కుతంత్రం

( పంతొమ్మిది వందల అరవయ్యిల్లో, ఇండియాలో, బెజవాడలో)

ఆ ఇల్లు ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది. లోపలి గదుల్లో ఎక్కడ చూచినా పెట్టెలు, చుట్టేసిన పరుపులు, విప్పేసిన పట్టు చీరలు. కొన్ని గంటల్లో ఆ ఇంట్లో అంపకాలు. ఒక గదిలో పెళ్ళి కూతుర్ని కొందరు అలంకారాలు చేసి తయారు చేస్తున్నారు. తల చక్కగా దువ్వి, పూల జడకుట్టారు. ఆమె తండ్రి లక్ష్మీ జెనరలు స్టోరు నుండి ప్రత్యేకంగా ఎంచి తెచ్చిన జరీ అంచు నీలి బనారసు చీర కట్టారు. నీలి చీర కట్టి, నీలి జాకెట్టు వేసుకుని, నెమలిలా ఉన్న ఆ పెళ్ళి కూతురు వాళ్ళ నాన్న పెళ్ళిలో బహూకరించిన ముత్యాల సెట్టు పెట్టుకుంది. అది బోంబేలో తోతారామ్ సాగర్ నగల షాపులో ప్రత్యేకంగా చేయించి తెప్పించినది. దాని నవరత్న పతకం సరిగ్గా ఆమె గుండెల మీదుకు వేళ్ళాడుతున్నది. ముత్యాల జూకాలు – చెవి కి అంటుకుని చిన్న నవరత్నాల బిళ్ళ, మధ్యలో అలాంటిదే ఇంకో నవరత్నాల బిళ్ళతో, రెండు అంగుళాల పొడుగుతో- అటూ ఇటూ ఊగితే, చూసే వాళ్ళ మనసులు ఊగుతున్నాయి. పెళ్ళి సంబరాల్లో ఎంత చూసినా, ఇంకా సరిగా పదిహేడు ఏళ్ళు కూడా లేని ఆ పిల్ల లేత అందానికి చుట్టూ ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి ముగ్ధులై పోయారు. పెళ్ళికూతురి అమ్మ తరుఫు వాళ్ళు పిల్ల పూల జడ పైగా, మల్లెపూలు కనకాంబరాలు చెండ్లు అమరుస్తూ, మధ్య మధ్యలో సరిగ్గా అమరినవో లేవో అని ముందుకు వచ్చి గమనిస్తూ, “సుమతక్కా! మన అమ్మాయి అచ్చంగా విజయ నిర్మల లాగా ఉండదూ. ఆ పెద్ద కళ్ళూ, ఆ సున్నితపు చెంపలూ, ఆ గులాబి పువ్వు పెదాలూ!” అని ఎంతో మురిసిపోయారు.

“అమ్మాయేమో విజయ నిర్మల! నువ్వేమో అంజలీదేవి! ” అంది సుమతీ దేవి. ఆమెకు అంద చందాల మీద పెద్ద భ్రాంతి లేదు. కాని ఆచార వ్యవహారాలూ, కుటుంబంలో, సంఘంలో, పరువు ప్రతిష్ఠలూ ఆమె కిష్టం.

మధ్య హాల్లో అంపకాలకి ఏర్పాట్లు జరిగాయి. ఆ హాలు విశాలంగా -చుట్టూ కూర్చునే వాళ్ళు వరసగా వేసిన కుర్చీల్లో కూర్చుంటే, కొందరు నుంచునే వాళ్ళు నుంచునీ, మగవాళ్ళ ఎదటకు రాని కొందరు ఆడవాళ్ళు అక్కడి తతంగాన్ని లోని గదుల్లోంచీ చూడ్డానికి కూడా వీలుగా ఉంది. హాల్లో మధ్యన పెద్ద మంచం. ఆ మంచం మీద చక్కని దుప్పటీ. చుట్టూ పెద్ద పళ్ళెరాల్లో పూలు, తమలపాకుల కట్టలు, వక్కలు, బంధువులకు అందించడానికి సిద్ధంగా ఉంచిన కొత్త బట్టలు. వెండి గిన్నెల్లో కుంకుమలు, పసుపులు, గంధాలు. కంచు, ఇత్తడి పళ్ళెరాల్లో లడ్డూలు. బాసుందీలు, జిలేబీలు , జాంగ్రీలు, కొన్ని స్టీలు పాత్రల్లో అరిసెలు, బూరెలు, బూందీ మిఠాయీలు. అరటి గెలలు, జామపళ్ళు, కొబ్బరికాయలు. బుట్టల్లో చేమంతులు, మల్లెలు, మరువాలు, దవనాలు. వాసనలతో హాలంతా ఘుమఘుమ లాడి పోతున్నది.

“వచ్చారు వచ్చారు వియ్యాల వార”‘న్నారు. పునిస్త్రీలంతా ధాటీగా ముందుకు వచ్చారు. వితంతువులంతా కొంచెం వెనక్కి తగ్గారు. బ్రాహ్మలు రంగంలోకి వచ్చారు. మంగళ హారతులు వెలిగాయి. మంత్రోచ్చారణలు మొదలయ్యాయి. పెళ్ళికొడుకు బావమరుదులు దారి చేసి తీసుకురాగా, లోనికి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. తెల్ల సిల్కు చొక్కా , బిన్నీసిల్కు పంచె ధరించి ఉన్నాడు. ఇంత పట్టె నుదురు. తిరుచూర్ణం, కుంకుమ కలిపి ఇంత నిలువు బొట్టు. ఆయన ముత్తవలు, తాతలు ఆ పక్కా ఈ పక్కా వచ్చి నుంచున్నారు. అందరి ముఖాలనా అవే నిలువు బొట్లు. పెళ్ళికూతురిని తీసుకు వచ్చి మంచానికి ఇంకో చివర అతనికి ఎదురుగా కూర్చోపెట్టారు.

బ్రాహ్మణులు క్రతువు సామానులన్నీ సిద్ధం చేసుకున్నాక, “అయ్యా! పెళ్ళికూతురు తండ్రిగారు, మావగారు రావాలండోయ్!” అని కేకలు పెట్టారు. “డాక్టరుగారు! డాక్టరుగారు! లోపల మీకోసం పిలుస్తున్నారు” అని కాంపౌండర్లు, వరండాలోకి పరిగెట్టి కెళ్ళారు. బైటి వరండాలో స్నేహితుల మధ్య నిలబడి విలాసంగా సిగరెట్టు కాలుస్తున్న ఆ డాక్టరు గారి గుండెలో రైళ్ళు పరిగెట్టాయి.

ఆయనకు ఈ పెళ్ళికూతురు పెద్దకూతురు. తన కూతురికి ఎంతో మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేసినందుకు మనసులో మహా పొంగుగా ఉన్నా, కూతురి అంపకాల ఘట్టానికి ఆయన తయారుగా లేడు. తన భార్య, అత్తవారి విషయాల్లో ఆయన కొయ్య. వేరే విషయాల్లో మాత్రం ఆయన వెన్న. తన పిల్లలనే కాకుండా, తన తోబుట్టువుల పిల్లలను కూడా తన రెక్కల కింద పొదుగుకుని, అందరి పిల్లలనూ ఆ ఊళ్ళో స్కూళ్ళల్లో, కాలేజీల్లోనూ చదివిస్తూ, వాళ్ళ చదువు సంధ్యల్లో చాలా శ్రద్ధ చూపిస్తూ ఉండేవాడాయన.

