విన్నంత కన్నంత తెలియవచ్చినంత

[శాస్త్రీయ భాషా పరిశోధనలో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని భాషా శాస్త్రవేత్త, అభ్యుదయ సాహిత్యోద్యమకారుడు, పాత్రికేయ గురువు బూదరాజు రాధాకృష్ణ గారు గత నెల జూన్ 4, 2006 న మరణించారు. నన్నయ పూర్వకాలంలోని శాసన భాషమీద, తెలుగు మాండలికాలపై వీరు చేసిన పరిశోధనలు, ఆధునిక వ్యవహారకోశం, ఈనాడు భాషా స్వరూపం, తెలుగు జాతీయాలు, వాడుక మాటలు లాంటి ఉపయుక్తమైన గ్రంథాలు ఆయన ప్రతిభాపాటవాలకు గీటురాళ్ళు. తెలుగు భాషాభివృద్ధికి  వారు చేసిన కృషికి ఇదే మా నివాళి. – సంపాదకులు]

నాకు యుక్తవయసులో ఆధునిక తెలుగు సాహిత్యం మీద ఆసక్తి ఉండేది. అమెరికా వచ్చింతర్వాత అది మరుగున పడింది. భాషాశాస్త్రం గురించి బొత్తిగా ఏమీ తెలియదు. రెండేళ్ళ క్రితం “తెలుగు నాడి” లో “తెలుగుమాట” శీర్షిక చూసిందాకా బూదరాజు రాధాకృష్ణ గారి పేరు గూడా వినలేదు! అప్పుడైనా పెద్దగా పట్టించుకోలేదు.

పోయిన సంవత్సరం కొత్త పుస్తకాల కోసం వెతుకుతుంటే తెలుగులో ఓ కొత్తరకమైన పుస్తకం కనిపించింది – బూదరాజు గారి “మరవరాని మాటలు.” ఇంగ్లీషులో Dictionary of Quotations లాంటిది. అయిదువేలకి పైగా గ్రంథాలను పరిశీలించి, నాలుగు వందల మందికి పైగా – నన్నయ నుండి చండీదాస్ దాకా – రాసిన రచనల్లోంచి, నాలుగు కాలాల పాటు నిలిచే రచయితల మాటలని సంకలన పరచారు.

ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ, తెలుగు సాహిత్యంలో వైవిధ్యలేమిని బూదరాజు గారు నిష్కర్షగా వివరించారు: “కవి, కవిత, స్త్రీ, ప్రేమ, జీవితం వంటి సర్వసాధారణ విషయాలను ప్రస్తావించిన వాళ్ళ సంఖ్య అపారం. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ ఆధునిక సమాజం సంభావించే విషయాలనూ విమర్శించిన, వివరించిన వాళ్ళ సంఖ్య తక్కువ.”

అలాగని ఇంగ్లీషులో సంస్కృతంలో వున్న పుస్తకాలతో పోల్చుకొని క్రుంగిపోకుండా మనకున్నదాంట్లోనే వున్న సొగసులని చూపిస్తూ, యువతరం మీద ఎంతో వుత్సాహాన్ని వెలిబుచ్చారు: “సుప్రసిద్ధులనుకుంటున్న అనేక రచయితలకన్నా అంత ప్రసిద్ధులు కాని యువతరం రచయితలు వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. జీవం జవం గల భాషనూ భావాలనూ ప్రకటిస్తున్నారు.”

దీంట్లో నాక్కనిపించిన లోపం రచయితల సూచికలో పేజీల వివరాలు లేకపోవడం. తెలుగు పుస్తకాల్లో సరయిన సూచిక (Index) లేకపోవడం కొట్టొచ్చినట్లు కనపడే లోపం; ఈ విషయంలో పాతకాలపు ప్రచురణకర్తలే నయం. ఈ పుస్తకం అంకితపు మాటలు నన్ను ప్రత్యేకంగా ఆకర్షించాయి: “ప్రతికూల మిత్రులకు.” ఈ రచయిత ఎవరో గడుసువాడులాగుందే, మరికాస్త తెలుసుకుందాం అని ప్రయత్నిస్తే ఆయన స్వీయ చరిత్ర దొరికింది.

