…..ఉరకకురా పడేవు

“ఒరే, ఎప్పుడైనా మందు కొట్టావా?” అడిగాడు విలాస్‌, వరప్రసాద్‌ ని.
“ఛఛ! లేదు రా, నాకు ఇష్టం లేదు”, అనేసి చేతిలో ఉన్న మ్యాగజీన్‌ వంక చూస్తూ ఉండిపోయాడు వరప్రసాద్‌, ఆ విషయం పొడిగించటం ఇష్టం లేదన్నట్టు.
“నువ్వు?” శివ వైపు చూసాడు విలాస్‌.
“నన్ను మరోసారి ఈ విషయం గురించి అడగకు, ప్లీజ్‌”, అన్నాడు శివ.
ఎంత దాచుకుందామనుకున్నా తన తండ్రి తాగుడుకి బానిసై చనిపోయాడన్న బాధ దాగలేదు అతని గొంతులో.
తన ఫ్రెండ్స్‌ ఇచ్చిన రియాక్షన్‌ చూసి నిట్టూర్చాడు విలాస్‌, అదో రకమైన నిరాశతో.
అతని ఉత్సాహం చల్లార్చటం ఇష్టం లేనట్టు చెప్పమన్నట్టు చూసారు ఇద్దరూ విలాస్‌ వైపు.
“మా ఇంట్లో నిన్న మందు పార్టీ జరిగింది, మా డాడీ ఫ్రెండ్స్‌ చాలా మంది వచ్చారు. పార్టీ అయిపోయాక మా డాడీ బయటికి వెళ్ళారు అందరినీ సాగనంపటానికి. ఎవరూ చూడట్లేదు కదా అని చిన్న సిప్‌ వేసా! గొంతు మండింది మొదట. మన అనుకుంటాం కానీ బానే ఉందిరా టేస్టు!” చెప్పాడు విలాస్‌ కాస్త “గర్వం” గా.
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
“అరే, విలాస్‌ గాడికి, అది తప్పు అని చెప్పలేదేం?” వరప్రసాద్‌ ని అడిగాడు శివ.
“వాడికి ఇంకొకళ్ళు చెప్పటం ఇష్టముండదురా, నేను చాలా సార్లు గమనించాను. అయినా మొదటి సారి ఏదో సరదాకి చేసాడేమో, తెలుసుకుంటాడు వాడే అన్నట్టు చెప్పలేదు. మరి నువ్వూ చెప్పలేదే?”
“నువ్వన్నది నిజమే, నేను చెప్పబోయాను నువ్వు వచ్చేసాక. వాడు తనకు నచ్చదు అన్నట్టు ఎక్స్‌ప్రెషన్‌ పెట్టాడు” నిస్సహాయంగా అన్నాడు శివ.
==========================================
బేగంపేట్‌ఎయిర్‌పోర్ట్‌ అంతా సందడిగా ఉంది. ఆగస్ట్‌ లోనూ, నవంబర్‌ నెలాఖరులోనూ అలాగే ఉంటుంది అమెరికాకి వెళ్ళే స్టూడెంట్స్‌ తో. అందరూ జీన్స్‌ ప్యాంట్లు, లెదర్‌జాకెట్లూ తొడుక్కుని ఉన్నారు, ఈ నవంబర్‌లో చలి బాగా ఉంది.

“నువ్వు అమెరికాకి వెళ్తున్నావు అంటే హాపీగా ఉంది, I am proud of you, my son” ఆనందంగా అన్నారు రావుగారు. “Thanks, dad”, అంతే ఆనందంతో అన్నాడు విలాస్‌.
“నువ్వు అమెరికాకి వెళ్తున్న కారణం మర్చిపోకు, బాగా చదువుకోవాలి. “పుత్రోత్సాహము తండ్రికి…” పద్యం గుర్తుంది కదా…” మూర్తిగారు చెప్తూంటే తల ఊపుతున్నాడు వరప్రసాద్‌.
“నీకు నీ బాధ్యత బాగా తెలుసు, నా కొడుకు గొప్ప పేరు తెచ్చుకుంటాడని నాకు తెలుసు, నాకు మిగిలిన ఆశ నువ్వేనయ్యా..” బరువైన గుండెతో చెప్తున్నారు భారతిగారు శివతో. ఆ గొంతు వణుకుతున్నా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. భర్త పోయాక కొడుకుని కష్టపడి ఇంజనీరింగ్‌ చదివించింది ఆవిడ.

