకెల్దారి ‘ అంటనాడమ్మ!” అని నా సీక్రీట దండోరా ఏస్సింది. అది మా సిన్నాన కూతురనీసి కిందటిసుట్టు ఒగ్గీసేనుగాని ఇంకోసుట్టు నా ఊసొచ్చేవంటె నిద్దట్లో ఉణ్ణిచ్చి పిలకలు కత్తిరించెత్తాననీసి దానికి కిందట శనోరమే వోర్నింగిచ్చేను. చేతులు కత్తిర్లాడిస్తంటె కిసుక్కుమనీసి మూతికి చెయ్యడ్డం పెట్టుకున్నాది. వల్లీ మేడం డబ్బుల చార్ట్రుకి కర్ర చూపించుకోని “రోబో ఎవరెవరు చూసేరఱ్ఱా? చిల్ద్రన్?! రైజ్ యువర హేండ్స్?” అన్నాది. కుమారీ మేడానికి తందానతాన్నాగ ‘రోబో ఎవలెవలు చూసేరో చేతులెత్తర్రా?’ అంటే ఆపనాకొడుకు, ఇచ్చుగాడు, రాజేష చేతులెత్తీసేరు. “తిండాలక్కాదర్రా! రోబో చూసేరర్ర..?” అని గసిరితే చేతుల్దించీసేరు. మంటిబొక్కడం నాకొల్లు! ఆపగాడికి బకిట్లు బకిట్లు నీల్లు మొయ్యడాల్తప్పించి కేట్‌కీ డాగ్‌కీ తేడా తెలీదు. ఆడి చెయ్యట్టుకుని టకామని దించీసి కిసుక్కుమనీసి నవ్వుతంది నాగలష్మి ఉట్టుట్టికే సిగ్గుపడిపోయి ‘ఎవలం సూల్లేదమ్మ!’ అనుకోని.

వల్లీమేడం రోబోనొగ్గీసి గాందీజీ మీదకెల్దారనీసి డిసైడింగు చేయిస్సి “చూడండఱ్ఱా! ఈ నోటు చూసేరా? దీనిమీద ఈయనెవరూ?” అన్నాది. సిరీషా కుమారీ ఆడోలిద్దరూ ఒక్కసుట్టే “గాందీ గాందీ” అంటంటె నాగలష్మే కలగచేసుకోని “అలాగనకోడదర్ర! మహాత్మా గాందీజీ అనాలి!” అనీసెత్తుకున్నాది నెక్చర! మేడం తరవాత ఇదే చిన్నమేడం నాగ. ఆలమ్మాలు దానికి విజీవాడ సైడు పెల్లిసమందాలు సూస్తన్నకాణ్ణించి పెద్దవారి యెడాల, సాటి విద్యార్ధుల యెడాల ఎచ్చులెక్కువైపోతన్నాయి దానికి. వల్లీమేడం ఇంక నెక్చర్లకి దిగిపోతాదిరా స్వామిసరణం! పనివాల్లకి రోజుకి నూటనలపై చొప్పున నెలకెంతొస్తాదొ, ఆడోలకి రోజుకి నూటాపది చొప్పున ఇంతలెక్కనిచ్చెత్తె నెలకి నలుగురు మడుసులికి ‘బియ్యాలెంత? కూరెంత? పాలెన్నీసి తాగీయాల? కోడిగుడ్లెన్నీసి తినీయాల’నీసి కొసినీలేసెస్తాది దయగల్తల్లి. ఇచ్చునాకొడుకూ బేకుడూ ఆలింట్లో పాలే కొన్రమ్మంటే ఆమాటే ఇనపణ్ణుట్టిగె చెవిటి మారాణీ “పాలు సంపూర్నా ఆహారమఱ్ఱా! రోజుకీ ఒక్కసుట్టైనా కంపల్సరీగ పాల్తాగితే… మీ పెదిమల చివర తెల్లగా ఉన్నాయి చూసేరా, అలాగవ్వకుండ అంకిత్ బాబోల్లాగ గులాబీ రంగులోనుంతాయఱ్ఱా మీ పెదాలు!” అంటాదింక మహాత్మురాలు. ఆలయ్యకి తాగీసి పడిపోనాలకే సానదు ఆడి జీతము! ఈలకి ప్రాలు, ప్రండ్లు, గ్రుడ్లు యెక్కణ్ణించి తెచ్చీమంటావనీసి గెట్టిగడిగీవోల్లేక. పన్నాకొళ్ళందరు ఒక్కలంటొక్కలు యేటీ అనకుంట సెడ్డు టాపులికేసి సూసుకోని సిగ్గుసిగ్గుగా నవ్వుతన్నారు. మీఁవందరఁవు బీదవాల్ల పిల్లలమనీసి, మాకు సదువులు చెప్పించీసి జీతగాలకింద చేయిస్సి ఎవులకాలమీద వాల్లమూ టకామన్నిలబడపోవాలనిస్సి ఆడోలకీ మొగాలకీ ఇద్దఱకి సమానముగ నూట్నలపియ్యీసి కరుకులు రోజూ ఇచ్చీయాలనిసి, ఆ కరుకులెట్టీసి మీమందరఁవు రోజువిడిసి రోజైనా పౌష్టికాహారంవు డబల బొక్కియ్యాలనీసి, మేడం నడుములమీద సేతులేసుకోని చార్ట్రుమీద గాందీజి మీద కర్రేసి కొట్టుకుంతంది దర్మతల్లి! నాకు గుండీలంట ఎండ కాలిపోతందంటె నాదా తప్పు? ‘మీము బీదవోల్లం కాదు మేడాంగారండి! మాకు ఉల్లిబద్ర లోన ఎకరాఁవున్నర పొలాలున్నాయి మేడంగారండి!! గర్భఁవు పూడిపోయి సెరువెండిపోబట్టి నీల్లేక మా అయ్యోలకి నెక్క సద్దుబాటయ్యింది కాదనీసి ఈఊరొచ్చీసీఁవు మేడాలమ్మా!’ అందుఁవా అన్నోటిదాకొచ్చీసింది. మేడం గాందీగారిమీదున్న కర్రకి తీసిటుతిప్పీసి నాదుక్కే చూపించి “ఏంట్రా కొండబాబూ? రోబో టికట్ట ఒక్కొక్కలకీ ఎయిటీ అయితే మనం ఎంతమందిమున్నామురా? మనందరికి కలిపీసి ఎంతవుతుందిరా?” అంటంది. పెట్టించెయ్యికి తిడతామా? నీను బుజాలు గజాల్చేస్సుకోన్నిలబడపొయి ‘యెస్ మేడం’ అనిసేను ఆదికిముందు. మేడం టికట కట్టీసి రోబోకెల్దామంటె మరి సిలకట్టెగ్గట్టీనా అర్జింటుగాని?

