కలవరపెడుతుంది మనస్సును

అనంతంగా ధ్వనించే
సముద్ర ఘోషలో
మెత్తగా ఆకులు రాలే
శిశిర సాయంత్రాన
రాబోయే చీకటి
ఏ బంధాలను తెంపుతుందో!
ఏ జ్ఞాపకాలను రేపుతుందో!

నీలినీడల వెనుకాల
గాలికెరటాల అంచుల మీద
జలతారు చేలాంచలాలను
పరాకుగా జారవిడుస్తూ,
జ్ఞాపకాల భూతకాలంలోకి
అవలోకనం చేసే అనుభవాల నెమ్మోముల
అలముకునే పల్చని చీకటి
కలవరపెడుతుంది మనస్సును .

నిర్జన ప్రదేశాలలో
వంగిన ఆకాశం మీదుగా
చల్లని గాలి మోసుకొచ్చే
జనవాసాల హోరు
అస్తమించే సూర్యునితో
దిగులుగా వెళ్ళిపోయే దృశ్యం
కలవర పెడుతుంది మనస్సును.

పెంచిన కుక్కలా
వెంబడించే దుఃఖాన్ని
గర్భస్థ శిశువులా రోదించే
అస్పష్టపు జ్ఞాపకాల్ని
మరణ సుంకంగా చెల్లించే
అమాయకపు విశ్వాసం
కలవరపెడుతుంది మనస్సును.


సి. ఎస్. రావ్

రచయిత సి. ఎస్. రావ్ గురించి:

సి. ఎస్. రావు ఆంగ్ల, ఆంధ్రభాషలలో విమర్శకులు, అనువాదకులు, కవి. వీరి అనేక ఆంగ్ల ప్రసంగాలు ఆలిండియా రేడియోలో ప్రసారమయాయి. శ్రీ వెలిచాల కొండలరావుగారు స్థాపించిన విశ్వనాథ పీఠం ఆధ్వర్యంలో ప్రచురించబడిన A Thousand Hoods ను వీరు ఇతర అనువాదకులతో కలిసి అనువదించటమే కాక సంపాదకత్వ బాధ్యతలు కూడా నిర్వహించారు. ఇది విశ్వనాధ వేయిపడగలు’కు మొట్టమొదట ప్రచురించబడిన ఆంగ్లానువాదం. తిలక్ అమృతం కురిసిన రాత్రిని A Night Nectar Rained గా ఆంగ్లంలోకి అనువదించారు. Shakespeare’s Sonnets, MK Gandhi -An Indian Patriot in South Africa లను తెలుగులోకి అనువదించారు. ఇంగ్లీష్, తెలుగు భాషలలో అనువాదాలు, స్వీయరచనలు కలిపి ఆరు పుస్తకాలు ప్రచురించారు. వీరికి అనువాదసాహిత్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనుండి కీర్తి పురస్కారం లభించింది. పది కాలాలు నిలిచే సాహిత్య విమర్శ-సమగ్రమైన, సునిశితమైన విషయ విశ్లేషణతోపాటు రమ్యమైన వ్యక్తీకరణ కూడా కలిగి ఉంటుంది అని వీరి ప్రగాఢ విశ్వాసం.

 ...