తెలుగు రాని వాళ్ళకి తెలుగు గురించి తెలియని వాళ్ళకి తెలుగు గురించి చెప్పవలసి వస్తే, భారతదేశంలో ఈ భాష డెబ్భై మిలియన్లకి మాతృభాష అనో, ఈ భాషలో పదకొండువందల ఏళ్ళుగా ధారావాహికంగా గొప్ప సాహిత్యం వస్తూవున్నదనో చెప్పడం ఇక్కడి విద్యావంతులకి మొక్కుబడి, మామూలు. అంతేకాదు, ఆరువందల ఏళ్ళక్రితం ఒక రాయడు గారో, మరొక రాయలు గారో, “దేశభాషలందు తెలుగు లెస్స” అని ఒక ఆటవెలది పాదంతో మా భాషని పొగిడారనో ఒక పాత చప్పడిపోయిన పాట పాడడం కూడా మామూలే! ఈ పాట పాడి పాడి మన బుర్రలు పాడు పాడు చేశారు ఏటా వచ్చే రాజకీయనాయకులు, వారివెంట వచ్చే రాజకీయకవులూ! అందుకే, ఈ పద్యపాదం పరమ పేలవంగా తయారయ్యింది.
పై మకుటం అచ్చుతప్పు కాదు; ఛందోభంగం అయిందేమో తెలియదు కానీ, అచ్చు తప్పు మాత్రం కానే కాదు.
ఇకముందు అమెరికాలో అటువంటి ప్రశ్నలు అడగే ఆవశ్యకత లేకండా ఇక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్ళు తేలికగా చెయ్యగలరు.
అమెరికాలో విస్కాన్సిన్ విశ్వవిద్యాలయంలో మూడు దశాబ్దాల పైచిలుకుగా తెలుగు భాషాబోధన, తెలుగు సాహిత్య పరిశోధనా ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి మూలకారకులు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు గారు. ఇకపోతే, తెలుగు బోధనా భాషగా చికాగో విశ్వవిద్యాలయంలోను, కొలంబియా లోనూ ఉన్నాయి. ఈ మూడు చోట్లా దక్షిణ ఆసియా భాషల విభాగాలు (South Asian Languages Departments)బలమైనవి కావడమే కారణం కావచ్చు. మిగిలిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో దక్షిణ ఆసియా భాషా విభాగం ఉన్నప్పటికీ తెలుగు చెప్పడం, తెలుగులో పరిశోధనని ప్రోత్సహించడం ఎక్కడా లేదు. ఇది చాలా విచారకరం.
ఈ విచారకరమైన పరిస్థితిని మార్చడానికి స్థానిక తెలుగు సంస్థలు, దేశవ్యాప్తంగా బలపడ్డ తెలుగు సంస్థలూ, ముఖ్యంగా తెలుగంటే నిజమైన మమకారం ఉన్న వాళ్ళు కలిసి విశ్వవిద్యాలయాల్లో తెలుగు బోధనకి కృషిచెయ్యడం అసాధ్యం కాదు.
ఆ పని మొట్టమొదటిగా డెట్రాయట్ తెలుగు వాళ్ళు మూడు సంవత్సరాల క్రితం, సాధించారు. డెట్రాయట్ లో తెలుగు సాహిత్యాభిమానులు (DTLC), డెట్రాయట్ తెలుగు సంఘం, తానా ప్రముఖులూ కలిసి మిషిగన్ విశ్వవిద్యాలయం, యాన్ ఆర్బర్ లో తెలుగు భాషా బోధనకి అవకాశం కల్పించగలిగారు. అందుకుగాను విశ్వవిద్యాలయం కోరిన విధంగా ధన సహాయం విరాళంగా అందిచారు. విశ్వవిద్యాలయం కోరిన ధనసహాయం చాలా పరిమిత మైనదే అని చెప్పాలి. ఐదు సంవత్సరాలకి 150,000 డాలర్లు మాత్రమే! అంటే, ఏడాదికి 30,000 డాలర్లు డెట్రాయట్ తెలుగు వారు మిచిగన్ విశ్వవిద్యాలయానికి విరాళం ఇస్తున్నారు! ఉమ్మడిగా మనం చెయ్యలేని పని లేదని డెట్రాయట్ తెలుగు వాళ్ళు రుజువు చేశారు. ఈ ఒప్పందానికి ప్రొఫెసర్ నారాయణ రావుగారి ప్రోద్బలం ఉన్నది.
