ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా

[భారతీయ సినిమాలోనే కాక, ప్రపంచ సినిమాలో అగ్రశ్రేణి దర్శకుల్లో ప్రత్యేక స్థానం బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ది. రాయ్ దాదాపు 26 సినిమాలు, 10 డాక్యుమెంటరీలకి దర్శకత్వం చెయ్యటమే కాక మరెన్నో సినిమాలకి తన సహాయం అందించాడు. ఆయన తీసిన సినిమాలు కొన్ని ఈమాట పాఠకులకు పరిచయం చేద్దామని నా ప్రయత్నం. ఈ శీర్షిక కింద, “చారులత” సినిమా ముందు పరిచయం చేస్తున్నాను. — రచయిత]

rayByNemai
సత్యజిత్ రాయ్

ప్రపంచ సినిమాలో అతి ప్రముఖుడైన బెంగాలీ సినిమా దర్శకుడు సత్యజిత్ రాయ్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సమాధానంగా,”నేను చారులత సినిమా మళ్ళీ తియ్యాల్సి వస్తే, సరిగ్గా మళ్ళీ అలాగే తీస్తాను” అన్నాడు. ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”. ఈ సినిమా కథ వదిన చారులత పాత్ర (మాధవి ముఖర్జీ), మరది అమల్ పాత్ర (సౌమిత్ర ఛటర్జీ) ల మధ్య ఉండే అభిమానం, ప్రేమ పరిధి దాటి వెళ్ళటం వల్ల కలిగే ఉద్వేగాల గురించి వివరిస్తుంది. హద్దు మీరిన అనురాగంతో చారులత పాత్ర (వదిన) పొందే అంతర్మధనం ఈ కథకు కేంద్రబిందువు.

ముఖ్య పాత్రల పరిచయం


చారులత పోస్టర్

ఈ సినిమా కథ చాలా సున్నితమైన మానవ సంబంధాలను, విలువలను ఎత్తి చూపిస్తుంది. భారతీయసంస్కృతిలో, ముఖ్యంగా కథా కాలమైన 1880 సంవత్సర ప్రాంతాల్లో బెంగాల్ రాష్ట్రంలో ఒక కుటుంబంలోని వదిన, మరదిల మధ్య ఉన్న పవిత్రమైన అనుబంధం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చారులత భర్త భూపతి పాత్ర (శైలేన్ ముఖర్జీ), ఎప్పుడూ తనకి నచ్చిన వ్యాపకమైన ప్రింటింగ్ ప్రెస్ నడపటంలో, క్షణం ఖాళీ లేకుండా ఉంటాడు. ఆ ప్రెస్‌కి అతడే యజమాని, సంపాదకుడు కూడా! తన భార్యను నిర్లక్ష్యం చెయ్యటానికి కారణం పత్రిక, దాన్ని నడపటం తప్ప, తన కాలమంతా తాగుబోతుగా లేక పచ్చి వ్యభిచారిగా తిరుగుతూ కాలం గడిపే వ్యక్తి కాదు భూపతి. స్వతహాగా తెలివైన చారులత పాత్ర, తన ఇంట్లోనే తాను బందీగా ఉండటం గమనిస్తుంది. ఈ ఒంటరితనాన్ని, రాయ్, సినిమా మొట్టమొదటి సీన్ దగ్గరనుంచి దాదాపు ఏడు నిమషాల పాటు అత్యత్భుతంగా, రకరకాలైన కేమెరా భంగిమల ద్వారా, చారులత పాత్ర ప్రవర్తనల ద్వారా నిర్ధారిస్తాడు. ఈ ఏడు నిమషాల్లో ఒక్క చిన్న సంభాషణ మాత్రమే ఉంటుంది. సినిమాలో ముందు ముందు జరగబోయే సంఘటనలకి ఈ పాత్ర పరిచయం ఈ రకంగా చూపించడంలో సినిమా కథ ఎంతగా ఈ పాత్ర వల్ల ప్రభావితం అవుతుందో తెలుసుకున్న తరవాత, రాయ్, సినిమా దర్శకత్వం మాత్రమే కాకుండా, గొప్ప స్క్రీన్ ప్లే రచయితగా అందరూ అంగీకరిస్తారు.

