ఒకే ఒక్క ఇస్మాయిల్‌

(డిసెంబర్‌ 1, 2003 న ఆంధ్రజ్యోతి “వివిధ” శీర్షికలో ఇదే పేరుతో ప్రచురించబడ్డ వ్యాసాన్ని సవరించి, పెంచి రాసినది)

ఇస్మాయిల్‌గారు పోయారని వినగానే ఆయన గొంతు గుర్తొచ్చింది. అంటే మనిషిగా ఆయన గొంతు కాదు. ఆయన చివరికాలంలో గొంతుక దెబ్బతిందని, గట్టిగా మాట్లాడలేకపోయే వారని నేను విన్నాను. ఆయనకి సన్మానం చేసినప్పుడు ఆయన ఉపన్యాసం ఇంకెవరో సభలో చదివారని కూడా విన్నాను. కాని నేనెరిగిన ఇస్మాయిల్‌ హుందాగా, నిదానంగా, ఆప్యాయంగా నవ్వుతూ సున్నితంగా పలకరించేవారు. మంచి గాఢమైన ఆలోచనలు మాట్లాడేవారు. ఆయన పోయారని తెలియగానే నేను తల్చుకున్న గొంతుక అదొక్కటే కాదు. ఆయన కవిత్వంలో గొంతుక, నిశ్శబ్దంగా వినిపించే గొంతుక అదీ నాకు ఎక్కువసేపు గుర్తొచ్చింది.

ఇస్మాయిల్‌ కవి అని ఇప్పుడు తెలుగుసాహిత్యంలో అందరూ ఒప్పుకుంటారు. కాని ఆయన ఎలాటి కవో మనం పూర్తిగా గుర్తించామా అన్నది ఇంకా నాకు అనుమానమే. ఎందుకంటే ఆయనకవిత్వం లాంటి కవిత్వం ఆయనొక్కరే రాశారు. వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యజీవితంలో అలాంటి కవి మరొకరు లేరు. అలా అని ఆయన మహాకవి అనీ, యుగకర్త అనీ, ఇలాంటి అలవాటైన మాటల్లో ఆయన గురించి చెప్పడం ఆయనకి అన్యాయం. ఆయన కవిత్వం ఎలాటిదో తెలుసుకోడానికి ప్రయత్నిస్తే అక్కడికదే పదివేలు.

మాటకి శబ్దం, అర్థం రెండూ ఉన్నాయని మనకందరికీ తెలుసు. ఈ రెంటికీ మధ్య వున్న సంబంధం అకారణమనీ, ఏ వ్యక్తి ఇష్టాన్ని బట్టీ ఇది ఏర్పడేది కాదనీ, భాషని గురించి మాట్లాడినవాళ్ళు చాలామంది చెప్పారు. శబ్దమూ అర్థమూ వస్త్రంలో పడుగూ పేకల్లా, కాగితానికి ఇటూ అటూ వుండే పుటల్లా విడదీయడానికి వీల్లేకుండా కలిసిపోయి వుంటాయి. కాళిదాసు శబ్దార్థాల్ని ఈశ్వరుడి అర్థనారీశ్వర శరీరంతో పోల్చాడని అందరూ చెప్తుంటారు. సాహిత్యమంటేనే శబ్దార్థాల సంబంధమని ఎన్ని సార్లు మనకి చెప్పారో ఆలంకారికులు! నిశ్శబ్దంగా మాట చదివినా కూడా దాని అర్థంతో పాటు శబ్దం కూడా బుర్రలోకి వస్తుంది. కాగితం మీది మాటకి శబ్దం లేదు కదా! అది లోపల చదువుకుంటే శబ్దం వినిపించక్కర్లేదు కదా! ఐనా శబ్దం వినిపిస్తుంది. అలాగే అర్థరహితమైన శబ్దాన్నీ కవిత్వంలో ఊహించలేం. లోకంలో అర్థంలేని పదాలు కూడా, అంటే రణగొణధ్వనులు కూడా కవిత్వంలో అర్థవంతాలౌతాయి.

ఇంతసేపు ఈ సంగతి ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే తెలుగు సాహిత్యంలో కవిత్వం పరిస్థితి శబ్దార్థాల కలయిక గానే ఇన్నాళ్ళూ వుండడం వల్ల!

