(విజయనగరం కాలేజీ శతవార్షికోత్సవ (1971) సందర్భంలో ఇవ్వబడిన ప్రసంగ పాఠం)
సభాధ్యక్షులైన శ్రీ రాజాగారు అనుఙ్ఞనిస్తే, ప్రిన్సిపాలుగారూ, అధ్యాపకులూ, పెద్దలూ, మన కాలేజీ విద్యార్థులూ సెలవిప్పిస్తే నేను ఏదో బరికి తెచ్చిన నాలుగు మాటలూ వినిపిస్తాను చిరంజీవిని కృష్ణకుమారి ద్వారా.
వెనుక నోరున్నప్పుడు నేనూ ప్రసంగవేదికపై రవ్వంత సందడి చేసేవాణ్ణి. ఏదయినా వ్రాయవలసి వచ్చినప్పుడు అటూ ఇటూ పచారు చేస్తూ చెప్పేవాణ్ణి, ఆప్తులు వ్రాసిపెట్టేవారు.
ఇప్పుడు ఎలాగ చెప్పడం? ఇక కంఠంలో ఉన్న గొట్టాం వల్ల వంగి చాలాసేపు వ్రాయలేను, కనుక ఏమి గిలికానో ఏమో! అసలే ఆట్టే తెలిసినవాడను కాను. మూగతనము, ముదిమి…
నేను చెప్పే మాటలలో అనుచితమైనవీ, అర్థం లేనివీ, సొంత గొడవలూ ఉంటే మన్నించండి. నా యెడ దయ ఉంచి వినండి.
సరస్వతీ నిలయమైన తల్లి ఈ కళాశాల ఎదుట నిలబడి మునుముందు నా చేతులు జోడిస్తున్నాను. నాటి నా గురువుల నందరినీ స్మరించుకుంటూ పరమభక్తితో కృతఙ్ఞతతో వారి చరణ సన్నిధానాన నా శిరస్సు వంచుతున్నాను.
వారిలో పరమ గురువులు శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య గారి దర్శనం తరచూ చేసుకుని పాదవందనం చేస్తూంటాను. హైదరాబాదులో ఆ నడుమ వారికి మహావైభవంగా “గురు పూజ” చేసుకున్నాను. నా ఋణం తీర్చుకోడానికి ప్రయత్నించాను. నా తలిదండ్రులదీ, గురువులదీ, ఋణం ఏమి తీర్చుకోవడంలెండి, నా మొహం!
నా భాగ్యం వల్ల నాటి నా గురువులలో ఇప్పుడూ ఉన్నవారు వారున్నూ, ప్రొఫెసరు సిరుగూరి హనుమంతరావు గారున్నూ, అనుకుంటాను.
ఆహా! ఎంత గొప్ప కాలేజీ అండీ మనది? ఆనాడు ఆంధ్రదేశంలో మూడే First Grade కాలేజీలు. వాటిలో ఇది ఒకటి. దక్షిణదేశంలోనే చాలా మొదటి కాలేజీలలోనిది.
మరి, ఇక్కడ ఉండే ఆచార్యులూ అధ్యాపకులు, ఉద్దండులూ ఉన్నతులూనూ. మేము బి. ఏ. లో ఉన్నప్పుడు, అంటే 191618 లో, ప్రిన్సిపాలు రామానుజాచారిగారు! ఆ శుభ్ర సుందరమూర్తినీ ఉదాత్తుణ్ణీ స్మరించుకుని మళ్ళీ శిరస్సు వంచుతున్నాను.
ఇంగ్లీషు అధ్యాపకులు వారూ, సుబ్బరాయ భట్టు గారు, బుఱ్ఱా శేషగిరిరావు గారు, ఎం. వి. ఎన్ సుబ్బారావు గారు, తణికెళ్ళ వీరభద్రుడు గారు, తరువాత ఆత్మారాంగారున్నూ. హిస్టరీ ఎకనామిక్సులకు వేంకట రంగయ్య గారు, సిరుగూరి హనుమంతరావు గారు, తరువాత పాత మద్రాసు హైకోర్టు జడ్జీ, మహా మేధావి గోవిందరాజాచారి గారున్నూ. కనుక ఆతురులైన యువకులు విద్యార్థులై మనస్సులూ, హృదయాలూ తెరుచుకుని ఆంధ్రదేశం దూరప్రాంతాలనుండి ఇక్కడికే వచ్చేవారు.
కాక, ఇక్కడ మరొక్క సదుపాయం ఉండేది, మహారాజులు నడిపించే సత్రం. మరి ఈ విజయనగరమో! చిన్న ఉజ్జయిని లాగున ఉండేది, పెద్ద భారతీ తీర్థం లాగున.
అటు మహామహోపాధ్యాయ రాయుడు శాస్త్రులు గారు, చిన సీతారామ శాస్త్రిగారు, వెంకట రమణాచార్యులు గారు, వీణ వెంకట రమణదాసు గారు, నారాయణదాసు గారు, తరువాత తరువాత ఆ దివ్య ప్రతిభాశాలి ద్వారం నాయుడు గారు ఇలాగ ఎందరో “ఉండేది, ఉండేవారు” అంటున్నాను ఏమీ అనుకోకండి. ఇవి మధురస్మృతుల నెమరువేతలో వచ్చిన ఆప్యాయతా, ఆవేశం వల్ల వచ్చే మాటలు.
