గ్రేడింగ్ అమ్మలు

[రచ్చబండ నుండి రచయిత అనుమతితో]

ఇది పిచ్చికల గురించీ కాదు, సమీక్షల గురించీ కాదు. పొగాకు గురించి. వాసన పడని వాళ్ళు ఇక్కడే ఆగిపోవడం మంచిది.

జొన్న, సజ్జ లాంటి తిండి గింజలు పండిచడం మాని రైతులు పొగాకు వెయ్యడంతో మా ఊళ్ళొ అప్పట్లో (1970 ప్రాంతంలో) గొప్ప మార్పులొచ్చాయి. అప్పటిదాకా డబ్బులు (cash) కావాలంటే ఊళ్ళో గగనంగా ఉండేది. కొద్దిమంది ఉద్యోగస్తులు తప్ప, మిగిలిన వాళ్ళంతా గింజలతోటే లావాదేవీలు చేసేవాళ్ళు. పొగాకు పండించి కంపెనీలకి అమ్మితే డబ్బొచ్చేది. ఆ విధంగా ఊళ్ళో డబ్బులు కనబడసాగాయి.

పొగాకుని బ్యార్నీ లో మగ్గించి, నాసి రకాన్ని తీసేసి, మంచిది బేళ్ళకి వేసి, రైతులు కంపెనీ వాళ్ళకి అమ్మేవాళ్ళు. పొగాకు అమ్మడం నాకు ఇప్పటికీ బాగా గుర్తు. రైతులంతా, పొగాకు బేళ్ళని, ఊరి బయట ఒకచోట చేరవేసి ఉంచేవాళ్ళు. ఒంగోలు నుండో, మేదరమెట్ల నుండో, కంపెనీ “దొర” వచ్చేవాడు. నాకు దొరని చూడటం అదే మొదటిసారి! నిక్కరు, టీ షర్టూ వేసుకొని, పిట్టలుకొట్టేవాడి లాగా జీపులో దిగేవాడు. ఇంగ్లీషులో ధూం! ధాం! అని మాట్లాడేవాడు.

నాకప్పట్లో ఇంగ్లీషు బొత్తిగా రానందువల్ల ఆభాషలో ధారాళంగా మాట్లాడే వాళ్ళంటే, చెప్పలేనంత భయభక్తులుండేవి. మా అయ్యవారు, అంటే RMP డాక్టరు గారు, (ఊర్లోకి తరువాత MBBS డాక్టరు వచ్చింతర్వాత ఆయన కొత్త డాక్టరు, ఈయన పాత డాక్టరు అయ్యారు) Indian Express తెప్పించుకునేవాళ్ళు. ఆయన ప్రతిరోజూ అంత లావూ పొడుగూ వున్న పేపరు ఇంగ్లీషులో ఎలా చదవగలడా అని నాకు బోలెడు ఆశ్చర్యమేసేది. సంవత్సరమంతా కష్టపడితే నేను ఒకటో రెండో ఇంగ్లీషు పుస్తకాలు, క్లాసుకి సంబంధించినవి, చదివి అదే గొప్ప అనుకునేవాణ్ణి. ఎప్పుడన్నా Medical Representatives వచ్చి, వాళ్ళూ డాక్టరు గారూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటే, నేనా సంభాషణ వినడానికి చెవులు కొరుక్కునేవాణ్ణి. నేనెప్పటికైనా అలా మాట్లాడగలనా అని ఆలోచనలో పడేవాణ్ణి.

మరి ఇక దొర గారంటే అచ్చమైన ఇంగ్లీషు కదా మాట్లాడేది! దేవుడే దిగి వచ్చినట్లనిపించింది నాకు. పెద్దగా మాట్లాడిందీ, ఎవరికీ అర్థమయ్యిందీ ఏమీ లేదనుకోండి. ఆయన చేసిందల్లా పొగాకు కాడ ముక్కు దగ్గర పెట్టుకొని రేటు పలకడం. ఓ గంటలో వంద బేళ్ళకి రేట్లు పలికి తిరిగి జీపులో దుమ్మురేపుకుంటూ వెళ్ళేవాడు. మా పొగాకు వాసనకి దొర ఎంత ముగ్ధుడయ్యాడు అని చెప్పుకునే వాళ్ళు రేటు కాస్త ఎక్కువ వచ్చిన వాళ్ళు. ఆ రోజంతా దొర గారి వేషభాషల గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఊళ్ళో. నాకీమధ్యదాకా ఈ బ్రిటిషు దొరల్లో చాలా మంది వాళ్ళ ఊళ్ళో కనీసం పదో తరగతికూడా పాసవని ప్రబుద్ధులని తెలియదు.

