“సుధా నే వెళ్ళి పోతున్నా” బాత్ రూమ్ బయటనుంచి సుధకి వినపడేలా ఓ గావు కేక పెట్టి బయటికి నడిచాడు సతీష్.
ఇంకా కమ్యూనిటీ లో ఎవరూ బయలు దేరి నట్టు లేరు. పిల్లలందరూ ఈ పాటికే స్కూలు బస్సుల్లో ఉడాయించేసి ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా బాత్ రూముల్లోనే ఉండి ఉంటారు. తాను మాత్రం ఏదో పొద్దున్నే మీటింగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్తున్నాడు గానీ లేక పోతే మరో అరగంట తర్వాతే కదా బయట పడేది. ఆలోచిస్తూనే గబ గబా షూస్ వేసుకుని, కారు స్టార్ట్ చేశాడు. రివర్స్ చేసి కమ్యూనిటీ రోడ్డు మీద గేట్ వైపు పోనిచ్చాడు.
గేటు ఆనుకునే కమ్యూనిటీ క్లబ్ హౌస్. క్లబ్ హౌసు ముందు కొచ్చాక గుర్తొచ్చింది, ఈ రోజు రాత్రి ప్రసాదు కొడుకు పుట్టిన రోజు పార్టీ అని. క్లబ్ ముందు కారు ఆపాడు సతీష్. వాచ్ మన్ పరుగున వచ్చాడు.
“ప్రసాద్ సారు ఎన్నింటికని చెప్పిండు రాత్రి పార్టీ” తెచ్చిపెట్టుకున్న తెలంగాణాలో అడిగాడు సతీష్ వాచ్‌మాన్ ని.
“పార్టీ ఇవ్వాళ కాద్సార్. శనారం నాడు. ఈ రోజు బాబు పుట్టిన రోజు. పార్టీ శనారమయితే అందరూ వస్తారని ఆ రోజు పెట్టారు సార్. ఆయ్!”. దీర్ఘాలు తీస్తూ గోదావరి జిల్లాని నాలుగు లఘు వాక్యాల్లో ఆవిష్కరిస్తూ సమాధానం చెప్పాడు వాచ్‌మన్.
కారు క్లబ్ నీ, కాలనీ గేట్ నీ దాటి బయటికి నడిచింది.
సతీష్ అనుకున్నట్టుగానే ఇంకా ఆఫీసులకెళ్ళే పెద్ద వాళ్ళు రోడ్లమీదకి రాలేదు . స్కూలు బస్సులూ పిల్లలూ రోడ్లని ఆక్రమించి ఉన్నారు. మరో అరగంట తర్వాత బైకులూ, కార్లతో పెద్ద వాళ్ళు రోడ్లని తమవి చేసు కుంటారు. టిఫిన్ సెంటర్లూ, రెస్టారెంట్ లూ తప్పా ఇంకా ఏ షాపులూ తెరిచి లేవు.
కారు జుబిలీ హిల్స్ రోడ్డు మీదకి చేరేటప్పటికి ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయి ఉంది. రోడ్డు వెడల్పు పెంచే పనుల్లో సగం పగల గొట్టిన గోడలూ, రోడ్డుమీద వేసిన కంకర, ఇసక… వాటి మధ్య నించి ఎలాగోలా ఇరికి, దూరి, పాకి మిగతా వాళ్ళందర్నీ వెధవల్లా జమకట్టి పారిపోదామను కుంటున్న అభినవ షూ మాకర్ ల ధాటికి పూర్తిగా నిలిచిపోయిన ట్రాఫిక్.
“ఈ రోడ్డేదో అయిపోతే కనీసం అరగంట ఎక్కువ నిద్ర పోవచ్చు” భవిష్యత్తు లో జరగబోయే మంచిని తలచుకుంటూ పొద్దున్నే మూడ్ పాడవకుండా విసుగుని కాస్త దూరంలో ఉంచే ప్రయత్నం చేశాడు.
అర్జున్ ఇక్కడి దాకా రాగలిగాడంటే, నేను బిల్ గేట్సుని దాటితే తప్పా సమ ఉజ్జీని కాలేను అని అనుకుంటూ పనిలో చేరిపోయాడు సతీష్.
పూర్తిగా నిలిచి పోయిన కార్లోంచి యథాలాపంగ చుట్టు పక్కల చూట్టం మొదలు పెట్టాడు. మొదట ఓ నిమిషం గమనించలేదు గానీ తన కారు పక్కనే దాదాపు ఆనుకుని వున్న స్కూటర్ మీద కూర్చున్న వ్యక్తి తననే చూస్తున్నాడని అనిపించ గానే తిరిగి అటు వైపు చూశాడు.
“సతీష్?” ప్రశ్నార్థకంగా అడిగాడు స్కూటర్ మీద వ్యక్తి.
