మంచి స్నేహితులు లభించడం కూడా ఒక వరం అని నాకనిపిస్తుంది. నా ఉద్యోగ పర్వంలో నాకు పరిచయమయి మనసుకు చేరిక అయిన వారిలో శ్రీలత ఒకరు. తను నా మూడవ ఐటీ ఉద్యోగంలో పరిచయమయిన సహోద్యోగి. అంతవరకూ పెద్ద కంపెనీల్లో మాత్రమే పనిచేసిన నాకు కొత్తగా ప్రారంభించిన చిన్న నెట్ వర్క్స్ కంపెనీలో పనిచేయడం ఇదే మొదలు. అక్కడికి నేను చిన్న సాంకేతిక రచయితల గుంపుకు మేనేజరుగా వెళ్ళాను. చేరిన రోజు తెలిసింది నా టీంలో ఉన్నది ఇద్దరు సాంకేతిక రచయితలే అని. వాళ్ళలో ఒకరు కొద్దిగా అనుభవం ఉన్న వారు. తను ఆరు నెలల ఎసైన్మెంట్ మీద క్యాలిఫోర్నియాలో ఉంది. నాకు మిగిలింది శ్రీలత మాత్రమే.
నేను తన మేనేజరు గా చేరినా అక్కడి పని గురించి తన దగ్గరే మొదట తెలుసుకోవాలి. కానీ తనేమో ఆరోజు స్వంత సమస్యల్లో చాలా బిజీగా ఉంది. తర్వాత తెలిసింది, అంతకు ముందు రోజే డెభ్భై పైబడిన వాళ్ళ నాన్నకు నాలుగోసారి గుండె పోటొస్తే, ఆస్పత్రిలో చేర్చింది. ఆరోజు కూడా కూడా సిటీకి కొన్ని మైళ్ళు దూరంలో ఉన్న వాళ్ళ నాన్న గారిని చేర్పించిన నారాయణ హౄదయాలయం ఆస్పత్రి చుట్టూ తిరుగుతోంది.
తరువాతి రోజుల్లో ఎన్నోసార్లు తనతో కలిసి గడిపిన సమయాల్లో శ్రీలతను గురించి నేను తెలుసుకున్న వివరాలివి. లతకు బి-కాం పాసయిన వెంటనే ఒక బ్యాంకు ఉద్యోగితో పెళ్ళయింది. యవ్వనంలోకి సరిగ్గా అడుగు పెట్టని ఆ బాల్యావస్థ అమాయకత్వంలో లతకు ఆ భర్త పెళ్ళి చేసుకోవటానికే అనర్హుడని తెలుసుకోవడానికే చాలా సమయం పట్టింది. అతని దురభ్యాసాలు, బలహీనతల వల్ల లత ఆ ఇంట్లో బందీగా మిగిలిపోయింది. తన పరిస్థితిని లత నాన్న, అన్నయ్య అర్థం చేసుకుని తనను ఆ ఖైదునుంచీ విడిపించి, విడాకుల కేసు పెట్టడానికి ఆరేళ్ళు పట్టింది.
సాధారణంగా ఎక్కడయినా జరిగేదే ఇక్కడా జరిగింది. పెళ్ళయి విడాకులు తీసుకుంటున్న లత అన్నా, వదినెల కుటుంబంతో కలిసిపోవడం కుదర్లేదు. అక్కడ అంతేం సయోధ్యగా లేని తల్లిదండ్రులు కూడా కూతురితో సహా ఒక ఎపార్ట్మెంటులో ఉండేటివారు. వాళ్ళన్నయ్య కుటుంబం నాన్నగారి స్వంత ఇంట్లోనే ఉండిపోయారు. అప్పటికే తను డిగ్రీ హోల్డరు కాబట్టి ప్రైవేటుగా ఎం.సి.ఏ చెయ్యడం ప్రారంభించింది. సరిగ్గా అప్పుడే తన బంధువులొకరు రిసెప్షనిస్టుగా ఉద్యోగమిప్పించారు. సహజంగా చురుకుగా ఉండే లత రిసెప్షనిస్ట్ పని చేస్తూనే, కొంచం సాంకేతిక రచనా వ్యాసంగం చేసి చూసింది. కంపెనీ చిన్నది కాబట్టి అవసరం వచ్చినప్పుడు లత నేర్చుకున్న విద్యను ఉపయోగించి చూశారు. వాళ్ళకు నచ్చింది. తన ఉద్యోగమే మారిపోయింది.