చారులత పాత్ర ఇలా ఒంటరితనం అనుభవిస్తున్న కాలంలో (చారులత పాత్రకి పిల్లలు లేకపోడం ఈ ఒంటరితనాన్ని తీవ్రతరం చేస్తుంది), వేసవిలో కాలేజీ శలవలకి మరిది అమల్ పాత్ర ఇంటికి రావటంతో, సినిమా కథ ముందుకు నడుస్తుంది. అమాయకంగా ఉండే అమల్ పాత్రధారి, చనువుగా వదినతో మసలటం, అమల్ పాత్రకి ఉన్న సాహిత్యపు అభిరుచులకి, పాండిత్యానికి చారులత పాత్ర సహజంగానే అమల్ పాత్ర వైపుకి ఆకర్షింపబడటం – రాయ్ చాలా తెలివిగా, వీరిద్దరి మధ్య అతి తక్కువ సంభాషణలతో, చూపిస్తాడు. చారులత పాత్రలో వచ్చే మార్పులను, ఆ మార్పులను అర్ధం చేసుకోటంలో అమల్ పాత్ర స్పందనల్ని ఈ సినిమాలో రాయ్ చాలా నేర్పుతో తీసాడు. ఈ కథలో ప్రేమ కేవలం విరిసీ విరియని మొగ్గలాంటి భావన మాత్రమే. ఇది తెలుసుకున్న మరిది తప్పు చేసిన భావనతో ఇల్లు వదలి వెళ్ళిపోతాడు. భర్త ఖిన్నుడౌతాడు.

దర్శకత్వం, నవలానుకరణ

చారులత సినిమా దర్శకుడిగా రాయ్‌ని చూస్తే, ఈ సినిమా తియ్యటంలోని ప్రతి అంశం మీద రాయ్‌కి ఎటువంటి అవగాహనతో కూడిన పూర్తి అధికారం ఉందో తెలుస్తుంది. బహుశా, జాపనీస్ సినిమా దర్శకుడు కురొసావా తీసిన “రషోమాన్” సినిమాలోని అన్ని అంశాలపై కురొసావాకి ఎటువంటి పట్టు ఉందో, అలాంటి పట్టు సంపాయించడం కోసం రాయ్ చాలా కష్టపడి, “చారులత” సినిమా ద్వారా సాధించాడు అనిపిస్తుంది. రాయ్ “చారులత” సినిమా ముందు తీసిన సినిమాలతో పోలిస్తే, సినిమా అన్న మీడియంను సంపూర్ణంగా అర్ధం చేసుకోటంలో పూర్తి విజయం “చారులత”తో సాధించాడు.

ఒక నవలను సినిమాగా రూపొందించాలంటే సినిమా దర్శకుడు ఎంతో శ్రమించాలి. నవలలో జరిగే సన్నివేశాలను చూపించడం ఒక ఎత్తైతే, ఆ పాత్రల భావాలు వెండితెరపై ప్రదర్శించ గలగడం మరొక ఎత్తు. నవలలోని కథను సినిమాగా చూపించడానికి మార్పులు, చేర్పులు అవసరం. పైగా ఆ మార్పులన్నీ నవలా రచయిత చెప్పే శైలికి అనుగుణంగా ఉండి, నవల చదివిన పాఠకుల్ని ఆ సినిమా ఒప్పించి, మెప్పించ గలగాలి. ఈ విషయం కూడా, రాయ్ అతి సమర్ధవంతంగా సాధించాడు. ఠాగోర్ నవల్లోని సంఘటనలు చాలా కాలం పాటు జరిగితే, “చారులత”లో, రాయ్ వీటిని కుదించి కథా కాలాన్ని ఒక నెలకి సరిపెట్టాడు.

“చారులత” సినిమా బాగా అర్ధం కావాలంటే, ఇంకొంచెం లోతులకి వెళ్ళి చూడాలి. ఈ సినిమాకి మూలం అయిన ఠాగోర్ బెంగాలీ నవల “నష్టనీర్” లో, వదిన – మరుదుల మధ్య పరిచయం, చాలా ఉదాత్తంగా వర్ణించాడు ఠాగోర్. నిజానికి, ఈ నవలా కథ, ఠాగోర్ స్వీయ కథే! ఠాగోర్‌కి 8, 9 ఏళ్ళ వయస్సులో, దాదాపు అంతే వయసున్న తన స్నేహితురాలు కాదంబరి దేవి, తరవాత కాలంలో ఠాగోర్‌కి నిజజీవితంలో వదిన అవుతుంది. వాళ్ళ చిన్న నాటి పరియచయంలోని స్నేహం, అది విడిపోటం వల్ల కలిగే విషాదాలు, ఠాగోర్ మనస్సు పిండేలా, “నష్టనీర్” నవల్లో వర్ణించాడు. ఈ అనుభూతుల తీవ్రత ఎంత గాఢంగా ఉంటుందో, ఈ నవల్లో స్పష్టంగా కనపడుతుంది. కొన్ని తెలియని పరిస్థితుల్లో, తరవాత కాదంబరీ దేవి ఆత్మహత్య చేసుకోటం, దాని ప్రభావం ఠాగోర్ తరవాత జీవితంలో అతి తీవ్రంగా ఉండేదని చరిత్రకారులు చెపుతారు.