డెట్రాయట్ తెలుగు వారు నాందీ వాక్యం పలికారు. వాళ్ళని అభినందించి తీరాలి. ఇదేవిధంగా, అమెరికా వ్యాప్తంగా దక్షిణ ఆసియా భాషల్లోను, సంస్కృతంలోనూ బోధన స్థిరపడ్డ ప్రతి విశ్వవిద్యాలయంలోనూ తెలుగు భాషా బోధనకి, తెలుగు సాహిత్య పరిశోధనకీ అవకాశం కల్పించవలసిన అవసరం ఉన్నది.
ఇది గుర్తించి, అట్లాంటాలో ఎమరీ విశ్వవిద్యాలయంలో కేవలం బోధనకే కాక, తెలుగు సాహిత్యం సంస్కృతులపై పరిశోధనకికూడా అవకాశం కల్పించడానికి సుమారు ఆరు నెలలనుంచీ కృషి జరుగుతూన్నది. స్థానిక తెలుగు సంఘం తామా, తదితర స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఈ పనికి పూనుకున్నారు. ఐదు సంవత్సరాల పరిమితిలో ఎమరీ విశ్వవిద్యాలయంకి 200,000 డాలర్లు విరాళం ఇవ్వగలమని వాగ్దానం (monetary commitment) చేస్తే, వచ్చే సంవత్సరంలో ఎమరీలో తెలుగు భాషా బోధనే కాకుండా, తెలుగు సాహిత్యం, సంస్కృతుల పై పండితుల ఉపన్యాసాలు, వాటిపై పరిశోధన సాధ్యపడతాయి. ఎమరీలో తెలుగు పెట్టించడానికి పట్టుదలతో పనిచేస్తున్న ముఖ్య సూత్రధారిణి, ఎమరీ ప్రొఫెసర్ శ్రీమతి జాయిస్ ఫ్లూకిగెర్. విరాళాల వివరాలకు, Telugu Initiative at Emory, Prof. Joyce B. Flueckiger, reljbf@emory.edu Emory University, Atlanta కి దయచేసి వ్రాయండి.
సుమారు ఒక నెలక్రిందట కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం బర్కెలీ లో కూడా తెలుగు బోధనకి, సాహిత్య పరిశోధనకీ ఏర్పాట్లు చేయించేనిమిత్తం బే ఏరియా తెలుగు సంస్థలు, సాహితీ బృందాలు కలిసి పనిచేయడం మొదలుపెట్టాయి. బే ఏరియాలో డాలర్ల పంటకి కొదవలేదని వినికిడి. అమెరికాలో ఉన్న తెలుగు కోటీశ్వరులలో సగం మంది బే ఏరియాలోనే ఉన్నారుట! బర్కెలీలో అతి త్వరలో తెలుగులో ఆచార్య పదవీ స్థాపన జరుగుతుందని నా దృఢనమ్మకం. ఇతర వివరాలకు, Raka Ray, Center for South Asian Studies, University of California, Berkeley, rakaray@berkeley.edu ని సంప్రదించండి.
ఆఖరిగా మరొక్క మాట. సంస్కృత భాషా బోధన, సంస్కృతసాహిత్య పరిశోధన, ఈ దేశంలో పేరుమోసిన విశ్వవిద్యాలయాలలో చాలా కాలంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో, కారణాలు ఏమయితేనేం, హిందీ భాషా బోధన చాలా చోట్ల మొదలయ్యింది. ఈ రెండు భాషలూ ఉన్న ప్రతిచోటా తెలుగు ప్రవేశ పెట్టడం కోసం ప్రయత్నాలు జోరుగా సాగాలి. ఈ పనికి, స్థానిక సంస్థలు పూనుకోవాలి. స్థానిక సంస్థలకి, దేశవ్యాప్తంగా ఉన్న తానా, ఆటాలు ప్రోత్సహించాలి, మద్దతు ఇవ్వాలి. మాటల ప్రోత్సాహం నిరుపయోగం. మూటల మద్దతు అవశ్యం. ఇది ఎలా సాధ్యమవుతుంది అన్న ప్రశ్నకి సమాధానం: ప్రతి సంవత్సరమూ తానా వారో, ఆటా వారో, సాంస్కృతికోత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఎంతో సందడిగా చేసుకుంటారు. ప్రతి ఏడూ ఆ ఉత్సవాలకి పెట్టే ఖర్చులో 10 శాతం తెలుగు బోధనకి తెలుగు సాహిత్య పరిశోధనకీ నిర్దేశిస్తే, హార్వర్డు నుంచి హోనోలూలూ దాకా ఉన్న విశ్వవిద్యాలయాలలో తెలుగు బోధనకి ఏర్పాట్లు చేయించడం ఎంత సులువైన పనో ఆలోచించండి.