హాలాహలం

(6,000 రూపాయల ప్రథమ బహుమతి పొందిన కథ)

తెల్లటి మంచు కప్పబడ్డ ఆ శవాలు రోడ్డు మీద … ఒక్కొక్కటీ పైకి లేచి వరుసగా రొబొట్లలా అడుగులు వేసుకుంటూ మాకు ఎదురొస్తుంటే అవన్నీ ఎక్కడ మా కారుని చిదిమేస్తాయో, మమ్మల్ని మింగేస్తాయేమొనని భయంతో వొణికి పోయాన్నేను …. చిత్రమేమిటంటే ఈ శవాలన్నీ బక్కపలచగా, వికృతంగా, పేగులెండుకుపోయి….. మింగడానిక్కాకుండా దోచుకుపోవడాని కొస్తున్నట్టున్నాయి …. దెయ్యాలూ, భూతాలూ వినడమే తప్ప చూడ్డమయితే యిదే మొదటిసారి …

“ఏయ్‌ ఏంటది?… హేమా ప్లీజ్‌ కొంచెం కొంట్రోల్‌ చేసుకో”… సురేష్‌ ఏదో పలకరిస్తూంటే ఏడుస్తున్నానని అర్థమయి మగతలో నుండి బయట పడ్డాను ….

మెలకువలోకి రావడం మరింత భయంకరంగా వుంది … మనసు కాలుతోంది …. దయాకర్‌ యిటువంటి పని చేస్తాడనీ, చెయ్యగలడనీ నేనెప్పుడూ ఊహించలేదు … మా కుటుంబంలో ఎవరూ యింత అర్థాంతరంగా చనిపోయిన జ్ఞాపకం లేదు … అందునా ఆత్మహత్యల జాడే కన్పించదు … ఛ .. ఛ దయ యింత పని చేస్తాడనుకోలేదు …

తెల్లవారు ఝాము మంచు శరీరాన్నీ, మనసునీ కూడ ముద్ద చేస్తోంది … ఎప్పుడూ యెడా, తెంపూ లేకుండా సాగిపోయే వాహనాలతో వుండే మెయిన్‌ రోడ్డు మీద మంచుప్రభావానికి కాబోలు అప్పుడొకటి, అప్పుడొకటి బండ్లు ఎదురొస్తున్నాయి … వాటి లైట్లు కారు అద్దం మీద పడి పరావర్తనం చెందుతున్నాయి… దట్టమయిన ఆ మంచుని చీల్చుకు వెళ్ళడం కారులో కాకుండా మేఘాల్ని దాటుకు వెళ్తూన్నట్లుగా వుంది …. అయినా ఆవేగం నాకందడం లేదు.

గుండెల్లో సన్నగా మంట … అలజడి … ఆపుకోవడం సాధ్యం కాని టెన్షన్‌….
“డ్రైవర్‌ఁ కొంచెం త్వరగా పోనీ” టాక్సీ అతన్ని తొందరపెట్టాను.
“ష్ష్‌ ఁ డెబ్బయి మీద పోతున్నాడు” మందలించాడు సురేష్‌. అప్పటివరకూ బిగపట్టుకున్న దుఃఖం చప్పున బయటికి తన్నుకొచ్చింది… నా ఒళ్ళో నేనే తలపెట్టుకుని యేడవసాగాను. సురేష్‌ చేయి నా వెన్ను నిమురుతూ సముదాయించడానికి ప్రయత్నిస్తోంది …. ప్చ్‌ ఁ ఎంతకీ సమాధానం కుదరడం లేదు…

మా మేనత్త కొడుకులు ముగ్గుర్లోనూ దయాకర్తోనే నాకు సన్నిహిత అనుబంధం … మిగిలిన యిద్దరూ నాకంటే పెద్దవాళ్ళు కావడం ఎప్పుడూ చదువే ధ్యేయం అన్నట్లుగా వుండడంతో వాళ్ళిద్దరితో అంత చనువు లేదు… దయాకర్‌, నేనూ ఒకే ఈడు వాళ్ళం కావడం, ఒకే బడిలో, ఒకే తరగతిలో వుండడంతో చిన్నప్పట్నుండీ యిద్దరి మధ్యా స్నేహమూ, చనువూ ఎక్కువ …

జ్యోతిని ప్రేమించినపుడు కూడ తల్లితో, అన్నలతో కాకుండా ముందుగా నాతోనే చెప్పి తల్లికి చప్పమని బతిమాలాడు.

చదువు పూర్తి కాకుండానే పెళ్ళేమిటని అన్నలూ, తల్లీ విసుక్కుంటున్నా తనే అత్తని ఒప్పించి పెళ్ళి జరిపించింది …

పెద్దకొడుకు లిద్దరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఒకరు మద్రాసులోనూ, మరొకరు హైదరాబాదులోనూ ఉండడంతో అత్త ఎక్కువగా వాళ్ళతోనే వుంటుంది … తనెప్పుడూ నవ్వుతూ అత్తని దెప్పిపొడిచేది పల్లెటూరి కోడలి మీద ప్రేమ లేదంటూ ….

దయాకర్‌కి చదువబ్బక పోవడంతో ఊళ్ళోనే వుండి పొలాలు దున్నుకోవడం మొదలుపెట్టాడు. దయాకర్‌కి మా ఊరన్నా, తండ్రి పండించిన పొలాలన్నా అమితమయిన ప్రేమ …. అయితే అన్నలు కూడ పొలంలో వాటాలు కావాలని పేచీపెట్టక తమ్ముడు స్థిరపడితే చాలుననుకున్నారు….