సినిమా కోసం రాయ్ అసలు కథని కొన్ని మార్పులు చేసాడు. అందుకు అప్పట్లో రాయ్ చాలా విమర్శలకి గురి అయ్యాడు. మార్పులు చేసినా, నవలలోని ముఖ్యమైన విషయాలను అత్యంత కళాత్మకంగా తీయటంలో, రాయ్ విజయం సాధించాడు. “చారులత సినిమా ఎప్పుడు పూర్తి అయితే, అప్పుడే విడుదల చేస్తాను. అంతవరకు నాపై ఎటువంటి వత్తిడి తీసుకురాకండి” అని రాయ్ ఈ సినిమా నిర్మాతలతో అన్నాట్ట. దీని బట్టే తెలుస్తోంది, రాయ్ ఈ సినిమా నిర్మాణంలో ఎంత ఏకాగ్రతతో పనిచేసాడో!

సంచలనం

“చారులత” సినిమా కథ ఠాగోర్ స్వీయచరిత్రే అని ఇందాకే మనవి చేసాను కదా! రాయ్ ఈ సినిమా తీస్తున్నప్పుడు బెంగాలీ సాహిత్యాభిమానులకి, ఆర్టు సినిమా మెచ్చుకొనే వర్గాల వారు చాలా అభ్యంతరాలు లేవతీసారు. ఈ సినిమా వల్ల “విశ్వగురు” రవీంద్రనాథ్ ఠాగోర్ పేరు రచ్చకీడుస్తున్నారని వారి అభిప్రాయం. తన వదిన గారిపై ఠాగోర్ కి నిజ జీవితంలో ఏర్పడిన “నిరాకారమైన” ప్రేమ అందరికీ తెలిస్తే “గురుదేవ్” ఠాగోర్ కి అపఖ్యాతి వస్తుందనటానికి కారణాలు లేకపోలేదు. “నష్టనీర్” నవల్లోని “చారులత” పాత్రకు, ఠాగోర్ వదినగారైన కాదంబరి దేవికి ఎన్నో పోలికలున్నాయి. సరిగ్గా చేసిన రాయ్ అంచనాల ప్రకారం, నవల్లో వర్ణించిన నిరాకారమైన ప్రేమ వల్ల మగవాడి గుండెలని నమిలేసే బాధలు, ఉద్రేకాలు, క్షోభ ఠాగోర్ కి స్వానుభవాలే! కాదంబరి దేవి ప్రభావం ఎంత తీవ్రమైనదంటే, డెబ్భై ఏళ్ళ వయస్సులో, ఠాగోర్ స్వయంగా నందాలాల్ అన్న ఆర్టిష్ట్ తో ఈ విషయాన్ని చెప్పాడు. అందుకు ఋజువు ఠాగోర్ తన వృద్ధాప్యంలో వేసిన వందలాది ఛాయాచిత్రాల్లో వెంటాడుతున్నట్టు కనపడే కాదంబరి దేవి కళ్ళు.

కళాత్మక విలువలు

ఈ సినిమాలోని కథా కాలం 1880 సంవత్సరానికి తగ్గట్టు, కథకి కావలసిన సామాగ్రి, అలంకరణలు మొదలైనవి కూర్చటంలో రాయ్ అతని కళా దర్శకుడు బన్సి చంద్రగుప్త, విశేషంగా శ్రమించారు. చారులత సినిమాలో చూపించిన ఇల్లు, ఆ ఇంటిలోని వాల్‌పేపర్లు, విక్టోరియన్ అలంకరణలూ మాత్రమే కాకుండా, 1880 సంవత్సరం లోని వాతావరణం సృష్టించడానికి, ఆ కాలంలో రోడ్ల మీద వినిపించే శబ్దాలు కూడా సృష్టించారు. రాయ్ దర్శకత్వం చేసిన సినిమాలు అన్నింటిలోకి, దాదాపు పూర్తిగా ఇన్‌డోర్ సెట్లపై షూటింగ్ జరిగిన సినిమా “చారులత”. “చారులత” సినిమాకి ముందు తీసిన “పథేర్ పాంచాలి”, “అపరాజితో” వంటి పల్లెటూరు వాతావరణం ఇతివృత్తంగా ఉన్న సినిమాలు, ఆ తరవాత రాయ్ తీసిన పట్టణ ఇతివృత్త సినిమాలకన్నా “చారులత” పూర్తిగా భిన్నంగా ఉండటం గమనించ తగ్గది.