ఏ విధమయిన ప్రత్యేక శిక్షణా లేకుండానే శ్రీలత ఐటిలో సాంకేతిక రచయితగా మారింది. కంపెనీకి తన ఉద్యోగం విలువ హెచ్చింది కానీ తన వేతనం మాత్రం పెద్దగా పెరగలేదు. తన మేనేజరుగా వచ్చిన వెంటనే నా మొదటి పని పరిశ్రమలో తన వంటి విద్యార్హతలు, అనుభవం ఉన్న సాంకేతిక రచయితలకు ఎంత నెలసరి వేతనమొస్తుందో తెలుసుకుని అంతే తన కివ్వాలని సిఫార్సు చెయ్యటం. (నేనడిగింది రూ 5500 నుండీ రు. 11,000 కు పెంచమని మాత్రమే!)
నేను ఉద్యోగంలో చేరిన రోజు తను ఆస్పత్రి, ఆఫీసుల మధ్య తిరుగుతోంది. వాళ్ళ నాన్నకిది నాలుగో గుండె పోటు. వాళ్ళ బిజీ అన్నయ్యకు లతకు సహాయం చెయ్యడానికి టైము లేదు. ఆయనకు ఆరోగ్యం నెమ్మదించినప్పుడు మాత్రం వాళ్ళందరి జీవితాలను నియంత్రించేది నాయనే. తన నెలసరి జీతం మొత్తం ఆయనకివ్వాలి. తన బ్యాంకు ఎకౌంట్లన్నీ ఆయన చేతిలో ఉంటాయి. అమ్మ పాతకాలం మనిషి. మెతక. భర్త ముందు నోరు విప్పి ఎదురు చెప్పడం కూతురిని సపోర్టు చెయ్యడం ఆవిడకు రావు.
శ్రీలతకు, వాళ్ళన్నయ్యకు మధ్య మరొక అన్నయ్య ఉన్నాడు. అతను మానసిక వికలాంగుడు. చిన్నప్పుడే అతన్ని ఒక ఆశ్రమంలో తనను జీవితాంతం చూసుకునే విధంగా చేర్చారు వాళ్ళ నాన్న. ఇక్కడ ఒకేసారి కొన్ని లక్షల రూపాయలు కట్టేసినందుకు అతని మీద నెలసరి ఖర్చులేదు. లత తన తల్లిదండ్రులను తీసుకుని నెలకు ఒక సారి ఈ అన్నయ్యను చూసి రావడానికి వెళ్తుంది. పెద్దన్నయ్యకు ఎప్పుడో ఒకసారి వీళ్ళను తన కార్లో తీసుకుని వెళ్ళటం కుదురుతుంది. మిగతా సార్లన్నీ, సిటీకి ఇరవయి మైళ్ళ దూరం ఉన్న ఈ ఆశ్రమానికి వెళ్ళడానికి లత ట్యాక్సీ ఏర్పాటు చేయాలి. ఇందులో లతకి ఇష్టమయిన విషయాలు రెండు. ఒకటి చిన్నన్నయ్యను కలిసి అతనికిష్టమయిన తిండి తీసుకుని పొయి తినిపించడం. రెండోది తనకా ఆశ్రమ వాతావరణం కూడా చాలా ఇష్టం. ఎప్పటికయినా తనకు అలాంటి సంస్థలో ఉద్యోగం చెయ్యాలని ఒక తీరని కోరిక.