ఇస్మాయిల్‌గారు దీన్ని కాదన్నారు.

తన కవిత్వంలో, శబ్దప్రమేయం లేకుండా కాగితం మీద రాసిన అక్షరం తిన్నగా అర్థానికి దారి తీయగల విలక్షణమైన ప్రజ్ఞని ఆయన సంపాదించారు. ఆయనపద్యం చదువుతుంటే మన కంటికి అక్షరాలు కనిపించే మాట నిజమే. కాని ఆ అక్షరసముదాయం శబ్దసముదాయంగా మార్పుచెందక ముందే మన కళ్ళ ముందు ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మ అర్థాలు గీసిన బొమ్మే కాని శబ్దాలు గీసిన బొమ్మ కాదు. భాషకి వున్న శబ్దశక్తిని నిశ్శబ్దంగా వాడుకోగల సామర్య్థాన్ని ఇస్మాయిల్‌ అపూర్వంగా సాధించారు. ఆయన కవిత్వంలో తరుచు చెట్లు, కాలవలు, గోదావరి, ఆకాశం, నక్షత్రాలు ప్రత్యక్షంగా ఏ భాషాప్రమేయం లేకుండా కనిపిస్తాయి. “ధనియాలతిప్ప” అని తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం తాలూకాలో వున్న లంక గురించి ఆయనో పద్యం రాశారు

అంతా ఒక తెల్ల కాగితం

అందులో ఒక మూలగా
ఒక అడ్డుగీతా
ఒక నిలువుగీతా

తెరచాప ఎత్తిన పడవ

కిందిది నదీ
పైది ఆకాశమూ

కావొచ్చు

ఇందులో మాటల్నీ, వాటి కలయికల్నీ, వాటి కూర్పునీ, వాటి చమత్కారాన్నీ, ఏమీ విశ్లేషించక్కర్లేదు. పద్యం చదవగానే కళ్ళకు కనిపించే రెండు గీతల్నీ, రెండు గీతలతో పడవని చేయగల ఒక చిత్రకారుడి ప్రతిభనీ కావాలంటే గమనించవచ్చు. కాని మీకు కనిపించేది పడవ. ఈపద్యం ఎలా తయారయ్యిందో తెలియాలంటే మీరు మాటల్ని మర్చిపోవాలి. మాటకి వున్న శబ్దశక్తిని మర్చిపోవాలి. దాన్ని నిశ్శబ్దం చేయడం మూలంగా విడుదలయ్యే ఇంకొక శక్తి వుంది. అది ప్రత్యక్ష రూపదర్శన శక్తి. అదీ ఇస్మాయిల్‌గారు స్వాధీనం చేసుకున్న శక్తి. నాకు తెలిసివున్నంతలో ఈ శక్తిని గురించి మాట్లాడిన ఆలంకారికులు కానీ, ఆధునికులు కానీ ఇస్మాయిల్‌గారు తప్ప మరొకరు లేరు. ఇస్మాయిల్‌ కవిత్వంలో మాటలు దూదిపింజల్లా తేలిగ్గా వుంటాయి. మంచుతునకల్లా పారదర్శకంగా వుంటాయి. గాలితెరల్లా వున్నాయా లేవా అన్నట్టుంటాయి. మాటలకి రంగూ రుచీ వాసనా బరువూ అనేక అర్థాల్ని బోధించగల ధ్వనీ ఇవన్నీ వున్నాయని రకరకాలుగా మనం ఎరుగుదుం. కాని మనం ఎరగనిదల్లా మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వశక్తిని సంపాదించుకోగలదని. ఆ పని మాటచేత చేయించగలిగిన వారు ఇస్మాయిల్‌ ఒకరే.