“యెస్ మేడం గారండి! మనము యెనమండుగురు విధ్యార్ధులము కొరకు రోబో టికట్ల కొరకు వొక్కొక్క టికట్ట ఎనపై రూపాయలు చొప్పున …. ఇచ్చూకి, రాజేష్ కి అరటికట్ట చొప్పున మొత్తము ఎనిమిదిమంది విధ్యార్ధులము మేడం..” అనీసింక హరికద. మేడం చేతులు కట్టీసుకోని, పేంబెత్తం నాకాసే చూపించుకోని చిద్విలాసంగా నవ్వుకోని ‘ఊఁ కానీ కానీరా …. నెక్కచెప్పురా పుడింగి?!’ అన్నట్టగ సూస్తంటె, పన్నాకొళ్ళందరు ‘ఈడీ లెక్కేదో బేగి కట్టిస్తే రోబోకెల్దుఁవా?’ అన్నట్టుగు నాదుక్కే సూడ్డాలు! నీను ఏటయితే అదే అయ్యింది మార్చీ పోతె సెక్టెంబరున్నాది గాదా అనీసి “ఎనిమిది మంది విధ్యార్ధులకు ఎనపై ఎనిమిదుల ఎనపయ్యెనిమిదీ స్తానేముందున ఒకటీ ..” అనీసి గునకారాలు బాగారాలు ఎత్తుకున్నట్టుగ దొంగేక్సన్ చేస్తన్నాను. రోబోకి లెగదిసేననీసైన కనికారము లేకుంట నాగలష్మీ పెద్ద సావుకారమ్మనాగ చేతులెత్తీసింది. కుమారీ దానికి సపోర్టుకింద నెగిసి “వాడికి మేక్స్ సమింగా రాదు మేడం ! పల్లబండీవోడికి హండ్రడ్ రుపీస్ ఎగష్ట్రా ఇచ్చీసి విల్లా నెంబర ట్వంటీటూ మేడం వాల్చేత తిట్లు కాసేడు మేడం!” అని నా పెద్దరికం కుమ్మర బజార్లోన నిలబెట్టెస్తె పన్నాకొళ్ళందరు ‘ఈ’ అనీసి ఇకిలిస్తంటె. మేడం కర్ర నాకాణ్ణించి నాగలష్మీ మీదకి తిప్పీసి గన్నులాగ దానిమీద పెట్టీసి “ఊఁ చెప్పు నాగలష్మీ? టోటల్ ఎంత?” అన్నాది. మానాగక్కయ్య పల్లికిలించుకోని నిలబడపోయి “ఎనిమిది మంది పనివాల్లమమ్మ మయింద్రతోను కలుపుకోని. ఒక్కొక్కరికి ఎనపయి సొప్పున ఎనిందీ ఎనిముదుల అరవైనాలుగమ్మ. పదులు స్థానమునందు సున్న యెట్టెస్తమ్మ మొత్తము టోటల ఆరువొందల నలపయ్యమ్మ!” అన్నాది. వల్లీమేడం బేగునోనుండి వెయ్యనోటు తీస్సి దానికి వజ్రకిరీటంనాగ నెత్తిమీదాడించి “మరి దీక్షూ రాజేష్ చిన్నిపిల్లలు కదవే! వాళ్ళకి ఆఫ్ టికట కదా? కానీ మహిందర్ కి ఫుల్! సో… మొత్తం సిక్స్ ఫాటీ … అంటే ఆరువందల నలభయ్యి? ఊఁ? గుడ్..?” అనీసి మూతి, కళ్ళు, బుర్రకాయ ఇటీపటీపు తిప్పుకోని ఆ వెయ్యినోటు నాగలష్మీ చేతులెట్టుకోని సెడ్డు గుమ్మం దిగిపోతంది. గుంట్నాకొళ్ళందరము రోబోకి లడీ అయిపోయి బిలబిల్లాడి దిగిపోతంటె మహిందర గేటు పెట్టిసి లైను కట్టించీసి “వన్ బై వన్… వన్ బై వన్!” అంటన్నాడు. ఆడు నరజన్మెత్తేక ఓ మాటైన మాటాడి ఓ పలుకైన పలకటము ఇదే మొదాటసుట్టు!

మేడమాల కారు ఇన్నోవ! ఇన్నోవాకి టాటా సూమోకి టకాఫోర్లాగుంటాది! మేడాం ఫ్రంట్ సీట్లో కూసోని సెల్లో ఎవలకో అవతలోడికి కొసినీలేస్తంది – “మీరు సైటు దగ్గరకొచ్చేసేసెయ్యండి. నేనూ ప్రవీన్ డైరెక్ట్‌గా వచ్చేసేస్తాం. ఓకేనా?” అనీసి. సిరీషా, కుమారీ, నాగలష్మీ మజ్జిసీట్లోన కూకోని ఇచ్చుగాడికి ఒళ్ళో కూకోబెట్టుకున్నారు. నీనూ, ఆపగాడు, బేకుడు, రాజేష ఎనకాల కూకోని కొత్తసీట్లు వోసన్లు చూస్తనాము. ‘రోబోకెల్తనాఁవు … రోబో, రోబో!’ అనీసి ఆలమ్మాలకి కేకలెస్తంది సిరీషా. మహిందర సిరీషాకి డోరు కరక్టగా యెయ్యలేదనీసి తిడతన్నాడు. ఆడు తోవకడాకీ ఆ ఒక్కమాట తప్ప ఇంకెవల్తోటీ ఏటీ అన్లేదు. మేడం ఆడికి మాటాడించబోతే “అట్లేంలా… మాది నల్గొండా మెడేం!” అనీసి ఆడిమానాడు డ్రైవింగులోన కామాప్ అయిపోయేడు. ఆపగాడు బేకుడూ ఏసీ బొక్కల్లోపట మొహాలెట్టీసి ‘ఉహ్ హ్వా! ఉహ్ హ్వా!!’ అనీసి సల్లగా సూయింగం వోసన ముక్కులెగబీల్సుకుంతనారు. నాగలస్మోలు ఏసీ చల్లగ మొకాలక్కొడతంటె పళ్ళికిలించుకోని రోడ్డుమీద కార్లకి లారీలకి ఎప్పుడూ చూణ్ణట్టుగ చూస్తనారు. సీయెమ్మార్ ఎప్పుడొస్తాదానీసి మీఁవు కాసుక్కూకోనుంటే మేడం ‘ఉఁఘం..’ అని గొంతు సవిరించిసుకోని “ఏది నాగలక్ష్మీ? కిందటి క్లాస్‌లో లెసన్ ఏంటి చెప్పుకున్నాం చెప్పూ…?” అన్నాది. నాగలష్మీ రుమాల మూతికడ్డం పెట్టీసుకోని సిగ్గుపడిపోయి “ఏదైనా ఒక యేడి విస్తువమ్మ!” అనీసింది ఉడతనాగ.

“యేడివొస్తువేంటే..? ఏదైనా ఒక వేడి వస్తువు… ఊఁ చెప్పూ? చదివేవా అసలు?”

నాగలష్మీకి మఱడాం ఐస్కూల్లోన టెంతక్లాసు సైన్సొక్కటే ఏడు మార్కుల్లోన పోయింది. సైన్సు కనక కట్టీసి పేసైపోయిందంటే జీవితములో గొప్పదాయివైపోతాదనీసి మేడం దానికి ఎలాగైనాసరే టెంతక్లాస పేస్ చేయించుతాననీసి డీచ్‌చాలంజీ కింద తీస్సుకున్నాది.

“అదేనమ్మ! యేడి వొస్తువమ్మ… ఏదైన ఒక యేడి వొస్తువును… వేడి వొస్తువును…”

“ఊఁ వేడి వొస్తువును..?”