ఇప్పుడుకూడా ఈ పట్టణమూ మన కాలేజీ అలాగే ఉంటాయి ఉన్నాయి. అప్పుడే! ఆ రోజుల్లోనేం! అంటూ అస్తమానమూ చచ్చు:జావ మాటలు చెప్పే ముసలితనపు నెమరువేత కాదు నాది. ఇవి ఉత్సవ సమయంలో ఉబికి పొర్లే ఉత్సాహంవల్ల దొర్లే మాటలు.
“అయ్యో! నాకు నోరుంటేనా ” అనిపిస్తుంది. ఇవాళ ఈ కళాశాలతో మాత్రమే కాదు నాకు ఈ సంబంధమూ, గాఢ స్నేహమూనూ. ఈ విజయనగరంతో కూడా.
నా బాల్యం అంతా దాదాపు ఇక్కడే కడచింది. నా పెద్ద బావగారు ఈ సంస్థానంలో ఉండేవారు. కొంత మంచి ఉద్యోగమే, ఆయనది, అప్పుడు ఖిల్లేరుదారు, ఇంగ్లీషు మున్షీ, ఇలాగ! పేరు గాడేపల్లి సీతారామస్వామి గారు. ఆయనకూడా 19వ శతాబ్ది చివర ఈ కళాశాలలో విద్యార్థే.
మరి మా పిఠాపురం కన్నా విజయనగరం పెద్ద పట్టణం. ఇక్కడ వింతలూ, ఆకర్షణలూ ఎక్కువ. తరచుగా ఏమిటి ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడిని.
సంస్థానపు పట్టణాలు చాలా చాలా వింతగా ఉంటాయి. అరమోడ్పు కన్నులు లాగున అలసాలస నేత్రాలు అవి. అవి స్వప్నభరాలు. అవి రాచరికపు కళ్ళు. గతించిన మహారాజులవీ వారి ఆస్థానాలవీ స్మృతులు వెలుగులు లాగ, నీడలు లాగ, అక్కడ మెరుస్తూ, పాకుతూ పెనవేసుకునుంటాయి. ఆ రోజులలో ఆ సంస్థాన నగరాలు సంధ్యా గగన ఖండాలట్లు రేబవళ్ళ కౌగిలింతల ఒరపిడిలో రేగే వన్నె వెన్నెలతో నిండి కనబడేవి.
మా పిఠాపురం అలాగే మన విజయనగరమూ అంతే. బాల్య దృక్కులకు మరీని. నాకు మరీ మరీని. రాజాస్థానాలలో కలిసిపోయి పెరిగిన వాళ్ళు నాలుగు వందల ఏళ్ళ నుంచి నా తాత తండ్రులు రాజనగరాలలో. రాచనగరుల్లో వాతావరణం అపూర్వమైన కాల్పనికావేశంతో నిండి ఉంటుంది. విశాలమైన ఆ రాజ మందిరాంతరం నుంచి ఏనాటివో రాణివాసపు నిట్టూర్పులు గుసగుసలాడుతున్నట్లుండేవి. రాచవీరుల మేఘ గంభీర కంఠాలు, దూరగర్జనవలే యుగాలు దాటివచ్చి బెదరిస్తున్న్త్లటుండేవి.
“సరదారుల్ పరదారుణ ద్యుతి సమంచన్మూర్తులై దక్కిణీ తరహా పాగాలు, బుగ్గ మీసములు, నిద్దంపు షరాయీలు, అంగరఖాలు” మొదలైనవాటితో కోటలోని ఏ చీకటి కొన నుండో ఇవతలికి ఎప్పుడయినా రావచ్చు ననిపించేది. ఉన్నత స్థంభోపరివిటంకాలలో పావురాల కువకువలూ, అటూ ఇటూ నడయాడే దాసీ జనం, చీర అం़చుల గుసగుసలూ, చతుశ్శాలలో మంటపంలో ఆశీనులైన ఎఱ్ఱ, ఆకుప़చ్చ శాలువాల పండితుల కుండలాల తళతళలూ, అప్పుడప్పుడూ తేలివచ్చే గాన లహరులూ, అడపాతడపా అత్తరు తావులూ హుక్కా ధూమవాసనలూ ఇవి మా లేత మనసులను ఆవహించి అడ్డులేని రెక్కలను తొడిగి ఏ లోకానికో లాగుకొనిపోయేవి.
ఇక్కడ మోతీమహల్‌లో, పూర్వ గజపతుల గాధలకు కొన్ని కొత్త కథలు కలుపుకొనేవాడిని ముఖ్యంగా అతిలోక సుందరమూర్తి అయిన ఆనంద గజపతి చిత్రపటం ముందు అల్లాగే నిలబడిపోయి కోట వెనుకనున్న “అస్తబల్” వైపు సాయం వేళలు వచ్చేవాడిని కాను అక్కడ విగ్రహాలు, Statues , కదిలి అలకనారాయణులై, విజయరాములై, ఆనంద గజపతులై, విలాసంగా విహరిస్తూ ఉంటారేమోనని.