ఫ్లైట్‌ అనౌన్స్‌మెంట్‌ విని సెక్యూరిటీ వైపు అడుగులేస్తోన్న తమ పిల్లల వైపు చూస్తున్నారు తల్లితండ్రులంతా. అంత మంది ప్రయాణికులలోనూ తమ పిల్లలను గుర్తిస్తూ ఆనందం, బాధ, గర్వం, నమ్మకం అన్నీ కలసిన భావాలతో చేతులు ఊపుతున్నారు వాళ్ళు. రావు, మూర్తి, భారతి గార్లకి ఒకటే ధైర్యం నాలుగేళ్ళూ కలిసి తిరిగారు తమ పిల్లలు, ఇప్పుడు ఒకటే యూనివర్సిటీకి వెళుతున్నారు అంతా. కష్టానికి, సుఖానికి మనిషి తోడే కదా కావలసింది….
======================================
“Would you like to have any drinks, sir?” వినమ్రంగా అడిగింది ఎయిర్‌హోస్టెస్‌. కొత్తదనం, మొహమాటం, తడబాటు అన్నీ కలిపి “No, thanks” అనిపించాయి శివ, వరప్రసాద్‌ల చేత.
“What have you got?” దర్పంగా అడిగాడు విలాస్‌. పెద్ద లిస్ట్‌ చదివింది ఎయిర్‌హోస్టెస్‌. “Beer please” మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ అడిగాడు విలాస్‌ కాస్త బెరుకుగానే. మిత్రులిద్దరూ విచిత్రంగా చూసారు విలాస్‌ని.
“And you, sir?”, మళ్ళీ అడిగింది వీళ్ళని, వీళ్ళ బెరుకు గమనించిన ఎయిర్‌హోస్టెస్‌. ఈ సారి కాస్త తేరుకుని ఒకరు కోక్‌ అని, ఒకరు ఆపిల్‌జ్యూస్‌ అని అడిగారు వరప్రసాద్‌, శివ, ఇందాక విన్న లిస్ట్‌లోంచి.
===========================================
“కభీ దారూ పియా క్యా?” అడిగాడు అవినాష్‌. అతను కూడా వాళ్ళ యూనివర్సిటీ స్టూడెంటే.
“హా, టేస్ట్‌ తో కియా థా”, మొదట్లో ఉన్న బెరుకు లేదు విలాస్‌ గొంతులో.
“Cool! చలో ఫిర్‌, welcome to the gang!”, విలాస్‌ భుజం తట్టాడు అవినాష్‌.
======================================
“Hello..”
“అరే, విలాస్‌ హై క్యా?”
“One minute”…”విలాస్‌, నీకే…అవినాష్‌”.
“బోలో అవినాష్‌”
“కల్‌ పార్టీ మనారే హమ్‌, తూ జరూర్‌ ఆనా”.
“ముర్‌Xసే నహీ హోతా రే…”
“New year party man, we’re entering the new millennium! Come on యార్‌”
“I’ll try”
“Call your roomies too, ఉన్‌లోగోంకే లియే కుచ్‌ సాఫ్ట్‌డ్రింక్స్‌మంగాయేంగే. చిప్స్‌ వగైరా భి రహ్తే, obviously. Shall I tell them personally or will you call them?”
“I’ll bring them over, no prob’s man” అన్నాడు విలాస్‌, ప్రతి సారీ లాగే వాళ్ళని వదిలి వెళ్ళిపోతే వాళ్ళు ఫీల్‌ అవుతారేమో అన్న మొహమాటం, New Year party కదా అన్న హుషారూ కలిసి.
================================
“చాలురా విలాస్‌, ఇక వెళదాం, అమ్మ వెయిట్‌చేస్తూ ఉంటుంది ఫోన్‌ కోసం, ఇవాళ చేస్తానని చెప్పా” శివ అన్నాడు విలాస్‌ చేతిలో బాటిల్‌ లాక్కుంటూ.