“ఒక డిగ్రీ వేడిగాని చలువగాని పరచినప్పుడమ్మ… దానికి ఉష్టం…” అనీసి అది మెక్కుతుంటె నీను రోబ్బోనాగ గొంతుకు పెట్టుకోని ‘యేడికి సలవా సలవకి వేడీ’ అంటె మేడం నాకు గుడ్లెర్రగా చూస్సి నా నోరుమూయించీసి, దంతోటి మాత్రం కూలింగాన “ఉష్టం కాదు. ఉష్ణోగ్రత!” అన్నాది. ఆ ముక్కందుకోని మా సరస్పతీదేవి “ఆ ఉష్ణోగ్రతకే బాస్పీబవన గుప్తోష్ణమూ అంటారమ్మ!” అనీసింది ‘అమ్మయ్య ఒడ్డెక్కిపోనాన్రా మందపిల్లి శనీసురుడా!’ అనీసి పంజాబిడ్రస్స తోని మొకం తుడిస్సుకుని. మేడం ఓవరబిర్జీకాడ టర్నింగు తిరుగుతంటె తనలోన తనే అనుకుంటనట్టుగ ‘చూసేవా చదివితే ఒస్తుందీ!’ అన్నాది మెడకాయలు యెనక్కి తిప్పీసి. నాగలష్మి ఆవిడిమీద జాలితల్చినట్టుగ “సదువుతున్నానమ్మ! అంటెమ్మ… మా మేడం వాల్ల చెల్లిగారాలు అమిరికానుండొచ్చేరుగదమ్మ? వాల్ల బాబుకి ఆడించడాలు… ఇంకా బట్లవ్వన్ని ఉన్నాయనిస్సి…”అని నసుగుతుండీసరికె దేవుడి దర్మఁవ్వాన్ని రోబో వాల్ పోష్టర్లు జిగజిగమనుకోని సీయెమ్మారొచ్చీసింది. సిర్డీసాయున్నాడు! బాబా అన్నీ సైలంటగె ఆలకింతాడు!

మేడం మహిందరకి పార్కింగులకెలిపోమని చెప్పీసి టిక్కట్లకి డబ్బులిచ్చీసింది. మాకు రొబోలోన కూల్ డ్రింకుల కాడికి తీస్కెల్తాదనుకుంటే సీయెమ్మార మెట్లన్నీ యెక్కించి కరంట దువ్వారం లోనకి ఒక్కోల్ని దాటించీసి, అద్దాల లిఫ్టునోనకి అందరికీ సద్దీసింది. మేము ఏడుగురిఁవి, మేడంగారు లిఫ్ట్‌లోన సద్దుకుంటె సెక్రూరిటీవోడు తలుపడ్డం పట్టుకోని సూస్తనాడు. ఒక సారగారు మేడంగారు హిందీవోలు, ఆల్లోపటకొస్తారేటో అనీసి. ఆ మేడానికి మా వాలకాలు చూసి నోపట చోటున్నాని రాకుంట సైడుకెలిపోయేరు. లిఫ్ట్‌లోన సెక్రూరిటీ అంకులు మాదుక్కు అనుమానంగా సూస్తనాడుగాని మేడం ఉన్నాదికాబట్టి కిక్కురు కక్కురుమనకుంట ఎన్నో లెంబరనీసి మేడానికడిగేడు. మేడాం ఆడికేటీ జవాబు చెప్పకుంట రెండు నొక్కీసింది. అద్దాల గేలాం నూతులెల్లి తాబేల్లకి పైకినాగుతున్నట్టుగ లిఫ్టు మీదకి లెగిసిపోతంటె ఆపగాడు బేకుడు సిరీషా ఇచ్చుగాడు రాజేస పన్నాకొళ్ళందరు నోలెల్లబెట్టుకోని కిందకి సూస్తనారు. ఒక్కొక్కంతస్తు మీదకెల్తంటె కిందన సారగార్లు మేడాలు ఆల పిల్లలందరు బట్టలు, బొమ్మలు, సామాన్ల బేగీలట్టుకోని మజ్జినోన రంగురంగుల నీల వాటరు లైటుసెట్టింగులెల్లి ఎగజిమ్ముతుంటేని. ఇచ్చుగాడు, రాజేష మొకాలు సేతులు అద్దాలకి నొక్కీసుకోని “ఓలమ్మ వోటర సెట్టింగులఱ్ఱా? వోల..?!” అనీసి ఐరాన పడిపోతుంటె మేడాం లిఫ్టుబైటికొచ్చీసి ఆలకి బయిటికి నాగీసి, దువ్వారం వోపెన్ పట్టుకున్నాది మీమందరఁవు దిగినివరుకు. ఇంకిలాగ దిగేమో లేదొ మల్లీ సుట్టుతిరిగిపోయి మిషనీ మెట్లమీదకి నడమన్నాది. నల్లట మిషనీ మెట్లమీద అక్కడున్నోలందరు సారగారు మేడాల్లాటోలే చేతుల్నిండ చంకల్లోన బేగీలు బేగీలేసుకోని కిందకీ మీదకీ దిగిపోతన్నారు. కుమారీ సిరీషా చెయ్యొగ్గీకుంట గెట్టిగా పట్టుకోని నాగలష్మీ చెవ్వులోన ‘ఇవి మిషినీ స్టెప్సండివే! మనం నిలబడుంటె ఆటంతటవ్వె మీదికెలిపోతాయి. మన్మదుడూలో సూళ్ళేదా నాగార్జునా సోనాలీ బింద్రే బ్రమ్మానందం…?’ అంటంది.