శబ్దార్థాలలో వాచ్యమైన అర్థం అప్రధానమైతే ఏమవుతుందో ఆనందవర్ధనుడు తొమ్మిదో శతాబ్దంలో గుర్తించాడు. ధ్వనిని గురించి ఆయన చెప్పిన మాట మనకి ఆలంకారికులు చాలా సార్లు చెప్పారు. ధ్వన్యాలోకంలో ఆనందవర్ధనుడి కారిక యిది

యత్రార్థః శబ్దో వా తమర్థముపసర్జనీకృతస్వార్థౌ
వ్యఙ్క్తః కావ్యవిశేషః స ధ్వనిరితి సూరిభిః కథితః

ఏ కావ్యంలో శబ్దం తన అర్థాన్నీ, అర్థం (అంటే వాచ్యార్థం) తనని తనూ, అప్రధానం చేసుకుని ఇంకొక  అర్థాన్ని (అంటే వ్యంగార్థాన్ని) వ్యక్తం చేస్తున్నాయో ఆ కావ్యం ధ్వనికావ్యం అని యీ కారికకి అర్థం. ఆనందవర్ధనుడు చెప్పిన ఈ నిర్వచనంలో వాచ్యార్థం అప్రధానమైతే ఏం జరుగుతుందో మనకి చెప్పాడు కాని శబ్దం అప్రధానమై పోవడాన్ని గురించి ఆయన మనకేమీ చెప్పలేదు. చెప్పడానికి ఆ కాలంలో అవకాశం కూడా లేదు.

పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది. ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది. అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు. చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది. అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది. అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు. కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి, అందులో ప్రయోజనం వుందని గమనించి, ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్‌ ఒక్కడే.

అయితే, మనకి అక్షరాలే కనిపించే పద్యాలు అచ్చుయంత్రం రాకముందు లేవా అంటే వున్నాయి. ఒక్కసారి అప్పకవీయంలో చివరిపేజీలు చూస్తే, వాటిలో చాలా బంధకవిత్వచిత్రాలు కనిపిస్తాయి. బంధకవిత్వం కవిత్వాన్ని ఒక వినూత్నమైన కొత్తదశకి తీసుకువెళ్ళింది. అక్షరాల్ని ఒక ఆకృతిలో ఉదాహరనకి కుండలాకారంలో చుట్టుకున్న పాములాగా, ఎద్దు ఉచ్చపోసినప్పుడు ఏర్పడే వక్రరేఖలాగా, ఒరలోంచి తీసిన కత్తిలాగా పేర్చినప్పుడు ఆ అక్షరాల శబ్దం మరుగునపడి వాటి ఆకృతి మీద దృష్టి కలుగుతుంది. ఆధునికకాలంలో కాంక్రీట్‌ పొయిట్రీ అనీ, విజువల్‌ పొయిట్రీ అనీ, ఫ్రాన్సులో అపొలినేర్‌, అమెరికాలో ఇ. ఇ. కమింగ్స్‌, తెలుగులో నారాయణబాబు, శ్రీశ్రీ, ఆ తరవాత స్మైల్‌ ఇలాంటివాళ్ళు అక్షరాలు వానచినుకుల్లాగో, గాలి తరగల్లాగో ఒక పద్ధతిలో అచ్చువేసి చేసిన విచిత్రాలు ఈ కోవలోవే. అయితే ఈ రకమైన పద్యాలు అక్షరానికీ దాని ఆకృతికీ బొమ్మకున్నటువంటి ప్రాధాన్యాన్ని ఇస్తాయి. ఇక్కడ వున్న విశేషం ఏమిటంటే, శబ్దం నిశ్శబ్దం కాలేదు సరికదా, అక్షరం యొక్క ఆకృతికి అపారమైన ప్రాధాన్యం వచ్చింది. అంటే పద్యమే బొమ్మైంది. ఇది చిత్రకవిత్వం అని గమనిస్తే ఈ పద్యచిత్రాల్ని గురించి, చిత్రానికీ శబ్దానికీ వున్న సంబంధాన్ని గురించీ బోలెడు సంగతులు చెప్పవచ్చు.