దయాకర్‌ ఎప్పుడయినా మందులకోసమో, ఎరువులకోసమో టవును కొచ్చినపుడు వ్యవసాయం యింతకుముందులా కాదనీ, చాలా కష్టమయి పోతోందనీ వాపోయేవాడు….

వర్షాల్లేక పోవడం, అకాలవర్షమూ…. కొత్తకొత్త తెగుళ్ళు, నకిలీ పురుగుల మందులూ, బలంలేని ఎరువులూ…. యిలా నాకర్థమయినా కాకపోయినా దయాకర్‌ చెప్తుంటే శ్రద్ధగా వినేదాన్ని…

గడ్డిలేదని ఎద్దుల్ని అమ్మేశానని కళ్ళల్లో నీళ్ళు తొణికిసలాడుతూ చెప్పాడోసారి…

“ఆ నేల గాడ అమ్మిపారెయి పీడా వదలద్ది … యిక్కడికొచ్చి యేదయినా వ్యాపారం పెట్టుకుందువుగాని” పెరుగుగిన్నె తీసి దయాకర్‌ ముందుపెడుతూ యాధాలాపంగా అనేశాను.

తినబోతున్న ముద్దని ప్లేట్లో వుంచేసి ముందు సీరియస్‌ గానూ, ఆ తర్వాత దీనంగానూ నా కళ్ళలోకి చూశాడు … నామాటల్లోని వ్యవసాయ వ్యతిరేకత దయని బాగా బాధించినట్లుంది.

“అవునవును అమ్మని గూడ అమ్ముదావనే చూస్తిని .. ఆ నడవఁ రొయ్యల కాంట్రాక్టర్లొచ్చి పొలాలు గావాలని అడిగితే …. తీరా చూస్తే నా తల్లి గుండెల్లో కన్నీళ్ళే తప్ప ఉప్పునీళ్ళు పడవంట” జీరబోయిన గొంతుతో పెరుగు వేసుకోకుండానే లేచి చెయ్యికడిగేసుకున్నాడు ….

రోజురోజుకీ నేలతల్లి మీద నమ్మకం పోవడం … అట్టాటి పరిస్థితిలో బడ్డందుకు నీలో నువ్వే యెంత మదనపడ్డావో నాకిప్పుడు తెలుస్తోంది… నేనిప్పుడు ఆకులు పట్టుకుని ఏం చెయ్యను? తలబాదుకుని యేడవాలన్న ఆలోచనని బలవంతాన ఆపుకున్నాను.

ఊళ్ళు ఒకదాని తర్వాత మరొకటి గుడ్డిగుడ్డిగా కన్పించి కనుమరుగవుతున్నాయి…

మా ఊరికి దగ్గరయ్యే కొద్దీ గ్రామాలు వెలవెలబోతున్నాయి. నా చిన్నప్పుడయితే ఈ వేళకే ఊళ్ళు నిద్రలేచి కళకళలాడుతుండేవి ….. పాలు తీసేవాళ్ళు, పేడ జవిరే వాళ్ళు, బర్రెలకి మేత పెట్టేవాళ్ళు, మోకులు భుజానేసుకుని చేలోకి పొయ్యేవాళ్ళూ, పాలుపోసుకు పోవడానికొచ్చిన వాళ్ళ సైకిల్‌ బెల్లులూ, వాళ్ళకీ, గృహిణులకీ మధ్య కలగాపులగమైన మాటలూ, “కొక్కొరొకో” అంటూ కోడిపిలుపులూ ప్రతీదినం ఒక పండగ మాదిరుండేది… మరీ పండగ నెలయితే చెప్పేదానికే ల్యా …. అట్టాటిది యిప్పుడు అయిదున్నరయినా ఎక్కడా ఏ సందడీ లేదు… ఏ యింటి దొడ్డిలోనూ అంత గడ్డివామి లేదు. పశువులసలే లేవు… కొట్టాలన్నీ చెదలు పట్టిపోయి కూలిపొయ్యేట్టుండాయి.

మా ఊళ్ళో గ్రామదేవత అంకమ్మ గుడి కూడ గోడలన్నీ పెచ్చులూడిపోయి … ఉప్పుదేలి వెలవెలబోతోంది… అంకమ్మ గుళ్ళో వుందో, వెళ్ళిపోయిందో తెలీడం లేదు.

పల్లెటూర్లలో కూడ జీవితం యింతకు ముందుకీ, ఇప్పటికీ యెంత తేడా అయిపోయిందో ఆలోచిస్తూ కారు ముందుసీటు మీదికి తలవాల్చాను … “ష్ష్‌” మంటూ భారమైన నిట్టూర్పొకటి నన్నొదిలి వెళ్ళింది …
* *

పడుకుని ప్రశాంతంగా నిద్రపొతున్నట్లుగా వున్నాడు దయాకర్‌. నాతో తీసికెళ్ళిన పూలమాలని వెయ్యాలన్న సంగతి కూడ మర్చిపోయి దయ ముఖంలోకి చూస్తుండి పోయాన్నేను….. మూసుకువున్న కనురెప్పలు నలిగి వున్నాయి … ఎప్పుడూ ఒక్కమాట కూడ పెద్దగా, పరుషంగా మాట్లాడని పెదవులు నలుపు తిరిగి వున్నాయి … బుగ్గలు లోతుకుపోయి ఆ గుడ్డి బల్బు వెలుతురులో దయాకర్‌ని కాక మరెవరినో చూస్తున్నట్లుగా వుంది నాకు …

పూర్తిగా తెల్లారక పోవడంతో యింకా యెవరూ వచ్చినట్లులేదు. జ్యోతి పక్కన మా పెద్దమ్మా, యింకా జ్యోతి తల్లి, ఆమె తాలూకూ బంధువులొక అయిదారుమంది కూర్చునివున్నారు… అత్త కూడ యింకా రాలేదు … ఇప్పుడు చార్మినార్‌లో గన దిగుతారేమొ …

శవం పక్కన పేరుకుపోయి వున్న ఆ తెల్లవారు ఝాము నిశ్శబ్దం మంచుకన్నా చల్లగా మనసుని కోస్తోంది.