చారులత, అమల్

మేరి సెటాన్ పుస్తకం రచయిత్రి (Portrait of a Director: Satyajit Ray) తన పుస్తకంలో చారులత సినిమా పై సమీక్షలో “1964 సంవత్సరంలో వచ్చిన చారులత సినిమా కథా కాలం 1879 సంవత్సరం. నేను జనవరి 1964 సంవత్సరంలో ఒక రోజంతా ఈ సినిమా షూటింగ్ చూస్తూ గడిపాను. రాయ్ అతని పరివారం ఎంతో కష్టపడుతూ, ఓపిగ్గా 1879 సంవత్సరపు వాతావరణం సృష్టించడానికి సినిమా స్టూడియోలో చాలా కష్టపడ్డారు. ఉదాహరణకి, 1879 ప్రాంతాల్లో వీధుల్లో అరుపులు, కేకలు, శబ్దాలు ఎలా ఉండేవో పరిశోధించి, అచ్చం అలాంటి వాతావరణం సృష్టించారు. ఈ పరిశోధనల వల్ల 1870 లకి, 1960 లకి మధ్య కలకత్తా ఎంత మారిందో అని రాయ్ ఆశ్చర్య పడ్డాడు. అలాగే, ఈ సినిమా కోసం నిర్మించుకున్న ఇంటి లోపల విక్టోరియన్ వాతావరణం కోసం ఒకటిన్నర రోజులు ఇంటి గోడలకి వాల్ పేపర్లు అతికించటంతో సరిపోయింది.”

చారులత సినిమా కోసం సెట్స్ వేయడానికి, రాయ్, బన్సి కలకత్తాలో ఎన్నో ఇళ్ళు చూసారు. ముఖ్యంగా, కథా కాలానికి తగ్గట్టు, విక్టోరియన్ పద్ధతిలో కట్టిన ఇళ్ళ వేటలో పడ్డారు. రాయ్ గీసిన స్కెచ్‌లలో, సెట్ ఎలా నిర్మించాలి అన్న వివరాల ఆధారంగా బన్సి సెట్‌లు వేసాడు. ఈ స్కెచ్‌లు ఎంత వివరంగా ఉన్నాయంటే, చారులత పాత్ర గది ఎలా ఉండాలి? ఇంటిలోని నడవా ఎంత పొడుగ్గా ఉండాలి, నడవాలోంచి చారులత పాత్ర పడక గదికి తలుపులు ఎలా ఉండాలి? ఇటువంటి వివరాలన్నీ, రాయ్ బన్సికి రాసిన ఉత్తరాలతో పాటు జతపరచిన స్కెచ్‌లలో ఉండేవి!


చారులత, అమల్

ఈ సినిమాలో ఉన్న కళాత్మక విలువల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, రెండు చిన్న ఉదాహరణలతో ఈ విషయం ముగిస్తాను. “చారులత”, “అమల్” పాత్రల మధ్య వారి ఇంటి తోటలో జరిగే ఒక సన్నివేశం కళాపరంగా ప్రత్యేకం! ఇక్కడ “చారులత” పాత్ర తన గుండెలోని ప్రేమను అతిసున్నితమైన భావాలతో మొహంలో చూపిస్తున్నప్పుడు, రాయ్ ఆమె భావాలతో ఆడుకున్నట్టనిపిస్తుంది. ఉయ్యాలపై ఊగుతున్న “చారులత”తో పాటు ఊగుతున్న కేమరాతో ఆమెను గమనిస్తూనే, ఆమెలో పెల్లుబికే “కూడని” భావాలను మార్చి మార్చి క్లోజప్ షాట్‌లలో, ఉయ్యాల “అమల్”కి దగ్గరగా – దూరంగా వెళ్ళటంలో, అమల్ పాత్ర అమెలో ఎలాంటి మార్పులు తెస్తోందో చూపెట్టాడు రాయ్.

