పల్లకీ..

పొద్దున్న పదిగంటలకనగా రాజమండ్రీలో బస్సెక్కి, అపరాహ్నం వేళకి వాళ్ళ వూరు చేరాడు జగన్నాధం. స్టాండులో దిగేసరికి ప్రాణం లేచొచ్చినట్ట్లైంది. బస్సులో కూర్చున్నంతసేపూ ఒకటే ఉక్కపోత. పైగా కిక్కిరిసే జనం. వెధవ వేసంకాలం ప్రయాణాలంటే చెడ్డా ఛికాకు . అసలే వేడి, దానికి తోడు బస్సు వేడి. ఇంక పాసింజర్ల సంగతి చెప్పనే అఖ్ఖర్లేదు. చుట్టాకాల్చే వెధవొకడూ, బీడీ ముట్టించే వాడొకడూ. “ఛీ ఛీ!, వెధవ దేశం, ఎన్నాళ్ళెళ్ళినా వొకలాగే ఏడిసింది”..అంటూ రుమాలు తీసి మొహం తుడుచుకున్నాడు. **50 యేళ్ళ స్వాతంత్య్ర సంబరాలు..రండి..కదలి రండి.. **…బస్సు వెనకాల బోర్డు చూసి నవ్వాలో, యేడవాలో తెలియలేదు జగన్నాధానికి. ఇంతలో వచ్చిన పని గుర్తొచ్చి, తిన్నగా తోట కేసి బయల్దేరాడు.

సెంటర్లోంచి వెడితే కిళ్ళీకొట్టు వాడి దగ్గర్నించి, సినిమా హాలు వాడిదాకా అందరూ ఆపి మరీ పలకరిస్తారు. కొంచెం..తెలిసిన పెద్దవాళ్ళు కనిపిస్తే, యింటికొచ్చి కాఫీ తాగేదాకా వదలరు. మళ్ళీ సాయంత్రం మూడు గంటల బస్సుకి రాజమండ్రీ వెళ్ళకపోతే, రాత్రికి రైలు అందదు. కాబట్టి గోదారి గట్టమ్మటే పోదామని నిశ్చయించుకుని, నడక మొదలెట్టాడు.

ఒక పక్క ఎండగా వున్నా, ఆగి ఆగి గాలి వీస్తూండడంతో అతని మనసు కొంచెం కుదుట పడింది. అతనికి ఆవూరు చూస్తే వాళ్ళ అమ్మ గుర్తొస్తుంది. తను ఎన్ని సార్లు విసుక్కున్నా, ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది ఆ వూరు. గంభీరంగా ఉన్న గోదావరిని చూస్తే, వాళ్ళ నాన్న విశ్వేశ్వరం గారు గుర్తొస్తారతనికి. విశ్వేశ్వరం గారికి పదెకరాల పొలం వుండేది. కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయగా మిగిలిన అయిదెకరాలలోనూ, మూడు కొడుక్కీ, రెండు తన రైతు సుబ్బడికీ పంచేసి, పైకి వెళ్ళిపోయాడాయన. పరిస్థితుల దృష్య్టా పట్నం వెళ్ళిపోయాడు జగన్నాధం. పిల్లల చదువులకి రెండెకరాలు కరిగిపోగా, మిగిలిన ఎకరాన్నీ, సుబ్బడే చూస్తున్నాడు. ఆ భూమే, అతన్ని ఆరునెలలకోమాటైనా అక్కడికి రప్పిస్తూ వుంటుంది. పావు గంటలో తోటకి చేరుకున్నాడు. తోటలో వెంకడు దింపు తీయిస్తున్నాడు. జగన్నాధాన్ని చూసి, లెఖ్ఖాపి..”బాగున్నారాండీ?” అంటూ పలకరించి, సమాధానం కోసం ఎదురు చూడకుండా, ఓ బొండం చెక్కి చేతికిచ్చాడు.

అతనికి జగన్నాధాన్ని చూస్తే నిర్లక్ష్యంతో కూడిన గౌరవం. తాము ఇన్నాళ్ళూ, వీళ్ళ కుటుంబానికి సేవ చేశామని తలుచుకుంటే అతనికి ఎక్కడో అహం దెబ్బతింటుంది. దాంతో కాస్త నిర్లక్ష్యం.కానీ, అలా చేయడం వల్ల తామేమీ నష్టపోలేదనీ, పైగా యీరోజు ఆరెకరాల పొలం కొనుక్కోగలిగామనీ అనిపించి..అంతలోనే, కొద్దిగా గౌరవం.

“ఆ..ఆ..బానేవున్నాన్రా..” అంటూ బొండం తీసుకుని తాగుతూ..”సుబ్బడు రాలేదా?” అని అడిగాడు.

“ఈ మజ్జెన ఆడికి వొంట్లో యేం బాగుంటాల్లేదండి..” అని కొంచెం ఆగి..
“పనిమీదొచ్చారేటండి?” అన్నాడు వెంకడు.