అప్పటిదాకా దయాకర్‌ ప్రక్కనే సోలిపోయి పడున్న జ్యోతి పైకి లేవాలని ప్రయత్నించి పడిపోబోయి ఎట్టకేలకు నిలదొక్కుకుంది… నిన్న యేవేళప్పుడు దువ్వుకున్న తలో అంతా వూడిపోయి వెంట్రుకలు చిర్రుచిర్రుగా వేళ్ళాడుతున్నాయి … రంగుబోయి మాసివున్న నైలెక్స్‌ చీర ఒంటిమీద సగం, నేలమీద సగం జీరాడుతోంది. రెండుచేతులూ పైకెత్తి నన్నుచూసి బిగ్గరగా ఏడుపందుకుంది జ్యోతి … ఇటువంటి సమయాన్ని ఎదుర్కోవడం నాకెప్పుడూ కష్టమైన విషయమే … నా ధుఃఖాన్నే ఎవరయినా దోసిలిపట్టి పంచుకుంటే బావుండునని వున్న ఈ స్థితిలో జ్యోతికి నేనేం చెప్పగల్ను? అప్రయత్నంగా ఆమె పక్కనే కూలబడి వీపుమీద చెయ్యేశాను.

కదిలిపోతోంది జ్యోతి
“యెంత పని చేసి పోయినాడో చూడక్కా … నేనేం తప్పు చేశాననీ? …. నాకెట్ట బతకాలో చెప్పకుండా పొయినాడే … కష్టాలు మనుషులిగ్గాకపోతే మాన్లకొస్తాయా? … తనొక్కడే సుఖపడి పోతే చాలుననుకున్నాడే … నాగ్గూడ యింత పెట్టుండగూడదా పెరుగుబువ్వ హయ్యో నేనేం జేసేదక్కా …. ఈ బిడ్డల్ని పెట్టుకొని నేనెట్ట బతికేది? మమ్మల్ని దిక్కులేనోళ్ళని జేసి పొయినాడే” తలబాదుకుంటూ, వాళ్ళిద్దరి నడుమా జరిగిన అనేకానేక స్మృతుల్ని ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ, తలపోసుకుంటూ ఏడుస్తోంది

జ్యోతి ఏడుపుతో దుఃఖం నిండిన నాగుండెలు ఎగిసిపడుతున్నాయి … ఆమెను పట్టుకున్న నా చేతులు వొణుకుతున్నాయి … ఏడుపుని బలవంతాన ఆపుకోవడంతో గొంతు విపరీతంగా నొప్పి పెడుతోంది …

అసలేం జరిగిందో తెలీక పెద్దమ్మ వంక చూశాను. దయాకర్‌కి అటువైపుగా కూర్చుని వున్న పెద్దమ్మ లేచి చుట్టూ తిరిగి మా యిద్దరి పక్కగా వచ్చి కూచుంది.
“నిన్న మధ్యాన్నం చేలోకి పొయ్యేటప్పుడు గూడ మీ పెదనాయిన్ని ఎచ్చరించుకోని పొయినాడమ్మా … రాత్రి ఎప్పుడు తిరిగొచ్చిందీ నేను చూడనే ల్యా …. పదిగంటలప్పుడు చిన్నోడొచ్చి “అమ్మమ్మాఁ అమ్మ పిలుస్తుందంటే పరిగెత్తినా …. అప్పటికీ యాముండాది రిక్షా పిల్చుకోని యెసుకోఅని పరిగిస్తిమి. డాక్టరు కాడికి పొయ్యేలోపల్నే అంతా అయిపోయింది … కల్తీ మందులంటారు .. నకిలీ మందులంటారు … పురుగేమొ ఛావడం లేదు … మనుషులు మాత్రం నిమిషాల మీద ఎగిరిపోతుండారు. అయ్యేం మందులో తల్లా …” రాత్రినుండి టెన్షన్లో పడి ఏడుపు మర్చిపోయినట్లుగా హఠాత్తుగా పెద్దమ్మ యాడవసాగింది.

పెద్దమ్మ చెప్పింది సంపూర్ణంగా లేదంటూ జ్యోతి కొనసాగించింది … “రాత్రి ఎనిమిది గంటలకొచ్చినాడు కాపొలం కాడ్నుండి …. ఒక మాదిరిగా, మౌనంగా వుణ్ణాడు … అయితే మావూలుగానే అన్నం తిన్నాడు … పక్కింటోళ్ళ రవి వస్తే కాసేపు మాట్లాడ్నాడు … పిలకాయిల్తో ఆడతా వుణ్ణాడు కా …. నేను వంటింట్లోంచి అన్నీ సర్దుకుని వచ్చేటప్పుడుకి దేవుడి ముందు కూర్చుని ధ్యానం చేసుకుంటుణ్ణాడు. ఎంతసేపయినా రాకపొయ్యేతలికి లేసిపొయి చూద్దును గదా పక్కకి ఒరిగిపొయ్యుండాడు … కిందంతా ఈ గుళికల మందు రాలుంది … నా నడుము లిరిగిపొయినా యనుకో …..”