రెండవ ఉదాహరణ, వదిన – మరదుల ఇద్దరికీ ఉన్న సాహిత్యాభిలాష. “అమల్” పాత్ర రాసే కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ “చారులత” ప్రత్యేకంగా “అమల్” కోసం ఒక పుస్తకాన్ని కుట్టి అతని చేత కవిత్వం రాయిస్తుంది. ఆ కవిత్వం ఒక ప్రముఖ పత్రికలో అచ్చయితే, “చారులత” పాత్ర ఈర్ష్య పడి, పోటీగా తనూ కవిత్వం రాసి, మరొక పత్రికకి పంపిస్తే, అది కూడా అచ్చవుతుంది. ఒకరి కవిత్వం పై మరొకరు ఇష్టం చూపించటం, ఈ ప్రయత్నంలో ఒకరినొకరు కవ్వించుకోటం – రాయ్ చాలా కళాత్మకంగా తీసాడు.

చారులత పాత్ర ఒంటరితనం

చారులత పాత్ర అనుభవించే ఒంటరితనాన్ని గురించి ఠాగోర్ నవలలో చెపుతాడు. ఆ వర్ణన చాలా బాధగా ఉంటుంది. అలాగే, చారులత పాత్ర అనుభవించే మానసిక సంఘర్షణలు కూడా ఠాగోర్ అతి హృదయ విదారకంగా రాసాడు. కానీ, దాన్ని స్క్రీన్ మీద చూపించటం ఎలాగ? ఉదాహరణకి, చారులత పాత్ర, భర్తతో కలిసి కాపురం చేస్తున్నా, ఒంటరితనం అనుభవించటం, రాయ్ ఒక ఏడు నిమషాల పాటు ఎటువంటి సంగీతం లేకుండా, అప్పటి కాలానికి తగ్గట్టు సరిపడే విధంగా వీధిలోని అరుపుల బాక్‌గ్రౌండులో చూపించాడు. ఒంటరిగా, కిటికీలోనుంచి బయటకు చూస్తూ ఉంటే, బుర్ర మీసాలతో ఒక లావుపాటి వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ, ఒక చేత్తో గొడుగు, మరో చేత్తో మిఠాయిల పొట్లం తీసుకెళ్ళటం చారులత పాత్ర చూస్తుంది. వెంటనే తన గదిలోకి పరుగులాంటి నడకతో వెళ్ళి, ఆ కాలంలో బ్రిటీష్ వాళ్ళు ఆపెరాలోని నటీనటులను దగ్గరగా చూట్టానికి వాడే బైనాక్యులర్స్ తెస్తుంది. అలా, ఆమె ఒక కిటికీ నుంచి మరో కిటికీ దగ్గరకు వెడుతూ, ఒక దాని తరవాత మరొకటి చొప్పున ఐదు కిటికీల నుంచి అతన్ని చూస్తుంది. ఇంకొకచోట, కోతుల్ని ఆడించే వాణ్ణి కూడా ఇలాగే చాలాసేపు కిటికీలోంచి చూస్తుంది. రకరకాల కెమేరా కోణాల్లో చారులత పాత్ర ఒంటరితనాన్ని సృష్టించాడు రాయ్. కళా చిత్రాల్లో ఇది ఒక నూతన ప్రయోగం. అత్యంత కళాత్మకంగా, ఆ ఇల్లు, ఆ పరిసరాలు, ఆ పరిసరాలలో జరిగే వింతల తోటి, ఆమె హావభావాలలో, మాటలలో వ్యక్తపరచ లేని మమతాను బంధాలు, తపనలూ, అవమానాలు, మనసు చివుక్కుమనే వైనాలు – చాలా భాగం కెమేరాతో కథ చెప్పిస్తాడు రాయ్. అనేక క్లోజప్ కోణాల్లో ప్రధాన పాత్రల మనోభావాలకి రాయ్ అద్దం పడతాడు. భారతీయ స్త్రీలల్లో ఉండే సహజ గంభీరత్వం, పెదవి విప్పని, మనసు దాటని భావాలతో ఆ గంభీరత్వం పై అప్పుడప్పుడు ఆవరించే భావావేశం, ఇవన్నీ నటి మాధవి ముఖర్జీ ముఖ కవళికలు ప్రదర్శిస్తాయి.

మాధవి ముఖర్జీ – చారులత పాత్ర కోసం రాయ్ ఎంపిక

ఎవరో రాయ్‌ని అడిగారట. “చారు మీకు ఆదర్శ స్త్రీ మూర్తా?” అని. మరే వివరణ ఇవ్వకుందా, “అవును” అని రాయ్ సమాధానం.