అటు మచ్చకొండ. అంటే దాసన్నపేట కొండ, దాని ప్రక్క కుమిలి ఘాటీ, ़చూస్తే నా ప్రాణాలు బిక్కుబిక్కుమనేవి. ఆ ఘాటీలలో సింహ శార్దూలాలు పొంచిఉంటేనో! ఆ ఘాటీలలో పిండారీల దండులూ, బందిపోటు దొంగల ముఠాలూ దాడి చేయడానికి ఒడుపుగా కాచుకునియుంటేనో! ఏమి భావనా, ఊహలూ అండీ అప్పుడు! అటు పెద్ద ఏనుగు మీద అంబారీ లాగున వెలగవాడ కొండ మీద ఏదో కట్టడం కనబడేది. కాని లోకం వదిలేసి కళింగ గజపతులు వివిక్తమైన ఆ గిరి దుర్గంలో ఏకాంతవాసం చేస్తూంటారు అనిపించేది King Arthur and the knights of the round table లాగున. అటు ఫూల్‌బాగ్ ఇవతల చిన్నపూల్‌బాగ్ ఆ వెనుక కార్తీక సంతర్పణల వ్యాసనారాయణ మెట్ట, రత్నాల వర్తకుడు రాజారావు ప్రాసాదం. ఇటు యూరోపియనులతో కంటోన్మేంటు అన్నీ వింతలూ విడ్డూరాలే! అన్నిటికన్నా ఆప్తమైన దేవీ మిఠాయి అన్నీ బాగుండేవి అనిపిస్తుంది నాకు చివరకు పెద్ద చెరువు దోమలు కూడా! ఊరికే మా కవులు లాగున హమేషా ప్రబోధం చేయడమే కాని అవి గట్టిగా కరిచేవికావు కాబోలునేమో.
మరి, నాకు అన్నిటికన్నా విలువైనది ఆనాటి స్మృతి గురజాడ అప్పారావు గారి దర్శనం. వారి ఇంటనో, మరి మా బావగారి వీటనో వారిని చూస్తుండేవాడిని సన్నగా, అర్భకంగా కానీ, పదును పెట్టిన కత్తిలాగుండేవారు. ఎప్పుడయినా పిఠాపురం నుంచి వచ్చే నా తండ్రిగారూ వారూ సాహిత్య గోష్ఠి జరిపేవారని ఙ్ఞాపకం.
అప్పారావుగారు 1915లో వెళ్ళిపోయారు. 1916లో ఇక్కడ బి. ఏ.़చదువుకు వచ్చాను. అప్పుడు వెలగవాడ కొండ మీద వీరులు అంతర్ధానమైపోయారు. కుమిలి ఘాటీలోని పిండారీ దండులు కరిగిపోయారు. నేను ముదిరాను పెరిగాను. నా భాగ్యం వల్ల ఇంగ్లీషు ़చదువులో చొరబడ్డాను.
ఆంగ్ల విద్యాభ్యాసం ముదరడం, పెరగడం, కాలంతో హాయిగా జరుగుతూ రావడం, నా అదృష్టం. ఇంగ్లీషు ़చదువు మన దేశానికి గొప్పవరం అని నా నమ్మకం.
ఇక్కడ ఒక మాట, “నా ़చదువు, నా ़చదువు” అంటుంటే ఏదో మాంచి విద్యార్ధి ననుకోకండి. ఏమి ़చదవడం లేండి! నా అంత పనికిమాలిన విద్యార్ధి ఆరోజుల్లో అఖండ భారతదేశంలోనే లేడు.
ఒకటి జరిగింది చెప్పనా? 1919లో నేను బి. ఏ. అయాక, ఒక సాయంకాలం సామర్లకోట Platform మీద నిలబడ్డాను కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళే మెయిల్ (Mail) కోసం ట్రయిన్ వచ్చింది. దానిలో ఒక First class Compartment లో మా గురువర్యులు ప్రిన్సిపాలు రామావతారంగారు ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీ సెనేట్ సభకు వెడుతున్నారు. దగ్గరకు వెళ్ళి నమస్కరించాను “ఎవరు నువ్వు?ఓయ్‌నువ్వా?కాకినాడ Boy ! అన్నారు. నన్ను వారు కాకినాడ Boy అనేవారు.
“ఏమి చేస్తున్నావు?” అన్నారు.
కాకినాడలో “మిషన్ High School లో మేస్టర్ని” అన్నాను. వారు విరగబడి నవ్వారు.
నవ్వి “నీ ़చదువులాగే ఉందా నీ ఉద్యోగమూనూ” అని మళ్ళీ నవ్వి, వాత్సల్యం నిండిన చూపులతో ‘God bless you’ అన్నారు.
ఆ సంవత్సరం ఆ స్కూలువారు నేను బాగా పనిచేయడంలేదని నా ఉద్యోగం తీసేశారు. మరుసటి సంవత్సరం పెద్దాపురం లోనూ అంతే. ఒక ఏడే ఉద్యోగం. ఆ తరువాత పిఠాపురంలోను అంతే.
నేను నిరుద్యోగిగా పుట్టాను.
అందుకే నా మొదటి సన్మానం రేపల్లెలో ఆంధ్రదేశ నిరుద్యోగ సంఘం వారు చేసేరు.
ఇద్దరు పెద్దలతో కలిపి, శివశంకర శాస్త్రి గారు, విశ్వనాధ నిజం తెలుసుకున్నవారు చేసిన సన్మానం, నాకు చాలా ఇష్టం అది. అట్టి నన్ను ఏరి, ఈ దివ్యసంస్థ శతవార్షికోత్సవ సమయాన, మా కళాశాలలో గౌరవిస్తున్నారా? నాటి నా అధ్యాపకులూ, గోపాలంగారి వంటి సతీర్థులూ వింటే చేయి అడ్డుపెట్టుకుని ఎంత నవ్వుకుంటారో!