కాని, ఇస్మాయిల్‌ చేసిన పని ఇది కాదు. ఇస్మాయిల్‌ పద్యంలో అక్షరం యొక్క ఆకృతికీ, పద్యం కాగితం మీద కనపడే తీరుకీ దాదాపుగా ఏ ప్రాధాన్యమూ లేవు. “దాదాపుగా” అని ఎందుకన్నానంటే, మంచి వచనపద్యం ప్రతిదానికీ లాగే ఇస్మాయిల్‌ పద్యంలో కూడా పద్యం కాగితం మీద అచ్చయిన తీరుకి చాలా ముఖ్యమైన ప్రయోజనం వుంది. ఉదాహరణకి ధనియాలతిప్ప అనే పై పద్యంలో పంక్తులు సరిగ్గా అలాగే విరవాలి. పంక్తి చివర ఫుల్‌స్టాప్‌ వుండకూడదు. చరణాలు స్పష్టంగా వుండేట్టు చూసుకోవాలి. అంటే, పంక్తుల మధ్య జాగాల కన్నా చరణాల మధ్య జాగా ఎక్కువ వుండాలి. పంక్తులకీ, చరణాలకీ జాగాలు కలిపేసి, ఈపద్యాన్ని వచనంలా అచ్చువేస్తే, పద్యత్వం పూర్తిగా దెబ్బ తింటుంది. అయితే, ఈ గుణాలు సర్వవచనకవిత్వ సాధారణమైనవే. ఇస్మాయిల్‌ కవిత్వానికే ప్రత్యేక లక్షణాలు కావు. ఇంతకు మించి పద్యం ఆకృతికి ఆయన కవిత్వంలో ప్రత్యేక ప్రాధాన్యం లేదు.

కవిత్వం చేత సమాజానికి కావలసిన చాలా పనులు చేయించుకోవాల్సిన అవస్థలో పడి, కవుల మీద వాళ్ళు నెత్తికెత్తుకోలేనంత బరువు మోపి, ఆ బరువు మోయలేమంటున్నవాళ్ళని ఈసడించుకుంటున్న ఈకాలంలో ఇస్మాయిల్‌ ఒక పట్లాన మనకి అర్థం కారు. కవులు ఆ బాధ్యతని మొయ్యకతీరదన్న వాళ్ళ మీద ఇస్మాయిల్‌ గారికి గౌరవం లేదని మనకి తెలిసినప్పుడు మనం కొంచెం కష్టపెట్టుకున్నాం కూడా. కాని ఆయన రాసిన “అనంతపురంలో గాడిదలు” కూడా పెద్ద చప్పుడు చేస్తున్నట్టు వినిపించదు. ఆ పద్యం చదువుతుంటే కొట్టవచ్చినట్టు కనిపించేది అమాయకమైన గాడిదల మూర్ఖత్వమే.

తెలుగులో కొత్తరకమైన కవిత్వం రాస్తున్నామనుకుంటున్న వాళ్ళంతా కవిత్వం గురించి కవిత్వం రాసారు. ఇస్మాయిల్‌ పద్యాలలో కూడా కవిత్వం గురించి రాసినవి ఉన్నాయి. కవిత్వం గురించి ఇస్మాయిల్‌ ఏమనుకుంటున్నారో తెలుస్తుంది ఈ పద్యాలు చదివితే. వీటిలో నాకు నచ్చినవి రెండున్నాయి. ఒకదాని పేరు “కవిత్వం”.

సుందరి ఒకామె కనిపించి
విత్తనం చేతనుంచి
పలక్కుండా వెళ్ళిపోయింది.

ఈ విత్తనాన్ని పాతి,
మొక్కై
మహావృక్షమై
విశాంతరాళాలు
విస్తరించే దాక
పెంచి,
అప్పుడు
పొద్దుపొడుపు లోకి
పొడిచే వటశాఖ నెక్కి
ఆమెను వెతుక్కుంటో
యోజనాలు నడిచిపోతాను.