“విన్నంత కన్నంత” లో బూదరాజుగారి విశిష్ట వ్యక్తిత్వమేగాకుండా సామాజిక జీవిత చరిత్ర కూడా వెల్లడవుతుంది. ముందుగా నాకాశ్చర్యమూ సంతోషమూ కలిగించింది – ఆయన మా ఊరికి పది పదిహేను మైళ్ళ దూరంలో వున్న వేటపాలెం గ్రామ వాస్తవ్యుడు కావడం. నాకిన్నాళ్ళూ తెలియనందుకు నా అజ్ఞానానికి సిగ్గు వేసింది. వేటపాలెం చీరాల పట్టాణానికి అయిదారు మైళ్ళ దూరంలో వున్న గ్రామం. ఆ ఊరు “జీడిపప్పు”కి పెట్టినపేరు.

అంతకన్నా గొప్ప పేరు గలది ఆ వూళ్ళోని “సారస్వత నికేతన” గ్రంథాలయం – మన రాష్ట్రంలో కెల్లా చరిత్రాత్మకమైనది. అది ఈ పుస్తకంలో అనేకసార్లు ప్రస్తావనలోకొస్తొంది. దానికి 1929లో మహాత్మాగాంధీ శంకుస్థాపన చేశారు. నిజానికి చీరాలలో కన్నా వేటపాలెం లోనే సాంస్కృతిక వాతావరణం ఎక్కువ; అందుకు కేంద్రం గ్రంథాలయమే. డబ్బూ, చదువుకోడానికి సమయమూ అంతగాలేని అనేకమంది పౌరులు ఈ సమావేశాలకి వచ్చి పెద్దలని గూడా తమ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాళ్ళు.

ఒకసారి తెలుగులెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు ప్రసంగించడానికి వచ్చారు. ఆయన మాట్లాడటం మొదలు పెట్టీ పెట్టక ముందే, ఒక సభ్యుడు లేచి, “అయ్యా, తిక్కన భారతం లో మీ దృష్టిలో చెత్తపద్యమనిపించే దొకటి చదివి, మీరు రాసిన మంచి పద్యం కూడా చదివి, మీరే విధంగా అభినవ తిక్కన బిరుదుకు తగిన వారో వివరించి మాకు జ్ఞానం ప్రసాదించండి” అన్నాడు. “ఎవరో ఒక నిండు సభలో ఇస్తే కాదనలేక తీసుకున్నాను గాని, నేనంతటి వాణ్ణి కాదు” అని తుమ్మల సమాధానం ఇచ్చారు. తుమ్మల వారి వినయం, సభ్యుడి తెంపరితనం ఈ కాలపు సభల్లో వింటామా? కంటామా? అంటారు బూదరాజు.

“ఈమాట”లో ఈమధ్య “ఏతావాతా” అనే పదం ఎక్కువగా వినబడుతోంది. దీని అర్థమేమిటా అని “శబ్దార్థరత్నాకరము”లో వెతికితే కనపడలేదు. బూదరాజు గారి “మాటల వాడుక: వాడుక మాటలు; అనుభవాలు-న్యాయాలు” పుస్తకంలో దీనికి చక్కని వివరణ ఉంది

కులమతాభిమానాలున్నా అవి ద్వేషాలుగా మారలేదనీ, పంచాయతీరాజ్ ఎన్నికలు వచ్చింతర్వాతనే అవి దురభిమానాలుగా ద్వేషాలుగా మారాయనీ, మత ప్రసక్తి వచ్చినా ఎంత సులభంగా సమసిపోయేదో నిరూపించడానికి చీరాలలో కళ్ళారా చూసిన – సాహెబుగారికీ పంతులుగారికీ మధ్య జరిగిన – కుస్తీ పోటీని వర్ణించారు.