మాధవిని చారులత పాత్రకి ఎన్నుకోవటంలో రాయ్‌కి ఎంతటి సూక్ష్మబుద్ధి ఉందో అర్ధం అవుతుంది. మాధవి అందాల నటి కాదు. ఆమె “సహజ నటి”. రాయ్‌లో ఒక పాత్ర గురించి నటీ నటులకి వివరంగా చెప్పగలిగే ఒక మంచి దర్శకుడిని మాధవి చూడగలిగింది. ఈ విషయం మాధవికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది. సహజనటికి ఎప్పుడైతో ఇలా ఆనందం కలిగిందో, ఆమె నటన అనితర సాధ్యం. నటనలో వాడే ఆయుధాలేమిటో? వాటిని ఎలా వాడాలో? ఆమెకు తెలుసు. అందుకనే, చారులత పాత్రలో కలిగే అంతర్ భావాలని ఆమె అతి తేలికగా తన మొహంలో చూపించ గలిగింది. ఈ సినిమాలో మాధవి మొఖం చూసినట్లయితే, ఆమె మనసులోని భావాలు ఇట్టే తెలుసుకోవచ్చు.

అయితే, మాధవితో ఒక అతి పెద్ద చిక్కు వచ్చింది! పరిష్కారం కష్టమైన సమస్య అది. మాధవి పలువరస బాగుండవు. కొన్ని ఏళ్ళుగా తాంబూలం సేవించడం వల్ల, ఆమె పళ్ళు బాగా గార పట్టి పోయాయి. ముఖ్యంగా, కింది పలు వరస మరీ దారుణంగా ఉండేది. ఎంతో నిపుణతతో ఫొటోగ్రాఫ్ తీస్తే, గార పళ్ళు కనపడకుండా జాగ్రత్త పడొచ్చు. మరి సంభాషణలు చెపుతున్నప్పుడు, పళ్ళు కనపడకుండా, షూట్ చెయ్యలేరు కదా! కెమేరా కోణాలని అతి కిందగా ఉంచి, సంభాషణల్లో ఆమె పళ్ళు కనపడకుండా జాగ్రత్త పడ్డారట.

సౌమిత్ర ఛటర్జీ, శైలేన్ ముఖర్జీ

ఎప్పట్లాగే, సౌమిత్ర తన నటనలో అత్యుత్తమ స్థాయిని చూపెట్టాడు. రాయ్, మొత్తం తీసిన 26 సినిమాల్లో, 14 సినిమాల్లో సౌమిత్ర నటించాడు. ఇతని నటనలో ప్రత్యేకం – ఉత్సాహం, వాక్చాతుర్యం, ఛలోక్తి. భూపతి పాత్రధారి శైలేన్ అప్పట్లో, బెంగాలీ రంగస్థల నటుడు. “చారులత” సినిమాకి ముందు, ఇతనికి సినిమాల గురించి ఏమీ తెలియదు. రాయ్ దగ్గరకు శైలేన్ వచ్చి, “మానిక్‌దా, నాకు సినిమాల గురించి ఏమీ తెలియదు. నీ శిష్యుడిగా నన్ను చేర్చుకుని, సినిమా నటన నాకు నేర్పు” అన్నాడు. సినిమా పూర్తి అయిన తరవాత, రాయ్ “శైలేన్ నటన అంతా చాలా తిన్ననైన నటన. నేను ఎలా నటించమంటే, నన్ను అనుకరిస్తూ అలా నటించాడు. శైలేన్ వప్పుకోడు కాని, తను అనుకున్నదాని కంటే అతడు మంచి నటుడు” అన్నాట్ట.

రాయ్ – ఠాగోర్ – బంకించంద్ర ఛటర్జీ

ఠాగోర్ సాహిత్యం ఆధారంగా, రాయ్ తీసిన రెండవ (మొదటి సినిమా “తీన్ కన్యా”) సినిమా “చారులత”. రాయ్ సినిమాలకి, ఠాగోర్ సాహిత్యానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. ఠాగోర్ సాహిత్యంలో కనపడే పాత్రలకు మల్లే, రాయ్ సినిమా పాత్రలన్నీ ప్రకృతి నుంచి కదలి వచ్చి, బెంగాలీ సంస్కృతిని పుణికి పుచ్చుకున్న సజీవ మూర్తులుగా కనిపిస్తాయి. ఠాగోర్ ప్రభావం రాయ్ పై ఎంత ఉండేదో, బంకించంద్ర ప్రభావం ఠాగోర్ పై అలాగే బలంగా ఉండేది. 1870, 80 దశాబ్దాలలో బంకిం బెంగాలీ సాహిత్యంలో మకుటం లేని మహారాజు. ఠాగోర్‌ని అతి చిన్న వయస్సులో బంకిం గుర్తించి, ప్రోత్సహించాడు. అలాగే, బంకిం సాహిత్య ప్రభావం ఠాగోర్ పై బలంగా ఉండేది. “నష్టనీర్” వంటి నవలను ఆ రోజుల్లోనే అతి ఉత్తమ సాహిత్యపు విలువలున్న నవలగా ప్రాచుర్యం చెందింది. “చారులత” సినిమా రాక పూర్వం, అప్పటికే ఎవరో “నస్టనీర్” పేరుతో ఒక సినిమా తియ్యటం వల్ల (కానీ, ఆ సినిమా కథ వేరు), ఠాగోర్ “నష్టనీర్” నవల్లోని కథానాయకి పాత్ర చారులతనే, రాయ్ తన సినిమాకి పేరుగా నిర్ణయించాడు.

