“అమృతం కురిసిన రాత్రి” పై రారా సమీక్ష – ఒక ప్రతి విమర్శ

[రా.రా సమీక్షపై సి. ఎస్. రావ్ గారు వ్రాసిన ప్రతిస్పందన నిడివి, పరిశీలన వ్యాసానికి సరిపోయినంతగా వుండటంతో వారి లేఖను ఒక పూర్తి వ్యాసంగా ప్రచురించాము. ఇలా ఆలస్యంగా ప్రచురించడం మా నియమ భంగమే అయినా సబబైన నిర్ణయమనే మా అభిప్రాయం – సం. 13 సెప్టెంబర్ 2010.]

రారాగా ఆంధ్రదేశమంతటా ప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారు గొప్ప సాహితీ విమర్శకులు. రమ్యమైన తెలుగు వచనరచనాశైలి కలిగినవారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాహితీ సంప్రదాయాల్నీ, క్రొత్తగా వస్తున్న పోకడలనీ లోతైన వివేచనాశక్తితో ఆకళింపు చేసికొన్న పండితులు, మేధావులు. ఆయన మీద నాకు అపారమైన గౌరవం ఉంది. వారి నిష్పక్షపాత వైఖరి, నిశితపరిశీలన, నిర్భీతి, ఇంటలెక్చువలైజ్డ్ అభివ్యక్తీకరణ ఎవరినైనా ఇట్టే వశపరచుకోగలవు.

1969 ‘సంవేదన’ లో వారు ‘తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు’ శీర్షికతో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి ‘అమృతం కురిసిన రాత్రి’ మీద వ్రాసిన సమీక్ష (ఈమాట ఈ సంచికలోనే పునర్ముద్రణ) వారి స్థాయికి, వారి రీతికి తగినట్లుగా లేకపోవటం ఆశ్చర్యం వేస్తుంది, విచారం కలిగిస్తుంది. సమీక్ష తిలక్ కవిత్వం యొక్క జీవలక్షణాల్ని చక్కగా అంచనా వేయటంతో ప్రారంభమవుతుంది.

“తిలక్ లోని ప్రముఖమైన గుణం భావుకత్వం – కించిత్ ప్రేరణకు కూడా చలించిపోగల సుకుమార హృదయస్పందన శక్తి … ఈ భావుకత్వానికి తోడు తన హృదయం లోని అనుభూతిని వ్యక్తం చేయగల శబ్దశక్తి, అలంకారపుష్టి కలిసి రావటంతో తిలక్ ఉత్తమశ్రేణి కవి కాగలిగినాడు.” మరలా అంటారు: “భావుకత్వం అనేది ఏ ఉత్తమ కవికైనా ఉండవలిసిన ముఖ్యలక్షణం.”

బావుంది. భావుకత లేకపోతే కవిత్వమే లేదు. నాకు స్పష్టంగా అర్ధంకాని విషయం: “కానీ, అతను ఏ ధోరణి కవి అయ్యేదీ అతని హృదయతత్వం మీదా, జీవితం పట్ల అతని దృక్పధం మీదా ఆధార పడుతుంది. ఈ రెండూ కలిసి తిలక్‌ను ఒక ఉత్తమ భావకవిగా తయారు చేసినాయి” అనడం. భావుకత్వం ఏ ఉత్తమ కవికైనా ఉండవలసిన ముఖ్యలక్షణం అని అన్న తరవాత మరలా ఎవరినో భావకవి అనడం ఏమిటి? భావుకత్వం లేనివాడు కవే కాడుగా? కవిత్వం కవిత్వమే. కవిత, వస్తువు ప్రాతిపదికగా, లేదా కవి హృదయతత్వం మీద ఆధారపడి వర్గీకరించటం ఏ మాత్రం సబబు? ఇన్ని విభజనలు చేయాలా?

భావుకత కలిగిన కవి దేనిని కవితా వస్తువుగా స్వీకరిస్తేనేమి, అతని దృక్పధం ఏదైతేనేమి? తనదైన రీతిలో తాను వ్రాసుకోవచ్చు. అభ్యుదయపు బావుటాలు ఎగరవేయనివ్వండి. విప్లవశంఖం వినిపించనీయండి. జన వాహినిని విప్లవోన్ముఖంగా మలుపు తిప్పనీయండి. అలానే మరొకర్ని ఆశాచంద్రశాలలని నిర్మించుకోనియ్యండి. ‘వార్షుకాభ్రంలో యక్షపతీ సౌందర్యాన్ని’ చూడనియ్యండి. ‘ఒక శుష్కస్తన్య సన్నిధిని క్షుధార్తినేడ్చు పసిపాప’ను చూసి ‘సిగ్గుతో రెండుగా చీలిన వెదురుబొంగు’ను కానీయండి. ‘మంటలో అంతరాంతర దగ్ధమైన బూడిదను కానీయండి’. ‘దిగులు నీరు నిండిన కోటి మనస్సరస్తీరాల నా కవిత కోరికల కోణాకారపు కొత్త చెట్లను నాటుతుంది’ అననీయండి. ఇవన్నీ హృదయం ఆర్ద్రం అయ్యే రీతిలో వ్రాయమనండి. పాఠకుడిని కదిలించే విధంగా వ్రాయమనండి. ఆ కవితలు కలకాలం పాఠకుని మనసులో చెక్కు చెదరకుండా నిల్చిపోయేట్లు, ప్రతిధ్వనించేట్లు వ్రాయమనండి. అలా ఉత్తేజితులని జేసే విధంగా వ్రాయమనండి. ఆకట్టుకొనని కవిత్వం వ్యర్ధం. ఆకట్టుకోవాలంటే అందంగా వ్రాయటమే మార్గం. ఈ విషయాన్ని గురించి మాత్రమే తన కవిత్వంలో తిలక్ వ్రాశారు.