(“ఇస్మాయిల్‌ కవితలు”, ట్వింకిల్‌ పబ్లికేషన్స్‌, సెప్టెంబర్‌ 1989, పేజీ 110)

ఈ పద్యంలో ఎక్కడా కవిత్వం అనే మాట లేదు. కాని పద్యం పేరు “కవిత్వం”. అంటే ఈ పద్యంలో కథకి వాస్తవమైన అస్తిత్వం లేదు. ఇది కవి మనస్సులో జరిగిన కథ. ఆ సుందరి తెచ్చింది కవిత్వమే. అది యింకా పలకడం లేదు. బీజప్రాయంగా వుంది. ఈ బీజం కవిమనస్సు లోది కాదు. అదీ ఓ అందమైన అమ్మాయే తెచ్చి యివ్వాలి. లోకసృష్టి, నన్నయ గారి మాటల్లో చెప్పాలంటే “స్త్రీపుంస యోగోద్భవం”. కవిత్వసృష్టి కూడా అలాటిదే. ఇక్కడ కవి పురుషుడు కాబట్టి బీజం స్త్రీ. ఆ అమ్మాయి పలక్కుండా వెళ్ళిపోవడంతో కవికి కవిత్వం పట్ల తపన ఏర్పడింది. అందుచేతనే కవి ఆ కవితాబీజాన్ని తన మనఃక్షేత్రంలో పాతి, మొలిచిన మొక్కను పెంచి, పెద్దది చేస్తాడు. ఈ చెట్టు కవి మనస్సులోనే పెరగాలి. తనలోనే తాను యోజనాలు నడవాలి. అంతా నిశ్శబ్దంగా. శబ్దసౌందర్యం అంత నిశ్శబ్దంగా ప్రయాణం చేస్తేకాని కనిపించదు. పైగా అంత ప్రయాణం చెయ్యడానికి కవి మహావృక్షమంత పెరగాలి.

ఇస్మాయిల్‌గారి కవిత్వంలో ఆయన కవిత్వాన్ని చూసిన తీరు కూడా దండలో దారంలాగా కలిసిపోతుంది. అలాటి ఒక పద్యం “చిలకలు వాలిన చెట్టు”. ఇది కవిత్వం గురించే కాదు, కవిత్వం చదవడం గురించి కూడా.

కిచకిచమని శబ్దమైతే
కిటికీలోంచి చూశాను.
ఎప్పటిలాగే చెట్టు
గుప్పిట విప్పి నిలుచుంది.
మరెక్కడిదీ చప్పుడు?
పరకాయించి చూశాను.
పచ్చటి చీకట్లో
మంటేదో ఎర్రగ కదిలింది.

గుట్టు తెలిసింది : చిలక!
చెట్టునిండా ఉన్నట్టున్నాయి.
గుబురంతా వెతికి వీటిని
గుర్తించటం ఒక సరదా.

ముక్కుల దీపశిఖలవల్ల
ఒక్కొక్క చిలకనే పోలుస్తుంటే
తెలిసిందప్పుడు నాకు
చిలకలు వాలిన చెట్టు
లోతైన కావ్యం
లాంటిదని.

(“ఇస్మాయిల్‌ కవితలు”, ట్వింకిల్‌ పబ్లికేషన్స్‌, సెప్టెంబర్‌ 1989, పేజీలు 115116)

పద్యం చూడడానికి ఉత్త చెట్టులాగే కనిపిస్తుంది. కాని జాగ్రత్తగా చూడాలి. ఎక్కడో ఒక చిలకముక్కు ఆకుల మధ్య దాక్కుని, ఎర్రగా కనిపిస్తుంది. ఒకటి కనిపించిన వెంటనే ఇంకోటి. ఎన్నిసార్లు చూస్తే అన్ని అందాలు కనిపిస్తాయి. పద్యం ఎప్పటికీ పూర్తిగా చదివేసామనుకోలేం. ఇంకా కొత్త చిలకముక్కులు కనిపిస్తూనే వుంటాయి కాబట్టి.

ఇంత మంచి పద్యంలో నాకు బాగులేనిది ఒక్కటే

తెలిసిందప్పుడు నాకు
చిలకలు వాలిన చెట్టు
లోతైన కావ్యం
లాంటిదని

అని పద్యం చివర అంత వాచ్యంగా చెప్పెయ్యాలా? సాధారణంగా ప్రతిమాటా జాగ్రత్తగా వాడే ఇస్మాయిల్‌ ఈ పద్యం ముగింపు విషయంలో జాగ్రత్త పడలేదు. చాలా మంచిపద్యం ఇలా దెబ్బ తిని పోయిందే అని నాకు దిగులు ఈ పద్యం చదివినప్పుడల్లా. ఇలా జాగ్రత్త పడని జాగాలు ఈయన పద్యాల్లో మరికొన్ని లేకపోలేదు. కాని బహుకొద్ది.