ఆయనకు ఎటు చూసినా కూతురి వివాహం గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు. వియ్యంకుడూ, తనూ, రోజూ క్లబ్బులో ఎదురూ బొదురూ కూర్చుని పేకాడుకునే వాళ్ళేనయ్యె. కొన్ని సంవత్సరాలుగా డాక్టరుగారి చేతిలో ఆ షావుకారు రమ్మీ ఆటలో ఓడిపోటం, ఆయన జేబులో చెయ్యి పెట్టి, “డాక్టరూ, ఇదిగోనోయ్, నీ డబ్బు.” అనడమూ, ఆ చెయ్యి ఆ పట్టు లాల్చీ జేబులోంచి ఊడి పడక పోటమూ, -అది చూచి డాక్టరు గారు “ఉండనీయండీ, వెంకటేశ్వరరావు గారు! ఇంకెప్పుడైనా ఇద్దురులే, ఉంచండీ.” అనడం. ఆ వినోదం అందరూ చూసి చూసి ఆనందించిందే. ఆ వెంకటేశ్వరుడి అప్పు అలా అలా పెరిగిపోయి, ఒకరోజు పక్కనే ఉన్న మిత్రులు: “ఇక మీరు డాక్టరు గారి ఋణం తీర్చలేరండీ,” అంటే ఆ షావుకారుగారు, “మా పెద్దబ్బాయికి, వాళ్ళ పెద్దమ్మాయిని చేసుకుంటే నా బాకీ మాఫు చెయ్యడా డాక్టరు?” అన్నాడనీ, అలా అలా ఆ పెళ్ళి నిజంగానే కుదిరిపోయి, జరిగిపోయిందనీ వదంతులు ఉన్నాయి. లేకపోతే ఆంధ్రాలో పెద్ద భూస్వామి, పేరు మోసిన షావుకారు, వడ్డీ వ్యాపారి, -ఒక మధ్య తరగతి డాక్టరు కూతురిని ఎందుకు కోడలుగా చేసుకుంటాడు?

ఆయనకు లోపలకు పోవటానికి కాళ్ళాడలేదు. వియ్యంకుడే ‘రండి, డాక్టరుగారూ’ అని లోనికి తీసుకెళ్ళాడు. లోన బంధువర్గమంతా గుంపులు గుంపులుగా చేరి ఉన్నారు. “మన ముకుందు ఉత్త పిరికి గుండెవాడమ్మా. పెద్ద పిల్లంటే పంచ ప్రాణాలు. చెయ్యలేడమ్మా అంపకాలు. ఆడదానికి మల్లే ఏడుస్తాడు.”

“ఎప్పుడూ ఆ పిల్ల గురించిన మాటలే చెప్పుకునేవాడు. అంత బాగా చదువుతుంది. ఇంత బాగా చదువుతుందని. చాలా ఆశ్చర్య పోయాం. ఎందుకు ఇంత చిన్న వయసులో పిల్ల పెళ్ళి చేస్తున్నాడా అని.” “ఎలా ఆగుతాడమ్మా. ఇలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ వస్తుందా? వాడి మంచి మనసుకు తగ్గట్టే కలిసి వచ్చిందమ్మా అదృష్టం” – ఇలా సంభాషణలు సాగుతున్నాయి.

డాక్టరుకి సహాయంగా ఆయన ముగ్గురు అన్నదమ్ములు వచ్చి పక్కనే నుంచున్నారు. “కానివ్వరా! ఇంతా చేసి ఎక్కడికి వెళుతున్నదని మన పిల్ల. వియ్యాల వారు ఊళ్ళోనేనయ్యే. పేరుకు చేసే తతంగమే కానీ, ఇప్పుడప్పుడే పిల్లను వాళ్ళింటికి పంపబోయామా ఏమిటి?” అని ధైర్యం చెప్పారు.

డాక్టరుగారు, భార్య కలిసి అంపకాల వేదిక వద్దకు వచ్చారు. ఇద్దరూ కలిసి తమలపాకుల్లాంటి పెళ్ళికూతురి చేతులు పాలల్లో అద్దించి, అల్లుడి చేతుల్లో ఉంచారు. ఆ తర్వాత మళ్ళీ ఆమె చేతులు పాలల్లో అద్దించి వియ్యంకుడు, వియ్యపురాలి చేతుల్లో ఉంచి, వారికి చేతులెత్తి నమస్కరించి, కొత్త బట్టలిచ్చి సత్కరించారు. వధూవరులిద్దరి మీదా అక్షింతలు వేశారు. డాక్టరి గారికి కళ్ళవెంట ధారాపాతంగా కారిపోతున్నాయి. ఆయనంటే చిన్నప్పటినించీ అభిమానం ఉన్న పిన్నమ్మలూ, పెద్దమ్మలూ అందరూ మళ్ళీ – “ముకుందు మనసు వెన్న, తల్లిని చూడమ్మా. కంట నీటి చుక్క లేదు. ఎంత నిబ్బరంగా ఉందో. ముకుందు ఉండలేడమ్మా అలా” అని మళ్ళీ వాళ్ళ కళ్ళు తడి చేసుకున్నారు. పెళ్ళికూతురూ, పెళ్ళి కొడుకూ మంచం దిగి తలిదండ్రులకు నమస్కరించినాక, ఒకరి తర్వాత ఒకరుగా అక్కడి పెద్దలందరికీ వంగి నమస్కారాలు చేసి వారి దీవెనలు తీసుకున్నారు. అందరి మనసుల్లో సంతోషం, విషాదం కలిసి, పెనవేసుకుపోయాయి.


మెల్లిగా పెళ్ళివారి ఇల్లు రోజురోజుకూ ఖాళీ అవసాగింది. దూరపు చుట్టాలు వెళ్ళిపోయారు. కొంతమంది పల్లెటూరి బంధువులు ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ రాలేని వృద్ధులూ కొంచెం బలవంతం చేయించుకుని ఉండిపోయారు.

కొన్నాళ్ళలో పెళ్ళికొడుకు, కొన్ని వీధుల అవతల ఉన్న వాళ్ళింటినుండి పెళ్ళి కూతురి ఇంటికి రాకపోకలు మొదలెట్టాడు. పెళ్ళి కూతురికి అసలు వాళ్ళ నాన్న అకస్మాత్తుగా తనకు పెళ్ళెందుకు చేశాడో అర్ధం కాలేదు. ఆమె రోజూ పొద్దున్నే తయారై స్కూలికి, ఆ తర్వాత కాలేజీకి పోవటానికి అలవాటు పడింది. వాళ్ళ నాన్నకి ఆమె చదువు గురించి చాలా ఆసక్తి. ప్రతి సంవత్సరమూ క్లాసు పుస్తకాల మీద చర్చా, మరుసటి సంవత్సరం ఎక్కడ చదవాలో ఏం సబ్జెక్ట్లు తీసుకోవాలో చర్చ. స్కూల్లో వాదనల పోటీలు, క్లాసు మేగజీనుకి కథలూ, పద్యాలూ, వ్యాసాలు రాయటం, ఊళ్ళో ఇతర స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనూ, రేడియోలో పోటీల్లో పాల్గొనడం- ఇదీ కొన్నేళ్ళు గా ఆమె వ్యాపకం.

