కవుల వాగ్వాదాల్లోంచి కవిత్వం – గీరతం

ఇరవయ్యవ శతాబ్దపు తొలిదశకాల సంప్రదాయ పద్య సాహితీకారుల జాబితాలో ముందుగా కనిపించేవారు తిరుపతివెంకట కవులు. “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం” అనే గ్రంథంలో వెల్చేరు నారాయణరావు తిరుపతివెంకట కవుల ప్రభావాన్ని మొదలుకాని విప్లవంగా భావించారు. అందుకు వారి ప్రతిపాదన ఇది –

“పందొమ్మిదవ శతాబ్దపు చివరి భాగానికి తెలుగులో ముద్రణ బాగా అమలులోకి వచ్చింది. అయితే అచ్చుయంత్రం కేవలం ఒక సౌకర్యంగా, ఒక మంచి ఉపకరణంగా ఉండి వూరుకోబోవడం లేదు. అది అక్షరాస్యులైనవారి సాహిత్యాన్నంతటినీ సమూలంగా మార్చివెయ్యబోతోంది. పద్యం వినేవారికి బదులు చదువుకునేవారు ఏర్పడబోతున్నారు. పైకి చదివే అలవాటు అవసరం అయిపోబోతోంది. కావ్యానికి సామాజిక ఆస్వాదన పోయి, వైయక్తిక ఏకాంతంలో పుస్తకాలు చదువుకునేవారు ఏర్పడబోతున్నారు. పుస్తకాలు సులభంగా దొరుకుతాయి కాబట్టి పద్యాలు ధారణ చెయ్యవలసిన అవసరం ఇక వుండదు. కవిత్వం రాయడానికి కాగితాలూ కలాలూ వచ్చాయి కాబట్టి నోటితో పద్యరచన చెయ్యడం అనవసరం. తెలుగుసాహిత్య రంగంలో దాదాపు వెయ్యేళ్ళు గొప్పకళలుగా భావించబడినవి రెండు – నోటితో పద్యం రచించడం, అది మళ్ళీ నోటితో పదిమంది ముందు రాగయుక్తంగా చదవడం. ఈ రెంటికీ కాలదోషం పడుతున్న సందర్భంలో ఆ పరిస్థితి మీద ఒక అసంకల్పిత ప్రతీకారచర్య లాగా వచ్చింది తిరుపతివెంకట కవులతో ఆరంభమయిన ఆశు (అవధాన) కవిత్వం.”

ఐతే ఆంధ్రదేశపు కవిత్వాభిమానుల్లో ఒకవర్గం వారిపై వాళ్ళ ప్రభావం బలంగానే పడిందనిపిస్తుంది. ముఖ్యంగా మూడు అంశాల్లో వాళ్ళ ప్రభావం ఇప్పటికీ సజీవంగానే వుంది –

  1. సమర్ధులైన శిష్య ప్రశిష్య గణాలు. వీరి శిష్యుల్లో విశ్వనాథ, పింగళి, కాటూరి, వేలూరి శివరామశాస్త్రి, త్రిపురనేని రామస్వామిచౌదరి వంటివారు ఎందరో వున్నారు. వీరిలో చాలామంది రచనలు, భావాలు విస్తృత చర్చనీయాలయాయి.
  2. నాటక రచన. వీరి పాండవోద్యోగ విజయ నాటకాలు ఎంతగా ప్రచారం పొందాయో, వాటిలోని పద్యాలు జనసామాన్యపు వాడుకభాషలో ఎలా భాగాలయ్యాయో చెప్పనవసరం లేదు.
  3. ఆశుకవితా సంప్రదాయానికి కొత్త ఊపిరి. తిరుపతివెంకట కవులకు ముందు అవధానప్రక్రియలో ఉద్దండులైన వారు ఎందరో వున్నా, దాన్ని రాజాస్థానాల్లోంచి జనసామాన్యంలోకి విస్తరింపజేసిన వారు వీరు. ఆ ప్రభావం ఇప్పటికీ మనం చూస్తూనే వున్నాం.