“గాజుకెరటాల వెన్నెల సముద్రాలు
జాజిపువ్వుల అత్తరు దీపాలు
మంత్రలోకపు మణి స్తంభాలు
నా కవితా చందనశాలా చిత్రవిచిత్రాలు”

“నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు”

“అన్నా!
అగ్నిజల్లినా అమృతం కురిసినా
అందం,ఆనందం దాని పరమావధి”

“ఉత్తమ కవులందరిలోనూ శైలి, ఇతివృత్తము విడదీయరాకుండా పెనవేసుకునే ఉంటాయి.తిలక్ అలాంటి ఉత్తమ కవిగానే కనపడతాడు.” – రారా చాలా బాగా చెప్పారు. తిలక్ అరువు తెచ్చుకున్న భావాలతో కానీ, అనుకరించిన శైలీ విలాసంతో కానీ కవిత్వం వ్రాయలేదు. రారా ఈ విషయాన్ని బాగానే గమనించారు అనుకునే లోపలనే ఇలా అంటారు: “అలౌకిక సౌందర్య శోభితమైన ఐంద్రజాలికుల అంతఃపురం లాగానే ఉంది అతని కవితా చందనశాల.” ఇలా అనడంలో విమర్శ కంటే అవహేళనే ఎక్కువగా ఉంది. కవిత్వంలో ఏ అనుభూతినైనా అందంగానే చెప్పాలి. ఒక మానసిక స్థితిని లేదా పరిస్థితిని సజీవంగా చిత్రీకరించి శుష్కనినాదాలు ఇవ్వకుండానే వానికనుగుణమైన ప్రేరణను పాఠకుడు పొందేట్లు చేస్తుంది గొప్ప కవిత. అందంగా వ్రాయటం అంటే ప్రకృతి శోభను చూపించటమో, శారీరక సౌందర్యాన్ని పెరేడ్ చేయించటమో, షోకులు పోవటమో, వాగాడంబరంగా భాషా సౌందర్యాన్ని ప్రదర్శించటమో కాదు. ఆకట్టుకునేలా అనుభూతిని, ఏ రకమైన అనుభూతినైనా వ్యక్తీకరించటం. రారా అన్నట్లు పాఠకులను ఉత్తేజితులని చేయాలన్నా, వారిని ఆకట్టుకునే విధంగా వ్రాయకపోతే ఉత్తేజితులెలా అవుతారు?

తిలక్ తన కవిత్వాన్ని గురించి చెప్పిన కవితా ఖండికల మీద రారా వ్యాఖ్య సరైన వివేచనతో కూడుకున్న దానిలా కనిపించటం లేదు. “తన కవిత్వం కరుణారస భరితంగా… వెన్నెల సముద్రాల మీద విలాసయాత్రలు చేసేదిగా ఉండాలి. అత్తరుదీపాలు వెలిగించేదిగా ఉండాలి. మంత్రలోకపు మణిస్తంభాలమధ్య దాగుడుమూతలాడేదిగా ఉండాలి.” అనడంలో నిష్పక్షపాతంగా ఆలోచిస్తే వక్ర భాష్యం కనిపిస్తుంది. తిలక్ తన కవిత్వం గురించి వ్రాసిన పంక్తులలోని వెన్నెల సముద్రాలు, మణిస్తంభాలు, అత్తరు దీపాలు కేవలం అందంగా వ్రాయటానికి సంకేతాలు.దానికి ఎంతటి అవహేళనతో కూడిన పెడార్ధం తీశారు రారా!

అభ్యుదయ కవులనబడే వారు, విప్లవకవులనబడే వారు అందానికి వ్యతిరేకులా? చెప్పదలచుకున్న విషయం, వ్యక్తీకరించదలచుకున్న అనుభూతి అందంగా వ్యక్తీకరించక పోయినా వారు పాఠకులని ఉత్తేజితులని చేయగలరా? అభ్యుదయకవులనీ, విప్లవకవులని అనటం అవసరమైన వర్గీకరణా? కవిత అభ్యుదయ లేదా విప్లవ కవులకు మాత్రమే పరిమితమా? మానవానుభవంలోని ఇతర పార్శ్వాలను స్పృశిస్తూ కవిత వ్రాయకూడదా? అభ్యుదయభావాలు కవిత్వంలో వ్యక్తీకరించని వాళ్ళు మంచి కవులు కావటానికి అవకాశం లేదా? అభ్యుదయభావాలు కవిత్వంలో వ్యక్తీకరించిన వాళ్ళందరూ మంచి కవులా? ఉద్యమనిర్మాణం జరగవలసినది నైతికమైన నిబద్ధతతో, ధర్మనిష్టతో, ఉద్యమంలో పాల్గొనడం ద్వారా చేసే త్యాగాలతో. కవిత్వాలు ఉద్యమాలను సృష్టించవు: ఉద్యమాలు కవిత్వాలను సృష్టించవచ్చు.

“నా గీతం గుండెలలో ఘూర్ణిల్లగ నా జాతి జనులు
పాడుకునే మంత్రంగా మ్రోగించాలని”

అభ్యుదయకవి తనకు ఇంతటికి ప్రాముఖ్యతను కోరుకుంటాడా? ఇంతటి ప్రాధాన్యతను తనకు తాను ఆపాదించుకుంటాడా? తన జాతి జనుల ఆశలను, వారి అవసరాలను కవితగా (మరలా మంత్రమెందుకు!) మలచుకుని అది తనలో మార్మోగాలి కానీ? “నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా…” మలచడమా? అభ్యుదయ కవి ఆదర్శాలను సోదరులు పంచుకోవాలా? అంతేకానీ తోటిజనుల ఆకాంక్షలను తాను ఆదర్శాలుగా స్వీకరించడా? అసంబద్ధం, అన్యాయం, ఘోరమైన పెత్తందారీ మనస్తత్వం. “వెలుగుల రవ్వల జడి” బావుంది. అందమైన పదచిత్రం. నేను చెప్పదలచుకున్నది కూడ ఇదే: అనుభూతి ఆవిష్కరణ కేవలం కవితలో అంతటి అందమైన పదచిత్రాల ద్వారానే జరుగుతుందని.

“ఒక్కొక్క యుగంలో జీవితం గురించి ఆనాటి జనులకు ఒక్కొక్క అవగాహన ఉంటుంది.” రారా గొప్పదనమిదే. మంచి అవగాహన. చారిత్రక పరిణామంలో విలువల అస్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవటం. అంటే కవిత్వావగాహన సాపేక్షమని. అంతవరకు బాగానే ఉంది. కానీ, “వాస్తవ జీవితానికీ,కవిత్వానికీ మధ్య అఖాతం విస్తరించేకొద్దీ జీవిత వాస్తవాన్ని విస్మరించటమే కవిత్వధ్యేయం అవుతుంది” అనడంలో ఒక లాజికల్ ఫ్లా ఉంది. ఈ వాక్యం మరొకసారి చదవండి. వాస్తవ జీవితానికీ కవిత్వానికీ మధ్య అఖాతం ఎందుకేర్పడింది? దానికి కారణం ఏమిటి? కవిత్వం జీవిత వాస్తవానికి దూరంగా జరగటమే. అంటే అంతటితో ఈ ప్రాసెస్ అయిపోయింది. అఖాతం ఏర్పడటంలోనే, విస్తరించటంలోనే విస్మరించటం ఉంది. ఇంక విస్మరించటం ధ్యేయం కావటం ఏంటి? జ్వరం వచ్చిన తర్వాత వళ్ళు కాలటం మొదలెట్టింది అన్నట్లు (జ్వరం లోనే వళ్ళు కాలటం ఉంది). “పర్యవసానంగా కవిత్వం మద్యంలాంటిది అయ్యింది. కవిత్వం ఇచ్చే ఆనందం కైపు లాంటిదయింది.” ఈ మాటలు తిలక్‌కి కానీ, ఆయన కవిత్వానికి గానీ ఎలా అన్వయించటం సాధ్యమవుతుంది? ఆయన ప్రవచించిన జీవన విలువలకు, వ్రాసిన కవిత్వానికీ, జీవించిన తీరుల మధ్య క్రూరమైన వైరుధ్యాలున్నాయా? ప్రపంచవ్యాప్తంగా మానవులని వేధించే వర్గాలకు, శక్తులకు, సమస్యలకు వ్యతిరేకంగా, మహాశక్తివంతంగా, కవితామయంగా ఆయన స్పందించటం మనం చూడలేమా?