స్కూల్లో లైబ్రరీ రీడింగు క్లాసుల నుంచి ఆమెకే పుస్తకాల పిచ్చి బాగా ఎక్కింది. ఆమె చిన్నప్పటి నుంచి తండ్రి ఇంట్లో పుస్తకాల బీరువాలకి తాళాల్లేవు. వేమన నించి వుడ్‌హౌస్ వరకూ, బాపిరాజు నించీ బార్బరా కార్ట్లేండు వరకూ పద్ధతీ పాడూ లేకుండా అన్నీ చదివేది. నవోదయ పుస్తకాలూ, విశాలాంధ్ర తుమ్మల మామయ్య ఇంట్లోంచి రష్యా , చైనా, ఇతర దేశాల రచయితల అనువాదపు పుస్తకాలూ, కిళ్ళీ కొట్లనుంచి తెచ్చే తెలుగు సీరియలు డిటెక్టివ్ పుస్తకాలూ, వారపత్రికలూ, చందమామ, యువ ఒకటని లేకుండా చదివేస్తూ ఉండేది. ఏవి ఎంతవరకూ అర్థమయ్యేవో, ఎవరికి ఎరుక! కాలేజీ నించి రావటమే ఆమె క్లాసు పుస్తకాలు అవతల పారేసి, వాళ్ళ నాన్నగారి గది ఖాళీ్గా ఉందేమో చూసుకుని తలుపులేసుకుని, అలమరలోంచి కథల పుస్తకాలు తీసుకుని, డన్లప్ బెడ్డేక్కేసేసి, చదువుకునేది. ఎవరో ఒకరు వచ్చి అన్నం కలుపుకుని వచ్చి తినిపించి వెళ్ళిపోయే వారు. అందులో ఏం కూర కలిపి పెట్టారో కూడా ఆమెకు తెలిసేది కాదు.

కాటూరి నుండి వస్తూ పోతూ ఉండే ఆమె అమ్మమ్మ ఆమెని పౌరాణిక, జానపద సినిమాలకు తీసుకువెళ్ళేది. “భక్త ప్రహ్లాద” , “జయసింహ”, “అగ్గిరాముడు” లాటి సినిమాలు చూసేవారు. అణా పెట్టి, తప్పకుండా పాటలపుస్తకాలు కొనిపించుకునేది మనవరాలు. సువర్ణసుందరి సినిమా మన పెళ్ళికూతురి అమ్మమ్మకు ఇష్టం. ఆ సినిమాలో ఒక సీనులో నాగేశ్వరరావు, అంజలీ దేవి, “హాయి హాయిగా ఆమని సాగె” అని పాట పాడుతూ ఒక పెద్ద తామరపువ్వులోకి వెళ్ళిపోతారు. ఆ పువ్వు మూసుకుపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ – “వామ్మో! అప్పుడే, అప్పుడే ఆమెకు గర్భిణీ వచ్చింది “- అని తనలో తనే అనుకుంటే విన్న మనవరాలు చిప్సు తినడం ఆపేసి, – ‘గర్భిణీ! ఇదేంతో గజ్జి, తామర లాగా ఉంది. ఎప్పుడూ తామరపువ్వులోకి వెళ్ళకూడదు.’ – అని ఒళ్ళు జలదరించగా తీర్మానించుకుంది. ఆమెకు అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. కాని ఆమె గర్భిణీ, గొబ్బిరి, లాటి వికృతపు మాటలు అన్నప్పుడు మాత్రం ఇష్టంగా ఉండేది కాదు.

అలాటి పిల్లకు, వాళ్ళ నాన్న ఆ వేసవి సెలవుల్లో అకస్మాత్తుగా పెళ్ళి చేసేశాడు. అంతకు కొన్నాళ్ళకు ముందే కాలేజీలో ఫైనలు పరీక్షలు రాసి అలిసిపోయి ఉంది. ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి లేకుండా ఈ పెళ్ళికొడుకేమో రోజూ వస్తున్నాడు. ఇదొక గండం ఐపోయింది. ఏమిటి ఇతనికి తన ఇంట్లో పని? ఏం అర్థం కాలేదు పెళ్ళికూతురికి.

రావటమయితే ఈ కొత్త వ్యక్తి తన కోసమే వస్తున్నాడు. వస్తూ, ఏవో చీరలో, పళ్ళో, పలహరాలో తెస్తున్నాడు. కానీ వాళ్ళింట్లో వర్ధిల్లే సోషలిజం గుర్తించినట్లున్నాడు. తనకోసం ఓ చీర తెస్తే తన ఈడు ఆడపిల్లలందరికీ తేవటం. బుట్టల్లో మామిడికాయలూ, ముంజెలూ తెప్పించటం. తనొక్కదానినే తీసుకు వెళ్ళకుండా బావమరుదుల్ని, మరదళ్ళను అందర్నీ పొలోమని తన కారులో ఎక్కించుకుని ఓ సారి ఉండవల్లి అనీ, ఓసారి కనక దుర్గ గుడి అనీ, ఓ సారి మంగళగిరి అనీ, ఒకసారి కృష్ణా బేరేజి అనీ తిప్పటంతో పెళ్ళి కూతురికి కొంత రిలీఫ్ వచ్చింది. అంతా తనే ఈ అబ్బాయిని ఎంటర్‌టెయిను చెయ్యక్కరలేదు. ఐనా రోజూ మంచి చీరలు కట్టుకోవలసి రావటం, అతను వచ్చినప్పుడల్లా తన పుస్తక పఠన ధ్యానభంగం చేసుకుని, లేచి వచ్చి, అతని దగ్గర కూర్చోవాల్సి రావటం కొంచెం చిరాకు గానే ఉంది. అయినా పర్లేదు, మధ్యలో అప్పుడప్పుడూ రాజకుమారి టాకీసులో తెలుగు, హిందీ సినిమాలు, కొత్తగా కట్టిన నవ్రంగ్ లో ఇంగ్లీషు సినిమాలు. కొన్ని మధ్యాహ్నాలు వాళ్ళ నాన్నగారి మంచం మీద కూర్చుని అందరూ పేకాటలు. నాట్ టూ బేడ్.

వేసవి అలా గడిచిపోతున్నది. ఒక రోజు అందర్నీ చూసిపోటానికి మళ్ళీ కాటూరు నుండి ఆమె అమ్మమ్మా, తాతా వచ్చారు. ఆమెకు ఇష్టమని ఆ తాత బైటినుండి పకోడీల పొట్లాలు తెచ్చిచ్చాడు. అవి తింటూ, “తాతయ్యా! నన్ను ఏ కాలేజీకి పంపించేదీ ఇంకా ఏం మాట్లాడటల్లేదు. ఎందుకనో” అని దిగులుగా చెప్పింది. ఆయన నవ్వి, “నీకు చదువు కోవాల్సిన పనేంటమ్మా, నువ్వింక ఉద్యోగాలు చెయ్యాలా ఏమన్నానా, కలవారి కోడలు కలికి కామాక్షివి.” అన్నాడు. “చదివినంత చదువుకున్నావు. మంచి మొగుడొచ్చాడు. ఇంకేంటి?” అని ఆమె మాటలు ఏం పట్టించుకోలేదు.