ఉన్నోలందరూసెందుకు, అంత పెద్ద బిల్డింగు అన్నీసి మడత కటింగులు, అన్ని సోయింగులున్నది నాజన్మలోన్నీనే సూల్లేదు! మీదకి మెట్లెలిపోతుంటే కిందకి గాజులు గాజుల కప్పులికి స్టీలు గోడలకి ముచ్చి రిబ్బన్లు రంగురిబ్బన్లు బుంగలు కట్టించీసి. మిసనమెట్ల మీదన పడిపోయి సచ్చిపోతాననీసి ఇచ్చునాకొడుకు రాజేషగాడు బయపడి ఏడుప్మొకాలెట్టీసుకుంటె మేడం వోల్చెయ్యి గెట్టిగా పట్టీసుకోని ‘పరవాలేదఱ్ఱా! నేనున్నాను కదా! ఇట్సా వోకె..’ అంటందో లేదో దుబ్మని గచ్చుమీదకి దింపీసింది మిషనమెట్లు. అక్కడ బిల్డింగంతా కలిపీసి ఒకటే మెటీర, ఏకసైజునోన ఇంద్రబవనంలాగ ఒకటే పేద్ద షాపున్నాది. దన్లోన తల్లితోడు- పన్నాకొడుకులు సెక్రూరిటీ నాకొళ్ళే ఒకెయ్యిమందైనా ఉంతారు! కుమారీ ఆ వైబోగంచూసి నిబ్బరించుకోనేక “అబ్బ! అచ్చఁవు అమిరికానాగున్నాది మెడేం!” అనీసి మాయందరికీ అక్కడే ఒగ్గీసి నోపటకెలిపోబోయింది. సెక్రూరిటీవోడు ‘ఎక్కడికొచ్చెత్తావె?’ అన్నట్టుగా హిందీలోన సూస్తనాడు కాబట్టి తగ్గిందిగాని. మేడంగారు దాని జబ్బొట్టుకోని ఆపీసి నాగలషానికి పిల్సి ఆ దువ్వారం మీద పెద్ద పెద్ద అచ్చరాలు ఏటున్నాయో చదవమన్నాది. అది ఒక్కొక్కచ్చరం కడుపులోనా జిగజిగేల్మనీసి పదేసి చూపులైట్లెనా ఉంటాయి. అయినాసరే నాగలష్మి చీకట్లోన తడుంకుంటనట్టుగ గాబరగాబరగా ఒక్కొక్కచ్చరం తడుఁవుకున్నాది – J – O – S – C – H – W – A – R – T – Z అనీసి. “యెస్ ! జేవో ష్వార్జ్ . ఆంటే ఏంటో తెల్సునా?” అనడిగీ మల్లీ ఆవిడే “ఇదొక పెద్ద షాపింగ్ సిటీయఱ్ఱా! అదుగో చూసేర? బట్టలు, బొమ్మలు, గ్రోసరీస్, పళ్ళు కూరలు … ఇక్కడ దొరకని వస్తువు లేదూ!” అంటంటె ఆపనాకొడుకు “సిప్సులు, టూటిఫ్రూటిలు, వోటర గన్స, సైకిల్లు, షూషులు, గిఫ్స్ …” అనీసి ఆడి కడుపులోనున్నవన్నీ వల్లించుతున్నాడు. “గిఫ్స్ కాదరా గిఫ్ట్స్. అంటే భర్తడేకి బాక్సుల్లోన కట్టిసి ఇస్తారు కదమ్మ ఒక టోయస్ గాని, ఒక బుక్స్, జ్వెల్లరీ, క్రాకరీ, నావల్టీస్ వెరైటీ ఐటంస్” అనీసి బ్రైను, జాఖరీ వోలకాడ విన్న బితిరీలన్నీ వల్లించెస్తంది కుమారి. దానికి రెండు కళ్ళు సాంటంనేదు, లోపటకెల్దుఁవంటే సెక్రూరిటీనాకొడుకు గేటుకడ్దాలొచ్చెత్తనాడు గాని. మేడం ఆల్తోటి ‘యే బచ్చెఁ హమార బచ్చేఁ వోతాహై…’ అనీసి ఆతలకంటే పెద్దిందీలోన గసిరెస్తే ఆడు “ఠీక్ హై మేడేం! అచ్చీ బాత్ హై!” అనీసి మాకు నోపటికొగ్గీసేడు. హిందీవోలకాడెప్పుడు ఆలకంటే పెద్దిందీ పేల్తే సాన; నోపటకొగ్గెత్తారు! స్వార్జింగేటి ఆల బాబుగార సొమ్మ? ఆడమ్మా మొగుళ్ళాగ ఆడికి ముందు నీను, నా యెనకాల కుమారి, దానెనకాల పన్నాకొళ్ళందరు – ఇచ్చుగాడు, రాజేష మేడం చేతులు పట్టుకోని స్వార్జింగు నోపటకొచ్చీసేఁవు. ముందు లోపటకెల్లగానే ఆడోల జ్వెల్లరీలున్నాయి బంగార కొట్లన్నీటికి ఇక్కడే బుకింగునాగ. దన్నోన బంగారాల ముందు మావూరు సావుకారమ్మల బంగారాలు కొబ్బరమిటాయికి రావు. అక్కడ కుర్చీల్లోన కూకోని మేడాలు చెవులికీ మెళ్ళకీ రవ్వ దుద్దులు, నక్లీసులు బెత్తాయించుకుంతనారు. కుమారీకి అక్కడ్నించి ఊడ్రాడానికి ఇంకేడు జల్మలైన కావాల గాని, ఆపనాకొడుకు పల్లికిలించుకోనొచ్చి రహస్యంగ ‘ఓర్రా! రండర్ర సూడండా’ నీసి వేల్తో సూపిస్తనాడు. గాజులద్దాల డిపారమింటు ఏక మొత్తాన గాజుల్దే ఉన్నాది. దన్నిండ ఆడోలవీ మొగోలవీ గోసీలొక్కటే వున్నాయి. అంత పెద్ద డిపారమెంట్నోన గోసీలే ఏక మెటేర! సారగార్లు మేడాలు గోసీలు ఎలాగ తొడుక్కోవాలో అమిరికావోల బొమ్మలకి గోచీలు, బాడీలు తొడిగీసిన బొమ్మలున్నాయి. నాగలష్మీ అటుదుక్కు చూసి తల్తిప్పీసుకుని ‘చీ బేకార్నాకొడకా!’ అన్నటుగ ఆపగాడికి మొట్టికాయేసీసి ఇటీపు లాగీసింది.

మేడం జ్వెల్లరీలు, బట్టలు, బొమ్మలు అవన్నీ ఒగ్గీసి గ్లోబులు, మేపులు, పుస్తకాలకాడికెల్తనాది. స్వొర్గానికెల్లినా సవితిపోరు తప్పనేదు! రోబోకాడ చార్ట్రులూ గ్లోబులుంతాయంటె సిటీకి లెగదీసేవోలమా అసల? అక్కడ అంకిత్ బాబు, అమోఘ్ బాబు అంతీసి పిల్లలు ఇద్దరున్నారు. ఆల మమ్మీగారు, డాడీగారు ఆలకి ఒళ్ళో కూకోబెట్టుకోని గ్లోబులు తిప్పించీసి, గొట్టం మిషన్లోకి సూడమంతనారు. ఆలు కుటుంబరమంతా మమ్మల్ని చూసి గాబరా పడి లెగిసిపోబోయి, మేడానికి చూసి నిబ్బరించుకోని అటుదుక్కు తిరిగిపోయేరు. బేకుడు కాలు మెక్కుకోని దన్సుట్టు ప్రదచ్చనాలు సేస్కోని “అబ్బ! ఆ మిషన్లెల్లి ఆకాసంలోకి చూస్తె చుక్కలన్ని క్లీ…రుగుంటాయా? క్లీ…రుక్కనిపింస్తాయ..?” అంటంటె ఆపగాడు, కుమారీ, సిరిషా, రాజేష గుంట్నాకొళ్ళందరు గొట్టం మిషన చుట్టు నిలబడిపోయేరు. గ్లోబులమ్మీ ఆడదాయీ, సెక్రూరిటీ వోడూ ఎవరూ ఏటీ ముట్టీసుకోకుండ అక్కడెనకాలే వొచ్చి నిలబడిపోయేరు, నవ్వుమొఖాలెట్టిసుకోని. వల్లీ మేడం ఆ మిషన గొట్టం నిమానుగా కిందికీ మీదికీ కిందికీ మీదికీ ఆడించి “చుక్కల్లోకి కాదఱ్ఱా! అది వేరు! ఇది మైక్రోస్కోప్! దీన్లోకి చూస్తే …. ఒక బొట్టు రక్తంలో, ఒక బొట్టు నీళ్ళలో కొన్ని వేల కోట్ల సూక్ష్మక్రిములుంటాయనుకున్నామా? అవన్నీ చీమలంతేసి చూడొచ్చఱ్ఱా!” అనీసి లెక్చరెత్తీసుకున్నాది మేడమ! “డాక్ట్రాఫీసులా ఎనకాలుంట్టాది కదండి మేడం?” అన్నాడు బేకుడు. ఆడికి తెల్లార్లెగిస్తే ఎదో ఒకుష్టఁవో రోగఁవో ఉంటాది కాబట్టి పనోలందరికి డాక్ట్రకింద ఫీలింగైపోయి. వల్లీమేడం మైక్రాష్కాప్‌లోన ఒంటికన్ను బిగించీసి చూస్కోనే లెక్కుంట ఈ మన ప్రపంచకం చుట్టూర నీట్లోన, గాల్లోన, మన సరీరములోన మట్టీ మశానంలోనా కొన్ని వ్రేలాది క్రోటానుక్రోట్లు సూష్మాక్రిములూ, జీవాలూ ఎలాగ దేవులాడుతుంతాయో, ఆటికి ఈ గొట్టాలెల్లి ఎలాగ చూసియ్యొచ్చునో, అవి ఒక్కో జీవము చీమ కన్నా వెయ్యిరెట్లు సూష్మాతిసూష్మంగుండీ కూడ మనం గనక ఒకేల పొరపాట్న లెట్రనకెల్లి సేతులు కడుక్కోకుంటా వొచ్చెస్తె ఎలాగ దొడ్లొకెల్లి మన రక్తాలంట ఎక్కిపోయి మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాదుల కింద కాపరాలెట్టెస్తాయో అనీసి పాఠం మొదలెట్టీసింది. రోబోకనీసి రాడాలేటి? టెంతక్లాస ఎజ్జాంసకి డబల సోయింగులేటి?! మయిందర్నాకొడుకు టికట్లకనీసెల్లినోడు ఐపునేడు నల్గొండా ఎలిపోనాడేటో?! ఆపనాకొడుక్కి ఎంత మెంటలైతే మటుక్కి ఇక్కడికి తెస్తాడానీసి నీను ఆడి జబ్బ గిల్లదానికెల్తంటె మేడం నా జబ్బే వొట్టీసుకోని “దీని ఖరీదు చూసేవ కొండబాబూ? ఎంతిది…? చదువు?” అన్నాది. దానిమీద టికట్ట చూసి బేజారైపోయి ‘పద్దెనిమిదీ వందల తొంబయ్ మేడం!’ అన్నాను. ఆవిడి నాదుక్కు ‘ఇద్దీ గుట్టా తెలీదేమట్ర బాల్ కే బచ్చానాకొడ’ కన్నట్టుగు నవ్వీసి,