“అభ్యుదయకవుల అవగాహన లో కవిత్వం ఇవ్వవలసింది ఆనందం కాదు, ఉత్తేజం.” – కీర్తిశేషులైన రారాని ప్రశ్నలు వేసి ప్రయోజనం లేదు. మనం ఒక క్షణం ఆలోచిద్దాం. ఉత్తేజంలో ఆనందం అంతర్లీనంగా ఉండి తీరుతుందే? ఆనందం అంటే ఇక్కడ కవిత ఇచ్చే ఆనందం. అది వ్యక్తీకరించే అనుభూతి స్వభావం ఏదైనా హృదయానికి హత్తుకునే విధంగా, హృదయం ఆర్ద్రమయ్యే విధంగా చెప్పటంద్వారా కలిగించే ఆకర్షణ. ఆ ఆకర్షణే ఆనందం. ఇది లేనప్పుడు ఉత్తేజం సాధ్యం కాదు. ఆనందం, ఉత్తేజం వేరు వేరు అనుభూతులుగా సిద్ధాంతీకరింపబూనటం గందరగోళానికి గురిచేయటమే. వైయక్తిక భావనలను సర్వ మానవాళి భావనలతో సమన్వయం సాధించవలసిన అవసరం గొప్ప కవిత్వానికి ఉంది. వ్యక్తి తనను తాను నిష్పక్షపాతంగా అర్ధంచేసుకుంటే మానవాళి ఆశలను, ఆకాంక్షలను, కష్టసుఖాలను అర్ధం చేసుకోవటానికి వీలవుతుంది. అలా తన వ్యక్తిగత చైతన్యాన్ని విస్తరించుకుని విశ్వచైతన్యానికి చేరువై, ఆ చైతన్యాన్ని తాను తన కవితలలో వ్యక్తీకరించగలుగుతాడు. ఇలా చెప్పటంలో కవితలో అనుభూతి ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో చెప్పటమే.

“అభ్యుదయకవిత్వం ఉత్తేజం ద్వారా క్రియాశీల పర్యవసాయి. లేక కార్యోత్సాహ పర్యవసాయి.” – కవిత్వం ఈ పాత్ర నిర్వహించాలంటే ఎలా వ్రాయబడాలి? నినాదాలు వల్లించటం ద్వారానా? కరపత్రస్థాయికి దిగటం ద్వారానా? ఉత్తేజంలో ఆనందం, ఆకర్షణ (అందం) అంతర్లీనంగా ఉంటాయని ఇంతకుముందే చెప్పుకున్నాం కదా. ఆహారం ఆరోగ్యం కోసం, బలంకోసం. సందేహం లేదు. కానీ అది చక్కగా తినాలంటే రుచి, శుచి ఉండాలి కదా! అలాంటివే కవిత్వంలో అందం, ఆనందం.

“పెను నిద్దుర వదిలించేదీ
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణత బ్రదుకిచ్చేదీ”

శ్రీశ్రీ కవిత్వం ఏం చెయ్యాలో చెప్పటం బావుంది. బావుందంటే ఒకటి దీనిలో సత్యముందని: రెండవది, ఇది అందంగా చెప్పటం జరిగిందని. అందుమూలాన ఆనందం కలిగిందని, అంచేతనే ఇది ఆకట్టుకుంటుందని. సరే, ఉత్తేజం కూడ ఇది ఇస్తుందనీ. కానీ వారిదే:

“రాబందుల రెక్కల చప్పుడు / పొగగొట్టపు భూంకార ధ్వని
అరణ్యమున హరీంద్ర గర్జన / పయోధర ప్రచండ ఘోషం
ఖద్గమృగోదగ్ర విరావం / ఝంఝానిల షడ్జధ్వానం
కావాలోయ్ నవకవనానికి.”

సింబాలిజం బాగానే ఉందనుకుందాం.కానీ ప్రజల ఊసే లేదేమిటి దీంట్లో? రారా ఈ చరణంలో ఇది గమనించకపోవటం ఏమిటి? ఇది గొప్ప అభ్యుదయ కవితని కోట్ చేశారు కూడా. దీంట్లో అస్పష్టత లేదా? ఇవన్నీ విప్లవాలకు సంకేతాలా? లేక ఎవరికి వ్యతిరేకంగా పోరాడటం జరుగుతుందో వారికి సంకేతాలా? లేకపోతే పోరాడే శక్తులకు సంకేతాలా? ఏ రకంగా పొసగటంలేదే? కొద్దిగా వాగాడంబరత ఉన్నట్లు కూడా అనిపించటం లేదూ?

“శ్రీరంగం నారాయణబాబు, శిష్ట్లా, రోణంకి, పఠాభి మొదలైన వాళ్ళందరూ అన్నివేళలో అభ్యుదయకవులు కారు.” – వాళ్ళందరూ అభ్యుదయకవులు కాని సమయాల వాళ్ళెటువంటి కవులు మరి? వారేవర్గానికి చెందుతారో రారా చెప్పలేదు. ఇలా అన్నారు కాబట్టి ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది. తిలక్ మాత్రం అభ్యుదయ కవిగా వ్రాసిన సందర్భాలు లేవా, కనీసం ఒకటి కూడా? ఏదో స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేయటం, వారి నొకరకంగా చూడటం, ఈయననొక రకంగా చూడటం ఎందుకు?