రాత్రినుండీ ఈ సంఘటనని యెన్నిసార్లు గుర్తుకు తెచ్చుకుందో … ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పిందో గాని అరిగిపోయి వుంది జ్యోతి గొంతు … ఏడుపు, దుఃఖమూ అన్నీ ఆపి భర్త ముఖం లోకి తదేకంగా చూడసాగింది.

క్షణాలు గడుస్తున్నాయి … చిరుచీకట్లు తొలిగి వెలుతురు కిరణాలు లోపలికి ప్రసరిస్తున్నాయి … పక్కింట్లో, ఎదురింట్లో వాకిళ్ళు వూడ్చి కళ్ళాపి చల్లుతున్న చప్పుడు నిశ్శబ్దాన్ని చెదరగొడుతోంది…

అప్పుడే నిద్రలేచిన దయాకర్‌ చిన్నకూతురు దివ్య తప్పటడుగు వేసుకుంటూ వచ్చి “మా …. మా …. నానా … నానా ” అంటూ దాని భాషలో ఏదో ప్రశ్నించింది తల్లిని …

చిన్నప్పుడు నేనూ, దయా కలిసి చదూకున్న ఇంగ్లీష్‌ పాఠం “ది డెడ్‌ వారియర్స్‌ వైఫ్‌” గుర్తొచ్చి హఠాత్తుగా గొంతుని బిగపట్టుకున్నాను ….. ఇక్కడ్నుండి ఎక్కడికయినా పారిపోగలిగితే ఎంత బావుణ్ణు ..?

“నాయినా … నా నాయినా దయా” వాకిట్లోనుండే అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చింది అత్త …. అత్తని చూడగానే ఏడుపుల్తో యిల్లంతా హోరెత్తిపోయింది.
“నాయినాఁ ఎంత పని చేసినావురా దయా …. ఈ ముసిలి ముప్పందాన నాకీ కడుపుశోకం పెట్టిపొయినా వేందయ్యా …. నన్ను తీసుకు పోగూడదా ఆ దేవుడు … మీ నాయన్తో గూడ పొయ్యుంటే నాకీ ఖర్మలన్నీ చూసేది ల్యాకుండా పొయ్యుణ్ణే … అయ్యో నాయినా … నీకేం కష్టమొచ్చిందిరా … ఒక్కమాట నాతో చెప్పుండ గూడదా? అప్పులుంటే ఎట్నో ఒకట తీర్చుకోకూడదా …. దానికి యిట్టాపని జేసుకుంటారా ఎవురయినా? …. ప్రెపంచంలో ఎవురికయినా అప్పు చెయికుండా, కన్ను కారకుండా బతుకులు గడుస్తాయా? …..
…. నీకేమి నాయినా కోటిసూర్యప్రకారంగా వుండారే నీ అన్నలు … ఒక్కమాట వాళ్ళకి చెప్పుకునుంటే వాళ్ళు నీ అప్పులు తీర్చక పొయ్యుందురా? … నాయినా …. నా దయా …”

శోకాలు పెడుతోన్న అత్తని చూస్తుంటే జాలిగా వుంది….. పైకి అలా అంటోందే కానీ అత్తకి బాగా తెలుసు .. ఎవరి బతుకులు వాళ్ళవి … తమ్ముడు చేసిన మూడేళ్ళ అప్పులూ తీర్చి .. వస్తుందో, రాదో తెలీని కొత్తపెట్టుబడి పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా లేరు … నిజానికి ఈ రోజు వ్యవసాయం ఎంత కష్టమై పొయ్యిందో, దేశమంతటా అక్కడా, అక్కడా ఎంతమంది రైతులు నేలతల్లినీ, కుటుంబాలనీ వదిలి ఆత్మహత్యలు చేసుకుంటుండారో వాళ్ళకి తెలీకుండా యేం లేదు … ప్చ్‌ఁ ఎవరి బతుకుకీ, ఎవరి ఛావులకీ ఎవరు జవాబులు చెప్తారు?

నేనే మాలోచిస్తుండానో నాకే తెలీడం లేదు.
నిరామయంగా నిమిష నిమిషానికీ మారిపోతున్న దయాకర్‌ శరీరాని కేసి చూస్తూ కూర్చున్నాను … జ్యోతి పెదనాన్న కూతురు సునీత ఐసుగడ్డలు తెచ్చి దయాకర్‌ పక్కనా, కిందా, పొట్ట మీదా పెడుతోంది. కాస్సేపటికే అవన్నీ కరిగి నీరంతా చాపకింద చేరుతోంది … దయాకర్‌ కిందేసిన పరుపు తడిసి ముద్దవుతోంది …. నల్లగా కమిలిపోయిన పెదాల మధ్య తులసాకు ముద్ద వికృతంగా కన్పిస్తోంది … సమయం గడిచే కొద్దీ ముక్కుల్లో నుండి నల్లటి ద్రవం బయటికొస్తోంది … మనిషి బతికుంటే సరేగానీ ఆ గుక్కడు ప్రాణం కాస్తా పొయ్యిందంటే ఒక్కరోజు కూడ యింట్లో వుంచుకోం …. ప్చ్‌ఁ