కనుక, వారిది మొదలుకాని విప్లవమైనా, వారి కవితామార్గం మీద ఆ తర్వాత నడిచిన వారు ఎక్కువమంది లేకపోయినా, తెలుగు సాహిత్యం మీద వారి పరోక్షప్రభావం తక్కువేమీ కాదు. ఆశ్చర్యమేమిటంటే, సాహిత్యరంగంలో విప్లవకారుడిగా గుర్తించబడ్డ గురజాడతో పోలిస్తే, తిరుపతివెంకట కవుల దారిలో నడిచిన వారే ఎక్కువమంది. గురజాడ అడుగుజాడల్లో నడుస్తున్నామనుకున్న వాళ్ళు చాలామందే వున్నా నిజంగా నడిచిన వారు అసలు లేరనే చెప్పాలి. ఇది నారాయణరావు గారి వాదనకు ఖండన కాదు – ఒక కవితావిప్లవానికి నిదర్శనం ఆ ధోరణిని ఎంతమంది అనుసరించారన్నది కాదు. అంతకుముందున్న మార్గానికి అది ఎలా భిన్నమైనది, అప్పటి సామాజిక, సాంకేతిక పరిస్థితులకు ఎలా అనుస్పందించింది అనేది మాత్రమే.

తిరుపతివెంకట కవుల మార్గాన్ని తర్వాతి వారు అనుసరించకపోవటానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యమైన వాటిలో – ఒకటి, వారి శ్రవణానందం మొదలైన కావ్యాలు చాలా పేలవంగా వుంటాయి. ప్రబంధ ధోరణుల చివరిదశని సూచిస్తాయి. రెండు, వారి సామాజిక భావాలూ పురాతనాలే. వర్ణవ్యవస్థా, కుల విచక్షణా, వేశ్యాసంపర్కం మొదలైన ఆచారాల్ని సమర్థించటమే కాదు, వాటికి వ్యతిరేకతని ఆక్షేపించారు కూడ.

ఐతే, కసిలోంచి దూసుకొచ్చేదే అసలైన కవిత్వం అని ఎవరో అన్నట్టు, పట్టుపట్టి కూర్చుని చేసిన రచనల కంటె ఇతర కవులతో జరిపిన వాగ్వాదాల్లో వారి కవితాప్రతిభ ఎక్కువగా గోచరిస్తుంది. వాటిలోని భావాల్లో కూడ వినూత్నత కనిపిస్తుంది. ఇలాటి సందర్భాలకు తగిన పడికట్టు పదాలు కాని కవిసమయాలు కాని సంప్రదాయ ప్రయోగాలు కాని ఎక్కువ లేకపోవటం ఇందుకు ఒక కారణం కావొచ్చు. మరొక విధంగా, కావ్యరచనలో దొరకని స్వాతంత్ర్యం ఈ వివాదరచనల్లో దొరికిందనీ, దాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారని కూడ భావించటానికి అవకాశం వుంది. అంతేకాకుండా, అవధానప్రక్రియని మినహాయిస్తే వారి కవితాధోరణిని కాని, భావాల్ని కాని ఆ తరువాతి వారు ఎవరూ అనుసరించకపోయినా, ఈ వివాదమార్గాన్ని మాత్రం శ్రీశ్రీ లాంటి వారు కొందరు అనుసరించారు! తిరుపతివెంకట కవుల లాగే వీరు కూడ పత్రికాముఖంగా, వచన-పద్యరూపాల్లో తమ వివాదాల్ని బహిరంగంగా కొనసాగించారు.

తిరుపతివెంకట కవులు అచ్చువేసిన “గీరతం” అనే రచనని తీసుకుని వారి కవితా వాగ్వాద తత్వాన్ని కొంత విపులంగా చూద్దాం.

“గీరతం” రచనని మొత్తం నాలుగు భాగాలుగా ప్రచురించారు. మొదటి మూడు భాగాలు 1911 – 13 మధ్య వచ్చినట్టు కనిపిస్తాయి. నాలుగవభాగాన్ని మాత్రం, కాటూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో షష్టిపూర్తి మహోత్సవ సందర్భంగా తిరుపతివెంకటేశ్వరుల రచనలన్నిటినీ ప్రచురిస్తూ 1934లో ప్రచురించారు.

గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది. వారిలో ఓలేటి వెంకటరామయ్య తనకు శిష్యుడని వెంకటశాస్త్రి గారు అంటారు. అది నిజం కాదని వెంకటరామయ్య గారి వాదన.

ఐతే, ఈ “గీరతం” ప్రచురించింది తిరుపతివెంకట కవులనీ, అందువల్ల మనం ఇందులో చూసేది ఎక్కువభాగం వీరి వైపు నుంచి వున్న సాక్ష్యాధారాలు, సంఘటనలపై వీరి వ్యాఖ్యానాలు మాత్రమేనని, రెండవ పక్షం వారి వాదనలు ఎక్కువ కనిపించవని గ్రహించాలి. ఐనా, ఇక్కడ మన దృష్టి కవిత్వం మీద కాని ఇరుపక్షాల వాదాల బలాబలాల మీద కాదు కనుక ఇది ఒక లోపం కాదు.