లతకొకసారి అమెరికాకు ఆరు నెలల పాటు వెళ్ళే అవకాశం వచ్చింది. నేనా కంపెనీలో చేరినప్పుడు అమెరికాలో ఉన్న చంద్రిక తిరిగొచ్చి రెండు వారాలయింది. తన దగ్గిర పాస్ పోర్ట్, వీసా అన్నీ తయారుగా ఉన్నాయి. కానీ తను వెళ్ళడానికి మాత్రం తయారుగా లేదు. ఏవో స్వంత కుటుంబ సమస్యలు. అందుకని శ్రీలతను వెళ్ళమని ప్రోత్సహించాను. ఈ ప్రయాణం వల్ల తనకు చాలా కావలిసిన ఆర్థిక స్వాతంత్ర్యం, తనంత తానుగా కొన్ని రోజులయినా బ్రతకగల అవకాశం దొరుకుతాయి. తను దేశం వదిలి దూరంగా వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు మొదట్లో అనుమతివ్వలేదు. అప్పుడు నేను వాళ్ళింటికెళ్ళి ఆయన్ను కలిసి లత ఒంటరిగా వెళ్ళి నెగ్గుకురాగల వ్యక్తి అని ఆయనకు నచ్చజెప్పాల్సి వచ్చింది. తన దగ్గరప్పుడు పాస్ పోర్టు కూడా లేదు. రెండు వారాల్లో కంపెనీ ద్వారా అన్ని ఏర్పాట్లు చేసి లతను కాలిఫోర్నియాకు పంపించాము. ఇది లత జీవితంలో ఒక పెద్ద మలుపు. నేను తనతో వారంలో అయిదు రోజులు ఆఫీసుకు వెళ్ళినన్ని రోజులు ప్రతిరోజు తనతో ఫోన్లో మాట్లాడేదాన్ని. తనక్కడి జీవితానికి అలవాటు పడేవరకూ నెలరోజులపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాను. విదేశంలో ఒంటరిగా అమ్మా నాన్నలకు దూరంగా ఉండటం, అదే ఊళ్ళో ఉండి పని చేసుకుంటున్న ఇతర సహోద్యోగుల సహాయం, వాళ్ళ వెంట వారాంతాల్లో ఊళ్ళు చూడటానికి పోవడం, అన్నీ లతకు కొత్త అనుభవాలు. ఇవన్నీ తను మానసికంగా ఎదగటానికి తోడ్పడినాయనుకోవచ్చు.
ఎన్నో కొత్తగా మొదలుపెట్టిన చిన్నకంపెనీల్లాగే మా కంపెనీలో కూడా తక్కువ సంఖ్య ఉద్యోగులం. ఎక్కువ పనిచెయ్యాల్సిన అవసరాలు చాలా వచ్చేవి. నెలలో ఒక వారం రోజులయినా అందరం రాత్రి 12:00 గంటలకు కానీ ఇంటికి వెళ్ళగలిగేవాళ్ళం కాదు. అలాంటప్పుడు చాలా వరకూ లత, నేను కలిసి పని చేసాక వెళ్ళేటప్పుడు తనను వాళ్ళింటి దగ్గర వదిలి వెళ్ళేదాన్ని. ఇదే టైములో తన విడాకుల కేసు హియరింగ్స్ అవుతున్నాయి. తను ఎప్పుడూ దిగులుగా, భయంగా ఉండేది. అప్పుడు నేను తన మనసును మరో వైపు తిప్పే ప్రయత్నంలో షిర్డి బాబాను ప్రార్థించుకొమ్మని చెప్పేదాన్ని. మరుసటి ఏడు మేం షిర్డికి ప్రయాణం చేసినప్పుడు లతను వెంట తీసుకుని వెళ్ళాను. తన కిదే మొదటి షిర్డి దర్శనం. తనకీ చోటు ఎంతగా నచ్చిందంటే, తరువాత ఎన్నోసార్లు తన అమ్మానాన్నలను, అన్నయ్య కుటుంబాన్ని వెంట పెట్టుకుని షిర్డికి వెళ్ళివచ్చింది.
లతకు అమెరికాలో ఉండగా ఒక కంపెనీ సహోద్యోగితో దగ్గరి స్నేహమయింది. సంప్రదాయిక బెంగాలి కుటుంబానికి చెందిన ఆ యువకుడొక ఐఐఎం ఎం బి ఏ. మా కంపెనీలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీరు. ఇద్దరికీ స్నేహం కుదిరింది. ఇద్దరిమధ్యా పెళ్ళి మాటలు కూడా జరిగినట్లుంది. తెరిగొచ్చిన తర్వాత అతన్ని లత వాళ్ళ అమ్మానాన్నలకు పరిచయం చేసింది. కొన్ని నెలల తర్వాత అతను వాళ్ళ వూరికొక సారి వెళ్ళి తన కుటుంబంతో లత విషయం తెలిపిన తర్వాత, వాళ్ళీ విషయాన్ని స్వాగతించలేదు. పెళ్ళి మాటలు అంతటితో ఆగిపోయినా అతను స్నేహం కొనసాగించాలని చూశాడు. అదికూడా అతను ఉద్యోగం వేరే కంపెనీకి మారడంతో ఆగిపోవడం లతకు మంచిదే అయింది. శ్రీలత కిప్పుడు ముప్పయ్యి యేళ్ళు దాటాయి. కానీ తనకు మళ్ళీ పెళ్ళి చేసి పంపితే వయసు పైబడిన అమ్మా నాన్నలనెవరు చూసుకుంటారు? ఇదొక విచిత్రమయిన సందిగ్ధం. తనకు ఇప్పుడు మంచి జీతం వస్తుంది. వాళ్ళిదర్నీ చక్కగా చూసుకుంటుంది. తనప్పుడు కైనెటిక్ హోండా స్కూటర్లో తిరిగేది. ఒక శనివారం నాన్ననయితే, మరొక వారం అమ్మను బైట తిప్పుకుని వస్తుంది, వాళ్ళకెప్పుడూ ఇంట్లోనే ఉండి బోర్ కొడ్తుందని. అయితే వాళ్ళకు తను కేటాయించేది ఒక్క శనివారాలే. ఆదివారాలు ఆఫీసుకు వచ్చి కూచుని చదువుకుంటుంది. ఎం సి ఏ కాంటాక్ట్ క్లాసులకు పోతుంది. ఆ డిగ్రీ అయిపోగానే ఎం ఏ ఇంగ్లిష్ లిటరేచర్ చేరింది. తనకలా ఏదో ఒకటి చదువుకునే పని ఉండాలి.