సంగీతం

సత్యజిత్ రాయ్‌కి “చారులత” సినిమాకి ముందు తీసిన “కాంచనజంగ”, “అభిజాన్”, “మహానగర్” సినిమాలతో బాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో చాలా అనుభవం వచ్చింది. వీటన్నిటికన్నా “చారులత” సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు రాయ్. “చారులత సినిమా తీస్తున్నప్పుడు భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం – రెండూ ఒక్కటే అని నాకు అనిపించాయి” అని 1980 సంవత్సరంలో రాయ్ అన్నాడు. ఠాగోర్ పాటలు మూడు “చారులత” సినిమా సంగీతానికి మూలం. సినిమా మొదలవుతూనే “చారులత” పాత్ర ఒంటరిగా కూర్చొని ఒక చేతిరుమాలు మీద B అన్న అక్షరాన్ని కుడుతున్నప్పుడు, “మమ సిట్టె, నితి నృత్యే” అన్న పాట బాక్‌గ్రౌండ్ సంగీతంగా వినిపిస్తుంది. ఈ పాట చాల సరళంగా, అందరూ పాడుకోటానికి వీలుగా ఉండే బాణీ. ఠాగోర్ సంగీతంలో, చిన్న వయస్సులో ఉన్న ఆడ పిల్లలకి, డాన్స్ స్టెప్స్ నేర్పిస్తూ పాడే పాట ఇది. రెండో పాట “ఫులే ఫులే”, స్కాటిష్ బాణీలో కట్టిన పాట. ఠాగోర్ మొదటిసారి ఇంగ్లెండ్ వెళ్ళినపుడు విన్న బాణీని, ఠాగోరే ఈ పాటకు బాణీగా వాడుకున్నాడు. “అమల్” పాత్ర కాలేజీ శెలవలకి ఇంటికి రాగానే, తన సామాన్లు సర్ధుకొన్నప్పుడు పాడుకున్న పాట ఇది. తరవాత, “చారులత” పాత్ర కూడా తోటలో ఉయ్యాలపై ఊగుతున్నప్పుడు, ఇదే పాట పాడుతుంది. మూడో పాట, ” అమి ఛినిగొ, ఛినితొ మారే ఒగో బిదేషిణీ” అన్న ఠాగోర్ సాహిత్యానికి, కాదంబరీ దేవి భర్త, ఠాగోర్ అన్నగారి బాణీ. ఈ పాట చాలా ఉత్సాహంగా ఉండి, “చారులత”, “అమల్” పాత్రలు ఒకొరి కొకరు సన్నిహితంగా ఉండే సన్నివేశాలను చూపించటానికి వాడుకోబడింది.

ఈ సినిమాలో సంగీతం, ప్రతి సందర్భానికి తగ్గట్టే ఉండి, కొంచెం వెంటాడుతునట్టు ఉంటుంది. ఈ సినిమాకి వాడిన సంగీతం శాస్త్రీయ సంగీతం కాదు. ఇది కొంచెం ప్రజా సంగీతం లాగ అనిపిస్తుంది. ముఖ్యంగా పల్లెటూళ్ళలో ఇలాంటి సంగీతం ఎక్కువగా వినిపిస్తుంది.