ఈ వెంకటరామకృష్ణకవుల గురించి మనకు ఇప్పుడు ఎక్కువగా తెలియదు. వారూ కావ్యాలు రాశారు కాని అవి నిలబడలేదు. నాకు తెలిసినంతవరకు వారి రచనల్లో ఇప్పటికీ అక్కడక్కడ వినిపించేవి “ఆంధ్రకవుల అపరాధములు” అనే శీర్షికతో వారు ఆంధ్రపత్రిక యాభై ఏళ్ళ ప్రత్యేక సంచికలో ప్రచురించిన కొన్ని పద్యాలు. వాటిలో తొలిపద్యం –

ఆంధ్ర భాషోపకారమ్ము నాచరింప
దలచి నన్నయభట్టు భారతము తెనుగు
చేయుచున్నాడు సరియె బడాయి గాక
తొలుత సంస్కృతపద్య మెందులకు చెపుడీ

గీరతానికి మూలం 1910లో “కవిత” అనే మాసపత్రికలో వెంకటరామకృష్ణకవులు (ఆ పత్రికాసంపాదకులు, ప్రచురణకర్తలు కూడ వారే) ప్రచురించిన కొన్ని రచనలు తమపై విమర్శలని తిరుపతివెంకట కవులు భావించటం. (తిరుపతివెంకట కవులకు వారు “ఈశ్వరవేరు”లని (ఈ ఈశ్వరవేరు ఏమిటో నాకు తెలియదు – పాములకు విరుగుడుగా వాడే వేరనే అర్థంలో వాడినట్టున్నారు) అన్నారట.) ఈశ్వరవేరులో జీలుగుబెండ్లో తేల్చుకోవచ్చు ఒక సభకు రండని తిరుపతి శాస్త్రి గారు “ఛాలెంజ్” విసిరారు. దాన్ని తిప్పికొడుతూ వెంకటరామకృష్ణులు కొన్ని పద్యాలు చాటుగా ప్రచురించారట. వాటిలో ఒకటి –

మాకవితావిశేషములు మానసవీధుల సంచరింప వీ
రే కవిభోగిభోగముల కీశ్వరవేరులటంచు కొందరీ
లోకులు పల్కుచుండ్రు గుణలుబ్ధులు గావున మీరు సెప్పుచో
కాకవి కాచపాత్రల మొగంబులు మూయగ జీల్గుబెండ్లమే

దీనికి సమాధానంగా వెలువడ్డ తిరుపతికవుల పద్యప్రవాహంలోంచి ఓ రెండు – 

కాకవి! కాచపాత్రల మొగంబులు మూసెడు జీల్గుబెండ్లకుం
జేకురునే సభాస్థితియు, జేకురు గాకది, తద్రసంబులం
గైకొనువేళ నొక్క కడగా బడవైవరె? పట్టుపట్టినన్
మేకుబిగించి లాగి బలిమిం బలు ముక్కలు సేయకుందురే?

“మాకవితావిశేషములు మానసవీధుల సంచరింప” నం
చా కవులాడు మాటలకు నప్పురవాసులె గేలి గొట్టుచున్
“మీ కవితావిశేషములు మేదరవీధుల సంచరించు జుం
డో కవులార” యంచు కడు నుల్లసమాడుదు రంట! వింటివే
(ఈ పద్యం తిరుపతిశాస్త్రి నుద్దేశిస్తూ వెంకటశాస్త్రి చెప్పింది)

ఈ సందర్భంలో తిరుపతిశాస్త్రి గారు ఎవరో శాంతించండని సలహా చెప్తే దానికి ఆగ్రహించి చెప్పిన ఐదు పద్యాలు ఆ ఆగ్రహావేశాల్ని ఆవిష్కరిస్తాయి. అందులో ఓ రెండు –

శాంతింపుండని రాయబాయ మవురా! శాంతింపకేమున్న ద
శ్రాంత ప్రస్మయ దస్మదీయ కవితాచండాసి ఖండీకృతా
హంతాదంతుర కాకవిప్రతివచఃప్రారంభ రంభాకురు
ట్కాంతారమ్ములు సగ్గి మ్రగ్గి యసదై కంపట్టు నిప్పట్టునన్