పెళ్ళికూతురికి తనను గురించి మనసులో సన్నటి దిగులు ప్రారంభమయ్యింది. ఏమిటి? ఎందుకో జీవితం అకస్మాత్తుగా ముగిసిపోయినట్లుగా ఉంది. ఎందుకు? ఇకమీద తను ఏం చేస్తుంది? ఏమీ సరిగా అర్ధం కావటం లేదు.


ఇలా ఉండగా, వాళ్ళమ్మా , పక్కింటి పిన్నిగారు గోడమీదుగా చేసే మంతనాలు ఆమె చెవిని పడినయ్. పక్కింటి పిన్నిగారంటే పెళ్ళి కూతురికి చచ్చేంత మంట. ఆమెకి ఎప్పుడూ పెళ్ళిళ్ళూ, ఆడా, మగా గొడవలూ. ఆమెతో మాట్లాడాక వాళ్ళమ్మా మేనత్తా ఎప్పుడూ కొంగులు అడ్డం పెట్టుకుని ఒకటే నవ్వుకోవటాలూ. ఆ రోజు వాళ్ళు తనను గురించే మాట్లాడుకుంటున్నారని ఆమెకు సందేహంగా ఉంది.

“ఏమిటి సుమతీ! అమ్మాయి అక్కర ఐపోయిందా. మాకు మిఠాయీ ఏం పంచలేదు? చేశారా లేదా?”

“లేదండి పిన్నిగారు.”

“అదేంటమ్మాయ్! పెళ్ళయ్యి నెలలు గడిచిపోటంలా?”

“అవునుగానండి, వియ్యపురాలు వాళ్ళమ్మా బదరీలో ఏవో స్తూపాలు వేయించటానికని వెళ్ళారట. వాళ్ళు జియ్యరు స్వామి భక్తులు . ఆయన ఆజ్ఞ లేందే వాళ్ళూ ఏ పనీ చెయ్యరండి. వాళ్ళు అడిగితే మాదేముంది?”

“ఆ, అన్నీ ఉట్టి మాటలు. అమ్మాయికి శోభనం చేస్తే, నువ్వూ డాక్టరూ ముప్పయ్యేళ్ళ ఈడు లోనే అమ్మమ్మా తాతా ఐపోతారూ? మిమ్మల్ని ముసలి వాళ్ళంటారనిలే, నాకు తెలియదా?”

ఇక ఆ తరువాతి సంభాషణ వినకుండా లోనికి వెళ్ళి పోయినా, పెళ్ళి కూతురికి గుండెలో పోటు మొదలయింది. ఒక పక్కన ఇంట్లో పల్లెటూరి చుట్టాల గోలా, ఒక పక్కన రోజూ క్రమం తప్పకుండా వచ్చే పెళ్ళి కొడుకు. ఎందుకు వస్తున్నాడితను? రోజూ షోకు చొక్కాలూ పేంట్లూ, షోకు చెప్పులూ, కార్లు, స్కూటర్లు వేసుకు ఈ ఇంటి చుట్టూ తిరగటం. ఏం పనిలేదా ఇతనికి. ఆమెకి అతనంటే ఒకలాటి వెగటు కలిగింది. ఆమె తండ్రి ఇంటి దగ్గరే ఉండడు. వారాలు వారాలు, చింతపిక్కల క్లబ్బులోనో, మాడపాటి క్లబ్బులోనో నివాసం. అక్కడికే భోజనాలు కేరియర్ కట్టి పంపిస్తారు. మరి ఈ పెళ్ళికొడుకు క్లబ్బుకు పోడా ఏమిటి? అతను వచ్చినప్పుడల్లా ఆమె ఎదురుగా కూర్చోవలసి రావటం, అతనికి పలహారాలు తీసుకు రావటం. పైగా, రోజూ ఏదో ఒక కొత్త షిఫాన్‌చీరో, పట్టుచీరో కట్టుకుని ఉండాల్సి రావటం, రెండు జడలు మానేసి ఒక్క జడ వేసుకోటం ఆమెకు ఏం బాగా లేదు. రోజు రోజూ ఈ పట్టు చీరల గోలేంటి? ఈ ఎండల్లో ఏదో కాటన్ చీర కట్టి, ఏ కిటికీలోనో కూర్చుని చదువుకుంటూ కాలం గడపడానికి లేకుండా ఈ వడగాల్పుల్లో ఇతడెందుకు?

ఆమె కొన్నాళ్ళు చూసి చూసి, విసుగెత్తి, అతడొస్తే లేచి వెళ్ళిపోయి, వాళ్ళ నాన్న గారి గదిలోకెళ్ళి కూర్చోవటం మొదలెట్టింది. ఆయన పడుకుని కాలు మీద కాలు ఊగించుకుంటూ, బ్రిడ్జ్ పుస్తకాలు చదువుకుంటున్నవాడు, అది ఆపేసి, ఆమెను పక్కలో కూర్చోపెట్టుకుని, ఆమెకు ఆ అబ్బాయి మంచితనం గురించి చెప్పటం ప్రారంభించేవాడు. అతనికి తనలాగా, సిగరెట్లు, తాగుడు, ఇలాంటి చెడ్డ అలవాట్లు ఏం లేవనీ, చాలా మంచి మనసనీ, ఇల్లూ వాకిలీ, బాగా శ్రద్ధ తీసుకుంటాడనీ, పిల్లా పెద్దా అందరంటే ప్రేమగా ఉంటాడనీ, అచ్చంగా రాముడనీ , ఇలా. కానీ, ఆమె “ఈ వేసవయ్యాక ఏ కాలేజీలో చదవాలీ?” అంటే దాట వేస్తున్నాడు. అప్పటి వరకూ చదువో చదువు అని గోల. ఇప్పుడు చదువును గురించిన మాటలే లేవు. ఆమెకి అంతా అయోమయంగా ఉంది. అందుకని ఆమె ఉక్రోషంతో,

అమ్మా నాన్నా వెడతారు గుడికి,
చెల్లీ తమ్ముడూ వెడతారు బడికి
నేను మాత్రం పక్క మీద పడి
తిరుగుతాను ఎడమనుండి కుడికి

ఇలా పద్యాలు చిన్న చిన్న కాగితాల మీద రాసి తండ్రి పక్క మీద పడేసేది. లేకపోతే, ఆయన చదువుతున్న పుస్తకంలో అక్కడక్కడ ఆమెకు పరిస్థితులు బాగా లేవని, చాలా చిక్కుల్లో ఉన్నదనీ, కాపాడమనీ, ఇలా అర్థం వచ్చే సన్నివేశాలూ, పేరాలూ, అండర్లైను చేసి వదిలేసేది.

ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఆమెకు కొత్త ఉడ్‌హవుసు పుస్తకాలు తెచ్చి ఇచ్చారు. కూర్చోమని ప్రేమగా పక్కన కూర్చోపెట్టుకున్నారు. గ్లాసులో కొంచెం బీరు వంపుకున్నారు. అది రేడియో గ్రాం మీద పెట్టుకుని – ఆమెకు బోధ మొదలు పెట్టారు. అప్పుడు ఆమెకు హాయిగా అనిపించింది. ఆయన మధ్య మధ్య తల నిమరటం , వింటున్నావా పెద్దతల్లీ! అనటం- అమ్మయ్య! ఇదీ తన మామూలు ప్రపంచం. ఎక్కడకీ పోలేదు. ఇక్కడే ఉంది . ఇంకా నయం. ఆమె సంతోషంగా పుస్తకాలు చేతిలో తిప్పుతూ, మధ్యలో వాళ్ళ నాన్న ముఖంలోకి భక్తిగా చూస్తూ ఉంటే, ఆయన చెప్పుకు పోతున్నాడు.