“భావకవిత్వం ఆధునిక జీవితానికి విషతుల్యమనీ, మనిషికి ప్రోత్సాహమిచ్చేబదులు ప్రాణశక్తిని హరించేదనీ తెలిసిపోయింది.” – ఇంతటి అబ్సొల్యూట్ సిధ్ధాంతాన్ని చేయటానికి ఎంతటి తిరుగులేని దాఖలాలు ఉండాలి! ఎంతటి పకడ్బందీ వాదనతో ఈ దాఖలాల ఆధారంగా ఆ సిధ్ధాంతాన్ని నిలబెట్టాలి! అదేం జరగలేదు. కనుక దీనిని వక్రభాష్యంగా పరిగణించవలసి ఉంది. కవిత్వంలోని భావుకతను మెచ్చుకుంటూ మాట్లాడారు కాబట్టి ఇక్కడ భావం అంటే అనుభూతి. ఈ అనుభూతిని వ్యక్తీకరించేది భావ కవిత్వం. అదెప్పుడూ విషతుల్యమేనని అంత నిర్ద్వంద్వంగా సిద్ధాంతీకరించటం ఏ తాత్విక మూలాలను ఆధారం చేసుకుని? తోటిమానవుల సమస్యలకు అది స్పందనగా ఉండదనే నిశ్చితాభిప్రాయానికి రావటం ఏ సిద్ధాంత ప్రాతిపదికన? నాకు తెలిసినంతవరకూ ఇది తిలక్‌ను ఏ కాలం చెల్లిన సిద్ధాంతాలకో, బూజు పట్టిన పదజాలంతోనో కట్టిపడేయాలనే వ్యర్ధప్రయత్నం. ఆయన అసలు సిసలైన కవి. అగ్ని జల్లినా, అమృతం కురిసినా అందం ఆనందం దాని పరమావధి అని చిత్తశుద్ధితో నమ్మిన కవి. కవిత్వం చైతన్య పరిధిని విస్తరింపజేయాలని నమ్మిన వ్యక్తి. ఆయన అనుభూతులన్నీ ఆరోగ్య వర్ధకాలే. ఏవీ విషకారకాలు కావు.

“అభ్యుదయకవులను అలా వదిలేసినా ఆధునిక కవులందరికీ ఈ నాడు వచన గేయ చందస్సు మీద పెరిగిన అనురక్తి కూడా, భావకవిత్వంలోని లాలిత్య గుణం (లిరిసిజం) మీద తిరుగుబాటుగానే కనబడుతుంది… కనుక ఈ నాటి కవిత్వానికి లలితమైన శయ్య వర్జ్యమయ్యింది.” – అటు భావకవులూ కాక, ఇటు అభ్యుదయకవులూ కాక ఆధునిక కవులంటున్నారే రారా! వారు ఏ వర్గం కిందకి వస్తారు? ఇక్కడ వర్గీకరణ అవసరం లేదా? వర్గీకరణ ఆయనకు ఇష్టం కదా? కవిత్వం హృదయసంబంధి: లాలిత్యం హృదయాహ్లాదకరమైనది. దానిమీద తిరుగుబాటు దేనికి? లాలిత్యంలో దుర్మార్గపు దోపిడీగుణం ఏమైనా అంతర్లీనంగా ఉందా? “ఆధునిక కవుల అనుభూతిలో భావుకత్వం (అనుభూతి సౌకుమార్యం) ఎంత వున్నా ఆ అనుభూతిలో తాత్వికవేదనా భారం, తాత్విక ఆలోచనా భారం ప్రముఖ స్థానం వహిస్తున్నాయి.” – ఇదేమిటి కొత్తవిషయం? అంటే కవిత తాత్వికచింతనకు మాధ్యమంగా ఉండాలని రారా సిద్ధాంతీకరిస్తున్నారా?

“వచన గేయపు శైలి లలితమైన (లిరికల్)ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని, గంభీరమైన ఇతివృత్తాలకు సముచితంగా ఉంటుందని స్పష్టంగా అర్ధమవుతుంది. అందువల్లనే నేడు వచనగేయం ఇంత వ్యాప్తిలోకి వచ్చింది”, “వచన గేయపు శైలి లలితమైన (లిరికల్) ఇతివృత్తాలకు అనుచితంగా ఉంటుందని.” – ఇంత అనాలోచితంగా, నిర్లక్ష్యంగా సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నట్లు సాహసమెలా చేశారో రారా! వచనకవిత్వపు శైలి లలితమైన ఇతివృత్తాలకు చాలా గొప్పగా, ఉచితంగా ఉంటుందని తిలక్ తిరుగులేని విధంగా నిరూపించారు కదా? ఇది జగమెరిగిన సత్యం, రారా కూడా ఒప్పుకున్న సత్యం. ఆయనే ఈ సమీక్షలోనే ముందుముందు చెప్పబోతున్నారు, “తిలక్ లో ఎన్ని అనభ్యుదయభావాలున్నా అన్నీ అపురూపమైన కవితా సౌరభం సంతరించుకుని పాఠకులను సమ్మోహనం చేయటం అతని ప్రత్యేకత.”అని. అపురూపమైన కవితా సౌరభం లిరిసిజమే కదా? పాఠకులను సమ్మోహనం చేయటం ఈ లిరిసిజం లాలిత్యం వల్లనే కదా? ఈ పని సాధించింది వచనకవిత్వం ద్వారానే కదా. వచన కవిత ఐన గీతాంజలి ఆంగ్లానువాదంలో టాగోర్ ఎంతటి మనోహరమైన లిరిసిజాన్ని సాధించారు!

“వచనగేయ రూపాన్ని ఆదరించటమే భావకవిత్వం మీద తిరుగుబాటు” అన్నారు రారా. ఈ వాక్యంలో ఆయన చెప్పింది సత్యమైతే తిలక్ కూడా భావకవిత్వం మీద తిరుగుబాటు చేసినట్లుగానే అంగీకరించవలసి వస్తుంది కదా. కారణం తిలక్ కూడా వచన కవిత్వాన్ని ఆదరించి తన కవిత్వీకరణ మాధ్యమంగా దానిని స్వీకరించారు. మరి ఈ అంగీకారావశ్యకత రారాకి రుచించలేదా? “దుఃఖితులపట్లా,బాధితులపట్లా తిలక్ అపారమైన కరుణతో కరిగిపోయిన మాట ఎవరూ కాదనరు. కానీ ఆ కరుణ అభ్యుదయస్పందనగా కనిపించదు.” – రారా ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించలేదు.తిలక్ కవి చేయవలసిన పని చేశారు. అపార కరుణానుభూతిని ఆర్ద్రంగా ఆవిష్కరించారు. దీనిలో అంతర్లీనంగా ఆయన పర్స్పెక్టివ్ ఉంది. ప్రచార కవిలా సందేశపు ఢంకా మ్రోగించలేదు.

సందేశాలనివ్వటం, తాత్వికసిద్ధాంతాలు ప్రవచించటం కవి చేయకూడని పనులు. రసాత్మకంగా తానావిష్కరించిన కవిత తన పని తాను చేసుకుపోతుంది. పాఠకుడి అంతరంగాన్ని వశపరచుకుంటుంది. మనిషిలో సహజంగా ఉన్న కరుణను బహుముఖంగా పెంచి పోషించి విస్తరింపజేస్తుంది. కరుణ ఒక మహోన్నత మానవీయతకు అస్తిత్వాన్ని చేకూర్చే జీవశక్తి. కరుణ లోంచి ప్రేమ ఉద్భవిస్తుంది. అన్యాయానికి వ్యతిరేకంగా శౌర్యమవుతుంది. సర్వజనావళికి శుభం చేకూర్చేందుకు అవసరమైతే త్యాగమవుతుంది. సర్వమతాలు, ధర్మాలు, యోగాలు, తాత్విక సిద్ధాంతాలు, సర్వ లలిత కళలు అంతిమంగా సాధించవలసినది పరిపూర్ణమైన కరుణామూర్తిగా అయ్యే పరిణామప్రక్రియను వేగిర పరచటం.

