భావతరంగాల సింధువు: భైరవి

మన దేశమంతటా విశేషజనాదరణ కలిగిన రాగాల్లో (సింధు) భైరవి ఒకటి. హిందూస్తానీ పద్ధతిలో భైరవి అంటే సింధుభైరవి అనే అర్థం. కర్నాటకపద్ధతిలో భైరవి వేరొక ప్రసిద్ధరాగం కనక దక్షిణాదివారు దీన్ని సింధుభైరవి అనే అంటారు. కర్నాటక భైరవిలోని అటతాళవర్ణం విరిబోణి ఈమని శంకరశాస్త్రిగారి వీణావాదనంలో వినవచ్చు. దీనికీ సింధుభైరవికీ పోలికలు తక్కువ.


రాగమాలా సంప్రదాయక చిత్రీకరణలో భైరవి రాగం
(ఇంటర్నెట్ ఆర్కైవుల నుండి.)

హిందూస్తానీ పద్ధతిలో దీని శుద్ధస్వరూపాన్ని భైరవీ ఠాట్ అని కూడా అంటారు. పన్నెండు స్వరాల్లోని ‘కోమలమైన’వన్నీ ఇందులో ఉపయోగించబడతాయి (స రి1 గ1 మ1 ప ధ1 ని1). ఇది సరిగ్గా కర్నాటక మేళకర్త హనుమతోడికి సమానం. సింధుభైరవి కర్నాటక విద్వాంసులుకూడా వినిపిస్తారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయొలిన్‌పై ఈ రాగంలో వాయించిన అష్టపది వినండి. ఇదే రాగంలో శ్రీరంగం గోపాలరత్నం ఒక అన్నమాచార్య కీర్తన పాడింది.

కర్నాటకపద్ధతిలో సింధుభైరవి భజనలకూ, అర్ధశాస్త్రీయగీతాలకూ ఎక్కువగా వినియోగిస్తారు. హిందూస్తానీలో సామాన్యంగా ఇది చివరకు పాడి కచేరీని ముగించేందుకు ఉపయోగిస్తారు. ఇది పాడేందుకు ఉదయం తగిన సమయం అయినప్పటికీ కచేరీ పూర్తయేటప్పుడు దీనితో ముగించే సంప్రదాయం ఉంది. ఈ వ్యాసంలో ఇకపై భైరవి అంటే సింధుభైరవిగానే భావించాలి. ఈ రాగం గురించి డా. లక్ష్మన్న లోగడ ప్రస్తావించారు. అందులో ఆయన ఉదహరించిన అనేక తెలుగు సినిమా పాటల్లో కొన్నిటి గురించి మాత్రమే నేను రాస్తాను. వాటికి కింద ఆడియో లింకు లున్నాయి కనక చదువుతూ, విని ఆనందించవచ్చు.

దాదాపు 3 దశాబ్దాల క్రితం నావద్ద సితార్ నేర్చుకుంటున్న ఒక మరాఠీ అమ్మాయి చక్కగా సాధన చేస్తున్నప్పటికీ రాగాలను గుర్తుపట్టగలిగేది కాదు. తాను ఇంట్లో భైరవి వాయిస్తున్నప్పుడు సంగీతం ఏ మాత్రమూ నేర్చుకోని తన తండ్రి ఈ రాగాన్ని విని గుర్తుపట్టడంతో ఆ అమ్మాయి నిర్ఘాంతపోయి, అదెలా సాధ్యమని నన్నడిగింది. పూనాలో పుట్టి పెరిగిన ఆమె తండ్రి మరాఠీ స్టేజి నాటక సంగీతప్రియుడు. భైరవి రాగం పేరు అతనికి తెలియడం అతని సంస్కారాన్ని సూచిస్తుందని నేను సమాధానం చెప్పాను. ఆ తరం మహారాష్ట్రులకు నాట్యసంగీత్ అంటే వల్లమాలిన అభిమానం. భైరవిరాగంలో దీనానాథ్ మంగేశ్కర్ (1900-42) పాడిన సావర్కర్ గీతం సన్యస్త్ ఖడ్గ అనే నాటకం లోనిది. అలాగే బాలగంధర్వ (1888-1967) పాడిన ఒక గీతం బాగా పేరు పొందింది.

1940కి పూర్వపు నాటకాల్లో పురుషులు ఆడవేషాలు వెయ్యడంవల్లనూ, మైకుల్లేని ఆ రోజుల్లో ఎక్కువ మందికి వినిపించడం కోసమూ హెచ్చు శ్రుతిలో పాడేవారు. ఈ పద్ధతిలో సంగీతప్రియులు వినికిడి మీద రాగాలను పోల్చడం analog పద్ధతి అనుకోవచ్చు. సంగీతాభిమానుల్లో 90 శాతం తమకు నచ్చిన రాగాలను ఇలాగే గుర్తిస్తారు. ఇంతకన్నా స్వరజ్ఞానం సహాయంతో digitalగా రాగాలను గుర్తుపట్టడం మంచిపద్ధతి. ఈ వ్యాసం రాయడంలోని ముఖ్య ఉద్దేశం పాఠకులు ఇందులోని ఆడియోల సహాయంతో ఎప్పుడైనా, ఎక్కడైనా ఈ రాగాన్ని విని, గుర్తుపట్టడం నేర్చుకోవాలనే. అందుకనే ఇందులో ఎన్నో లింకులు పొందుపరుస్తున్నాను. వాటివల్ల ఈ రాగంలోని భక్తి, వైరాగ్య, శృంగారరసాలు ఎలా పలుకుతాయో అర్థమవుతుంది. సంగీతాన్ని కేవలం పదాలతో వర్ణిస్తే సరిపోదని నా ఉద్దేశం. 1988లో టీవీలో చూపించిన మిలే సుర్ మేరా తుమ్హారా భైరవి రాగంతో తయారుచేసినదే.