ఇస్మాయిల్‌ ప్రకృతిని ప్రేమించిన వాడనీ, సదా బాలకుడనీ కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఈయన మీద ఉందనీ రకరకాల మాటలు చెప్పారు విమర్శకులు. కాని ఇస్మాయిల్‌ అంత తేలిగ్గా దొరికిపోయే కవి కాడు. ఈయన చాలా గడుసైన కవి. చాలా పరిణతమైన, గాఢమైన ఊహాశక్తి వున్నవాడు. లోకం క్షుణ్ణంగా తెలిసిన వాడు. ప్రేమికుడో అమాయకుడో కాడు. పైగా కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఇస్మాయిల్‌ కవిత్వం మీద సుతరామూ లేదు. కృష్ణశాస్త్రి గారంటే ఇస్మాయిల్‌కి ఇష్టం వుంది. కాని ఇష్టం వేరు, ప్రభావం వేరు.

కవిత్వం పేరుతో తన చుట్టూ జరుగుతున్న గోల నుంచి తప్పించుకోడానికి ఒక బలమైన మార్గాన్ని తన కవిత్వం కోసం ఎంచుకొని, నిశ్శబ్దంలో కవిత్వాన్ని చూపించారు ఇస్మాయిల్‌గారు. ఈ పరిస్థితి గమనిస్తే ఒక ప్రత్యేకమైన చారిత్రక సందర్భంలో వచ్చిన కవిగా ఇస్మాయిల్‌ మనకి కనిపిస్తారు. అందుచేతనే, ఆయన కవిత్వం అనుయాయిత్వాన్ని ప్రోత్సహించదు. నిజానికి ఆయనలా రాయాలనుకున్న కవులు ఎక్కువమంది లేరు. ఉన్న కొద్దిమందీ ఆ మార్గంలో రాసినప్పుడు పేలవమైన రెండోతరగతి కవుల్లా కనిపించేశారు. ఆ సంగతి కొందరు తొందరలో గమనించి దాన్నుంచి తప్పుకున్నారు కూడా. మంచికవిత్వానికి అభిమానులే కాని అనుయాయులు వుండకూడదు. ఈ విషయంలో ఇస్మాయిల్‌ నిజంగా అదృష్టవంతుడు.

ఇస్మాయిల్‌గారి కవిత్వాన్ని ఇంగ్లీషులోకి అనువదించి అమెరికాలో, ఇంగ్లండులో, జర్మనీలో ఎక్కడ చదివినా వెంటనే ఇది కవిత్వం అని పోల్చుకోగలిగారు వింటున్నవాళ్ళు. ఈ పద్యాలు ఇంగ్లీషు ద్వారా స్పానిష్‌ లోకి అనువదించి ప్రచురించినప్పుడు అక్కడ కూడా చాలామంది మెచ్చుకున్నారని అనువాదం చేసిన మిత్రుడు మొరేసియో టెనేరియో చెప్పాడు.

చాలా ఏళ్ళ క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు రోజల్లా విడుపు లేకుండా మాట్లాడుకున్న గంటలు, ఆయన నామీద చూపించిన ఆప్యాయత, వీధరుగు మీద విశ్రాంతిగా కూర్చుని తిరగేసిన పుస్తకాలు, ఆయనా వాళ్ళావిడా మాకిచ్చిన ఆతిథ్యం నాకిప్పటికీ గుర్తొస్తాయి. అన్ని గంటలసేపు ఆయనతో మాట్లాడినా ఆయన తన కవిత్వాన్ని గురించి ఏమీ చెప్పలేదు. చదివి వినిపించలేదు కూడా. ఆయన చేతిరాతతో ముచ్చటగా రాసుకున్న పద్యాల పుస్తకం మాత్రం నాతో వచ్చిన స్మైల్‌ నాకు చూపించాడు. వాటన్నింటికన్నా కూడా ఇప్పటికీ నన్ను పట్టుకునేది ఆయన పద్యాల్లోని నిశ్శబ్దమే.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...