“అవును మీరూ… నువ్వు .. .అర్జున్… అవునా ?” ప్ర శ్నించ బోయి వెంటనే గుర్తు పట్టి అడిగాడు.
“కారు ఆగంగానే చూశా… రంగు వచ్చినట్టుంది. ఆ కళ్ళజోడు… కొంచెం అనుమానించి నువ్వే పలకరిస్తావులే అని చూస్తున్నా” అన్నాడు అర్జున్.
ఇంతలో ట్రాఫిక్ కదిలింది. వెనక వాళ్ళు హారన్ మోతలు మోగించకముందే బయలు దేరటం మంచిదని “ముందు ఆపుతా” అని స్కూటర్ని ముందుకు పోనిచ్చాడు అర్జున్.
అర్జున్ అలా కొంతదూరం ముందుకు పోయి త్రినేత్ర ముందున్న పార్కింగ్ లోకి స్కూటర్ పోనివ్వడాన్ని గమనించి కారు ఇండికేటర్ వేశాడు సతీష్. ఎదురొస్తున్న ట్రాఫిక్ లోకి అంగుళం అంగుళం చొప్పున దూరి, దాన్ని దాటి రోడ్డు కి కుడి వైపు ఉన్న పార్కింగ్ లోకి చేరాడు సతీష్.
“హైదరాబాదు ఎప్పుడు చేరావురా? నాకు తెలిసి ఖమ్మం దగ్గరే ఎక్కడో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లో చేస్తున్నావని విన్నా” సతీష్ దిగుతూనే మొదలెట్టాడు.
“మూడేళ్ళనించీ ఇక్కడే ఉన్నా. గవర్నమెంట్ జాబ్ వదిలి ఇక్కడే ప్రయివేట్ కాలేజీ లో చేరా”
గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కన్నా ప్రయివేట్ కాలేజీ ఉద్యోగాలు మెరుగయి పోయాయా అనే సందేహం వచ్చినా… దానికన్నా ముందు చాలారోజుల తర్వాత కలిసిన మిత్రుడితో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉండడంతో టాపిక్ మార్చి అన్నాడు.
“నా సంగతేమన్నా తెలుసా? ఆఖరి సారి మనం కలిసింది పదేళ్ళ క్రితం అనుకుంటా. నా MTech అప్పటికి అయ్యిందా?” గుర్తు చేసుకుంటూ అడిగాడు.
“చూచాయగా తెలుసు. సాఫ్ట్ వేర్ లో చేరావనీ అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జపాన్, సింగపూర్ ఎవేవో తిరుగుతున్నావనీ విన్నాలే. ఖచ్చితంగా తెలీదులే ఎక్కడున్నావో”
“అన్ని దేశాలేం తిరగలేదులే. ఆమెరికా చాలాసార్లే వెళ్ళాను. ఓ సారి లండన్, ఓసారి సింగపూర్ వెళ్ళా అంతే ప్రాజెక్ట్ పని మీద. ఎక్కడా ఉండిపోయే ఉద్దేశం లేదులే మొదట్నించీ. వెళ్ళి వచ్చేస్తుంటా. ఇక్కడే ఇల్లు కూడా కొనేసు కున్నా. ఓ భార్య, ఓ కొడుకు”
“ఓ భార్యేనా? ” సతీష్ ఆలోచించకుండా అన్న మాటని వెక్కిరిస్తూ నవ్వాడు అర్జున్. నవ్వాపుకుని అన్నాడు.
“నేనూ ఓ చిన్న ఫ్లాట్ కొనుక్కున్నాలే ఊరి బయట. ఒకే ఒక్క భార్య, ఇద్దరు పిల్లలూ. ఇద్దరూ మొగ పిల్లలే”.
ఆఫీసు మీటింగ్ గుర్తు కొచ్చింది సతీష్ కి.
“నేను తొందరగా మీటింగ్ కి వెళ్ళాలి. నీ నంబర్ ఇవ్వు. సాయంత్రం కాల్ చేస్తా. ఇంటిదగ్గర కలుద్దాం”. అన్నాడు.
ఇద్దరు మిత్రులూ ఫోన్ నంబర్లు తీసుకుని ఎవరి ఉద్యోగాలకి వాళ్ళు బయలు దేరారు.
పదేళ్ళ తరవాత కలిసిన మిత్రుడిని అంచనా వేసే ప్రయత్నం చేశాడు సతీష్. చిన్నప్పటి కోపం ఆవేశం ఇంకాఈ మనిషిలో ఉండి ఉంటాయా?
