గడియారపు ముల్లులు

గోడ గడియారపు ముల్లుల్లా
బ్యాటరీ అయిపోయేవరకు
తిరుగుతూనే ఉంటాం మనం

గడియారపు సెకెన్ల ముల్లులా
నాకు కాస్త తొందరెక్కువ
అన్నీ అనుభవించెయ్యాలని
“ఎంజాయ్‌మెంట్‌ ” ముసుగేసుకొని
పక్కనున్నవాణ్ణి చూడకుండా
మన్ను మిన్ను కానకుండా
ఎవరో తరుముతున్నట్టు
పరుగుపెడతాను నేను

నా వెనకే మెల్లగా
గడియారపు గంటల ముల్లులా
అన్నింటినీ ఆస్వాదిస్తూ
అందరినీ పలుకరిస్తూ
ఆప్యాయంగా ఆదరిస్తూ
అనుసరించే వాళ్ళని చూసి
వాళ్ళేదో కోల్పోతున్నారని
ఎంజాయ్‌ చెయ్యడం లేదని
వాళ్ళ జీవితం వృధా అని
తెగ బాధపడతాను నేను
వేదాంతి లా నవ్వుతాను

ఐతే నాకు తెలియదు
గడియారం లో నేనున్నా లేకున్నా
పెద్దగా తేడా లేదని!
నాకంటూ గుర్తింపు లేదని!


మా పక్కింటి బాబు

మా పక్కింటి బాబు
దైవాంశసంభూతుడు

ఏదేదో మాట్లాడతాడు
ఒక్కముక్క అర్ధం కాదు
దేవుడి భాష మరి

బొమ్మలతో ఆడుకుంటూ
వాటిని తన్నేస్తాడు,విసిరేస్తాడు
ఎత్తుకుంటాడు ముద్దులాడతాడు
గట్టి గట్టి గా నవ్వుతాడు

చిన్ని చిన్ని చేతులతో
చిట్టి పొట్టి పాదాలతో
బోడిగుండుతో
బోసి నవ్వుతో
చూడగానే ముద్దొచ్చే వీడిలో
దైవాంశభరిత సౌందర్యం ఉంది!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...