ప్రస్తుతం తెలుగు దేశంలో మధ్య తరగతి వివేకులకి ముఖ్య వివాదాంశం తెలుగు భాష ప్రాచీనత. రెండేళ్ళ క్రితం భారత కేంద్ర ప్రభుత్వం తమిళ భాషని ప్రాచీన భాషగా గుర్తించి, ఆ భాషకు నూరు కోట్ల రూపాయలు బహూకరించింది. దాంతో తమిళానికి దీటుగా తెలుగు భాష ఎంత ప్రాచీనమైనదో రుజువు చెయ్యడానికి సాహితీ పరులు, పాత్రికేయులు, ఒకడేమిటి, రకరకాల వాళ్ళు నానా యాతనా పడుతున్నారు. కాసుచేయని సుద్దులు చెపుతున్నారు, కంఠ శోష పెడుతున్నారు. ఈ వివాదం పరమ అపహాస్యంగా తయారయ్యిందని వేరే చెప్పనవసరం లేదు.
తెలుగు భాష వేదాల కన్నా పాతదని, మనిషి పుట్టుకకు పూర్వమే పుట్టిందని వికారమైన వాదాలు మొదలయ్యాయి. “శ్రీకృష్ణుడు తెలుగువాడే,” అన్నవాదం నుంచి “అస్సిరియా నుండి ఆస్ట్రేలియా దాకా తెలుగే మాట్లాడేవారట” అనేటంత వెర్రి వాదాలు కూడా వచ్చే సూచనలు కనపడుతున్నాయి.
దీనంతటికీ కారణం, కేంద్రప్రభుత్వం. పురికొలిపి, పుల్లలు పెట్టి దేశభాషల మధ్య వైరుధ్యం కావాలనే కేంద్రప్రభుత్వం తెచ్చిపెట్టినట్టు కనపడుతూన్నది. ఒక భాష మరొక భాషకన్నా ప్రాచీనమైనది అని రుజువు చెయ్యడం భాషా శాస్త్రజ్ఞుల పరిశోధనలకి సంబంధించినది. అంతే. అంతకుమించి వేరుగా ఏమీ చెప్పనక్కర లేదు, పతకాలు, బిరుదులూ ఇవ్వనక్కర లేదు. ద్రావిడభాషలలో అతి ప్రాచీనమైన లిఖిత సాహిత్యం తమిళంలో ఉంది అని భాషాశాస్త్రజ్ఞులు చెబితే కొంపేమీ మునిగి పోదు. కానీ, ఆ ప్రాచీనతకి రూపంలో కాకుండా, రూపాయలలో విలువకట్టడం అవివేకం. కేవలం అవివేకం అనడం కన్నా, అనవసరమైన ప్రేరేపణ అనడం సబబేమో.
నూరుకోట్ల రూపాయలు తమిళ భాషకిచ్చి, మిగిలిన ద్రావిడ దేశభాషలని చులకన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ తెలివితక్కువ పనిని అవమానంగా భావించి రాజకీయాల్లోకి దించారు. ఉమ్మడిగా కేంద్రం మీద ” సాహిత్యరాజకీయ వాదుల” దాడి మొదలయ్యింది. “ఇది నూరుకోట్ల రూపాయలకోసం కాదు, భాషాభిమానంతో చేస్తున్న పని,” అని చెప్పి ఎవ్వరినీ మభ్య పెట్టలేరు. ఈ మూకుమ్మడి దాడిలో కలవని ప్రతివాడూ, విశ్వాసఘాతకుడుగా, భాషా ద్రోహిగా పరిగణించబడే ప్రమాదం లేకపోలేదు. మా బుష్షు దొర అచ్చంగా ఇలాగే అన్నాడు, ఇరాకు యుద్ధానికి వ్యతిరేకత చూపించిన ప్రతి ఒక్కడూ దేశద్రోహేనని.
మత సంబంధంగా, భాషాపరంగా ప్రాచీనతావాదం దుర్బోధలకి మూలం. ఈ దౌర్భాగ్య స్థితినుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం. కేంద్ర ప్రభుత్వం అన్ని దేశభాషలనీ సమానంగా పరిగణించి, ఆదరించి గౌరవించడం.
After all, no one vernacular is more equal than the other.