స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సామాజిక వాతావరణం లో కలిగిన మార్పులన్నీ చెప్పాలంటే పది మహాభారతాలవుతుందంటూ, క్లుప్తంగా వివరించిన భాగంలో ఆసక్తికరమైన విషయాలెన్నో వున్నాయి. పళ్ళు తోముకోడానికి కచ్చిక, బొగ్గు, వేపపుల్లలనుంచి పళ్ళపొడికి, చద్దన్నం నుంచి ఇడ్లీ కాఫీలకి, భావకవిత్వం నుంచి వచన అభ్యుదయ సాహిత్యానికి తొందరతొందరగా మార్పులొచ్చాయి. అప్పట్లో సాహితీ పత్రికలన్నిటిలోనూ మకుటం లేని మహారాణి “భారతి”. బెంగాలీ సాహిత్యం ప్రభావంతో కొన్ని కులాలలో పేర్ల చివరన బాబు, చౌదరి వచ్చి కలిశాయి. దాతృత్వంతో మొదలైన విద్యాసంస్థల్లో “మన వాళ్ళు” వుండాలనే భావం విస్తరించింది.

ఆయన హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడు తెలంగాణా పోరాట సమయం. కమ్యూనిస్టు మహా నాయకులిద్దరు – పుచ్చలపల్లి సుందరయ్య, బద్దె ఎల్లారెడ్ది – వేటపాలెం ఊరికి పడమట తోటల్లో రహస్య జీవనం మొదలెట్టారు. తూర్పున పొలాల్లో గుడిసెలో బూదరాజు గారి దూరపు బంధువూ కమ్యూనిస్టూ అయిన కస్తూరి కుటుంబరావు గారు భూగర్భ జీవనం గడుపుతున్నారు.

వీళ్ళిక్కడ దాక్కున్నారని తెలిసినా ఎంత వెతికినా స్థానిక పోలీసులకి దొరక్కపోతే మలబార్ పోలీసులు వచ్చి వూళ్ళోవాళ్ళని వేధించడం మొదలెట్టారు. ఆబాధ పడలేక సారస్వత నికేతనం కార్యదర్శి మధ్యవర్తిత్వంతో రాజీ కుదిరిస్తే కుటుంబరావు గారు పిస్టలు ఇచ్చేశారు. అరెస్టుచేసి విచారణ చేస్తామని మాట ఇచ్చిన పోలీసులు వెంటనే ఆయన్ని అక్కడే వేలమంది కళ్ళ ఎదుటే కాల్చి చంపి, ఒంగోలు సమీపం లోని చింతలపాలెం లోని చింతలతోపులో పోలీసులతో హోరాహోరీ పోరాడి మరణించాడని పేపర్లో, రేడియోలో ప్రకటించారు!

బూదరాజు గారికి మనసు విరిగి, కాంగ్రెసు మీదా ప్రభుత్వం మీదా ద్వేషం కలిగి, పగ తీర్చుకోడానికి తెలంగాణా పోరాట దళాల్లో చేరడానికి కూడా సాహసించారు. అడవిపట్టున నాలుగు రోజులుండేటప్పటికి ఆవాతావరణం వొంటికి పడకపోవడంతో బుద్ధొచ్చి ఇంటికి చేరుకున్నారు.

వేటపాలెం లోని సారస్వత నికేతన్ బూదరాజుగారికి మొదటి విశ్వవిద్యాలయం అయితే, రెండోది, ఇంటర్మీడియట్ చదవటానికి గుంటూరు వెళ్ళినప్పుడు, అక్కడి రైల్వేస్టేషన్. స్టేషన్ ఆవరణలో అమరావతి రోడ్డువైపున్న ఖాళీ స్థలంలో రోజూ సాహితీగోష్ఠి జరిగేది. గుంటూరులోని సాహితీకారులేకాక, చుట్టుపక్కల అమరావతి, నరసరావుపేట నుండి కూడా వచ్చి పాల్గొనేవారు. కరుణశ్రీ, జాషువా, కుందుర్తి, బెల్లంకొండ, శిష్ట్లా, ముదిగొండ, అమరేంద్ర మొదలైనవాళ్ళంతా అలా పరిచయమయిన వాళ్ళే.