“తిలక్ కరుణ భావకవుల వేదనా ప్రియత్వాన్ని పోలివుంది” అనటం డెలిబరేట్ డిస్టార్షన్ అని తిలక్ కవిత్వాన్ని జాగ్రత్తగా చదివినవారి కెవరికైనా స్ఫురిస్తుంది. భావకవుల వేదనా ప్రియత్వంలో అనుభూతి సాంద్రత ఎక్కడుంది? అది ఒకరకంగా కృత్రిమమైనది. ఏ మాత్రం లోతులేనిది. అదొక ఫాషన్గా కనపడుతుంది. తిలక్ కరుణ ఎంత బలవత్తరమైన భావన! ఎంత కదిలించి కలవరపెట్టే శక్తి కలది1 ఈ రెంటికీ పోలిక ఎక్కడ ఉంది? రారా ఉదహరించిన కెవీయార్ చరణంలో తిలక్ కరుణరసావిష్కరణాన్ని నిరసించటానికి తర్కబద్ధమైన హేతువేమీ లేదు, ఉత్తేజపరచే లక్షణమూ లేదు. అది కవితనా? తిలక్ తత్వానికి సంబంధించని, తర్కం కాకుండా తర్కంలా కనిపించే అసంగతమైన విషయం ఈ చరణంలో ఉంది. పైగా ఇది ఉత్తేజ పరచేదిగా ఉన్నదని రారా భావించారని అనుకోవాలా?

చిన్నారికి చిన్న మాట అనే ఖండికలో జీవితం సంగీతం పెట్టె అని, జీవితం నవనీతపు పాత్ర అని, జీవితం దేవతల దరస్మితం అని తిలక్ చెప్పటాన్ని రారా తీవ్రంగా తప్పు పట్టారు. అలా లలితంగా చెప్పకుండా బ్రతుకు భారమంతా చూపించాలా? జీవితం వర్గపోరాటాల రుధిరధారావాహిక అని చెప్పాలా? “చిన్నారికి చిన్న మాట” అనటంలోనే ఒక ధ్వని ఉంది: కొండంత విషయాన్ని చిన్నారులకు గోరంతవిషయంలా చెప్పటం జరుగుతుందని. ఇలా చెప్పటంలో ఔచిత్యం ఉంది.

“మైనస్ ఇంటూ ప్లస్ ” అనే ఖండిక మీద రారా వ్యాఖ్య చూడండి: “‘క్రౌర్యం మీద అభిరక్తి అజ్ఞాతంగా మనిషి పశువుతో సమానం’ అనటం ఫ్రాయిడ్ సిద్ధాంతానికి దగ్గరలో ఉండవచ్చు కానీ, అభ్యుదయ దృక్పధానికి అనేక ఆమడల దూరంలో ఉంది.” పోనీ జీవితాన్ని ప్రగతి శీలక వర్గపోరాటంగా భావించే తాత్విక చింతనలోని దోపిడీ చేసే వర్గానికి చెందిన వాండ్ల మనస్తత్వాన్ని ఈ పంక్తులు ప్రతిబింబిస్తాయనుకోవచ్చుగా. ఇది సత్యమైన విషయం మాత్రం కాదా? ఇది సత్యం కాకపోతే ఇక జీవితంలో పోరాటం ఎవరికి వ్యతిరేకంగా?

“అందుకే మానవుడు మానవుడిగా, దేవుడిగా రూపొందే ఈ ప్రయాణం
అనంత దీర్ఘం, పునః పునర్వ్యర్ధం బహుయుగవిస్తీర్ణం”

తిలక్ ఈ పంక్తులు సర్వ మానవాళి పరిణామం గురించి, మానవుడు మానవుడిగా, దేవుడిగా పరిణామం చెందటం బహుయుగ విస్తీర్ణం అని చెబుతున్నాయి కానీ అసంభవం అనలేదే? ఇది పునఃపునర్వ్యర్ధం గాకపోతే స్టాలిన్ రష్యాలో లక్షలాదిమంది హత్యలకు గురిగావటం, చైనా టియానన్మైన్ స్క్వేర్ లో వేనవేల విద్యార్ధులు ప్రాధమిక మానవ హక్కుల కోసం పోరాడటం కూడా కాదు. కేవలం నినదిస్తున్నప్పుడు విప్లవ ప్రభుత్వ కిరాతసైనికుల తుపాకుల తూటాలకు నేలకొరిగిపోవటం ‘క్రౌర్యం మీద అభిరక్తి’ ఫలితానికి నిలువెత్తు నిదర్శనం కాక మరేమిటి? చిన్నా చితకా యుద్ధాలు, స్వాతంత్ర్యపోరాటాల అణచివేతలు, ప్రపంచ సంగ్రామాలకు వరదలై పారిన రక్తపుటేరులకు తిలక్ చెప్పిన పంక్తులు అద్దం పట్టడం లేదా? ఇది అబద్ధమా? ఇది ఆయన పరాజయ తత్వమా? కరుణామూర్తిగా మానవుడు పరిణామం చెందటానికి యుగాలు పడతాయే అని బాధ పడటం ఉంది ఈ పంక్తులలో. విప్లవాలలో నమ్మకాలు ఎప్పుడో పోయాయి. పరిణామం మీదనే ఆశలు.

“నాకు తల్లివి, నెచ్చెలివి, చెలివి నన్ను కౌగలించుకున్న పెద్దపులివి.” – ఈ మాటలు అనడం స్త్రీని కించపరచడం ఎలా అవుతుంది? తల్లి, చెల్లి, నెచ్చెలి అనడం గౌరవంతో కూడుకొనిన ప్రేమను ప్రకటించటం. పెద్దపులి అందానికి శక్తికి సంకేతం. ఈ లక్షణాలను స్తీకి ఆపాదించటంలో తప్పేమిటి? ఆమెను తక్కువ చేసి మాట్లాడటం ఎలా అవుతుంది? ప్రవహ్లిక అంటే పజిల్ అని. ఆమె మనస్సు ఒక పట్టాన అంతుపట్టేది కాదనీ, ఆమెను అర్ధం చేసుకోవలంటే తల్లి, చెల్లి, భార్య ప్రేమలలోని ఔన్నత్యాన్ని, త్యాగశీలతను ఆకళింపు చేసుకోవాలని దీని సూచితార్ధం.