“అవున్రా, నేను కూడా ఇంటికి ఫోన్‌ చెయ్యాలి, చాలా రోజులైంది…” తొందరపెట్టాడు వరప్రసాద్‌ కూడా.
వాళ్ళకి చాలా సేపటి నుంచి వెళ్ళిపోవాలని ఉంది, విలాస్‌ ఫీల్‌ అవుతాడనే వచ్చారు అసలు.
“Just ten minutes రా, అంతే”.
“పద, మళ్ళీ డ్రైవింగ్‌ కూడా చెయ్యాలి…”
“మనం కంట్రోల్‌తప్పటం ఉండదు, don”t worry dude” గర్వంగా చెప్పాడు ఏదో సాధించినట్టు. ….”bye boss, bye yaar, bye everyone” చెయ్యి ఊపాడు విలాస్‌ పార్టీలో అందరికీ.
ంంంంంంంంంంంంంంంం
“Are you okay? Drive చెయ్యగలవా?” వరప్రసాద్‌ అడిగాడు విలాస్‌ని.
“నీకు మరీ భయంరా”, థిలాసాగా నవ్వాడు విలాస్‌.
“పాపా కహ్‌తే హై బడా నామ్‌ కరేగా…” కార్‌ ఆడియోలోంచి. ఆ పాట టైంలో వచ్చిన హిందీ పాటలు ఇష్టం విలాస్‌కి. స్టీరింగ్‌ మీద వేళ్ళతో తాళం వేస్తూ నడుపుతున్నాడు. తన ఫ్రెండ్స్‌ ఇంకా ముభావంగా ఉండటం చూసి కన్విన్స్‌ చేస్తున్నట్టు “సారీ రా, చూస్తూనే ఉన్నారుగా, New Year party అంటూ బలవంతపెట్టేసారు….అరే, happy new year రా”, ఇద్దరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు.
“థాంక్స్‌రా, same to you”, చెప్పారు ఇద్దరూ.
తల్లిని తలుచుకుంటూ కళ్ళు మూసుకున్నాడు శివ, “ఇంటికి వెళ్ళగానే ఫోన్‌ చేయాలి” అనుకుంటూ.
పాట వింటూంటే “పుత్రోత్సాహము తండ్రికి…” పద్యం గుర్తొచ్చింది వరప్రసాద్‌కి, తన తండ్రి ఎప్పుడూ అనే వాడు తను గొప్పవాడౌతాడని. …
============
“అరే విలాస్‌!!” గట్టిగా అరిచాడు వరప్రసాద్‌. విలాస్‌ స్టీరింగ్‌ని పట్టుకునే కళ్ళు మూసుకుని ఉన్నాడు, అప్పుడే మైకం కమ్ముకుంది! కంట్రోల్‌ తప్పిన కారు ఎదురుగా వస్తున్న ట్రక్‌ని గుద్దేసింది, అంతా క్షణాల్లో జరిగిపోయింది! ప్రాణాలు పోవటం తెలుస్తోంది శివకి. తల్లి కనిపిస్తోంది ఆమె కళ్ళలో ఉన్నది ధైర్యమా దైన్యమా?
“Happy new year నాన్నా…”, వరప్రసాద్‌ అస్పష్టంగా అంటున్నాడు.
కష్టానికి, సుఖానికి తోడుగా ఉంటారనుకున్న స్నేహితులు కలిసే ప్రాణాలు విడిచారు….తమ వారికి సుదూరంగా….ఎవరూ లేని చోట అనాథల్లా…తమని పెంచిన ప్రేమని అనాథని చేస్తూ…
=============================
(ఆగస్ట్‌లో ఇండియా నుంచి Illinois Institute of Technology, Chicago కి వచ్చిన ముగ్గురు విద్యార్థులు సెప్టెంబర్‌లో ఒక కారు ప్రమాదంలో మరణించారు. కారణం డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి త్రాగి ఉండటమే. ఆ దుర్ఘటన ఆధారంగా కల్పించిన కథ ఇది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరుగకుండా ఉంటేనే వారి ఆత్మలకు శాంతి. ఆ పిల్లల తల్లితండ్రుల బాధలు చెప్పనలవి కాదు “మృతదేహాలని తీసుకుపోవటం కూడా కష్టమైంది insurance లేకపోవటం వలన” అని కూడా విన్నాను.)