“అవున్రా..ఎల్లుండి అమెరికా నించి అబ్బాయొస్తున్నాడు. వచ్చే గురువారం వాడి పెళ్ళి..రాజమండ్రీలోనే చేద్దామని…” ఆగాడు జగన్నాధం. కాసేపు ఇద్దరూ ఇంకేమీ మాట్టాడుకోలేదు . అయిదు నిముషాల తరవాత, కాయలన్నీ లెఖ్ఖచూసి, గట్టుమీదకొచ్చి….”మీకు తెలుసునుగాదండీ…అయ్య “పల్లకీ” కట్టటం మానేసి..పదేళ్ళయ్యిందండి…” అన్నాడు వెంకడు.

“..నిజమేరా..కానీ అబ్బాయి పట్టు పడుతున్నాడు. పైగా, ఇవన్నీ చూపించడానికి, అక్కణ్ణించి వాళ్ళ స్నేహితుల్ని కూడా తీసుకు వస్తానని రాశాడు…” అన్నాడు జగన్నాధం.

“..మీ యిష్టవండి..అయ్య ఆరోగ్గెం యేం బాగాలేదండి. ఆనక మీ యిష్టం..అయ్యిష్టం…” అనేసి, కోపంగా లేచి పాకలోకి వెళ్ళీపోయాడు వెంకడు.

“..సరేరా..అయితే ఇంటికెళ్ళి..సుబ్బణ్ణోమాటడిగి బయల్దేరతా. పెళ్ళికి మాత్రం రావాలొరేయ్‌…” అని గెట్టిగా చెప్పి సుబ్బడింటికెళ్ళాడు జగన్నాధం.

నులక మంచంలో పడుక్కొని వున్నాడు సుబ్బడు. జగన్నాధాన్ని చూడగానే లేచి వచ్చి, పడక కుర్చీ వాల్చాడు. జగన్నాధం కూర్చున్నాకా, పక్కనే మెట్లమీద కూర్చున్నాడు.

“..ఇంకా యేవిటి ఛాదస్తం సుబ్బడూ..నువ్వూ పైన కూర్చో….ఇంతకీ నీ ఆరోగ్యం యెలావుంటోంది ?…”అన్నాడు జగన్నాధం.

“..నా ఆరోగ్గేనికేటి గానీ, అమ్మగారూ, పిల్లలూ కులాసాండీ?” ఆ మాట అంటున్నప్పుడు, తన కుటుంబం మీద వున్న ప్రేమంతా అతని కళ్ళళ్ళో కనిపించింది జగన్నాధానికి. జగన్నాధానికి సుబ్బడంటే గౌరవంతో కూడిన నిర్లక్ష్యం. తన తండ్రి వయసువాడూ, తండ్రి నమ్మినవాడూ కాబట్టి గౌరవం. తమ..రైతే కదా..అని కొద్దిపాటి నిర్లక్ష్యం.

“ఆ..ఆ..బానే వున్నారు. అబ్బాయి ఎల్లుండి అమెరికానించి పెళ్ళికొస్తున్నాడు. వచ్చే గురువారమే పెళ్ళి. రాజమండ్రీలోనే చేద్దామని అనుకుంటున్నాం. మన పల్లకీ యేవైనా సిద్ధం చేయిస్తావేమొనని అడగడానికొచ్చాను…ఇక్కడ నీ ఆరోగ్యం చూస్తే..ఇలా వుంది…” ఆగాడు జగన్నాధం.

“ఆరోగ్గేనికేటీ కాలేదండి. గుండులాగున్నాను. అయినా మీ ఎర్రి గానీ, అమెరికా అబ్బాయిగారికి ఇయ్యన్నీ నచ్చుతయ్యేటండి?” కొంచెం వుత్సాహంగానే అడిగాడు సుబ్బడు.

“..లేదురా, వాడే మరీ మరీ చెప్పాడు. వాడికి మన సంస్కృతన్నా, పద్ధతులన్నా చాలా గౌరవం రోయ్‌!!..” చెప్పాడు జగన్నాధం.

“నిజవేనండి. అంతా మీ నాన్నగారి పోలికొచ్చుంటదండి..”అన్నాడు సుబ్బడు. అది తండ్రిని గురించి పొగడ్తో, లేక, తనమీద ఎత్తిపొడుపో అర్థంకాక..”ఆ..ఆ” అంటూ తలూపాడు జగన్నాధం.

“..సర్లెండి. అబ్బాయిగారంత ముచ్చట పడుతుంటే…అలాగే పెట్టిద్దారండి..” అంటూ, పెళ్ళాం తెచ్చిన మజ్జిగ చెంబూ, గ్లాసూ, అందుకుని జగన్నాధానికిచ్చాడు.

“..అబ్బ..ఇంత తాగలేనురా”..అంటూ..సగం గ్లాసులో పోసేసి, మిగితాది తాగేసి, బయల్దేరాడు జగన్నాధం.