తిలక్ “అభ్యుదయకవితా విహాయసంలోకి ఎగరలేక” పోవటం నిజం కాదు. నిజమైన కవితా తత్వానికి వ్యతిరేకమైన కృత్రిమ వర్గీకరణకు ఆయన వ్యతిరేకం. గానుగెద్దులాగా సిద్ధాంతం చుట్టూ నిరంతరం ప్రదక్షిణం చేయడం, అభ్యుదయవాదం పేర అరువు తెచ్చుకున్న భావాలు ఎవరి మెప్పుకోసమో ఏకరువు పెట్టడం యెడల తిలక్ కు ఏహ్యభావం ఉండటం నిజం. హైదరాబాదు నగరాన్ని “ఫ్యూడల్ రహస్యాల్ని దాచుకున్న పుండ్రేక్షు కోదండం”గా వర్ణిస్తున్నారు కాబట్టి ఫ్యూడల్ శృంగారానికి అనుగుణమైన సాంప్రదాయాలకు తగిన విధంగా ‘నగరం మీద ప్రేమగీతం’లో కనబడే వక్షోజాలు, జఘనోరు సౌందర్యాన్ని చారిత్రక దృక్పధంతో అర్ధంచేసుకుని తప్పుపట్టని రారా ‘అమృతం కురిసినరాత్రి’లో దేవలోకానికి మాత్రమే పరిమితమైన అప్సరాంగనల గురించి తిలక్ వ్రాసిన “వారు పృధు వక్షోజ నితంబ భారలై / యౌవన ధనుస్సుల్లా వంగి పోతున్నారు” అనే అద్భుతమైన కవితా సౌందర్యం కలిగిన పంక్తులను అర్ధం చేసికొనడంలో ప్రబంధ వర్ణనలలో ఉన్న సాంప్రదాయిక ఔచిత్యాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? తిలక్‌ను ఒక చవకబారు సెక్స్ అబ్సెషన్ కలిగిన వ్యక్తిగా అర్ధం వచ్చేట్లుగా ఎందుకు వక్రీకరించారు? జీవితంలో అతి ముఖ్యమైన పార్శ్వాలలో ఒకటైన శృంగారంతో కూడిన ప్రేమను ఉదాత్తంగా వ్యక్తీకరిస్తే తప్పేమిటి?

‘విరహోత్కంఠిత’ లో తిలక్ వ్రాసిన ‘సవ్వడయితే చాలు ప్రభూ రివ్వున స్మరశరం హృదయాన్ని దూసుకుపోతుంది‘ అని, ‘అవధరించవెందుకు పరిపక్వమైన నా యవ్వన విన్నపాన్ని / నవధరించవెందుకు అసకృదతిశయోక్తిశీలమైన నా తనూకావ్యాన్ని‘, ‘కందళించే ఈ వలపు ప్రభూ గాఢాశ్లేష దోహదం లేక క్రమవికాసితోద్భాసితం కానే కాదు‘ అని వ్రాస్తే రారా ఒక కసిలో వ్యాఖ్యానం వ్రాస్తారు: “భావ కవిత్వపు రూపకాలంకారాల పల్చని తెరల చాటున నా యవ్వనాన్ని స్వీకరింపమని,నా తనువును అనుభవింపమని ప్రబంధ సాంప్రదాయపు శారీరక కామార్తి గజ్జెలు కట్టుకుని చిందులు తొక్కుతుంది.” ఇది సమంజసమా? సాహిత్యవిమర్శలో “శారీరక కామార్తి” తో గజ్జెలు కట్టించి చిందులు తొక్కించవలసిన అవసరం ఉన్నదా? దీనికి ఔచిత్యం ఉన్నదా? ఈ వ్యాఖ్య ఔన్నత్యం కలిగి ఉందా? తిలక్ వ్రాసిన దానిలో లేని కామప్రకోపం ఈ వ్యాఖ్యలో ఉన్నదేమో అనిపిస్తుంది. ప్రేమ వ్యక్తీకరణ ఉదాత్తంగా జరిగిందా లేదా అన్నది మాత్రమే ఆలోచించవలసిన విషయం. అసలు దాని ఊసే కవిత్వంలో ఎత్తుకోకూడదనటం ఆత్మవంచన అవుతుంది.

ఇక్కడ రారా విస్మరించిన విషయం, తిలక్ అష్టవిధ నాయికలలో ఒకరైన విరహోత్కంఠిత మీద కవిత వ్రాస్తున్నారని. విరహోత్కంఠిత ఊహాలోకపు ప్రబంధనాయిక. ఆమెకు తగిన భావాలను,తగిన భాషను వాడటంలో ఔచిత్యం ఉంది. ఇది మనం ప్రస్తుతం జీవిస్తున్న సంఘానికి ఏ మాత్రం వర్తించే విషయం కాదు. టేబుల్ కాళ్ళను పూర్తిగా కవర్ చేస్తూ బట్టను కప్పకపోతే అభ్యంతరంగా భావించడాన్ని విక్టోరియన్ ప్రూడరీ గా చెప్పుకుంటారు. అలా ఉంది రారా విమర్శ. జీవితంలో ప్రేమ బలీయమైన పార్శ్వం. కాకపోతే అది తప్పనిసరిగా హుందాగా మాత్రమే వ్యక్తీకరింపబడాలి. ‘పరువానికి వస్తున్న నా వయస్సులో/చటుక్కున పరిమళపు తుపానులని రేపి‘ అని ప్రారంభ యవ్వనోధృతిని హుందాగా వ్యక్తీకరించిన తిలక్ కవిత్వానికా చవకబారు కామార్తిని అంటకట్టడం?

తపాలా బంట్రోతు అనే ఖండికలో “అమ్మాయీ !పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి పళ్ళెరంలో బెట్టి ప్రాణనాధుని కందించాలనే నీ ఆశ నా కర్ధమయింది” అనడంలో “ఆమె పడుచుదనాన్ని పడకటింట్లో చేరవేయాలనే తహతహ మాత్రమే కనిపిస్తుంది” రారాకు. ఇది సబబా? ‘భద్రంగా దాచి’ ‘ప్రాణనాధుడు’ అనడంలో ఆమె ఉన్నతమైన సౌశీల్యం ద్యోతకమవడం లేదూ? గౌరవించదగిన,కరుణతో చూడదగిన ప్రేమ, అమాయకత్వం కనిపించటం లేదూ? ఆర్కే నారాయణ్ పోస్ట్‌మన్ తానప్ప ఉత్తరాలు పంచుతూ, అందరికీ ప్రేమపాత్రుడుగా, దగ్గరి బంధువుగా, చతురోక్తిగా అంటున్నట్లు మాత్రమే నాకు తోస్తుంది. ఇలా అనడంలో నాకెక్కడా ఈ వ్యాఖ్య ధ్వనింపజేసే సెక్సిస్ట్ అబ్సెషన్ ఉన్నట్లు అనిపించదు. మరి ఈ “మానసిక జాడ్యం” ఎక్కడది? ఊహా జనితమైన అభ్యంతరాలను, మూలంలో లేని జుగుప్సాకరమైన ఏహ్యతను వెలికితీయాలనే పట్టుదల ఎక్కడినించి వచ్చింది?