“వందలు కాదు! ఎయిటీన్ తౌజండ్ ! పద్దెనిమిది వేలు! మీలో ఎవరైనా డాక్టర్ చదవాలంటే గనక ఇది చాలా అవసరం! ఊఁ…?” అంటనాది. అంకిత్ బాబు, అమోగ్ బాబోల్లాగున్నార ఆలమ్మా డాడి గ్లోబొకటి, మైక్రాష్కాప్ ఒకటి బెత్తాయీంచుకెల్తనారు! కుమారీ ఉన్నదాయి ఉన్నట్టుండకుంట “పద్దెనిమిది వేలంటె ఆర్నెల్ల షేలరీ మేడం!” అన్నాది, ‘ఎన్ని మాసాల జీతాలు కూడబెటిద్దునా, ఆ గొట్టాంల కూకున్న జీవాలికి మేడ కట్టిద్దునా?’ యనీసి ఊర్జితమంతురాలు. మా అయ్య మొదాట ఈ ఊరొచ్చీరాగాన అన్నమాటలు గేపకమొచ్చేయి. పజ్జెనిమిది వేలు గనక ఉన్నాయంటె ఈఊల్లోన మానాటోలు కుటంబరానికి నలుగురికి ఆర్నెల్లు గ్రాసమనీసి. వేసాకాలం వొచ్చిందంటె మాదుక్కు ఆవులు, గీదలు, కుక్కలు, పందుల్నాగ కళ్ళక్కనిపించే జీవాలకే టికానా లేదు! వల్లీమేడంగారు ఎంతెర్రిబాగుల్దాయి కాకపోతె ఆర్నెల్ల జీతండబ్బులెట్టి కంటికి కనిపించని సూష్మక్రిములికి సూన్నానికి గొట్టం కొనిపించుకుంతాది?

రాజేష గాడు ఉన్నట్టుండి “మేడంగారండి? మేడంగారండి?! సూడు సూడు… పుష్టకాహారం…” అనరుస్తనాడు, మేడం చెయ్యిపట్టుకోని ఇవతలకి లాగీసి. ఆడికీ, ఇచ్చుగాడికీ మదీనాగాడికీ ఎప్పుడూ తిండిమీదే ఉంటాది. మేడం చెప్పిన పాఠాలన్నిట్లోకి పౌష్టికాహారం ఒక్కటే ఆలకి గుర్తుంటాది వాపిరిగొట్నాకొళ్ళికి! అక్కడ గ్లోబుల పక్కన షెల్ఫీలోన పెద్ద బొమ్మపెట్టిలోన అచ్చంగా మేడం సూపెట్టిన పౌష్టికాహారం చార్ట్రులాగే ఉన్నాది బొమ్మ. రంగురంగుల కొండనాగుండి దన్లోన ఒక్కొక్క తలుపూ తీస్తే ఒకొక్కటీ చేపలు, చికిని, పాలు, గ్రుడ్లు, అరటిపల్లు, యాపిల్సు అంకిత్ బాబోలు తినీటట్టుగ వెన్నలు, బ్రెడ్సులు అన్నీని. మేడం ఒకొక్క మెట్టుకి మీట నొక్కుతుంటె ఒకొక్క బొమ్మలగుత్తి బయిటికొచ్చీసి మల్లి నోపటకెలిపొతంది. అవి చేసిన వడ్రంగోడెవుడోగాని చూడ్డానికి అచ్చం నిజం ఆహారంనాగే ఉన్నాయి. రాజేష గాడు ఇంకుగ్గబట్టుకోనేక “మేడాంగారమ్మ? ఇవి నిజింవా బొమ్మవా?” అనుకోని నాకొడుకు పౌష్టికాహారము తినీడాలకొచ్చెత్తనాడు. ఈడికెవలు బొట్టిట్టి పిల్సేర?

“ఇవి నిజంవి కాదర్రా! మీకు ఆరోజు సండే క్లాసులో చెప్పేనుకదా? రోజూ ఏ ఏ ఆహారం సమపాళ్ళుగా ఎంతెంత తినాలో ఇది సులభంగా గుర్తుంచుకోడానికి! పౌష్టికాహారం! ఓకే?!” అన్నాది మేడాలు. బేకుగాడికి అనుమానఁవొచ్చీసి “ఇందల వణ్ణం లేదేటండి మేడంగారమ్మ? మీఁవు రోజూ వొణ్ణమొక్కటె తింటాము!” అన్నాడు ఆడు పౌష్టికావాహోరము ఎక్కడ తింట్లేదా అనీసి ఇక్కడ సీయెమ్మార్ల సారోలందరు డబల వఱ్ఱీ ఐపోతనట్టుగ! ఆడికొచ్చిన కటింగే నాకూ వొచ్చింది – ఆ బొమ్మలకొండకి ఎన్నిసుట్లు బటన్స నొక్కించి ఎన్నలమారాలు తీసినా బ్రెడ్డులు జాంసులు గ్రుడ్లు చికినీలున్నాయగాని వణ్ణం లేదు! కుమారీ ఆడిదుక్కు జాలిగా చూసి “మా బ్రైన్ బాబు, జాఖరీ బాబాలు రోజూ ఇవ్వే తింతారు. వణ్ణాలు తిన్రు!” అన్నాది. దానికి అమిరికావోల పౌష్టికాహారాలన్ని ఇంత గుంటప్పుణ్ణించే తెలిసిపోయినట్టుగ. “అన్నం లేకపొయినా ఓకేనేరా! బ్రెడ్ , పొటాటో, చపాతీ ఇవన్నీ పిండిపదార్ధాలేగా! ఏంటే… నాగలక్ష్మీ?” అన్నాది మేడం ఈ పౌష్టికాహారఁవొట్టికెల్లి దాని టెంతక్లాసల కలిపియ్యాలని.