రషోమాన్ – చారులత

ఎంత కూడదని ప్రయత్నించినా, చారులత సినిమా గురించి రాస్తున్నప్పుడు, ప్రఖ్యాత జాపనీస్ సినిమా దర్శకుడు అకిరా కురుసావా తీసిన “రషోమాన్” సినిమా పదే పదే గుర్తుకు రావటంతో, ఈ రెండు సినిమాల మధ్య ఉన్న పోలికలు తేడాలు రాయాలనిపించింది. మొదటి విషయం, తన పై కురుసావా ప్రభావం చాలానే ఉన్నట్టు, రాయ్ చెప్పుకున్నాడు. రషోమాన్ సినిమాలో కథా ఇతివృత్తం ఎంతో సస్‌పెన్స్‌తో సాగితే, చారులత సినిమాలో కథా ఇతివృత్తం పైకి అంత తేలికగా కనపడకుండా జరిగే కథ. మొదటిది గలగల పారే సెలయేరయితే, రెండవది పైకి నిర్మలంగా కనపడే నీటి ప్రవాహం కింద, సుడులు తిరుగుతున్న సుడిగుండాలున్నాయి. రషోమాన్‌లో తాత్విక సంబంధమైన ఆలోచనులుంటే, చారులతలో సున్నితమైన మానవ సంబంధాలు, విలువలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలలో ఉన్న ఒక్క గుణం – సినిమా చూసిన తరవాత ప్రేక్షకుణ్ణి ఒక చోట నిలవకుండా, ఆలోచించేట్టు చెయ్యగలగటం.

ముగింపు


చారులత, భూపతి

సినిమా చివరి దాకా, తన భార్య “అమల్” అంటే ఇష్టం (అది ఎటువంటి ఇష్టమో భూపతి పాత్రకు కూడా తెలియదు) చూపుతోందన్న విషయం తెలియని “భూపతి”, “అమల్” దగ్గరనుంచి తనకు వచ్చిన ఉత్తరాన్ని “చారులత” కు ఇస్తాడు. ఆ ఉత్తరం చివర్లో తన వదిన కవిత్వాన్ని ప్రోత్సహించమని తన అన్నకు చెపుతాడు “అమల్”. ఈ ఉత్తరం చదివి ఏకాంతంగా దు@ఖిస్తున్న “చారులత”ని చూసి, “భూపతి” ఎంతో నొచ్చుకొని, ఈ సంఘటనలకి తను ఎంత బాధ్యుడు అనుకొంటూ, తన ఆత్మ పరిశీలనకు అలా తిరిగొద్దామని ఇంటి బయటకు వెడతాడు.

పరిస్థితుల్ని అర్ధం చేసుకొని, భూపతి ఇంటికి తిరిగి వచ్చి, “చారులత” గది తలుపులు తీయగానే, లోపలికి రమ్మని ఆహ్వానిస్తూ “చారులత” చెయ్యి అందించటంతో (భార్యా, భర్తల చేతులు కలవకుండా స్తంభించిపోటం ఆఖరి సీన్) సినిమా పూర్తి అవుతుంది. నవలలో ఠాగోర్ ఈ సంఘటన సందిగ్ధంతో పూర్తి చేస్తే, రాయ్ చెదిరిన గూడు లాంటి వారి కాపురం, తిరిగి సర్దుకుంటుందేమో అన్నట్టు పూర్తి చేస్తాడు.

ప్రశంసలు, బహుమతులు

“చారులత” సినిమా పారిస్‌లో ప్రతి రోజూ కనీసం ఒక ఆట చొప్పున ఒక ఏడాదికి పైగా ప్రదర్శించారు. “చారులత” 1964 లో భారత రాష్ట్రపతి బంగారు పతకం, 1965 లో బెర్లిన్ ఫిల్మోత్సవంలో సిల్వర్ బేర్ (Silver Bear) బహుమతి, 1965 లో రోమన్ కాథలిక్ సినిమాటోగ్రఫి వారి అత్యుత్తమ సినిమా బహుమతి, 1965 లో ఆకపూకో ఫిల్మ్ ఫెస్టివల్ (Acapulco Film Festival) లో గోల్డెన్ హెడ్ బహుమతి గెల్చుకుంది. *


ఈ వ్యాస రచనకు ఉపయోగపడిన పుస్తకాలు, వీడియో

  1. చారులత డీవీడీ
  2. Inner Eye”, Andrew Robinson, University of California Press, 1989 (ఈ పుస్తం నించి చాలా విషయాలు ఈ వ్యాసం కోసం వాడుకోవడం జరిగింది.)
  3. “Portrait of a Director: Satyajit Ray”, Marie Seton, Indiana University Press, 1971
  4. The Broken Nest, బెంగాలీ నవల “నష్టనీర్” రవీంద్రనాథ్ ఠాగోర్, అనువాదం మేరీ ఎం. లాగో మరియు సుప్రియ బారీ, మెక్ మిల్లన్ ఇండియా లిమిటెడ్, 1971

[“చారులత” సినిమా పై వ్యాసం రాయమని సూచించి, అందుకు తగిన ఎన్నో వివరాలను అందచేసిన శ్రీమతి చామర్తి కల్పనకు ధన్యవాదాలు. — రచయిత]