1. చెప్పలేము
(Nellie Wong రాసిన Can’t Tell కవితకు స్వేచ్చానువాదం)
పొద్దున్నే రేడియో
రెండో ప్రపంచ యుద్ధం ప్రకటించిన రోజు,
చెవులు నిక్కపొడుచుకొని, కళ్ళు పెద్దవి చేసాం.
మా వళ్ళు వణికిపోయాయి.
జపాన్ శత్రువని
అదృశ్యమైన గొంతు చెప్పింది,
పర్ల్ హార్బర్ దగ్ధమయ్యింది
బర్కిలీలో, మా కొట్లో
మాంసపు ముద్దల పక్కన
మేమూ తలకిందలయ్యాం
మొన్నటి మాటల జాడల మధ్యన
నిశ్శబ్దంగా
పెట్టే బేడా సర్ది పెట్టాం,
అంగట్లో హడావిడి లేదు,
ఇక అమ్మకాలు లేవు.
పిల్లలమంతా చెక్క బల్లల మీద ఇరుక్కున్నాం
“మేము చైనా నుంచి, మేము చైనా నుంచి,” అని
అమ్మా నాన్నా గుసగుసమంటూంటే,
మా పిల్లగోచీలు
భయంతో బరువెక్కాయి.
కొద్దిలోనే పొరుగింటి జపాన్ వాళ్ళు మాయమయ్యారు
అమ్మా నాన్నా గుసగుస మంటూనే ఉన్నారు
“మేము చైనా నుంచి, మేము చైనా నుంచి.”
చేతులకి నల్ల రిబ్బన్లు చుట్టుకున్నాం,
పెద్దక్షరాలతో
ఓ బోర్డు రాసి కొట్టు ముందు తగిలించాం.
2. Notes for a Poem on Being Asian American
(Dwight Okita రాసిన Notes for a Poem on Being Asian American కవితకు స్వేచ్చానువాదం)
చిన్నప్పుడు తినడానికి మారాం చేసేవాణ్ణి
గుడ్డులో పసుపూ, తెలుపూ వేరు చేసి తినేవాణ్ణి
నాలోని ఏషియన్నీ అమెరికన్నీ
వేరు చెయ్యడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టు —
తూర్పునీ పడమరనీ, కలనీ కల కనేవాణ్ణీ.
కానీ దేశాలు
గుడ్లలా కావు — రెండూ పల్చటి
చిప్పలున్నవే కానీ — గుడ్లకీ దేశాలకీ ఒకటే పోలిక
రెంటినీ పగలగొట్టి చూసాక,
మనకవి అస్సలు అర్థమవ్వలేదని తెలుస్తుంది.
ఇంతకీ గుడ్డు పగలగొట్టి చూస్తే,
నాకు కనిపించేవి:
నేను ఏషియన్-అమెరికన్నని నిస్సందేహంగా తెలిపే
నా గత స్మృతులు రెండు.
మొదటిది — నేనో రోజు మిషిగన్ అవెన్యూపై
నడుస్తూవుంటే — అకస్మాతుగా ఒకాయన నా దగ్గరకొచ్చి
“మీకు చెప్పాలనిపించింది…హిరోషిమా మీద బాంబు పేల్చిన
విమానంలో నేనున్నాను. ప్రపంచ శాంతి కోసం
మేమలా చెయ్యవలిసొచ్చింది,” అన్నాడు. నా దగ్గర
క్షమాపణ కోరుతున్నట్టు అనిపించింది నాకు. అది 1983,
క్రేట్ అండ్ బారెల్లో మారిమెక్కో దుప్పట్లు చవగ్గా అమ్ముతున్నారు,
వేసవి వెచ్చదనం ఆహ్లాదకరంగా ఉంది, అతన్ని ఇంతకు ముందెప్పుడూ
చూడలేదు, బహుశా చూడబోను. అతనన్నదానికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు —
అయినా ప్రపంచంలోని ప్రతి సంబంధమూ ఉంది. కానీ అతన్ని
క్షమించాల్సింది నేనుకాదు. తన్ను తానే క్షమీంచుకోవాలి.
“మీరు చేసినది మిమ్మల్ని చాలా కష్టబెట్టి ఉంటుంది” అని,
ఎదురుగా మారిమెక్కో దుప్పట్లు చవగ్గా అమ్ముతున్నారు చూసారా అనడిగాను,
ఆ దుప్పట్ల మీద, గలేబుల మీదా గోధుమ పైర్ల బొమ్మలున్నాయనీ,
రాత్రుళ్ళు కిటికీ ముందు గాలికెగరేస్తే
అవి రెపరెపలాడే జెండాల్లా ఉంటాయని,
చాలా కాలం పోరాడి లొంగిపోయిన తెల్ల జెండాల్లానో, గెలుపుతో
మిడిసిపడుతున్న విజయపతాకాల్లానో, ఊరికే వేసవిలో
గాలి విసురుకుంటున్నట్టుగనో.
రెండవ జ్ఞాపకంలో — నేను ట్యాక్సీలో ఉన్నాను, ఇరానీ
డ్రైవర్ అద్దంలో నా ఏషియన్ కళ్ళని పరీక్షగా చూసి,
“నువ్వు నిజంగా చైనా వాళ్ళకీ జపాన్ వాళ్ళకీ
తేడా చెప్పగలవా?” అన్నాడు.