నాగలష్మేటో అంత పెద్ద షాపుల్లోన మొగమాటంగా ఒకవారకి ముడుసుకుపోయి ఇచ్చూకి, రాజేషకీ దానిపక్కన కూచోబెట్టుకోనున్నాది ‘ఈ దిక్కుమాల్ని పోష్టకాహారాలు గోబులూ ఎంత బేగొగ్గీసి రోబోకెలిపోతాన్ర సిర్డీ సాయీ?’ అన్నట్టుగ. దానికి మేడం సడనగా కొస్సిన్లేస్తే ఏటనాలో తెలిసిందికాదు గావాల. టకామన్నిలబడిపోయి చేతులు కట్టీసుకోని “అంటే వణ్ణంలోనైతె బంగాల్దుంపలమ్మ, మామూలుగ పొటాటా ఫ్రై గాని ఒక ఉల్లీ వెల్లుల్లి ముద్ద మసాలా కింద వొండెస్తామమ్మ! బ్రెడ్ సేండ్మిచ్ లోనకైతె పొటాటా సన్నంగ దవ్వలాగ తరిగీసి నూనలో వేపించీసి ఒక కెచప్ తోన, చికిన్నగిట్స్ ఇలాటోటతోన తినాలమ్మ!” అన్నాది. నీను ఎందుకేనా మంచిది, నన్నేటి కొసినీలేస్తాదో అనీసి ఇందాకే పుష్టకాహారం బొమ్మకి టికట్ట చూసొచ్చేను. ఏడువేలా రెండూతొబైతొమ్మిదాట! ఒకడు తిన్నదా, ఒకడు తాగిందా ముండామోపి పౌష్టకాహారఁవు? మేడం అక్కడికి ఆపుతాదనుకుంటె దర్మతల్లి గ్లోబులకాడే సర్వోదయా ఆష్ట్ల కట్టించీసింది మాకందరకీని. “ఏమర్రా చిల్డ్రన్ ? అన్నం సరే కానీ… ఊఁ? మీరు రోజూ తినే ఆహారంలో ఏదీ ఈ పదార్ధాల్లో ఇంకా ఏమేంఉన్నాయో ఎవరైనా చెప్తారఱ్ఱా?” అనీసెత్తుకున్నాది మల్లీని – హరికద! మేము పనమ్మా చిల్డ్రన్సఁవి ఏటేటి తింటామో మేడానికి తెల్దా? ఈవిడీ ఇంకిద్దరు మేడాలూ కెమేరాలేసుకోని మా ఇళ్ళకాడికొచ్చి పొటోల్తీస్కోనెల్నారు కారా వినాయకచవుతులపుడు ఆ పొటోవులెవలకిచ్చీనాది? విల్లాల గోడవతల మొదలుపెట్టించి వొడ్డోలవి, కలకత్తావోలవీ, మావీ పనోల సీనారేకుల కొంపలు, తడకల్లెట్రన, బెంగాలీవోల మందిర్ అన్నీని. మాకాడ గేష్టవ్వున్నాది. మాయమ్మ, కుమారోలమ్మ, నాగలష్మోలమ్మ దడికట్టుకోని మూడిల్లకీ ఒకసుట్టే బువ్వొండీసి మాకు వణ్ణాలకి పిలుత్తారు. ఆలకాడేటుంతాయి పౌష్టకాహారాములు? మాయమ్మాలెప్పుడేన ఈ చార్ట్రులు సూస్తేకదా? నాగలష్మీ ఇంకెవలికి తప్పినా నాకు తప్పిందికాదురా బహుఁవుంతుడానీసి “అంటె రోజువారి మామూలుగ చారు, ఇంక సారుగారు వాలింట్లొ ఏటైన మిగిల్న కూర్లేన తెచ్చుకోని, బువ్వొండుకోని తింటామ్‌మ్మ. బుదవారం గాని, శనోరం గాని ఏవైన చేపలో, నీసో గేటుకాడ బజార్లోన తెచ్చీసీ వొండుతామమ్మ…!” అన్నాది. మా సిన్నాన కూతురైతె అయ్యిందిగాని మా సిన్నానాల్తోటి నాకక్కడే వొస్తాది టకాఫోర్! ఆల మేడమోలింట్లో వంటంతా ఇదే చేస్తాది మల్లీని! ఏమి ‘మాయమ్మోలొండిన వొణ్ణాలే తింతాము మేడాలమ్మ!’ అనీసూరుకుంటే పోనేదా? మీఁవూ పోష్టకాహారాలు తింతామనీసి రూపించుతంది సత్యమంతురాలు. ఇలాటొల్తోటి అక్కడే కాల్తాది నాకు. ‘నువ్వూ ఏ మాయ చేషావె కానీ?’ అన్నట్టుగ సూస్సరికి కల్లు దించీసుకున్నాది నాయప్పచెల్లిలు!

“పాలో? మిల్క్ ఎన్ని పేకెట్లు?”