“బాగా చదువుకోవాలి అని నేను చెప్పిన మాట కొంత నిజమే ననుకో. కానీ అంతా నిజం కాదు. జీవితం అంటే పుస్తకాలు మాత్రమే కాదు. పెళ్ళి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. సీతారాముల్లాగ ఉండాలి భార్యా భర్తలు.” ఆమె పరధ్యాసగా వింటూ, మధ్యలో, తెచ్చిన పుస్తకాల్లో – బెర్ట్రమ్ ఊస్టర్, ఉన్న కధలెన్నో, ఆంట్ అగథా, ఫ్రెడ్డీ, లార్డ్ ఎమ్స్ వర్త్ ఎన్నిటిలో ఉన్నారో, బింగో లిటిల్ ఏ కథలోనైనా ఉన్నాడో లేడో తనిఖీ చేస్తూంది. ” మీ అత్తా మావలు మంచివాళ్ళే. నిన్ను గారాంగా చూస్తారు. మీ అత్తగారికి కొద్దిగా మతం, పూజలు వెర్రి ఉందనుకో. అవి నిన్నేం చెయ్యవు. నువ్వు పట్టించుకోకు. నే చూస్తున్నా. నీ ప్రవర్తన సరిగా లేదు. మీ ఆయన వచ్చినప్పుడు నువ్వు లేచి నుంచోవాలి. అది మర్యాద. అతనికి ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆయన ఏం అడిగితే అవి నువ్వు చేస్తే, నీకు ఏం కావాలంటే అవి అన్నీ ఆయన ఇస్తాడు. అతను ఎలా అంటే అలా నడుచుకో. భార్యా భర్తా కలిసినప్పుడు మొదట్లో స్త్రీకి చాలా కష్టం గా ఉంటుంది. కానీ తర్వాత తర్వాత అంతా సుఖమే. ఆ సుఖం వర్ణించి చెప్పేది కాదు. ప్రతి ఆడా, మగా అనుభవించి చూడాల్సిందే. జీవితంలో చాలా ముఖ్యమైన సుఖాల్లో …”

ఏదో చెప్పుకు పోతున్నాడు . ఆమె కథలాగా వింటున్నది. ఆమెకు చిన్నప్పుడి నించి అలవాటే. నాన్న క్లబ్బు నుండి ఆలస్యంగా ఇంటికి వచ్చి, అప్పటికే డోసు ఎక్కువైతే, విరుగుడుగా మరో డోసు వేసుకుని, నిద్ర పోయే ఆమెను లేపి కథలు వినిపించటం.

ఆ రోజు, పెళ్ళికొడుకు మీది పాఠం చెప్పిన మరుసటి రోజు ఇంట్లో తండ్రి కనపడలేదు. ఎందుకో తెలియదు కానీ, తన మీద ఏదో తెలియని కుతంత్రం జరుగుతున్నట్లు ఆమె మనసుకు అనిపించింది. ఎవరిని మాట్లాడించబోయినా, తప్పుకు తిరుగుతున్నారు. ఇంట్లో వాళ్ళకు ఆమె అంటే కొంచెం భయం. ఆమె చదివే విషయాలూ, మాట్లాడేవీ, వాళ్ళకేమీ అర్థం కావు. వాళ్ళకు తెలిసిన విషయాలేవీ మాట్లాడదయ్యె. వాళ్ళమ్మ ఒకటి రెండు సార్లు ఎదురు పడినా తన కూతురినే ఏదో కొత్త పిల్లను చూసినట్లు , ఉలిక్కిపడి చూసి, అటూ, ఇటూ వెళ్ళి పోయింది. ఇంకోసారి, పక్కింటి గోడమీదుగా ఆ పిన్నిగారితో , సత్యనారాయణ వ్రతాలూ, మంగళగౌరీ వ్రతం పట్టించటాలూ, ఇలాంటి వెర్రి మొర్రి సంభాషణలేవో చెవిన పడి, పెళ్ళికూతురే మేడ మెట్ల మీదనుండి లేచి పోయింది.

ఎందుకనో రోజూ వచ్చే పెళ్ళికొడుకు ఆరోజు రాలేదు. ఆమె “అమ్మయ్య! ఇవాళ సెలవు” అనుకుని, అన్నిటికన్నా లావాటి “వేయి పడగలు” పుస్తం పుచ్చుకుని సమాధిలోకి వెళ్ళిపోయింది.

సాయంత్రం అయ్యింది. ఇంట్లో దీపాలు వెలిగాయి. కొంచెం కొంచెంగా కృష్ణ గాలులు తిరిగాయి. వరండాలో పెళ్ళికూతురి ఆడ , మగ కజిన్లు, మల్లెపూలు గుట్టలుగా పోసుకుని దండలు గుచ్చుతున్నారు. నవ్వుకుంటూ అందరూ స్కూలు, కాలేజీ పంతుళ్ళ మీద కులాసా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆశ్చర్యం! పెళ్ళి కొడుకు తన హెరాల్డు కారు వేసుకు దిగాడు.

“చీకట్లో ఇప్పుడా. ఆ రోజు సినిమా ప్రోగ్రాము ఏమీ లేదే. మెట్లెక్కి వరండాలోకి వచ్చాడు, కారు తాళాలు తిప్పుకుంటూ. అదేంటి? సోగ్గాడు, తెల్ల సిల్కు చొక్కా, తెల్ల పైజమా వేసుకు వచ్చాడు. ఎందుకో గాని, మెల్లి మెల్లిగా మిగతా వాళ్ళంతా లోపలికి పారిపోయారు. ఎవరికి తప్పినా ఆమెకు తప్పదు కదా! ఏముంటుంది ఇతనితో మాట్లాడటానికి? ఇంకా నయం తిరుచూర్ణం పెట్టుకుని రాలేదు. అంతమటుకి రక్షించాడు” అనుకుంది ఆమె. ఆమెకు పెళ్ళయ్యాక జరిగిన ఒక సంఘటన చటుక్కున గుర్తు వచ్చింది.

ఒకరోజున ఆమె స్నేహితురాళ్ళు ఆమెను బలవంతం చేసి, “మీ పెళ్ళప్పుడు, మేమాయనతో సరిగా మాట్లాడలేదు. ఇవ్వాళ వాళ్ళింటికి వెళ్ళి వద్దాం. మన స్వర్ణ కారు తెచ్చింది. ఆమె ఆయన చుట్టమేగా. వెళ్దాం. వెళ్దాం” అన్నారు. అంటే ఆమెకు ఠారు పుట్టి, “ఆయన ఊళ్ళో లేడు, మెడ్రాసు వెళ్ళాడు” అని చెప్పింది. స్వర్ణ, “లేదు, లేదు. అన్నయ్య వచ్చాడు. నాకు తెలుసు.” అంది. “పద, పద” అని తనను తొందరించి తనను వాళ్ళింటికి లాక్కెడితే , అందరూ హాల్లొ కూర్చుని ఉండగా, వాళ్ళ అత్తగారు వచ్చి విషయం తెలుసుకుని, నవ్వుకుని, ఆమె లోపలికి వెళ్ళిపోయి వాళ్ళకు ఫలహారాలు పంపించింది. కొంత సేపటికి, లోపల్నుంచి ఒక బోడిగుండతను వచ్చాడు. ఆమె ” ఏయ్! వెళ్ళి మీ అయ్యగార్ని పిలుచుకు రా” అంది.