ఆరోజు రాత్రి సుబ్బడింట్లో, తండ్రికీ, కొడుక్కీ గొడవ జరిగింది. యెవరు చెప్పినా వినేరకం కాదు కాబట్టి, సుబ్బడు మర్నాటినించీ, పల్లకీ పనిలో ములిగిపోయాడు. పాకలో మూల పడున్న పల్లకీని చూస్తే, అచ్చం తనలానే అనిపించింది సుబ్బడికి. దాన్ని తీసి శుభ్రం చేసి, పసుపు రాసి, టాపు తయారు చేసి, సిద్ధం చేస్తూంటే, చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఒక్కసారిగా ముసలితనమంతా యెగిరిపోయింది. ఎప్పుడో యినప్పెట్టెలో పడేసిన పూసలూ, దండలూ తీసి, దులిపి, కడిగి, పల్లకీకి తగిలించ సాగాడు.

నాలుగు రోజులు యెల్లా గడిచిపోయాయో, అతనికి స్పృహేలేదు. మంగళవారం వుదయాన్నే లేచి, గెడ్డం గీయించుకుని, పని చేయించుకుని, తలస్నానం చేసాడు సుబ్బడు. సాయంత్రానికల్లా, పల్లకీ సిద్ధం చెయ్యాలి. రేపు రాజమండ్రీ తీసుకువెళ్ళాలి. ఎల్లుండి అబ్బాయిగారు వూరేగాలి. అంతకంటే తనకింకేం కావాలి..

పాక దగ్గరకెళ్ళి పల్లకీకేసి చూశాడు సుబ్బడు. అలాచూడటం ఆవేళ..అప్పుడే పదోసారి. ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా యింట్లోకి పరిగెత్తాడు. దేవుడిదగ్గర చిల్లరంతా తీసుకుని, బజారెళ్ళి చెంకీలూ, మెరిసే బిళ్ళలూ కొనితెచ్చాడు. దారిలో మిగితా మోతగాళ్ళని పురమాయించి మరీ వచ్చాడు. చెంకీలూ, బిళ్ళలతో అలంకరించిన పల్లకీ మెరిసిపోతొంది. అంతకంటే యెక్కువగా మెరిసిపోతున్నాయి సుబ్బడి కళ్ళు.

మధ్యాన్నానికల్లా మొత్తం పూర్తిచేసి, మంచమ్మీద నడుం వాల్చాడు సుబ్బడు. ఎవరో వచ్చిన అలికిడి విని లేచి కూర్చున్నాడు. వచ్చినది కృష్ణమూర్తి. జగన్నాధానికి పినతల్లి కొడుకు. రాజమండ్రీలో ఉంటాడు. చూడగానే పరిగెత్తుకుంటు యెదురెళ్ళి, తీసుకొచ్చాడు సుబ్బడు. “..పల్లకీ రాజాలాగుందండి. అబ్బాయిగారు చూసి మరి..అదిరిపోవాల..సుబ్బడి పల్లకీ అంటే మాటలేటండీ?…” అంటూ కుర్చీ వేశాడు.

“కూర్చునే టయిము లేదురా..అన్నయ్య నీకో ముఖ్య విషయం చెప్పమని ఫోను చేశాడు. అబ్బాయికి వారంకన్నా సెలవు దొరకలేదట. అందుకనీ….పెళ్ళి హైదరాబాదులోనే కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నారు. అన్నయ్య మొన్న వచ్చినప్పుడు నీకూ, అచ్చెమ్మకీ బట్టలకని, నాకు డబ్బిచ్చాడు. ఇదిగో..ఇది నీ పంచెల చాపు. ..ఇది..అచ్చెమ్మ చీరా……” ఇంకా ఏవేవో చెప్పాడు కృష్ణమూర్తి. కానీ సుబ్బడికి అవేవి వినపడలేదు.

ఆ పంచెలచాపు భుజానవేసుకుని పాక దగ్గరకెళ్ళాడు. పల్లకీని చూశాడు. అలంకరించిన పల్లకీ అతణ్ణిచూసి నవ్వుతోంది. దాన్ని చూసి అతనికి యేడుపొచ్చింది. వెళ్ళి పల్లకీలో కూర్చున్నాడు. పంచెలచాపు ముఖం మీద కప్పుకుని యెంతోసేపు యేడ్చాడు. యేడ్చి యేడ్చి..అలసిపోయాడు. తనని ఎవరో పిలుస్తున్నట్లనిపించిందతనికి….

దూరంగా…విశ్వేశ్వరంగారు..పెళ్ళికొడుకులా నవ్వుతూ కనిపించారు..పల్లకీ భుజాన్నెత్తుకుని సుబ్బడు పరిగెడుతున్నాడు………అంతే..

ఆ తరువాత అతను ఏడవనూ లేదు. నవ్వనూ లేదు. అసలు అక్కణ్ణించి కదలనే లేదు…


శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

రచయిత శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా గురించి: శ్రీనివాస ఫణికుమార్‌ డొక్కా జననం అమలాపురంలో. నివాసం అట్లాంటా జార్జియాలో. కంప్యూటర్‌ సైన్స్‌ ఫీల్డ్‌లో పనిచేస్తున్నారు. కథలు, కవితలు రాసారు. ...