ఓ పల్లెటూళ్ళో పదో తరగతి దాకా కలసి చదువుకున్న మిత్ర్లులు అర్జున్ సతీష్ లు. అంత చిన్న పల్లెటూరు నించి ఇంత పెద్ద ఉద్యోగం దాకా రాగాలిగానన్న గర్వం అప్పుడప్పుడూ మెదిలినా, అర్జున్ గురించి ఆలోచిస్తే మాత్రం తను సాధించింది గొప్పేం కాదనిపిస్తుంది సతీష్ కి.
ఊళ్ళో అందరికీ బట్టలుతికే చాకలి సాంబయ్య కొడుకు అర్జున్. ఏడో క్లాసులో వాడు జిల్లా లోనే 3వ రాంకు. వాళ్ళ నాన్న చదువు మానిపిద్దామనుకుంటే స్కూలు పంతుళ్ళే ఫీజులు కట్టి వాణ్ణీ ఎనిమిదో తరగతిలో చేర్చారు. గవర్నమెంటు బళ్ళలో అడీగే నామ మాత్రవు ఫీజు కూడా కట్టలేని స్థితి సాంబయ్యది. వాళ్ళింట్లో కరెంటు కూడా లేక పోవడంతో సతీషి పక్కన చేరి చదువుకునే వాడు.
అర్జున్లో ఎవరికీ తెలియని ఒక కసి ఉండేది. పగలూ రాత్రీ పడి పడి చదివే వాడు. సతీషి తన కిష్ట మయిన లెక్కలూ సైన్సూ చదువుతుంటే, అర్జున్ ప్రతీ సబ్జక్ట్ నీ ఒకే ఇంటరెస్ట్ తో చదివేవాడు.
“చాకలోడి తెలివి తేటలు కూడా లేవు” అని సతీష్ ని వేళా కోళం చేసినా, అర్జున్ పట్ల మాత్రం ఏమాత్రం అమర్యాద చూపించలేదు సతీష్ కుటుంబం. సతీష్ తండ్రి గ్రామీణ బ్యాంకులో మానేజర్ గా పనిచేశే వాడు. చదువూ, ప్రభుత్వ ఉద్యోగం నేర్పిన సంస్కారం తో పల్లెటూరి కట్టు బాట్లకు కొంత దూరంగా ఉండేది సతీష్ కుటుంబం. సాంబయ్య పొద్దున వచ్చి విడిచిన బట్టలు తీసుకెళితే, అర్జున్ మాత్రం సతీష్ తో సమానంగా కూర్చుని చదువుకునే వాడు. వూళ్ళో చాలా మందికి ఇది మింగుడు పడేది కాదు. సాంబయ్యతో సహా.
“పెద్దోళ్ళతో కూర్చుని నువ్వూ పెద్దోడి వనుకో మాక” అని కొడుకుని అప్పుడప్పుడూ హెచ్చరిస్తూ ఉండే వాడు సాంబయ్య.
తమ హైటెక్ స్నేహితుల్లో ఇలాంటి పిలుపులు వినకపోవటంతో ఆ పిలుపెందుకో ఎబ్బెట్టుగా అనిపించింది సుధకి.
సతీష్ పదో తరగతి పరీక్షలవడంతోనే నానా తంటాలూ పడి వాళ్ళ నాన్న ఖమ్మం బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ చేయించు కున్నాడు. అక్కణ్ణించీ సతీష్ చదువు బయట ప్రపంచంలో పడి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ దాటీ MTech దాకా సాగింది.
అర్జున్ భద్రాచలంలో నానా తంటాలూ పడి ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ చేశాడు. తెల్లవారు ఝామున పేపర్ వేయటం దగ్గర్నించీ, ట్య్షూషన్లు చెప్పడం దాకా అన్నిపన్లూ చేసి డిగ్రీ చది వాడు. పన్లు చేస్తూ, డబ్బుల్లేకుండా సైన్స్ సబ్జెక్ట్స్ చదవటం కష్టమని తెలిసి ఇంగ్లీషు ని ఆశ్రయించాడు. BA ఇంగ్లీషులో పూర్తి చేసి, నాగార్జునా లో MA కూడా పూర్తి చేశాడు. ప్రతీ పైసా లెక్క వేసుకుంటూ అతికష్టం మీద పల్లెటూరు చాకలి కొడుకు ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఉద్యోగం దాకా సాధించాడు.
చదువులయే దాకా ఏదో రకంగా పరిచయాన్ని కాపాడుకుంటూ వచ్చిన మిత్రులు, సొంత ఉద్యోగాలూ , జీవితాలు ప్రారంభిచాక మాత్రం దూరమయిపోయారు.
గతాన్ని నెమరువేసుకుంటూ ఆఫీసు చేరాడు సతీష్. అర్జున్ ఇక్కడి దాకా రాగలిగాడంటే, నేను బిల్ గేట్సుని దాటితే తప్పా సమ ఉజ్జీని కాలేను అని అనుకుంటూ పనిలో చేరిపోయాడు సతీష్.