అతను ఇంకా దగ్గరగా వస్తూ – “ఏ అయ్యగార్ని?” అన్నాడు.

ఆమె స్నేహితురాళ్ళంతా , అటూ ఇటూ తిరిగి, నవ్వు దాచుకోలేక పడి, పడి నవ్వారు. ఆమెకు చాలా చిన్నతనమనిపించింది. ఆ క్షణంలో, ఆమెకు ఆ అందవికారపు మనిషిని తన మొగుడుగా తన స్నేహితురాళ్ళు చూసే సరికి, ఆమెకి భూమి చీలి సీతాదేవిలా తనను మింగేస్తే బాగుండనుకుంది. అతనంటే చెప్పలేని అసహ్యం జనించింది.

“ఎవ్వడైనా మతి ఉన్నమగాడు గుండు కొట్టించుకుంటాడా!” అనుకుంది. “అబ్బ! ఆ దేవదేవి, ఉండి ఉండీ ఆ బోడిగుండు విప్రనారాయణని ఎందుకు ప్రేమించిందో, ఆ వరూధుని, ఆ పిలక ప్రవరుడిని ఎలా ప్రేమించిందో? ఆ ఆడవాళ్ళ దివ్య సౌందర్యాలెక్కడ, ఆ దిక్కుమాలిన మగవాళ్ళ వికారపు ఆకారాలెక్కడ?” అనుకుంది.

తనేమో పుస్తకాల్లో నారాయణరావునీ, గోన గన్నారెడ్డినీ, డార్సీనీ, సినిమాల్లో ఓమర్ షరీఫు, పీటర్ ఓటూల్నీ ప్రేమించినదాయె! ఇటు నిజ జీవితంలో తన తండ్రి గ్రెగరీ పెక్, రాక్ హడ్సన్ కీ అన్నో తమ్ముడో లాగా ఉంటాడు. మరి ఈ జియ్యరు స్వామి భక్తుడు తనకి భర్తగా ఎందుకు దొరికినట్లు! అతనేమో ఈ భావాలకు అతీతుడనుకుంటా. ఆ బోడి గుండుతోనే నాన్నగారింటికి కూడా వచ్చేవాడు. అతనికి మళ్ళీ నెత్తి మీద జుట్టు వచ్చేదాకా యమగండమై పోయింది. ఏమైతేనేం? ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ ఒత్తుగా జుట్టు వచ్చింది. ఇంట్లో వాళ్ళూ ఆ చాటుకీ ఈ చాటుకీ వెళ్ళీ నవ్వుకోటం ఆపేశారు.

అలాటి ఆ ప్రవరుడు, ఇప్పుడు సిల్కు బట్టలు సింగారించి రాత్రిపూట దిగబడడం పెళ్ళికూతురికి ఏం నచ్చలేదు. కాసేపు ఏదో అర్థం పర్థం లేని మాటలు నాలుగు మాట్లాడి లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సందులో ఒక నవ్వారు మంచమ్మీద పడి నిద్రపోయింది.

అర్థరాత్రి, కుక్కలూ నక్కలూ కూసేవేళ, బెజవాడలో ఇళ్ళల్లో దొంగలు పడేవేళ, ఆమెను ఆమె తల్లి వచ్చి లేపింది.

ఆమె ఉలిక్కి పడి, అలవాటు ప్రకారం కళ్ళింతగా లేచింది, అయోమయంగా, “నాన్నగారు రామాయణం చెబుదామనుకుంటున్నారా? రాముడూ, సీతా అడవికి వెళ్ళారా” అంటూ… ఆమె తండ్రి ఎంత రాత్రివేళ వచ్చినా నిద్రలోంచి లేచి, ఎన్ని గంటలు సోది చెప్పినా ఊకొడుతూ వినేది.

ఆ రాత్రి తీరా చూస్తే లేపింది తల్లి.

“ఏమిటి లేపావ్!” అంది విసుగ్గా.

“అమ్మా! ఈ సందులో పడుకున్నావే! లేచి వెళ్ళీ, లోపల పడుకో!”

“ఎందుకు? ఇక్కడ బాగానే ఉంది”

“అమ్మా! అబ్బాయి నీకోసం ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు.. ”

పెళ్ళి కూతురికి ఒక్కసారి మత్తు వదిలింది.

“ఏ అబ్బాయి!?”

“ఏ అబ్బాయేంటి? అదేంటే అట్లా అడుగుతావు. సాయంత్రం వచ్చాడుగా అల్లుడుగారు.”

పెళ్ళి కూతురు మత్తు పూర్తిగా వదిలింది.

“ఇంకా వెళ్ళలా వాళ్ళింటికి? ”

తల్లికి సిగ్గుగా ఉంది. ఈ కూతురికి ఆమె ఎప్పుడూ ఏమీ చెప్పి ఎరగదు. అన్నిటికీ ‘మీ నాన్న నడుగు’ మంత్రమే వచ్చు ఆమెకు. “వెళ్ళమ్మా .వెళ్ళు. లోపలికి వెళ్ళి పడుకో. బాగుండదు. ఇప్పటికే ఆలస్యం ఐపోయింది. బాగా నిద్ర పోతున్నావని లేపలా” అంది. పెళ్ళికూతురికి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది. అప్పుడు అర్ధమయ్యింది. ఆమెకు తెలియకుండా, ఆమెకు సంబంధించిన విషయంలో ఎవరి మధ్యనో, ఏదో ఏర్పాటు జరిగిపోయింది. ఇందులో, ఈ కుతంత్రంలో, అమ్మా, నాన్నలూ, పక్కింటి వెకిలి పిన్నీ, తన మేనత్త, ఇంట్లో ఇంకా దిగబడిన చుట్టాలూ ఎందరో ఉన్నారు. తను మాత్రం లేదు.

ఏమిటి ఈ దాష్టీకం? తన మీదే? ఇన్ని చదువులు చదివిన తనమీదే? వీళ్ళల్లో ఒక్కళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కరు చదవగలరా ? ఒక్కళ్ళకు తెలుసా తనకు తెలిసిన విషయాలు? ఏమిటి వీళ్ళు తనకు చెప్పేది? ఎవరిచ్చారీ అధికారం ఈ మూర్ఖులకు?

ఆమె కళ్ళమ్మట బొటబొటా నీళ్ళూ కారిపోయాయి . తనకు పెళ్ళి ఐపోయింది. ఇంక వీళ్ళ పెత్తనం ఏమిటీ, అతనూ, తనూ చూసుకోలేరూ తమ విషయాలు?