శాంతింపుండని రాయబాయ మవురా! శాంతింపకేమున్న దా
క్రాంతాశేష దిగంత మామక గవీ ప్రాగ్భార దూరీకృత
క్లాంత క్లాంత నిశాంత శాంత కుకవి క్రవ్యాద నవ్యోదయ
ధ్వాంతంబుల్ ధరణీభృదంత కదరీద్వారంబు దూరంజనన్

ఈ పద్యాలకు స్పందిస్తూ, “అర్భకులైన వెంకటరామకృష్ణుల మీద నీ వంటివాడికి ఇంత ఆగ్రహం తగునా?” అంటూ తిరుపతిశాస్త్రిని ఆదరంగా మందలిస్తున్న మిషతో వెంకటశాస్త్రి పంపిన పద్యాలు అద్భుత చమత్కార సహితాలు. తొలిపద్యమే తిరుపతిశాస్త్రిని సాభిప్రాయంగా సంబోధిస్తుంది –

ప్రాదుర్భూత శతావధానకవితా ప్రాగల్భ్యసౌరభ్య సా
రోదారాప్రతిమ ప్రబంధకవితాయోషావిభూషా యశ
కేదారాంతరతః కథంచి దుదయ త్కంపాక నూత్నాంకుర
చ్ఛేది చ్ఛాత్ర నమత్కృతున్ తిరుపతిన్ శ్రీనాథుడోమున్ గృపన్
(ఇక్కడ వివాదం గురుశిష్య సంబంధం గురించి అని గుర్తుపెట్టుకుంటే ఈ పద్యంలో “ఛాత్రుల్ని” అంతగా ఎందుకు పొగిడారో అర్థమౌతుంది.)

విషయం ఎలాటిదైనా గాని హాయిగా చదివించగలిగే పద్యాలు చెప్పటం జరిగిందిక్కడ. ఈ పద్యం సుప్రసిద్ధమే –

గారెల పిండివంటకయి కాంతుడు కాంతను పృచ్ఛ సేయ నా
సారసనేత్ర వ్రేలొకటి చయ్యన జూపి “యిదొక్కడున్న దా
ధార” మటన్న సామెతగ ధార యొకించుక కల్గు మాత్రనే
వీ రవధానపుం బనికి వీరిడులై ప్రయతించి రక్కటా!

“కోకిలకాకము” అనే పేరుతో ఓ చిన్న పుస్తకాన్ని వెంకటరామకృష్ణులు అచ్చువేశారు. వెంకటశాస్త్రి కాకి అని, తనకు ఏమీ తెలియని స్థితిలో ఆయన గూటిలో కొంతకాలం తను గడిపి ఆ తర్వాత తను కోకిలనని తెలుసుకున్నానని వెంకటరామకవి అంటున్నట్టు ధ్వనించే విధంగా వుంటుందీ కావ్యం. దానికి వెంకటశాస్త్రి సమాధానం –

కాకికోకిలముల పోకలం బట్టియె
వ్వాడు దేశికునితో వైరమూను?
మేకపోతుల జూచి మేలునీతి యటంచు
నెవ్వాడు తల్లితో నవ్వులాడు?
నాలమందల జూచి యౌ బళీ యిది యంచు
భక్షించు నెవ్వాడు పచ్చికసవు?
తురకబిడ్డల జూచి సరియంచు నెవ్వాడు
పినతండ్రి కొమిరెల బెండ్లియాడు?

పక్షులం బట్టి పశువుల బట్టి యితర
మనుజులం బట్టి నీతులు మనకు గొన్ని
గలవు నేర్వంగ నివి కావు కావు కావు
పిల్లకాకి యెరుంగునే వింటిదెబ్బ!
(ఇక్కడ “కావు కావు” అనటంలో “కోకిలకాకము”తో సంబంధించిన ధ్వనిని గమనించండి.)

ఈ చమత్కారం చూడండి –

“వంటింట నిట్టి కృతి తగ”
దంటకు నొక్కింత కొంకి “యౌ; నిది తులసీ
మంటప మనుకొంటి” ననెడి
దంట లిపుడు కలరు సూ! శతమ్ములు వేలున్

తర్వాత కొన్నాళ్ళకు వెంకటశాస్త్రి గారు కాకరపర్తి వెళ్ళారు. అక్కడ రామకృష్ణకవి బంధువులు, మిత్రులు చాలామంది వున్నారట. ఒకరి ఇంట్లో వెంకటశాస్త్రి గారు తమ రచనలు చదివి వినిపిస్తుంటే వాళ్ళు చుట్టుముట్టి గేలిచేశారు. ఆయన మాటల్లో –