“నమ్మలేదు తొలుత, అంత నయనమ్ములునులిమి విచ్చి” మళ్ళీ ़చదివాను మీ ఉత్తరం. ఉబ్బిపోయాను, ఇంతకన్న ఎవరికయినా గర్వకారణమూ గౌరవమూ ఉన్నాయా?
నాకు అత్యంత ప్రియములయిన విద్యాసంస్థలు మూడు. ఒకటి కూచి నరసింహం గారు Head Master గా ఉన్న పిఠాపురం హైస్కూలు. రెండు నా గురుదేవులు వేంకటరత్నంనాయుడు గారి కాకినాడ కళాశాల, మూడు వాటికి శిఖరం లాగున, రామావతారంగారితో ఇతర ఆచార్యులతో మన మహారాజా కాలేజీ.
అయినా రాలేకపోయేవాడినేమో! అసహాయుణ్ణి,అసలే బద్ధకస్తుణ్ణి కూడా జమీందారీ పద్ధతులు అలవాటు పడ్డవాడిని జమీందారీ ఆస్తి లేకుండా.
అంతేకాక, సన్మానాలు అంటే నాకు అంతగా కిట్టవు. బిరుదులూ సన్మానాలూ మోయలేని బలహీనుణ్ణి. మరిన్నీ పదిమందిలో కూర్చోబెట్టి, పొగిడేస్తుంటే, మొగం ఎలాగ పెట్టాలో, దానిమీద ఎట్టి మందహాసం పొదిగి వుంచాలో, ఎట్టి తీయని వినయం చూపింఛాలో, ఆ pose ఎంతసేపు అలాగ నిలిపి ఉంచాలో, ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా తెలియదు. అయితే, దొంగను కాను. పొగుడుతుంటే లోపలలోపల నాకూ చక్కిలిగింతలు పెట్టినట్లే ఉంటుంది. అయినా, కీర్తికయినా, డబ్బుకయినా, పదవి కయినా ఒక హద్దూ పద్దూ ఉండడం మంచిదేమో!”అగ్గలమగు తృష్ణ ఎవ్వనికి, గాఢ దరిద్రుడు వాడు”, “సతుభవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా” అన్నాడు కదా భర్తృహరి. సన్మానాల కోసం దండలకోసం, అదే పనిగా ఒంటె లాగున మెడ చాపి ఉంచడం ఇబ్బందండీ! అవే వెతుక్కుని వస్తే, అంత ఫరవాలేదు. ఎందుకు రావు? కవికుల గురువు చెప్పినట్లు రత్నం వెతుక్కుంటూ పోనక్కరలేదు, దానినే వెతుక్కుంటూ వస్తారు అందరూ.
నా కాలేజీ శతవార్షికోత్సవంలో గౌరవిస్తామని ఆహ్వానించడం అలాగ ఉండగా, ఆ సన్మాన సభకు శ్రీ రాజా వారధ్యక్షులుగా ఉంటారన్నారు. మరీ ఆనందమూ, గర్వమూ పడ్డాను. నా తండ్రి తాతలనాటి గజపతుల వంశము వారనే గాక, గొప్ప సంస్కారులనీ, విద్యావంతులనీ, ఊరికే విధిలేక గాక, ఉత్సాహంతో కాలంతో నడిచివస్తూ ముందంజ వేస్తూ, ప్రజాస్వామ్య ప్రభావాన్ని ఏనాడో చిరునవ్వుతో స్వీకరించిన విజ్ఞులనీ, రాగల, వచ్చిపడ్డ, యుగంలో ప్రతీ మానవుడూ మకుట ధారే ‘We are all kings in the kingdom of the king’ అన్న పరమార్ధం ముందే ముందే తెలుసుకున్న ఉదాత్తులనీ నాకు తెలుసు. ‘ బలే నాభాగ్యం ‘ అని వచ్చేశాను. మళ్ళా విజయనగరం చూస్తాను. వీలైతే వీథి వీథీ తిరిగి చూస్తాను. మళ్ళా నా కాలేజీ చూస్తాను.
అన్నట్లు విజయనగరం సంస్థానంతో మా తాతలకుగల ఆవంత సంబంధం ఏదో చెప్పనా? మా పూర్వులలో ఒకరు రామశాస్త్రి గారు ఘన మహీపతి జగపతి గజపతీంద్రవర, సభాస్థాన పాండిత్య పద నిరూఢి భాసురుడు, ఆయన ఉడ్డోలుడైన పండితుడూ, కవిన్నీ. ఆయన కాశీ నుంచి మా ఊరు తిరిగివస్తూ ఇక్కడ ఆగి, విజయరామ గజపతుల దర్శనం చేసి, కొన్ని పద్యాలు చెప్పారు, శ్రీ కాకుళం నవాబు కాబోలు నూరుద్దీన్ హుసేన్ ఖాన్ తో యుద్ధం చేసి అతనిని ఆ విజయరామ గజపతి హతమార్చారు, వీరు ఏనాటి విజయరామగజపతులో గాని?
చ. భువినిది అద్భుతం బొకటి, భూరికృపాపరిపూర్ణపూసపా
టి విజయరామ భూరమణ!ఠీవిని నీ కరవాల ధారచే
అవయవ హానియున్ కువల యాహిత భేదము లేక మత్స్య భూ
మి విభుడు సాంగుడై చనియె మీదికి దేవ పురాధిగామియై
“మహి, నానంద నృపాలు శ్రీ విజయరామస్వామి వాల్‌సోకి నూర్ద్రిహుసేన్‌ఖానుని మస్తికం బసిమొనన్ రెండయ్యె, రెండయ్యె భవ్య హరిద్ఘోటక మండలం బపుడు, రంభాకంచుక గ్రంథియున్ రహి రెండయ్యె” అంటారు రామశాస్త్రి గారు.