కంపెనీలు రైతుల నుండి పొగాకుని కొన్న తరువాత, దాన్ని నాణ్యమైన గ్రేడింగు చేయించి, వాసిని బట్టి రకరకాల సిగరెట్లకి వాడటానికి వేరే కంపెనీలకీ దేశాలకీ అమ్మేవాళ్ళు. దీనికి మేదరమెట్లలో పెద్ద పెద్ద గ్రేడింగ్ కంపెనీలు ఉండేవి. అది మా ఊరికి అయిదారు మైళ్ళ దూరంలో, మద్రాసు-కలకత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద ఉంది. మా ఊరి నుంచి చాలా మంది ఆడవాళ్ళు – అగ్ర వర్ణాల వారితో సహా – ఈ పనికి మేదరమేట్ల వెళ్ళేవాళ్ళు – రోజూ కాలి నడకన!

ప్రొద్దున్నే లేచి, అన్నం వండుకొని, అయిదారు మైళ్ళు నడిచి, రోజంతా గ్రేడింగ్ చేసి, తిరిగి రాత్రికి ఇంటికి చేరుకొని, ఇంటి పనులు చేసుకునే వాళ్ళు. చాలా కష్టమైన పనేగాని, దీని మూలంగా ఎంతో మందికి కాస్త డబ్బులు చేతికొచ్చాయి. ఆడవాళ్ళకి కొంత స్వతంత్రం దొరికింది. సొంతంగా కాస్త సరదాలకి – పూలకి, పళ్ళకీ, ఎప్పుడన్నా సినిమాకి – కర్చు చేసేవాళ్ళు. చక్కగా అలంకరించుకొని కాలేజీకి వెళ్తున్నట్లుగా పనికి వెళ్ళేవాళ్ళు. ప్రొద్దుట పూట, వాళ్ళ నడక ఉరుకులు, పరుగులతోనే. మరి కంపెనీ పని ఆంటే టైంకి అక్కడ ఉండాలి – లేటయితే తిరిగి ఇంటికొచ్చెయ్యాలి, కూలి డబ్బులు రావు, నడక వృధా.

సాయంత్రానికల్లా పిల్లలంతా చెరువు గట్టుకి చేరి అమ్మలకోసం ఎదురుచూడటం, వాళ్ళెంత ఉసూరు మంటూ ఊరు చేరినా, మమ్మల్ని చూసి నవ్వుల పువ్వులు కావడం, అప్పుడప్పుడు వాళ్ళ టిఫినీ గిన్నెలో మరమరాల ముద్దలు దొరకడం – అవి ఓ జీవితకాలపు మధురానుభూతులు.

వీళ్ళల్లో కూడా కాస్త తారతమ్యాలు ఉండేవి. Golden Company లో పని చేసేవాళ్ళు చాలా stylish గా ఉండేవాళ్ళు. వాళ్ళ కూలీ రేటు కాస్త ఎక్కువ. కంపెనీ చీటీ (seat?) ని వేరేవాళ్ళకు అమ్ముకోవచ్చుకూడాను – మనకిక్కడ ప్రయివేటు క్లబ్బుల్లో membershiup లాగా! మా అమ్మ East India Company లో పనిచేసేది. నేను ఈ కంపెనీ గురించి బళ్ళోకంటే ఇంట్లోనే ముందర విన్నా. సంవత్సరాల తరబడి మా ఊరి ఆడవాళ్ళు ఈ గ్రేడింగ్ చాకిరి చేశారు.

గ్రేడింగ్ పని ఒక విధంగా చూస్తే సుఖమైన పని. నీడన ఉండి కడుపులో చల్ల కదలకుండా చెయ్యొచ్చు. కాని అదే వచ్చిన తంటా. బయట పొలం పనిలో కాస్త మంచి గాలి పీలుస్తూ, చెట్టూ చేమా చూస్తూ, ఆడుతూ పాడుతూ పని చేస్తాం. ఇది అలా కాదు. ప్రొద్దస్తమానూ ఉన్నచోటనే ఉండి కాళ్ళు కదపకుండా చెయ్యాలి. కంటికీ, చేతులకీ యాంత్రికమైన పని – రోజంతా. మా ఊళ్ళో నేనెప్పుడన్నా గ్రేడింగ్ పనికి వెళ్తే, నాలుగ్గంటలకే నాకాళ్ళు తిమ్మిరెక్కడం నాకిప్పటికీ గుర్తు.

కవిగా మంచి పేరున్న మా ఊరి మాష్టారు నాగభైరవ కోటేశ్వరరావు గారు, మిగిలిన మా ఊరి, జిల్లా కవులు, రంగాజమ్మ మీదా, గుళ్ళకమ్మ వాగు మీదా కవిత్వం రాశారు కాని, ఈ గ్రేడింగ్ అమ్మల కళ్ళలోగాని చేతుల్లో గాని వాళ్ళకి కవితా వస్తువు కనిపించినట్లు లేదు.


కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి: పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది Washington రాష్ట్రంలో Seattle నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో. దాదాపు పాతికేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత మూడేళ్ళుగా కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం - అదీ ప్రస్తుత వ్యాపకం.  ...