కౌముది పాఠమ్ము గావలె నాకిప్పు
డంచొక్క విద్యార్థి యడుగదొడగె
పోనిమ్ము రఘువంశమేని జెప్పుమటంచు
నిక నొక్క విద్యార్థి యీసడించె
కాకరపర్తి యీ గ్రామం బెరుగుమంచు
వేరొక్కవిద్యార్థి వెక్కిరించె …

అలాటి పరిస్థితిని వివరిస్తూ కూడ చమత్కారం మానరు –

అటులు చుట్టుకొనిన యవ్వార లెల్లరు
నరవ లేను గూడ నరవ నగుట
“నరవ గోల” యనెడి యార్యుల మాట య
త్తరిని మదికి దగిలె దరుణమగుట

ఈ సంఘటనని వర్ణిస్తూ వెంకటరామకృష్ణులు “శృంగభంగము” అనే పుస్తకాన్ని మర్నాడే అచ్చువేశారు. దానికి ప్రతిగా తిరుపతిశాస్త్రి సవాలు చేస్తూ ఒక ఉత్తరం పంపారు –

చుక్కలు రాలలేదు రవిసోముల పోకడ మారలేదు న
ల్దిక్కులు కూలలేదు జలధిజ్వలనం బుబుకంగలేదు నే
డక్కట రామకృష్ణకవు లర్భకు లేగతి సేయనేర్తు రా
ధిక్కృతవైరి వేంకటసుధీ కవిమౌళికి శృంగభంగమున్

కాకరపర్తి యొక్కటియ కాదు, జగమ్మఖిలంబు నేకమౌ
గా కల రామకృష్ణులకు గల్గునె శ్రీపతి వేంకటేశ్వరా
స్తోక శతావధాన కవి ధూర్వహ దివ్యతర ప్రతిష్టతో
డీకొనుశక్తి? యయ్యది ఘటించిన మాకును మోదమే కదా!

ఈ వివాదం రెండేళ్ళ పైగా సాగినట్టు కనిపిస్తుంది. ఇరు వర్గాల వారూ పుంఖానుపుంఖాలుగా పద్యాలు రాసి ప్రచురించారు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే, మధ్యలో వారిని సమర్థించే వారూ వీరిని సమర్థించే వారూ కూడ ఎవరి శక్తికి తగ్గట్టు వారు పద్యాలు రాశారు. ఉదాహరణకు, వేటూరి ప్రభాకరశాస్త్రి గారి పద్యం ఒకటి –

అచ్ఛానేక మహర్షి నిర్మిత మహార్హాచార నిర్మాణముల్
స్వేచ్ఛాచారులు నేటికాలమునయం దెందెందరో విజ్ఞ వే
షచ్ఛన్నుల్ పడగూల్ప నందు గురుశిష్యన్యాయనిర్మాణ మూ
లోచ్ఛేదమ్మున కీరు పాల్పడితిరొక్కో రామకృష్ణాహ్వయుల్

చివరికి గీరతం ప్రతి నొకదానిని పంపమనటానికి కూడ సుదీర్ఘపద్యమాలికలు రాసినవారున్నారు –

… తిరుపతివేంకటేశ కవిధీరవతంసములార మీకు నే
నెరగి త్రయీవిధిన్ బుధహృదీప్సిత లక్షణ లక్ష్యభార సం
భరితము నీతిదాయకము ప్రాజ్ఞ గురూత్తమ శిష్యవృత్తి సం
స్కరణ ధురీణసంఘజన సన్నుతిపాత్ర మరి త్రపా తిర
స్కరణచణప్రచారణము సారవదర్థ సమర్థ శబ్ద సం
చరణము తత్తదుత్తమ రసప్రతిభాగతి భాసితంబునై
పరగెడు గీరతమ్మొకడు బంపగ మిమ్ము సతమ్ము వేడెదన్
(ఇది పంపినవారు జమ్ములమడక శ్రీరాములు గారు.)

గీరతం లాటిదే “గుంటూరు సీమ” అనే మరో రచన కూడ వుంది. ఇది తిరుపతివెంకట కవులకు, కొప్పరపు సోదర కవులకు జరిగిన వాగ్వాదాలను వివరిస్తుంది. ఇంకెప్పుడైనా అవకాశం కలిగితే దాని గురించి కూడ ముచ్చటించుకోవచ్చు.

ఇక్కడ ఇచ్చిన పద్యాలు 1934 లో షష్టిపూర్తి మహోత్సవ సంఘం, బందరు వారు ముద్రించిన సంపుటాల్లో 8వ సంపుటం లోవి.

==================