అప్పుడు
చ. అతనికి, పూసపాటి కులజాగ్రణియున్ కవితారసఙ్ఞుడ్‌ు
ప్రతత యశుండునౌ, విజయరామ నృపాలవరుండు, గౌరవాం
చిత మతి రాజధానిదరి సీమ నొసంగెను సర్వ సస్య శా
శ్వత ఫలసారమౌ వెలగవాడ సమాఖ్య మహాగ్రహారమున్
విద్య, కవిత్వం తో పాటు మా దేవులపల్లి వారికి ఇంకొక శక్తి ఉంది ఆస్తి పోగొట్టుకోవడం, ఆ అగ్రహారం ఎప్పుడో పోగొట్టుకున్నాం.
ఇంకొక ఘట్టం
మావారు పిఠాపురాస్థాన పండిత కవులు. నాతండ్రి పెత్తండ్రులు గంగాధర రామారావు మహీపతుల ఆస్థానంలో ఉండే వారు ఆ రాజుగారు అన్నదమ్ముల వరసన పిలుస్తుండేవారు వీరిని. వారికి మొదట సంతానం లేక, వెంకటగిరి వంశంలో ఒకరిని దత్తత చేసుకున్నారు. తరవాత ఔరసపుత్రుడు కలిగాడు. అప్పుడు దత్తులకీ ఔరసులకీ దావాలు జరిగేయి. దత్తుని వైపు వారు చాలా బలవంతులు;వెంకటగిరి, బొబ్బిలి, జటప్రోలు వారు. గంగాధర రామారావు గారు పోతూ మైనరు రాజాను నా తండ్రులకు అప్పగించేరు. అప్పుడు అసహాయులైన నా తండ్రి పెత్తండ్రులు ఈ ఊరు వచ్చారు ఆనంద గజపతి మహారాజులుంగారి ఆలంబనం కోసం. ఆ రోజుల్లో వారి ఆంతరంగిక కార్యదర్శి గురజాడ శ్రీరామమూర్తి గారు ఆంధ్ర కవుల చరిత్ర వ్రాసినవారు. గురజాడ వారికీ మాకూ అన్నదమ్ముల వరస. శ్రీరామమూర్తి గారు మావారికి మహారాజ దర్శనం ఇప్పించారు. రాజసన్నిధిలో అడుగుపెట్టటడమేమిటి, వీరు ఏ కార్యం అర్ధించివచ్చారో కథ అంతా పద్యాలలో ప్రారంభించారు చాలా Dramatic గా.
“నృపసుతుడర్భకుండు, జననీ జనకుల్ స్మరణీయులై ,రసా
ధ్యపు పనికూడె , దాయలమిత ద్రవిణుల్, భవనంబు బాసిపోన్
కపటము చేతురేమొ యని, కారణికాగ్రణి నిన్నె వేడగా
వ్యపగత ధైర్యవృత్తి నిటువచ్చితి మేమభయంబు కోరుచున్
ఇలాగ మొదలు పెట్టేసరికి “ఏ నృపసుతుడు? దాయలెవరు?” కుతూహలం కలుగుతుంది.
“ఆనంద ద్విపరాజ రాజకులచంద్రా సత్కృపాసాంద్ర! మా
క్ష్మానాధాత్మజు డస్వతంత్రు డుదయఙ్ఞానుండు యుష్మత్ సుహృ
త్సూనుం డర్భకు డార్యసమ్మత గుణస్తోమాంకుడున్ కావునన్
పౌనః పున్యవిమర్శనీయుడు సుమీ వాత్సల్య చిత్తంబుతోన్ ”
“గజశాబమెత్తుబడినన్
గజపతిగా కుద్ధరింపగలరే యితరుల్
నిజముగ, ఆనందశ్రీ
గజపతిరాజేంద్ర చంద్ర! కరుణాసాంద్రా!”
తరువాత ఆనంద గజపతి ప్రాభవసాహాయ్యం లభిస్తుంది.
నా పెద్దతండ్రి గారు పొడుం పీల్చేవారు. ఆ రోజున సభలోనే పొడుంకాయ తీస్తుంటే, నా తండ్రిగారు వారిస్తుంటే, మహారాజు కంట పడింది. పొడుం పీల్చడం పొగుడుతూ ఒకరినీ, గర్హిస్తూ ఒకరినీ పద్యం చెప్పమన్నారు. నా పెద్దతండ్రి గారికి బంగారుగొలుసు తొడిమతో పొడుంకాయ నిచ్చారు. నా తండ్రి గారికి కంకణాలు ఇచ్చారు. ఇక నా మొదటి పద్యం ఇక్కడే రామ తీర్థాల కొండ మీద చెప్పినట్లు ఙ్ఞాపకం. ఎందుకు ఉత్సాహంతో ఇక్కడకు వచ్చానో మీకు తెలియపరచడానికి ఎంతచెప్పానో చాలాసేపు. రాజులూ, మహారాజులూ అంటూ వ్రాసేను. నాకు పాత Feudal విధానం పోవాలని గట్టి నమ్మకం. 50 ఏళ్ళ క్రితమే ఉంది. నా పిఠాపురం మహారాజును ప్రతిఘటించి వచ్చేసిన కథ ఇప్పుడు అప్రస్తుతం.