అద్వితీయం అనే ఖండిక గురించి రారా అంటారు: “‘నేను నీ స్త్రీత్వమున కాహుతినై ‘ అనడమూ ‘నా బ్రతుకు పచ్చని గట్ల నీవు మిన్నాగువై చుట్టుకునీ ‘ఓ సురతాణి !నీ క్రతుహోమగుండమున నా జీవితమునే వ్రేల్చి’ అనడము ఏ విపరీతమైన మనస్తత్వము నుండి ఉద్భవించిన అభిప్రాయాలో తెలియడం లేదు. వీటికి మూలం ఫ్రాయిడ్ సిధ్ధాంతమా, డి.హెచ్.లారెన్స్ వాదమా? వామాచారుల తంత్ర శాస్త్రమా? లేక అన్నీ కలిపి అపక్వంగా తిన్న ఫలితంగా ఏర్పడిన అజీర్ణ వ్యాధా?” విస్మరించవీలులేని ఒక బలీయమైన సత్యాన్ని గౌరవప్రదంగా, ఆకర్షణీయంగా చెప్పటం అనుకోవాలిగానీ “మానసిక అజీర్ణవ్యాధిగా” చూడటం రారా సాహితీవిమర్శ స్థాయిని దిగజార్చే రీతిలో ఉంది. వాస్తవానికి, స్త్రీ,పురుష సంబంధమైన ఉదాత్త ప్రేమబంధానికి పునాది కామం అని అంగీకరించకపోవటం సత్యాన్ని తిరస్కరించటడం అవుతుంది. కామంగా ప్రారంభమై ప్రేమగా పరిణతి చెందుతుంది. ఈ ఎదుగుదల సహజమైనదీ, ఔన్నత్యంతో కూడుకున్నది. కాకపోతే ఈ మిశ్రమానుభూతిని ఉదాత్తంగా ప్రస్తావించి ఆవిష్కరించాలి. చవకబారు రీతిలో, చవకబారు భాషలో కాదు. తిలక్ గొప్ప ఔచితిని,ఔన్నత్యాన్ని పాటించారు, చూపించారు.

రారా మరలా అనకుండా ఉండలేకపోతున్నారు: “తిలక్ లో ఎన్ని అనభ్యుదయభావాలున్నా అన్నీ అపురూపమైన కవితా సౌరభం సంతరించుకుని పాఠకులను సమ్మోహనం చేయడం అతని ప్రత్యేకత. ఆ శక్తి అపారమైన అతని భావుకత్వం నుండి ఉద్భవించిందే. భావుకత్వమే తిలక్ బలం. ఆ బలం తోనే అతను ‘కవితాసతినొసటి నిత్యరసగంగాధర తిలకం’ కాగలిగినాడు… ఏ సూత్రాలకూ కట్టుబడని అతని మానసిక అరాజకత్వం కూడా అతనికొక అలంకారం కావటం అతనికే చెల్లింది. అన్ని మనస్తత్వాలవాళ్ళకు ఆహ్లాదం ఇచ్చి, అందరి మన్ననలూ పొందింది.” ఇది సామాన్యమైన ప్రశంస కాదు.ఇంత మెచ్చుకుంటూ కూడా అరాజకత్వం అనకుండా ఉండలేకపోయారు. ఏ సిద్ధాంతాలకూ తాను కట్టుబడనని తిలక్ మొదటే చెప్పుకున్నారు. ఏ సూత్రాలకు కట్టుబడక పోవటాన్ని అరాజకత్వం అని నిందించటం సహేతుకం కాదు. ఏ సిద్ధాంత నిరంకుశత్వానికి తలవంచని, బందీ కాని స్వతంత్రనిరతిగా ఆయన రీతిని ఎందుకు భావించకూడదు?

“కల ఎప్పుడూ మనిషికి బలం/ మిధ్యా జీవన రధ్యలలో/ స్వప్నం ఒక సుందర తనుమధ్య.” కల అంటే కలలు, ఆశలు, ఆశయాలు, అంతిమంగా చేరవలసిన గమ్యాలు. వాటిని పిచ్చాసుపత్రికి పరిసరప్రదేశాలుగా, నివాస స్థలాలుగా భాష్యం చెప్పటం కరుణతో కూడిన అభ్యుదయ భావన కాదు. ఇలా అనడం అసహనం, ఉక్రోషం అవుతుంది కాని సాహిత్య విమర్శ అనిపించుకోదు. కవిమీద ప్రేమ పూర్వక పక్షపాతవైఖరి ఉండాల్సిన అవసరం లేదు: కానీ అతను ఏం చెబుతున్నాడో అర్ధం చేసుకోవటానికి తెలివితేటలు, స్పందించే హృదయంతో పాటు ఒక మేరకు సానుభూతి ఉండాలి. ఈ సమీక్షలో ఆ సానుభూతి పూర్తిగా మృగ్యం. రారా నమ్మిన గతితార్కిక భౌతికవాద సిద్ధాంతాన్ని, తత్సంబంధమైన పిలక సిద్ధాంతాలను కరదీపికలుగా తిలక్ నమ్మకపోయినంత మాత్రాన సమ్యక్‌దృష్టి గోల్పోయి అసహనం పెంచుకోవటం వివేకం కాదు, విమర్శ కాదు. సాహిత్య సత్యదర్శనం తనకొక్కడికే అయినట్లు అంత నమ్మకమేమిటి? అన్నీ సిద్ధాంతాలు అర్ధసత్యాలే. లేకపోతే ఇన్ని సిద్ధాంతాలు, ఇందరు తత్వవేత్తలు, ఇన్ని తాత్విక చింతనలు ఉండటం ఎలా సాధ్యమవుతుంది? రారా కాక మరెవరైనా “కలలను, కల్లలను నమ్మే స్థితికి దిగజారినాడు” అని తిలక్‌ని అన్నారా? రారా అంత విపరీతంగా తిలక్‌ను మెచ్చుకోవటం, ఇంత అధ్వాన్నంగా విమర్శించటం (దాదాపు నిందించటం) – ఈ రెంటికీ సమన్వయం సాధించలేకపోయారు.

“చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుప రాగంలో / తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు”; ఆఖరుకు నెహ్రూ మీద వ్రాసిన ఈ పంక్తులు కూడా రారా గారి కసికరవాలానికి బలికాక తప్పలేదు. ఈ పంక్తులలోని సౌందర్యం, ఔచిత్యం, భావ సౌకుమార్యం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. నెహ్రూ గారి అభిమానులని మరీను. రోజుకు పద్దెనిమిదిగంటలు కోకొల్లలుగా ఉన్న దేశసమస్యల పరిష్కారమార్గాల మీద దృష్టినంతా కేంద్రీకరించి, శారీరకంగా, మానసికంగా అలసిపోయి తన సహజ స్వభావసిద్ధమైన సత్యసౌందర్యాల భూమిక నాధారం చేసుకుని తన మనస్సులో ఒక శాంతి ధామాన్ని సృజించుకుని మరుసటిరొజు కావలసిన శక్తిని సంతరించుకుంటున్నారని దీని అర్ధం. దీనికి ఒక పెడర్ధం తీశారు రారా. ప్రతి వ్యక్తికీ రెండు జీవితాలుంటవి. ఒకటి తన ప్రవృత్తికి తగినట్లు మానసిక లేదా భావ ప్రపంచంలో బ్రతకటం. రెండవది తాను వృత్తిరీత్యా భౌతిక ప్రపంచంలో తన విధులను తాను చిత్తశుధ్ధితో నిర్వహిస్తూ బ్రతకటం. ధర్మవ్యాధుడికధ మనకు తెలిసినదే. ఈ రెండు జీవితాలకూ తేడా ఉండవచ్చు. అప్పుడు “తనలో తానొక ఏకాంత సౌందర్యాన్ని రచించుకున్న స్వాప్నికుడు” అని సందర్భోచితంగా ఎవరి గురించయినా అంటే ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదనుకుంటాను.

ఆంగ్లసాహిత్యంలో, మనకున్నన్ని సిద్ధాంతవివాదాల రాధ్ధాంతాలు ఉన్నట్లు కనబడదు. ఒకరిమీద మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నట్లుగా కనిపించదు. రాజకీయాలకు సంబంధించి ఆయన ఎంత సాంప్రదాయవాదైనా షేక్స్పియర్ ప్రధానంగా భావవాద రచయిత అని, రూసో నుండి గొప్ప రచయితలందరూ భావ వాద రచయితలేనని మిడిల్టన్ మరే లాంటి ప్రఖ్యాత విమర్శకుడి అభిప్రాయం. భావకవిత్వంలో ప్రసిద్ధులుగా పేరెన్నికగన్న వర్డ్స్‌వర్త్,కీట్స్,షెల్లీ లను ఏనాడూ ఎవరూ తక్కువగా చూడలేదు. ఎవరిమానాన వారు వారివారి ధోరణులలో వ్రాసుకుపోయారు. ఇమేజిస్ట్-వోర్టిసిస్ట్ సంప్రదాయంలో ఇజ్రాపౌండ్ లాంటివాళ్ళు వ్రాసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవటం కోసం యుద్ధాన్ని స్వాగతిస్తూ రూపర్ట్ బ్రూక్ లాంటి వారు కవిత్వం వ్రాశారు. యుద్ధాన్ని, దాని భీభత్సాన్ని నిరసిస్తూ సజూన్, వోవెన్, రోజెంబర్గ్ కవిత్వాలు వ్రాసారు.యుద్ధానంతర నైరాశ్యాన్ని టి.ఎస్.ఇలియట్ కవిత్వీకరించారు. ఆడెన్ (ఆ తర్వాత మార్క్సిస్ట్ ప్రభావం నుండి తప్పుకున్నారు), స్పెండర్, మెక్నీస్, సెసిల్ డే లెవిస్ లాంటి వాళ్ళు మార్క్సిస్ట్ భావనలతో సామాన్య మానవుని గురించి, అతని సమస్యలను గురించి కవితలు వ్రాశారు. గతకాలము మేలు వచ్చు కాలం కంటెన్ లాంటి ధోరణిలో జాన్ బెట్జ్మన్ నాస్టాల్జిక్ అనుభూతులతో, ఫ్రాయిడియన్ మనస్తత్వ పరిశోధనల ఆధారంగా రాయ్ ఫుల్లర్ కవితలు వ్రాశారు. డిలాన్ థామస్ ఉండనే ఉన్నాడు: అసలు కవితకు అర్ధం ఉండవలసిన అవసరం లేదన్నాడు. మాటల పొందిక ద్వారా సాధింపబడిన లయను, శబ్దసారూప్యతవల్ల ఉద్భవించే రిథంను ఒక సమ్మోహన శక్తిగా ఉపయోగించుకుని పదచిత్రాలద్వారా ఆనందానుభూతి కలిగించటమే కవిత్వం చేసే పని అన్నాడు. ఇదంతా చెప్పటానికి కారణం, ఇదే కవిత్వం, వేరొకటి కవిత్వం కాదు అని మనం వాదులాడుకున్నట్లు వారెప్పుడూ ఇంతగా గొడవపడినట్లు కనిపించక, ఒకరియెడల ఒకరు ఎక్కువ సహనంతో వ్యవహరించారేమో ననిపించడం. మనకు భిన్నంగా వ్రాసేవారిని ఒక ఉద్యమంగా వీరావేశంతో ఖండించటం ఒకమేరకు నిందించటం కూడా మనకు కాస్త ఎక్కువేమో అని కూడా అనిపిస్తుంది.

రారా గారంటే నాకు గౌరవం, ఇష్టం. ద్వంద్వ ప్రమాణాలు లేని వ్యక్తి. నిజాయితీ కలిగిన వ్యక్తి. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి. కట్టుబడి కష్టబడ్డ వ్యక్తి. అయినా వెనుక చూపు లేని వ్యక్తి. ఆర్ధిక ఇబ్బందులతో, అనారోగ్యంతో బాధపడిన వ్యక్తి. అననుకూల పరిస్థితులకు కూడా తలవంచని ధీరత్వం కల వ్యక్తి. చెక్కుచెదరని గాంభీర్యం కల వ్యక్తి. అయితే ఆయన పట్ల నాకున్న గౌరవం కానీ, అభిమానం కానీ ఆయన సమీక్షను నిష్పక్షపాతంగా విమర్శించటానికి ఏమాత్రం అడ్డు రాకూడదు. ఏది ఏమైనా ఆఖరికి వచ్చేసరికి సాహిత్యానికి సంబంధించి, ముఖ్యంగా కవిత్వానికి సంబంధించి సిద్ధాంతాలన్నీ ప్రక్కకు తప్పుకుంటవి. ‘ది టేస్ట్ ఆఫ్ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ది ఈటింగ్’ అన్న సూక్తి నిలుస్తుంది. నిలవవలసిన, నిలవగలిగిన కవిత్వం నిలుస్తుంది. ప్రజలనాల్కల మీద నడయాడుతూనే ఉంటుంది. తెలుగులో వచనకవిత్వానికి సంబంధించినంతవరకూ నా అభిప్రాయంలో ఆ కీర్తి తిలక్ గారికే దక్కుతుంది.