గత సంచికలో మీకందించిన అపురూపమైన గొంతుకల ఆడియోలకు పాఠకులనుంచి విశేషమైన స్పందన లభించింది. ఆ ప్రోత్సాహంతో పరుచూరి శ్రీనివాస్ మరికొన్ని అపురూపమైన గొంతుకలను ఈమాటకు ఈ సంచికలో అందిస్తున్నారు. ఈ గొంతుకలన్నీ ఆకాశవాణి వారు వేరువేరు సందర్భాల్లో రికార్డు చేసినవి. ప్రముఖుల గళాలు అన్న శీర్షికన శంకరమంచి సత్యం ప్రసారం చేసిన ఒక కార్యక్రమం ఈ ఆడియోల సంకలనం.
1. జయంతి రామయ్య పంతులు
సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రధాన పరిష్కర్త, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపకుడు జయంతి రామయ్య పంతులుగారు ఆయన గురించి చెప్పుకున్న మాటలు. (5ని. 9సె. ఈ ఆడియోలో మొదటి ముప్ఫై క్షణాలు సత్యం శంకరమంచిగారి ఉపోద్ఘాతం ఉంది.)
2. కాశీ కృష్ణాచార్యులు
అవధానక్రియలో అగస్త్యుడు, సంస్కృత భాషావ్యాప్తికి జీవితాన్ని అంకితం చేసిన కాశీ కృష్ణాచార్యులుగారు ఆ ఆర్షభాష ప్రాశస్త్యాన్ని వివరిస్తున్నారు. (3ని.59సె)
3. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి
భారత, భాగవత, రమాయణ మహాకావ్యాలను రచించిన మహాకవి, సోమయాజి. కృష్ణమూర్తి శాస్త్రిగారు తన 95వ ఏట తెలుగు భాషపై తనకు గల అభిమానాన్ని ఇలా వివరించారు. (4ని.36సె)
4. తాపీ ధర్మారావు
రచయిత, పత్రికా సంపాదకుడు, సాహితీ విమర్శకుడు తాపీ ధర్మారావు. వెంకటకవి విజయవిలాసానికి హృదయోల్లాసమైన వ్యాఖ్యను రాసి తెలుగు సాహిత్యంలో విశిష్టతను సాధించిన తాపీ వారి వాణి. (1ని.56సె)
5. చిలుకూరి నారాయణరావు
సంస్కృత ప్రాకృత భాషలలో పండితుడయిన చిలుకూరి నారాయణరావుగారు, జయంతి రామయ్య పంతులు గారిని కొనియాడుతూ… (3ని.09సె)
6. కాటూరి వేంకటేశ్వరరావు
పింగళి కాటూరి జంటకవులలో ఒకరు, సౌందరనందన సృష్టికర్త. పౌలస్థ్యహృదయ కావ్యం ద్వారా రావణాసురునిలో మంచిని చూసిన మహాకవి. కాటూరి వారు వారి గురువైన చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి సభాప్రవేశం గురించి చెప్తున్నారు. (2ని.39సె)
7. బాలాంత్రపు వెంకట్రావు
తెలుగు గీతాంజలి గా కొనియాడబడే ‘ఏకాంతసేవ’ కావ్య రచయిత. వోలేటి పార్వతీశంతో కలిసి జంట కవిత్వం చెప్పిన కవి. అన్ని తెలుగు సాహిత్య మాధ్యమాల్లోనూ కృషి చేసిన సాహితీ కర్షకుడు బాలాంత్రపు వెంకట్రావుగారు తన సాహిత్యాభిలాషపై చెప్పిన ముచ్చట్లు. (3ని.12సె)
8. కట్టమంచి రామలింగా రెడ్డి
ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా ఉన్నత విద్యాబోధనకు కృషి చేయడమే కాకుండా, ఆంగ్ల విమర్శా పద్ధతులని తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు సి. ఆర్. రెడ్డి గా సుపరిచితులైన కట్టమంచి. వారు ఆంగ్లంలో వేమన గురించి ఉపన్యసిస్తూ… (2ని.19సె)
9. గిడుగు వెంకట సీతాపతి
తండ్రి రామ్మూర్తి పంతులుగారి వ్యావహారిక భాషోద్యమాన్ని వారసత్వంగా స్వీకరించి ముందుకు నడిపించిన గిడుగు సీతాపతిగారు తమ తండ్రిగారి గురించి చెప్పిన సంగతులు (2ని.30సె)
10. తెలికచర్ల వెంకటరత్నం
నవ్య సాహిత్య పరిషత్ సంస్థాపకుడు, ప్రసిద్ధ సంపాదకుడు, ప్రాచ్యభాషాధ్యాపకుడు తెలికిచెర్ల వెంకటరత్నంగారు పంచుకున్న సాహిత్యపు ముచ్చట్లు. (0ని.47సె)
11. రాళ్ళబండి సుబ్బారావు
సుప్రసిద్ధ చరిత్ర పరిశోధకులు రాళ్ళపల్లి సుబ్బారావుగారు జయంతి రామయ్య పంతులుగారి గురించి… (0ని.20సె)