“పన్నెండు పేకట్లు మేడం!” అన్నాది కుమారీ పెద్ద దూడావులికి నాయురాల్నాగ! విల్లాలకొచ్చిన పాలపేకట్లకి సగఁవు అమిరికావోలే తాగెత్తారు. బ్రైను, జాఖరి, ఎమీ, సిల్వయా ఇలాగ ఆలకి ఏడుగురు పిల్లలు. కుమారీ పాలపేకట్లు బుట్టల్లోకి తీత్తంటే నీనెల్లి ‘ఆవుల్లతల్లిరో అతిసక్కనాంగి! పెయ్యల్లతల్లిరో ప్రెధమ సుందారి!’ అనీసి మా తాతముసిలి పాడ్న పాటలు పాడతాను ఇగటాలకి. ఇదెన్ని పాలపేకట్లు తాగుతాదో నాకాడా బితిరీలు? ‘బ్రైనోలక్కాదు పిల్లా మీ ఇంట్లోనకి ఎన్ని పేకట్లు?’ అని గసిరీసేను. “మాకా…? మాకు అరపేకట్ట తీస్తాది మాయమ్మ. మజ్జిగలకి!” అనీసి లైన్లోకొచ్చీసింది రాయపూరు పేసింజర! ఆపగాడు బేకుడూ ‘పాల పేకట్లు సారగారోలకి, మనకెందుకు? మనకి టూటీఫ్రూటి ఉంటే సాల్దో?’ అన్నట్టుగ నోలెక్కబెట్టుక్కూకున్నారు. ‘ఇంకెంచేపురా పరమాత్ముడా ఈ ఆహారాములు?’ అనుకొన్నీను పల్లకైపోతుండగ ఏనుక్కి రచ్చించిన ఇష్నుమూర్తినాగ మహిందరొచ్చీసి మేడానికి మిస్సుడు కాలిచ్చేడు. మేడం “ఏంటి మహిందర్? ఓహో అరే?! సర్లే… ఇట్సోకె! మేము ఎయిత్ ఫ్లోర్లో సారూ నేనూ ఒస్తాం కదా ష్వార్జ్, అక్కడున్నాము. నువ్విక్కడికొచ్చేసెసెయ్!” అనీసి మాకాస్తిరిగి ఏదో అనబోతుంటె బేకునాకొడుకు “ఓలమ్మ ఎంతనావు పెన్నో? బంగార పెన్నురా కొండబాబు… మేడం బంగార పెన్ను!” అనీసి మేడానికి సేతుల్లాగీసి అల్లడతల్లడ పడిపోతనాడు. రోబోకడ్డమొచ్చినందుకు అడికి మేడం చూడకుండ టెంకిజెల్లలు పీకీవోణ్ణేగాని ఆడు పాముల కొండ మీద వొడ్డోల పిల్లల్చేతిలోన తాపులుకాసి కళ్ళుతిరిగి పడిపోనకాణ్ణించి ఆడికి ఎవరూ ఏటనకుండా చూసిన పూచీ ఆలయ్య నాకే వొప్పగించేడు! ఒకూరోలం ఒక్కులపోలమనీసి ఒగ్గీసేన్నాకొడుకుని! ఆపనాకొడుకు దర్మఁవాన పోష్టకాహారాలకాణ్ణించి పెన్నులకాడికైతే ఒచ్చీసేము కాఁవా.

పెన్నులేటవి పెన్నులుకావు. కత్తుల్లాగున్నాయి, బంగారచ్చరాల పెట్టిల్లోన కూకోని వొక్కోటి కట్లతుట్టంతీసి లావున. వల్లీమేడాం అడక్కుంటా ముందే టికట్ట చూసేనుగాని అది ఎనిమిదివేలా తొమ్మిదివొందలవునో కాదొ నా మేక్స్ మీద నాకే డవుటొచ్చీసింది. నాగలష్మి పక్కకెల్లి దానికి టికట్టు చూడమనీసంటె అదొచ్చి అప్పటిదాక మంటిబొక్కడంనాగ కూకోనున్నది పాదాలమ్మలాగ నిలబడిపోయి “అచ్చి ఎనిమిదివేలు కాదు. ఎనపైవేలా తొమ్మిదివందల తొంబయ్య! పదులస్తానము నందు ఎన్ని సున్నాలున్నాయొ చూసేవా…?” అనీసి నా ఇజ్జత్ తీస్సింది మాయప్పచెల్లెల. అద్దాల బాక్సులవతల నీలం సూటేసుకొని నిలబడ్డావోడీతోటి మేడాం ఏదో ఇంగ్లీష్ లోనన్నాది ఆ పెన్నులు సూపించి. ఆడూ మేడం ఏదో పెన్నులన్నిటికీ చూపించుకోని ఇంగ్లీష్‌లోన నవ్వీసుకుంతనారు. నీను మేడం యెనకాల్నుండి కుమారీకి మండమీద గిల్లి ఆలేటనుకుంట్నారో చెప్మనీసి సైగలు చేస్తంటే అది ‘ఉష్! ఉష్!’ అనీసి గసిరీసింది. అవి స్పెషల పెన్నులంట! జర్మనీ నుండి రప్పించుతారంట. అమిరికా అద్జచ్చుడు అలాటోలు సంతకాలు పెడ్డాలకీ ఈ పెన్నులే బెత్తాయింతారంట. మేడం ఇలాగ పెన్నుల నెక్చిరీలకి దిగిపోతంటె మహిందర మేడానికెతుక్కోని నోపటకొచ్చీసేడు – టికట్లన్నీ అయిపోనావంట, పండగెల్లిన పాసినాడు ముక్క తెచ్చీనాడు గూబెదవ! గబగబా అడావిడిగా షాపులోన సందులు సందులెల్లి మేడం పరిగెట్నట్టుగు నడుస్తుంటె ఆవిడెనకాల మహిందర, ఆడెనకాల్నీనూ, నాయెనకాల కుమారి, నాగలష్మి గుంట్నాకొళ్ళందరు లైనుగా ఎలబారిపోతుంటె అద్దిర దద్దా! అవా!! అక్కడున్నాయి దీనెమ్మా పంచెవొన్నెల పౌష్టకాహారాములు!! కూర్లబజార, పాల బజార, దేశదేశాలివి పళ్ళు, పిక్కలు, నూనలు, బిస్కట్లు, రస్కులు, చాకనేట్లు, ఉప్పులు, పప్పులు, దాన్యాలు, ఐసులు, సేపలు, మాంసాలు, భచ్యాలు ఆ చార్ట్రు నాకొడుకు బొమ్మల్లోన పౌష్టకాహారాఁవులన్నీ ఇవా ఇక్కడే వున్నాయి!

ఆయాహారాలు సూస్కోనీ సూపునేనట్టిగె టపటప్మనుకోని మెట్లు దిగిపోనాది మేడం!! మాకందరికి దిగనిచ్చీదాక ఎండలోన మొకానికి చెయ్యడ్డం పెట్టుకోని. బండీవోడికాడ ఒక్కోలకి ఒకొక్కటి పాలైసులు తీయింతూనె ‘త్వరగా రావాలి మహిందర్!’ అని కేకలేస్సింది. గుంట్నాకొల్లందరు అవి తినీసి రొబోలకెల్తామనుకుంట్నారు గావాలని, ఐస్క్రీములన్ని కారు బైటే తిని, చేతులు మూతులు కాయితాల్తోటి తుడుసుకున్నాక సెప్పీనాది సావుకబురు చల్లగాన. ‘టిక్కట్లైపోయ్యంటఱ్ఱా పిల్లలూ! ఇంకెప్పుడైనా చూడొచ్చులే రోబో, సరేనా?’ అనీసి. “శ్రీనివాసాలో ఉంటాయి మేడం డెఫినీటుగుంటాయి…” అన్నీనంటె కుమారీ ఇరగబడిపోయింది నామీద “మీ సారాలింట్లో పని ఎవలకిచ్చెస్తావు పిల్డా? అయిదున్నరకల్ల రమ్మనీసన్నారు…” అని. సెడపడానికి సేటపెయ్య! గౌలిదొడ్డి కాడికొచ్చీవరుకూ కిక్కురుకక్కురు మనకుంటా కూకున్నారు పన్నాకొళ్ళందరూ మహిందరగాణ్ణాగే. టికట్లైపోతే పాపము మేడాలేటి చేస్తాది?