నేను చదువుకున్నవాడిని గాను, మేధావినీ కాను, పెద్ద విషయాలను గూర్చి ఎక్కువగా చెప్పలేను. కాని, ఈనాడు, ప్రతీ నిముషం నాలో నిండి నన్ను కలతపెట్టే ఆలోచనలు మాత్రం కొన్ని బైట పడేస్తాను. ఆప్తులూ, నా వాళ్ళూ అయిన మీ సన్నిధిని ఈమధ్య ప్రతీచోట ఇదే చెప్పుకుంటున్నాను.
నేను హృదయవాదిని, వఠ్ఠి హృదయవాదిని. నాకు కవిత్వం ప్రాణం, సంగీతం మరీనీ. అన్నిటి కన్నా నాకు కావల్సింది మనిషి.
మతాలూ, వాటి రహస్యాలూ, బ్రహ్మ జిఙ్ఞాసా, యోగం, పరోక్షం, అపరోక్షమూ, పరతత్వం వంటివేవీ నాకు తెలియవు. వట్టి సున్నాను. మనిషితో ఎడతెగని సావాసం, ప్రేమిస్తే ఆనందం, దవ్వు అయితే బాధతో కొట్టుకుపోవడం, ఇది నాకు తెలుసు. ఇదీ నా మతం నాకిక వేరే మతం లేదు, కులం లేదు, రాజకీయ పక్షం లేదు, నేను మనిషిని. ” I am not a politician, and my other habits are good ” అలాగే సాహిత్యరూపాలూ, సిద్ధాంతాలూ, ధ్వనీ, వక్రోక్తీ, రసం, వగైరా అంటూ పెద్దలంటారే ఏమీ నాకు తెలియవు. కవిత్వం తెలుసుకుని అనుభవించడం తెలుసు.
ఈమధ్య నేను అదోలాగ తయారయాను. మూగతనం, ఇల్లు కదలకపోవడం! నా ఇంటి వాకిట్లో కూర్చుంటాను. చెట్ల ఆకుల గుసగుసలలో నిండిన చీకట్లో, కదలకుండా! మందిర ద్వారం ముందే తెరిచి ఉంచేస్తాను.
“నాకన్నాముందే చీకట్లో
నా మనసు
నీకోసం నిలుచుంది చీకటిలో”
అన్నట్లు ఎవరైనా అతిథి కోసం అనుకోని అతిథి కోసం! మరి ఇంకొక్కప్పుడు, ఎవరూ రాకపోతే! చిగురాకు చివర మం़చుబిందువు లాగ చలించి చలించి రాలిపోతానేమో అని భయపడతాను. అప్పుడు ఎత్తయిన కొండల నడిమిలోయలో ఒత్తుగా పెరిగిపోయిన పచ్చిక లాగున, ఎవ్వరికీ కనపడవు గదా నా అనురాగాలూ, నా భావాలూ అని గిలగిలలాడతాను. అప్పుడేం చెయ్యను? ఆంగ్లకవి అన్నట్లు, కిటికీలోనుంచి ఒక పిచ్చిక వచ్చి వాలినా దానితో మనసులో సావాసం కట్టబోతాను, ” Even if a sparrow come before my window, I take part in its existence and pick about the gravel ”
అట్టి గొప్ప ముహూర్తాలలో అచేతనాలు అనుకునే వస్తువులని కూడా పలకరించి జట్టు కట్టవచ్చు.
రవీంద్రుని తుదిరోజులలో పక్క మీద నుండి లేవలేనప్పుడు వ్రాస్తాడూ, “తాను నిత్యమూ కూర్చునే కుర్చీ పెంపుడు కుక్క లాగున తనవైపు :జాలిగా చూస్తుంది” అని.
ఒకసారి హైదరాబాదు నుంచి మదరాసు వెళ్తున్నాను కారులో. దారిలో నాగార్జున సాగర్ ప్రాంతాననో, దేవరకొండ ప్రాంతాననో ఒక ఎ్తౖతెన కొండ ఉంది ధుమధుమ లాడుతూ, కనుబొమలు ముడుచుకుని తిక్కగా కొందరు మనుష్యుల లాగున ! దానిపైకి ఒక మేఘం వచ్చి వాలింది ఆప్యాయంగా. అశ్రు భరమైనది. కొద్ది జల్లులు పడ్డాయి. కొండ కరగలేదు. ధుమధుమలాడుతునే ఉంది. మేఘం పాపం తెల్లబోయి వెళ్ళిపోయింది. నాకు :జాలి వేసింది. ఊరికే నాలుగు పంక్తులు గిలికాను కూడా, ఏమో!
గిరిపయి వాలిన మేఘం
జరిగిందా జరిగిందా!
జరగలేక బరువుగ అటె
ఒరిగిందా ఒరిగిందా
కురిసి కురిసి వాన़జల్లు
తరిగిందా తరిగిందా
కరగని శిల చూచి మనసు
విరిగిందా విరిగిందా
వెలవెలనై మబ్బు దవుల
కరిగిందా అరిగిందా
మలచెక్కిట నీటిచార
చెరిగిందా మిగిలుందా
రాత్రివేళ మరీనీ! రాత్రి తల్లి! రాత్రి అమ్మ ఒడి! పగలు సృష్టిలో వస్తువులన్నీ దేనిదారిని అది తొందరగా, పనిమీద పోతున్నట్లు ఒక దాని నొకటి పలకరించడానికి తీరిక లేనట్లూ ఉంటాయి. రాత్రి ఒకే ఒక విశ్రాంతశయ్య మీద ఒకే ఒక నిశ్చలాంకం మీద, ఒకదాని ఒళ్ళు ఒకదానికి తగులుతుంటే, పిల్లల్లాగ నమ్మకంగా పవ్వళిస్తున్నట్లుంటాయి.