“నాయినా … నా నాయినా దయమ్మా” అంటూ దయాకర్‌ ఒళ్ళూ మొహమూ అంతా తడిమి, తడిమి ఏడుస్తోంది అత్త. మధ్యమధ్యలో కారుతున్న ముక్కుని పమిటచెంగుతో తుడుచుకుంటోంది. అసలే నల్లగా వున్న అత్తముఖం మరింత నల్లబడి పీక్కుపోయి వుంది … దూరప్రయాణం వల్లనో, కడుపుశోకం వల్లనో మరి …

అత్త మామయ్య పోయాక చాలా కష్టాలు పడింది …. మావయ్య వయసులో వున్నప్పుడు యిదే యిరవయి ఎకరాల్లో ఎంత పంట పండించి అప్పచెల్లెళ్ళ నందర్నీ సాగనంపాడు … ఇదే పదేనెకరాల్లో ఊళ్ళో మొదటి కుటుంబంగా గొప్పగా బతికారు … ఊరి సర్పంచ్‌ మామయ్య. ఊళ్ళో మంచికీ, చెడుకీ సలహాలకి మామయ్య …. ఏ మూల ఏ తగువు జరిగినా మద్యస్థాలన్నీ మామయ్య దగ్గరే … అట్టంతా బతికిన మామయ్య అవతలవతల కొడుకుల చదువు కోసం కొంతనేల అమ్మకతప్పింది గాదు … ఇప్పుడు పదెకారాల్లో దయాకర్‌ బతకలేక మందు మింగినాడంటే వ్యవసాయం ఎంత దుర్భరంగా వుందో కదా …

“నాయినా … నీమనసులో ఏం బెట్టుకున్నావో గదా … మొన్నీ నడవ నేనొచ్చినపుడు గూడ తెంపుగా లేడమ్మా బిడ్డ … ఏం కష్టమొచ్చిందో గాని ….” అత్తకు బాగా తెలుసు … కేవలం దిగజారిన ఆర్థిక పరిస్థితులు మూడేళ్ళుగా పెట్టిన పంట చేతికి రాకపోవడం …. ఆ పెట్టుబడి తాలూకూ వడ్డి, వడ్డీ మనిషిని తినేశాయని .. అయినా యిందులో తన కొడుకు తప్పేమీ లేదని, ఆ నిందని ఎవరో ఒకరి మీదకి నెట్టాలని చూస్తోంది …

అత్త ఏడుపాపడం లేదు … చనిపోయిన కొడుకు ఏ ఆపద్బాంధవుడో వచ్చి ఊపిరిచ్చి హఠాత్తుగా బతికిస్తే బావుండునని పరితపిస్తోంది … ఆమె ఏడుపు అక్కడున్న వాళ్ళందరి గుండెలూ చెరువవుతున్నాయి … “అమే రత్నమ్మాఁ వొచ్చినప్పుట్నుండీ చూస్తా వుండాను … యాడస్తానే వుండావు … మన చేతుల్లో ఏముండాది చెప్పు … నీకసలే ఒళ్ళూ బాగా లేదు గమ్మునుండు …” మా పెదమ్మ అత్తభుజం మీద చెయ్యేసి ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది … అయితే ఆమె మాటలు ఆమెకే పీలగా వుండాయి.

“వదినాఁ నన్ను కాసేపు కొట్టుకోనీండమ్మా .. నాబిడ్డను మళ్ళెప్పుడు చూడబోతానమ్మా … అప్పుల కోసమయితే భయపడ్డమ్మా … యింకేందో జరిగుండాది” అంటూ పెదమ్మ ఒళ్ళో తల పెట్టుకుంది.

ఏందో జరిగుండాది అన్న అత్తమాట వెనక నిజంగానే ఏదో వుందని నాకప్పటికి అర్థం కాలేదు .. “ఆఁ … ఆఁ జరిగింది చట్టుబండలు … మీ అబ్బయ్యకేం కష్టమొచ్చిందమ్మా? … గుట్టుగా యింత గొంతులో పోసుకుని నా బిడ్డను అన్యాయం చేసి పొయినాడు .. ఇంక జీవితాంతం పడాల్సిందంతా నా బిడ్డే కదా … ఏదో చదువు లేకపోయినా మంఛిపిల్లోడు, మంఛికుటుంబం అంటే సరేననుకున్నావమ్మా … ఇట్ట ముంచేసి పోతాడనుకోలేదు …” అత్తమాటకి రిటార్ట్‌లా జ్యోతి వాళ్ళమ్మ తన చుట్టుపక్కల కూర్చుని వున్న తమ వూరివాళ్ళతో చెప్పుకుని, తన కూతురి భవిష్యత్తును తలచుకుని తలచుకుని ఏడుస్తోంది ….. ఆమె చెప్తున్నది కూడ న్యాయమేనన్నట్లుగా అందరూ తలలూపుతూ ముక్కు లెగబీలుస్తున్నారు.