సెడ్డుముందర్నిలబెట్టి పొద్దుట తెచ్చిన బిస్కట్లు, టూటీఫ్రూటి ఒక్కోలకొకొక్కటి ఇచ్చీసి నిలబడ్దాది మేడం, ఏ సిచ్చేస్తారో ఏసీయండఱ్ఱా యన్నట్టుగ – వోచీలకి సూస్కోనీ, మాదుక్కు సూస్కోనీ పాపఁవు! రోబో ఎలాగా నేదు. సారాలింటికాడ ఐదున్నరకల్ల ఉండకపోతే అమోగ్ బాబాల్చేత తిట్లు కాయాల. మేడం ఇంటికెలిపోబోయీముందు చిన్నదేనా లెక్చిరింగిచ్చీసిగాని వెల్లదు. మీఁవు సెడ్డు బయటరుగుమీద కూకోని పుల్లల్తోటి ఫ్రూటీలు పీల్చుకుంటంటే ఆవిడి సోనియాగాందీలాగ చేతులు కట్టీసుకోని “ఏంటఱ్ఱా సౌండ్లేదు? మూవీకి ఇంకోసారెల్దాంగా, సరేనా?! సీయెమ్మార్ బాగున్నాదా?? జేవో ష్వార్జ్ గురించి ఏంటనుకుంట్నారో చెప్తారా ఎవరేనా?” అనీసి గెద్దలాగ సూదికళ్ళేసుకోని నాదుక్కు, నాగలష్మి దుక్కు, కుమారీ దుక్కే సూస్తంది మేడాలు. ఆవిడికి ఏది ముట్టితే అదే నెక్చర! “అలాంటి మాల్ ఇదివరకెప్పుడైనా చూసేరా మీరెవరైనా? చేతులెత్తండీ ఎవరు చూసేరో?”

ఫ్రూటీలు పీల్చుకుంట్నాము ఒక్కలం చెయ్యెత్తకుండాని. “చూసేరా మరి? ఈ రోజు అక్కడ ఏం నేర్చుకున్నారు? ప్రతివొక్కరు ఏదైనా ఒక్కొత్త విషయం! ఏచ్చెప్పండి…?! ఎనీథింగ్?”

నాగలష్మి ఫ్రూటీ సగంలోనే పక్కనెట్టీసి దులుపుకోని, చేతులుకట్టీసుకుని నిలబడిపోయింది, విద్యార్ద! ఇదింకా బూర్జ ఐస్కూలనీసి ఈవిడొక యెడ్మేష్ట్రనీసి ఇస్తిరాకులోని ఈనగర్రలాగ నిటారుగ నిలబడిపోయి “అంటె మనకు పుస్తకములు, పెన్నులు, సూష్మదర్శిని, బూగోళము, జ్వెల్లరీలు, బట్టలు, పౌష్టికాహారము ఇలాంటివన్ని ఒక్కసోట అముర్చుకొనుటకు… స్వార్జి…” అనీసి సిగ్గుపడిపోయి కిసకిసమని సణిగీసింది. బేకుడు డబల ఫ్రూటీ ఏస్కుంటు “అన్నింటికంట గ్లోబు, మైక్రాష్కోపు బాగున్నాయండి మేడంగారండి!” అన్నాడు ఆడొంతు ఏదోకటి బిగరకపోతే మరేదా మప్పితమా అనీసి. కుమారీ ఇంకెల్లడానికన్నట్టుగ లెగిసిపోయి “మేడంగారమ్మ! మా ఇంట్లోవోలందరిది యేడాది జీతము ఆ ఒక్క పెన్నుకే ఒస్తాది మేడం?!” అన్నాది ఇప్పటికీ నమ్మలేనట్టుగ. “ఊఁ ఇంకా…?” అన్నాది మేడం, ‘ఇంకా పైకొసాకి ఆన్సర చెప్పినోలకేనమ్మా డబల వెరీగుడ్’ అన్నట్టుగ మొకం పెట్టుకోని. క్లబ్బౌసు ముందర ఇసకా బుగ్గీ ఆకులు దుమ్ములెగుస్తన్నాయి గాలికి. కూలోలు గబగబా చిమింటు కట్టలు స్లాపులకిందకి లాక్కుంతనారు. చెయ్యిమీద టపామనీసి వొర్షం చినుకు పడ్డా దులిపీసుకున్నాది మేడం.

“అవును కుమారీ! గుడ్ పోయింట్! అక్కడ ఒక పెన్ను మీదో, నెక్లెస్ మీదో స్పెండ్ చేసేది…. ఊఁ… దెన్…?”

కుమారీ వానొచ్చీదుక్కు మబ్బుకి చూసి గమ్ముగైపోయి ఏటీ మాటాడకుంటానే బ్రైనోలింటికెలిపోతందిగాని దాని మొఖం అలాగ మబ్బుగైపోటము నీను ఈనాటికి సూపునేదు. గుంట్నాకొళ్ళు మేడం అన్నదానికి ఏటనాలో తెలీనట్టుగ ఖాళీ ఫ్రూటీడొక్కుల్లోవే చివార బొట్లు పుల్లలు పీల్చుకుంతనారు. స్వార్జింగులకెల్లి నీనేటి ఎత్తిరాసుకొచ్చీనాను కొత్త పోయింట? నీను సెవంతలున్నప్పుడు పెన్ను కొనమని ఏడిసినందుకు మా తాత నాకు సింతరువ్వతోటి బూర్జవరుకు ఎంటబెట్టి బాదీనాడు ముసిలోడు. ఈ సారగార్లెవరు? ఈ మేడాలెవరు? ఈ బ్రైనోలెవరు అమిరికానుండి ఇక్కడ విల్లాలకొచ్చి పౌష్టికాహారఁవు కుమారీ చేత నాగలష్మిం చేత వొండించుకోని తింతనారు? ఈ సారాల డబల కటింగులేటనీసి ఆలకి తొంబైవేలెట్టి పెన్ను కొంటాలకి జీతాలిస్తన్నారు పెద్దసారగారు? నాగలస్షిం టెంత పేసైపోతె ఆ పెద్దసారగారోలకాడికి ఎలిపోవస్తాదా జీతగత్తికింద?

మేడమాల ఇన్నోవ గేట్లోకెలిపోతంది బుగ్గిరేపుకోని. ఇచ్చుగాడు రాజేష రాటకర్రలెట్టి యుద్ధాలకి దిగిపోయేరు కికారపునాకొళ్ళు. ఆపగాడు బేకునాకొడుకు క్లబ్బౌసు కాడ ఇసక్కుప్పలెక్కిపొయి ఇసక జల్లీసుకుంతనారు. కుమారీ వోలమ్మ బ్రైనుబాబు స్ట్రాలర బండీ తెచ్చీసి డూటి ఎక్కమనీసి నిలబడ్డాది. మా సారాల డ్రైవరొత్తనాడు నాకు ఇస్తిరీలకి బట్టల్సంచీలివ్వడాలకి. నాగలష్మీ పుస్తకఁవు, పెన్ను తీసుకోని గట్టిగా సిరీష చెయ్యొట్టీసుకోని ఆల మేడం వాలింటికెల్తంది. కుమారీ దుక్కు కటికి పుల్లలు, బెందముక్కలు ఇసుర్తుంటే నామీదికి జట్టీలకొస్తాదనుకున్నాను ఎనక్కి సూణ్ణన్న సూళ్ళేదు. మేడం కారు టర్నింగయిపోతుంటే నీను కుమారీ నాగలష్మాలెనకాల మేడమ్మ లాగే గొంతుకెట్టుకోని “ఏదైనా వొక వేడి వొస్తువూ… బాస్పీబవనమూ…!” అనీసెక్కిరింస్తంటె నాకూతుళ్ళు ఒక్కద్దాయీ నాదుక్కు సూసిందికాదు, నవ్విందికాదు.

(Inspiration: Toni Cade Bambara The Lesson)