‘ఏమిటిది చిన్నపిల్లలా? అతనంటే నీకిష్టమేగా. ఏమనుకుంటారు, నువ్వు గదిలోకి వెళ్ళక పోతే. ఇంట్లో ఇంకా చుట్టాలున్నారు. వాళ్ళు వింటారు. వాళ్ళింట్లో వాళ్ళకి అబ్బాయి వెళ్ళి చెబితే? ఎవరికి తెలిసినా ఎంత అప్రతిష్ట. నలుగురూ నవ్వరూ. రేపొద్దున ఊళ్ళో మొహం ఎత్తలేం” అంది ఆమె తల్లి.

అసలు వాళ్ళమ్మ ఏనాడూ ఏం మాట్లాడుతుందో పెళ్ళి కూతురికి అర్థం కాదు. అసలు తల్లి భాషే అర్థం కాదు. తను తన మొగుడి గదిలోకి వెళ్ళడానికీ, వెళ్ళక పోవటానికీ, ఇంట్లో చుట్టాలకీ, బైటి ప్రపంచంలో తమని ఎరగనే ఎరగని వాళ్ళకీ ఏం సంబంధమో ఆమెకేమీ అర్థం కాలేదు. వాళ్ళమ్మ వెర్రిదా? మనిషా? కాదా?

ఆమె తల్లి “చీర మార్చుకో” అని చేతిలో ఒక సాదా చీర పెట్టబోయింది. పెళ్ళి కూతురు ఆమె చెయ్యి తోసి పారేసి, మళ్ళీ కళ్ళనీళ్ళు కార్చసాగింది. తల్లి చీర చేతిలొ పెట్టబొతుందీ, ఆమె తోసేస్తుందీ…ఏడుస్తుందీ.. “ఛీ! అశుభం, ఏడవకు”, అని తల్లి చీర చేతిలో పెట్టబోతుందీ..

ఇంతలోకి ఆమె మేనత్త వచ్చింది రంగం లోకి. ఆమె కళ్ళు పత్తికాయలంత చేసి, ఆమెను జడిపించటానికి హుంకరించింది. “లేచి ముఖం కడుక్కుని, ఈ చీర కట్టుకో. ఈ చీరే కట్టుకోవాలి. రేపు ఈ చీర చాకలిదానికివ్వాలి. దానికి నచ్చిందే పట్టుకొచ్చాం. రేపివ్వకపోతే, అది మర్నాడు రాదు.”

పెళ్ళికూతురు ఆ దారుణపు మోటు మాటలకు నిర్ఘాంత పోయింది. ఆమె మాటలు మానేసింది. కళ్ళమ్మట ధారలుగా నీళ్ళు కారిపోతున్నాయి.

“మీ నాన్న గారాం మరీ ఎక్కువయ్యింది. ఐనా ఏమిటికి ఈ నాటకం. పెళ్ళి అని చెప్పగానే ఎగిరి గంతేసి చేసుకున్నావుగా. ఇప్పుడు నంగనాచిలా ఈ ఏడుపు ఎందుకు? నీ ఈడుకు మేము ఇద్దరు పిల్ల తల్లులం, నువ్వేమన్నా దిగివచ్చాననుకుంటున్నావా?”

పెళ్ళి కూతురు తన మేనత్త గుడ్లు పీకి పక్కన పెడదామనుకుంది. పక్కనే గొడ్ల పాక చూరునుంచి ఒక కర్ర పీకి అమ్మనీ, అత్తనీ – ఇద్దరినీ వాయిద్దామనుకుంది. ఒక ఉతుకు ఉతుకుదామనుకుంది.

మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చి, “మా నాన్నగారేరీ, మా నాన్న గారిని పిలవండి.” అంది.

“నీ వేషాలు తెలిసే మీ నాన్న, మెడ్రాసెళ్ళి పోయాడు, లేడు, మీ నాన్న. రాడు.” అంది మేనత్త వెటకారంగానూ, చేతులు తిప్పుకుంటూనూ.

పక్కన గొడ్ల పాకలో గొడ్లు కూడా ఆశాంతిగా కదలటం మొదలెట్టాయి. వాటి గొంతులోనే అదిమి పెట్టిన అరుపులు ఆ రాత్రిపూట వికృతంగా వినవచ్చాయి. వాటి కదలికకు రొచ్చు వాసనలు లేచి పెళ్ళి కూతురి ముక్కుకు తగిలి, ఆమెకు ఇంకా జుగుప్స కలిగింది.

ఈ గుసగుసలు, గొడ్ల కదలికలకు లేచిన, ఆమె కంటే పెద్దైన ఆమె పెదనాన్న కొడుకు దగ్గరగా వచ్చి నుంచున్నాడు. అతనికి అంతా నిమిషాల మీద అర్థం అయ్యింది. పాపం, ఆ పిల్ల పెద్దమనిషి అయ్యినప్పుడు కూడా, ఇదే తంతు. అతను వెళ్ళి ఆకులు తీసుకు రావాలీ, ఆమె ఆ ఆకుల మీద పరిచిన ఆ దుప్పటి మీద, వచ్చే పోయే వారందరికీ తెలిసేట్లు, ఆ ఆకుల మీద కూర్చోవాలీ. అప్పుడు కూడా ఇదే తంతు. ఇదే దుఃఖం. అతనికి తెలుసు. ఆమె భౌతికంగా ఈ ఇంట్లో ఉంటుంది. ప్రతి నిమిషం ఒకరి నంటుకుని ఒకరు తిరుగుతూ, ఒకరిని ఒకరు కారాడుకుని, ఒకళ్ళకొకళ్ళు ఆచారాలు, కట్టడులు సంకెళ్ళు వేసుకునే ఆ ఇంటిలోని వారికి, అన్ని పుస్తకాలు చదివిన ఆమె స్వేచ్ఛాత్మ అర్థంకాదు. ఆమె ఎందుకు ఏడుస్తున్నదీ వారికి తెలియదు. ఆమె ఏడుపు అతను చూడలేకపోయాడు.

అతను ఆమె తల్లినీ, మేనత్తనీ పక్కకు వెళ్ళమని , ఆమె దగ్గర వచ్చి కూర్చుని, “ఏమిటి చెల్లీ? ఏం పర్వాలేదు. వెళ్ళు.” అన్నాడు. ఆమె అతని భుజాలమీద పడి గుండెలు అవిసిపోయేలా, అవమానంతో, తన జీవితం మీద వేరే వాళ్ళు చేసే అదుపు వల్ల కలిగిన అసహ్యంతో, ఒళ్ళంతా కదిలి పోయేలా ఏడ్చింది.

తను పెళ్ళి తన కోసం చేసుకుందా! తండ్రి వచ్చి, “అమ్మా, నువ్వు వాళ్ళబ్బాయిని చేసుకుంటావు, అని నేను వాళ్ళకు మాటిచ్చాను,” అని చెబితే “అలా ఎందుకు చేశారు?” అని ఆయన్ను కోప్పడి, తండ్రి మాట నిలపటం కోసం తను ఈ పెళ్ళి చేసుకుంది. ఇప్పుడు ఇంత విశ్వాసం లేకుండా, తను పెళ్ళి కోసం ఎగబడి చేసుకుందనీ, పిచ్చి మాటలు, తనమీద ఈ అర్థరాత్రి ఈ దాడీ, ఈ బలవంతం. ఛీ! వీళ్ళ ముఖం చూడకూడదు, అనుకుని , ఆమె తన అన్న చేతిలోంచి చీర ఊడలాక్కుని, అతని వంక, ఎవరి వంక చూడకుండా చరచర లోపలికి వెళ్ళిపోయింది.