మలేరియాతో మంచానపడితే నాలుగురోజులు అంటిపెట్టుకొని కాపాడిన జాషువా సంరక్షణ మరిచిపోలేనిది. “జాషువా కవిత్వం రవ్వలు రాలుస్తుందిగాని ఆయన మాత్రం పరమసౌమ్య శాంతమూర్తి. మీసాలూ కోటూ ఆయన నిజస్వరూపాన్ని మార్చి చూపుతాయి,” అంటారు బూదరాజు. జాషువా ఈలవేసి సంప్రదాయ నాటకరంగ పద్ధతిలో పద్యగానం చేస్తుంటే గుంటూరు ప్రజలు గుంపులు గుంపులుగా చూసేవాళ్ళు. అప్పటినుంచీ వున్న కవితా వ్యసనం బూదరాజు గారినెప్పటికీ వదల్లేదు.

వాల్టేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చేరిన బూదరాజు, B.Sc., Honors లో సీట్లు సిఫారసు వున్న వాళ్ళకే ఇస్తున్నందుకు ప్రొఫెసర్ తో ఎదురుతిరిగారు. ఆయన, క్రమశిక్షణ పాటించనందుకు వెళ్ళగొట్టి, “ఈ యూనివర్సిటీలో నీకు పుట్టగతులుండవు” అని బెదిరించాడు. “నా ఇష్టం వచ్చిన మరో కోర్సులో చేరి ఈ మూడేళ్ళూ నిన్ను నిద్రపోనీ” నని బూదరాజు శపథం చేశారు. ఆ విధంగా “Science వెలగబెట్టాల్సినవాడు తెలుగు తగలేస్తున్నాడ”ని ఇంట్లో వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది.

ఒకరోజు గ్రంథాలయంలో సరయిన తెలుగు పుస్తకాలేమీ కనిపించక నిరుత్సాహపడి, తిరిగివస్తూ, ఓ సంస్కృత మూలగ్రంథం కనిపిస్తే, షెల్ఫ్ నుంచి తీశాడో లేదో, తనకి రెండేళ్ళు సీనియర్ అయిన నాయని కృష్ణకుమారి గారు నిలవేసి, “నీకేమర్థమవుతుంది? నాకవసరం” అని లాక్కోబోయారు. “నాకు అర్థమవుతుందో కాదో తేల్చే అధికారం మీకేముంది?” అని బూదరాజు రెట్టించారు. ఈ గొడవ విని లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణరావు గారు పరిగెత్తుకొచ్చి సర్దిపుచ్చారు.

ఆతరవాత బూదరాజు అబ్బూరిగారి కుటుంబసభ్యుల్లో ఒకరన్నంతగా దగ్గరయారు. అబ్బూరి ప్రభావం శ్రీశ్రీ మీద వున్నట్లే బూదరాజుమీద గూడా పడింది. భాషని ప్రత్యేక విషయం గా తీసుకోడానికీ, “క్షుద్రవిషయాలకు గ్రాంథికం వాడి గొప్పవాటికి వాడుకభాష వాడాలనే” నిర్ణయానికీ అబ్బూరే దోహదం.

సాహితీ రంగాల్లోనే కాక, విద్యార్థి రాజకీయాల్లోనూ అనేకరకలైన గొడవల్లోనూ తలదూర్చి, పొట్టి శ్రీరాములుగారి ఆత్మార్పణ తర్వాత జరిగిన పోలీసు కాల్పులతో చివరకి పోలీసు రికార్డుల్లో బూదరాజు పేరు చిరస్థాయిగా చేరిపోయింది. విద్యార్థి దశతర్వాత ఆయన రాజకీయాల్లో పాల్గొనలేదు.