హిందూస్తానీ శాస్త్రీయసంగీతంలో ఎందరో గొప్ప సంగీతజ్ఞులు ఈ రాగం వినిపించారు. ముందుగా కిరానా సంప్రదాయానికి ఆద్యుడైన అబ్దుల్ కరీమ్‌ఖాన్ (1872-1937) పాడిన జమునా కే తీర్ వినండి. భీం‌సేన్ జోషీ ఈయనకు ప్రశిష్యుడు. ఆనాటి శైలిలో హెచ్చుశ్రుతిలో పాడిన ఈ పాటలో భైరవి రాగపు విశిష్టత పూర్తిగా వినబడుతుంది. బాపూ తన బొమ్మల్లో మినిమం గీతల్లో ఎక్కువ భావప్రకటన సాధించినట్టే భైరవి అందాలను బిస్మిల్లా ఖాన్ ఆవిష్కరిస్తాడు.

భైరవి శుద్ధస్వరూపంలో అన్నీ కోమలస్వరాలే అయినప్పటికీ సామాన్యంగా రి2 ఎక్కువగా వినబడుతుంది. ఆ తరవాత క్రమంగా తక్కువసార్లు వినబడేవి ధ2, ని2, మ2, గ2 స్వరాలు. వీటి ప్రయోగాన్ని విలాయత్‌ఖాన్ సితార్‌మీద వినిపించిన పంజాబీశైలి ధున్‌లో వినవచ్చు.

దీన్నిబట్టి చూస్తే ఈ రాగంలో మొత్తం 12 స్వరాలూ సందర్భాన్నిబట్టి వెయ్యవచ్చునని అర్థమవుతుంది. ఈ రాగాన్ని పూర్తి శాస్త్రీయపద్ధతిలోకాక, ఉపశాస్త్రీయసంగీతానికే ఎక్కువగా ఉపయోగిస్తారు కనక ఈ స్వేచ్ఛ ఉంటుంది. అలాకాకుండా ఎక్కువగా కోమలస్వరాలతోనే పర్వీన్ సుల్తానా పాడిన భవానీ దయానీ కూడా బావుంటుంది.

ఈ రాగంలో మన దేశంలోని అన్ని భాషల్లోనూ వందలాది సినీగీతాలు వినిపిస్తాయి. జానపద, శాస్త్రీయశైలుల్లో ఈ రాగస్వరూపం ఎంతో అందంగా ఉంటుంది కనక ఈ రాగంలో బాగులేనివి తయారు చెయ్యడం నిజంగా కష్టమే! దేశపు తొలి సినీగాయకుల్లో స్టార్ అనిపించుకున్న కె.ఎల్.సైగల్ స్ట్రీట్‌ సింగర్‌లో ఆర్.సి.బోరాల్ సంగీతదర్శకత్వంలో పాడిన ఈ ప్రసిద్ధమైన ఠుమ్రీ వినని సంగీతప్రియు లుండరు. ఇది రికార్డ్‌లోని వర్షన్‌కు కాస్త భిన్నమైనది. అలాగే మై సిస్టర్ సినిమాకు పంకజ్ మల్లిక్ చేసిన క్యా మైఁ నే కియాహై అనేది కూడా జనాదరణ పొందినదే. (ఇది కూడా రికార్డ్‌లోని వర్షన్‌కు భిన్నమైనది).

– మరొకటి నౌషాద్ సంగీతరచన చేసిన జబ్ దిల్ హీ టూట్‌గయా.

– హిందీ సినిమాపాటల్లో సహజంగా భైరవి పాటలు అనేకం కనిపిస్తాయి. మన సినిమాపాటల్లో మొదటగా ప్రపంచఖ్యాతి పొందిన ఆవారా హూఁ ఈ రాగంలోనిదే. శంకర్-జైకిషన్ ద్వయం భైరవిలో ఇంకా ఎన్నో చేసినప్పటికీ దీని ప్రత్యేకత దీనిదే. వారి మరొకపాటలోని విశేషం అలీఅక్బర్‌ఖాన్ సరోద్ వాద్యం.

– అలాగే మరొక లతా పాటలో సర్వోత్తమ వేణువాద్యనిపుణుడు పన్నాలాల్ ఘోష్‌చేత వీరు బిట్లు వినిపించారు. భైరవిలోని భక్తిభావం నౌషాద్ చేసిన అమర్ సినీగీతంలో బాగా వినిపిస్తుంది.

– భైరవిలోని జానపద అంశం నౌషాద్ ఈ సోహనీ మహీవాల్ సినీగీతంలో బాగా ఉపయోగించుకున్నాడు. ఆన్ చిత్రంలోని మరొక బృందగానం భైరవిలోని నౌషాద్ పాట కొత్త అందాలను చూపుతుంది.

– శాస్త్రీయరాగాల జోలికి ఎక్కువగా పోని ఎస్.డి.బర్మన్‌కూడా లతాచేత ఒక మంచి పాట పాడించాడు. అలాగే ఆయన తలత్ మహ్మూద్‌ చేత పాడించిన ఈ పాట మెచ్చినవారు ఇదే రాగమో కూడా పట్టించు కోకపోవచ్చు.