ఈ మొత్తం గందరగోళానికి జ్యోతి మళ్ళీ బరస్టయిపోయింది. “అప్పులుంటే మాత్రం యేంమా … ఆస్థిగన లేదా? … అమ్మి అప్పులు తీర్చేస్తే కూలి చేసుకునయినా బతికుంటాం కదా .. ఏది పోయినా మళ్ళీ సంపాదించుకో వచ్చు గానీ ప్రాణం పోతే తిరిగి త్యాగలమా? అయ్యో ఎంత పని చేశావయ్యా ….” అంటూ

యజ్ఞకుండంలో నుండి ద్రౌపది పుట్టిందంటారు. జ్యోతిని చూస్తుంటే ధుఃఖపుజ్వాలల్లో నుండి ప్రభవించిన ఆకారంలా వుంది … ఆమ్మాయి ధుఃఖాన్ని, దయ పట్ల ఆమెకున్న ప్రేమనీ, అనుబంధాన్నీ ఆపడం ఎవరికి సాధ్యం? … ప్చ్‌ఁ ఏమయినా ఈ మగాళ్ళు దయలేని వాళ్ళు … ఆడవాళ్ళని సుఖపెట్టాలన్నా, దుఃఖంలోకి నెట్టేయాలన్నా వాళ్ళకే సాధ్యమవుతుంది …

జ్యోతి ఏడుపు విని ఆమె తండ్రి పరిగెత్తినట్లుగా పెద్దపెద్ద అంగలేసుకుంటూ లోపలికొచ్చాడు … “అమ్మి ముందు ఎవురయినా ఏడ్చినారంటే చూడండి … చంపేస్తా” భార్యవైపు చూస్తూనే అయినా అందర్నీ ఒకసారి గదమాయించినట్లుగా అని వచ్చినంత వేగంగానూ బయటికెళ్ళిపోయాడు … యిల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దం పరుచుకుంది.
ఆ నిశ్శబ్దంలో నుంచి ఇంటి బయట కూర్చుని వున్న మగాళ్ళ మాటలు యదేచ్ఛగా లోపలికి ప్రవహించసాగాయి.

“కేవలం వానల్లేకపోవడం, కాలంగాని కాలంలో వానలు రావడం యియ్యేనా రైతులు నష్టపోవడానికి కారణాలు … వాళ్ళు బతకాలన్నా గాని ప్రభుత్వం యాడ బతకనిస్తా వుండాది? కరువు జిల్లాలనీ, కరువు మండలాలనీ ప్రకటించేస్తే సరిపోతుందా? ఇన్నేళ్ళయినా సాగునీటి సౌకర్యం కల్పించకపోతే ఎట్ట జెయ్యాల?”

“అదట్టుండనా …. మాటమాటకీ కరెంటు బిల్లులు కట్టలేదంటూ వచ్చి పైనబడ్తుంట్రి … యాడ్నుంచి తెచ్చి కడ్తాం చెప్పు. యవసాయం జేసుకునే వాళ్ళకి కరెంటన్నా వూరికే యిస్తే ఏవి ఈ గవర్మెంటు?” మనకి పంటలకి నీళ్ళందించాల్సిన బాద్దిత గవర్మెంటుది … అట్టబొయి … ఇట్టబొయి మన పాట్లు మనం పడతా బోర్లేయించుకుని అగసాట్లు పడి మోటర్లేయించుకుంటే … కరెంటు బిల్లు కట్టలేదని ఫ్యూజులు పెరికేసేది … స్టార్ట ర్లెత్తక పొయ్యేది … ఈ గవర్మెంటు గూడ చిన్నంగా బాధపెట్టడం లేదులే మనల్ని …” దయాకర్‌ తోటిరైతు కాబోలు ఒకాయన కడుపుమంటతో పెద్దగా అరిచినట్లు మాట్లాడుతున్నాడు.

పొద్దుట్నుండీ ఒకేస్థితిలో కిందకూచుని వుండడంతో పట్టుకుపోయిన మోకాళ్ళని విదిలించుకుంటూ పైకి లేచి మెల్లిగా వెనుక వరండాలోకి నడిచాను … నేను బాత్రూము లోనుండి బయటికొచ్చేసరికి పెదమ్మా … అత్త పెద్దకోడలు శారద మాట్లాడుకుంటూ వున్నారు …. దయాకర్‌ చేసిన తొందరపాటు పనినీ, జ్యోతి భవిష్యత్తునీ తలచుకుని బాధపడ్తున్నా రిద్దరూ … నన్ను చూడగానే శారద వంటగదిలో కెళ్ళింది కాఫీ కలుపు కొస్తానంటూ … “పెదమ్మాఁ అమ్మా వాళ్ళేరీ? … యింకా రాలేదు?” పొద్దుట్నుండీ అర్థం కాకుండా వున్న ప్రశ్నని సంధించాను. పెద్దమ్మ నాకేసి దిగులుగా చూసింది.
“అయ్యోఁ ఎందుకడుగుతావు లేమ్మా … మొన్నటిరేత్రి మీ నాయిన గూడ యిదేపని … పురుగుమందు డబ్బా ఎత్తుకున్నా డంట మీ అమ్మ చూసి లాక్కుని ఒకటే ఏడుపు … నేల అమ్మేస్తానని మీ అన్నా … వొద్దనే వొద్దని మీ నాయినా … అప్పులబాధ పడలేక యిద్దురూ ఒకటే తగువులు … రచ్చలు … మీ అమ్మ నలిగి ఛస్తా వుండాదనుకో … నేను నిన్న పొద్దన్నే బొయి మీ అమ్మనీ, నాయిన్నీ ప్రయాణం చేసి తిరపతికి అంపించినా … పొయ్యి దేవుడి దర్శనం చేసుకుని నాలుగు దినాలుండి రాబోండి అని”