మరో పది నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా విశ్వనాథ సత్యనారాయణగారు ఎక్కారు. ఆయన్ను నేను గుర్తించాను గాని నేనెవరో ఆయనకు తెలియదు. ఆయన రచనలకన్నా ఎన్నో రెట్లు ఆయన వ్యక్తిత్వం గొప్పదనీ, కాని ప్రవర్తన విపరీతంగా కనిపిస్తుందనీ అబ్బూరి వారెప్పొడో చెప్పారు. ఆటపట్టించి చూద్దామనిపించింది.

డిగ్రీ చదువు పూర్తిచేసి, పరిశోధన చేసే ఆసక్తి వున్నా, కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా, చీరాలలోనే వుపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. అక్కడ క్లాసులో పచ్చిబూతులున్న శృంగారభావనలున్న పాఠ్యాంశాలను చెప్పలేక బాధపడేవారు. “భామినీ విలాసం”లో వున్న “రతిత్వర పీడాలస నాకయోషి దధరస్వాదూపహాసంబు మత్సరసాలాపవిలాస మేసుకృతి యాస్యంబందు లాస్యం బిడున్?” అన్నదాన్ని తెలుగులో అంతమంది ఆడపిల్లల ముందర – అందులో చాలామంది బంధువులు – చెప్పలేక వృత్తినుండి బయటపడాలనిపించేది.

దానితో పాటు ముక్కుసూటిగా పోయే మనిషికావడాన పై అధికారులతో ఇబ్బందులు తోడు! ఒకసారి మెట్రిక్ పరీక్షలు రాసేవాళ్ళని, బూదరాజూ, vice principal నాయుడు గారూ కాపలా కాస్తున్నారు. నాయుడు గారు బయటకి వెళ్తూ, ఇద్దరబ్బాయిలను చూపెట్టి వాళ్ళని “ఓ కంట కనిపెట్టమని” చెప్పారు. అబ్బాయిలిద్దరూ జేబుల్లోంచి కాగితాలు తీశారు. బూదరాజు వాళ్ళని బయటకు వెళ్ళగొట్టారు. పది నిమిషాల్లో తిరిగి వచ్చిన నాయుడు గారికి వాళ్ళు లేని కారణం తెలిసి ముఖంలో నెత్తురు చుక్క లేదు. వాళ్ళిద్దరూ vice chancellor గారి అన్న కొడుకులు; అందుకని కాస్త “కనిపెట్టి చూడండి” అన్నారు!

ఆ సాయంత్రం వాళ్ళిద్దరిలో ఒకడు తన బలం చూపించటానికి బూదరాజు మీదకి వచ్చాడు. “చదివి రాసి పరీక్ష నెగ్గు, బెదిరించి నువ్విక్కడ గంటగూడా బతకలేవు” అని బూదరాజు తెగింపు. “నీవు Science చెప్పగలవా? తెలుగు మేష్టారువి. చదివించగలవా?” అని రెట్టించి మాట్లాడితే సవాలుగా తీసుకుని చదువు చెప్పాడు. అతను నీతిగా పరీక్ష రాసి నెగ్గి, ఎంతో మారిపోయి పై చదువుల్లో ఉత్తమ విద్యార్థి ననిపించుకున్నాడు. రీసర్చికి విశాఖ చేరి “వీర కమ్యూనిస్టు”గా మారి ఫాక్టరీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పాయాడు – అతనే వాసిరెడ్డి వెంకటప్పయ్య. అతనితోపాటు మరణించింది N.S. ప్రకాశరావు. వాళ్ళని గుర్తుంచుకోడానికని రావిశాస్త్రి “రత్తాలు-రాంబాబు” నవలని వాళ్ళిద్దరికీ అంకిత మిచ్చాడు.

అయిదారేళ్ళు ఉద్యోగం చేసింతర్వాత సెలవు పెట్టి PhD చెయ్యడానికి తిరిగి వాల్టేరు చేరారు బూదరాజు.