కొండ, చెట్టు, ఇల్లూ, కుర్చీ, మనిషీ, అన్నీ అన్నీని ! రాత్రి ద్రష్ట అయినవానికి సృష్టి లోని ఏకత్వం, బాంధవ్యం ఎక్కువ బాగా స్ఫురిస్తుందేమో!
రాత్రి వంటిది మౌనం. కనుక మౌనం లోనూ అంతే. అయితే నాది మౌనం కాదు, మూగతనం. కనుక ఈ అనుభవం ఎక్కువసేపు ఉండదు.
అబ్బ! ఇంతలో ఒంటరితనం లోపల లోపల గుబులు గుబులు మంటుంది. ఈదారంట ఇందరు నడుస్తున్నారు ఒక్కరయినా లోనికి రారే! పోనీ స్ఫుటంగా అడుగు చిన్నెలయినా నాకోసం వదలరే అని ఏడుపు వస్తుంది. ఇలాగ తపించుకుపోతాను. సావాసం కోసం ఈ తపన; ప్రేమ కోసం ఈ ఏడుపు! ఇదే నా మతం.
నాలో ఒక బాటసారి తనం ఉందేమో! Gypsy తనం! ఒక నిమిషం ఒక చోట ఉండాలని ఉండదు. ఒక ఇంగ్లీషు కవి అన్నట్లు Tramp లాగున,
” I hang about the streets all day!
at night I hang about ”
ఇది ఊరికే తిరగడానికి కాదు. మనిషి కోసం సావాసం కోసం. అలాగ తిరుగుతూ ఎదురయ్యే ప్రతిమనిషినీ కనుసైగతో ఆపి, చిరునవ్వుతో చేయి గట్టిగా ఒకసారి పట్టుకుని, మళ్ళీ నడిచిపోవాలని ఉంటుంది. ఒక పద్యం వినిపిస్తాను. First Republic day నాటి అఖిల భారత కవి సమ్మేళన లో తెలుగు కవిగా నేనన్నది.
” చిననాటి భావవల్లిని పూచినది, వాడనిది
వాసనలు వీడనిది ఒకండు కోరిక
నాల్గుదిక్కుల భూభువనమంత
లవలేశమును వదలకయె తిరిగి
ప్రతిగేహదేహళిపదమాగి ప్రతి హృదయద్వార
తోరణమట్టె త్రోసి
లోనికిజొచ్చి నాలోని స్నేహక్షీర
మొక్కింత ఒక్కింత ఒలకబోసి
అనుగు సోదర మరలి రానాయటంచు
సెలవడిగి సాగిపోయెడు చిరపథికుడ
కావలయునంచు ఆశ ఆకాశమంత
పటిమక్షుద్రవిహంగ మిప్పటికినంతె”
సావాసం కోసం ఈ తపన! ప్రేమకోసం ఈ ఏడుపు! మనిషి కోసం ఈ తపన Suffering వల్ల వస్తుందేమో! బాధాజీవికి కంఠంలో గరళం ఉంటుంది. తలపై చంద్రమకుటం ఉంటుంది. బాధ ఎక్కువైనకొద్దీ స్వార్ధం అహంకారం తగ్గుతూ వస్తాయి, ఇది శాస్త్ర సత్యం.
“తన కంఠమున దాచి హాలాహలం
తలనుంచి కురిపించి గంగాజలం
మనిషి శివుడు అవడమే” అప్పుడు సాధ్యమవుతుంది. నాకు చాలా బాధాభాగ్యమూ వేదనావరమూ లభించాయి. అది నాకు కొంత ఔన్నత్యమూ గాఢతా ఇచ్చిందేమో!
కొంత ముదిరినట్లున్నాను కాబోలు లేక ఊరికే ముదిసేనో! కాని నేను నిజానికి ముదిమిని దగ్గరకు రానీయను సుమండీ! వార్ధక్యం నిస్పృహతో వస్తుంది. నాకీ లోకమూ, సంసారమూ, మానవుడూ, జీవితమూ మహా ఇష్టం. ఆస్తికునికీ, మానవునిలో అచంచల విశ్వాసం ఉన్నవానికీ, ప్రేమికునికీ, నిస్పృహ చెందడానికి అధికారం లేదు. మనమే తెలీక, బుద్ధిలేక, చేజేతులా ఈలోకాన్ని ధ్వంసం చేస్తున్నాం. ఇది వినండి!
తేలు కుడుతుంది తోడేలు హింసిస్తుంది
తీతు వెవ్వరినయిన తిడుతుంది
లోన అంటుడు పురుగు ప్రాణం హరిస్తుంది
పైన ఆటంబాంబు పడుతుంది
ఎందుకీగతి జగతికీలాగు పడుతుంది
ఎందుకు శ్మశానమై చెడుతుంది?