కుములుతూ, చీర మార్చుకుంటున్న ఆమెకు, తను చేసుకున్న వాడి మంచితనం గుర్తొచ్చింది. ఈ గొడ్లు. వీరి కన్నా అతడే నయం. అనుకుని గదిలోకి వెళ్ళి చూస్తే అక్కడ రెండు మంచాలు. తండ్రి మంచం మీద అతడు పవ్వళించి ఉన్నాడు. మళ్ళీ ఆమెకు కోపం పొంగి వచ్చింది.

“అబ్బో! ధనవంతుడన్నారు. తన ఇంటికి కూడా తీసుకు పోలేడు పెళ్ళాన్ని? ఇలా మా నాన్న ఇల్లు పట్టుకు ఎందుకు వేళ్ళాట్టం. సోంబేరి. వాళ్ళమ్మ చెబితే పూజ, గీజ చేసుకుని వచ్చి పడుకున్నట్టున్నాడు” అనుకుని ఆ చిన్న మంచం మీద గోడ వైపు తిరిగి పడుకుని ఆలోచించుకోసాగింది.

పక్క మంచం మీది కదలికలు మొదలయ్యాయి. అతనికి నిద్ర పట్టటం లేదు లాగుంది. చేపలా కొట్టుకుంటున్నాడు. అటు తిరుగుతాడు. ఇటు తిరుగుతాడు? మధ్యలో నిట్టూర్పులా అవి? ఆమె గమనిస్తూంది అన్ని శబ్దాలూ. అవతలి పక్కకు తిరిగి పడుకునే “అసలెందుకు వచ్చాడు. ఎవరో ముహూర్తం పెట్టి పంపితే వచ్చాడు, పెళ్ళి కొడుకు! సిగ్గూ శరం లేవు? మగతనం లేని ఇతడా తనకు మొగుడు? ” అనుకుంది.

నిమిషాలు దొర్లిపోయి, గంటలై పోతున్నాయి. అతడు తట తటా కొట్టుకుంటున్నాడు. కొంచెంసేపటికి ఆమెకు జాలి వేసింది. పాపం అతనికి లేదా? పోదా? సొంత ఇల్లు ఉంది. ధనవంతుడు. ఇప్పుడు ఎందుకు వచ్చి వేరే వారి ఇంట్లో ఈ మంచాల మీద పడుకుని పొర్లటం. ఊళ్ళోనే ఉన్నా తను అత్తవారింటికి ఒక్కసారి వెళ్ళదు. ఎవరితో మాట్లాడదు. అతను తన కోసం రోజూ వస్తాడు. తను ఒక్క రోజు అతన్ని సౌమ్యంగా పలుకరించదు. ఇంట్లో అందరి దగ్గరా అతడిచ్చిన బహుమతులే. తనకు మాత్రం? ఎన్ని విలువైన బహుమతులిచ్చాడు! తనతో ఒక్క సారి కూడా పొల్లు మాట మాట్లాడలేదు.

ఆమె గుండె కరిగింది. తన చేతిని పక్క మంచం మీదికి సాచి అతని చేతి మీద ఉంచింది. అతడు దిగ్గున లేచి , ఆమె మంచం మీద వచ్చి కూర్చున్నాడు. ఆమె కూడా లేచి కూర్చుంది. దీపం కాంతిలో అతడు ఆమె ముఖం చూశాడు. వడిలిపోయి ఉంది. కమిలిపోయి ఉంది. కళ్ళు వాచిపోయి ఉన్నాయి.

అతడు అమెను కౌగిలించుకున్నాడు బాధతో, కరుణతో. అతని కళ్ళలో నీళ్ళు. “క్షమించాలి, మిమ్మల్ని చూడకుండా ఉండలేక రోజూ వస్తున్నా. మీ నాన్నగారు ఉండరనీ, రెండురోజులు ఇక్కడ వచ్చి తోడుగా ఉండమనీ నాకు కబురు వచ్చింది. అందుకని వచ్చాను. తీరా ఈ గదిలోకి వచ్చాక ఈ రెండో మంచం. నాకు అప్పుడు అర్థమయ్యింది. కానీ, మీరెంతకీ రాలేదు. మీకు కూడా ఏం చెప్పి ఉండరని అప్పుడు నాకు సందేహం కలిగింది. మీ అభిమానం, రోషం, సంగతి నేను విని ఉన్నాను. నాకు ఈ తతంగం విషయం ఇంతదాకా తెలియదు. మిమ్మల్ని లోపల ఏం బాధ పెడుతున్నారో అని నేనే వద్దామనుకున్నా. వచ్చే వాడినే ఇంకొంచెం ఉంటే. అయ్యో! ఏడ్చారా! నా మూలంగానా!” అన్నాడు.

అతని నిజాయితీకి ఆమె కదిలిపోయింది. ఆతని స్నేహపూరితమైన మాటలకు ఆమె కరిగిపోయింది. ఆమె పెదాలపై నవ్వు విరిసింది.

అతడు, “మనింటికి వెళ్ళిపోదామా? నా కారు ఎలాగూ బయటే ఉంది. మీరు వస్తారని ఇంటికి రంగులు వేయించాను. కొత్త మొక్కలు పెట్టించాను. ఇంకా ఎక్కువ నౌకర్లను పెట్టాను. వంటవాడు ఎలాగూ ఉన్నాడు. మీకేం కష్టం ఉండదు.” అన్నాడు.

ఆమె ఆశ్చర్యపోయి, “ఇప్పుడా ఈ చీకట్లోనా, మద్రాసా !” అంది.

“ఇంకా చీకటి ఎక్కడ? రాత్రి గడిచే పోయింది. తెల్లవార బోతున్నది. కొంచెం దూరం ప్రయాణం చేసి, హాయిగా టిఫినూ కాఫీ తీసుకుని, మళ్ళీ మిగతా ప్రయాణం చెయ్యొచ్చు. మధ్యలో మనిష్టమైన చోట ఆగిపోవచ్చు. డ్రైవింగు నాకు అలవాటేగా. ఎప్పుడు వెళుతూ వస్తూనే ఉన్నాగా.”

ఇద్దరూ లేచి గది బైటికి వచ్చారు.

గది బైట గుబులుతో నిద్ర పట్టని బావమరిది తచ్చాడుతున్నాడు. చెల్లెలు లోపల ఏ స్థితిలో ఉందో అని ఆదుర్దాతో. పెళ్ళికొడుకు అతన్ని చూసి నవ్వు ముఖంతో, “మీ చెల్లెలి కేం భయం లేదు లేవయ్యా. మేమిద్దరం మా ఇంటికి వెళ్ళి పోతున్నాం. ఇంట్లో వాళ్ళు లేచాక చెప్పు” అన్నాడు.

“బావగారు! బావగారు! ఇప్పుడా.” అని అతడు అంటూనే ఉన్నాడు. చుట్టాలు పక్కాలు ఎవరు లేచారో, ఎవరు విస్తుపోయారో, ఎవరు వారి దారిలో ఉన్నారో, ఏం అన్నారో, ఏం పట్టించుకోకుండా, ఆ తెలి తెలి వెలుగుల్లో అతడు ఆమెను తన తెల్ల హెరాల్డు కారెక్కించి తీసుకెళ్ళి పోయాడు.