పెదమ్మ కూతురు మంజులక్క తిరుపతిలో వుంటుంది … మేమంతా ఒకేచోట ఒక తల్లి పిల్లల్లా పెరగడంతో ఏ మాత్రం తేడాలుండవు
“ఒక్క నిముషమే చినమ్మే … మీ అమ్మగాన చూడకుండా వుణ్ణుంటే ఈ పొద్దు చిన్నదినమయి పోయుణ్ణు … పెద్దోళ్ళూ అదే పనయిపాయ, చిన్నోళ్ళూ అదే పనయిపాయ … ఏం యవసాయమో బోమ్మా అప్పుల్దెచ్చి పంటలు పెట్టడమే గాని పైసా చేతికి రాకపాయ … ఎట్ట తట్టుకోని ఎట్ట నిలబడాల చెప్పు … మీ అన్న చెప్పినట్లు నేలమ్మేసి యాడయినా బోయి యాపారం పెట్టుకునేది మేలుగా వుండాది …”

రైతు కుటుంబాలన్నీ కూడ క్రమంగా నేలమీద నమ్మకాన్ని కోల్పోవడం నిజంగా ఎంత దీనమయిన పరిస్థితి … “అందురూ యాపారాలు జేస్తే వడ్లు పండించే దెవురు పెదమ్మా … తిండిగింజ లెట్ల మనకి” నీర్సంగా అని వేగంగా కొట్టుకుంటున్న గుండెతో వెళ్ళి వరండాలో వున్న కుర్చీలో కూలబడ్డాను ….

అప్పటికే అక్కడ దయాకర్‌ పెద్దన్న, చిన్నన్న, మా అన్న రఘు …. సురేష్‌ అంతా కూర్చుని దయాకర్‌ పెద్ద సేద్దిగాడు వెంకటయ్యతో మాట్లాడ్తుండారు.
“అంత బాగుణ్ణిందయ్యా ఈసారి చెనిగ … మూడేళ్ళ అప్పులన్నీ తీరిపొయినాయి బో అబ్బయ్యకి అనుకున్నా … యింక యిరవయి దినాలుంటే చాలు పెరికేసుండొచ్చు … ఇంతలోపల అదేం తెగులో, కొత్తరకం తెగులు అది పట్టింది … నిలవన ఎండి ఆకులన్నీ రాలిపొయినయి … అప్పటికీ పచ్చివుండాదని అన్నగచాట్లూ పడి నీళ్ళు పెడ్తిమి ….. మళ్ళీ మల్లిఖార్జున దగ్గిరికి పరిగెత్తి పురుగుల మందులూ, బలానికి మందులూ అన్నీ తెచ్చేసినాడు … పురుగు ఛావనే లేదు … పంట ఎక్కిరానే లేదు … ప్చ్‌ఁ ఈ ఒక్కసారిగ్గన పండుంటే అబ్బయ్య ఈ పని చేసుండడయ్యా ….” కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు వెంకటయ్య … వెంకటయ్య ఆ యింట్లో రెండు తరాల సేద్యానికి సాక్షి … మావయ్య వున్నప్పట్నుండీ ఈ యింటినీ, ఈ పొలాన్నీ కనిపెట్టుకునే వున్నాడు.

ఒక్కక్షణం మౌనం తరువాత దయాకర్‌ చిన్నన్న మాట్లాడాడు
“ఏవయినా న్నా … ఈ గవర్మెంట్‌ ఫైనాన్షియల్‌ పాలసీలన్నీ రైతుల్ని ముందుగా దెబ్బ కొడ్తుండాయి … రకరకాల పథకాల పేరుతో కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం రైతుల సబ్సిడీల్ని తగ్గించి పారేసి …. కరెంటు ఛార్జీల్ని పెంచేసె … పేదరికం పెరిగిపోతుండాదే గాని అభివృద్ధి యాడ జరగతుండాది న్నా … పోయిన సంవత్సరం వెయ్యి మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు… ఇప్పుడు మొన్న జూసినావు గదా … రైతులు సాగునీ రడిగినందుకు రోడ్లమీద నిలబెట్టి లాఠీలతో గొడ్తిరి … మళ్ళీ యిప్పుడు ఆటలకి అయిదొందల కోట్లు ఖర్చు చేసి జాతీయక్రీడ లంటిరి … ఆకలి కంటే ఆటలు ముఖ్యం న్నా ప్రభుత్వానికి … ఆకలికంటే యిప్పుడు అభివృద్ధి ముఖ్యం బో” చిన్నన్న భాస్కర్‌ గొంతు కసిగా వుంది …. భాస్కర్‌ హైద్రాబాద్‌లో వుంటోన్నా అక్కడి హైటెక్‌ అభివృద్ధి పట్ల అతడి కెప్పుడూ నిరసనే ….

“నేనా నడవ హైద్రబాదొచ్చినపుడు చూస్తినే … కంప్యూటర్లు, సైబర్‌ కేఫ్‌లూ, హైటెక్‌ సిటీ మద్రాసునీ, బోంబేనీ మించిపొయి వుండాదనుకో …” నవ్వడానికి ప్రయత్నించి దిగాలుపడ్డాడు ప్రభాకర్‌ …. దయాకర్‌ పెద్దన్న …

నాకు కడుపులో తిప్పుతున్నట్టుగా వుంది .. . అక్కడెక్కడో పత్తిరైతుల ఆత్మహత్యలు … మరెక్కడో మరో రైతూ … వినడమే తప్ప యిప్పుడా వైరస్‌ యిక్కడికి కూడ పాకుతోందా? .. నాన్న విషయం విన్నప్పట్నుండీ నా ఒంట్లో రక్తాన్నంతా ఎవరో తోడేసినట్లు నీర్సంగా అయి చెమటలు పడ్తోంది … నన్ను నేను సంబాళించుకోవడం కష్టంగా వుంది …