తరువాతి సంవత్సరం నేను ఇంకొక కంఎనీలో చేరాను. కొంతకాలం తరువాత కొన్ని సమస్యలు వచ్చి కంపెనీ మూత పడింది. చాలా మంది ఇతరులకు లాగే శ్రీలతకు కూడా ఉద్యోగం పోయింది. కానీ తనకు అప్పటికే అయిన అనుభవం వల్ల తను మూడునెలల్లోపల వేరే కంపెనీలో సాంకేతిక రచయితగా ఉద్యోగం దొరికి చేరింది. తన తర్వాత చేరిన ఒక కొత్త రచయితను కూడా శ్రీలతే మేనేజ్ చెయ్యాలి. చేస్తున్న ఉద్యోగం బాగానే ఉన్నా శ్రీలతలో ఒక అసంతౄప్తి. తనే కంపెనీలో సీనియర్ కాబట్టి తనేం వ్రాసినా దాన్ని గురించి విమర్శించి, లోటు పాట్లను తెలిపి బాగుచేసేవారెవరూ లేక తను ఏమీ నేర్చుకోలేకపోతున్నాని తన బాధ. తన వ్రాతకు పీర్ రివ్యూలు కూడా లేవు. తనకేమో సాంకేతిక రచయితగా ఏవిధమయిన ట్రెయినింగూ లేదు. ఒకసారి ఇద్దరం కలిసినప్పుడు తన బాధ నాతో చెప్పుకుంది. ఇలా చేసిన పనిని తమ మనస్సాక్షితో కొలిచి చూసే సాంకేతిక రచయితలు నాకు ఎక్కువ కనిపించరు. నా అనుభవంలో మేమేం వ్రాసినా అందులో తప్పులుండవు, ఇంకెవరూ రివ్యూ చేయనక్కర్లేదనుకునే వాళ్ళే నాకెక్కువ తారసపడుతుంటారు. నేనిప్పుడు తన మేనేజర్ను కాదు. నేను తనకు సహాయంగా చేయగలిగింది చాలా తక్కువ.
అయినా ఇద్దరం ఒక ఒప్పందానికి వచ్చాము. ప్రతి శనివారం మా ఇంటికొచ్చి కొన్ని గంటలు గడిపేది. ఆ సమయాన్ని తన వ్రాతలను నేను రివ్యూ చెయ్యడానికి వెచ్చించేవాళ్ళం. కొన్ని మాసాలపాటు సాగిన ఆ ఏర్పాటులో తను చూపించిన ఓర్పు, నేర్చుకోవాలన్న జిజ్ఞాస అమోఘం! శనివారాలు తనకు కేటాయించబడి ఉంటాయని మొదటే చెప్పానుగా? అంతవరకూ కైనెటిక్ హోండా స్కూటర్లో తిరిగిన శ్రీలత ఆ ఏడు మారుతి-800 కారు కొనగలిగింది. వారాంతం అమ్మానాన్నల ఔటింగులు, నెలకొక సారి అన్నయ్య దగ్గరికి విజిట్లు తన స్వంత కారులో చెయ్యడం కుదిరింది. నీటిలో హఠాత్తుగా పడేసిన చేపంత సులభంగా నేర్చేసుకుంది శ్రీలత కారు డ్రైవింగ్.