క్షుద్రతిత్తిరి, కుటిలవృశ్చిక, కౄరవృక
రుద్రమారణయంత్ర రుగ్మతలు తానైన
మనిషికీ పెడబుద్ధి పడుతుంది
మనిషిలోనే పెద్ద మడతుంది
బోదెలో ప్రేమనే పాలు పొయ్యడు గాని
మోడు మందారాలు పెడుతుంది
అటుచాపి ఇటుచాపి అభయ హస్తాలల్లి
జగమంత పందిరిని కడుతుంది
ఈ ప్రేమ మనిషి మీదనే ఏమిటి? ఒక్కొక సుముహూర్తాన ఏ ప్రాణి మీదనయినా కలుగుతుంది కాదూ?
ఒక ఉదయం నేను నా ఇంట బయలుదేరాను. సమస్త సృష్టీ ఒకే ఒక ఆనందగీతం లాగున ఉంది. రోడ్డు పాడుతోంది. నా కారు పాడుతోంది. గాలీ, చెట్టూ, పిట్టా సర్వమూనూ! అప్పుడే ఉదయించిన ఉదయం వేళ కదా!! అప్పుడే ఒక కుక్క ఎటునుంచి వచ్చిందో, కులాసాగా తలా తోకా ఆడిస్తూ రోడ్డుకు అడ్డుగా నడిచి కారు కింద పడి ఒక్క అరుపు అరిచి ़చచ్చిపోయింది. నాకారు చక్రానికి రక్తం అంటుకుపోయింది. కారు ఆపలేదు డ్రైవరు. నా కుమార్తె మీద అలాగే నిష్ఠుర వేగంతో వెనక్కి తిరిగిచూడని రథ చక్రం వెళ్ళిపోయింది.
“ఓ ప్రభూ!నీ రథమ్ము దీక్షాప్రణీత విధురవేగమ్ము; పరువులు పెట్టుచుండె” దానికింద పడిపోయిన వారెందరో దినాంతమందు నీ రథ చక్రాలు కడిగేటప్పుడు ఏ రక్తం ఎవరిదో గుర్తు పట్టగలవా అంటాడు విశ్వనాధ.
అబ్బ! అయినా బాధ ఎంత గొప్పది! అందరికీ వేదన రావాలి. అందరికీ ప్రేమ కావాలి.
పారశీక కవి సాథీ అన్నట్లు మనం అందరం ఒక్క ఆదంలో నుంచే వచ్చాం. మానవ లోకం అంతా కలిపి ఒక శరీరం. ఈ లోకంలో ఏ మానవుడు చనిపోయినా నువ్వూ నేనూ చనిపోతున్నాం. ఏ మానవుడు పుట్టినా నువ్వూ నేనూ మళ్ళీ పుడుతున్నాం. వేదనా ప్రేమా కలిస్తేనే కరుణ. కరుణ సృష్టిస్తుంది. కరుణ శైథిల్యంలోనుంచి చైతన్యాన్ని పుట్టిస్తుంది. కరుణ బోధివృక్షం, కరుణ సిలువ, కరుణ సబర్మతి. ఊరికే బాధ చాలదు. కన్నీరు రావాలి. మేఘాలు పట్టవచ్చు. వర్షం కురియకపోవచ్చు. కన్నీటి భాగ్యం మానవునికే ఉంది.
మానవుడు ఎంత ధీరుడు ఎట్టి వీరుడు! కష్టాలూ సుఖాలూ, రాగాలూ ద్వేషాలూ, పతనాభ్యుదయాలూ, జీవనమృత్యువులూ, రోగాలూ రొష్టులూ, హత్యలూ ఆలింగనాలూ, విప్లవాలూ వేడుకలూ, ఎలాగ తన మహాప్రస్థానం సాగిస్తున్నాడో! మానవునికి జీవితమే గమ్యస్థానం! అదే మహాప్రస్థానం. మానవుడు దేవత. మానవుని స్వేద బిందువు రాలినచోట, అశృకణం ఒలికినచోట అక్కడే దేవళాలు మొలుస్తాయి.
అటువంటి మనుషుల మధ్య బతకడమే నేను కోరుకునే వరం. నన్ను గురించి చెప్పుకుందామని, నాలో పేరుకుపోయిన మనిషి మీది ప్రీతిని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయాను. ఇంతమంది మనుషుల మధ్య, ఇంకెంతోమంది ఉత్తముల్ని తీర్చిదిద్దిన, సరస్వతీ నిలయమైన నా తల్లి, ఈ కళాశాల నూరేళ్ళ పుట్టిన నాటి పండగ వేళ, ఇంతకంటే, చెప్పడానికి అర్హమైన విషయం ఏముంటుంది గనక!
ఇక చెప్పలేను మాటలురాక, మాటాడే వీలులేక, ఇదీ అని చెప్పడానికి సాధ్యం కాని మమతతో బరువెక్కి పోయాను. ఎంతపాటి చల్లటి చిఱుగాలి సోకినా జలజలా వర్షించే అశృ భరాభ్రంలా ఉంది నా మనస్సు.
నన్నిక్కడికి రావించి ఈ విధంగా అనురాగం చూపిన మీ అందరికీ నేను కృతఙ్ఞుణ్ణి. ఈ రాకవల్ల నా ఆయుస్సు మరీ 10 ఏళ్ళు అయినా పెరిగింది. నన్నూ నాకవితనూ గూర్చి మాట్లాడేరు. ఏలాగ వానికి జవాబుగా, వెంటనే ఇప్పుడు చెప్పగలను? సెలవిప్పించండి.