నిజమేఁ ఎన్నెన్నో కోట్లు రకరకాల పనుల మీద ఖర్చు పెట్టే ప్రభుత్వం రైతుల్నీ, సాగునీటినీ మాత్రం పట్టిచ్చుకోదు … ఇది ఆఖరికి ఎట్టవుతాదో, ఎంత ప్రమాదమో ఎవరికీ అర్థం కావడం లేదు … పేదరికం పెరిగిపోతా వుంది … జనాలంతా వర్గాలు వర్గాలుగా విడగొట్టబడ్తుండారు …

ఒక పక్క భాస్కర్‌, ప్రభాకర్‌ వంటి వాళ్ళు కార్పొరేట్‌ కంపెనీల్లో … ఎ.సి గదుల్లో కంప్యూటర్ల ముందు కూర్చుని వేలకి వేలు సంపాదిస్తుంటారు … ఈ కొత్త కార్మికవర్గాన్ని అభివృద్ధిగా అంతా గౌరవిస్తూంటారు … మరోపక్క దేశానికి వెన్నెముకలని పొగడబడ్డ రైతులంతా స్వచ్ఛమైన గాలిలోనే, నకిలీ పురుగుల మందులతో ఊపిరాడక గిలగిలా తన్నుకుంటూ వుంటారు … అంతా అయిపోతుంది.

వాళ్ళ కన్నీళ్ళకూ, కష్టాలకూ, అప్పులకూ మొత్తం సమస్యలకూ కారణాల్ని వెతక్కుండా శవాల మీద నాలుగు డబ్బులు జల్లి తృప్తి పెట్టాలని చూస్తుంటుంది ప్రభుత్వం …
“కన్సల్టెన్సీలు, సైబర్‌ కేఫ్‌, ప్రపంచబ్యాంకూ పంటలు పండిస్తాయా? … పిజ్జాలు, బర్గర్లూ, ఛాట్లూ, మావూలు మనిషి ఆకలికి అందుతాయా …” సురేష్‌ అంటున్నాడు …

గుండెల్లోనో, కళ్ళల్లోనో తెలీకుండా నీళ్ళు ఊరుతూనే వున్నాయి … ఉద్వేగాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించి నా పెదాలు వొణుకుతున్నాయి ..

ఇది యిట్లానే … యిట్లానే కొనసాగితే … ఈ పుణ్యభూమిలో ఈ శవాలన్నీ తిరగబడ్తాయా? … అవును తిరగబడక తప్పదు.

“అయ్యాఁ మీకు చెప్పకూడ దనుకున్నా గానీ … అయ్యా నిన్న సాయంత్రం మల్లిఖార్జున, బుజ్జిశెట్టి వాళ్ళు చేలో కొచ్చినారు … వచ్చి యిప్పుటికిప్పుడు అప్పు కట్టమని అబ్బయ్య నెత్తిన కూర్చున్నారు … ఎంతెంత సర్దిచెప్పి, కొంచెం టయిమివ్వండి అని అబ్బయ్య ఎంత బతిమాలుకున్నా యినకుండా సాధించి పారేసినారనుకో … అయ్యాఁ …. నేనెట్ట జెప్పేది నా నోటితో …. ప్చ్‌ఁ
నీ పెళ్ళాన్యాడయినా పండబెట్టయినా మా అప్పు తీర్చమన్నారయ్యా … ఆ మాటతో గూడ అబ్బయ్య యిరక్తి చెంది పొయినాడయ్యా … ఈ పొద్దు వాళ్ళు మళ్ళా వస్తామని చెప్పిపొయినారు … రాత్రికి రాత్రి యింతపని చేస్తాడనుకో లేదయ్యా …” గుసగుసగా అన్నలతో చెప్పి ఏడుస్తున్నాడు వెంకటయ్య …

నా గుండెలవిశి పోయాయి … నా లోపల జీవనాడులన్నీ తెగిపోతున్నట్లుగా వుంది … నా శరీరం కదలిక లేకుండా కుర్చీకి అతుక్కుపోయినట్టుంది … చుట్టూ వాతావరణం మంచులా గడ్డ కట్టుకుపోయింది …

చాలాసేపు ఆ నిశ్శబ్దాన్ని ఎవరూ ఛేదించలేదు.

చివరికి పెదమ్మ వచ్చి ఎత్తుబడికి ప్రయత్నాలు జరుగుతుండాయని పిలిచేదాకా ఎవరి కాళ్ళలోనూ, ఒంట్లోనూ శక్తి లేదు … ఎవ్వరి నోట్లోనూ చెమ్మ లేదు … అప్పటికి సూర్యుడు పడమటి కొండల్లోకి దిగబాకుతుండాడు.
* * * *

దూరంగా తీతువెక్కడో భయంకరంగా కూస్తోంది …

ఆ రాత్రి తిరిగొస్తూంటే రోడ్డు మీద నున్న శవాలన్నీ లేచి కారుకి ఎదురొచ్చినా నాకస్సలు భయమేయలేదు … ఇప్పుడవి శవాల్లా, దయ్యాల్లా అన్పించలేదు నాకు … జీవితం వెక్కిరించిన ఎంతోమంది దయాకర్లు అర్థాంతరంగా వదిలి వెళ్ళిపోయిన తమ కుటుంబాల గురించి ఏడుస్తూ, ప్రశ్నిస్తూ ఎదురొస్తున్నట్టుంది

అవునవును శవాలన్నీ ఎప్పుడో లేస్తాయి … తిరగబడ్తాయి.

ంంంంంంంంంంంంంంంంంంంంం