శ్రీలతను భారత్ మ్యాట్రిమొనీలో రిజిస్టర్ చెయ్యడానికి ప్రోత్సహించాను. వాళ్ళ నాన్నగారు తనకోసం పెళ్ళి సంబంధాలు చూడటం లేదని అనలేము. బంధువులందరిలో చెప్పి ఉంచాడు కూతురికి సరిపోగల వ్యక్తి వివరాలు. కానీ ఎవరయినా శ్రీలతను చూసి నచ్చి ఏమయినా మాట్లాడేలా కనిపిస్తే, ఆయనే ఏదో ఒక వంక పెట్టి ఆ సంబంధాన్ని తప్పిస్తాడు. భారత్ మ్యాట్రిమొనీలో వస్తున్న మెయిల్ రెస్పాన్సులు కూడా ఆయనే చూడటం ఏదీ కుదరక పోవటం కొనసాగింది. ఇలా అయితే ఎప్పటికీ తనకు పెళ్ళయేలా లేదని మెయిల్ కాంటాక్టులు తనే చూసుకోవడం ప్రారంభించింది.
సుబ్రహ్మణ్యం అనే అతను శ్రీలత ప్రొఫైల్ చూసి ఇష్టపడ్డాడు. సుబ్రహ్మణ్యంది పెద్ద కుటుంబం. ఇద్దరు చెల్లెళు, ఇద్దరు తమ్ముళ్ళు, రిటైర్ అయిపోయి మరొక ఆదాయం లేని తల్లి తండ్రులు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళకు ఉద్యోగాలు, పెళ్ళిళ్ళూ అయి సెటిల్ చేసే దాకా ఇతను పెళ్ళి చేసుకోలేదు. బి ఇ, ఎం బి ఏ విద్యార్హతలు. ఐఐఎంబి లో మెనేజ్మెంట్ క్లాసులు పార్ట్-టైం ప్రొఫెసర్ గా చేస్తూ, తనదే స్వంతం ఒక బయో-టెక్ కంపెనీ రన్ చేసుకుంటున్నాడు. తనింతవరకూ రావడానికి మునుపు, చదువు ముగించి కొన్నేళ్ళు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేశాడు. అతని వయసు శ్రీలత కన్నా నాలుగు నెలలు తక్కువ. ఏ రకంగా చూసినా తనకు నచ్చిన ఇతన్ని గురించిన నిర్ణయం, కొన్ని గంటల సమయం సంభాషణలకు ఇద్దరూ వెచ్చించిన తర్వాత శ్రీలత తీసుకుంది. మొదట సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను శ్రీలత కలిసి వాళ్ళకిష్టమయిన తర్వాతే, అతన్ని తన ఇంటికి తీసుకెళ్ళి అమ్మా నాన్నలకు చూపించింది. ఈ పద్ధతి వల్ల ఈ సంబంధం కూడా తప్పిపోయే అవకాశం చాలా తక్కువయింది. సుబ్రహ్మణ్యం శ్రీలత అన్నయ్యను కూడా కలిశాడు. ఇంతదాకా వచ్చిన తర్వాత ఎవరూ ఏ రకమయిన అభ్యంతరం చెప్పలేకపోయారు. పెళ్ళయింది. అదే మొదట నేను మా వారితో కలిసి వాళ్ళ పెళ్ళికి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం ను కలిశాను. తను నన్ను “గాడ్ మదర్, మెంటర్” అని మాత్రమే భర్తకు పరిచయం చేసింది. “ఆ మాట చాలు. తన మనసులో మీ స్థానమేమిటో నాకు అర్థమయింది,” అన్నాడు సుబ్రహ్మణ్యం. ఇద్దరికీ డ్రైవింగ్ పిచ్చి. సుబ్రహ్మణ్యం కార్లో ఇద్దరూ వారం రోజుల దక్షిణ భారత దేశం హనీమూన్ ట్రిప్పు పొయ్యొచ్చారు. సంవత్సరం తిరిగేలోపల పుట్టింది వాళ్ళకు అనన్య. ఇంట్లో పెళ్ళయిన చెల్లెళ్ళు తమ్ముళ్ళ పిల్లలు పుట్టినప్పుడు చూసిన అనుభవంతో శ్రీలతకు పాపను పెంచడంలో సుబ్రహ్మణ్యానికి సహాయం చెయ్యడం కష్టం కాలేదు.
ఎన్ని ఆటుపోట్లు తిన్నా చెక్కు చెదరకుండా ఒడ్డుకు చేరుతున్న నావ గుర్తొస్తుంది నాకు తనని చూస్తే. తను ఎంత తీరిక లేకున్నా సరే, అప్పుడప్పుడూ ఇప్పడికీ ఫోన్ చేసి పలకరిస్తూనే వుంటుంది.